కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 8/15 పేజీలు 26-30
  • చెడును ఎందుకు నివేదించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చెడును ఎందుకు నివేదించాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గద్దింపు యొక్క విలువను గుణగ్రహించడం
  • అదెవరి బాధ్యత?
  • పరిస్థితితో వ్యవహరించడం
  • సంఘంలో పరిశుద్ధతను కాపాడడం
  • తప్పిదస్థులకు సహాయం
  • సూత్రబద్ధమైన ప్రేమతో కూడిన చర్య
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 8/15 పేజీలు 26-30

చెడును ఎందుకు నివేదించాలి?

“నిజాన్ని బయటపెట్టువాడు ప్రజలకు శత్రువవుతాడు” అనేది పశ్చిమ ఆఫ్రికాలోని ఓ సామెత. తన అన్న తన చెల్లితో వావివరుసలు తప్పి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడని ఓలు నిందించినప్పుడు అతని విషయంలో జరిగిందదే. “అబద్ధాలాడుతున్నావు!” అని అతని అన్న అరిచాడు. అటు తర్వాత అతడు ఓలుని తీవ్రంగా కొట్టి, తమ ఇంటినుండి గెంటివేసి, ఓలు బట్టలన్నిటినీ కాల్చివేశాడు. గ్రామస్థులు అన్నతో ఏకీభవించారు. ఆ గ్రామంలో అతనికిక ఆశ్రయంలేకపోవడంతో, ఓలు గ్రామాన్ని విడిచి వెళ్లాల్సివచ్చింది. ఓలు చెల్లి గర్భవతియైన తర్వాత మాత్రమే, అతడు చెప్పింది సత్యమని ప్రజలు గ్రహించారు. అతని అన్న తప్పును ఒప్పుకున్నాడు, ఓలు తిరిగి ఆదరాన్ని పొందాడు. పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయి ఉండగలిగేవి. ఓలు హత్యచేయబడి ఉండేవాడు.

స్పష్టంగా, యెహోవా ఎడల ప్రేమలేనివారు, తమ తప్పు బయల్పర్చబడడాన్ని ప్రశంసించకపోవచ్చు. పాపభరితమైన మానవ ప్రవృత్తి ఏమిటంటే గద్ధింపును కాదని, గద్దించేవారెవరైనా సరే వారిపై ఆగ్రహపడడమే. (యోహాను 7:7 పోల్చండి) తప్పిదాల్ని సరిదిద్దే అధికారమున్న వారికి ఇతరుల తప్పిదాల్ని నివేదించాల్సి వచ్చినప్పుడు, అనేకమంది రాళ్లవలె మౌనం వహించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

గద్దింపు యొక్క విలువను గుణగ్రహించడం

అయితే, యెహోవా ప్రజల్లో గద్దింపు విషయంలో భిన్నమైన దృక్పథంవుంది. క్రైస్తవ సంఘంలోపల తప్పిదంచేసే వారికి సహాయపడేందుకు యెహోవా చేసిన ఏర్పాటును దైవభక్తిగల స్త్రీ పురుషులు ఎంతగానో గుణగ్రహిస్తారు. అలాంటి క్రమశిక్షణను ఆయన దయాపూర్వకమైన వ్యక్తీకరణగా వారు గుర్తిస్తారు.—హెబ్రీయులు 12:6-11.

