దేవుణ్ని సేవించాలన్న నా ప్రమాణాన్ని నిలుపుకుంటున్నాను
ఫ్రాంట్స్ గుడ్లైకీస్ చెప్పినది
వందకుపైగా ఉన్న నా పటాలంలో ఇప్పుడు నలుగురే బ్రతికి ఉన్నారు. మృత్యుముఖంలో ఉన్న నేను మోకాళ్ల మీద కూర్చుని, ‘నేను యుద్ధంలో బ్రతికితే నిరంతరం నిన్నే సేవిస్తాను’ అని దేవునికి ప్రమాణం చేశాను.
నేను ఆ ప్రమాణాన్ని 54 ఏండ్ల క్రితం 1945, ఏప్రిల్‌లో జర్మన్ సైన్యంలో సైనికుడిగా ఉన్నప్పుడు చేశాను. అది రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి కొంచెం ముందటి సమయం, అప్పుడు సోవియట్ సైన్యం ఎదురొచ్చిన దాన్నంతటినీ నేలమట్టం చేసుకుంటూ బెర్లిన్ వైపుగా దూసుకువస్తోంది. మా మనుషులు ఓడర్ నదీతీరాన ఉన్న జేలో పట్టణంలో స్థావరం ఏర్పర్చుకున్నారు, బెర్లిన్నుండి ఇక్కడికి 65 కిలోమీటర్లు కూడా ఉండదు. ఇక్కడ మా మీద రాత్రింబగళ్లు బాంబుల వర్షం కురుస్తుండడంతో మా పటాలం నెమ్మదిగా సంఖ్యాపరంగా క్షీణించిపోతోంది.
సరిగ్గా అప్పుడు, నేను జీవితంలో మొదటిసారిగా పూర్తి నిస్పృహ నన్ను ఆవరించగా ఏడుస్తూ కన్నీటితో దేవునికి ప్రార్థించాను. దైవభయంగల నా తల్లి ఎప్పుడూ చెబుతుండే బైబిలు వచనాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను: “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు.” (కీర్తన 50:15) అక్కడ రణరంగంలోని కందకాల్లో ప్రాణభీతితో ఉండగా నేను పైన చెప్పిన ప్రమాణాన్ని దేవునికి చేశాను. నేనా ప్రమాణాన్ని ఎలా నిలబెట్టుకోగలిగాను? దానికన్నా ముందు, నేను జర్మనీ సైన్యంలో ఎలా చేరాను?
లిథువానియాలో బాల్యం
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుండగా లిథువానియా 1918లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. నేను బాల్టిక్ సముద్రానికి ఆనుకుని ఉన్న మేమెల్ (క్లైపేడ) జిల్లాలో 1925లో జన్మించాను. నేను పుట్టడానికి సంవత్సరం ముందే ఈ జిల్లా లిథువానియాలో విలీనమైంది.
నా ఐదుగురు సహోదరీలూ నేనూ ఆనందదాయకమైన బాల్యాన్ని అనుభవించాము. మా నాన్న ఒక సన్నిహితుడైన స్నేహితుడిగా ఉండేవాడు, పిల్లలమైన మాతో ఎప్పుడూ సమయాన్ని గడిపేవాడు. మా తల్లిదండ్రులు ఇవాంజిలికల్ చర్చి సభ్యులుగా ఉండేవారు, కానీ వారు చర్చి సేవలకు హాజరయ్యేవారు కారు. ఎందుకంటే, ఆ చర్చిలోని పాదిరి వేషధారణ మా అమ్మను అభ్యంతరపర్చింది. అయినా, ఆమె దేవుణ్ని ప్రేమించేది, ఆయన వాక్యమైన బైబిలంటే ఆమెకు ఇష్టం. దాన్ని ఆమె ఎంతో నిష్ఠతో పఠించేది.
జర్మనీ 1939లో మేము నివసిస్తున్న ప్రాంతమైన లిథువానియాలోని కొంతభాగాన్ని ఆక్రమించుకుంది. అటుతర్వాత 1943 తొలిభాగంలో జర్మను సైన్యంలో పనిచేయమని నాకు పిలుపు వచ్చింది. అప్పుడు జరిగిన ఒకానొక యుద్ధంలో నేను గాయపడ్డాను, కానీ గాయాల నుండి కోలుకున్నాక తూర్పు వైపున ఉన్న యుద్ధభూమికి తిరిగివెళ్లాను. ఈ సమయానికల్లా యుద్ధవెల్లువ దిశ మారిపోయింది, ఇప్పుడు జర్మన్లు సోవియట్ సైన్యం నుండి వెనక్కి పారిపోయి వస్తున్నారు. నేను ప్రారంభంలో చెప్పినట్లు మృత్యుముఖం నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్నది అప్పుడే.
నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం
యుద్ధం జరుగుతున్న సమయంలో నా తల్లిదండ్రులు జర్మనీలోని లీప్జిగ్కి ఆగ్నేయంలో ఉన్న ఓషాట్స్కి తరలివెళ్లారు. అందుకని యుద్ధం తర్వాత వారిని కనుక్కోవడం కష్టమైపోయింది. కానీ చివరికి జరిగిన మా పునఃకలయిక ఎంత సంతోషాన్ని తీసుకువచ్చింది! కొంత కాలానికి నేను మా అమ్మతో యెహోవాసాక్షి అయిన మాక్స్ షూబర్ట్ 1947 ఏప్రిల్‌లో ఇచ్చిన బహిరంగ ప్రసంగానికి హాజరయ్యాను. మా అమ్మ తాను సత్య మతాన్ని గుర్తించిందని విశ్వసించింది, కొన్ని కూటాలకు హాజరైన తర్వాత ఆమె నమ్మకాలను నేనూ స్వీకరించాను.
అటుతర్వాత కొద్దికాలానికి మా అమ్మ నిచ్చెన మీదినుండి పడిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఆ గాయాల మూలంగా చనిపోయింది. తన మరణానికి ముందు హాస్పిటల్లో ఆమె నన్ను ఆప్యాయంగా ఇలా ప్రోత్సహించింది: “నా పిల్లల్లో కనీసం ఒక్కరైనా దేవుని మార్గాన్ని తెలుసుకోవాలని నేనెప్పుడూ ప్రార్థించేదాన్ని. నా ప్రార్థనలకు జవాబు దొరకడం నేను చూశాను, ఇప్పుడు ప్రశాంతంగా కన్ను మూస్తాను.” మా అమ్మ మరణ నిద్ర నుండి మేల్కొని, ఆమె ప్రార్థనలు నెరవేరాయని చెప్పే సమయం కోసం నేను ఎంతగా ఎదురుచూస్తున్నాను!—యోహాను 5:28.
నేను 1947, ఆగస్టు 8న అంటే బ్రదర్ షూబర్ట్ ఇచ్చిన ప్రసంగాన్ని విన్న నాలుగు నెలలకు, నన్ను నేను యెహోవా దేవునికి సమర్పించుకున్నానన్న దానికి సూచనగా లీప్జిగ్లో జరిగిన ఒక సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. ఎట్టకేలకు నేను దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటున్నానన్నమాట. కొద్దికాలానికే నేను పయినీరునయ్యాను, యెహోవాసాక్షుల్లోని పూర్తికాల పరిచారకులు అలా పిలువబడతారు. జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లేదా ఈస్ట్ జర్మనీ అని అటుతర్వాత పిలువబడిన ఆ దేశంలో అప్పట్లో దాదాపు 400 మంది పయినీర్లు ఉండేవారు.
విశ్వాసానికి తొలి పరీక్షలు
ఓషాట్స్లో ఒక పొరుగింటాయన నాలో మార్క్సిజం పట్ల ఆసక్తిని రేపడానికి ప్రయత్నించాడు. నేను గనుక సోషలిస్ట్ యూనిటీ పార్టీ ఆఫ్ జర్మనీ (ఎస్ఇడి)లో చేరితే నా యూనివర్సిటీ చదువులకు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని ఆశపెట్టాడు. యేసు సాతాను ప్రతిపాదనను ఒకసారి తిరస్కరించినట్లే నేను ఆ ప్రతిపాదనను తిరస్కరించాను.—మత్తయి 4:8-10.
