కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 5/15 పేజీలు 4-8
  • మీరు పునర్జన్మయందు నమ్మకముంచాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు పునర్జన్మయందు నమ్మకముంచాలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దాని మూలాన్నీ, ఆధారాన్నీ గుర్తించడం
  • మానవునిలో అమర్త్యమైన భాగమేదైనావుందా?
  • ప్రజలు ఎందుకు బాధపడ్తున్నారు?
  • ఓ శాంతియుతమైన భవిష్యత్తు
  • దేవుని వాక్యం పునర్జన్మను బోధిస్తుందా?
    తేజరిల్లు!—1994
  • బైబిలు పునర్జన్మ గురించి బోధిస్తోందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 5/15 పేజీలు 4-8

మీరు పునర్జన్మయందు నమ్మకముంచాలా?

గ్రీకు తత్వవేత్తయైన ప్లేటో, ప్రేమలో పడ్డాన్ని పునర్జన్మ సిద్ధాంతానికి ముడిపెట్టాడు. దేహం మరణించిన తర్వాత జీవాత్మ అమర్త్యమైనదిగా “సిద్ధాకృతులు ఉండే ఊర్ధ్వలోకానికి” పోతుందని ఆయన విశ్వసించాడు. నిరాకారంగావుండి, అది ఆకృతుల్ని యోచిస్తూ అక్కడే కొంతకాలం ఉంటుంది. తర్వాత ఆ జీవాత్మ మరో జన్మను ఎత్తినప్పుడు, ఊర్ధ్వలోక ఆకృతుల్ని లేశమాత్రంగా ఎక్కడో గుర్తుపెట్టుకుంటూ, వాటి కోసం పరితపించిపోతుంది. ప్లేటో చెప్పినదాని ప్రకారం, ప్రజలు ప్రేమలో పడ్డానికి కారణమేంటంటే తమకు అస్పష్టంగా గుర్తున్న, అన్వేషిస్తోన్న సౌందర్యాదర్శ ఆకృతిని తమ ప్రియమైన వ్యక్తిలో చూడడమే.

దాని మూలాన్నీ, ఆధారాన్నీ గుర్తించడం

పునర్జన్మ బోధకు జీవాత్మ అమర్త్యమైనదిగా ఉండడం అవసరం. అయితే, అలాంటి నమ్మకాన్ని కల్గివున్న ప్రజలనుండో లేక జనాంగాలనుండో పునర్జన్మ సిద్ధాంత పుట్టుపూర్వోత్తరాల్ని కనుగొనగలం. దీని ఆధారంగా, ఇది ప్రాచీన ఈజిప్టులో ప్రారంభమైందని కొందరు తలస్తారు. ఇతరులు అది ప్రాచీన బబులోనులో ఆరంభమైందని నమ్ముతారు. బబులోను మతానికి ప్రజాదరణను సృష్టించేందుకే, దాని మతగురువులు జీవాత్మ దేహాంతర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ విధంగా, ఎంతోకాలం క్రిందట మరణించినటువంటి ప్రసిద్ధిగాంచిన పూర్వికులే తమ మతనాయకులుగా పునర్జన్మించారని వాళ్లు చెప్పుకోగలిగారు.

అయితే, ఇండియాలోనే పునర్జన్మయందలి ఆ నమ్మకం అత్యున్నత దశకు చేరుకుంది. హిందూ ఋషులు మానవుల్లోవున్న చెడుతనాన్ని గూర్చిన, బాధలను గూర్చిన విశ్వ సమస్యలతో తలమునకలై పోయారు. ‘నీతిమంతుడైన సృష్టికర్తను గూర్చిన భావనతో ఇవి ఎలా ఏకీభవిస్తాయి?’ అని వాళ్లు అడిగారు. వాళ్లు దేవుని నీతికీ, లోకంలో జరిగే అనూహ్యమైన విపత్తులకూ అసమానతలకూ మధ్యనున్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కాలక్రమేణా వాళ్లు, ‘మనుష్యుడు దేన్ని విత్తుతాడో దాన్నే కోస్తాడు’ అనే కార్యాకరణ నియమమైన “కర్మ సిద్ధాంతాన్ని” రూపొందించారు. వాళ్లు వివరణాత్మకమైన పాపపుణ్యాల చిట్టాను ఒకదాన్ని తయారుచేశారు. దాని ఆధారంగా, ఒక జన్మలో చేసిన మంచిచెడులకు మరు జన్మలో ప్రతిఫలం పొందడమో లేక శిక్షించబడ్డమో నిర్ణయించబడుతుంది.

