దేవుడే నా ఆశ్రయమును నా దుర్గమునైయున్నాడు
శార్లాట్ ముల్లర్ చెప్పినది
కమ్యూనిస్టు న్యాయమూర్తి ఇలా అన్నాడు: “హిట్లర్ పాలనలో మీరు గడిపిన తొమ్మిది సంవత్సరాలు మెచ్చుకోదగినవి. అప్పుడు మీరు నిజంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు మా శాంతికి వ్యతిరేకంగా ఉన్నారు!”
ఆయన నేను నాజీల క్రింద అనుభవించిన జైలు శిక్షను గురించీ జర్మన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లోని సామ్యవాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న వెంటనే నేను తెల్లబోయాను కానీ తర్వాత ఇలా సమాధానమిచ్చాను: “ఇతర ప్రజలు పోరాడిన విధంగానే ఒక క్రైస్తవుడు నిజమైన శాంతి కొరకు పోరాడడు. దేవున్ని మరియు నా పొరుగు వారిని ప్రేమించాలన్న బైబిలు ఆజ్ఞను నేను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నానంతే. నేను మాటల్లోనూ క్రియల్లోనూ శాంతియుతంగా ఉండేందుకు దేవుని వాక్యం నాకు సహాయం చేస్తుంది.”
ఆ దినాన అంటే 1951 సెప్టెంబరు 4న కమ్యూనిస్ట్‌లు నాకు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు, అది నాజీలు విధించిన దానికన్నా ఒక సంవత్సరం తక్కువ.
యెహోవాసాక్షులమైన మేము జాతీయ సామ్యవాదులూ కమ్యూనిస్టుల ద్వారా హింసింపబడుతున్నప్పుడు, నేను కీర్తన 46:1వ వచనాన్నిబట్టి ఆదరణను పొందాను: “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.” యెహోవాయే నేను సహించేందుకు శక్తినిచ్చాడు, ఆయన వాక్యాన్ని నేను ఎంతగా ఆకళింపు చేసుకున్నానో నేనంతగా బలపడ్డాను.
భవిష్యత్తు కొరకు దృఢపర్చబడటం
జర్మనీ నందలి తురింగాలోని గొత్తా-సీబ్లెబెన్లో నేను 1912వ సంవత్సరంలో జన్మించాను. నా తలిదండ్రులు ప్రొటెస్టెంటు వారైనప్పటికీ నా తండ్రి బైబిలు సత్యం కొరకూ నీతియుక్తమైన ప్రభుత్వం కొరకూ వెదుకుతున్నాడు. నా తలిదండ్రులు “సృష్టి యొక్క ఫోటో-డ్రామా”ను చూసినప్పుడు వారు అత్యానందభరితులయ్యారు.a నాన్న తాను వెదుకుతున్న దాన్ని, అంటే దేవుని రాజ్యాన్ని కనుగొన్నాడు.
అమ్మా నాన్నలు, ఆరుగురు పిల్లలమైన మాతోపాటు 1923 మార్చి 2న చర్చికి రాజీనామా చేశారు. సాక్సన్నందలి కిమ్నిట్జ్లో మేము నివసిస్తున్నాము, అక్కడ మేము బైబిలు విద్యార్థులతో సహవసించే వాళ్లము. (నా సహోదరసహోదరీల్లో ముగ్గురు యెహోవాసాక్షులయ్యారు.)
బైబిలు విద్యార్థుల కూటాల్లో, లేఖన వాక్యాలూ ప్రశస్తమైన సత్యాలు నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి, అవి నా యౌవన హృదయాన్ని ఆనందంతో నింపాయి. అన్నిటికీ మిన్నగా, మొదట్లో 50 కంటే ఎక్కువమంది ఉన్న క్రైస్తవ యౌవనులమైన మాకు ఆదివారాల్లో ఉపదేశం ఇవ్వబడేది, నేను మా అక్క కాట్ కొంతకాలం వరకూ దానికి హాజరయ్యాము. మా గుంపులో యౌవనుడైన కాన్రాడ్ ఫ్రాంక్ కూడా ఉన్నాడు, అతడు హైక్లనూ పాటల ప్రాక్టీసులనూ మా కొరకు నిర్వహించేవాడు. తర్వాత, 1955 నుండి 1969 వరకూ బ్రదర్ ఫ్రాంక్ జర్మనీలోని వాచ్‌టవర్ బ్రాంచి పర్యవేక్షకునిగా సేవ చేశాడు.
