దుఃఖితులకు ఎన్నడైనా ఉపశమనం లభిస్తుందా?
మీరనుభవిస్తున్న బాధే కాకుండా యావత్ మానవజాతీ అనుభవిస్తున్న బాధ అంతమొందడాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ఉదాహరణలను పరిశీలించండి:
సోనియా ఎంతో బాధననుభవించింది.a తన భర్తకు పది సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఆమె బాధలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆమె చిన్న కుమారునికి హెచ్.ఐ.వి. వైరస్ సోకి, ఎయిడ్స్ వలన మరణించాడు. రెండు సంవత్సరాల తర్వాత ఆమె మరో కుమారుడు కూడా అస్వస్థతకు గురై త్వరలోనే అతడు కూడా ఎయిడ్స్ వలన మరణించాడు. సోనియా ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “అతని వ్యాధి చివరి దశలో చాలా కాలం ఉంది. అతడు తీవ్రమైన నిరాశకు గురయ్యాడు, వెంట్రుకలు రాలిపోయాయి, సరిగా చూడలేకపోయేవాడు. అది ఎంతో దుఃఖకరమైంది.”
బ్రెజిల్ విశ్వవిద్యాలయ విద్యార్థినియైన ఫాబ్యాన ప్రపంచ సామాజిక అన్యాయాల గురించి ఆందోళన కలిగివుండేది. అదే సమయంలో ఆమె జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. నిరాశతో బాధపడుతున్న ఆమె సహోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫాబ్యాన తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, ఆమె అలాంటి దుస్సంఘటనలను అనుభవిస్తుందంటే దానికి కారణం ఫాబ్యానాపై ఎవరో మంత్ర ప్రయోగం చేసి ఉంటారనీ, కాబట్టి ఆమె ఒక పైడిసేన్టూను (మాంత్రికుడిని) కలవడం మంచిదని ఒక స్నేహితురాలు సలహా ఇచ్చింది! కాని పైడిసేన్టూ ఏ ఉపశమనాన్నీ ఇవ్వలేకపోయాడు. బదులుగా, ఫాబ్యానా తన దుఃఖాలను బట్టి నిద్రపోలేక హింసింపబడినట్లు భావించింది.
అనా వేదనలు జీవితంలోని తొలి ప్రాయంలోనే ప్రారంభమయ్యాయి. ఆమె ఇలా చెబుతుంది, “నేను ఏడాది వయస్సులో ఉండగా, మా అమ్మ నన్ను వదిలేసింది, కాబట్టి నా ఆలనాపాలనా మా అమ్మమ్మ చూసేది.” ఆ తర్వాత అనాకు కేవలం మూడు సంవత్సరాలున్నప్పుడు ఆమె అమ్మమ్మ మరణించింది. అనా రియో డీ జనైరోలోని అనాధాశ్రమానికి పంపబడింది, అక్కడామె తనకు 13 సంవత్సరాలు వచ్చే వరకు ఉంది. “అక్కడ మమ్మల్నెంతో బాధపెట్టేవారు, నేను తిరుగుబాటు చేసేదానిగా తయారయ్యాను. నేను పెరిగి పెద్దయ్యాక, దాదాపు ప్రతి దానికి పోరాడేదాన్ని” అని ఆమె చెబుతుంది.
బాధ ప్రతి మానవుని జీవితాన్ని ఏదొక విధంగా ప్రభావితం చేస్తున్నట్లుగా కన్పిస్తోంది. వాస్తవానికి, మనం వార్తలను చూసినప్పుడు, చదివినప్పుడు, లేక విన్నప్పుడు మనం మానవ బాధను గూర్చిన వృత్తాంతాలను అనుదినం వింటూనే ఉంటాము. “మన . . . ప్రచార సాధనాల శకం, ఎడతెగక ఎదురయ్యే దుర్వార్తల దాడిని తప్పించుకోవడం దాదాపు అసంభవమయ్యేలా చేసేసింది. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, పారిశ్రామిక విపత్తులు, భయంకరమైన రోడ్డు ప్రమాదాలు, నేరం, తీవ్రవాదం, లైంగిక దుర్వ్యవహారం, మానభంగం, గృహ దౌర్జన్యం వంటివన్నీ వేదనను ఒక భయంకరమైన, ఇరవయ్యవ శతాబ్దపు అనుదిన జీవన ఇతివృత్తమయ్యేలా చేస్తున్నాయి” అని డా. మేరి సైక్స్ వైలీ చెబుతుంది. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు మానవ అనుభవాన్ని వాస్తవికంగా ఇలా సంక్షిప్తపరిచాడు: ‘సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నది.’—రోమీయులు 8:22.
మీ విషయమేమిటి? మీరు బాధననుభవిస్తున్నారా? మీరు ఏ ఉపశమనం కొరకు నిరీక్షించవచ్చు? మీరు ఎన్నడైనా నిజమైన శాంతిని పొందగలరా? సోనియా, ఫాబ్యానా, అనాలు నిజమైన ఓదార్పును, వాస్తవంగా ఎంతో శాంతిని పొందారు! తర్వాతి శీర్షికలో మీరు దాని గురించి చదవవచ్చు.
[అధస్సూచీలు]
a ఈ శీర్షికలోని పేర్లు మార్చబడ్డాయి.