సరళంగా చెప్పాలంటే “కర్మ” అనగా “కృతం” అని భావం. ఒక హిందువు సామాజిక మత నియమాల అనుసారంగా ప్రవర్తిస్తే అతడు సత్‌కర్మను పొందుతాడనీ, అలా ప్రవర్తించకపోతే దుష్కర్మను పొందుతాడనీ చెప్పబడింది. అతని ప్రవర్తనా లేక కర్మే, రాబోయే ప్రతీ పునర్జన్మలోనూ అతని భవిష్యత్తును నిర్ధారిస్తుంది. “మనుష్యులందరికీ భౌతిక లక్షణాలు వంశపారంపర్యంగా సంక్రమించినప్పటికీ, వాళ్లు గత జన్మల్లో ప్రవర్తించిన విధానంపైనే ప్రధానంగా ఆధారపడి రూపొందించబడిన స్వభావపు నకలుతో పుడతారు” అని తత్త్వవేత్తయైన నికిలానంద చెబుతున్నారు. “[ఆ విధంగా] ఒకడు తన పూర్వనిర్ధారణ నిర్మాణకుడై, తన విధికి తానే శిల్పకారుడు అవుతాడు.” అయితే, ఈ దేహాంతర వృత్తాన్నుండి మోక్షంపొంది, పారమార్ధిక సత్యమైన బ్రహ్మన్‌లో ఐక్యమవ్వడమే పరమ గమ్యం. దీన్ని, సామాజికంగా అంగీకృతమైన ప్రవర్తన కోసమూ, ప్రత్యేక హిందూ జ్ఞానం కోసమూ కృషిచేయడం ద్వారా సాధించవచ్చని విశ్వసించబడుతుంది.

ఆ విధంగా పునర్జన్మ బోధ, జీవాత్మ అమర్త్య సిద్ధాంతాన్ని తన పునాదిగా చేసుకొని, కర్మ నియమాన్ని ఉపయోగిస్తూ దానిపై కట్టడాన్ని కడుతోంది. ఈ అభిప్రాయాల్ని గురించి దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు ఏమి చెబుతుందో చూద్దాం.

మానవునిలో అమర్త్యమైన భాగమేదైనావుందా?

ఈ ప్రశ్నకు జవాబు కోసం, ఈ అంశం విషయంలో సర్వోన్నత అధికారిక మూలమైన సృష్టికర్త ప్రేరేపిత వాక్యం దగ్గరకు వెళ్దాం. మొదటి మానవుడైన ఆదాము సృష్టించబడిన విధానాన్ని గూర్చి వర్ణిస్తూ, బైబిల్లోని తొలి పుస్తకం ఇలా చెబుతోంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ [నెఫెస్‌] ఆయెను.”a (ఆదికాండము 2:7) స్పష్టంగా, జీవాత్మ లేక ప్రాణము అనేది మనుష్యునిలోనుండి వేరైన ఓ భాగమని లేఖనాలు సూచించడంలేదు. మనుష్యుడు ప్రాణమును కల్గిలేడుగానీ అతడే ప్రాణముయైవున్నాడు. జీవాత్మ లేక ప్రాణము కొరకు ఇక్కడ ఉపయోగించబడిన పదం నెఫెష్‌. అది బైబిల్లో 700 సార్లకు పైగా కన్పిస్తోంది. అది మానవునిలో వేరుగావున్న నిరాకార భాగాన్ని ఎన్నడూ సూచించదు కానీ సృశించగల్గినదాన్నీ, భౌతికమైనదాన్నీ ఎల్లప్పుడూ సూచిస్తోంది.—యోబు 6:7, NW; కీర్తన 35:13; 107:9; 119:28.

అయితే, మరణమందు ఏమి జరుగుతుంది? ఆదాము మరణించినప్పుడు అతనికి ఏమి జరిగిందో పరిశీలించండి. అతడు పాపం చేసినప్పుడు, దేవుడు అతనితో ఇలా చెప్పాడు: “నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.” (ఆదికాండము 3:19) దాని భావం ఏమిటో ఆలోచించండి. దేవుడు ఆదామును నేలమంటి నుండి సృజించడానికి మునుపు, ఆదాము ఉనికిలోలేడు. ఆదాము తాను మరణించిన తర్వాత అదే విధంగా ఉనికిలోలేకుండా పోయాడు.

సరళంగా చెప్పాలంటే, మరణం జీవానికి భిన్నమని బైబిలు బోధిస్తోంది. ప్రసంగి 9:5, 10 వచనాల్లో మనమిలా చదువుతాం: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు [“షియోల్‌,” NW] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”

మృతులు ఏమీ చేయలేరనీ, వారికి ఎటువంటి భావాలూ ఉండవనీ దీని భావం. వాళ్లకు ఇక ఏ విధమైన ఆలోచనలూ ఉండవు. వారిక దేన్నీ గుర్తుంచుకోరు. కీర్తనల గ్రంథకర్త ఇలా చెబుతున్నాడు: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.”—కీర్తన 146:3, 4.

మరణమందు జీవాత్మ లేక ప్రాణము దేహాంతరం చెందదు కానీ అది మరణిస్తుందని బైబిలు స్పష్టంగా చూపుతోంది. “పాపముచేయు ప్రాణమేదో అదే మరణిస్తుంది” అని బైబిలు నొక్కి వక్కాణిస్తోంది. (యెహెజ్కేలు 18:4, 20, NW; అపొస్తలుల కార్యములు 3:23, NW; ప్రకటన 16:3, NW) ఆ విధంగా పునర్జన్మ సిద్ధాంతపు పునాదియైన జీవాత్మ అమర్త్యతా సిద్ధాంతానికి లేఖనాల్లో ఏ విధమైన మద్దత్తూ లేకుండాపోయింది. ఆ పునాదికి మద్దతే లేకపోతే అది కూలిపోతుంది. మరైతే, లోకంలో మనం చూస్తున్న బాధలు ఏమి వివరిస్తున్నాయ్‌?

ప్రజలు ఎందుకు బాధపడ్తున్నారు?

మానవ బాధలకు వెనుకనున్న అంతర్గత కారణమేంటంటే, పాపియైన ఆదాము ద్వారా మనకందరికీ సంక్రమించిన అపరిపూర్ణతే. “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆదాము నుండి వచ్చినందున, మనం అందరమూ రోగగ్రస్థులమై, వృద్ధాప్యానికి ఎదిగి మరణిస్తున్నాం.—కీర్తన 41:1, 3; ఫిలిప్పీయులు 2:25-27.

అంతేగాకుండా, మార్పునొందని సృష్టికర్త నైతిక చట్టం ఇలా చెబుతోంది: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛేలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును.” (గలతీయులు 6:7, 8) ఆ విధంగా, ఉచ్ఛనీచాల్లేని జీవనశైలి భావోద్రేక కలతలకూ, కోరదగని గర్భధారణలకూ, లైంగిక సంక్రమిత రోగాలకూ దారితీయవచ్చు. “ఆశ్చర్యాన్ని కల్గించే రీతిలో, [అమెరికాలోని] ప్రాణాంతకపు క్యాన్సర్‌ రోగాల్లో 30 శాతం ధూమపానం మూలంగానే సంక్రమించాయనీ, అంతే శాతం జీవనశైలి మూలంగానూ, విశేషంగా ఆహార నియమాలూ, వ్యాయామలోపం మూలంగానూ వచ్చాయని” సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక చెబుతోంది. బాధలకు కారణమైన కొన్ని విపత్తులు, భూ వనరుల్ని మానవుడు దుర్వినియోగం చేయడం ఫలితంగా ఏర్పడ్డాయి.—ప్రకటన 11:18 పోల్చండి.

అవును, మానవుడు తన దుస్థితిలో అధిక శాతానికి అతడే బాధ్యుడు. అయితే, జీవాత్మ అమర్త్యమైంది కాదు గనుక, మానవ బాధల్ని కర్మకు ముడిపెట్టేందుకు అంటే గత జన్మలో చేశారని తలంచబడ్తున్న క్రియలకు ముడిపెట్టేందుకు ‘నువ్వు విత్తినదాన్నే కోస్తావు’ అనే నియమాన్ని ఉపయోగించలేం. “చనిపోయినవాడు పాపవిముక్తుడని” బైబిలు చెబుతోంది. (రోమీయులు 6:7, 23) ఆ విధంగా, పాపఫలం, మరణానంతర జీవితానికి అన్వర్తించదు.

బాధల్లో అధిక శాతానికి అపవాదియైన సాతాను కూడా కారణం. నిజానికి, ఈ లోకం సాతాను ఆధీనంలోవుంది. (1 యోహాను 5:19) యేసుక్రీస్తు ప్రవచించినట్లుగానే, ఆయన శిష్యులు ‘ఆయన నామం నిమిత్తం అందరిచేత ద్వేషింపబడతారు.’ (మత్తయి 10:22) తత్ఫలితంగా, దుష్టులకన్నా నీతిమంతులే ఎక్కువ కష్టాల్ని ఎదుర్కుంటారు.

ఈ లోకంలో జరిగే కొన్ని సంఘటనలకుగల కారణమేంటో అంత సులభంగా తెలియదు. అతి వేగంగా పరిగెత్తే రన్నర్‌ తొట్రిల్లి, పరుగుపందెంలో ఓడిపోవొచ్చు. బలమైన సైన్యం బలహీనమైన సైన్యం చేతిలో ఓడిపోవొచ్చు. తెలివైన వ్యక్తి ఓ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోలేక పోవొచ్చు, అందునుబట్టి పస్తులుండాల్సి రావొచ్చు. వ్యాపార నిర్వహణలో మంచి అవగాహనగల వ్యక్తులు, పరిస్థితుల్ని బట్టి, తమ జ్ఞానాన్ని అన్వయించుకోలేకపోవొచ్చు, తత్ఫలితంగా వాళ్లు దరిద్రులు కావొచ్చు. జ్ఞానంగల వ్యక్తులు, అధికారంలోవున్న వారి ఆగ్రహానికి గురై, అనుగ్రహాన్ని కోల్పోవొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ‘ఇవన్నీ కాలవశము చేతనూ, అనూహ్యంగానూ జరుగుతున్నాయి’ అని జ్ఞానియైన సొలొమోను రాజు జవాబిస్తున్నాడు.—ప్రసంగి 9:11, NW.

బాధ ఎందుకుందనేది హిందూ ఋషులు వివరించేందుకు ప్రయత్నించిన కాలానికి ఎంతో ముందునుండే మానవజాతి దాన్ని అనుభవిస్తోంది. కానీ శ్రేష్ఠమైన భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ ఉందా? మరి మృతుల కొరకు బైబిలు ఏ వాగ్దానాన్ని ఇస్తోంది?

ఓ శాంతియుతమైన భవిష్యత్తు

సాతాను ఆధీనంలోవున్న ప్రస్తుత లోక సమాజాన్ని త్వరలోనే నాశనం చేస్తానని సృష్టికర్త వాగ్దానం చేశాడు. (సామెతలు 2:21, 22; దానియేలు 2:44) నీతియుక్తమైన ఓ నూతన మానవ సమాజం అంటే “క్రొత్త భూమి,” అప్పుడు వాస్తవమౌతుంది. (2 పేతురు 3:13) ఆ సమయంలో “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు.” (యెషయా 33:24) దేవుడు ‘వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోతాయి’ గనుక మరణవేదన సహితం తీసివేయబడుతుంది.—ప్రకటన 21:4.

వాగ్దానం చేయబడిన దేవుని నూతనలోక నివాసుల్ని గురించి, కీర్తనల గ్రంథకర్త ఇలా ప్రవచించాడు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) అంతేకాకుండా, దీనులు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.

ముందు శీర్షికలో ప్రస్తావించబడిన ముకుంద్‌బాయ్‌, దేవుని అద్భుతకరమైన వాగ్దానాల్ని గురించి తెల్సుకోకుండానే మరణమందు నిద్రించాడు. కానీ దేవుని ఎరుగకుండానే మరణించిన కోట్లాదిమందికి అలాంటి శాంతియుతమైన నూతనలోకంలోనికి లేపబడే ఉత్తరాపేక్ష ఉంది. ఎందుకంటే దాన్ని గురించి బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్ధానము కలుగ బోవుచున్నది.’—అపొస్తలుల కార్యములు 24:14; లూకా 23:43.

“పునరుత్థానము” అనే పదం ఇక్కడ “మరలా నిలబడడం” అనే అక్షరార్థ భావాన్ని కల్గివున్న అనాస్థసిస్‌ అనే గ్రీకు పదాన్నుండి అనువదించబడింది. ఆ విధంగా పునరుత్థానమందు ఓ వ్యక్తి జీవన నమూనాను పునర్జీవింపచేయడం చేరివుంది.

భూమ్యాకాశాల సృష్టికర్త, అనంత జ్ఞాని. (యోబు 12:13) మరణించినవారి జీవన నమూనాలను జ్ఞాపకం ఉంచుకోవడం ఆయనకో లెక్కకాదు. (యెషయా 40:26 పోల్చండి.) యెహోవా దేవుడు ప్రేమామయుడు కూడా. (1 యోహాను 4:8) అందునుబట్టే, మృతులు చేసిన చెడుక్రియల్నిబట్టి వారిని శిక్షించేందుకుగాక ఆ మృతులు చనిపోకముందు వాళ్లకున్న వ్యక్తిత్వంతోనే పరదైసు భూమిపై జీవించేందుకు తిరిగి వాళ్లను సజీవులుగా చేయడానికి ఆయన తన పరిపూర్ణ జ్ఞాపకశక్తిని ఉపయోగించగలడు.

ముకుంద్‌బాయ్‌లాంటి కోట్లాదిమందికి పునరుత్థానం అంటే తమ ప్రియమైనవారితో మరలా కలిసి జీవించడమేనని భావం. కానీ ఇప్పుడు జీవిస్తున్న వారి విషయంలో దీని భావం ఏమైవుండగలదో ఊహించండి. ఉదాహరణకు, దేవున్ని గూర్చిన, ఆయన సంకల్పాల్ని గూర్చిన అద్భుతమైన సత్యాల్ని తెల్సుకున్న ముకుంద్‌బాయ్‌ కొడుకునే తీసుకోండి. దుష్టత్వంచే, బాధలచే చుట్టుముట్టబడిన దాదాపు అనంతమైన పునర్జన్మలచక్రంలో తన తండ్రి చిక్కుకోలేదని తెల్సుకోవడం అతనికి ఎంత ఓదార్పును ఇస్తున్నదో కదా! అతడు కేవలం పునరుత్థానం కోసం ఎదురుచూస్తూ మరణమందు నిద్రిస్తున్నాడు. బైబిల్లోనుండి తాను నేర్చుకున్న వాటిని తన తండ్రితో పంచుకోవడం సాధ్యమయ్యే రోజు గురించి తలపోసుకోవడం ఆయన్ని ఎంతగా పులకరింపజేస్తుందో కదా!

“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలనేది దేవుని చిత్తం. (1 తిమోతి 2:3, 4) ఇప్పటికే దేవుని చిత్తాన్ని చేస్తున్న లక్షలాదిమందితోపాటూ, మీరూ పరదైసు భూమిపై నిరంతరం ఎలా జీవించవచ్చుననే దానిని గురించి తెల్సుకునేందుకు ఇదే సమయం.—యోహాను 17:3.

[అధస్సూచీలు]

a “నెఫెష్‌ అనే హీబ్రూ పదమూ, సైఖే అనే గ్రీకు పదమూ “ఆత్మ,” “జీవి,” “జీవాత్మ” “ప్రాణము,” “దేహము,” అలాగే “వ్యక్తి” అని భారతీయ భాషల్లోవున్న బైబిళ్లయందు వేర్వేరుగా అనువదించబడ్డాయి. (ఉదాహరణకు, యెహెజ్కేలు 18:4, అలాగే మత్తయి 10:28 వచనాల్ని తమిళ ఆథరైజ్డు వర్షన్‌లోనూ, న్యూహిందీ బైబిలు వర్షన్‌లోనూ చూడండి.) మీ స్వభాషా బైబిళ్లు “ఆత్మ”యనిగానీ “ప్రాణము”యనిగానీ లేక ఇంకేపదాల్నైనాగానీ, వాటిని సంఘటితంగా నెఫెష్‌, సైఖేలకు బదులు ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఆ పదాలున్న వచనాల్ని పరిశీలించడం, అవి ప్రాచీనకాలంలో దేవుని ప్రజలకు ఏ భావాన్నిచ్చాయో తెల్సుకోవడానికి మీకు సహాయపడతాయి. ఆ విధంగా, మీకుగామీరే జీవాత్మ యొక్క వాస్తవికస్థితిని నిశ్చయపర్చుకోగలరు.

[7వ పేజీలోని చిత్రం]

“ఇవన్నీ కాలవశము చేతనూ, అనూహ్యంగానూ జరుగుతున్నాయి.”—ప్రసంగి 9:11, NW

[6వ పేజీలోని బాక్సు]

దేవుని వ్యక్తిత్వం, కర్మ సిద్ధాంతం

“కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోవడం దుర్లభం. గనుక జోక్యం చేసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. సూచనార్థకంగా చెప్పాలంటే, ఆయన ఆ సిద్ధాంతాన్ని నెలకొల్పి, ప్రక్కకు తప్పుకున్నాడు” అని మోహన్‌దాస్‌ కె. గాంధీ వివరించాడు. ఇది కలచివేసే విషయమని గాంధీ భావించాడు.

మరో వైపున, దేవునికి తన సృష్టిపై ప్రగాఢమైన మక్కువ ఉందని పునరుత్థాన వాగ్దానం బయల్పరుస్తోంది. మరణించిన వ్యక్తిని పరదైసు భూమిపై తిరిగి జీవానికి తీసుకు రావడానికి, ఆ వ్యక్తిని గూర్చిన ప్రతి విషయాన్నీ దేవుడు ఎరిగివుండి, గుర్తుంచుకోవాలి. నిజానికి దేవుడు మనలో ప్రతీ ఒక్కరి ఎడల శ్రద్ధను కల్గివున్నాడు.—1 పేతురు 5:6, 7.

[5వ పేజీలోని చిత్రం]

హిందూ జీవచక్రం

[8వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం పునరుత్థానాన్ని బోధిస్తోంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి