కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 5/15 పేజీలు 3-4
  • పునర్జన్మను మీరు నమ్ముతారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పునర్జన్మను మీరు నమ్ముతారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవిత మర్మాలకు పునర్జన్మ కీలకమా?
    తేజరిల్లు!—1994
  • బైబిలు పునర్జన్మ గురించి బోధిస్తోందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవుని వాక్యం పునర్జన్మను బోధిస్తుందా?
    తేజరిల్లు!—1994
  • మీరు పునర్జన్మయందు నమ్మకముంచాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 5/15 పేజీలు 3-4

పునర్జన్మను మీరు నమ్ముతారా?

“ఇక్కడ ఇండియాలో నువ్వు బాల్యదశలో ఉన్నప్పుడు, నీవు ప్రేమించిన మన పొరిగింటి అమ్మాయి నీకు గుర్తుందా? ఆ అమ్మాయికి ఇక కొద్ది వారాల్లో పెళ్లికాబోతుంది. ఆ విషయం నీకు తెలియడం మంచిదని నేను అనుకున్నాను” అని ముకుంద్‌బాయ్‌, అమెరికాలో విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న తన కొడుక్కి రాశాడు.

అయితే తండ్రి తన కొడుకుతో ఈ విషయాన్ని ఎందుకు పంచుకున్నాడు? ఏళ్లక్రిందట ఎప్పుడో సాగిన ఆ టీనేజ్‌ ప్రేమకలాపాన్ని నిలిపివేయాలని అనుకున్నందుకే. పైగా కొడుకు, అమెరికాలో ఆరు సంవత్సరాలుగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయికీ అతనికీ ఉత్తరప్రత్యుత్తరాలేమీ జరగలేదు. ఆ విషయం ముకుంద్‌బాయ్‌కి తెలుసు.

మరైతే ఎందుకు ఆయనకు ఆ చింత? ముకుంద్‌బాయ్‌కి పునర్జన్మనందు నమ్మకముంది గనుకనే. బాల్యదశలో వాళ్లిద్దరి మధ్యావున్న ఆ ఆకర్షణ, బహుశా వాళ్లిద్దరూ మునుపటి జన్మలో భార్యాభర్తలైనందు మూలంగానేయైతే, వివాహ వయస్కులైన వాళ్లని ఇప్పుడు వేరుచేయడం క్రూరమైన చర్య అవుతుంది. ఆ అమ్మాయి ఈ జన్మలో వేరొకరి భార్య కాకమునుపే జరగబోయేదాని విషయంలో తన కొడుకుని అప్రమత్తున్ని చేయాలని ముకుంద్‌బాయ్‌ అనుకున్నాడు.

మరొక ఉదాహరణను పరిశీలించండి. ఇండియాలోని ముంబయ్‌ నగరమందున్న ఓ హాస్పటల్‌లో నాలుగేళ్ల పాప తీవ్రమైన యాతనల్ని అనుభవించింది. ఆ పాప గుండె కవాటాల్లో ఒకటి పాడైంది. ధనవంతులైన ఆ పాప తల్లిదండ్రులు, ఆ పాప పడే బాధను చూడలేకపోయారు. కానీ, వాళ్లిలా సమర్థించుకున్నారు: “దీన్ని మేము అనుభవించాల్సిందే. దీనికి తగినదేదో గత జన్మలో చేసివుంటుంది.”

హిందూమతానికీ, బౌద్ధమతానికీ, జైనమతానికీ, సిక్కుమతానికీ, ఇండియాలోనే ఉద్భవించిన మరితర మతాలకూ చెందిన కోట్లాదిమంది వ్యక్తుల జీవితాల్లో, పునర్జన్మ ఎడలగల నమ్మకం ఓ ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తోంది. ప్రేమలోపడ్డం నుండి తీవ్రమైన బాధలకు గురవ్వడం వరకూ ఉన్న జీవితానుభవాలు, గత జన్మలోనో లేక జన్మల్లోనో చేసిన క్రియల పర్యవసానాలుగానే పరిగణించబడుతున్నాయి.

పాశ్చాత్యదేశాలకు చెందిన అనేకమంది కూడా ఈ పునర్జన్మ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. దీన్ని నమ్ముతున్నానని అమెరికా నటియైన షిర్లా మాక్లిన్‌ బహిరంగంగానే చెప్పుకొంటోంది. కెనడాకు చెందిన బ్రిటిష్‌ కొలంబియాలోని వన్‌కూవర్‌ ద్వీపంవాడైన లోరల్‌ పెలన్‌ అనే రచయిత, గత యాభై జన్మలస్మృతులు తనకు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు. 1994లో సి.ఎన్‌.ఎన్‌/యు.ఎస్‌.ఎ టుడే నిర్వహించిన గేలప్‌ పోల్‌లో ఇంటర్వ్యూచేసిన 1,016 మందిలో 270 మంది పునర్జన్మయందు తమకు నమ్మకముందని తెలియజేశారు. పునర్జన్మయందు నమ్మకం, నూతన యుగోద్యమంలో ఓ భాగం కూడా. కానీ ఏ సాక్ష్యాధారం ఈ నమ్మకాన్ని బలపరుస్తోంది?

“గతజన్మ స్మృతులే!” అని పునర్జన్మయందు నమ్మకం ఉంచేవారు చెబుతారు. అందుకే, బాన్‌కాక్‌ వాసియైన మూడేళ్ల రత్నా “తాను, 60 ఏళ్లపైబడిన వయస్సులో మరణించిన మతనిష్టగల ఓ స్త్రీనని తన గతజన్మ స్మృతుల్ని” గురించి చెప్పడం ఆరంభించినప్పుడు, దాన్ని చూసిన అనేకమంది అది పునర్జన్మకో బలమైన రుజువని ఒప్పుకున్నారు.

అయినప్పటికీ, అనుమానాలు కోకొల్లలు. గతజన్మ స్మృతులని భావించబడే వాటిని ఇతరత్రా వివరించడం సాధ్యమే.a హిందూమతం: దాని ఆత్మమోక్షార్థ భావన (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, హిందూ తాత్వికవేత్తయైన నికిలానంద్‌ ‘మరణానంతర అనుభవాల్ని వివేచనతో రుజువు చేయలేమని’ చెబుతున్నాడు. అయినప్పటికీ, “పునర్జన్మ సిద్ధాంతాన్ని నిరూపించలేక పోవడానికన్నా నిరూపించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన ధృవపరుస్తున్నాడు.

అయితే బైబిలు ఈ బోధను సమర్థిస్తోందా? మరి దేవుని ప్రేరేపిత వాక్యం, మృతులకు ఏ నిరీక్షణను ఇస్తోంది?

[అధస్సూచీలు]

a తేజరిల్లు! జూన్‌ 8, 1994, 5-7 పేజీలను చూడండి.

[4వ పేజీలోని చిత్రం]

గతజన్మలో చేసిన పాపాల్నిబట్టి ఈమె శిక్షించబడుతోందా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి