నేటి కొరకే జీవించడమా లేక నిరంతర భవిష్యత్తు కొరకు జీవించడమా?
“మనము [ఈ] నిరీక్షణ కలిగినవారమై . . . రక్షింపబడితిమి.”—రోమీయులు 8:24.
1. ఎపిక్యూరియన్లు దేనిని బోధించారు, ఆ విధమైన తత్వసిద్ధాంతం కొంతమంది క్రైస్తవులపై ఎలాంటి ప్రభావం చూపింది?
అపొస్తలుడైన పౌలు కొరింథులో నివసిస్తున్న క్రైస్తవులకు ఇలా రాశాడు: “మీలో కొందరు—మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?” (1 కొరింథీయులు 15:12) గ్రీకు దార్శనికుడైన ఎపిక్యూరస్ యొక్క విషపూరితమైన తత్త్వజ్ఞానం, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో కొంతమేరకు ప్రభావాన్ని చూపించింది. అందుకే, పౌలు ఎపిక్యూరస్ యొక్క ఈ బోధలవైపు అవధానాన్ని మళ్లించాడు: “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.” (1 కొరింథీయులు 15:32) మరణానంతర జీవితానికి సంబంధించిన ప్రతీ నిరీక్షణనూ తృణీకరిస్తూ, శారీరకానందమే జీవితంలో ముఖ్యమనీ లేక ప్రధానమనీ ఆ తత్వవేత్త అనుచరులు విశ్వసించారు. (అపొస్తలుల కార్యములు 17:18, 32) ఎపిక్యూరియన్ తత్వజ్ఞానం స్వార్థచింతనతోనూ నిర్లిప్తతతోనూ చివరకు భ్రష్టత్వంతోనూ కూడి ఉన్నది.
2. (ఎ) పునరుత్థానాన్ని తిరస్కరించడం ఎందుకు అంత అపాయకరమైనది? (బి) కొరింథులోని క్రైస్తవుల విశ్వాసాన్ని పౌలు ఎలా బలపర్చాడు?
2 పునరుత్థానాన్ని ఈ విధంగా తిరస్కరించడం తీవ్రమైన ప్రభావాల్ని కల్గివుంది. పౌలు ఇలా తర్కించాడు: “మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, [మా] విశ్వాసమును వ్యర్థమే. . . . ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.” (1 కొరింథీయులు 15:13-19) అవును, నిరంతర భవిష్యత్తును గూర్చిన నిరీక్షణలేకపోతే, క్రైస్తవత్వం “వ్యర్థ”మైనదౌతుంది. అది సంకల్పంలేనిదౌతుంది. అయితే, ఈ అన్య ఆలోచనా ప్రభావానికి గురైన కొరింథు సంఘం, సమస్యలమయంగా తయారయ్యిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. (1 కొరింథీయులు 1:11; 5:1; 6:1; 11:20-22) కాబట్టి, పునరుత్థానంలో వారి విశ్వాసాన్ని బలపర్చాలని పౌలు సంకల్పించాడు. ఆయన శక్తివంతమైన వాదనాపటిమనూ, లేఖన ఉల్లేఖనలనూ, ఉపమానాలనూ ఉపయోగిస్తూ, పునరుత్థాన నిరీక్షణ కల్పితగాథ కాదుగానీ తప్పక నెరవేరే ఓ వాస్తవికత అని ఏ సందేహాలకు తావులేకుండా రుజువుచేశాడు. దీని ఆధారంగా, ఆయన తన తోటి విశ్వాసులకు ఇలా ఉద్బోధించగలిగాడు: “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరింథీయులు 15:20-58.
“మెలకువగా ఉండుడి”
3, 4. (ఎ) పేతురు చెప్పినదాని ప్రకారంగా, ఏ ప్రమాదకరమైన వైఖరి అంత్యదినాల్లో కొంతమందిని ముంచివేస్తుంది? (బి) మనకు మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి?
