నవహో దేశంలో గొఱ్ఱెల్లాంటి వారి కొరకు పచ్చిక మైదానం
నవహొ ఆదివాసుల భాషలో హఝోనీ అంటే “సుందరమైన” అని అర్థం. నవహో ప్రజలు తమ దేశాన్ని ఆ విధంగా వర్ణిస్తారు. 1868 నుండీ అమెరికా ప్రభుత్వం నవహో ప్రజలకు ఇంచుమించు 62,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల ఆరక్షితభూమిని కేటాయించింది. నలుదిశలు అని పిలువబడిన అరిజోనా, కొలరడో, న్యూ మెక్సికో, ఊటా అను నాలుగు రాష్ట్రాలు కలిసేచోట అరిజోనాకు ఈశాన్యంలో ఈ ఆరక్షితభూమి ఉంది. పాశ్చాత్య సినిమాల ద్వారా ప్రసిద్ధికెక్కిన మాన్యుమెంట్ వ్యాలీ, ఇప్పుడు నవహో ట్రైబల్ పార్కుగా భద్రపర్చబడి, ప్రపంచం నలుమూలల నుండీ సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. ఆ లోయ విశేషత ఏమిటంటే కనులవిందుచేసే మూడు వందల మీటర్ల ఎత్తుండే ఎర్ర ఇసుకరాతితో కూడిన ఏక శిలలే. అవి ఎడారి మైదానాలపై మనోహరమైన ఏకాంతంలో నిలబడివున్నాయి. సరియైన విధంగానే, ఆ లోయ కొరకు ఉపయోగించబడిన నవహో పదానికి “శిలల నడుమనున్న స్థలము” అని అర్థం.
మొత్తంమీద చూస్తే నవహో ప్రజలు వినయానికీ, హృదయపూర్వక ఆతిథ్యానికీ, విస్తృత కుటుంబాల సన్నిహితత్వానికీ పేరుగాంచారు. ఆ ఆరక్షితభూమిలో ఉన్న 1,70,000 మంది నివాసులు పారంపర్య విధానాల్ని అనుసరిస్తూ, ప్రధానంగా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ గొఱ్ఱెల్ని పెంచుతున్నారు, హొగాన్లు అని పిలువబడిన మట్టితో మేగబడిన కర్ర గుడిసెల్లో నివసిస్తారు. నవహో అలంకారిక కళలూ, చేతి పనులూ ఎంతో ప్రసిద్ధిగాంచాయి. గొఱ్ఱె ఉన్నితో నేయబడి, రంగురంగుల గీతలతో కూడిన లేక సాంప్రదాయక డిజైన్లతోనున్న వారి రగ్గులూ, కంబళ్లూ విశేషంగా ప్రశస్తమైనవిగా ఎంచబడ్డాయి. నవహోలోని నీలంవన్నె మణితోనున్న వెండి నగలు, మరితర ప్రకృతి సిద్ధమైన వస్తువులూ అంతే ప్రసిద్ధిగాంచాయి.
నవహో దేశంలోనికి సువార్తను తేవడం
30 ఏళ్లకు పైగా, యెహోవాసాక్షులు నవహో దేశంలోనికి కేవలం ప్రకృతి దృశ్యాల్ని చూడ్డానికేగాక ఈ మారుమూల ప్రాంతంలోవున్న ప్రజల దగ్గరకు దేవుని రాజ్య సువార్తను తెచ్చేందుకు కూడా వస్తూనేవున్నారు. (మత్తయి 24:14) యెహోవాసాక్షుల క్రమ పయినీరు పరిచారకులూ, ప్రత్యేక పయినీరు పరిచారకులూ ప్రకటనాపనిలో నాయకత్వం వహించారు. వారిలో అనేకులు అవసరం ఎక్కువుగా ఉన్న చోట సహాయపడమని ప్రయాణ పైవిచారణ కర్తలనుండీ, స్థానిక సాక్షుల నుండీ వచ్చిన పిలుపులకు ప్రతిస్పందించి వచ్చారు. కొంతమంది చుట్టుప్రక్కలవున్న సంఘాల నుండి రాగా, అమెరికా ఆదిమ జాతులకు చెందిన సభ్యులతోపాటూ ఇతరులు అమెరికానందలి వివిధ ప్రాంతాలనుండి వచ్చారు.