రాజైన దావీదు జీవితంలో జరిగిన ఓ సంఘటనతో దీన్ని ఉదాహరించవచ్చు. ఆయన తన యౌవనదశ నుండీ నీతిమంతుడైనప్పటికీ, ఆయన గంభీరమైన తప్పిదంలో పడిపోయిన సందర్భం ఒకటి తటస్థించింది. మొదట, ఆయన వ్యభిచరించాడు. తర్వాత, తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో, ఆ స్త్రీ భర్త చంపబడేలా ఏర్పాటుచేశాడు. కానీ, దావీదు పాపాన్ని ఏ ప్రవక్తకైతే యెహోవా బయల్పర్చాడో ఆ ప్రవక్తయైన నాతాను దాని విషయమై దావీదును ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఓ శక్తిమంతమైన ఉపమానాన్ని ఉపయోగిస్తూ, తన వద్ద అనేక గొఱ్ఱెలున్నప్పటికీ తన స్నేహితునికి ఆతిథ్యమివ్వడానికి, ఓ దరిద్రుడు అపురూపంగా పెంచుకుంటున్న ఒకే ఒక గొఱ్ఱెపిల్లను తీసుకొని వధించిన ఓ ఐశ్వర్యవంతున్ని ఏమి చేయాలని నాతాను దావీదును అడిగాడు. మునుపటి గొఱ్ఱెల కాపరియైన దావీదు మహోద్రేకం చెందాడు. ఆయన ఇలా అన్నాడు: “ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.” ఆ తర్వాత నాతాను “ఆ మనుష్యుడవు నీవే” అని తెలియజేస్తూ ఆ ఉపమానాన్ని దావీదుకు అన్వయించాడు.—2 సమూయేలు 12:1-7.

దావీదు నాతానుపై కోపించలేదు; తనను తాను సమర్థించుకోనూ లేదు లేక ప్రత్యారోపణ చేయడానికి మొగ్గు చూపించనూలేదు. బదులుగా, నాతాను గద్దింపు ఆయన మనస్సాక్షిని ఎంతగానో కదిలించింది. “నేను [“యెహోవాకు వ్యతిరేకంగా,” NW] పాపము చేసితినని” గుండెకోతతో దావీదు ఒప్పుకున్నాడు.—2 సమూయేలు 12:13.

నాతాను దావీదు పాపాన్ని బయల్పర్చడం, అటు తర్వాత దైవిక గద్దింపును ఇవ్వడం సత్ఫలితాల్ని తెచ్చింది. దావీదు తన తప్పిదం యొక్క పర్యవసానాలను తప్పించుకోలేక పోయినప్పటికీ, ఆయన పశ్చాత్తాపపడి యెహోవాతో సమాధానపడ్డాడు. అలాంటి గద్దింపును దావీదు ఎలా దృష్టించాడు? ఆయన ఇలా రాశాడు: “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.”—కీర్తన 141:5.

మన కాలంలో కూడా యెహోవా సేవకులు, గంభీరమైన తప్పిదంలో పడిపోగలరు. వీరిలో అనేక సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్నవారు కూడా ఉండవచ్చు. పెద్దలు సహాయపడగలరని గుర్తిస్తూ, సహాయం కొరకు వారిని సమీపించేందుకు అనేకులు చొరవ తీసుకుంటారు. (యాకోబు 5:13-16) కానీ రాజైన దావీదు చేసినట్లుగానే, కొన్నిసార్లు తప్పిదస్థుడు తన పాపాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నించవచ్చు. సంఘంలో గంభీరమైన తప్పిదం జరిగినట్లు మనకు తెలిస్తే మనమేం చేయాలి?

అదెవరి బాధ్యత?

గంభీరమైన తప్పిదాన్ని గూర్చి పెద్దలు తెల్సుకున్నప్పుడు, వారు అవసరమైన సహాయాన్ని, దిద్దుబాటును ఇచ్చేందుకు ఆ తప్పిదంలో చేరివున్న వ్యక్తిని సమీపిస్తారు. సంఘంలోపల ఉన్న అలాంటి తప్పిదస్థులకు తీర్పుతీర్చడం పెద్దల బాధ్యతయైవుంది. సంఘ ఆత్మీయస్థితిని అప్రమత్తంగా గమనిస్తూ, వాళ్లు అవివేకమైన పనిచేసే లేక తప్పటగుడును వేసే వారెవరికైనా సహాయపడి, ఉద్బోధిస్తారు.—1 కొరింథీయులు 5:12, 13; 2 తిమోతి 4:2; 1 పేతురు 5:1, 2.

