కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 8/15 పేజీలు 17-22
  • అంతం సమీపిస్తుండగా “స్వస్థ బుద్ధి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంతం సమీపిస్తుండగా “స్వస్థ బుద్ధి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన వ్యక్తిగత సంబంధాల్లో “స్వస్థ బుద్ధి”
  • “స్వస్థ బుద్ధి,” కుటుంబ బాధ్యతలు
  • విద్యాభ్యాసాన్ని గూర్చిన మన దృక్కోణంలో “స్వస్థ బుద్ధి”
  • ‘గొప్పవాటిని వెదకవద్దు’
  • మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం
  • “స్వస్థ బుద్ధి”తో జీవిస్తూ ఉండడం
  • ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 8/15 పేజీలు 17-22

అంతం సమీపిస్తుండగా “స్వస్థ బుద్ధి”

“అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా . . . స్వస్థ బుద్ధిగలవారై . . . ఉండుడి.”—1 పేతురు 4:7.

1. “స్వస్థ బుద్ధి” కల్గివుండడంలో ఏమి చేరివుంది?

క్రైస్తవులు జీవించే జీవిత విధానంపై, అపొస్తలుడైన పేతురు చెప్పిన పైమాటలు ప్రగాఢమైన ప్రభావాన్ని కల్గివుండాలి. అయితే, సాంసారిక బాధ్యతల నుండీ, జీవిత చింతల నుండీ పలాయనులవ్వమని పేతురు తన పాఠకులకు చెప్పలేదు; రానైవున్న నాశనం విషయంలో భీతినిగొల్పే భావాన్నీ ఆయన ప్రోత్సహించలేదు. బదులుగా, ఆయన ఇలా ఉద్బోధించాడు: “స్వస్థ బుద్ధిగలవారై . . . ఉండుడి.” మన మాటల్లో, క్రియల్లో మంచి వివేచనను చూపించడం, తెలివిగానూ వివేకంగానూ సహేతుకంగానూ ఉండడం “స్వస్థ బుద్ధి” కల్గివుండడంలో చేరివున్నాయి. దేవుని వాక్యం మన ఆలోచనలనూ క్రియలనూ నడిపించడానికి అనుమతించడమని దీని భావం. (రోమీయులు 12:2) మనం “మూర్ఖమైన వక్రజనము మధ్య” జీవిస్తున్నాం గనుక సమస్యల్నీ కష్టాల్నీ నివారించేందుకు స్వస్థ బుద్ధి అవసరం.—ఫిలిప్పీయులు 2:14.

2. యెహోవా దీర్ఘశాంతం నేటి క్రైస్తవులకు ఏ విధంగా ప్రయోజనకరమైనది?

2 అలాగే, మనల్ని గురించి మనం స్పష్టమైన, వాస్తవిక దృష్టిని కల్గివుండేందుకు కూడా “స్వస్థ బుద్ధి” మనకు సహాయపడుతుంది. (తీతు 2:12, 13; రోమీయులు 12:3) 2 పేతురు 3:9వ వచనంలో రాయబడివున్న మాటల దృష్ట్యా ఇది ఆవశ్యకం: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” యెహోవా అవిశ్వాసుల ఎడలేగాక “మీ యెడల” అంటే క్రైస్తవ సంఘంలోని సభ్యుల ఎడల కూడా దీర్ఘశాంతము చూపిస్తున్నాడనే విషయాన్ని గమనించండి. ఎందుకు? ఎందుకంటే ‘ఎవ్వరూ నశించడం ఆయనకు ఇష్టంలేదు.’ నిత్యజీవ బహుమానాన్ని పొందేందుకు అర్హులయ్యేలా బహుశా కొంతమంది ఇంకా మార్పుల్నీ, సర్దుబాటుల్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కాబట్టి, కొన్ని సర్దుబాట్లు అవసరంకాగల రంగాల్ని మనం చూద్దాం.

మన వ్యక్తిగత సంబంధాల్లో “స్వస్థ బుద్ధి”

3. తమ పిల్లల విషయంలో తలిదండ్రులు ఏ ప్రశ్నల్ని తమకు తాముగా వేసుకోవచ్చు?