3 ఈనాడు, అనేకమంది ప్రజలు ఆశావాద వైఖరినీ, నేటి కొరకే జీవించడం అనే వైఖరినీ కల్గివున్నారు. (ఎఫెసీయులు 2:2) అది అపొస్తలుడైన పేతురు ప్రవచించినట్లుగానేవుంది. “అపహాసకులు అపహసించుచువచ్చి . . . ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదు[రు]” అని ఆయన అపహాసకులను గురించి మాట్లాడాడు. (2 పేతురు 3:3, 4) సత్యారాధికులు గనుక అలాంటి దృక్పథానికి లోనైతే వాళ్లు ‘సోమరులుగానో లేక నిష్ఫలులుగానో’ తయారవ్వవచ్చు. (2 పేతురు 1:8) సంతోషదాయకంగా, ఈనాటి దేవుని ప్రజలలోని అనేకమంది విషయంలో పరిస్థితి అలా లేదు.
4 రాబోయే ప్రస్తుత దుష్ట విధానాంతమందు ఆసక్తిని కల్గివుండడం తప్పేమీ కాదు. యేసు స్వంత అపొస్తలులు చూపించిన ఆసక్తిని జ్ఞాపకం చేసుకోండి: “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” అందుకు యేసు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచు కొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.” (అపొస్తలుల కార్యములు 1:6, 7) ఈ మాటలు, ఆయన ఒలీవ కొండపై తెలియజేసిన ప్రాధమిక సందేశాన్ని కలిగివున్నాయి: “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు . . . మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును.” (మత్తయి 24:42, 44) మనం ఆ సలహాను గుర్తుచేసుకుంటూ ఉండాల్సిన అవసరతవుంది! కొందరు ‘బహుశా నేను అంత క్రియాశీలంగా ఉండకుండా, విషయాల్ని కాస్త తేలికగా తీసుకోవాలి’ అనే దృక్పథం కలిగివుండేలా శోధించబడవచ్చు. అదెంత పొరపాటవుతుందో కదా! ‘ఉరిమెడు వారైన’ యాకోబు, యోహానుల విషయాన్ని పరిశీలించండి.—మార్కు 3:17.
5, 6. యాకోబు యోహానుల మాదిరులనుండి మనమే పాఠాల్ని నేర్చుకోగలం?
5 యాకోబు ఎంతో ఆసక్తి కల్గివున్న అపొస్తలుడని మనకు తెలుసు. (లూకా 9:51-55) ఒక్కసారి క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత, ఆయన చురుకైన పాత్రను నిర్వహించి ఉంటాడు. కానీ యాకోబు ఇంకా యౌవనస్థుడిగా ఉండగానే, హేరోదు అగ్రిప్ప I ఆయనను చంపించాడు. (అపొస్తలుల కార్యములు 12:1-3) యాకోబు తన జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుండడం చూస్తూ, తాను మరీ ఆసక్తిని కల్గివున్నందుకూ, పరిచర్యలో శ్రమించినందుకూ విచారించి ఉంటాడని మనం అనుకుంటామా? అనుకోం! సాపేక్షికంగా చూస్తే స్వల్పమైన తన జీవితపు శ్రేష్ఠమైన సంవత్సరాల్ని యెహోవా సేవలో గడిపినందుకు ఆయన నిశ్చయంగా సంతోషించాడు. ఇప్పుడు, మన జీవితం అనుకోకుండా ముగిసిపోతుందో లేదో మనలో ఎవరమూ తెల్సుకోలేము. (ప్రసంగి 9:11; లూకా 12:20, 21 పోల్చండి.) కాబట్టి యెహోవాను సేవించడంలో మనం అత్యంత ఆసక్తిని కల్గివుంటూ, చురుకుగా ఉండడం జ్ఞానయుక్తమని స్పష్టమౌతుంది. ఆ విధంగా మనం ఆయన దగ్గర మన మంచి పేరును కాపాడుకుంటూ, మన నిరంతర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవిస్తాం.—ప్రసంగి 7:1.
6 యేసు “మెలకువగా ఉండుడి” అని తీవ్రంగా ఉద్బోధించినప్పుడు అక్కడేవున్న అపొస్తలుడైన యోహాను చేరివున్న ఓ సంబంధిత గుణపాఠం ఉంది. (మత్తయి 25:13; మార్కు 13:37; లూకా 21:34-36) యోహాను అనేక దశాబ్దాలుగా ఆసక్తితో సేవిస్తూ, ఆ ఉద్బోధను హృదయంలోకి తీసుకున్నాడు. నిజానికి, ఆయన ఇతర అపొస్తలులకంటే ఎక్కువ కాలం జీవించినట్లు కనబడుతోంది. యోహాను వయోవృద్ధాప్యంలో, దశాబ్దాలుగా చేసిన నమ్మకమైన పనిని పునరావలోకనం చేసుకొన్నప్పుడు, ఆయన దానిని ఓ పొరపాటుగానూ, తప్పుడు మార్గానికి మళ్లించబడిన జీవితంగానూ లేక సమతూకంలేని జీవితంగానూ దృష్టించాడా? లేదు, నిశ్చయంగా అలా దృష్టించలేదు! ఆయన అప్పటికీ భవిష్యత్తువైపు ఆతృతతోనే ఎదురుచూశాడు. పునరుత్థానుడైన యేసు “అవును, త్వరగా వచ్చుచున్నానని” చెప్పినప్పుడు, యోహాను “ఆమేన్; ప్రభువైన యేసూ రమ్ము” అని వెనువెంటనే ప్రత్యుత్తరమిచ్చాడు. (ప్రకటన 22:20) యోహాను కచ్చితంగా నెమ్మదియైన ‘ఒడుదుడుకుల్లేని జీవితం’ కొరకు ఎదురుచూస్తూ, ప్రస్తుతం కొరకే జీవించలేదు. ప్రభువు ఎప్పుడు వచ్చినప్పటికీ తన జీవితమంతటితోనూ, తన యావత్ బలంతోనూ సేవిస్తూ ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడు. మరి మన సంగతేమిటి?
నిత్య జీవమందు నమ్మకానికి పునాదులు
7. (ఎ) నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ ఎలా “అనాదికాలమందే వాగ్దానము” చేయబడింది? (బి) నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణపై యేసు ఏ విధంగా వెలుగును ప్రసరింపచేశాడు?
7 నిత్యజీవ నిరీక్షణయనేది మానవ నిర్మిత స్వప్నమో లేక కల్పనయో కాదనే నమ్మకాన్ని కల్గివుండండి. తీతు 1:1 చెబుతున్నట్లుగా, మన దైవభక్తి “నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణ”పై అంటే “అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము” చేసిన ఆ నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణపై ఆధారపడివుంది. విధేయులైన మానవులంతా నిరంతరం జీవించడం కొరకు అది దేవుని ఆది సంకల్పమైవుంది. (ఆదికాండము 1:28) ఏదీ కూడా, చివరకి ఆదాము హవ్వల తిరుగుబాటు సహితం, ఈ సంకల్పాన్ని ఆటంకపర్చలేదు. ఆదికాండము 3:15నందు రాయబడి ఉన్నట్లుగా, మానవజాతిని పట్టిపీడించిన హానినంతటినీ తొలగించబోయే ఓ ‘సంతానాన్ని’ దేవుడు వెనువెంటనే వాగ్దానం చేశాడు. ఆ ‘సంతానం’ లేక మెస్సీయా అయిన యేసు వచ్చినప్పుడు, నిరంతర జీవితాన్ని గూర్చిన నిరీక్షణను ఆయన తన ప్రధాన బోధల్లో ఒకదానిగా చేశాడు. (యోహాను 3:16; 6:47, 51; 10:28; 17:3) తన పరిపూర్ణ జీవితాన్ని విమోచన క్రయధనంగా అర్పించడం ద్వారా, మానవజాతికి నిత్యజీవాన్ని అనుగ్రహించే చట్టబద్ధమైన హక్కును క్రీస్తు పొందాడు. (మత్తయి 20:28) ఆయన శిష్యుల్లో కొందరు అంటే మొత్తం 1,44,000 మంది పరలోకంలో నిరంతరం జీవిస్తారు. (ప్రకటన 14:1-4) ఆ విధంగా ఒకప్పుడు మర్త్యమైన మానవులు ‘అమర్త్యతను ధరిస్తారు’!—1 కొరింథీయులు 15:53.
8. (ఎ) “అమర్త్యత” అంటే ఏమిటి, యెహోవా దానిని 1,44,000 మందికి ఎందుకు అనుగ్రహిస్తాడు? (బి) ‘వేరే గొఱ్ఱెల’ కొరకు యేసు ఏ నిరీక్షణను అనుగ్రహించాడు?
8 “అమర్త్యత” అంటే కేవలం ఎన్నటికీ మరణించకుండా ఉండడంకన్నా మరెంతో ఎక్కువని భావం. అందులో “నాశనములేని జీవమునకున్న శక్తి” చేరివుంది. (హెబ్రీయులు 7:15; ప్రకటన 20:6 పోల్చండి.) అయితే, అలాంటి విశిష్టమైన బహుమానాన్ని అనుగ్రహించడంలో దేవుడు ఏమి సాధిస్తాడు? దేవుని సృష్టి ప్రాణుల్లో ఎవ్వరూ నమ్మదగిన వారుకారనే సాతాను సవాల్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. (యోబు 1:9-11; 2:4, 5) దేవుడు 1,44,000 మందిని అమర్త్యులుగా ఉండడానికి అనుమతించడం ద్వారా, సాతాను సవాలుకు ఎంతో విశిష్టమైన రీతిలో జవాబిచ్చిన ఈ గుంపునందు తనకున్న పూర్ణ నమ్మకాన్ని సూచిస్తున్నాడు. కానీ మిగతా మానవాళి సంగతేమిటి? రాజ్యవారసులైన ఈ ‘చిన్నమందకు’ చెందిన ప్రథమ సభ్యులు ‘సింహాసనముల మీదకూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి . . . తీర్పుతీరుస్తారని’ యేసు వారితో చెప్పాడు. (లూకా 12:32; 22:29) ఇది, ఆయన రాజ్యపౌరులుగా ఇతరులు భూమిపై నిత్యజీవాన్ని పొందుతారని తెలియజేస్తోంది. ఈ ‘వేరే గొఱ్ఱెల’కు అమర్త్యత అనుగ్రహించబడనప్పటికీ, వాళ్లు ‘నిత్యజీవాన్ని’ తప్పక పొందుతారు. (యోహాను 10:16; మత్తయి 25:46) ఆ విధంగా, నిత్యజీవం క్రైస్తవులందరి నిరీక్షణయైవుంది. ఇది కల్పనకాదు గానీ, “అబద్ధమాడనేరని దేవుడు” చేసిన నిబద్ధతతో కూడిన వాగ్దానం, దాని కొరకు యేసు అమూల్యమైన రక్తం చెల్లించబడింది.—తీతు 1:1.
సుదూర భవిష్యత్తులో నెరవేరుతుందా?
9, 10. మనం అంతానికి సమీపంలో ఉన్నామనడానికి ఏ స్పష్టమైన సూచనలు ఉన్నాయి?
9 నిర్వివాదంగా మనం ‘అంత్యదినాలకు’ చేరుకున్నామని సూచించబోయే ‘అపాయకరమైన కాలాల్ని’ గురించి అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు. మన చుట్టూవున్న మానవ సమాజం ప్రేమలేనితనమూ, అత్యాశ, స్వార్థమూ, భక్తిహీనతా స్థితిలోనికి పడిపోతుండగా, ఈ దుష్టలోక విధానంపై తన తీర్పుల్ని అమలుచేయడం కొరకైన యెహోవా దినం వేగంగా సమీపిస్తూన్నదని మనం గ్రహించడం లేదా? హింసా విద్వేషాలు పెరిగిపోతుండగా, “దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపోవుదురు” అని ప్రవచించిన పౌలు తర్వాతి మాటల నెరవేర్పును మన చుట్టూ చూడడంలేదా? (2 తిమోతి 3:1-5, 13) కొంతమంది బహుశా ఆశావాదంతో “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని” చెప్పినప్పటికీ శాంతిని గూర్చిన ఉత్తరాపేక్షలన్నీ నిర్వీర్యమైపోతాయి ఎందుకంటే “గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” మన కాలాల్ని గూర్చిన భావం విషయంలో మనం చీకటిలో విడిచిపెట్టబడలేదు. కాబట్టి, “మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.”—1 థెస్సలొనీకయులు 5:1-6.
10 అంతేగాక, అంత్యదినాల ‘సమయం కొంచెమే’ అని బైబిలు సూచిస్తోంది. (ప్రకటన 12:12; 17:10 పోల్చండి.) ఆ ‘కొంచెం సమయం’లో చాలా మొత్తం గడిచిపోయినట్లుగా కనబడుతోంది. ఉదాహరణకు, దానియేలు ప్రవచనం, మన శతాబ్దం వరకూ కొనసాగించబడిన, “ఉత్తరదేశపు రాజు”కూ “దక్షిణదేశపు రాజు”కూ మధ్య జరిగిన పోరాటాన్ని కచ్చితంగా వివరిస్తోంది. (దానియేలు 11:5, 6) ఇక నెరవేరడానికి మిగిలివున్నది ఏమిటంటే దానియేలు 11:44, 45 వచనాల్లో వర్ణించబడిన “ఉత్తర దేశపు రాజు” యొక్క చివరి దాడి మాత్రమే.—ఈ ప్రవచనాన్ని గూర్చిన చర్చ కొరకు కావలికోట జూలై 1, 1987 (ఆంగ్లం), నవంబరు 1, 1993 చూడండి.
11. (ఎ) మత్తయి 24:14 ఎంతమేరకు నెరవేరింది? (బి) మత్తయి 10:23నందు రాయబడివున్న యేసు మాటలు దేనిని సూచిస్తున్నాయి?
11 “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు ప్రవచించిన ప్రవచనం కూడావుంది. (మత్తయి 24:14) నేడు, యెహోవాసాక్షులు 233 దేశాల్లోనూ, ద్వీపసముదాయాల్లోనూ, ప్రాంతాల్లోనూ తమ పనిని నెరవేరుస్తున్నారు. నిజమే, ఇంకనూ ప్రకటించని ప్రాంతాలు ఉన్నాయి, బహుశా యెహోవా నియమిత కాలంలో, అవకాశ ద్వారం తెరవబడవచ్చు. (1 కొరింథీయులు 16:9) అప్పటికీ, “మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండ[రు]”అని మత్తయి 10:23 వచనంలో రాయబడివున్న యేసు మాటలు గంభీరంగా ఉన్నాయి. సువార్త భూమియందంతటా తప్పక ప్రకటించబడినప్పటికీ, యేసు తీర్పును అమలుచేసే వానిగా ‘రావడానికి’ ముందు రాజ్య సందేశంతో భూమిపైనున్న అన్ని ప్రాంతాలనూ మనం స్వయంగా చేరుకోలేము.
12. (ఎ) ప్రకటన 7:3వ వచనంలో ఏ ‘ముద్ర’ సూచించబడింది? (బి) భూమిపైనున్న అభిషిక్తుల సంఖ్య తగ్గిపోవడాన్ని గూర్చిన విశేషత ఏమైవుంది?
12 “మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు” హానిని కలుగజేసే ‘నాలుగు దిక్కుల వాయువులు’ పట్టుకొనబడ్డాయని చెబుతున్న ప్రకటన 7:1, 3 వచనాల్ని పరిశీలించండి. ఇది, 1,44,000 మందికి చెందిన వారు పరలోకపు పిలుపును పొందినప్పుడు ముద్రించబడే ప్రథమ ముద్రను సూచించడంలేదు. (ఎఫెసీయులు 1:13) ఇది, అంతిమ ముద్రను అంటే వాళ్లు “మన దేవుని” పరీక్షించబడిన, నమ్మకమైన ‘దాసులు’గా తిరుగులేనిరీతిలో గుర్తించబడినప్పటి ముద్రను సూచిస్తుంది. భూమిపై సజీవంగా ఉన్న దేవుని యథార్థవంతులైన అభిషిక్త కుమారుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. అంతేగాక, “ఏర్పరచబడినవారి నిమిత్తము” మహా శ్రమ యొక్క ప్రారంభ భాగం “తక్కువ” చేయబడుతుందని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (మత్తయి 24:21, 22) అభిషిక్త క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో అనేకులు వయోవృద్ధులు. అంతం సమీపంలో ఉందని ఇది సూచించడంలేదా?
నమ్మకమైన కావలివాడు
13, 14. కావలివాని తరగతి బాధ్యత ఏమిటి?
13 ఈలోగా, మనం ‘నమ్మకమైన దాసుడు’ ఇచ్చే నడిపింపును లక్ష్యపెట్టడం మంచిది. (మత్తయి 24:45) వంద సంవత్సరాలకు పైగా, ఆధునికదిన “దాసుడు” ‘కావలివాని’గా నమ్మకంగా సేవ చేస్తున్నాడు. (యెహెజ్కేలు 3:17-21) కావలికోట జూన్ 1, 1984 ఇలా వివరించింది: “బైబిలు ప్రవచనము నెరవేర్పుననుసరించి ఏ ప్రకారముగా భూమిమీద సంఘటనలు జరుగుచున్నవో ఈ కావలివాడు కనిపెట్టి చూచి, ‘లోకారంభము నుండి [ఇప్పటివరకును] కలుగని మహాశ్రమలు’ కలుగబోవుచున్నవని హెచ్చరికచేయుచున్నాడు. మరియు ‘సువర్తమానము ప్రకటించుచున్నాడు.’”—మత్తయి 24:21; యెషయా 52:7.
14 “తనకు కనబడుదానిని” తెలియజేయడం కావలివాని పని అనే విషయాన్ని గుర్తుంచుకోండి. (యెషయా 21:6-8) బైబిలు కాలాల్లో కావలివాడు, రాబోయే ప్రమాదం స్పష్టంగా గుర్తించలేనంత దూరంలో ఉన్నప్పుడు సహితం హెచ్చరించేవాడు. (2 రాజులు 9:17, 18) వెనుకటికి తప్పుడు హెచ్చరికల్ని ఇవ్వడం కూడా జరిగింది. కానీ మంచి కావలివాడు అవమానానికి జడిసి హెచ్చరించకుండా ఉండడు. మీ ఇల్లు అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే, మరి అది అగ్నిమాపక సిబ్బందికి తప్పుడు హెచ్చరికగా అన్పించినందున వాళ్లు రాకపోతే మీరెలా భావిస్తారు? అలాంటి సిబ్బంది అపాయాన్ని సూచించే ప్రతీచిన్న హెచ్చరికకూ సత్వరంగా ప్రతిస్పందించాలని మనం ఎదురు చూస్తాం! అదే విధంగా, పరిస్థితులు హెచ్చరించదగినవిగా కన్పించినప్పుడు, కావలివాని తరగతి హెచ్చరించింది.
15, 16. (ఎ) ప్రవచనాన్ని గూర్చిన మన అవగాహనలో దిద్దుబాటులు ఎందుకు చేయబడ్డాయి? (బి) కొన్ని ప్రవచనాలను తప్పుగా అర్థంచేసుకొన్న దేవుని నమ్మకమైన సేవకులనుండి మనం ఏమి నేర్చుకోగలం?
15 అయితే, సంఘటనలు అంతకంతకూ తేటతెల్లమవుతుండగా ప్రవచనాన్ని గూర్చిన మన అవగాహన స్పష్టమయ్యింది. దైవిక ప్రవచనాలు నెరవేరక మునుపే వాటిని పూర్తిగా అర్థంచేసుకోవడం అరుదని చరిత్ర చూపుతోంది. దేవుడు అబ్రహాముతో ఆయన సంతానం కచ్చితంగా 400 సంవత్సరాలు ‘తమది కాని పరదేశమందు నివసిస్తారని’ చెప్పాడు. (ఆదికాండము 15:13) అయితే, నిర్ణీత కాలానికి ముందు విమోచకునిగా మోషే స్వయంగా ముందుకు వచ్చాడు.—అపొస్తలుల కార్యములు 7:23-30.
16 మెస్సీయాకు సంబంధించిన ప్రవచనాల్ని కూడా పరిశీలించండి. సింహావలోకనం చేస్తే, మెస్సీయా మరణ పునరుత్థానాలు ప్రవచించబడ్డాయనే విషయం సుస్పష్టం. (యెషయా 53:8-10) అయినప్పటికీ, యేసు స్వంత శిష్యులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక పోయారు. (మత్తయి 16:21-23) దానియేలు 7:13, 14 వచనాలు క్రీస్తు భవిష్యద్ పరౌసియా కాలంలో లేక “ప్రత్యక్షత” కాలంలో నెరవేరుతాయని వాళ్లు గ్రహించనేలేదు. (మత్తయి 24:3, NW) “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” అని వాళ్లు యేసును అడిగినప్పుడు, వాళ్లు దాదాపు 2,000 సంవత్సరాల్ని తప్పుగా లెక్కించారు. (అపొస్తలుల కార్యములు 1:6) క్రైస్తవ సంఘం బాగా స్థిరపర్చబడిన తర్వాత కూడా, పొరపాట్లతో కూడిన అభిప్రాయాలూ, తప్పు నిరీక్షణలూ తలెత్తుతూనే ఉన్నాయి. (2 థెస్సలొనీకయులు 2:1, 2) అయితే, కొంతమంది అప్పుడప్పుడూ పొరపాటుపడిన అభిప్రాయాలను కల్గివున్నప్పటికీ, యెహోవా మొదటి శతాబ్దంలోని ఆ విశ్వాసుల పనిని నిస్సందేహంగా ఆశీర్వదించాడు!
17. లేఖనాన్ని మనం అర్థంచేసుకోవడంలోని దిద్దుబాటులు గూర్చి మన దృక్పథం ఏమైవుండాలి?
17 అదే విధంగా, నేటి కావలివాని తరగతి అప్పుడప్పుడూ తన ఉద్దేశాల్ని స్పష్టపర్చాల్సి వచ్చింది. అయితే, యెహోవా ఆ ‘నమ్మకమైన దాసున్ని’ ఆశీర్వదించాడనేదాన్ని ఎవరైనా సందేహించగలరా? పైగా, పూర్వాపర సందర్భాన్ని పరిగణనలోనికి తీసుకుంటే, చేయబడిన దిద్దుబాటుల్లో అనేకం సాపేక్షికంగా చిన్నవి కావా? బైబిల్ని గూర్చిన మన ప్రాధమిక అవగాహన మారలేదు. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే మన నమ్మకం మునుపెన్నటికన్నా పటిష్ఠంగా ఉంది!
నిరంతర భవిష్యత్తు కొరకు జీవించడం
18. నేటి కొరకు మాత్రమే జీవించడమనే దృక్పథాన్ని మనమెందుకు విడనాడాలి?
18 ‘మనం రేపు చనిపోతాం గనుక తిందాం, త్రాగుదాం’ అని లోకం అనవచ్చు గానీ ఇది మన వైఖరి మాత్రం కాకూడదు. మీరు నిరంతర భవిష్యత్తు కొరకు పనిచేయగల్గినప్పుడు ఇప్పటి జీవితాన్నుండి పొందగల ఆనందాల కోసం ఎందుకు వ్యర్థంగా ప్రయాసపడడం? ఆ నిరీక్షణ, పరలోకంలో అమర్త్య జీవితమైనా లేక భూమిపై నిత్య జీవమైనా, అది స్వప్నమూ కాదు, కల్పనాకాదు. అది “అబద్ధమాడనేరని” దేవుడు వాగ్దానం చేసిన ఓ వాస్తవం. (తీతు 1:1) మన నిరీక్షణ వాస్తవరూపం దాల్చే సమయం సమీపించిందనడానికి సాక్ష్యం ఎంతో ఉంది! “కాలము సంకుచితమై యున్నది.”—1 కొరింథీయులు 7:29.
19, 20. (ఎ) రాజ్యం కొరకు మనం చేసిన త్యాగాల్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? (బి) మనం ఎందుకు నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించాలి?
19 నిజమే, ఈ విధానం ఇంతకాలం నిలుస్తుందని అనేకమంది తలంచిన దానికన్నా ఎక్కువ కాలం ఇప్పటికే నిలిచింది. దీన్ని గురించి తమకు ముందుగా తెల్సివుంటే, తాము ఆ ఫలానా త్యాగాల్ని చేయకపోయేవాళ్లం గదా అని కొంతమంది ఇప్పుడు భావించవచ్చు. కానీ త్యాగాల్ని చేసినందుకు ఒకరు చింతించకూడదు. త్యాగాలు చేయడం క్రైస్తవునిగా ఉండడంలో ఓ ప్రాథమిక భాగమైవుంది. క్రైస్తవులు ‘తమ్మును తాము ఉపేక్షించుకోవాలి.’ (మత్తయి 16:24) దేవుని ప్రీతిపర్చేందుకైన మన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయని మనం ఎన్నడూ భావించకూడదు. యేసు ఇలా వాగ్దానం చేశాడు: “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు . . . నూరంతలుగా [పొందుతాడు.] . . . రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు[తాడు.]” (మార్కు 10:29, 30) ఇప్పటి నుండి ఓ వెయ్యి సంవత్సరాల తర్వాత, మీ ఉద్యోగమూ, ఇల్లూ, లేక బ్యాంకు అక్కౌంట్ ఎంత ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి? మీరు యెహోవా కొరకు చేసిన త్యాగాలు ఇప్పటి నుండి పది లక్షల సంవత్సరాల తర్వాత—వందకోట్ల సంవత్సరాల తర్వాత కూడా అర్థవంతంగా ఉంటాయి! “మీరు చేసిన కార్యమును . . . మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.
20 కాబట్టి, మన నేత్రాల్ని “దృశ్యమైనవాటి[పై గాక] . . . అదృశ్యమైనవాటి[పై]నే” నిలుపుతూ, నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మనం జీవిద్దాం. “ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.” (2 కొరింథీయులు 4:17, 18) ప్రవక్తయైన హబక్కూకు ఇలా రాశాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) అంతం కొరకు ‘కనిపెట్టుకుంటూ ఉండడం’ మన వ్యక్తిగత బాధ్యతల్నీ, కుటుంబ బాధ్యతల్నీ నెరవేర్చే విధానంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? ఈ విషయాల్ని మన తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.
పునఃసమీక్ష కొరకైన విషయాలు
◻ ఆలస్యమవుతున్నట్టుగా అనిపిస్తున్న ఈ విధానాంతాన్నిబట్టి నేడు కొందరెలా ప్రభావితులయ్యారు?
◻ నిత్యజీవాన్ని గూర్చిన మన నిరీక్షణకు ఆధారమేమిటి?
◻ రాజ్యాసక్తుల కొరకు మనం చేసిన త్యాగాల్ని మనమెలా దృష్టించాలి?
[15వ పేజీలోని చిత్రం]
అంతం రావడానికి ముందు భూగోళవ్యాప్తంగా జరిగే ప్రకటనాపని పూర్తవ్వాలి