రాజ్య ప్రచారకుల నివేదిక
యెహోవా యొక్క దైవపరిపాలనా సంస్థలోనికి పారిపోవడం
చాలాకాలం క్రితం ప్రవక్తయైన యెషయా ఇలా ప్రకటించేందుకు పురికొల్పబడ్డాడు: ‘సముద్ర ద్వీపవాసులారా యెహోవాను ఘనపర్చుడి.’ (యెషయా 24:15) యెహోవాసాక్షులు ‘సువార్త ప్రకటింపబడ వలసిన’ ‘లోకమంతటిలో’ సముద్ర ద్వీపాలను కూడా ఒక భాగంగా పరిగణిస్తారు.—మత్తయి 24:14; మార్కు 13:10.
మార్కేజజ్ ద్వీపాలు, టాహిటికి ఈశాన్యంగా దాదాపు 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దక్షిణ పసిఫిక్‌లో సుదూరానున్న, ఫ్రెంచ్ పాలినేషియా అని పిలువబడే ద్వీపకల్పంలో అవి ఒక భాగమైవున్నాయి. సారవంతమైన, అగ్నిపర్వతం నుండి వచ్చిన మట్టి మరియు వెచ్చనైన, తేమగల వాతావరణం మూలాన ఈ ద్వీపాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. అయితే, మార్కేజజ్లో మరో విధమైన పెరుగుదల కూడా ఉంది. హీవా ఓఆ అనే ద్వీపంలో రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించిన ఒక కుటుంబం యొక్క సంగతిని పరిశీలించండి.
జాం మరియు అతడి భార్య నాడీన్లకు తాము నివసిస్తున్న పశ్చిమ యూరప్‌లోని బూటకపు నాగరిక సమాజ జీవనమంటే విసుగు పుట్టింది. కాబట్టి, వాళ్లు ఉరుకులు పరుగులతో సాగే ఆ జీవన విధానాన్ని వదిలేసి, తమ పిల్లవానితో పాటూ మార్కేజజ్ ద్వీపానికి తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెదురు బొంగులతో నిర్మించబడిన వారి క్రొత్త ఇల్లు మారుమూలనున్న ఓ లోయలో నెలకొని ఉంది. వారికి అతి సమీపానున్న పొరుగు వారిని చేరుకునేందుకు, వారు ఎత్తుపల్లాలతోకూడిన పర్వత మార్గంగుండా రెండు గంటలు కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. జీపులో మూడు గంటలు ప్రయాణం చేస్తే గానీ వాళ్లు వైద్యుడు, పాఠశాల మరియు కిరాణదుకాణం ఉన్న అతి సమీపంలోని గ్రామాన్ని చేరుకోలేరు.
జాం నాడీన్లకు మతం ఎడల ఆసక్తి ఉండేది కాదు. అయితే వారు జీవావిర్భవాన్ని గురించి అప్పుడప్పుడూ చర్చిస్తుండే వారు. తరచూ వారు సంక్లిష్టమైన పరిణామ సిద్ధాంతాలను గురించి కల్పనలు చేసే వారు. అయితే వారి సిద్ధాంతాల్లో ఏవీ కూడా వారికి సంతృప్తినివ్వలేదు.
ఆరు సంవత్సరాలపాటూ ఏకాంతంగా జీవించిన తర్వాత, వారిని ఇద్దరు యెహోవాసాక్షులు సందర్శించినప్పుడు వారెంతో ఆశ్చర్యపోయారు. సాక్షులు జాం నాడీన్లను గురించిన వివరాలను దగ్గర్లోని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్నారు. సహజంగానే, వారి సంభాషణ పరిణామ సిద్ధాంతాన్ని గురించిన చర్చ వైపుకు దారి తీసింది. యెహోవాసాక్షులు ప్రచురించిన జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తక ప్రతి సాక్షుల దగ్గర ఉండడం ఆ దంపతులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. జీవం ఎలా ప్రారంభమయ్యిందనే విషయాన్ని స్పష్టంగా చర్చించే పుస్తకాన్ని పొందగలిగినందుకు జాం నాడీన్లు ఎంతో ఆనందించారు.
కొంత కాలం తర్వాత, బైబిలు పఠనం ప్రారంభించబడింది. దాదాపు మూడు సంవత్సరాల కాలంలో జాం నాడీన్లు చక్కగా పురోభివృద్ధి చెందారు. త్వరలోనే భూమ్యంతా కూడా ఒక పరదైసుగా మార్చబడుతుందని వారు ఒప్పించబడ్డారు. వారికి మరో ఇద్దరు పిల్లలు జన్మించాక రాజ్య మందిరంలో జరిగే కూటాలకు హాజరయ్యేందుకు నాలుగు గంటలు ప్రయాణించి వెళ్లడం వారికి నిజంగా ఓ సవాలుగా మారింది. అయితే వారు కూటాలకు హాజరు కాకుండా అది వారిని ఆటంకపరచలేదు. తుదకు జాం నాడీన్లు తాము యెహోవాకు సమర్పించుకున్నామని నీటి బాప్తిస్మం ద్వారా సూచించారు. ముఖ్య గ్రామంలో జరిగిన, 38 మంది శిఖర సమావేశ హాజరు ఉన్న ఒక సమావేశంలో వారు బాప్తిస్మం తీసుకున్నారు!
రాజ్య ప్రచారకుల చిన్న గుంపుకు సహాయం చేసేందుకు, తమ ఏకాంత గృహాన్ని వదిలి వెళ్లాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. దాదాపు వేయి మంది ప్రజలు నివసిస్తున్న ఒక గ్రామానికి వారు తరలి వెళ్లారు, అక్కడ జాం ఇప్పుడు యెహోవాసాక్షుల ప్రాంతీయ సంఘంలో ఒక పరిచర్య సేవకునిగా సేవ చేస్తున్నాడు. నాగరికతను తప్పించుకునేందుకు ద్వీపాలకు పారిపోయిన ఈ కుటుంబం, ఏకైక నిజమైన ఆశ్రయమైన యెహోవా దైవపరిపాలనా సంస్థను కనుగొనగల్గటం తమ ఆధిక్యతగా పరిగణిస్తున్నారు.