నిస్వార్థపరులైన ఈ స్త్రీ పురుషులు, ఇక్కడ తాము చేసే పరిచర్యను మిషనరీ నియామకానికి పోల్చారు. ఎందుకు? మొట్టమొదటిగా, స్థానిక భాషల యొక్క సంక్లిష్టమైన శబ్దాలనుబట్టీ, నిర్మాణాన్నిబట్టీ, పదాలనుబట్టీ వాటిని నేర్చుకోవడం ఎంతో కష్టం. తర్వాత మతం, కుటుంబ నిర్మాణం అలాగే ప్రకృతి ఒడిలో జీవించడం వంటి విషయాల్లో స్థానిక ప్రజలు మొత్తంమీద తమ పారంపర్య మార్గాలకు హత్తుకొని ఉన్నారు. అంతేగాక, ఆదిమవాసులుకాని వారికి ఇళ్లూ పనీ అరుదుగా దొరుకుతాయి. అందువల్ల అక్కడ ఉండడానికి వెళ్లిన వారికి ఎంతో కష్టమౌతుంది. చివరగా, తెల్లవాళ్ల చేతిలో ఈ ప్రజలు పొందిన అనాదరణను గూర్చిన సుదీర్ఘ చరిత్ర, వీరిలో ఆదిమవాసులుకాని వారిపై తీవ్రమైన అపనమ్మకాన్ని పాతుకుపోయేలా చేసిందంటే అర్థం చేసుకోవచ్చు.a
సాక్షులు మొదట్లో, చక్కగా తయారై టై కట్టుకొని ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు, వారిని మార్మొనులనుకొని అనేకమంది తలుపులు తెరవలేదు. వాళ్లు మామూలు దుస్తులు ధరించుకొని వెళ్లనారంభించినప్పుడు ఇంట్లోకి ఆహ్వానించబడ్డారు, తరచుగా ఓ గంటగానీ లేక అంతకుపైగాగానీ వారితో వెచ్చించేవారు. పరిచర్యలో చక్కగా తయారై, టై కట్టుకొని వెళ్లడం మరలా మొదలైనప్పటికీ, ఇప్పుడు ప్రజలు యెహోవాసాక్షుల్ని గుర్తుపడతారు.
నవహో ఆరక్షితభూమిపై జీవించే ప్రజల్ని కలుసుకోవడం, నిజంగా ఓ సమస్యే. బహుశా రాళ్లతోనూ, ఇసుకతోనూ, బురదతోనూ ఉన్న రోడ్లమీదుగా అనేక కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడం సర్వసాధారణం. సహజంగానే, ఇది వాహనాలకు మరింత అరుగుదలనూ, ప్రయాణికులకు మరింత అలసటను కల్గిస్తుంది. వాహనాలు బహుశా కదలనని మొరాయించవచ్చు కూడా, కానీ వాహనం మరలా కదలేలా సహాయపడేందుకు దారినపోయే వారు సాధారణంగా సిద్ధంగా ఉంటారు. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడూ, గృహ బైబిలు పఠనం నిర్వహించడానికి వెళ్లేటప్పుడూ, లేక క్రైస్తవ కూటానికి ఎవరినైనా తీసుకెళ్లేటప్పుడూ తరచూ రానూపోనూ ప్రయాణానికి చాలా గంటలు పడుతుంది. కానీ స్థానికుల ఎడల తమకుగల ప్రేమను చూపిస్తూ, సాక్షులు ఇష్టపూర్వకంగా తమ వనరులను ఉపయోగిస్తారు.—1 థెస్సలొనీకయులు 2:8 పోల్చండి.
నవహో ప్రజలు బైబిలు గురించి చర్చించడంలో ఆనందిస్తారు. మానవజాతి కొరకైన భావి పరదైసు గృహ నిరీక్షణను గురించి వినేందుకు పిల్లలూ, తలిదండ్రులు, తాత మామ్మలు అలా మొత్తం కుటుంబం సమకూడుతుంది. పరదైసు ఎలావుంటుందని తలస్తున్నారని నవహో వాసినొకరిని అడిగినప్పుడు, భూమి ఎడలా, పశువుల ఎడలా తమకుగల అనురాగాన్ని ప్రతిబింబిస్తూ “ఎన్నో గొఱ్ఱెలుండే పచ్చని మైదానం” అని ఆయన జవాబిచ్చాడు. వాళ్లు బైబిలు సాహిత్యాల్ని కూడా ప్రశంసిస్తారు. రాజ్య పరిచర్యకు మద్దతునివ్వడంలో మణిపూసలనూ, సబ్బు ముక్కనూ, పాలక్యాన్నూ, మరి అలాంటి వాటినే ఇవ్వడం ద్వారా కొన్నిసార్లు ఈ ప్రశంసను చూపిస్తారు. ఓ ప్రత్యేక పయినీరు ఒక సంవత్సరంలో 200 కావలికోట, తేజరిల్లు! పత్రిక చందాలను సేకరించాడు. ఈ చందాల్లో రెండింటిని గుఱ్ఱపు స్వారీ చేస్తున్న ఓ వ్యక్తి కట్టాడు.
