నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
“[యెహోవా] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:9.
1. యెషయా ప్రవచనంలో మనం శాంతిని గూర్చిన ఏ అద్భుతమైన వాగ్దానాన్ని కనుగొంటాము?
“నీతి సమాధానము [“శాంతిని,” NW] కలుగజేయును; నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.” (యెషయా 32:17, 18) ఎంత చక్కని వాగ్దానం! అది దేవుడు తీసుకువచ్చే నిజమైన శాంతిని గూర్చిన వాగ్దానం.
2, 3. నిజమైన శాంతిని వివరించండి.
2 అయితే, నిజమైన శాంతి అంటే ఏమిటి? అది కేవలం యుద్ధం లేకపోవడమేనా? లేక తర్వాతి యుద్ధం కొరకు దేశాలు సిద్ధపడే సమయం మాత్రమేనా? నిజమైన శాంతి కేవలం ఒక స్వప్నమేనా? అవి విశ్వసనీయమైన సమాధానాలు కావలసిన ప్రశ్నలు. మొదటిగా, నిజమైన శాంతి ఒక స్వప్నం కాదు. దేవుడు వాగ్దానం చేసిన శాంతి, ఈ లోకం ఊహించగలిగిన దేనికంటే కూడా ఎంతో ఎక్కువైనది. (యెషయా 64:4) అది కేవలం కొన్ని సంవత్సరాలు లేక కొన్ని దశాబ్దాలు మాత్రమే ఉండే శాంతి కాదు. అది నిరంతరం ఉంటుంది! అది కేవలం ఆధిక్యతగల కొంతమంది కొరకే కాదుగాని అది పరలోకంలోనూ, భూమిపైనా, దేవదూతల్లోనూ, మానవుల్లోనూ వ్యాపిస్తుంది. అది అన్ని దేశాల, జాతుల, భాషల, వర్ణాల ప్రజలను చేరుతుంది. దానికి అవధులూ, అవరోధాలూ, వైఫల్యాలూ ఉండవు.—కీర్తన 72:7, 8; యెషయా 48:18.
3 నిజమైన శాంతి అంటే ప్రతిరోజూ శాంతియే అని భావం. అంటే మీరు ప్రతి ఉదయం యుద్ధాన్ని గూర్చిన ఆలోచన లేకుండా, మీ భవిష్యత్తు గురించీ, మీ పిల్లల భవిష్యత్తు గురించీ, చివరికి మీ మనుమల భవిష్యత్తు గురించీ, వ్యాకులపడకుండా మేల్కొనడమని భావం. సంపూర్ణ మనశ్శాంతి అని దాని భావం. (కొలొస్సయులు 3:15) నేరం ఇక ఉండదనీ, హింస ఇక ఉండదనీ, విచ్ఛినమయ్యే కుటుంబాలు ఇక ఉండవనీ, ప్రజలు ఇక నిరాశ్రయులు కారనీ, ఆకలితో అలమటించరనీ, చలితీవ్రత వల్ల చనిపోయేవారుండరనీ, నిరాశా నిస్పృహలు ఇక ఉండవనీ అర్థం. ఇంకా శ్రేష్ఠంగా, దేవుని శాంతి అంటే అనారోగ్యంగానీ, బాధగానీ, దుఃఖంగానీ, లేక మరణంగానీ లేని లోకమని అర్థం. (ప్రకటన 21:4) నిజమైన శాంతిని నిరంతరం అనుభవించే ఎంతటి అద్భుతమైన నిరీక్షణ మనకుందో కదా! మనమందరం కావాలని ఆకాంక్షించేది ఈ విధమైన శాంతినే కాదా? మనం ప్రార్థించవలసింది, కృషి చేయవలసింది ఈ విధమైన శాంతి కొరకే కాదా?
విఫలమైన మానవజాతి ప్రయత్నాలు
4. శాంతి కొరకు రాజ్యాలు ఏ ప్రయత్నాలు చేశాయి, ఏ ఫలితాలతో?
4 శతాబ్దాలుగా మానవులూ రాజ్యాలూ శాంతి గురించి మాట్లాడారూ, చర్చించారూ, వందలాది శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు కూడా. దాని ఫలితమేమిటి? గత 80 సంవత్సరాల్లో, వాస్తవంగా ఏదైనా దేశంగాని లేక గుంపు కాని యుద్ధంలో పాల్గొనకుండా ఉన్న క్షణమే లేదు. శాంతి మానవజాతి చేతికి చిక్కలేదని స్పష్టమౌతుంది. కాబట్టి ప్రశ్నేమిటంటే, అంతర్జాతీయ శాంతిని స్థాపించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమయ్యాయి, నిరంతరం నిలిచే నిజమైన శాంతిని తీసుకువచ్చే సామర్థ్యం మానవునికి ఎందుకులేదు?
5. శాంతి కొరకు మానవజాతి చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమౌతూనే వచ్చాయి?
5 సరళమైన జవాబు ఏమిటంటే, నిజమైన శాంతి కొరకు మానవజాతి సరైన మూలంవైపు తిరగలేదు. అపవాదియగు సాతాను ప్రభావం క్రింద మానవులు తమ స్వంత బలహీనతలకూ దౌష్ట్యాలకు అంటే తమ దురాశకు, కోరికకు, అధికారమూ ప్రాముఖ్యతల కొరకైన తమ వాంఛలకు బలయ్యే సంస్థలను స్థాపించారు. వారు ఉన్నత విద్యా సంస్థలకు వెళ్లారు, ధర్మసంస్థలనూ వ్యూహ రచనా నిపుణుల సంస్థలనూ స్థాపించారు, అవి అణిచివేత మరియు వినాశనాలకు ఇంకా ఎక్కువ మార్గాలను కనుగొన్నాయి. మానవులు ఏ మూలంవైపు నడిపించబడ్డారు? ఆ మూలాన్ని వారు ఎక్కడ వెదికారు?
6, 7. (ఎ) నానాజాతి సమితికి ఎటువంటి చరిత్ర ఉంది? (బి) ఐక్యరాజ్య సమితి చరిత్ర ఎలా ఉంది?
6 వెనుకటికి 1919లో రాజ్యాలు శాశ్వత శాంతిని స్థాపించడం కొరకు నానాజాతి సమితిపై తమ నమ్మకాన్ని ఉంచాయి. 1935లో ముస్సోలినీ ఇతియోపియాను ఆక్రమించడంతోనూ, 1936లో స్పెయిన్‌లో అంతర్యుద్ధం ప్రారంభం కావడంతోనూ ఆ నిరీక్షణ పటాపంచలయ్యింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధారంభంతో ఆ సమితి అగాధంలో కూరుకుపోయింది. బూటకపు శాంతి కనీసం 20 సంవత్సరాలు కూడా నిలవలేదు.
7 ఐక్యరాజ్య సమితి మాటేమిటి? భూవ్యాప్తంగా శాశ్వతమైన శాంతి గురించి అదేమైనా నిజమైన నిరీక్షణను అందజేసిందా? ఎంతమాత్రం లేదు. 1945లో అది ఉనికిలోకి వచ్చినప్పటి నుండి 150 కంటే ఎక్కువ యుద్ధాలూ, సాయుధ పోరాటాలూ జరిగాయి! యుద్ధం గురించీ, దాని ఆరంభాల గురించీ పరిశోధన చేసిన, కెనడాకు చెందిన విద్యార్థియైన గ్విన్ డయర్ ఐక్యరాజ్య సమితి “దొంగ వేటగాళ్లే జంతుసంరక్షకులుగా మారిన వ్యక్తులతో కూడిన సంఘమేగాని పరిశుద్ధుల సంఘం కాదు” అనీ, “పని తక్కువ మాటలెక్కువ జరిగే ఆవరణ” అనీ దాన్ని వర్ణించడంలో ఆశ్చర్యం లేదు.—యిర్మీయా 6:14; 8:15 పోల్చండి.
8. దేశాలు ఒక ప్రక్క శాంతి ఒప్పందాలు చేస్తూనే మరో ప్రక్క ఏమి చేస్తూవున్నాయి? (యెషయా 59:8)
8 దేశాలు శాంతి గురించి మాట్లాడుతూనే, ఆయుధాలను కనిపెట్టి వాటిని తయారుచేయడంలో కొనసాగుతున్నాయి. శాంతి సమావేశాలకు మద్దతునిచ్చే దేశాలే తరచూ ఆయుధాల తయారీలో నాయకత్వం వహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 26,000 మంది పెద్దలనూ పిల్లలనూ చంపే లేక వికలాంగులను చేసే పైశాచిక మందుపాతరలతో సహా ప్రాణాంతకమైన ఆయుధాల తయారీని ఈ దేశాల్లో శక్తివంతమైన వాణిజ్య ప్రయోజనాలు ప్రోత్సహిస్తున్నాయి. దురాశా అవినీతీ వాటిని పురికొల్పే శక్తులు. లంచాలూ, ముడుపులూ అంతర్జాతీయ ఆయుధ వ్యాపారపు అంతర్గత భాగంగా ఉన్నాయి. కొంతమంది రాజకీయవేత్తలు ఈ మూలం ద్వారా సంపన్నులౌతున్నారు.
9, 10. యుద్ధాల గురించీ, మానవ ప్రయాసల గురించీ లోక సంబంధమైన నిపుణులు ఏమి తెలియజేశారు?
9 పోలాండుకు చెందిన భౌతిక శాస్త్రవేత్తా, నోబుల్ శాంతి బహుమతి గ్రహీతా అయిన యుజెఫ్ రోట్‌బ్లాట్ ఆయుధ పోటీని నిలిపివేయమని దేశాలకు విజ్ఞప్తి చేశాడు. ఆయనిలా చెప్పాడు: “[ఒక క్రొత్త ఆయుధ పోటీని] నివారించడానికి ఏకైక మార్గం ఏమిటంటే యుద్ధాల్నే రద్దు చేయడం.” ఇది జరుగబోతుందని మీరనుకుంటున్నారా? 1928 నుండి, 62 దేశాలు విభేదాలను పరిష్కరించుకోవడానికి యుద్ధం ఒక మార్గమనడాన్ని నిరాకరిస్తూ, కెల్లోగ్-బ్రియాండ్ సంధిని ఆమోదించాయి. ఆ సంధికి ఏమాత్రం విలువలేదని రెండవ ప్రపంచ యుద్ధం స్పష్టంగా చూపించింది.
10 మానవజాతి చరిత్ర మార్గంలో యుద్ధం ఎల్లప్పుడూ ఒక అవరోధంగా ఉందన్నది నిర్వివాదాంశము. గ్విన్ డయర్ వ్రాసినట్లుగా, “మానవ నాగరికతలో యుద్ధం కేంద్ర సంస్థగా ఉంది, దానికి మానవజాతికున్నంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది.” అవును, నిజంగా ప్రతి నాగరికతకు, సామ్రాజ్యానికి దాని దాని గౌరవనీయమైన సైనిక వీరులు, స్థాయీ సేనలు, ప్రసిద్ధిగాంచిన యుద్ధాలు, పరిశుద్ధ సైనిక అకాడమీలూ ఆయుధాగారాలు ఉన్నాయి. అయితే, వినాశం కలిగించడంలోనూ, ప్రాణ నష్టం కలిగించడంలోనూ మన శతాబ్దం యుద్ధాలకు పేరుగాంచింది.
11. శాంతి కొరకైన తమ అన్వేషణలో ప్రపంచ నాయకులు ఏ ప్రాథమిక అంశాన్ని నిర్లక్ష్యం చేశారు?
11 “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును” అని చెబుతున్న యిర్మీయా 10:23 నందలి ప్రాథమిక జ్ఞానాన్ని ప్రపంచ నాయకులు నిర్లక్ష్యం చేశారని స్పష్టమౌతుంది. దేవున్ని నిర్లక్ష్యం చేస్తే నిజమైన శాంతి ఉండదు. మరైతే, సభ్య సమాజంలో యుద్ధం అనివార్యమని దీనంతటి భావమా? శాంతి, అంటే నిజమైన శాంతి అసాధ్యమైన స్వప్నమని దీని భావమా?
మూల కారణాన్ని కనుగొనడం
12, 13. (ఎ) యుద్ధం యొక్క ప్రాథమిక, అదృశ్య కారణం గురించి బైబిలు ఏమి తెలియజేస్తుంది? (బి) ప్రపంచ సమస్యలకు నిజమైన పరిష్కారం నుండి మానవజాతి అవధానాన్ని సాతాను ఎలా ప్రక్కకు మళ్లించాడు?
12 ఆ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు, మనం యుద్ధ కారణాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. తిరుగుబాటుదారుడైన దేవదూతయగు సాతాను అసలు ‘నరహంతకుడనీ, అబద్ధికుడనీ’ అంతేగాక, “లోకమంతయు దుష్టుని యందున్నదని” బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. (యోహాను 8:44; 1 యోహాను 5:19) తన పథకాలను నెరవేర్చుకోవడానికి అతడేమి చేశాడు? 2 కొరింథీయులు 4:3, 4 నందు మనమిలా చదువుతాము: “మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” ప్రపంచ సమస్యలకు పరిష్కారంగా దేవుని రాజ్యంవైపు మానవజాతి తన అవధానాన్ని మరల్చకుండా చేయడానికి సాతాను తనకు సాధ్యమైనదంతా చేస్తున్నాడు. విభేదాలు కలుగజేసే సామాజిక, రాజకీయ, మత సంబంధ వివాదాంశాలతో అతడు ప్రజలను అంధులను చేసి తప్పుదోవ పట్టిస్తూ, ఇవన్నీ దేవుని పరిపాలన కంటే ఎంతో ప్రాముఖ్యమైనవని అనిపించేలా చేస్తున్నాడు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జాతీయవాదం దీనికి ఒక ఉదాహరణ.
13 అపవాదియగు సాతాను జాతీయవాదాన్ని, వర్గవ్యవస్థనూ, ఒక దేశంకంటే మరో దేశం, ఒక జాతికంటే మరో జాతి, ఒక తెగకంటే మరో తెగ ఉన్నతమైనదనే నమ్మకాన్ని పెంపొందింపజేస్తున్నాడు. శతాబ్దాలుగా అణచిపెట్టబడిన లోతుగా పాతుకుపోయిన విద్వేషాలు మరిన్ని యుద్ధాలను, పోరాటాలను రేకెత్తించడానికి పునరుద్ధరించబడుతున్నాయి. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఫెడెరికో మేయర్ ఈ దృక్పథం గురించి ఇలా హెచ్చరించాడు: “సహనానికి పేరుపొందిన ప్రాంతాల్లో కూడా విదేశీ విముఖత అధికమౌతున్నట్లు స్పష్టమౌతోంది, గతించిపోయిన విషయాలుగా కనిపించిన విపరీతమైన దేశభక్తితో కూడిన లేక జాతి దురభిమానంతో కూడిన వ్యాఖ్యానాలు ఇప్పుడు తరచూ ఎక్కువగా వినిపిస్తున్నాయి.” దాని ఫలితమేమిటి? మునుపటి యుగోస్లావియాలోని దారుణమైన సామూహిక సంహారాలు, రువాండాలోని జాతి వధ, ప్రముఖ ప్రపంచ వార్తలుగా తయారైన ఈ రెండు ఉదాహరణలు దీని ఫలితాలే.
14. ప్రకటన 6:4 యుద్ధాన్నీ, మన కాలంలో దాని ప్రభావాన్నీ ఎలా వర్ణించింది?
14 ఈ విధానాంతంలో, యుద్ధాన్ని సూచించే ఎఱ్ఱని గుఱ్ఱము భూమి అంతటా దౌడు తీస్తుందని బైబిలు ముందే తెలియజేసింది. ప్రకటన 6:4 నందు మనమిలా చదువుతాము: “అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్లెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము [“శాంతి,” NW] లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱము మీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.” ఈ సూచనార్థక గుఱ్ఱపు రౌతు “సమాధానము లేకుండ చేయ”డాన్ని మనం 1914 నుండి చూస్తున్నాము, దేశాలు పోరాడ్డంలో యుద్ధాల్లో పాల్గొనడంలో కొనసాగుతున్నాయి.
15, 16. (ఎ) యుద్ధాల్లోనూ, హత్యల్లోనూ మతం ఏ పాత్ర పోషించింది? (బి) మతాలు చేసినదాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
15 అలక్ష్యం చేయకూడని విషయం ఏమిటంటే, ఈ యుద్ధాల్లోనూ, హత్యల్లోనూ మతం పోషించిన పాత్ర. మానవజాతి యొక్క రక్తసిక్తమైన చరిత్రకు ఎక్కువగా దోహదపడింది అబద్ధ మతం యొక్క తప్పుదోవ పట్టించే ప్రభావమేనని చెప్పవచ్చు. కాథోలిక్ వేదాంతియైన హాన్స్ కూంగ్ ఇలా వ్రాశాడు: “[మతాల] ప్రతికూలమైన, నాశనకరమైన ప్రభావం దృష్ట్యా అవి యుద్ధాలకు ఎంతగానో తోడ్పడ్డాయన్నది నిర్వివాదాంశము. ఎంతో పోరాటానికి, రక్తపాత వివాదాలకు, వాస్తవానికి ‘మత యుద్ధాలకు’ అవే బాధ్యత వహించాలి; . . . రెండు ప్రపంచ యుద్ధాలకు సంబంధించి కూడా ఇది వాస్తవమే.”
16 హత్యలు మరియు యుద్ధాల్లో అబద్ధ మతం పోషించిన పాత్రను యెహోవా దేవుడు ఎలా దృష్టిస్తాడు? అబద్ధ మతంపై దేవుడు చేస్తున్న దోషారోపణ ప్రకటన 18:5 నందు ఇలా వ్రాయబడివుంది: “దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.” ప్రపంచ రాజకీయ పాలకులతో అబద్ధ మతం యొక్క పొత్తు, దేవుడు దాన్ని అలక్ష్యం చేయలేనంత రక్తాపరాధానికి, పాపాల పుట్టగా మారడానికి దారితీసింది. నిజమైన శాంతికి అవరోధంగా ఉన్న దీన్ని ఆయన త్వరలోనే పూర్తిగా నిర్మూలిస్తాడు.—ప్రకటన 18:21.
శాంతికి మార్గం
17, 18. (ఎ) నిత్య శాంతి సాధ్యమనేది నమ్మడం ఎందుకు కేవలం అవాస్తవికమైన స్వప్నం కాదు? (బి) నిజమైన శాంతి వస్తుందని నిశ్చయతనివ్వడానికి యెహోవా ఇప్పటికే ఏమి చేశాడు?
17 ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ద్వారా మానవులు నిజమైన, శాశ్వతమైన శాంతిని తీసుకురాలేకపోతే, మరి నిజమైన శాంతి ఏ మూలం నుండి వస్తుంది, ఎలా వస్తుంది? నిత్య శాంతి సాధ్యమనేది నమ్మడం కేవలం అవాస్తవికమైన స్వప్నమేనా? మనం శాంతి యొక్క సరైన మూలంవైపు తిరిగినట్లైతే, అది అవాస్తవికమైన స్వప్నంగా ఉండదు. ఎవరా మూలం? యెహోవా “భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే” అని మనకు చెప్పడం ద్వారా కీర్తన 46:9 జవాబిస్తోంది. యుద్ధాలను అంతమొందించి, నిజమైన శాంతిని స్థాపించే పనిని యెహోవా ఇప్పటికే ప్రారంభించాడు. ఎలా? క్రీస్తు యేసును 1914లో అతని న్యాయబద్ధమైన రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టడం ద్వారా, శాంతి కొరకు మానవజాతి చరిత్రలో అత్యంత గొప్పదైన విద్యా ప్రచారాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆయనలా చేస్తున్నాడు. యెషయా 54:13 నందలి ప్రవచనార్థక మాటలు మనకిలా అభయమిస్తున్నాయి: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.”
18 ప్రతీ ప్రతిక్రియకు ఒక క్రియ కారణమనే క్రియ-ప్రతిక్రియ సూత్రాన్ని ఈ ప్రవచనం వివరిస్తోంది. ఈ ప్రవచనంలో, యెహోవా బోధ—క్రియ—యుద్ధ సన్నద్ధులైన ప్రజలను దేవునితో శాంతి కలిగివున్న శాంతి కాముకులైన ప్రజలుగా మారుస్తుంది. దానికి ప్రతిక్రియ ఏమిటంటే, ప్రజలను శాంతి కాముకులుగా చేసే హృదయ పరివర్తనే. “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసు క్రీస్తు మాదిరిని లక్షలాదిమంది అనుసరిస్తుండగా, ప్రజల హృదయాలనూ మనస్సులనూ మార్చే ఈ బోధ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది.—యెషయా 9:6.
19. నిజమైన శాంతి గురించి యేసు ఏమి బోధించాడు?
19 నిజమైన శాంతి గురించి యేసు ఏమి బోధించాడు? ఆయన కేవలం దేశాల మధ్య శాంతి గురించే కాదుగాని ప్రజల మధ్య సంబంధాల్లో ఉండవలసిన శాంతి గురించీ, మంచి మనస్సాక్షి నుండి లభించే అంతర్గత శాంతి గురించీ కూడా మాట్లాడాడు. యోహాను 14:27 నందు, యేసు తన అనుచరులకు చెప్పిన ఈ మాటలను మనం చదువుతాము: “శాంతి మీ కనుగ్రహించుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.” యేసు ఇచ్చే శాంతి లోకం యొక్క శాంతి నుండి ఎలా వేరుగా ఉంది?
20. యేసు దేని ద్వారా నిజమైన శాంతిని తీసుకువస్తాడు?
20 మొదటగా, యేసు ఇచ్చే శాంతి ఆయన రాజ్య సందేశంతో దగ్గరి సంబంధము కలిగివుంది. తాను మరియు 1,44,000 మంది సహ పరిపాలకులతో రూపొందించబడిన నీతియుక్తమైన పరలోక ప్రభుత్వము యుద్ధాన్ని, యుద్ధపిపాసులను అంతమొందిస్తుందని యేసుకు తెలుసు. (ప్రకటన 14:1, 3) తన ప్రక్కన మరణించిన దొంగతో తాను చెప్పిన శాంతికరమైన పరదైసు పరిస్థితులను అది తీసుకు వస్తుందని ఆయనకు తెలుసు. యేసు అతనికి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తానని చెప్పలేదు గాని ఆయన, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.”—లూకా 23:43.
21, 22. (ఎ) నిజమైన శాంతిలో, అద్భుతంగా బలపర్చే ఏ నిరీక్షణ కూడా ఉంది? (బి) ఆ ఆశీర్వాదాన్ని చూడడానికి మనం ఏమి చేయాలి?
21 తనయందు విశ్వాసముంచే దుఃఖితులందరికీ తన రాజ్యం ఓదార్పును తెస్తుందని కూడా యేసుకు తెలుసు. ఆయన ఇచ్చే శాంతిలో అద్భుతంగా బలపర్చే పునరుత్థాన నిరీక్షణ కూడా ఉంటుంది. యోహాను 5:28, 29 నందు కనుగొనబడే ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరమైన మాటలను గుర్తుంచుకోండి: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”
22 ఆ సమయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? మీరు మీ ప్రియమైన వారిని మరణంలో కోల్పోయారా? వారిని మళ్లీ చూడాలని మీరు ఆకాంక్షిస్తున్నారా? అయితే, యేసు ఇస్తున్న శాంతిని స్వీకరించండి. లాజరు సహోదరియైన మార్త కల్గివున్నటువంటి విశ్వాసాన్ని కలిగివుండండి, ఆమె యేసుతో, “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.” కాని మార్తకు యేసు ఇచ్చిన ఉల్లాసపర్చే జవాబును గమనించండి: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా?”—యోహాను 11:24-26.
23. నిజమైన శాంతిని పొందడానికి దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం ఎందుకు అవసరము?
23 మీరు కూడా ఆ వాగ్దానాన్ని నమ్మి, దాని నుండి ప్రయోజనం పొందవచ్చు. ఎలా? దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా మీరలా చేయవచ్చు. కచ్చితమైన జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను అపొస్తలుడైన పౌలు ఎలా నొక్కి చెప్పాడో గమనించండి: “మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, . . . దేవుని బతిమాలుచున్నాము.” (కొలొస్సయులు 1:9-12) నిజమైన శాంతికి మూలం యెహోవా దేవుడని ఈ కచ్చితమైన జ్ఞానం మిమ్మల్ని ఒప్పిస్తుంది. “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు” అని మీరు కీర్తనల గ్రంథకర్తతోపాటు చెప్పడానికి ఇప్పుడు మీరేమి చేయాలో కూడా అది మీకు చెబుతుంది.—కీర్తన 4:8.
మీరు వివరించగలరా?
◻ శాంతి కొరకైన మానవ ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమౌతూనే ఉన్నాయి?
◻ యుద్ధానికి మూల కారణం ఏమిటి?
◻ శాశ్వతమైన శాంతి ఎందుకు అవాస్తవికమైన స్వప్నం కాదు?
◻ నిజమైన శాంతికి మూలం ఏమిటి?
[8వ పేజీలోని చిత్రం]
నిజమైన శాంతి స్వప్నం కాదు. అది దేవుని వాగ్దానం
[10వ పేజీలోని చిత్రం]
సూచనార్థక ఎఱ్ఱని గుఱ్ఱపు రౌతు 1914 నుండి భూమి మీది నుండి శాంతిని తీసివేశాడు
[11వ పేజీలోని చిత్రం]
మతమూ, ఐక్యరాజ్య సమితీ శాంతిని తీసుకురాగలవా?
[క్రెడిట్ లైను]
UN PHOTO