మీరు తగినంత ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారా?
“మంచి ఆహారం మానవ ప్రాథమిక అవసరతలన్నిటిలో అత్యంత ప్రధానమైనది. . . . తగినంత ఆహారం లేకపోతే, మనం మరణిస్తాము.”—ఫుడ్ అండ్ న్యూట్రీషన్.
ఆకలితో అలమటిస్తున్న స్త్రీపురుషుల, పిల్లల శరీరాలు, అంటే “మానవ ప్రాథమిక అవసరతలన్నిటిలో అత్యంత ప్రధానమైన” దానిని పొందలేకపోతున్న ప్రజల బక్కచిక్కిన శరీరాలు ఆ ప్రాథమికమైన వాస్తవానికి అద్దం పడుతున్నాయి. ఇతరులు ఈ అవసరాన్ని ఓ మోస్తరుగా తీర్చుకోగలుగుతున్నా తీవ్రమైన కుపోషణకు గురౌతున్నారు. అయినప్పటికీ, చక్కగా భోజనం తినగల్గే స్తోమతవున్నా అనేకులు తమకు ఎలాంటి పోషణనూ ఇవ్వని చిరుతిళ్లు తిని సంతృప్తిపడుతున్నారు. “మన స్వాధీనంలో ఉన్న వాటన్నిటిలో ఆహారం అత్యంత దుర్వినియోగం చేయబడుతున్న పదార్థం” అని హెల్దీ ఈటింగ్ పుస్తకం చెబుతోంది.
ఆత్మీయ ఆహారం విషయంలో అంటే దేవుని వాక్యమైన బైబిలునందు కనుగొనబడే సత్యం విషయంలో కూడా ఇది వాస్తవమే. కొందరు ప్రజలకు కావాల్సిన ప్రాథమిక ఆత్మీయ పోషక పదార్థాలు కూడా లభించవు; వారు ఆత్మీయ ఆకలితో అలమటిస్తుంటారు. ఇతరులు అందుబాటులో ఉన్న ఆత్మీయ ఆహారం నుండి ప్రయోజనం పొందడాన్ని అలక్ష్యం చేస్తారు. మీ విషయం ఏమిటి? మీరు వ్యక్తిగతంగా తగినంత ఆత్మీయ ఆహారం తింటున్నారా? లేక మీరు ఆత్మీయ పోషణ నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారా? ఈ విషయంలో మన ఎడల మనం యథార్థంగా ఉండాలి, ఎందుకంటే మనకు భౌతిక ఆహారం కంటే కూడా ఆత్మీయ ఆహారం అత్యంత ప్రాముఖ్యం.—మత్తయి 4:4.
ఆత్మీయ పెరుగుదలకు కావలసిన ఆహారం
సరైన ఆహారాన్ని తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించే ఒక పాఠ్యపుస్తకమైన ఫుడ్ అండ్ న్యూట్రీషన్, సరైన ఆహారం తినడం యొక్క మూడు మంచి కారణాలను మనకిస్తోంది. “పెరుగుదలను అభివృద్ధి చేసేందుకు మరియు శరీర కణాల క్షీణతను తట్టుకునేందుకు” ఆహారం అవసరమన్నది ఒక విషయం. మీ జీవితంలోని ప్రతి దినం మీ శరీరంలోని కోటానుకోట్ల కణాలు పాడైపోతాయనీ మరి వాటి స్థానంలో కొత్త వాటిని చేర్చాలీ అనే విషయం మీకు తెలుసా? సరైన పెరుగుదలకూ శరీర సంరక్షణకూ మంచి ఆహారం అవసరం.
ఆత్మీయంగా కూడా అది వాస్తవమే. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని సంఘానికి వ్రాసినప్పుడు, ‘సంపూర్ణ పురుషుడు’ అయ్యేందుకు ప్రతి క్రైస్తవునికి మంచి ఆత్మీయ ఆహారం ఎంత అవసరమో ఆయన నొక్కి చెప్పాడు. (ఎఫెసీయులు 4:11-13) పోషణనిచ్చే ఆత్మీయ ఆహారాన్ని మనం చక్కగా తీసుకున్నప్పుడు, మన ఎడల మనం శ్రద్ధ తీసుకోలేని పిల్లల్లా, అన్ని విధాలైన ప్రమాదాలకు గురయ్యే బలహీనమైన పిల్లల్లా ఉండము. (ఎఫెసీయులు 4:14) బదులుగా, “విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు” ఉన్నాము గనుక మనం విశ్వాస పోరాటంలో దృఢంగా పోరాడేందుకు శక్తిగల వారమై, మనం దృఢమైన వ్యక్తులుగా అవుతాము.—1 తిమోతి 4:6.
మీ విషయంలో అది వాస్తవమా? మీరు అత్మీయంగా ఎదిగారా? లేక మీరు ఇంకా దుర్బలమైన వారిగా, ఇతరులపై పూర్తిగా ఆధారపడే వారిగా, పూర్తి క్రైస్తవ బాధ్యతను తీసుకోలేని ఆత్మీయ శిశువుల వలె ఉన్నారా? అయితే మనలో ఎవరం కూడా మనం ఆత్మీయ శిశువులంగా ఉన్నామని వెంటనే అంగీకరించమన్నది అర్థం చేసుకోగల విషయమే, అయితే నిర్మొహమాటమైన స్వయం పరిశీలన ఎంతో అవసరం. మొదటి శతాబ్దంలోని కొందరు అభిషిక్త క్రైస్తవులు ఆత్మీయ శిశువులవలె ఉన్నారు. దేవుని వాక్యం చెబుతున్న విషయాలను ఇతరులకు బోధించే సామర్థ్యాన్నీ సుముఖతనూ కలిగివుండి తామే బోధకులై ఉండవలసినప్పటికీ, అపొస్తలుడైన పౌలు వారికి ఇలా వ్రాశాడు: “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారైయుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.” మీరు ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటుంటే, మంచి పుష్టిగల ఆత్మీయ ఆహారం ఎడల ఆకలిని పెంచుకోండి. ఆత్మీయ శిశు ఆహారాన్ని తిని సరిపెట్టుకోకండి!—హెబ్రీయులు 5:12.
ఈ ప్రతికూల లోకంలో మనం అనుదినం ఎదుర్కొనే శ్రమల వలన కలిగే ఎటువంటి నష్టాన్నైనా మరమ్మతు చేసేందుకు కూడా మనకు పౌష్టికమైన ఆత్మీయ ఆహారం అవసరం. ఈ శ్రమలు మన ఆత్మీయ శక్తిని పీల్చేయగలవు. అయితే దేవుడు ఆ శక్తిని పునరుద్ధరించగలడు. పౌలు ఇలా చెప్పాడు: “కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.” (2 కొరింథీయులు 4:16) మనం ఎలా ‘దినదినము నూతన పరచబడుచున్నాము’? కొంత మేరకు, లేఖనాలను మరియు బైబిలు ఆధారిత ప్రచురణలను వ్యక్తిగతంగా మరియు సామూహికంగా అధ్యయనం చేయడం మూలంగా దేవుని వాక్యాన్ని క్రమంగా భుజించడం ద్వారా మనం అలా చేయగలము.
ఆత్మీయ శక్తికి కావలసిన ఆహారం
“వేడిని మరియు శక్తిని” ఉత్పత్తి చేసేందుకు కూడా ఆహారం అవసరం. మన శరీరాలు చక్కగా పని చేసేందుకు అవసరమైన ఇంధనాన్ని కూడా ఆహారం అందిస్తుంది. మనం సరిగ్గా తినకపోతే మనకు తగినంత శక్తి ఉండదు. మన ఆహారంలో ఇనుము తక్కువగా ఉంటే అది మనం అలసిపోయినట్లు మరియు బలహీనమైనట్లు భావించేలా చేయగలదు. ఆత్మీయ కార్యకలాపాల విషయంలో మనం కొన్నిసార్లు అలాగే భావిస్తామా? క్రైస్తవులముగా మనం కలిగివున్న కర్తవ్యాలను నెరవేర్చడం మీకు కష్టంగా ఉందా? యేసుక్రీస్తు యొక్క అనుచరులమని చెప్పుకునే కొందరు పని చేయలేక అలసిపోతారు మరియు క్రైస్తవ పని చేసేందుకు తగినంత శక్తి వారివద్ద ఉండదు. (యాకోబు 2:17, 26) మీ విషయంలో ఇది నిజమని మీరు గమనిస్తే, మీరు సరైన ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవడంలోనో లేక మీరు ఆత్మీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుకోవడంలోనో పరిష్కారం ఉండి ఉంటుంది.—యెషయా 40:29-31; గలతీయులు 6:9.
మోసపోయి, ఆత్మీయ ఆహారాన్ని గిల్లి గిల్లి తినడానికి అలవాటుపడకండి. అనేక శతాబ్దాలుగా సాతాను చేపట్టిన అతి గొప్ప మోసం ఏమంటే, వారు బైబిలును చదవవలసిన అవసరత మరియు దాని నుండి కచ్చితమైన జ్ఞానాన్ని తీసుకోవలసిన అవసరత లేదని ప్రజలను ఒప్పించడమే. శత్రు పట్టణాలను చేజిక్కించుకునే సైన్యాలు చేపట్టే అతి పురాతన తంత్రాన్నే అతను ఉపయోగిస్తాడు, అదేమంటే వారికి ఆహారాన్ని ఇవ్వకుండా ఎండబెట్టి వారు తమకై తాము లొంగిపోయేలా చేయడమే. అయితే అతను ఈ కుతంత్రాన్ని అమలుపర్చడంలో ఒక అడుగు ముందుకెళ్ళాడు. తన “చెరలో” ఉన్న వారు అతి చక్కని ఆత్మీయ ఆహారం తమ చుట్టూ గుట్టలు గుట్టలుగా ఉన్నప్పటికీ వారు తమను తామే ఎండబెట్టుకునేలా వారిని మోసగిస్తున్నాడు. అతడి దెబ్బకు అంతమంది పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు!—ఎఫెసీయులు 6:10-18.
ఆత్మీయ ఆరోగ్యానికి కావలసిన ఆహారం
“శరీరం యొక్క ఆరోగ్యాన్ని నియంత్రించేందుకూ . . . వ్యాధులను నివారించేందుకూ” మనకు ఆహారం అవసరమని చెబుతూ, ఫుడ్ అండ్ న్యూట్రీషన్ అనే పత్రిక మూడవ కారణాన్ని చూపుతోంది. మంచి ఆహారం యొక్క ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వెంటనే కనిపించవు. మనం పోషక పదార్థాలున్న భోజనం తిన్న తర్వాత, ‘అది నా గుండెకు (లేక నా మూత్రపిండాలకు లేక నా కండరాలకు మిగతా అవయవాలకు) ఎంతో లాభాన్ని కలిగించింది’ అని మనం ఎప్పుడూ అనుకోము. అయినప్పటికీ, కొంత కాలం వరకూ ఆహారం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి, అప్పుడు మీ ఆరోగ్యానికి కలిగే దుష్పరిణామాలు స్పష్టమౌతాయి. ఏ దుష్పరిణామాలు? “దానికిగల అత్యంత సాధారణ ప్రభావం ప్రతికూలమైనది: ఆరోగ్యంగా ఉండలేకపోవడం, చిన్న ఇన్‌ఫెక్షన్‌ను కూడా తట్టుకోలేకపోవడం మరియు శక్తిని, ఇష్టాన్ని కలిగి లేకపోవడం” అని ఒక వైద్య రెఫరెన్సు ప్రచురణ చెబుతుంది. ఈ విధమైన ఆత్మీయ అనారోగ్యం ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఒకసారి కలిగింది. వారిని గురించి ప్రవక్తయైన యెషయా ఇలా అన్నాడు: “ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు.”—యెషయా 1:5, 6.
మంచి ఆత్మీయ ఆహారం, మనం అలాంటి ఆత్మీయ నిస్సత్తువను మరియు ఆత్మీయ ఇన్‌ఫెక్షన్ యొక్క పర్యవసానాలను త్రిప్పికొట్టేందుకు మనకు సహాయం చేస్తుంది. దేవుని నుండి వచ్చే జ్ఞానం మనం ఆత్మీయంగా మంచి పరిస్థితిలో ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది, అయితే మనం దాన్ని తీసుకున్నప్పుడే! తన కాలంనాటి ప్రజల్లో అనేకులు, సరైన ఆత్మీయ ఆహారపుటలవాట్ల విషయంలో తమ పూర్వికులు అలక్ష్యం చేయడం నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకోకపోవడాన్ని గురించి యేసు వ్యాఖ్యానించాడు. ఆయన బోధించిన సత్యాలను నేర్చుకునేందుకు కూడా వారు నిరాకరించారు. దాని పర్యవసానం ఏమిటి? యేసు ఇలా అన్నాడు: “ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు.” (మత్తయి 13:15) దేవుని వాక్యం యొక్క స్వస్థపరిచే శక్తి నుండి అత్యధికులు ఎన్నడూ లాభం పొందలేదు. వారు ఆత్మీయంగా అనారోగ్యంగానే ఉండిపోయారు. కొందరు అభిషిక్తులు కూడా “బలహీనులును రోగులు”ను అయ్యారు. (1 కొరింథీయులు 11:30) దేవుడు అందిస్తున్న ఆత్మీయ ఆహారాన్ని మనం ఎన్నడూ అసహ్యించుకోకుండా ఉందాము.—కీర్తన 107:20.
కలుషిత ఆత్మీయ ఆహారం
ఆత్మీయంగా అలమటించడమనే ముప్పుకు తోడు, మనం మెలకువగా ఉండాల్సిన మరొక ప్రమాదం ఉంది—మనం తినే ఆహారం బహుశ కలుషితమైనదై ఉండవచ్చు. క్రిములు లేక విష పదార్థాలతో కలుషితమైన భౌతిక ఆహారాన్ని తినడం మనలను ఎంత త్వరగా విషపూరితం చేస్తుందో, ప్రమాదకరమైన దయ్యాల ఆలోచనలతో కలుషితమైన బోధలను తీసుకోవడం కూడా అలాగే చేస్తుంది. (కొలొస్సయులు 2:8) విషపూరితమైన ఆహారాన్ని గుర్తించడం ఎల్లవేళలా అంత సులభం కాదు. “ఆహారం కొన్నిసార్లు మంచిగానే ఉన్నట్లు కనిపించవచ్చు, అయితే అది వ్యాధి కారకమయ్యే సూక్ష్మ జీవులను కలిగివుండవచ్చు” అని ఒక నిపుణుడు చెబుతున్నాడు. కాబట్టి, మతభ్రష్ట రచనల వంటి కొన్ని సాహిత్యాలు లేఖనరహితమైన బోధలచే తత్వసిద్ధాంతాలచే కలుషితం చేయబడి ఉండవచ్చనే విషయాన్ని మనస్సులో ఉంచుకుని మనం మన సూచనార్థక ఆహార మూలాన్ని పరిశీలించడం మంచిది. తమ ఉత్పత్తుల్లో ఏ పదార్థాలు ఉన్నాయనే విషయంలో కొనుగోలుదారులను మోసగించేందుకు కొందరు ఉత్పత్తిదారులు తప్పుదారి పట్టించే లేబుల్‌లను కూడా ఉపయోగిస్తారు. మహా మోసగాడైన సాతాను కూడా అలాగే చేస్తాడు. కాబట్టి, మీరు “విశ్వాసవిషయమున స్వస్థులగు”నట్లు అలాంటి సూచనార్థకమైన ఆహారం నమ్మదగిన మూలం నుండి వస్తుందో లేదో చూసుకోండి.—తీతు 1:9, 13.