1949 ఏప్రిల్‌లో ఒకరోజు నేను పనిచేస్తున్న చోటికి ఇద్దరు పోలీసులు వచ్చి నన్ను తమతో రమ్మని దబాయింపుగా అడిగారు. నన్ను వారు సోవియట్ గూఢచారి సంస్థ స్థానిక విభాగానికి తీసుకువెళ్లారు. నేను పాశ్చాత్య దేశాల్లోని పెట్టుబడిదారీ వ్యవస్థ మద్దతుదారుల కోసం పనిచేస్తున్నానని నాపై నిందారోపణ చేశారు. నేను నా ఇంటింటి పరిచర్య చేస్తూనే సోవియట్ యూనియన్ గురించీ లేదా ఎస్ఇడి గురించీ ప్రతికూలంగా మాట్లాడిన వారి పేర్లూ, యెహోవాసాక్షుల కూటాలకు హాజరైన వారి పేర్లూ తమకు గనుక చెబితే నేను ఏ తప్పూ ఎరగని వాడిగా నా నిజాయితీని రుజువుచేసుకోవచ్చని వారు అన్నారు. నేను సహకరించడానికి వ్యతిరేకించినప్పుడు నన్ను జైలు గదిలో పెట్టి తాళం వేశారు. తర్వాత మిలిటరీ కోర్టులో నన్ను హాజరుపర్చారు. నా శిక్ష: సైబీరియాలో 15 సంవత్సరాల కఠిన కారాగారం!
నేను ప్రశాంతంగా ఉండిపోయాను, ఇది ఆ అధికారుల మనస్సులపై బాగా ప్రభావాన్ని చూపించింది. నా శిక్ష అమల్లోనే ఉంటుందని వారు నాకు చెప్పారు, కానీ నేను వారితో సహకరించేంత వరకు వారానికి ఒక్కసారి వారికి రిపోర్టు చేస్తే సరిపోతుందని చెప్పారు. మరింత పరిణతిగల సహోదరుల నుండి సలహా పొందుదామని నేను మాగ్డేబర్గ్కు వెళ్లాను, అప్పట్లో వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి ఆఫీసు అక్కడే ఉండేది. నా ప్రయాణం అంత సులభంగా సాగలేదు, ఎందుకంటే నేను గూఢచారుల నిఘాలో ఉన్నాను. మాగ్డేబర్గ్‌లో లీగల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎర్నస్ట్ వావూ నాకు ఇలా చెప్పాడు: “పోరాడు, అప్పుడు నీవు విజయం సాధిస్తావు. రాజీపడితే మాత్రం ఓడిపోతావు. మేము కాన్సన్ట్రేషన్ క్యాంపులలో నేర్చుకున్నది అదే.”a ఆ సలహా నేను దేవుణ్ని సేవించాలన్న నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి సహాయం చేసింది.
నిషేధం, మళ్లీ నిర్బంధం
1950 జూలైలో నన్ను ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేయమని సిఫారసు చేశారు. అయితే ఆగస్టు 30న పోలీసులు మాగ్డేబర్గ్‌లోని మా ఆస్తులపై దాడిచేశారు, దానితో మా పని నిషేధంలోకి వచ్చింది. అందుకని నా నియామకం కూడా మారింది. నేనూ, పాల్ హర్ష్బర్గ్ కలిసి దాదాపు 50 సంఘాల్లో ఒక్కొక్క సంఘంతో రెండు లేదా మూడు రోజులు గడుపుతూ, సహోదరులు నిషేధం క్రింద తమ పరిచర్యను కొనసాగించడానికి సంస్థీకరించుకునేలా సహాయం చేశాము. అటుతర్వాతి నెలల్లో నేను ఆరుసార్లు పోలీసుల అరెస్టును తప్పించుకున్నాను!
ష్టాజీ అనే స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థకు మన సహోదరులను అప్పగించిన ఒక వ్యక్తి మన సంఘాల్లో ఒకదాంట్లోకి జొరబడ్డాడు. ఆ విధంగా, ఒక వీధిలో ఐదుగురు మావైపు తుపాకీలు గురిపెట్టి నన్నూ పాల్నూ 1951 జూలైలో అరెస్టు చేశారు. వెనక్కి తిరిగి చూసుకుంటే, యెహోవా సంస్థపైన మేము ఆధారపడవలసినంతగా ఆధారపడలేదని మేము గ్రహించాము. కలిసి ఎప్పుడూ ప్రయాణించవద్దని మాలో వృద్ధులైన సహోదరులు సలహా ఇచ్చారు. అతి విశ్వాసం మా స్వేచ్ఛను కోల్పోయేందుకు నడిపించింది! అంతేగాక మేము అరెస్టయితే ఏమి చెబుతామన్నది ముందే చర్చించుకోలేదు కూడా.
ఒంటరిగా నేను జైలుగదిలో, నా సహోదరులను మోసంచేసి వారిని పట్టించకుండా ఉండడానికీ, నా విశ్వాసం విషయంలో రాజీపడకుండా ఉండడానికీ సహాయం చేయమని యెహోవాకు కన్నీటితో ప్రార్థించాను. నేను నిద్రపోయిన తర్వాత పాల్ స్వరం వినబడటంతో హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. ష్టాజీలు ఆయన్ను ప్రశ్నలు అడిగిన గది నా గదికి సరిగ్గా పైన ఉంది. ఆ రాత్రి వాతావరణం వేడిగాను తేమగాను ఉండటంతో బాల్కనీ తలుపు తెరిచివుంది, నాకు సన్నని స్వరంలోనైనా అంతా వినబడుతూనే ఉంది. తర్వాత, నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు నేనూ ఆయన చెప్పిన జవాబులే చెప్పాను, దానితో అధికారులు ఆశ్చర్యపోయారు. మా అమ్మకు ఎంతో ఇష్టమైన బైబిలు లేఖనమైన, “ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమ పరచెదవు” అనే మాటలు నాకు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వచ్చాయి. నేనెంతో ప్రోత్సాహాన్ని పొందాను.—కీర్తన 50:15.
ఇంటరాగేషన్ తర్వాత హాలెలోని ష్టాజీ వారి విచారణకు పూర్వం ఉంచే జైలులోనూ అటుతర్వాత మాగ్డేబర్గ్లోనూ నేనూ పాల్ ఐదు నెలలు నిర్బంధంలో గడిపాము. నేను మాగ్డేబర్గ్‌లో ఉన్నప్పుడు అప్పట్లో మూసివేయబడిన మా బ్రాంచిని నేను అప్పుడప్పుడు చూసేవాడిని. జైలులో కన్నా అక్కడ పనిచేస్తూ గడిపితే ఎంత బాగుండు! 1952 ఫిబ్రవరిలో తీర్పును ప్రకటించారు: “10 సంవత్సరాలు జైలు, 20 సంవత్సరాలు పౌర హక్కుల పరిహరణ.”
జైల్లో విశ్వాసాన్ని నిలుపుకోవడం
దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష పడిన యెహోవాసాక్షులు తాము జైల్లో ఉన్నప్పుడు కొంతకాలంపాటు ఒక ప్రత్యేక గుర్తింపు చిహ్నాన్ని ధరించారు. ప్యాంట్లలో ఒక కాలికి, మా చొక్కాల్లో ఒక చేతికి ఎర్రని బట్టను కుట్టారు. మేము భయంకరమైన నేరస్థులమని గార్డులను హెచ్చరించడానికి మా జైలుగది తలుపు మీద బయటివైపు ఎర్రని గుండ్రని చిన్న కార్డుబోర్డు ముక్కను అతికించారు కూడా.
అధికారులు మమ్మల్ని నిజానికి నేరస్థులందర్లో కరడుగట్టినవారమని దృష్టించారు. మేము బైబిలు ఉంచుకోవడానికి కూడా వీల్లేదు, దానిక్కారణం ఒక గార్డు ఇలా చెప్పాడు: “యెహోవాసాక్షి చేతిలో బైబిలు ఉండడం, ఒక నేరస్థుని చేతిలో తుపాకీ ఉండడంతో సమానం.” బైబిల్లోని భాగాలను సేకరించడానికి మేము రష్యన్ రచయిత అయిన లియో టాల్‌స్టాయ్ పుస్తకాలను చదివేవాళ్లము, ఆయన తన పుస్తకాల్లో బైబిలు వాక్యాలను ఎత్తివ్రాశాడు. మేమా వచనాలను కంఠతా పట్టేవాళ్లము.
1951లో అరెస్టు కావడానికి ముందు నాకు ఎల్జా రీమాతో ప్రధానం అయ్యింది. ఆమె సాధ్యమైనంత తరచుగా నన్ను కలిసేది, నెలకు ఒక్కసారి భోజనం పార్శిలు పంపించేది. ఆ పార్శిల్లో ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా ఆమె దాచివుంచేది. ఒకసారి ఆమె ఒక కావలికోటలోని శీర్షికలను కొన్ని సాసేజ్‌లలో కూరి పంపించింది. గార్డులు కొన్నిసార్లు సాసేజ్‌లను కోసి లోపల ఏమన్నా దాచిపెట్టారేమో చూసేవారు, కానీ ఈసారి పార్శిలు పనివేళలు ముగియడానికి కొద్దిగా ముందు వచ్చింది, ఆ విధంగా అది తప్పించుకుంది.
ఆ సమయంలో, నేనూ కార్ల్ హైంట్స్ క్లేబా కలిసి చిన్న జైలుగదిలో సాక్షులుకాని వేరే ముగ్గురితో ఉండేవాళ్లం. మరి వాళ్లు గమనించకుండా మేము కావలికోటను ఎలా చదువుతాము? మేము ఒక పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ అందులో కావలికోట శీర్షికలను దాచుకుని చదివాము. జైలులో ఉన్న ఇతర సాక్షులకు కూడా ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించాము.
మేము జైల్లో ఉన్నప్పుడు ఇతరులకు దేవుని రాజ్యాన్ని గూర్చి చెప్పే అవకాశాలను కూడా ఉపయోగించుకున్నాము. దాని ఫలితంగా నాతోపాటు జైలుగదిలో ఉన్న ఒక వ్యక్తి విశ్వాసి కావడం చూసి నేనెంతో పులకరించిపోయాను.—మత్తయి 24:14.
మళ్లీ పూర్తికాల పరిచర్య
1957 ఏప్రిల్ 1న అంటే దాదాపు కటకటాల వెనుక ఆరేండ్లు ఉన్న తర్వాత నేను విడుదలయ్యాను. విడుదలైన రెండు వారాల్లోపే నేను ఎల్జాను వివాహం చేసుకున్నాను. ష్టాజీ వాళ్లు నేను విడుదలయ్యానని విని నన్ను మళ్లీ జైలుకి పంపించడానికి సాకుల్ని వెదకడం ప్రారంభించారు. దాన్ని నివారించడానికి నేనూ ఎల్జా సరిహద్దు దాటి వెస్ట్ బెర్లిన్‌లో జీవించడానికి వెళ్లాము.
మేము వెస్ట్ బెర్లిన్ చేరుకునే సరికల్లా మా ప్లాన్లేమిటో తెలుసుకోవాలని సొసైటీ అడిగింది. మాలో ఒకరు పయినీరింగ్ చేస్తుండగా మరొకరు ఏదైనా లౌకిక ఉద్యోగం చేస్తామని చెప్పాము.
“మీరిద్దరూ పయినీర్ సేవ చేయడం మీకిష్టమేనా?” అని వారు మమ్మల్ని అడిగారు.
“అదే సాధ్యమైతే మేము వెంటనే ప్రారంభిస్తాము” అని జవాబిచ్చాము.
ఆ విధంగా మాకు ప్రతి నెలా లభించే చిన్న స్టైఫండ్‌తో మమ్మల్ని మేము పోషించుకుంటూ 1958లో స్పెషల్ పయినీర్లుగా సేవచేయడం ప్రారంభించాము. మాతో బైబిలు పఠించిన వ్యక్తులు తమ జీవితాల్ని మార్చుకుని యెహోవా సేవకులు అవుతుంటే చూడడం ఎంతటి ఆనందాన్ని ఇచ్చింది! మేము తరువాతి పది సంవత్సరాలు స్పెషల్ పయినీర్లుగా సేవ చేసిన సమయం ఒక పురుషునిగా, ఒక స్త్రీగా కలిసి సన్నిహితంగా పనిచేయడం మాకు నేర్పింది. ఎల్జా ఎప్పుడూ నా ప్రక్కనే ఉండేది, చివరికి నేను కారును రిపేరు చేసేటప్పుడు కూడా. మేము కలిసి చదివాము, కలిసి పఠించాము, కలిసి ప్రార్థించాము.