3 ఇల్లు శాంతికి నిలయంగా ఉండాలి. కానీ కొంతమందికి అది “కలహముతో కూడియుండిన ఇ[ల్లు]”గా ఉంటుంది. (సామెతలు 17:1) మీ కుటుంబం విషయమెలా ఉంది? మీ ఇల్లు “క్రోధము, అల్లరి, దూషణ” లేకుండా ఉందా? (ఎఫెసీయులు 4:31) మీ పిల్లల సంగతేమిటి? వాళ్లు ప్రేమించబడుతున్నట్లూ, ప్రశంసించబడుతున్నట్లూ భావిస్తారా? (లూకా 3:22 పోల్చండి.) మీరు వారికి బోధించడానికీ, తర్ఫీదునివ్వడానికీ సమయం తీసుకుంటున్నారా? మీరు కోపంతోనూ ఉద్రేకంతోనూ గాక ‘నీతియందు శిక్షిస్తారా’? (2 తిమోతి 3:16) పిల్లలు “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” గనుక వాళ్లెలా వ్యవహరించబడుతున్నారనే విషయంలో ఆయనకు అమితమైన ఆసక్తివుంది.—కీర్తన 127:3.

4. (ఎ) ఓ భర్త తన భార్యతో కఠినమైన రీతిలో గనుక వ్యవహరిస్తే వచ్చే ఫలితం ఏమైవుండగలదు? (బి) దేవునితో సమాధానాన్నీ, కుటుంబమంతటిలో సంతోషాన్నీ భార్యలు ఎలా పెంపొందింపజేయగలరు?

4 మీ వివాహజత విషయమేమిటి? “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింపబద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.” (ఎఫెసీయులు 5:28-30) దుర్భాషలాడే, అధికారాన్ని చూపించే లేక నిర్హేతుకంగా ప్రవర్తించే పురుషుడు తన గృహశాంతికి ముప్పును వాటిల్లజేయడం మాత్రమేగాక దేవునితో తనకుగల సంబంధాన్ని బలహీనపరుచుకుంటాడు. (1 పేతురు 3:7) భార్యల సంగతేమిటి? వాళ్లూ, అదే విధంగా “ప్రభువునకువలె [తమ] సొంతపురుషులకు లోబడి” ఉండాలి. (ఎఫెసీయులు 5:22) దేవున్ని ప్రీతిపర్చేరీతిలో ఆలోచించడమనేది ఓ భార్య తన భర్త తప్పిదాల్ని క్షమించి, కోపాన్ని మనస్సులో ఉంచుకోకుండా అతనికి లోబడేలా సహాయపడగలదు. కొన్నిసార్లు, భార్య తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం అవసరమని భావించవచ్చు. సామెతలు 31:26వ వచనం గుణవతియైన భార్యను గురించి ఇలా చెబుతోంది: “జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును.” తన భర్తతో దయాపూర్వకంగానూ గౌరవప్రదంగానూ వ్యవహరించడం ద్వారా, ఆమె దేవునితో సమాధానాన్ని కాపాడుకొంటుంది, యావత్‌ కుటుంబ సంతోషాన్నీ పెంపొందింపజేస్తుంది.—సామెతలు 14:1.

5. తమ తలిదండ్రులతో వ్యవహరించడాన్ని గూర్చిన బైబిలు సలహాను యౌవనస్థులు ఎందుకు అనుసరించాలి?

5 పిల్లలారా, మీ తలిదండ్రులతో మీరు ఎలా వ్యవహరిస్తారు? తరచూ ఈ లోకంచే సమ్మతించబడిన వ్యంగ్యమైన, అమర్యాదకరమైన పదజాలాన్ని మీరు ఉపయోగిస్తారా? లేక, “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది” అనే బైబిలు ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నారా?—ఎఫెసీయులు 6:1-3.

6. మన తోటి ఆరాధికులతో మనం సమాధానాన్ని ఎలా వెదకగలం?