17వ శతాబ్దానికి చెందిన ఒక ప్రచారకుడైన థామస్ ఆడమ్స్, తన కాలంనాటి ప్రజలను గురించి ఇలా చెప్పాడు: “వారు తమ పళ్లతో తమ సమాధులను త్రవ్వుకున్నారు.” వేరే మాటల్లో చెప్పాలంటే, వారు తిన్నవే వారి మరణానికి కారణమయ్యాయి. మీ ఆత్మీయ ఆహారం మిమ్మల్ని చంపకుండా చూసుకోండి. మంచి ఆత్మీయ ఆహార సరఫరా కొరకు అన్వేషించండి. ఆయన ప్రజలమని చెప్పుకుంటున్న వాళ్లు అబద్ధ బోధకుల వైపూ ప్రవక్తల వైపూ తిరిగినప్పుడు, “ఆహారము కానిదాని కొరకు మీరేల రూకలిచ్చెదరు?” అని యెహోవా దేవుడు అడిగాడు. “నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు.”—యెషయా 55:2, 3; యిర్మీయా 2:8, 13 పోల్చండి.
పుష్కలమైన ఆత్మీయ ఆహారం
మంచి ఆత్మీయ ఆహారానికి ఎంతమాత్రం కొరతలేదు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రకారంగా, ఆయన ఇప్పుడు నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిని కలిగివున్నాడు, ఆ తరగతి వారు ఎవరికి కావాలో వారికి “తగినవేళ అన్నము” అందజేయడంలో పని రద్దీని కలిగి ఉన్నారు. (మత్తయి 24:45) ప్రవక్తయైన యెషయా ద్వారా యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు . . . నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు.” వాస్తవానికి, తినాలని ఇష్టపడే వారికి ఆయన శ్రేష్టమైన ఆహారంతో విందును ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. “సైన్యముల కధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును.”—యెషయా 25:6; 65:13, 14.
అయితే దీని గురించి ఆలోచించండి: మనం ఒక విందు భోజనంలో కూడా ఆకలితో మలమల మాడి చావొచ్చు! మన చుట్టూ ఆహారం ఉన్నా మనం దాన్ని తినేందుకు ముందుకు వెళ్లకపోతే మనం తీవ్రమైన కుపోషణకు గురికావచ్చు. సామెతలు 26:15 ఈ అక్షరార్థమైన వివరణను అందిస్తుంది: “సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.” అదెంతటి దుఃఖకరమైన పరిస్థితి! దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా పఠించడానికి కృషి చేసేందుకు మనం కూడా మరీ సోమరులం కావచ్చు. మనం ఆత్మీయ ఆహారాన్ని తీసుకోడానికి మనకు సహాయం చేసేందుకు రూపొందించబడిన బైబిలు ప్రచురణలను అధ్యయనం చేసేందుకు కూడా మనం సోమరులం కావచ్చు. లేక క్రైస్తవ కూటాలకు సిద్ధపడేందుకూ వాటిలో పాల్గొనేందుకూ మనం మరీ అలసిపోవచ్చు.
మంచి ఆహారపుటలవాట్లు
మంచి ఆత్మీయ ఆహారపుటలవాట్లను వృద్ధి చేసుకునేందుకు మనకు ఎన్నో కారణాలున్నాయి. అయితే, వాస్తవమేమిటంటే కొందరు తమ ఆత్మీయ ఆహారాన్ని కోడి కెలికినట్లు కెలుకుతూ తింటారు, కొందరు పూర్తిగా అలమటిస్తారు. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం మూలంగా కలిగే పర్యవసానాలను జీవితంలోని తర్వాత భాగంలో అనుభవించేంత వరకూ దాని ప్రాముఖ్యతను గ్రహించని వ్యక్తులవలె వారుంటారు. జీవించడానికి మంచి ఆహారపుటలవాట్లు అవసరమని మనకు తెలిసినప్పటికీ మన ఆహారపుటలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండేందుకు హెల్దీ ఈటింగ్ అనే ప్రచురణ ఈ కారణాన్నిస్తుంది: “[అనుచితమైన ఆహారపుటలవాట్ల మూలంగా] ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించదు, ఒక రోడ్డును నిర్లక్ష్యంగా దాటినప్పుడు వచ్చినట్టుగా అనర్థాలు వెంటనే సంభవించవు, అదే దానితో వచ్చిన చిక్కు. బదులుగా, వారి ఆరోగ్యం చాలా మెల్లిగా, గుప్తంగా క్షీణించవచ్చు, ఇన్‌ఫెక్షన్‌లు త్వరగా సోకవచ్చు, ఎముకలు మరింత బలహీనం కావచ్చు, దెబ్బలు మానేందుకు మరియు వ్యాధులు నయమయ్యేందుకు చాలా సమయం పట్టవచ్చు.”
తీవ్రమైన కేసుల్లో ఒకరు, అనెక్సీరియా నెర్వోసా వలన బాధపడే యౌవనస్థురాలివలె కావచ్చు. తనకు ఎక్కువ ఆహారం అవసరం లేదనీ, భౌతికంగా క్షీణిస్తున్నప్పటికీ తాను పూర్తిగా బాగున్నాననీ ఆమె తనకు తాను చెప్పుకుంటుంది. తుదకు ఆమె తినాలనే కోరికను కూడా పూర్తిగా కోల్పోతుంది. “అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి” అని ఒక వైద్య రెఫరెన్సు పుస్తకం చెబుతుంది. ఎందుకు? “ఆకలితో అలమటించడం మూలంగా ఒక రోగి సాధారణంగా చనిపోకపోయినప్పటికీ, ఆమె తీవ్రమైన కుపోషణకు గురౌతుంది, మరి అత్యల్పమైన ఇన్‌ఫెక్షన్‌ను కూడా ఆమె తట్టుకోలేదు.”
ఒక క్రైస్తవ స్త్రీ ఇలా అంగీకరించింది: “క్రమంగా కూటాల కొరకు సిద్ధపడాలనీ, వ్యక్తిగత పఠనం చేయాలనీ తెలిసి ఉండి కూడా అదే చేయలేకపోవడమనే పోరాటాన్ని నేను సంవత్సరాలుగా సాగించాను.” తాను దేవుని వాక్యం యొక్క మంచి విద్యార్థిని అయ్యేందుకు అవసరమైన మార్పులను ఆమె తుదకు చేసుకుంది, అయితే ఆమె తన పరిస్థితి ఎంత క్షీణించిపోయిందో గుర్తించిన తర్వాతనే అలా చేసింది.
అపొస్తలుడైన పేతురు ఇచ్చిన సలహాను పాటించండి. “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:1-3) అవును, “అపేక్షించుడి” అంటే దేవుని జ్ఞానాన్ని మీ మనస్సుల్లోనూ హృదయాల్లోనూ నింపుకోవాలనే తీవ్రమైన కోరికను వృద్ధి చేసుకోండి. ఆత్మీయ వయోజనులు కూడా అలాంటి కోరికను పెంపొందించుకోవడంలో కొనసాగాలి. ఆత్మీయ ఆహారాన్ని ‘మీ స్వాధీనంలో ఉన్న వాటన్నిటిలో అత్యంత దుర్వినియోగం చేయబడుతున్న పదార్థంగా’ మార్చకండి. తగినంత ఆత్మీయ ఆహారాన్ని తినండి, దేవుని వాక్యమైన బైబిలులో కనుగొనబడే ‘హితవాక్యాల’ నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి.—2 తిమోతి 1:13, 14.
[28వ పేజీలోని చిత్రం]
మీరు మీ ఆహారపుటలవాట్లను వృద్ధి చేసుకోవలసిన అవసరముందా?