1920లు అల్లకల్లోలంగా ఉన్న సంవత్సరాలు, అవి కొన్నిసార్లు దేవుని ప్రజలకు కూడా సమస్యలను కలిగించాయి. కొంతమంది సహోదరులు కావలికోటను “తగినవేళ” ఇవ్వబడిన “అన్నము”గా దృష్టించడం మానివేశారు, మరి వారు ఇంటింటి ప్రకటనాపనిని వ్యతిరేకించారు. (మత్తయి 24:45) ఇది భ్రష్టత్వానికి దారి తీసింది. అయితే ఆ సమయంలో మాకు ఎంతో అవసరమైన శక్తి మాకు ఆ ‘అన్నం’ నుండే లభించింది. ఉదాహరణకు, “నిర్భయులు ధన్యులు” (1919) మరియు “యెహోవాను ఎవరు ఘనపరుస్తారు?” (1926) అనే కావలికోట శీర్షికలు వచ్చాయి. సాహసోపేతమైన కార్యాల ద్వారా నేను యెహోవాను ఘనపర్చాలని అనుకున్నాను, అందుకని నేను బ్రదర్ రూథర్‌ఫోర్డ్ గారి పుస్తకాలనూ చిన్న పుస్తకాలను ఎన్నింటినో పంచి పెట్టాను.
నేను మార్చి 1933లో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాను. అదే సంవత్సరంలో, జర్మనీలో మా ప్రకటనాపని నిషేధించబడింది. బాప్తిస్మం సమయంలో, ప్రకటన 2:9, 10 భవిష్యత్తు కొరకు సలహాగా అందించబడింది: “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.” నేను ఈ వచనాన్ని గురించి బాగా ధ్యానించాను, నాకు త్వరలో కఠోరమైన శ్రమలు రాబోతున్నాయనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అది నిజమని నిరూపించబడింది.
మా కుటుంబం రాజకీయపరంగా తటస్థంగా నిలిచింది గనుక, మా పొరుగువారు అనేకులు మమ్మల్ని అనుమానించారు. రాజకీయ ఎన్నికలు జరిగిన తర్వాత, యూనిఫారమ్‌లు ధరించిన నాజీ సైనికుల దండు మా ఇంటి ఎదుట నిలబడి “దేశద్రోహులు ఇక్కడే ఉంటారు!” అని గట్టిగా అరిచారు. 1933 డిశంబరు కావలికోట జర్మనులో వచ్చిన సంచిక, “వారికి భయపడకుడి” అనే శీర్షిక నాకు ప్రత్యేకంగా ప్రోత్సాహాన్నిచ్చింది. అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నేను యెహోవాకు నమ్మకమైన సాక్షిగా నిలవాలని కోరుకున్నాను.
శత్రువు పరిష్కారం—చెరసాల
1935 వసంతకాలం వరకూ కిమ్నిట్జ్లో కావలికోటను రహస్యంగా ఉత్పత్తి చేయడం సాధ్యమయ్యింది. దాని తర్వాత, అక్కడ ఉపయోగించబడిన నకలు యంత్రాన్ని ఓరే పర్వతాలలోని బయీర్ ఫీల్డ్కి తీసుకెళ్లవలసి వచ్చింది, అది అక్కడ 1936 ఆగస్టు వరకూ ప్రచురణలను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించబడింది. కాట్ నేనూ కలిసి మా నాన్న మాకు చిరునామాలు ఇచ్చిన సహోదరులకు ఆ ప్రతులను పంపిణీ చేసే వాళ్లము. కొంతకాలం వరకూ అంతా సవ్యంగానే జరిగింది. అప్పుడు గెస్టపో నాపై నిఘా ఉంచారు, తర్వాత 1936 ఆగస్టులో వాళ్లు నన్ను మా ఇంట్లో అరెస్టు చేసి విచారణ కొరకు నిర్బంధంలో పెట్టారు.