6 మనం మన తోటి ఆరాధికులతో “సమాధానమును వెదకి దాని వెంటా”డినప్పుడు కూడా “స్వస్థ బుద్ధి”ని ప్రదర్శిస్తాం. (1 పేతురు 3:11) విభేదాలూ, అపోహలూ అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. (యాకోబు 3:2) ద్వేషపూరితమైన భావాలు పెరగకుండా నిరోధించలేకపోతే, సంఘమంతటి సమాధానం అపాయానికి గురి కాగలదు. (గలతీయులు 5:15) కాబట్టి, వివాదాల్ని త్వరగా పరిష్కరించుకోండి; సమాధానకరమైన పరిష్కారాల్ని వెదకండి.—మత్తయి 5:23-25; ఎఫెసీయులు 4:26; కొలొస్సయులు 3:13, 14.

“స్వస్థ బుద్ధి,” కుటుంబ బాధ్యతలు

7. (ఎ) సాంసారిక విషయాల్లో “స్వస్థ బుద్ధి”ని చూపించడం గురించి పౌలు ఏ విధంగా ప్రోత్సహించాడు? (బి) ఇంటి బాధ్యతల విషయంలో క్రైస్తవ భర్తలూ, భార్యలూ ఏ వైఖరిని కల్గివుండాలి?

7 అపొస్తలుడైన పౌలు “స్వస్థ బుద్ధితో . . . బ్రదుకుచుండవలెనని” క్రైస్తవులకు ఉపదేశించాడు. (తీతు 2:13) ఆ సందర్భంలో “తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారు[నై] . . . యుండవలెనని” స్త్రీలకు పౌలు ఉద్బోధించడం ఆసక్తికరమైన విషయమైవుంది. (తీతు 2:3) పౌలు దానిని సా.శ. 61-64 సంవత్సరాల్లో అంటే యూదా విధానం అంతంకావడానికి కొన్ని సంవత్సరాల ముందు రాశాడు. అయితే, ఇంట్లో పనిచేసుకోవడం వంటి సాంసారిక విషయాలు అప్పటికీ ప్రాముఖ్యమైనవే. కాబట్టి భార్యాభర్తలిరువురూ “దేవునివాక్యము దూషింపబడకుండునట్లు” తమ గృహనిర్వహణా బాధ్యతల విషయంలో క్షేమాభివృద్ధికరమైన, అనుకూలమైన దృక్పథాన్ని కల్గివుండాలి. చికాకును కల్గించేలా కన్పిస్తున్న తన గృహస్థితినిబట్టి ఓ కుటుంబ యజమాని తన ఇంటికి వచ్చిన ఒక సందర్శకునికి క్షమాపణ చెప్పుకున్నాడు. “తాను పయినీరు సేవ చేస్తున్నందున” దాన్ని బాగుచేయించలేకపోయానని ఆయన వివరించాడు. రాజ్యం పక్షాన మనం త్యాగాలు చేయడం మెచ్చుకోదగిన విషయమే కానీ మన కుటుంబ యోగక్షేమాల్ని త్యాగం చేయకుండా జాగ్రత్త వహించాలి.

8. కుటుంబ శిరస్సులు, తమ కుటుంబాల అవసరతల విషయంలో సమతూకమైన రీతిలో ఏ విధంగా శ్రద్ధ తీసుకోగలరు?

8 తన ఇంటివారికి అవసరమైన వాటిని చేకూర్చని వాడు “విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని చెబుతూ, తమ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బైబిలు తండ్రులకు ఉద్బోధిస్తుంది. (1 తిమోతి 5:8) ప్రపంచమందంతటా జీవన ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయి, వస్తుపరమైన వాటిని పొందాలనే సంభావ్యతల్ని తగుమాత్రంగా ఉంచుకోవడం మంచిది. “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము” అని సామెతలు 30:8 యొక్క రచయిత ప్రార్థించాడు. అయితే, తలిదండ్రులు తమ పిల్లల వస్తుదాయక అవసరాల్ని అలక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు, దైవపరిపాలనా ఆధిక్యతల్ని వెంబడించేందుకు, జీవితపు ప్రాథమిక అవసరాల్ని తీర్చకుండా ఒకడు తన కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టడం జ్ఞానయుక్తమైనదౌతుందా? ఇది ఒకరి పిల్లలకు కష్టం కలిగించదా? మరో వైపున, సామెతలు 24:27 ఇలా చెబుతోంది: “బయట నీ పని చక్క పెట్టుకో ముందు పొలంలో దాని సిద్ధపరచు తరువాత నీ కుటుంబాన్ని కూడా నిర్మించుకోవాలి.” అవును, వస్తుదాయక విషయాల కొరకైన శ్రద్ధ దాని స్థానంలో ఉండగా, ‘ఒకడు తన కుటుంబాన్ని నిర్మించుకోవడం’—ఆత్మీయంగానూ, భావోద్రేకంగానూ—ప్రాముఖ్యం.

9. కుటుంబ శిరస్సులు తాము మరణించే సాధ్యతను గురించి లేక రోగగ్రస్థులయ్యే సాధ్యతను గురించి ఆలోచించడం ఎందుకు జ్ఞానయుక్తమైనది?

9 మీరొక వేళ అకాల మరణానికి గురైతే మీ కుటుంబ సంరక్షణ కొరకైన ఏర్పాట్లను మీరు చేశారా? సామెతలు 13:22 ఇలా చెబుతోంది: “మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును.” యెహోవాను గూర్చిన జ్ఞానాన్నీ, ఆయనతో సంబంధాన్నీ వారసత్వంగా ఇవ్వడంతోపాటూ, తలిదండ్రులు తమ పిల్లలకు వస్తుదాయకంగా ఇవ్వడంలోనూ ఆసక్తిని కల్గివుంటారు. అనేక దేశాల్లో బాధ్యతగల కుటుంబ శిరస్సులు కొన్ని సేవింగ్‌లనూ, చట్టపరమైన వీలునామానూ, జీవితభీమాలను కల్గివుండేందుకు ప్రయత్నిస్తారు. ఎంతైనా దేవుని ప్రజలు ‘కాలవశము చేతనూ, అనూహ్యంగానూ జరిగేవాటి నుండి’ మినహాయించబడలేదు. (ప్రసంగి 9:11) “ద్రవ్యము ఆశ్రయాస్పదము,” జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం తరచూ కష్టాల్ని నివారించగలదు. (ప్రసంగి 7:12) వైద్యపరమైన సదుపాయాలకు ప్రభుత్వం డబ్బు చెల్లించని దేశాల్లో, కొంతమంది ఆరోగ్య అవసరాల కొరకు నిధుల్ని ప్రక్కన పెట్టుకోడానికో లేక ఏదో ఓ రకమైన ఆరోగ్య ఖర్చుల్ని భర్తీచేసే ఏర్పాటును చేసుకోడానికో ఎంపికచేసుకోవచ్చు.a

10. తమ పిల్లల కొరకు క్రైస్తవ తలిదండ్రులు ఎలా ‘కూడబెట్ట’వచ్చు?

10 లేఖనాలు కూడా ఇలా చెబుతున్నాయి: “పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా.” (2 కొరింథీయులు 12:14) ప్రపంచంలో తలిదండ్రులు తమ పిల్లలు సఫలీకృతమైన జీవితాన్ని ఆరంభించేలా వారి భవిష్యద్‌ విద్యాభ్యాసం కోసమూ, వివాహం కోసమూ ధనాన్ని కూడబెట్టడం సర్వసాధారణం. మీ పిల్లవాని ఆత్మీయ భవిష్యత్తు కొరకు కూడబెట్టడాన్ని గూర్చి మీరు ఆలోచించారా? ఉదాహరణకు, ఎదిగిన పిల్లవాడు పూర్తికాల పరిచర్యను చేపట్టాలని అనుకుంటున్నాడనుకోండి. పూర్తికాల సేవకులు ఇతరులనుండి ఆర్థికపరమైన సహాయాన్ని కోరకపోయినా లేక అపేక్షించకపోయినా, ప్రేమగల తలిదండ్రులు అతను పూర్తికాల సేవలో నిలిచివుండేలా సహాయపడేందుకు ‘అతని అవసరాలలో అతనితో పాలు పంచుకోడానికి’ ఎంపికచేసుకోవచ్చు.—రోమీయులు 12:13; 1 సమూయేలు 2:18, 19; ఫిలిప్పీయులు 4:14-18.

11. డబ్బు విషయంలో వాస్తవిక దృష్టిని కల్గివుండడం విశ్వాసలేమిని సూచిస్తుందా? వివరించండి.

11 డబ్బు విషయంలో వాస్తవికమైన దృష్టిని కల్గివుండడం సాతాను విధానం దాని అంతానికి సమీపంలో ఉందనే నమ్మకం లేకపోవడాన్ని సూచించదు. ఇది “లెస్సయైన జ్ఞానమును,” మంచి అవగాహనను చూపించడానికి సంబంధించిన విషయం మాత్రమే. (సామెతలు 2:7; 3:21) తమ డబ్బును ఉపయోగించుకోవడంలో “వెలుగు సంబంధులకంటె ఈ లోకసంబంధులు . . . యుక్తిపరులై యున్నారు” అని యేసు ఒకసారి చెప్పాడు. (లూకా 16:8) అందుకనే, తమ కుటుంబ అవసరాల ఎడల మరింత చక్కగా శ్రద్ధవహించగలిగేలా తమ ఆస్తుల్ని తాము ఉపయోగించే విధానంలో సర్దుబాట్లను చేసుకోవాల్సిన అవసరాన్ని కొంతమంది గ్రహించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

విద్యాభ్యాసాన్ని గూర్చిన మన దృక్కోణంలో “స్వస్థ బుద్ధి”

12. క్రొత్త పరిస్థితులకు అనుగుణంగా మారమని యేసు తన శిష్యులకు ఎలా బోధించాడు?

12 ‘ఈ లోకపు నటన గతించిపోతూ ఉన్నది,’ అలాగే విస్తృతమైన ఆర్థిక మార్పులూ, సాంకేతిక పురోభివృద్ధులూ వేగంగా సంభవిస్తున్నాయి. (1 కొరింథీయులు 7:31) అయితే, పరిస్థితులకు అనుగుణంగా మారేలా ఉండాలని యేసు తన శిష్యులకు బోధించాడు. యేసు వారిని తమ మొదటి ప్రచారయాత్రకు పంపించినప్పుడు వారితో ఇలా చెప్పాడు: “మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?” (మత్తయి 10:9, 10) అయితే, తర్వాత మరో సందర్భంలో యేసు ఇలా తెలియజేశాడు: “సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను.” (లూకా 22:36) ఏవి మారాయి? పరిస్థితులు. మతపరమైన వాతావరణం మరింత ప్రతికూలంగా తయారైంది, మరిప్పుడు వాళ్లు తమకు కావాల్సినవాటిని తాము సమకూర్చుకోవాల్సిందే.

13. విద్యాభ్యాసపు ప్రధాన సంకల్పమేమిటి, ఈ విషయంలో తలిదండ్రులు తమ పిల్లలకు మద్దతునిచ్చేవారిగా ఎలా ఉండగలరు?