1969లో, ప్రతి సంఘాన్ని సందర్శిస్తూ దానిలోని సభ్యుల అవసరాల్ని చూసుకునేలా మమ్మల్ని ప్రయాణ పనిలో నియమించారు. ప్రయాణ పనిలో అనుభవజ్ఞుడైన యోజఫ్ బార్ట్ నాకు ఈ సలహా ఇచ్చాడు: “నీవు నీ నియామకంలో సఫలం కావాలంటే, నీవు నీ సహోదరులకు కేవలం ఒక సహోదరునిగానే ఉండు.” నేనా సలహాను అన్వయించడానికి ప్రయత్నించాను. తత్ఫలితంగా తోటి సాక్షులతో మా సంబంధం చాలా ముడిపడిపోయింది, దీనిమూలంగా అవసరమైనప్పుడు సలహా ఇవ్వడం సులభంగా తయారైంది.
1972లో ఎల్జాకు క్యాన్సర్ అని తెలిసింది, ఆపరేషన్ జరిగింది. తర్వాత ఆమెకు కీళ్లనొప్పులు కూడా ప్రారంభమయ్యాయి. నొప్పి ఆమెను పీడిస్తున్నప్పటికీ ఆమె నాతోపాటు ప్రతివారం వచ్చేది. తనకు వీలైనంత మట్టుకు ఆమె సహోదరీలతో పరిచర్యలో పనిచేసేది.
అవసరాల్ని సర్దుబాటు చేసుకోవడం
1984లో మా అత్తామామలను ప్రతినిమిషమూ ఎవరో ఒకరు చూసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని మేము ప్రయాణ పనిని విడిచిపెట్టి వారు అటుతర్వాత నాలుగు సంవత్సరాలకు చనిపోయేంత వరకు వారిని మేము చూసుకున్నాము. (1 తిమోతి 5:8) తర్వాత 1989లో ఎల్జా పరిస్థితి బాగా విషమించింది. సంతోషకరంగా ఆమె కొంతకాలానికి కాస్తంత కోలుకుంది, కానీ ఇంటి పనుల్ని నేనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఆమె ఉంది. నేనప్పటికింకా ఎడతెగని బాధను అనుభవిస్తున్న వ్యక్తితో జీవించడం నేర్చుకుంటూ ఉన్నాను. అయినా, ఎంత ఒత్తిడి, ఎంత శ్రమ ఉన్నప్పటికీ, మేము ఆధ్యాత్మిక విషయాలపట్ల మాకున్న అపేక్షను కోల్పోలేదు.
నేటికీ మేము పయినీరు లిస్టులో ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. అయితే, మనకు ఎటువంటి స్థానం ఉంది, మనం ఎంత చేయగల్గుతున్నాము అన్నవి ప్రాముఖ్యం కావు గానీ, మనం విశ్వసనీయంగా ఉండడం ప్రాముఖ్యం అన్న గ్రహింపుకు మేము వచ్చాము. మేము మా దేవుడైన యెహోవాను ఏదో కొద్ది సంవత్సరాలు కాదు గానీ అనంతకాలం సేవించాలన్నది మా కోరిక. మా అనుభవం భవిష్యత్తు కోసం అద్భుతమైన శిక్షణనిచ్చింది. అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో సహితం ఆయన్ను స్తుతించడానికి యెహోవా మాకు బలాన్నిచ్చాడు.—ఫిలిప్పీయులు 4:13.
[అధస్సూచీలు]
a ఎర్నస్ట్ వావూ జీవితకథ కావలికోట (ఆంగ్లం), ఆగస్టు 1, 1991, 25 నుండి 29 పేజీల్లో వచ్చింది.
[23వ పేజీలోని చిత్రం]
నన్నిక్కడే మాగ్డేబర్గ్‌లోని జైలులో వేశారు
[క్రెడిట్ లైను]
Gedenkstätte Moritzplatz Magdeburg für die Opfer politischer Gewalt; Foto: Fredi Fröschki, Magdeburg
[23వ పేజీలోని చిత్రం]
మేము 1957లో వివాహం చేసుకున్నప్పుడు
[23వ పేజీలోని చిత్రం]
నేడు ఎల్జాతో