1937 ఫిబ్రవరిలో 25 మంది సహోదరులు నాతో సహా ఇద్దరు సహోదరీలు సాక్సన్లోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరవ్వడం జరిగింది. యెహోవాసాక్షుల సంస్థ విద్రోహకమైనదని అక్కడ పేర్కొనడం జరిగింది. కావలికోటను పునరుత్పత్తి చేసిన సహోదరులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నాకు రెండు సంవత్సరాల శిక్ష విధించబడింది.
నా శిక్షాగడువు తీరిన తర్వాత నన్ను విడిచిపెట్టడానికి బదులు, గెస్టపో నన్ను మళ్లీ అరెస్టు చేశారు. నేను యెహోవాసాక్షిగా ఇక ఎంతమాత్రం క్రియాశీలంగా ఉండనని చెప్పే ఒక తీర్మాన పత్రంపై సంతకం చేయమని నన్ను కోరారు. నేను దానిని దృఢంగా నిరాకరించాను, అప్పుడు ఆ అధికారికి తీవ్రంగా కోపం వచ్చింది, అతడు తటాల్లున లేచి నిలబడి నన్ను నిర్బంధంలో ఉంచమని వారంటు జారీ చేశాడు. ఆ వారంటు చిత్రంలో చూపబడింది. నా తలిదండ్రులను చూసేందుకు అనుమతించబడకుండా, నేను వెంటనే ఎల్బీ నదిపైనున్న లిచ్టెన్బర్గ్నందున్న స్త్రీలకొరకైన ఒక చిన్న నిర్బంధ శిబిరానికి తీసుకువెళ్ల బడ్డాను. దాని తర్వాత కొంత కాలానికే నేను కాట్‌ను కలిశాను. 1936 డిశంబరు నుండి ఆమె మారింజెన్లోని నిర్బంధ శిబిరంలో ఉంది, అయితే ఆ నిర్బంధ శిబిరం మూసివేయబడినప్పుడు, మిగతా ఇతర సహోదరీలతోపాటు ఆమె కూడా లిచ్టెన్బర్గ్కు వచ్చింది. మా నాన్న కూడా నిర్బంధంలో ఉన్నాడు, 1945 వరకూ నేను ఆయనను మళ్లీ చూడలేకపోయాను.
లిచ్టెన్‌బర్గ్ నందు
ఇతర సహోదరీలు కూడా ఏదో ఒక విషయానికి శిక్షించబడుతున్నారు గనుక, నేను వారిని వెంటనే కలుసుకునేందుకు అనుమతించబడలేదు. ఒక హాలులో, నేను రెండు వర్గాల ఖైదీలను అంటే బల్ల వద్ద కూర్చునే స్త్రీల గుంపులనూ దినమంతా స్టూళ్లపై కూర్చునే సాక్షులనూ చూశాను, సాక్షులకు సాధారణంగా తినడానికి ఏమీ ఇవ్వబడేది కాదు.b
నేను కాట్ని ఎలాగైనా కలవగలనేమో అనే ఆశలతో నాకు ఇవ్వబడిన ఎలాంటి పనినైనా అంగీకరించే దాన్ని. మరి సరిగ్గా అదే జరిగింది. ఆమె తను పని చేసే స్థలానికి ఇద్దరు ఇతర ఖైదీలతో పాటూ వెళ్తున్నప్పుడు మేము ఒకరికొకరం ఎదురుపడ్డాము. నేను ఆనందం పట్టలేక ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను. అయితే గార్డులు మా గురించి వెంటనే రిపోర్టు చేశారు. మమ్మల్ని ప్రశ్నించారు, అప్పటినుండి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే వేరుగా ఉంచడం జరిగేది. మేము దాన్ని తట్టుకోలేకపోయాము.
లిచ్టెన్‌బర్గ్ నందు జరిగిన ఇతర రెండు సంఘటనలు కూడా నాకు బాగా జ్ఞాపకమున్నాయి. ఒక సందర్భంలో ఖైదీలందరూ హిట్లర్ ఇచ్చిన రాజకీయ ప్రసంగం యొక్క రేడియో ప్రసారాన్ని వినేందుకు ఆవరణంలో సమకూడవలసి ఉంది. దేశభక్తి కార్యకలాపాలు అక్కడ జరుగుతాయి గనుక, యెహోవాసాక్షులమైన మేము నిరాకరించాము. కాబట్టి గార్డులు అగ్ని నాళాలను మా వైపుకు తిప్పి, నీళ్ల ఊటనుండి వస్తున్న శక్తివంతమైన నీటి ప్రవాహాన్ని మాపైకి వదిలారు, అలా చేస్తూ వారు నిస్సహాయ స్త్రీలమైన మమ్మల్ని నాల్గవ అంతస్తు నుండి క్రింద ఆవరణంలోకి తరిమారు. అక్కడ మేము తడిసి ముద్దై నిలుచున్నాము.
మరో సందర్భంలో, గెర్ట్రడ్ ఒహేమీ మరియు గర్టీ బుర్లీన్తోపాటూ నాకు, హిట్లర్ జన్మదినం దగ్గరికి రాబోతుంది గనుక కమాండెంట్ల ముఖ్య కార్యాలయాలను దీపాలతో అలంకరించాలని చెప్పడం జరిగింది. చిన్న విషయాల్లో మేము రాజీపడేలా చేయడం ద్వారా మేము మా యథార్థతను కోల్పోయేలా మమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నించాలని సాతాను పన్నిన పన్నాగాన్ని గుర్తించి మేము నిరాకరించాము. శిక్షగా, యౌవన సహోదరీలమైన మేము తర్వాతి మూడు వారాలూ చిన్న, అంధకారమయమైన గదిలో ఒక్కొక్కరం ఒంటరిగా గడపవలసి వచ్చింది. అయితే యెహోవా మాకు సన్నిహితంగా ఉన్నాడు, మరి అలాంటి భయంకరమైన స్థితిలో కూడా ఆయన ఆశ్రయంగా నిలిచాడు.
రావెన్స్బ్రూక్లో
1939 మేలో లిచ్టెన్‌బర్గ్ నందలి ఖైదీలు రావెన్స్‌బ్రూక్‌లోని నిర్బంధ శిబిరానికి మార్చబడ్డారు. అక్కడ నేను అనేకమంది ఇతర సాక్షులైన సహోదరీలతోపాటూ లాండ్రీలో పని చేయడానికి నియమించబడ్డాను. యుద్ధం ప్రారంభమైన వెనువెంటనే, మేము స్వస్తిక్ జెండాలను తీసుకోవాలని వాళ్లు చెప్పారు, మేము అందుకు నిరాకరించాము. దాని ఫలితంగా, మిల్షెన్ ఎర్నస్ట్నూ నన్ను పీనల్ బ్లాకుల్లో వేశారు. అది అత్యంత కఠినమైన శిక్ష ఎందుకంటే మేము ఎలాంటి వాతావరణంలోనైనా ప్రతిదినం కష్టించి పని చేయవలసి ఉంటుంది, చివరకు ఆదివారాల్లో కూడా మేము పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా, అత్యధిక శిక్ష మూడు నెలలు, అయితే మేము అక్కడ ఒక సంవత్సరం పాటు ఉన్నాము. యెహోవా సహాయం లేనిదే నేను ఎంతమాత్రం సహించగలిగి ఉండేదాన్ని కాదు.
1942లో ఖైదీలమైన మా పరిస్థితి కొంతమేరకు మారింది, నేను శిబిరానికి కొంత దగ్గిరలో ఉండే ఒక ఎస్.ఎస్. కుటుంబానికి ఆయాగా పని చేసేందుకు నియమించబడ్డాను. ఆ కుటుంబం నాకు కాస్త ఎక్కువ స్వేచ్ఛే ఇచ్చింది. ఉదాహరణకు, ఒకసారి నేను వాళ్ల పిల్లలను నడకకు తీసుకుపోతుండగా, నేను ఊదారంగు త్రిభుజంగల జోసెఫ్ రెహ్వాల్డ్ మరియు గాట్‌ఫ్రీడ్ మెహ్న్హార్న్ అనే ఇద్దరు ఖైదీలను కలిశాను, నేను వారితో ప్రోత్సాహకరమైన మాటలను పంచుకోగలిగాను.c
కష్టతరమైన యుద్ధానంతర సంవత్సరాలు
1945లో మిత్ర రాజ్యాల సైన్యాలు దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఎవరి ఇంట్లో పని చేస్తున్నానో ఆ కుటుంబం పారిపోయింది, అప్పుడు నేను వారితోపాటూ వెళ్లవలసి వచ్చింది. ఇతర ఎస్.ఎస్. కుటుంబాలతో కలిసి వారు పశ్చిమం వైపుకు ప్రయాణిస్తున్న నౌకల దండుగా ఏర్పడ్డారు.
యుద్ధం యొక్క చివరి కొన్ని దినాలు గందరగోళంగానూ ప్రమాదకరంగానూ ఉన్నాయి. తుదకు, మేము అమెరికాకు చెందిన కొంతమంది సైనికులను కలవగలిగాము, వారు నేను పొరుగునున్న నగరంలో స్వతంత్ర వ్యక్తిగా నా పేరు నమోదు చేయించుకునేందుకు అనుమతించారు. అక్కడ నేను ఎవరిని కలిశానో తెలుసా? నేను జోసెఫ్ రెహ్వాల్డ్ మరియు గాట్‌ఫ్రీడ్ మెహ్న్హార్న్లను కలిశాను. జాక్సన్హూజన్లోని నిర్బంధ శిబిరం నుండి వచ్చిన సాక్షులందరూ భయంకరమైన మరణ యాత్ర చేసి ష్ఫెరీన్ చేరుకున్నారని వారు తెలుసుకున్నారు. కాబట్టి దాదాపు 75 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ పట్టణానికి మేము ముగ్గురం బయల్దేరాము. ఆ నమ్మకస్థులైన సహోదరులను అందరినీ అంటే కోన్రాడ్ ఫ్రాంకీతోపాటూ నిర్బంధ శిబిరాల్లో తప్పించుకుని మిగిలిన వారినందరినీ కలవగలగడం ఎంత ఆనందాన్నిచ్చిందో.
1945 డిశంబరుకల్లా, దేశంలోని పరిస్థితి ఎంత మేరకు మెరుగుపడిందంటే, నేను రైలు ద్వారా ప్రయాణించగలిగాను. కాబట్టి నేను ఇంటి దారి పట్టాను! అయితే, నా ప్రయాణంలో రైలు బండి కప్పుపై పడుకోవడం, ఫుట్‌బోర్డ్‌పై నిలబడటం కూడా ఇమిడి ఉన్నాయి. కిమ్నిట్జ్లో, రైల్వే స్టేషన్నుండి మేము ఒకప్పుడు కుటుంబంగా కలిసి జీవించిన స్థలానికి నేను వెళ్లాను. అయితే నాజీ సైనికులు “దేశద్రోహులు ఇక్కడే ఉంటారు!” అని ఏ ఇంటి ముందు నిల్చుని గట్టిగా అరిచారో అక్కడ ఇప్పుడు ఒక్క ఇల్లు కూడా మిగిలిలేదు. ఆ నివాస ప్రాంతమంతా కూడా బాంబుల చేత సమూలంగా నాశనం చేయబడింది. అయితే అమ్మా నాన్నలనూ కాట్‌ను నా సహోదర సహోదరీలనందరినీ సజీవంగా చూసి నేనెంతో ఆదరణపొందాను.
యుద్ధానంతరం జర్మనీలోని ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. అయినప్పటికీ, దేవుని ప్రజల సంఘాలు జర్మనీ అంతటా వర్ధిల్లడం మొదలయ్యాయి. ప్రకటనాకార్యక్రమం కొరకు మమ్మల్ని సంసిద్ధులను చేయడంలో వాచ్‌టవర్ సొసైటీ సాధ్యమైనదంతా చేసింది. మాగ్డేబర్గ్‌లోని బేతేలులో నాజీలు ఆపు చేయించిన పని పునఃప్రారంభమయ్యింది. 1964లోని వసంతకాలంలో నేను అక్కడ పని చేసేందుకు ఆహ్వానించబడ్డాను, మరి నేను వంటగదిలో పని చేసేందుకు నియామకాన్ని పొందాను.
మరోసారి నిషేధం క్రింద కస్టడీలో ఉండటం
జర్మనీలో కమ్యూనిస్టులు అదుపు చేయడం ప్రారంభించిన ప్రాంతంలో మాగ్డేబర్గ్ ఉంది. 1950 ఆగస్టు 31వ తేదీన వారు మా పనిని నిషేధించి మాగ్డేబర్గ్ నందలి బేతేలును మూసేశారు. అలా, నాకు ఎంతో విలువైన తర్ఫీదు లభించిన సమయమైన బేతేలునందలి నా సేవ ముగిసింది. నేను, కమ్యూనిస్టుల క్రింద కూడా సత్యాన్ని దృఢంగా హత్తుకోవాలనీ కష్టాలలో ఉన్న మానవజాతికి దేవుని రాజ్యమే ఏకైక నిరీక్షణ అనే వాస్తవాన్ని ప్రకటించాలనీ తీర్మానించుకుని కిమ్నిట్జ్కు తిరిగి వచ్చాను.
1951 ఏప్రిల్‌లో, కావలికోట ప్రతులను తీసుకువచ్చేందుకు నేను ఒక సహోదరునితో బెర్లిన్‌కు ప్రయాణించివచ్చాను. మేము తిరిగి వచ్చినప్పుడు, కిమ్నిట్జ్లోని రైల్వే స్టేషనును సివిలియన్ పోలీసులు చుట్టుముట్టి ఉండటాన్ని చూసి మేము నిర్ఘాంతపోయాము. వారు మా కొరకే ఎదురుచూస్తున్నారు, మమ్మల్ని అక్కడికక్కడే అరెస్టు చేశారు.
విచారణకు ముందు నిర్బంధంలో ఉంచబోయేటప్పుడు, నాజీలు నాకు అనేక సంవత్సరాల జైలు శిక్ష విధించారని నిరూపించే ప్రమాణపత్రాలు నా వద్ద ఉన్నాయి. దాని ఫలితంగా, గార్డులు నాతో గౌరవపూర్వకంగా వ్యవహరించారు. ముఖ్య గార్డులలో ఒకామె ఇలా అన్నది: “యెహోవాసాక్షులైన మీరు నేరస్థులు కారు; మీరు చెరసాలలో ఉండకూడదు.”
ఒకసారి ఆమె నేను ఇతర సహోదరీలతో నా జైలు గదిలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఒక పరుపు క్రింద రహస్యంగా ఏదో పెట్టింది. అదేమిటి? అది ఆమె స్వంత బైబిలు, దాన్ని ఆమె మాకు ఇచ్చేసింది. మరో సందర్భంలో, మా ఇల్లు చెరసాలకు దగ్గర్లోనే ఉంటుంది గనుక ఆమె మా ఇంటికి వెళ్లి నా తలిదండ్రులను కలిసింది. ఆమె కావలికోట ప్రతులనూ ఆహారాన్నీ తీసుకుని వాటినన్నిటినీ తన వద్ద దాచుకుని దొంగచాటుగా నా జైలు గదికి తెచ్చింది.
నేను ఇంకో సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఆదివారం ఉదయం వేళల్లో మేము మా దైవపరిపాలనా గీతాలను ఎంత గట్టిగా పాడుకునే వాళ్లమంటే ప్రతి పాటకీ ఇతర ఖైదీలు ఆనందంతో చప్పట్లు కొట్టేవారు.
యెహోవా నుండి బలం మరియు సహాయం
1951 సెప్టెంబరు 4వ తేదీన జరిగిన కోర్టు ప్రొసీడింగులలో న్యాయమూర్తి, ఈ శీర్షిక ప్రారంభంలో ప్రస్తావించబడిన వ్యాఖ్యానాలను చేశాడు. వెల్డ్హెల్మ్లో తర్వాత హాలేలో తుదకు హోహెనెక్లో నేను నా చెరసాల శిక్షను అనుభవించాను. యెహోవాసాక్షులకు దేవుడు ఒక ఆశ్రయముగానూ ఒక దుర్గముగానూ ఎలా ఉన్నాడో, ఆయన వాక్యం మమ్మల్ని ఎలా పునరుజ్జీవం చేసిందో ఒకటి రెండు క్లుప్త సంఘటనలు చూపుతాయి.
వెల్డ్హెల్మ్ చెరసాలలో, మేము క్రైస్తవ కూటాలను జరుపుకోగలిగేలా సాక్షి సహోదరీలు అందరూ క్రమంగా ఒక హాలులో కూడుకునే వారు. కాగితమూ పెన్సిలూ ఇవ్వబడేవికాదు, కానీ కొందరు సహోదరీలు కొన్ని బట్ట ముక్కలు సేకరించి, “పరిశుద్ధ అలంకరణతో యెహోవాను ఆరాధించుడి” అని ఉన్న, 1953 వార్షిక వచనాన్ని కలిగివున్న చిన్న బ్యానరును కుట్టగలిగారు.—కీర్తన 29:2.
గార్డుల్లో ఒకామె అకస్మాత్తుగా వచ్చి మా గురించి వెంటనే నివేదించింది. చెరసాల అధ్యక్షుడు వచ్చి ఆ బ్యానరును పైకెత్తి పట్టుకోమని ఇద్దరు సహోదరీలకు చెప్పాడు. “దీన్ని ఎవరు చేశారు? దీని అర్థమేమిటి?” అని అతడు గద్దించాడు.
ఒక సహోదరి నిందను తనపై వేసుకుని మా అందరి బదులు తనపైకి నిందను తీసుకోవాలని అనుకుంది, అయితే మేము వెంటనే మాలో మేము గుసగుసలాడుకుని ఆ నేరాన్ని అందరమూ పంచుకోవాలని నిర్ణయించాము. కాబట్టి, “మా విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు మేము దాన్ని చేసుకున్నామని” మేము సమాధానమిచ్చాము. ఆ బ్యానరును తీసేసుకున్నారు, మరి మాకు శిక్షగా భోజనం ఇవ్వలేదు. అయితే ఆ చర్చ జరిగే సమయమంతా, ఆ ప్రోత్సాహకరమైన లేఖనాన్ని మేము మా మనస్సులపై ముద్ర వేసుకునేందుకు సహోదరీలు ఆ పతాకాన్ని పైకి పట్టుకున్నారు.
వెల్డ్హెల్మ్లోని స్త్రీల చెరసాల మూసివేయబడినప్పుడు, సహోదరీలమైన మేము హాలేకు పంపబడ్డాము. ఇక్కడ మాకు ఇంటి నుండి వచ్చిన వస్తువులను మేము తీసుకునేందుకు అనుమతి లభించింది, అయితే నాకు మా నాన్న పంపిన చెప్పుల జతలో ఏమి పెట్టి వాటిని కుట్టి పంపాడు? కావలికోట శీర్షికలు! “నిజమైన ప్రేమ ఆచరణాత్మకమైనది” మరియు “అబద్ధాలు జీవాన్ని కోల్పోయేందుకు దారితీస్తాయి” అనే ముఖ్యాంశాలుగల శీర్షికలను నేను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకోగలను. ఈ శీర్షికలు వీటితోపాటు వచ్చిన మిగతా శీర్షికలు నాకు వాస్తవంగా పరమాన్నాలుగా ఉండేవి, మేము వాటిని ఒకరి తర్వాత మరొకరికి పంపుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ స్వంత నోట్సు వ్రాసుకునేవారు.
ఒకసారి తనిఖీ జరిగినప్పుడు గార్డులు నా పరుపులో నేను దాచుకున్న నా వ్యక్తిగతమైన నోట్సును కనుగొన్నారు. తర్వాత, నన్ను ప్రశ్నించేందుకు ఆమె నన్ను లోనకు పిలిచి, “యెహోవాకు భయపడే వారికిగల నిరీక్షణ 1955” అనే శీర్షిక యొక్క అర్థాన్ని తాను తప్పక తెలుసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఒక కమ్యూనిస్టు అయిన ఆమె 1953లో సంభవించిన తమ నాయకుడైన స్టాలిన్ మరణాన్ని గురించి ఎంతో కలత చెంది ఉంది, ఆమెకు భవిష్యత్తు అంధకారమయంగా కనిపించింది. మాకు మాత్రం భవిష్యత్తు కొన్ని మార్పులను తీసుకురావచ్చు, అయితే నాకు ఆ విషయం అప్పుడే తెలియదు. యెహోవాసాక్షుల పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుందని నేను ఆమెకు దృఢంగా వివరించాను. ఎందుకు? ఆ శీర్షిక యొక్క ముఖ్య లేఖన వాక్యమైన కీర్తన 112:7ను నేను చదివి చెప్పాను: “వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు.”
యెహోవా ఇంకా నాకు ఆశ్రయమునూ దుర్గమునైయున్నాడు
నాకు కలిగిన అతి తీవ్రమైన అనారోగ్యం మూలంగా 1957 మార్చిలో అంటే నా శిక్షాకాలానికి రెండు సంవత్సరాల ముందే నేను విడుదల చేయబడ్డాను. యెహోవా సేవలో నేను కలిగివున్న కార్యకలాపాల మూలంగా తూర్పు జర్మనీలోని అధికారులు నాపైకి ఒత్తిడి తెచ్చారు. కాబట్టి 1957 మే 6వ తేదీన నేను పశ్చిమ బెర్లిన్‌కు పారిపోయాను, అక్కడినుండి పశ్చిమ జర్మనీకి వెళ్లిపోయాను.
నేను నా భౌతిక ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు నాకు అనేక సంవత్సరాలు పట్టాయి. అయితే నేటి వరకూ నాకు ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారపుటలవాట్లు ఉన్నాయి, నేను ప్రతి కావలికోట క్రొత్త ప్రతి కొరకు ఆత్రుతతో ఎదురు చూస్తాను. నేను అప్పుడప్పుడూ నన్ను నేను పరీక్షించుకుంటాను. నేను ఇంకా ఆత్మీయ దృక్పథాన్ని కలిగి ఉన్నానా? నేను చక్కని లక్షణాలను పెంపొందించుకున్నానా? పరీక్షించబడటం ద్వారా మెరుగుపర్చబడిన నా విశ్వాసం యెహోవాకు మహిమనూ ఘనతనూ తీసుకొస్తుందా? దేవుడు నిరంతరం నా ఆశ్రయమును నా దుర్గమునైయుండేలా అన్ని విషయాల్లో దేవున్ని ప్రీతిపర్చాలన్నది నా గమ్యం.
[అధస్సూచీలు]
a “ఫోటో-డ్రామా”లో స్లైడులూ కదిలే చిత్రాలూ ఉంటాయి మరియు అది 1914 నుండి మొదలుకొని వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ యొక్క ప్రతినిధుల ద్వారా ఎంతో విస్తృతంగా చూపబడింది.
b నాజీ గీతాలు ఆలపించబడుతున్నప్పుడు ఒక గౌరవ సూచనయైన క్రియను చేయనందుకు ఒక సందర్భంలో యెహోవాసాక్షులైన సహోదరీలకు 14 దినాలు మధ్యాహ్న భోజనం ఇవ్వబడలేదని స్విట్జర్లాండ్‌లోని బర్న్ నందు 1940 మే 1న, వాచ్‌టవర్ సొసైటీ ద్వారా ప్రచురించబడిన ట్రోస్ట్ (ఓదార్పు) అనే పత్రిక యొక్క 10వ పేజీ నివేదించింది. అప్పుడక్కడ 300 మంది యెహోవాసాక్షులు ఉన్నారు.
c జోసెఫ్ రెహ్వాల్డ్ను గురించిన నివేదిక 1993 ఫిబ్రవరి 8, తేజరిల్లు! (ఆంగ్లం) సంచిక నందలి 20-3 పేజీలలో ప్రచురింపబడింది.
[26వ పేజీలోని చిత్రం]
రావెన్స్‌బ్రూక్‌లోని ఎస్.ఎస్. కార్యాలయం
[క్రెడిట్ లైను]
పైన: Stiftung Brandenburgische Gedenkstätten
[26వ పేజీలోని చిత్రం]
శిబిరం వెలుపల పని చేసేందుకు నాకివ్వబడిన పాసు