13 అదే విధంగా నేడు కూడా, నేటి ఆర్థిక సంబంధమైన వాస్తవాల్ని తలిదండ్రులు పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఉదాహరణకు, మీ పిల్లలు తగినంత విద్యాభ్యాసాన్ని తప్పక పొందేలా మీరు ఏర్పాట్లు చేస్తున్నారా? విద్యాభ్యాసపు ప్రధాన సంకల్పం, ఓ యౌవనస్థున్ని యెహోవా యొక్క ప్రతిభావంతుడైన పరిచారకునిగా ఉండేలా సంసిద్ధంచేసేదై ఉండాలి. విద్యాభ్యాసాలన్నిటిలో కెల్లా ఎంతో ప్రాముఖ్యమైనది ఆత్మీయ విద్యాభ్యాసమే. (యెషయా 54:13) తమ పిల్లలు ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడే వారి సామర్థ్యాన్ని గురించి తలిదండ్రులు శ్రద్ధ కూడా కల్గివుంటారు. కాబట్టి మీ పిల్లలకు నడిపింపును ఇవ్వండి, తగిన పాఠశాల అంశాల్ని ఎంచుకునేందుకు వారికి సహాయపడండి, ఏదైనా అనుబంధ విద్యను అభ్యసించడం జ్ఞానయుక్తమైనదా కాదా అనే విషయాన్ని వారితో చర్చించండి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ బాధ్యతయైవుంది, మరి తీసుకున్న నిర్ణయాన్ని ఇతరులు విమర్శించకూడదు. (సామెతలు 22:6) తమ పిల్లలకు ఇంటివద్దనే విద్యను అభ్యసింపచేయాలని ఎంపిక చేసుకున్నవారి విషయమేంటి?b అనేకమంది మెచ్చుకోదగిన రీతిలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించగా, కొంతమంది అది తామనుకున్న దానికన్నా ఎంతో కష్టమైన పని అని తెల్సుకున్నారు, మరి వారి పిల్లలు తగిన విద్యను పొందలేకపోయారు. కాబట్టి మీరు ఇంటివద్ద విద్యనభ్యసింపచేయాలనే విషయాన్ని పరిశీలిస్తుంటే, దానికి కావాల్సిన నైపుణ్యాలూ, స్వయం-క్రమశిక్షణా మీకున్నాయా లేవా అని వాస్తవికంగా మూల్యనిర్ధారణ చేసుకుంటూ, అందులోవున్న సాధకబాధకాల్ని గురించి ఆలోచించండి.—లూకా 14:28.

‘గొప్పవాటిని వెదకవద్దు’

14, 15. (ఎ) బారాకు తన ఆత్మీయ సంతుల్యాన్ని ఎలా కోల్పోయాడు? (బి) ఆయన ‘గొప్పవాటిని వెదకడం’ ఎందుకు అవివేకయుక్తమైవుంది?

14 ఈ విధానాంతం ఇంకా రాలేదు గనుక కొంతమంది ఈ లోకం అందించే—ప్రతిష్ఠాత్మకమైన కెరీర్లనూ, లాభసాటియైన ఉద్యోగాల్నీ, సంపదనూ అన్వేషించేందుకు మొగ్గుచూపించవచ్చు. యిర్మీయా సెక్రటరీ అయిన బారాకును పరిశీలించండి. ఆయనిలా విలపించాడు: “కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికితోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను.” (యిర్మీయా 45:3) బారాకు అలసిపోయాడు. యిర్మీయా సెక్రటరీగా సేవచేయడం కష్టమైన, ఒత్తిడిగల పని. (యిర్మీయా 36:14-26) ఆ ఒత్తిడికి అంతంలేనట్టుగా అనిపించింది. యెరూషలేము నాశనం కావడానికి 18 సంవత్సరాలు ముందు అది జరిగి ఉండవచ్చు.

15 యెహోవా బారాకుతో ఇలా చెప్పాడు: “నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు.” బారాకు తన మానసిక భావోద్రేక సంతుల్యాన్ని కోల్పోయాడు. ఆయన తన కొరకు ‘గొప్పవాటిని వెదకడం’ ఆరంభించాడు అంటే బహుశా సంపదనో, ప్రాముఖ్యతనో లేక వస్తుదాయక భద్రతనో వెదకడం ఆరంభించి ఉండవచ్చు. యెహోవా ‘సర్వభూమినీ పెల్లగిస్తున్నాడు’ గనుక అలాంటి వాటిని వెదకడంలో అర్థమేముంది? అందుకే యెహోవా బారాకుకు ఈ వివేకయుక్తమైన జ్ఞాపికను ఇచ్చాడు: “నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, . . . నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను.” వస్తుదాయక ఆస్తులు యెరూషలేము నాశనంనుండి తప్పించుకోలేవు! “దోపుడుసొమ్ము దొరికినట్టుగా [ఆయన] ప్రాణము” మాత్రమే రక్షించబడుతుందని యెహోవా హామీ ఇచ్చాడు.—యిర్మీయా 45:4, 5.

16. బారాకు అనుభవాన్నుండి యెహోవా ప్రజలు నేడు ఏ పాఠాన్ని నేర్చుకొనగలరు?