“గొఱ్ఱెల శిబిరాన్ని” ఏర్పర్చడం
నవహో కాపరి తన మందను గొఱ్ఱెల శిబిరానికి తరలించేందుకు సరియైన సమయం, వేసవికాలం. పచ్చిక బయళ్లకూ మంచి నీటి సదుపాయానికీ చేరువగా ఉండడాన్నిబట్టి, గొఱ్ఱెల కొరకు ఎంపికచేయబడిన ఈ వేసవి శిబిరం మంద వర్ధిల్లడానికి సహాయపడుతుంది. అలంకారికంగా చెప్పాలంటే, ఆత్మీయ పచ్చిక బయలూ, సత్యజలాల ఊటయైన రాజ్యమందిరాన్ని అలాంటి శిబిరంతో పోల్చవచ్చు. అక్కడకు వచ్చే ప్రజలు తమను ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగానూ, బలవంతులుగానూ చేసే ఆత్మీయ పోషకాహారాన్ని కనుగొనగలరు.
కొంతకాలం, అరిజోనలోని కాయెన్టా నందలి ఓ స్కూలు తరగతిగదిలో కూటాలు జరిగాయి. తర్వాత 1992 ఆగస్టులో, అనేక రాష్ట్రాలనుండి వచ్చిన వందలాది స్వచ్ఛంద సేవకులైన సాక్షుల సహాయంతో, కాయెన్టాలో ఓ క్రొత్త రాజ్యమందిరం నిర్మించబడింది. ఈ రాజ్యమందిరమూ, ఆ ప్రాంతంలోని మరనేక రాజ్యమందిరాలూ స్థానిక ప్రజల మనస్సుల్లో ప్రకటనాపనికి ఓ శాశ్వత భావాన్ని నాటుతాయి. ఈ విస్తృత ప్రాంతంలో ఉన్న ఇతర రాజ్యమందిరాల్లో ఆరక్షితభూమిపై ఉన్న ట్యూబా నగరంలోనూ, చిన్లేలోనూ ఉన్న రాజ్యమందిరాలూ, నవహో ఆరక్షితప్రాంతంలోనే ఉన్న హొపి తెగకు చెందిన ప్రాంతమందలి కెమ్స్ కెన్యన్నందలి ఒక రాజ్యమందిరమూ, ఆరక్షితభూమి సరిహద్దు పట్టణాల్లో ఉన్న అనేక ఇతర రాజ్యమందిరాలూ ఉన్నాయి. ప్రతిఫలం ఏమైవుంది?
రాజ్య సందేశానికి గొప్ప ప్రతిస్పందన
కాయెన్టాలో రాజ్యమందిరం నిర్మించబడినప్పటి నుండీ దాదాపు పన్నెండుకన్నా ఎక్కువమంది స్థానిక ప్రజలు బాప్తిస్మం తీసుకున్నారు. ఇది, సత్యారాధన కొరకైన ఈ స్థలంపై యెహోవా ఆశీర్వాదం ఉందని సూచిస్తోంది. ఈ మందిరం యెహోవాసాక్షులు ఇక్కడ ఉండడానికే వచ్చారనే రుజువునిస్తుంది, వాళ్లు ప్రకటించే రాజ్య సువార్తనందు నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అక్కడ ఇటీవలెనే నవహో భాషలో మొట్టమొదటి బహిరంగ బైబిలు ప్రసంగం ఇవ్వబడింది. తలిదండ్రుల బాధ్యతలను గూర్చి ఇవ్వబడిన ఆ ప్రసంగానికి 245 మందిని ఆహ్వానించేందుకు 40 మంది సభ్యులతో కూడిన ఆ సంఘం ఎంతో సంతోషించింది. ప్రశంసాత్మకమైన హృదయాలతో, ఈ ప్రసంగాన్ని వినేందుకు ఎనిమిదిమంది సభ్యులుగల ఓ కుటుంబం రానూ పోనూ 6 గంటలు ప్రయాణించింది. వాళ్లు రాజ్య మందిరానికి రావడం అదే మొదటిసారి.
యెహోవా అనుగ్రహించిన ఉపయుక్తమైన మరొక పనిముట్టు, నవహో భాషలోని భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము! బ్రోషూరే. ఎంతో సంక్లిష్టమైన నవహో భాషలోనికి ఈ బ్రోషూరును అనువదించడం, ఓ పెద్ద సవాలుగా పరిణమించింది. ఆ బ్రోషూరు రాజ్య సందేశాన్ని సరియైన విధంగా అందజేసేలా నిశ్చయపర్చుకునేందుకు అనువాదకులు సమిష్టిగా 1,000 కన్నా ఎక్కువ గంటల్ని వెచ్చించారు. 1995 చివరి భాగంలో అది విడుదల చేయబడినప్పటి నుండీ, స్థానిక సాక్షులు దాని అనేకవేల ప్రతుల్ని అందించడం మూలంగా సత్యాన్వేషకులతో అనేక బైబిలు పఠనాలు ప్రారంభించారు.
రాజ్య ప్రచారకులు నవహో భాషను నేర్చుకుంటుండగా, పరిచర్యలో అది ఎక్కువగా ఉపయోగించబడుతోంది. ఆ ప్రాంతంలోని సంఘాలు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో నవహో భాషను ఉపయోగించనారంభించాయి. ప్రచారకులకు తర్ఫీదునిచ్చేందుకు నవహో భాషా తరగతులు ఏర్పాటుచేశారు. అంతేగాక, స్థానిక సమావేశ కార్యక్రమాలు కూడా నవహో భాషలోనికి అనువదించబడ్డాయి. ఈ ప్రయత్నాలన్నీ ఆ ఆరక్షితభూమిపై మరింత ప్రతిస్పందనకు తప్పక నడిపిస్తాయి.
ఈ ఆదిమవాస ఆరక్షితభూమిపై ఫలించిన రాజ్య ఫలాల్లో మన నవహో సహోదరులచే చూపించబడిన ఉన్నతమైన ఆత్మీయ లక్షణాలను అలక్ష్యం చేయకూడదు. ఏడు సంవత్సరాలుగా, వారం వారం జరిగే కూటాలకు హాజరయ్యేందుకు జిమ్మీ, సాన్డ్రాలు ఐదుగురు పిల్లలతో కలిసి రానూ పోనూ 240 కిలోమీటర్లు ప్రయాణించేవారు. సుదీర్ఘమైన ప్రయాణాల సమయంలో రాజ్యగీతాల్ని ఆలపించిన బైబిల్ని పఠించిన స్మృతులను ఈ కుటుంబం, కల్గివుంది. సత్యం ఎడల ఆ తలిదండ్రులకుగల ప్రేమా ఆసక్తులు, యెహోవా సమర్పిత స్తుతికర్తలుగా తయారవ్వడంలో తమ తలిదండ్రుల మాదిరిని అనుసరించేలా పిల్లలను ప్రేరేపించాయి. వారిలో నలుగురు ఇప్పుడు క్రమపయినీర్లుగా సేవచేస్తున్నారు. జిమ్మీ ఒక పెద్దగా సేవచేస్తున్నాడు. ఈ కుటుంబం ఆనందానికి తోడుగా, జిమ్మీ అక్కయైన ఎల్సీ ఇటీవలే బాప్తిస్మం పొందింది. ఆమె నవహో భాషను మాత్రమే మాట్లాడే బాప్తిస్మం పొందిన క్రైస్తవుల్లో మొట్టమొదటి వ్యక్తి.
స్థానిక గొఱ్ఱెల కాపరులు తమ మందలతోపాటూ నవహో ఆరక్షితభూమికి అలంకారంగావున్న ఏక శిలా రాళ్లకు ప్రశాంతమైన గ్రామీణ ప్రకృతి సౌందర్యాన్ని జోడింపజేస్తారు. ప్రవక్తయైన యెషయా ఎంతోకాలం క్రిందటే యెహోవాను గురించి ఇలా ప్రవచించాడు: “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.” (యెషయా 40:11) రాజ్య సువార్తను వినాలనే, తన నిత్య ఆశీర్వాదాన్ని పొందాలనే కోరికవున్న, నవహో ఆరక్షితభూమిపై ఉన్న వారందర్నీ యెహోవా తన మంచి కాపరియైన యేసుక్రీస్తు ద్వారా తన ఆత్మీయ పచ్చిక మైదానంలోనికి సమకూరుస్తున్నాడు.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 1948; ఫిబ్రవరి 22, 1952; జూన్ 22, 1954; సెప్టెంబరు 8, 1996 సంచికలను చూడండి.
[24వ పేజీలోని చిత్రం]
నవహో గొల్లస్త్రీ సువార్తను వింటుంది