కానీ మీరు పెద్దకాకపోయినా, మరో క్రైస్తవుడు చేసిన ఏదైనా ఓ గంభీరమైన తప్పిదాన్ని గూర్చిన సమాచారం మీకు తెలిస్తే అప్పుడేమిటి? ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రంలో నడిపింపు సూత్రాలు ఉన్నాయి. మత భ్రష్టత్వ కార్యాలకూ, అధికార ధిక్కారణ, హత్య లేక నిర్దిష్టమైన ఇతర గంభీర నేరాలకూ ఓ వ్యక్తి సాక్షియైతే, దాన్ని గూర్చి ఫిర్యాదు చేయడమూ, తనకు తెల్సినదాన్ని గూర్చి సాక్ష్యం చెప్పడమూ అతని బాధ్యతయైవుందని ధర్మశాస్త్రం తెలియజేసింది. లేవీయకాండము 5:1 ఇలా తెలియజేస్తోంది: “ఒకడు ఒట్టు పెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.”—ద్వితీయోపదేశకాండము 13:6-8; ఎస్తేరు 6:2; సామెతలు 29:24 పోల్చండి.

నేటి క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, దాని వెనుకనున్న సూత్రాల ద్వారా నడిపించబడవచ్చు. (కీర్తన 19:7, 8) కాబట్టి తోటి క్రైస్తవుడు చేసిన ఓ గంభీరమైన తప్పిదాన్ని గూర్చి మీకు తెలిస్తే, మీరేమి చేయాలి?

పరిస్థితితో వ్యవహరించడం

మొట్ట మొదటిగా, గంభీరమైన తప్పిదం నిజంగా జరిగిందని విశ్వసించేందుకు తగిన కారణం ఉండడం ప్రాముఖ్యం. “నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?” అని ఒక జ్ఞాని తెలియజేశాడు.—సామెతలు 24:28.

పెద్దల దగ్గరకు నేరుగా వెళ్లాలని మీరు నిశ్చయించుకోవచ్చు. అలా చేయడం తప్పేమీ కాదు. అయితే, సాధారణంగా, తప్పిదంలో చేరివున్న వ్యక్తిని సమీపించడం ఎంతో ప్రేమపూర్వకమైన పని. బహుశా పైకి కన్పించేవి వాస్తవాలు అయ్యుండకపోవచ్చు. లేక ఆ పరిస్థితిని అప్పటికే పెద్దలు చేపట్టి ఉండొచ్చు. ఆ విషయాన్ని ఆ వ్యక్తితో నెమ్మదిగా చర్చించండి. గంభీరమైన తప్పిదం జరిగిందని విశ్వసించడానికి తగిన కారణమింకా ఉంటే, సహాయం కొరకు పెద్దల్ని సమీపించమని అతన్ని లేక ఆమెను ప్రోత్సహించండి, అలా చేయడంలో ఉన్న జ్ఞానయుక్తతను గురించి వివరించండి. ఆ విషయాన్ని గురించి ఇతరులతో మాట్లాడడం వదరుబోతుతనం అవుతుంది గనుక అలా చేయకండి.

ఆ వ్యక్తి సహేతుకమైన కాలం లోపల పెద్దలకు దాన్ని తెలియజేయకపోతే, అటు తర్వాత మీరు పెద్దలకు నివేదించాలి. నిందమోపబడిన వానితో ఆ విషయాన్ని ఒకరు లేక ఇద్దరు పెద్దలు తర్వాత చర్చిస్తారు. తప్పిదం జరిగిందో లేదో తెలుసుకునేందుకు పెద్దలు ‘శోధించి పరీక్షించి బాగుగా విచారించాల్సిన’ అవసరముంది. తప్పిదం జరిగితే, దాన్ని లేఖనాధార నడిపింపు సూత్రాల ప్రకారంగా వాళ్లు చేపడతారు.—ద్వితీయోపదేశకాండము 13:12-14.

తప్పిదాన్ని గూర్చిన ఫిర్యాదును స్థిరపర్చేందుకు కనీసం ఇద్దరు సాక్షులు అవసరం. (యోహాను 8:17; హెబ్రీయులు 10:28) ఆ వ్యక్తి మోపబడిన నిందను ఖండిస్తే, మీరిచ్చే సాక్ష్యమే ఏకైక సాక్ష్యమైతే, ఆ విషయం యెహోవాకు అప్పగించబడుతుంది. (1 తిమోతి 5:19, 24, 25) యెహోవాకు సమస్తము “మరుగులేక తేటగా” ఉన్నదనీ, ఆ వ్యక్తి గనుక అపరాధియైతే చివరికి అతని పాపములు అతన్ని ‘పట్టుకుంటాయనీ’ గ్రహించడాన్నిబట్టి ఇలా చేయడం జరుగుతుంది.—హెబ్రీయులు 4:13; సంఖ్యాకాండము 32:23.

కానీ ఆ వ్యక్తి మోపబడిన ఫిర్యాదును త్రోసిపుచ్చాడని, అతనికి వ్యతిరేకంగావున్న సాక్షి మీరొక్కరేనని అనుకుందాం. అపనిందలు వేసేవానిగా ఇప్పుడు మీపై ప్రతి ఫిర్యాదు వేయవచ్చా? వేయకూడదు, దానికి సంబంధించని వ్యక్తులతో మీరు వృథాప్రసంగం చేస్తేనే తప్ప, మీపై ప్రతి ఫిర్యాదు వేయకూడదు. పర్యవేక్షించే, విషయాల్ని సరిదిద్దే అధికారమూ బాధ్యతా ఉన్న వ్యక్తులకు సంఘాన్ని ప్రభావితంచేసే పరిస్థితుల్ని గురించి తెలియజేయడం వదరుబోతుతనమేమీ కాదు. నిజానికి, అది ఎల్లప్పుడూ సరియైనదీ, యథార్థమైనదీ చేయాలనే మన కోరికతో పొందికకల్గి ఉంటుంది.—లూకా 1:74, 75 పోల్చండి.

సంఘంలో పరిశుద్ధతను కాపాడడం

తప్పిదాన్ని నివేదించడానికి గల ఓ కారణమేమిటంటే సంఘ పవిత్రతను కాపాడేందుకు అది పనిచేస్తుండడమే. యెహోవా పరిశుభ్రమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు. తనను ఆరాధించేవారందరూ ఆత్మీయంగా, నైతికంగా పరిశుభ్రంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ప్రేరేపిత వాక్యం ఇలా ప్రేరేపిస్తోంది: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” (1 పేతురు 1:14-16) అపవిత్ర కార్యాలను లేక తప్పిదాన్ని చేస్తూవుండే వ్యక్తులను సరిదిద్దడానికి లేక తొలగించడానికి చర్యతీసుకోకపోతే వాళ్లు సంఘమంతటిపైకీ మాలిన్యాన్నీ, యెహోవా తిరస్కారాన్నీ తీసుకురాగలరు.—యెహోషువ, 7వ అధ్యాయము పోల్చండి.

కొరింథులో ఉన్న క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, తప్పిదాన్ని గూర్చి నివేదించడం అక్కడున్న దేవుని ప్రజలను పరిశుభ్రపర్చే విధంగా ఎలా పనిచేసిందో తెలియజేస్తాయి. తన మొదటి పత్రికలో పౌలు ఇలా రాశాడు: “మీలో జారత్వమున్నదని వదంతి [“నివేదించబడింది,” NW] కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.”—1 కొరింథీయులు 5:1.

ఈ నివేదికను అపొస్తలునికి ఎవరు తెలియజేశారో బైబిలు చెప్పడంలేదు. కొరింథు నుండి పౌలు ఉంటున్న ఎఫెసుకు ప్రయాణించిన స్తెఫను, ఫొర్మూనాతు, అకాయిల నుండి ఆ పరిస్థితిని గురించి పౌలు తెల్సుకొని ఉండొచ్చు. కొరింథులోని క్రైస్తవ సంఘం నుండి విచారణాలేఖను కూడా పౌలు అందుకున్నాడు. నివేదించినది ఎవరైనప్పటికీ, విశ్వసనీయమైన సాక్షులద్వారా పౌలుకు ఆ పరిస్థితిని గూర్చి ఒక్కసారి నివేదించబడిన తర్వాత, ఆయన ఆ విషయంపై నడిపింపును ఇవ్వగలిగాడు. “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి” అని ఆయన రాశాడు. ఆ వ్యక్తి సంఘం నుండి బహిష్కరించబడ్డాడు.—1 కొరింథీయులు 5:13; 16:17, 18.

పౌలు ఉపదేశం సత్ఫలితాల్ని తెచ్చిందా? నిశ్చయంగా తెచ్చింది! స్పష్టంగా, అతడు తన క్రియల్లోని తప్పిదాన్ని గ్రహించాడు. పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తిని సంఘం “క్షమించి ఆదరించుట మంచిది” అని పౌలు కొరింథీయులకు రాసిన తన రెండవ పత్రికలో ఉద్బోధించాడు. (2 కొరింథీయులు 2:6-8) ఆ విధంగా తప్పిదాన్ని గూర్చి నివేదించడమనేది సంఘాన్ని పవిత్రపర్చడానికీ, దేవునితో తనకుగల సంబంధాన్ని పాడుచేసుకున్న ఓ వ్యక్తి తిరిగి దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికీ దోహదపడే చర్యను తీసుకునేందుకు నడిపించింది.

కొరింథులోని క్రైస్తవ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రికలో మరొక ఉదాహరణను మనం కనుగొంటాం. ఈసారి తప్పిదాన్ని నివేదించిన సాక్షుల పేర్లను అపొస్తలుడు ప్రస్తావిస్తాడు. ఆయన ఇలా రాశాడు: “నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మనుగూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను.” (1 కొరింథీయులు 1:11) మనుష్యులకు అనుచితమైన గౌరవాన్ని ఇస్తుండడంతోపాటూ ఈ కలహాలు, సంఘ ఐక్యతను పాడు చేసే ముప్పును తీసుకురాగల శాఖలుగా విడిపోయే దృక్పథాన్ని సృష్టించాయని పౌలు గ్రహించాడు. అందుకే, అక్కడున్న తన తోటి విశ్వాసుల ఆత్మీయ క్షేమం ఎడలగల ప్రగాఢమైన శ్రద్ధనుబట్టి పౌలు వెంటనే ప్రతిస్పందించి, దిద్దుబాటునిచ్చే ఉపదేశాన్ని సంఘానికి రాశాడు.

నేడు, భూమియందంతటా ఉన్న సంఘాల్లోని సహోదర సహోదరీల్లో అత్యధిక శాతం, దేవుని ఎదుట అంగీకృత స్థానాన్ని వ్యక్తిగతంగా కాపాడుకోవడం ద్వారా సంఘ ఆత్మీయ పరిశుభ్రతను భద్రపర్చేందుకు తీవ్రంగా కృషిచేస్తారు. అలా చేయడంలో కొందరు బాధను అనుభవిస్తారు; యథార్థతను కాపాడుకునేందుకు ఇతరులు మరణించారు కూడా. తప్పిదాన్ని సమర్థించడం లేక కప్పిపుచ్చడమనేది ఈ ప్రయత్నాల ఎడల ప్రశంసా రాహిత్యాన్నే తప్పక చూపిస్తాయి.

తప్పిదస్థులకు సహాయం

గంభీరమైన పాపంలో పడిపోయిన వారిలో కొంతమంది సంఘపెద్దలను సమీపించడానికి ఎందుకు వెనుకంజవేస్తారు? తరచూ వాళ్లు పెద్దల దగ్గరకు వెళ్లడంవల్ల వచ్చే ఫలితాల్ని గ్రహించకపోవడమే కారణం. తాము తమ పాపాన్ని గనుక ఒప్పుకుంటే, అది సంఘమంతటికీ తెలిసిపోతుందని కొందరు పొరపాటుగా విశ్వసిస్తారు. తాము చేసిన తప్పిదం యొక్క గంభీరత విషయానికి వచ్చేటప్పటికి ఇతరులు తమను తాము వంచించుకుంటారు. మరితరులు పెద్దల సహాయం లేకుండా తమను తాము సరిదిద్దుకోగలమని భావిస్తారు.

కానీ అలాంటి తప్పిదస్థులకు సంఘ పెద్దల నుండి ప్రేమపూర్వకమైన సహాయం అవసరం. యాకోబు ఇలా రాశాడు: “మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.”—యాకోబు 5:14, 15.

తప్పిదస్థులు తమ ఆత్మీయతను పునరుద్ధరించుకోవడానికి వారికి సహాయపడేందుకు ఇది ఎంత చక్కటి ఏర్పాటో కదా! దేవుని వాక్యం నుండి ఉపశమనం కలుగజేసే సలహాను అన్వయించడం ద్వారా, వారి తరపున ప్రార్థించడం ద్వారా ఆత్మీయంగా రోగగ్రస్థులైనవారు తమ తప్పిదపు మార్గాలనుండి స్వస్థతపొందడానికి వారికి పెద్దలు సహాయపడగలరు. ఆ విధంగా, తృణీకరించబడినట్లు భావించే బదులు, పశ్చాత్తాపపడిన వాళ్లు ప్రేమగల పెద్దలను కలుసుకున్నప్పుడు తరచూ ఉపశమనం పొందినట్లు, భారం తగ్గినట్లు భావిస్తారు. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఓ యౌవనుడు వ్యభిచరించి, కొన్ని నెలల వరకూ తన పాపాన్ని కప్పిపుచ్చాడు. అతని పాపం వెల్లడైన తర్వాత, ఆయన పెద్దలతో ఇలా అన్నాడు: “ఆ అమ్మాయితో నాకున్న సంబంధాన్ని గురించి ఎవరైనా అడిగితే బావుండునని నేను ఎంతగా కోరుకున్నానో! నా పాపాన్ని ఒప్పుకోవడం ఉపశమనాన్ని కల్గించింది.”—కీర్తన 32:3-5 పోల్చండి.

సూత్రబద్ధమైన ప్రేమతో కూడిన చర్య

బాప్తిస్మం తీసుకొనిన దేవుని సేవకులు “మరణములోనుండి జీవములోనికి దాటి” ఉన్నారు. (1 యోహాను 3:14) కానీ వారు గంభీరమైన పాపాన్ని గనుక చేస్తే, వాళ్లు మరణ మార్గంలోనికి మరలినవారౌతారు. వాళ్లకు సహాయం అందకపోతే, పశ్చాత్తాపపడడానికి ఇష్టపడకుండా, సత్య దేవుని ఆరాధించేందుకు మరలకుండా తప్పిదాన్ని చేయడంలోనే వాళ్లు మొద్దుబారిపోవచ్చు.—హెబ్రీయులు 10:26-29.

తప్పిదాన్ని గూర్చి నివేదించడం, తప్పిదస్థుని ఎడల యథార్థమైన శ్రద్ధతో కూడిన చర్యయైవుంది. యాకోబు ఇలా రాశాడు: “నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.”—యాకోబు 5:19, 20.

కాబట్టి, చెడును గురించి ఎందుకు నివేదించాలి? అది సత్ఫలితాల్ని తెస్తుంది గనుకనే. నిజంగా, తప్పిదాన్ని గురించి నివేదించడమంటే దేవుని ఎడలా, సంఘం ఎడలా, తప్పిదస్థుని ఎడలా సూత్రబద్ధమైన ప్రేమను చూపించడమే. సంఘంలోని ప్రతీ సభ్యుడూ దేవుని నీతియుక్త ప్రమాణాల్ని యథార్థంగా అంటిపెట్టుకున్నప్పుడు, సంఘమంతటినీ యెహోవా బహుగా ఆశీర్వదిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన [యెహోవా] మిమ్మును స్థిరపరచును.”—1 కొరింథీయులు 1:8.

[26వ పేజీలోని చిత్రం]

తప్పిదం చేసిన సాక్షి పెద్దలతో మాట్లాడేలా ప్రోత్సహించడం ప్రేమను చూపుతుంది

[28వ పేజీలోని చిత్రం]

తప్పిదస్థులు దేవుని అనుగ్రహాన్ని తిరిగి పొందేందుకు పెద్దలు సహాయపడతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి