“సమాధానకర్తయగు దేవుడు” దుఃఖితుల ఎడల శ్రద్ధ కల్గివున్నాడు
ప్రాచీన కాలానికి చెందిన దావీదు బాధలకు అతీతుడు కాడని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. తనను చంపడానికి నిశ్చయించుకున్న దుష్టుడూ దురహంకారీ అయిన రాజు తనను తీవ్రంగా వెంబడిస్తుండడంతో ఆయన చాలా సంవత్సరాలపాటు దేశదిమ్మరిగా జీవించాడు. బాధతో కూడిన ఈ సమయంలో, దావీదు ఏకాంత ప్రదేశాల్లో దాక్కున్నాడు. కాని ఆయన అంతకన్నా ఎక్కువే చేశాడు. తన బాధ గురించి ఆయన యెహోవాకు ఎడతెగక ప్రార్థించాడు. తన కఠిన పరీక్ష గురించి ఆయన ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. . . . బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను.”—కీర్తన 142:1, 2.
నేడు కొందరు, దావీదు దేవునిపై ఉంచిన నమ్మకాన్ని అపహాస్యం చేయవచ్చు. ప్రార్థన కేవలం మానసిక ఊతకర్ర వంటిదని, ఆచరణరీత్యా చూస్తే అది సమయం వ్యర్థం చేసుకోవడమేనని వారు అనవచ్చు. అయినప్పటికీ, దేవునియందు దావీదుకున్న నమ్మకం వమ్ము కాలేదు, ఎందుకంటే చివరికి ఆయన శత్రువులు ఓడించబడ్డారు. తన గత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, దావీదు ఇలా వ్రాశాడు: “ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.” (కీర్తన 34:6) దావీదు ఎవరివైపు తిరిగాడో ఆ సత్య దేవుడే మరోచోట “సమాధానకర్తయగు దేవుడు” అని పిలువబడ్డాడు. (ఫిలిప్పీయులు 4:9; హెబ్రీయులు 13:20) మనకు శాంతినిస్తూ ఆయన మనకు మన దుఃఖాల నుండి ఉపశమనం తీసుకువస్తాడా?
యెహోవా మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడు
యెహోవా తన ప్రజల బాధల విషయంలో నిర్లక్ష్యంగా లేడు. (కీర్తన 34:15) ఆయన ఒక గుంపుగా తన సేవకుల అవసరతల ఎడల శ్రద్ధ కల్గివుండడమే గాక, తన ఎడల భయం కలిగివుండే ప్రతి వ్యక్తి అవసరతల ఎడల కూడా ఆయన శ్రద్ధ కల్గివున్నాడు. ప్రాచీన యెరూషలేములోని ఆలయాన్ని ప్రతిష్టించే సమయంలో, “వారిలో ప్రతి ఒక్కరికీ తమ స్వంత నొప్పి, తమ స్వంత కష్టము తెలుసు గనుక, వారిలో ఎవరైనాగానీ లేక ఇశ్రాయేలీయులందరూ కలిసిగానీ చేసే విన్నపాలన్నీ ప్రార్థనలన్నీ” వినమని సొలొమోను యెహోవాను వేడుకున్నాడు. (2 దినవృత్తాంతములు 6:29-33, NW) సొలొమోను గుర్తించినట్లుగా, ప్రతి వ్యక్తీ తనదైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది ఒక వ్యక్తికి శారీరక అనారోగ్యం అయ్యుండవచ్చు. మరొకరికి భావోద్రేకపరమైన వేదన అయ్యుండవచ్చు. కొంతమంది తమ ప్రియమైనవారి మరణం వల్ల దుఃఖిస్తుండవచ్చు. ఈ కష్టతరమైన కాలాల్లో నిరుద్యోగం, ఆర్థిక కష్టం మరియు కుటుంబ సమస్యలు కూడా సాధారణ దుఃఖాలుగా ఉన్నాయి.
‘మీ స్వంత నొప్పి గురించి, మీ స్వంత కష్టం గురించి’ ఒక్క క్షణం ఆలోచించండి. కొన్నిసార్లు మీరు బహుశా కీర్తనల గ్రంథకర్తయైన దావీదులా భావించివుండవచ్చు, ఆయనిలా వ్రాశాడు: “కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.” అయినప్పటికీ, మీ పరిస్థితి గురించి దేవుడు శ్రద్ధ కల్గివున్నాడని మీరు నిశ్చయత కల్గివుండవచ్చు, ఎందుకంటే అదే కీర్తనలో, దావీదు ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు.”—కీర్తన 69:20, 33.
దావీదు మాటలను విస్తృత భావంలో అన్వయించుకొని, ఖైదు చేయబడివున్న అంటే సూచనార్థకంగా చెప్పాలంటే తమ దుఃఖాలతో ఖైదు చేయబడివున్న వారి ప్రార్థనలను మానవజాతి సృష్టికర్త వింటాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. అంతకంటే ఎక్కువగా, ఆయన వారి దురవస్థకు ప్రతిస్పందిస్తాడు. దుఃఖితుల ఎడల యెహోవాకున్న వాత్సల్యాన్ని తెలియపరిచే ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి.
“విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱ్ఱను విందును. నా కోపాగ్ని రవులు” కొనును.—నిర్గమకాండము 22:22-24.
‘దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? వారి విషయమేగదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు.’—లూకా 18:7.
“దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”—కీర్తన 72:12-14.
‘మిమ్మును [భూమిపైనున్న దేవుని ప్రజలను] ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు.’—జెకర్యా 2:8.
తన ప్రజల క్షేమం ఎడల మన సృష్టికర్తకున్న అత్యధిక శ్రద్ధను ఈ కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాయి. కాబట్టి, అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనం అనుసరించడం యుక్తం: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.” (1 పేతురు 5:7) కాని దుఃఖకాలంలో దేవుడు మనకెలా సహాయం చేస్తాడు?
దుఃఖితులకు దేవుడు సహాయం చేసే విధానం
మనం చూసినట్లుగా, దావీదు దుఃఖాన్ని అనుభవించినప్పుడు, నడిపింపు కొరకు దేవునికి ఎడతెగక ప్రార్థించాడు. అదే సమయంలో, తనను వెంబడిస్తున్న వారి నుండి తప్పించుకోవడానికి చాతుర్యాన్ని ఉపయోగిస్తూ, పరిస్థితిని ఉపశమింపజేయడానికి చొరవ తీసుకున్నాడు. అలా, యెహోవాపై ఆధారపడడమూ వ్యక్తిగత ప్రయత్నమూ రెండూ కలిసి దావీదు తన దుఃఖాన్ని సహించడానికి ఆయనకు సహాయం చేశాయి. దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
మనం దుఃఖాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, సమస్యను పరిష్కరించడానికి సహేతుకమైనంత చొరవ తీసుకోవడం కచ్చితంగా తప్పు కాదు. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు నిరుద్యోగిగా ఉంటే, ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆయన ప్రయత్నించడా? లేక ఆయన శారీరక అనారోగ్యంతో బాధపడుతుంటే, వైద్యం చేయించుకోడా? వాస్తవానికి, అన్ని రకాలైన రోగాలను స్వస్థపర్చగల శక్తి ఉన్న యేసు కూడా, ‘రోగులకు వైద్యుడవసరమని’ గుర్తించాడు. (మత్తయి 9:12; 1 తిమోతి 5:23 పోల్చండి.) నిజమే కొన్ని బాధలను తొలగించడం కుదరదు; వాటిని సహించవలసిందే. అయినప్పటికీ, కొందరు దృష్టిస్తున్నట్లుగా బాధ దానంతటదే ఒక మేలన్నట్లు నిజ క్రైస్తవుడు దృష్టించడు. (1 రాజులు 18:28 పోల్చండి.) బదులుగా, తన దుఃఖాన్ని ఎదుర్కోవడానికి తాను తీసుకోగలిగిన ఏ చర్యలనైనా తీసుకుంటాడు.
అయితే, అదే సమయంలో, విషయాన్ని ప్రార్థనలో యెహోవా ఎదుటకి తీసుకువెళ్లడం సహేతుకం. ఎందుకు? మొదటిగా, మన సృష్టికర్తపై ఆధారపడడం ద్వారా, మనం “శ్రేష్ఠమైన కార్యములను వివేచింప”డానికి మనకు సహాయం లభిస్తుంది. (ఫిలిప్పీయులు 1:9) ఉదాహరణకు, ఉద్యోగం కొరకు వెదుకుతున్నప్పుడు, దేవునిపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడడం బైబిలు సూత్రాలతో పొందికలేని పనిని అంగీకరించకుండా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. ధనాశ ద్వారా “విశ్వాసమునుండి తొలగిపో”వడాన్ని కూడా మనం నివారిస్తాము. (1 తిమోతి 6:10) నిజంగా, ఉద్యోగం విషయంలో లేక జీవితంలోని మరే ఇతర అంశంలోనైనా బరువైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం దావీదు ఇచ్చిన ఈ ఆజ్ఞను అనుసరించవలసిన అవసరం ఉంది: “నీ భారము యెహోవామీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”—కీర్తన 55:22.
మన దుఃఖం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయకుండా ఉండేలా మనం మన మానసిక సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రార్థన సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” దాని ఫలితమేమై ఉంటుంది? “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము [“శాంతి,” NW] యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) అవును, శాంతి, దేవుని శాంతి, ఆ శాంతి ‘సమస్త జ్ఞానాన్నీ మించివుంటుంది’ కాబట్టి మనం వేదనకరమైన భావాలతో కృంగిపోతున్నప్పుడు అది మనల్ని బలపర్చగలదు. మన దుఃఖం అధికమయ్యేలా చేసుకుంటూ కఠినంగా, తెలివితక్కువగా ప్రతిస్పందించకుండా ఉండేందుకు మనకు సహాయం చేస్తూ, అది ‘మన హృదయములకు, తలంపులకు కావలివుంటుంది.’—ప్రసంగి 7:7.
ప్రార్థన అంతకంటే ఎక్కువే చేయగలదు. అది పరిస్థితి యొక్క పర్యవసానాన్ని మార్చివేయగలదు. ఒక బైబిలు ఉదాహరణను పరిశీలించండి. అపొస్తలుడైన పౌలు రోములో బంధింపబడివున్నప్పుడు, తన కొరకు ప్రార్థన చేయమని ఆయన తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు. ఎందుకు? ఆయన వారికిలా వ్రాశాడు: “నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (హెబ్రీయులు 13:19) తన తోటి విశ్వాసుల పట్టుదలతో కూడిన ప్రార్థనలు తన విడుదలకు సంబంధించిన సమయాన్ని మార్చగలవని పౌలుకు తెలుసు.—ఫిలేమోను 22.
ప్రార్థన మీ దుఃఖకరమైన పరిస్థితిని మారుస్తుందా? మార్చవచ్చు. అయితే, యెహోవా ఎల్లప్పుడూ మనం ఎదురు చూస్తున్న విధంగానే మన ప్రార్థనలకు సమాధానమివ్వడని మనం గుర్తించాలి. ఉదాహరణకు, పౌలు తన ‘శరీరములో ఉన్న ముల్లు’ గురించి అంటే బహుశా తన కంటిచూపుకు సంబంధించిన శారీరక సమస్య గురించి పదే పదే ప్రార్థించాడు. ఆ బాధను తీసివేసే బదులు, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని” దేవుడు పౌలుతో చెప్పాడు.—2 కొరింథీయులు 12:7-9.
కాబట్టి కొన్నిసార్లు మన దుఃఖాలు తీసివేయబడవు. బదులుగా, మన సృష్టికర్తపై మనకున్న నమ్మకాన్ని నిరూపించుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. (అపొస్తలుల కార్యములు 14:22) అంతేగాక, బాధను యెహోవా తీసివేయకపోయినప్పటికీ, ఆయన “శోధనతో కూడ తప్పించుకొను మార్గమును [మనకు] కలుగజేయును” అని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. (1 కొరింథీయులు 10:13) అవును, అందుకే యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు,” అని కారణయుక్తంగానే పిలువబడ్డాడు. “ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” (2 కొరింథీయులు 1:3, 4) తగినంత శాంతితో సహించడానికి మనకు అవసరమైనది ఆయన మనకిస్తాడు.
త్వరలోనే—దుఃఖంలేని లోకం
తన రాజ్యం ద్వారా తాను త్వరలోనే మానవజాతి యొక్క దుఃఖాలను నిర్మూలిస్తానని సృష్టికర్త వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దీన్నెలా సాధిస్తాడు? “ఈ యుగ సంబంధమైన దేవత” అని బైబిలు గుర్తిస్తున్నవాడూ, దుఃఖాలకు మూల కారకుడూ, శాంతికి ముఖ్య శత్రువూ అయిన అపవాదియగు సాతానును నిర్మూలించడం ద్వారా ఆయనలా చేస్తాడు. (2 కొరింథీయులు 4:4) త్వరలోనే మానవజాతిపై అతని అధికారం ముగియబోతుంది. సాతాను నిర్మూలించబడడం, దేవునికి భయపడేవారికి అసంఖ్యాకమైన ఆశీర్వాదాలు రావడానికి మార్గాన్ని తెరుస్తుంది. యెహోవా “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి”పోతాయని బైబిలు వాగ్దానం చేస్తోంది—ప్రకటన 21:1-4.
దుఃఖంలేని లోకం మరీ నమ్మశక్యం కానట్లుగా అనిపిస్తుందా? మనం దుఃఖాలతో జీవించడానికి ఎంతగా అలవాటు పడ్డామంటే అవి లేకపోవడాన్ని అస్సలు ఊహించలేము. కాని దేవుడు మానవజాతిని సృష్టించినప్పుడు భయం, చింత, విపత్తుల నుండి స్వేచ్ఛనే వారి కొరకు సంకల్పించాడు, ఆయన సంకల్పం నెరవేరుతుంది.—యెషయా 55:10, 11.
గత శీర్షికలో ప్రస్తావించబడిన సోనియా, ఫాబ్యానా, అనాలు కనుగొన్న నిరీక్షణ ఇదే. ఎయిడ్స్ వ్యాధి మూలంగా మరణించిన ఇద్దరు కుమారుల తల్లియైన సోనియా, నీతిమంతులకూ అనీతిమంతులకూ పునరుత్థానం ఉంటుందని బైబిలు ఇస్తున్న నిరీక్షణను బట్టి ఎంతో నెమ్మదిని పొందింది. (అపొస్తలుల కార్యములు 24:15) “ఒక విషయం మాత్రం కచ్చితం, మా నిరీక్షణ ఏ బాధనైనా అధిగమిస్తుంది” అని ఆమె చెబుతుంది.
అనా ఇంకా అనాధాశ్రమంలో ఉండగానే, యెహోవాసాక్షుల్లో ఒకరు ఆమెను దర్శించారు. “ఆమె బైబిలులో నుండి నాకు యెహోవా పేరును చూపించింది. నేను ఆనందబాష్పాలు రాల్చాను. నాకు సహాయం ఎంతో అవసరమయ్యింది, మన గురించి శ్రద్ధకల్గివున్న దేవుడు ఉన్నాడని నేను తెలుసుకున్నాను” అని అనా చెబుతుంది. అనాధాశ్రమాన్ని విడిచిపెట్టిన తర్వాత అనా బైబిలు పఠనానికి అంగీకరించి, యెహోవా వాగ్దానాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, దానికి సూచనగా బాప్తిస్మం తీసుకుంది. “అప్పటి నుండి నేను ప్రార్థన ద్వారా యెహోవాపై ఆధారపడడాన్ని కొనసాగించాను, ఆయన నాకు సహాయం చేస్తాడనే నిశ్చయతను బట్టి నేను ఓదార్పు పొందాను.”
ఫాబ్యానా కూడా భవిష్యత్తును గూర్చిన దేవుని వాగ్దానాల గురించి తెలుసుకోవడం ద్వారా తన దుఃఖాల నుండి ఎంతో ఓదార్పును, మనశ్శాంతిని పొందింది. “బైబిలు నుండి సత్యం తెలుసుకోవడం, అంధకారమయమైన అస్పష్టమైన స్థలాన్ని విడిచి, స్పష్టమైన కాంతివంతమైన ఆహ్లాదకరమైన గదిలోకి ప్రవేశించడంలా ఉంది.”—కీర్తన 118:5 పోల్చండి.
కాని విశ్వవ్యాప్తంగా ఎలా, ఎప్పుడు అక్షరార్థమైన శాంతి నెలకొంటుంది? తర్వాతి శీర్షికల్లో మనం చూద్దాము.
[6వ పేజీలోని బాక్సు]
దుఃఖం యొక్క అనేక కోణాలు
▪ ప్రపంచ జనాభాలోని దాదాపు నాలుగో వంతు కడు పేదరికంలో జీవిస్తోంది, ఇంకా కోట్లాదిమంది తమ ఉనికికే ప్రమాదం తీసుకురాగల అధమ పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
▪ 20 కోట్లకంటే ఎక్కువమంది పిల్లలు కుపోషణకు గురౌతున్నారు.
▪ ప్రతి సంవత్సరం అతిసార వ్యాధి ఐదేళ్లలోపున్న ముప్పై లక్షలమంది పిల్లలను చంపుతోంది.
▪ కేవలం 1993లోనే అంటురోగాలు దాదాపు 1 కోటి 65 లక్షలమందిని చంపాయి. కొన్ని దేశాలు రోగాలను వేరుగా వర్గీకరిస్తాయి గనుక, అసలు సంఖ్య ఎంతో ఎక్కువే ఉండి ఉండవచ్చు.
▪ 50 కోట్లమంది ప్రజలు ఏదో ఒక విధమైన మానసిక సమస్యకు గురైనట్లు అంచనా వేయబడుతోంది.
▪ ఇతర వయస్సుల వారిలో కంటే యౌవనుల్లో ఆత్మహత్యా రేట్లు మరింత త్వరగా పెరుగుతున్నాయి.
▪ “ఆకలీ, నిరుద్యోగమూ ప్రపంచంపై మచ్చల్లా తయారయ్యాయి, ప్రపంచంలోని ఏడు ధనిక దేశాల్లో 3 కోట్ల 50 లక్షలమంది నిరుద్యోగులున్నారు, కేవలం బ్రెజిల్లోనే 2 కోట్లమంది శ్రామికులు ఎలాంటి పనిని కలిగివున్నారంటే వారి పని వారికి తినడానికి తగినంత కూడా చేకూర్చలేకపోతోంది” అని ది యునెస్కో కొరియర్ చెబుతుంది.
[7వ పేజీలోని చిత్రం]
దుఃఖం లేని లోకం గురించి దేవుడు చేసిన వాగ్దానంపై మనస్సును కేంద్రీకరించడానికి ప్రార్థన మనకు సహాయం చేయగలదు