16 యెహోవా చేసిన దిద్దుబాటును బారాకు లక్ష్యపెట్టాడు, యెహోవా వాగ్దానం చేసినట్లుగానే బారాకు ప్రాణంతో తప్పించుకున్నాడు. (యిర్మీయా 43:6, 7) నేటి యెహోవా ప్రజలకు ఎంతటి శక్తివంతమైన పాఠమైవుందో కదా! ‘మన కొరకు గొప్పవాటిని వెదకడానికి’ ఇది సమయంకాదు. ఎందుకు? ఎందుకంటే “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి.”—1 యోహాను 2:17.

మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం

17, 18. (ఎ) నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు యోనా ఎలా ప్రతిస్పందించాడు? (బి) యెహోవా యోనాకు ఏ పాఠాన్ని నేర్పించాడు?

17 అయితే, మిగిలిన సమయాన్ని మనమెలా సద్వినియోగం చేసుకోగలం? ప్రవక్తయైన యోనా అనుభవం నుండి నేర్చుకోండి. ఆయన “నీనెవె పట్టణమునకు పో[యి] . . . ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచే[సెను.]” యోనాకు ఆశ్చర్యం కల్గిస్తూ, నీనెవె పట్టణవాసులు ఆయన తెలియజేసిన సందేశానికి ప్రతిస్పందించి, పశ్చాత్తాపపడ్డారు! యెహోవా ఆ పట్టణాన్ని నాశనంచేయలేదు. యోనా ప్రతిస్పందన? “నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపు[ము.]”—యోనా 3:3, 4; 4:3.

18 అప్పుడు, యెహోవా యోనాకు ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు. ఆయన “సొరచెట్టొకటి ఏర్పరచి . . . అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.” అయితే, ఆ చెట్టు త్వరగా ఎండిపోవడంతో యోనా సంతోషం ఎంతోసేపు నిలువలేదు. యోనా తనకు కల్గిన అసౌకర్యాన్నిబట్టి ‘కోపించాడు.’ “యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” అని చెబుతూ యెహోవా తన తర్కాన్ని నొక్కివక్కాణించాడు.—యోనా 4:6, 7, 9-11.

19. ఏ స్వార్థపూరిత ఆలోచనా సరళిని మనం విడనాడాలని అనుకుంటాం?

19 యోనా వాదన ఎంత స్వార్థపూరితమైనదో కదా! ఆయన ఓ చెట్టును గురించి విచారించగలిగాడు కానీ నీనెవె ప్రజల ఎడల—ఆత్మీయ భావంలో చెప్పాలంటే ‘కుడియెడమలు ఎరుగని’ జనము ఎడల లేశమాత్రమైనా దయను చూపించలేదు. అదే విధంగా, మనమూ ఈ దుష్టలోక నాశనాన్ని కోరుకోవచ్చు. అది యుక్తమే. (2 థెస్సలొనీకయులు 1:6-8) అయితే, వేచివుంటుండగా, ఆత్మీయ భావంలో చెప్పాలంటే, ‘కుడియెడమలు ఎరుగని’ యథార్థహృదయులకు సహాయపడాల్సిన బాధ్యత మనకుంది. (మత్తయి 9:36; రోమీయులు 10:13-15) యెహోవాను గూర్చిన అమూల్యమైన జ్ఞానాన్ని పొందేలా వీలైనంత ఎక్కువమందికి సహాయపడేందుకు మిగిలివున్న ఈ కొంచెం కాలాన్ని మీరు ఉపయోగిస్తారా? జీవాన్ని సంపాదించుకునేందుకు ఒకరికి సహాయపడడంలోని ఆనందంతో ఏ పని సాటియైనదిగా ఉండగలదు?

“స్వస్థ బుద్ధి”తో జీవిస్తూ ఉండడం

20, 21. (ఎ) రాగల దినాల్లో “స్వస్థ బుద్ధి”ని మనం చూపించగల కొన్ని మార్గాలేవి? (బి) “స్వస్థ బుద్ధి”తో జీవించడం నుండి ఏ ఆశీర్వాదాలు వస్తాయి?

20 సాతాను విధానం అంతకంతకూ నాశన కూపంలోనికి కూరుకుపోతూండగా, మనకు తప్పకుండా కొత్త సవాళ్లు ఎదురౌతాయి. రెండవ తిమోతి 3:13 ఇలా ప్రవచిస్తోంది: “దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపోవుదురు.” కానీ “అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండం[డి.]” (హెబ్రీయులు 12:3) బలం కొరకు యెహోవాపై ఆధారపడండి. (ఫిలిప్పీయులు 4:13) గతకాలంలోని పరిస్థితుల్ని తలపోసుకుంటూ ఉండడానికి బదులు, చెడిపోతున్న ఈ కాలాలకు అవసరమైనంత మేరకు మారడాన్ని నేర్చుకోండి. (ప్రసంగి 7:10) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ఇటీవలి నడిపింపును అన్వయించుకుంటూ, ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని ఉపయోగించండి.—మత్తయి 24:45-47.

21 ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో మనకు తెలియదు. కానీ, “అన్నిటి అంతము సమీపమైయున్నది” అని మనం నిశ్చయంగా చెప్పగలం. ఆ అంతం వచ్చేంతవరకూ ఒకరితో మరొకరం వ్యవహరించే తీరులోనూ, మన కుటుంబాలను గురించి మనం శ్రద్ధ తీసుకునే విధానంలోనూ, మన లౌకిక బాధ్యతల విషయంలోనూ “స్వస్థ బుద్ధి”గల వారమై జీవిద్దాం. ఆ విధంగా చేయడం ద్వారా, మనం చివరకు “శాంతముగల[వారమై] . . . నిష్కళంకులుగాను నిందారహితులుగాను” ఉంటామనే నిశ్చయాన్ని మనమంతా కల్గివుండగలం!—2 పేతురు 3:14.

[అధస్సూచీలు]

a ఉదాహరణకు, అమెరికాలో ఆరోగ్య భీమా వంటి రక్షణలు ఖరీదైనవిగా ఉన్నప్పటికీ, అనేకమంది వాటిని కల్గివున్నారు. కుటుంబాలు వైద్య భీమాలను కల్గివుంటే రక్తరహిత ప్రత్యామ్నాయాల్ని గురించి యోచించేందుకు కొంతమంది వైద్యులు మరింత సుముఖతను చూపిస్తున్నారని సాక్షుల కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు కనుగొన్నాయి. అనేకమంది వైద్యులు పరిమితమైన భీమా ప్రణాళికల క్రిందనో లేక ప్రభుత్వ ఆరోగ్య ఖర్చుల భర్తీ క్రిందనో అనుమతించబడిన మొత్తాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తారు.

b ఇంటివద్దనే విద్యను అభ్యసించాలా వద్దా అనే విషయం వ్యక్తిగత నిర్ణయం. తేజరిల్లు! (ఆంగ్లం) ఏప్రిల్‌ 8, 1993లో ప్రచురించబడిన “ఇంటివద్ద విద్యాభ్యాసం—అది మీ కొరకేనా?” అనే శీర్షకను చూడండి.

పునఃసమీక్ష కొరకైన విషయాలు

◻ మన వ్యక్తిగత సంబంధాల్లో “స్వస్థ బుద్ధి”ని మనమెలా చూపించగలం?

◻ మన కుటుంబ బాధ్యతల్ని నిర్వహించడంలో మనమెలా సంతుల్యాన్ని చూపించగలం?

◻ తమ పిల్లల లౌకిక విద్యాభ్యాసం విషయంలో తలిదండ్రులు ఎందుకు శ్రద్ధవహించాలి?

◻ బారాకు, యోనాల నుండి మనమే పాఠాల్ని నేర్చుకుంటాం?

[18వ పేజీలోని చిత్రం]

భార్యాభర్తలిరువురూ ఒకరితో ఒకరు తగినరీతిగా వ్యవహరించనప్పుడు, వాళ్లు యెహోవాతో తమకున్న సంబంధాన్ని బలహీనపర్చుకుంటారు

[20వ పేజీలోని చిత్రం]

తలిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసం విషయంలో శ్రద్ధ వహించాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి