నేను బైబిలు సత్యాన్ని రుమేనియాలో నేర్చుకున్నాను
గోల్డీ రోమోషీన్ చెప్పినది
నేను 1970లో రుమేనియాలోని నా కుటుంబ సభ్యులను దర్శించేందుకు దాదాపు 50 సంవత్సరాల తర్వాత వెళ్లాను. ప్రజలు తమను అణచివేసే కమ్యూనిస్టు పరిపాలన క్రింద జీవించేవారు, నేను ఏమి మాట్లాడతానో ఆ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పదే పదే హెచ్చరించబడేదాన్ని. మా స్వగ్రామంలోని ప్రభుత్వ కార్యాలయంలో నేను నిలుచుని ఉండగా, అక్కడి అధికారి వెంటనే దేశం వదిలి వెళ్లమని నన్ను తొందర పెట్టాడు. అలా ఎందుకు తొందర చేయబడ్డానోనని మీకు వివరించే ముందు, నేను రుమేనియాలో బైబిలు సత్యాన్ని ఎలా నేర్చుకున్నానో వివరిస్తాను.
నేను 1903 మార్చి 3న, వాయవ్య రుమేనియాలోని జలావు పట్టణానికి దగ్గర్లో ఉన్న ఆర్టలెక్ గ్రామంలో జన్మించాను. మేము అందమైన పరిసరాల్లో జీవించాము. గాలీ నీరూ చాలా స్వచ్ఛంగా ఉండేవి. మా ఆహారాన్ని మేమే పండించుకునే వాళ్లం, మాకు వస్తుపరంగా లోటేమీలేదు. నా బాల్య దశలో దేశం శాంతియుతంగా ఉంది.
ప్రజలు చాలా మతనిష్ఠగలవారు. వాస్తవానికి, మా కుటుంబం మూడు విభిన్న మతాలకు చెంది ఉండేది. మా నానమ్మ ఆర్థడాక్స్ కాథోలిక్, మా అమ్మమ్మ అడ్వెంటిస్ట్ మతానికి చెందినది, నా తలిదండ్రులు బాప్టిస్ట్ మతానికి చెందిన వారు. నేను ఈ మతాల్లో వేటినీ కూడా అంగీకరించలేదు గనుక మా కుటుంబీకులు నేను నాస్తికురాలిని అవుతాననేవారు. ‘ఒకవేళ ఒకే దేవుడు ఉంటే, ఒక కుటుంబంలో ఒకే మతం ఉండాలి గానీ మూడు మతాలు కాదు’ అని నేను అనుకునే దాన్ని.
మతం పేరట జరుగుతున్న విషయాలు నన్ను కలతపర్చాయి. ఉదాహరణకు, చర్చికి బకాయీ పడిన చందాలను వసూలు చేసేందుకు ప్రీస్టు ఇళ్లు దర్శించేవాడు. ఇచ్చేందుకు ప్రజల వద్ద డబ్బు లేనప్పుడు అతను డబ్బుకు బదులు వారి దగ్గరున్న మంచి ఉన్ని బ్లాంకెట్లను తీసుకెళ్లేవాడు. కాథోలిక్ చర్చిలో మా నానమ్మ మేరి పటం ఎదుట మోకాళ్లూని ప్రార్థించటాన్ని నేను చూసేదాన్ని. ‘ఒక పటానికి ఎందుకు ప్రార్థించాలి?’ అని నేను ఆలోచించేదాన్ని.
కష్ట కాలాలు
అప్పును తీర్చేందుకు డబ్బు సంపాదించడానికి నాన్న 1912లో అమెరికా వెళ్లాడు. కొంత కాలానికే యుద్ధం చెలరేగింది, మా గ్రామంలోని పురుషులు యుద్ధం చేసేందుకు వెళ్లారు, స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధ పురుషులు మాత్రమే మిగిలారు. మా గ్రామం కొంత కాలం వరకు హంగేరివారి పరిపాలన క్రిందికి వచ్చింది, అయితే రుమేనియా సైనికులు తిరిగి వచ్చి గ్రామాన్ని చేజిక్కించుకున్నారు. వారు మమ్మల్ని వెంటనే వెళ్లిపోమని ఆజ్ఞాపించారు. అయితే, వస్తువులను చిన్న పిల్లలను ఎద్దుల బండిలో సర్దే తొందరలో, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. మా కుటుంబంలోని ఐదుమంది పిల్లల్లో నేను పెద్దదాన్ని, కాబట్టి అలా ఎందుకు జరిగిందో మీరు అర్థం చేసుకోగలరు.
వెళ్లిపోకుండా ఉండిపోయిన వృద్ధుడైన ఓ పొరుగువాని దగ్గరకు నేను పరుగెత్తాను, ఆయనిలా చెప్పాడు: “ఇంటికి వెళ్లు. మీ ఇంటి తలుపులు మూసుకో, ఎవరినీ లోనకి రానివ్వకు.” నేను వెంటనే అలా చేశాను. విడిచి వెళ్లిపోయే తొందరలో వదిలేసిన కోడి పులుసును, మసాలా క్యాబేజీని తిన్న తర్వాత నేను నా పడక ప్రక్కన మోకాళ్లూని ప్రార్థించాను. నాకు వెంటనే మత్తు నిద్ర పట్టేసింది.
నేను నా కళ్లు తెరిసే సరికి, పగటి వెలుగు కనిపించింది, “ఓహ్ దేవా, నీకు వందనాలు! నేనింకా బ్రతికే ఉన్నాను!” అని నేను అన్నాను. రాత్రంతా కాల్పులు జరిగాయి గనుక గోడలన్నిటిలో బులెట్ల రంథ్రాలున్నాయి. ప్రక్క గ్రామం చేరుకున్న తర్వాత నేను వారితో లేనని అమ్మ తెలుసుకున్న వెంటనే ఆమె జార్జ్ రోమోషీన్ అనే యౌవనస్థుణ్ణి పంపింది, అతను నన్ను కనుగొని మా వాళ్ల దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. కొంత కాలానికే మేము మా గ్రామానికి తిరిగి వెళ్లి మళ్లీ అక్కడ జీవించగలిగాము.
బైబిలు సత్యం కొరకైన నా కోరిక
మా అమ్మ నేను బాప్టిస్టుగా బాప్తిస్మం తీసుకోవాలని కోరింది, అయితే నేను అందుకు నిరాకరించాను ఎందుకంటే ఒక ప్రేమగల దేవుడు మనుష్యులను నిరంతరం నరకంలో కాల్చుతాడనే విషయాన్ని నేను నమ్మలేక పోయాను. నాకు వివరించేందుకు ప్రయత్నిస్తూ, అమ్మ ఇలా చెప్పింది: “వాళ్లు చెడ్డవాళ్లయితే అలా చేస్తాడు.” అయితే నేను ఇలా సమాధానమిచ్చాను: “వాళ్లు చెడ్డావాళ్లయితే వాళ్లని చంపేయాలి, కానీ హింసించవద్దు. నేను ఓ కుక్కనో పిల్లినో కూడా అలా హింసించను.”
నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు, ఒక అందమైన వసంత కాల దినాన ఆవులను మేపేందుకు వాటిని పచ్చిక బయళ్లలోకి తీసుకెళ్లమని అమ్మ నాతో చెప్పడం నాకు జ్ఞాపకముంది. అడవికి దగ్గర్లోవున్న ఓ నది ప్రక్కనున్న పచ్చగడ్డిపై పడుకుని, ఆకాశంలోకి చూస్తూ నేనిలా అన్నాను: “దేవా, నువ్వున్నావని నాకు తెలుసు; అయితే ఈ మతాలేవీ నాకిష్టం లేదు. నీ దగ్గర ఒకే ఒక మంచి మతం ఉంది.”
దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నిజంగా నమ్ముతున్నాను ఎందుకంటే 1917లోని ఆ వేసవి కాలంలోనే ఇద్దరు బైబిలు విద్యార్థులు (యెహోవాసాక్షులను అప్పటిలో అలా పిలిచే వారు) మా గ్రామానికి వచ్చారు. వారు కల్పోర్టర్లు లేక పూర్తికాల సేవకులు బాప్టిస్టు చర్చిలో ఆరాధనా కార్యక్రమం జరుగుతుండగా వారు అందులోకి వచ్చారు.
రుమేనియాలో బైబిలు సత్యం విస్తరించింది
కొన్ని సంవత్సరాల క్రితం, అమెరికాలో బైబిలు విద్యార్థులుగా అయిన కారోల్ సాబో మరియు యోసిఫ్ కిస్ బైబిలు సత్యాలను పరిచయం చేసేందుకు 1911లో రుమేనియాకు వచ్చారు. వారు టర్గూమూరెస్లో నివాసం ఏర్పరచుకున్నారు, అది మా గ్రామానికి ఆగ్నేయాన దాదాపు 160 కిలోమీటర్ల దూరాన ఉంది. కొన్ని సంవత్సరాల్లోనే, అక్షరార్థంగా వందలాది మంది రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించి క్రైస్తవ పరిచర్యను చేపట్టారు.—మత్తయి 24:14.
అయితే, ఆ ఇద్దరు బైబిలు విద్యార్థులు మా ఆర్టలెక్ గ్రామంలోని బాప్టిస్టు చర్చికి వచ్చినప్పుడు, జార్డ్ రోమోషీన్ కేవలం 18 సంవత్సరాల వాడైనా ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు మరియు రోమీయులు 12:1 యొక్క భావాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తుదకు, ఒక యౌవన కల్పోర్టర్ లేచి నిలబడి ఇలా అడిగాడు: “సహోదరులారా, స్నేహితులారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?”
అది విన్నప్పుడు నేనెంతో ఆనందించాను! ‘బైబిలును ఎలా వివరించాలో వీళ్లకు తెలిసి ఉంటుంది’ అని నేను అనుకున్నాను. అయితే అక్కడున్న చాలామంది ఇలా అరిచారు: “అబద్ధ ప్రవక్తలు! మీరెవరో మాకు తెలుసు!” అక్కడో గొడవ మొదలైంది. అయితే జార్జి వాళ్ల నాన్న లేచి నిలబడి ఇలా చెప్పాడు: “మీరంతా నోళ్లు మూసుకోండి! ఇదేం పద్ధతి, త్రాగుబోతులలాగా చేస్తున్నారా? వీళ్లు మనకు ఏదైనా చెప్పాలనుకుంటుంటే, మీరు దాన్ని వినకూడదనుకుంటే నేను వాళ్లని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. ఇష్టమైన వాళ్లు ఎవరైనా సరే రావచ్చు.”
నేను ఆనందంగా ఇంటికెళ్లి, జరిగిన సంగతి అమ్మకు చెప్పాను. రోమోషీన్ వాళ్ల ఇంటికి వెళ్లిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. కాలుతున్న నరకం లేదని బైబిలునుండి తెలుసుకుని మరియు నా స్వంత రుమేనియన్ బైబిలులో దేవుని పేరు యెహోవా అని చూసి ఆ సాయంత్రం నేనెంత ఆనందించానో! మా అందరికీ బోధించేందుకు రోమోషీన్ వాళ్ల ఇంటికి ఒక బైబిలు విద్యార్థి వచ్చేలా ఆ కల్పోర్టర్ ఏర్పాట్లు చేశాడు. మరుసటి వేసవిలో నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యెహోవాకు చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాను.
కొంత కాలానికి, ప్రాముఖ్యంగా ప్రోడన్ కుటుంబీకులందరూ మరియు రోమోషీన్ కుటుంబం బైబిలు సత్యాలను అంగీకరించి తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నారు. మా గ్రామంలోని ఇతరులు అనేకులు అలా చేశారు, తమ ఇంటిని పూర్వం బాప్టిస్టు చర్చిలా వాడుకునేందుకు అనుమతించిన యౌవన దంపతులు కూడా వారిలో ఉన్నారు. తర్వాత వారు ఆ ఇంటిని బైబిలు విద్యార్థులు తమ అధ్యయనం కొరకు వాడుకునే స్థలంగా మార్చారు. లేఖన సత్యం చుట్టు ప్రక్కల గ్రామాల్లో త్వరితంగా వ్యాపించింది, మరి 1920 కల్లా రుమేనియాలో దాదాపు 1,800 మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు!
అమెరికాకు వెళ్లడం
మేము నేర్చుకున్న విషయాలను మా నాన్న పీటర్ ప్రోడన్కు చెప్పాలని మేమెంతో ఆతృత పడ్డాము. అయితే, ఆశ్చర్యకరంగా మేము ఉత్తరం వ్రాయడానికి ముందే, మాకు ఆయన నుండి ఉత్తరం వచ్చింది, ఆయన బాప్తిస్మం తీసుకుని యెహోవా సేవకుడు అయ్యాడని అందులో వ్రాశారు. ఒహాయోలోని అక్రాన్లో ఆయన బైబిలు విద్యార్థులతో పఠించారు, మేమందరం ఆయన వద్దకు అమెరికాకు రావాలని ఆయన కోరారు. అయితే అమ్మ రుమేనియా వదిలి వచ్చేందుకు నిరాకరించింది. కాబట్టి 1921లో నాన్న నాకు పంపిన డబ్బును వాడుకుని నేను అక్రాన్‌కు ఆయన వద్దకు చేరుకున్నాను. జార్జ్ రోమోషీన్, ఆయన అన్న గత సంవత్సరమే అమెరికాకు వలస వెళ్లారు.
నేను న్యూయార్క్‌లోని ఎల్లిస్ ద్వీపానికి చేరుకున్నప్పుడు, అవురేలియా అనే నా పేరును ఆంగ్లంలోకి ఎలా తర్జుమా చేయాలో అక్కడున్న వలస అధికారికి తెలియలేదు, అందుకని అతనిలా అన్నాడు: “నీ పేరు గోర్డీ.” అప్పటినుండి అదే నా పేరు అయ్యింది. దాని తర్వాత కొంత కాలానికే 1921 మేలో నాకు జార్జ్ రోమోషీన్కు వివాహమైంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత నాన్న రుమేనియాకు తిరిగి వెళ్లి 1925లో నా చెల్లి మేరీని అక్రాన్‌కు తీసుకొచ్చారు. అమ్మతోనూ మిగతా కుటుంబంతోపాటు కలిసి ఉండేందుకు నాన్న రుమేనియాకు తిరిగి వెళ్లారు.
అమెరికాలో మా తొలి పరిచర్య
జార్జ్ యెహోవా ఎడల ఎంతో యథార్థవంతుడైన భక్తిగల సేవకుడు. 1922 నుండి 1932 మధ్యలో మేము నలుగురు ముద్దు ముద్దు పాపలతో దీవించబడ్డాము, వాళ్లు ఎస్తర్, ఆన్, గోల్డీ ఎలిసబేత్ మరియు ఐరీన్లు. అక్రాన్లో ఒక రుమేనియన్ సంఘం ప్రారంభించబడింది, మొదట్లో కూటాలు మా ఇంట్లోనే జరిగేవి. తుదకు, ప్రతి ఆరు నెలలకు ఒకసారి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నందలి బైబిలు విద్యార్థుల ప్రపంచ ముఖ్య కార్యాలయం నుండి ఓ ప్రతినిధి మా సంఘాన్ని సందర్శించి మాతోపాటు ఉండేవారు.
అనేక ఆదివారాలు మేము దినమంతా ప్రకటనాపనిలో గడిపే వాళ్లం. మేము మా పుస్తకాల బ్యాగులనూ మధ్యాహ్న భోజనాన్ని తీసుకుని పాపలను మా మోడెల్ టి ఫోర్డ్ కారులో కూర్చోబెట్టి ఆ దినాన్నంతా పల్లె ప్రాంతాల్లో ప్రకటనాపని చేసేందుకు వెచ్చించే వాళ్లం. తర్వాత సాయంత్రం మేము కావలికోట పఠనానికి హాజరయ్యే వాళ్లం. మా పాపలు ప్రకటనాపనిని ఎంతో ఇష్టపడటం ప్రారంభించారు. యెహోవాసాక్షులు అనే తమ విశిష్టమైన పేరును బైబిలు విద్యార్థులు 1931లో స్వీకరించినప్పుడు నేను ఒహాయో కొలంబస్లోనే ఉన్నాను.
నాకు అవసరమైన గద్దింపు
కొన్ని సంవత్సరాల తర్వాత, వాచ్‌టవర్ సంస్థ యొక్క అప్పటి అధ్యక్షుడైన జోసఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ అంటే నాకు కోపం వచ్చింది. సహోదరుడు రూథర్‌ఫోర్డ్ తన సమస్యను ఓపికగా వినలేదని ఒక క్రొత్త సాక్షి భావించాడు. సహోదరుడు రూథర్ఫోర్డ్ది తప్పని నేను భావించాను. అయితే, ఒక ఆదివారం నా చెల్లి మేరీ ఆమె భర్త డాన్ పెస్ట్రూ మమ్మల్ని దర్శించేందుకు వచ్చారు. భోజనం చేసిన తర్వాత డాన్ ఇలా అన్నాడు: “మీటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధంకండి.”
“మేము ఇక ఆ మీటింగులకు రాము. బ్రదర్ రూథర్‌ఫోర్డ్ అంటే మాకు కోపంగా ఉంది” అని నేను అన్నాను.
డాన్ తన చేతులను వెనక్కి పెట్టుకుని ముందుకూ వెనక్కీ నడిచాడు, తర్వాత అతనిలా అన్నాడు: “మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీకు బ్రదర్ రూథర్‌ఫోర్డ్ తెలుసా?”
“అసలు తెలియదు,” నేను సమాధానమిచ్చా. “నేను రుమేనియాలో బాప్తిస్మం తీసుకున్నాను కదా.”
“మీరు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు?” అతనడిగాడు.
“యెహోవాయే సత్య దేవుడని నేను తెలుసుకున్నందుకు, నేను ఆయనకు నా జీవితాన్ని సమర్పించుకుని ఆయనకు సేవ చేయాలని అనుకున్నాను” అని నేను సమాధానమిచ్చాను.
“అదెన్నడూ మర్చిపోకండి!” అతను అన్నాడు. “బ్రదర్ రూథర్‌ఫోర్డ్ సత్యాన్ని వదిలేస్తే మీరూ సత్యాన్ని వదిలేస్తారా?”
“ఎన్నటికీ అలా చెయ్యం!” నేను అన్నాను. అది నా కళ్లు తెరిచింది, నేను ఇలా అన్నాను: “అందరూ మీటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధంకండి.” అప్పటినుండి మేము వెళ్లడం ఆపలేదు. నా మరిది అందించిన ప్రేమపూర్వక గద్దింపు విషయమై నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను!
ఆర్థిక మాంద్యం సమయంలో తట్టుకోవడం
1930లలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. ఒకరోజు జార్జ్ పని నుండి చాలా నిరుత్సాహంగా వచ్చాడు, తన రబ్బర్ ఫ్యాక్టరీలో తనకు ఇప్పుడు పని ఇవ్వరని నాకు చెప్పాడు. “చింతించకండి, మనకు సంపన్నుడైన తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆయన మనల్ని వదిలేయడు” అని నేను అన్నాను.
అదే రోజు జార్జ్ ఒక స్నేహితున్ని కలిశాడు, అతని వద్ద పెద్ద బుట్ట నిండా పుట్టగొడుగులు ఉన్నాయి. తన స్నేహితుడు వాటిని ఎక్కడినుండి ఏరుకొచ్చాడో తెలుసుకున్న తర్వాత జార్జ్ ఒక బూషెల్ (చాలా ఎక్కువ) నిండా పుట్టగొడుగులను తీసుకొచ్చాడు. తర్వాత, వాటిని ప్యాక్ చేసేందుకు చిన్న బుట్టలను కొనడానికి ఆయన మా వద్ద ఉన్న చివరి మూడు డాలర్లను ఖర్చు చేశాడు. “మన పిల్లలకు పాల డబ్బా కొనవలసి ఉండగా మీరు ఆ డబ్బును అలా ఖర్చు చేసేస్తారా?” అని నేను అన్నాను.
“ఏం ఫర్వాలేదు. నేను చెప్పినట్లు చెయ్యి” అని ఆయన సమాధానమిచ్చాడు. తర్వాతి కొన్ని వారాలు మా ఇంట్లో చిన్న కర్మాగారం వెలసింది, పుట్టగొడుగులను శుభ్రం చేస్తూ వాటిని ప్యాక్ చేసే వాళ్లం. మేము వాటిని మంచి హోటల్లకు అమ్మి ప్రతి దినం 30 నుండి 40 డాలర్లు తెచ్చుకునే వాళ్లం, మాకు అప్పట్లో అది గొప్ప సంపదే. తన పొలంలోనుండి పుట్టగొడుగులను ఏరుకునేందుకు మాకు అనుమతించిన వ్యవసాయదారుడు, తాను అక్కడ 25 సంవత్సరాల నుండీ జీవిస్తున్నాడని మరి అన్ని పుట్టగొడుగులను తాను ఎప్పుడూ చూడలేదనీ అన్నాడు. కొంత కాలానికే రబ్బరు ఫ్యాక్టరీ జార్జ్‌ను మళ్లీ పనికి పిలిచింది.
మా విశ్వాసాన్ని కాపాడుకోవడం
మేము 1943లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌కి మారిపోయాము, మరి నాలుగు సంవత్సరాల తర్వాత మేము ఎల్సినోర్‌లో స్థిరపడ్డాము. మేము ఒక కిరాణా దుకాణాన్ని తెరిచాము, మా కుటుంబ సభ్యులందరూ అందులో వంతుల వారీగా పని చేశారు. అప్పటిలో, ఎల్సినోర్ 2,000 మంది నివాసులున్న ఒక చిన్న పట్టణం. మా క్రైస్తవ కూటాల విషయమై మేము 30 కిలోమీటర్లు ప్రయాణించి మరో పట్టణానికి వెళ్లవలసి వచ్చేది. మరి 1950లో ఎల్సినోర్‌లో ఒక చిన్న సంఘం ఏర్పడినప్పుడు నేనెంతో ఆనందించాను! అదే ప్రాంతంలో ఇప్పుడు 13 సంఘాలున్నాయి.
మరి 1950లో మా కుమార్తె గోర్డీ ఎలిసబేత్ (ఆమె ఇప్పుడు చాలామందికి బెత్ అనే పేరుతోనే తెలుసు) న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్లోని వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌లో పట్టభద్రురాలైంది, మరి వెనిజ్యులాకు మిషనరీగా నియమించబడింది. 1955లో మా చిన్న కుమార్తె ఐరీన్ తన భర్త ప్రాంతీయ పనిలో ప్రయాణ సేవకునిగా సహాయం చేసేందుకు ఆహ్వానించబడినందుకు ఆనందించింది. తర్వాత 1961లో న్యూయార్క్ నందలి సౌత్ లాన్సింగ్లోని రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరైన తర్వాత వారు థాయిలాండ్‌కు పంపబడ్డారు. కొన్నిసార్లు నా కుమార్తెలు నాకు ఎంత జ్ఞాపకం వచ్చేవారంటే నేను ఏడ్చేదాన్ని, అయితే తర్వాత నేనిలా ఆలోచించేదాన్ని, ‘వాళ్లు ఆ పని చేయాలనేగా నేను కోరుకున్నది.’ కాబట్టి, నేను నా పుస్తకాల బ్యాగ్ తీసుకుని ప్రకటనాపనికి వెళ్లేదాన్ని. నేను ఎల్లప్పుడూ ఆనందంగా తిరిగి వచ్చేదాన్ని.
1966లో నా ప్రియమైన భర్త జార్జ్‌కు గుండెపోటు వచ్చింది. ఆరోగ్య సమస్యల మూలంగా వెనిజ్యులా నుండి తిరిగి వచ్చిన బెత్ ఆయన ఎడల శ్రద్ధ వహించేందుకు సహాయం చేసింది. మరుసటి సంవత్సరం జార్జ్ మరణించాడు, ఆయన యెహోవా ఎడల నమ్మకంగా ఉన్నాడని మరి తన పరలోక బహుమానాన్ని అందుకున్నాడనే వాస్తవాన్నిబట్టి నేను ఆదరణను పొందాను. తర్వాత బెత్ రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవ చేసేందుకు స్పెయిన్‌కు వెళ్లింది. నా పెద్ద కుమార్తె ఎస్తర్ క్యాన్సర్ వలన అస్వస్థురాలై 1977లో మరణించింది, మరి 1984లో లుకేమియా మూలంగా ఆన్ మరణించింది. వీరిద్దరూ తమ జీవితమంతటిలో యెహోవాకు నమ్మకంగా సేవ చేశారు.
ఆన్ మరణం సమయానికల్లా, బెత్ మరియు ఐరీన్లు తమ విదేశీ ప్రకటనానియామకం నుండి తిరిగి వచ్చారు. వాళ్లు తమ సహోదరీల ఎడల శ్రద్ధ వహించేందుకు సహాయం చేశారు, మేమందరం ఎంతో దుఃఖించాము. కొంత కాలం తర్వాత నేను నా అమ్మాయిలకు ఇలా చెప్పాను: “సరే, ఇక చాలు! అమూల్యమైన బైబిలు సత్యాల ద్వారా మనం ఇతరులకు ఆదరణనిచ్చాము. ఇప్పుడు మనకు మనం ఆదరణనిచ్చుకోవాలి. యెహోవాను సేవించడంలోని మన ఆనందాన్ని సాతాను దోచుకోవాలని ప్రయత్నిస్తాడు, అయితే మనం అతన్ని అందుకు అనుమతించకూడదు.”
రుమేనియాలోని మా నమ్మకమైన కుటుంబం
నా చెల్లి మేరీ నేనూ కలిసి 1970లో రుమేనియాలోని మా కుటుంబాన్ని చూసేందుకు ఆ మరువలేని ప్రయాణాన్ని సాగించాము. మా చెల్లెళ్లలో ఒకరు మరణించింది, అయితే ఆర్టలెక్ గ్రామంలోనే ఇంకా ఉంటున్న మా తమ్ముడు జాన్‌ను మా చెల్లి లొడొవికాను దర్శించగలిగాము. మేము దర్శించే సమయానికల్లా మా అమ్మానాన్నలు యెహోవాకు నమ్మకంగా ఉండి మరణించారు. సంఘంలో నాన్న ఒక స్తంభంగా ఉండేవాడని అక్కడివారు అనేకులు మాకు చెప్పారు. ఆయన ముని మనవళ్లలో కొందరు ఇప్పుడు రుమేనియాలో సాక్షులుగా ఉన్నారు. బైబిలు సత్యంలో నిలుకడగా నిలిచిన వారైన నా భర్త బంధువుల్లో కొందరిని కూడా మేము సందర్శించగలిగాము.
మరి 1970లో రుమేనియా న్యీకలై చౌచెస్క్యూ యొక్క క్రూరమైన కమ్యూనిస్ట్ పరిపాలన క్రింద ఉంది మరి యెహోవాసాక్షులు విపరీతంగా హింసించబడుతున్నారు. నా తమ్ముని కుమారుడు ఫ్లోర్ మరియు నా ఇతర బంధువులు తమ క్రైస్తవ విశ్వాసం మూలంగా నిర్భంద శిబిరాల్లో అనేక సంవత్సరాలు గడిపారు, నా భర్త మేనమామ కుమారుడైన గాబోర్ రోమోషీన్ కూడా అలాగే అనుభవించాడు. న్యూయార్క్‌లోని యెహోవాసాక్షుల ముఖ్య కార్యాలయానికి ఉత్తరాలను ఇవ్వమని రుమేనియాలోని సహోదరులు మాకు వాటిని ఇచ్చినప్పుడు మేము క్షేమంగా దేశం దాటి వెళ్లామని వారికి వార్త వెళ్లేంత వరకూ మేము హాయిగా ఊపిరి పీల్చుకోలేమని వారు అనడంలో ఆశ్చర్యం లేదు!
మా వీసాల గడువు తీరిపోయిందని మేము గుర్తించినప్పుడు మేము ఆర్టలెక్లోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాము. అది శుక్రవారం మధ్యాహ్నం, అక్కడ ఒక అధికారి మాత్రమే డ్యూటీలో ఉన్నాడు. మేము ఎవరిని దర్శించేందుకు రుమేనియాకు వచ్చామో అనే విషయాన్నీ మా మేనల్లుడు నిర్భంద శిబిరాల్లో కొంత కాలం ఉన్నాడనే విషయాన్నీ తెలుసుకున్న తర్వాత అతనిలా అన్నాడు: “ఏమండీ, మీరు వెంటనే ఇక్కడనుండి వెళ్లిపోండి!”
“కానీ ఈ రోజు ఏ రైలూ వెళ్లడం లేదు” అని నా చెల్లి సమాధానమిచ్చింది.
“అదేం ఫర్వాలేదు, ఓ బస్సో, రైలో, టాక్సీనో తీసుకోండి. లేకపోతే నడిచి వెళ్లండి. మీకు వీలైనంత త్వరగా ఇక్కడినుండి వెళ్లిపోండి!” అని అతను త్వరగా అన్నాడు.
మేము బయల్దేరుతుండగా ఒక అనియమిత సైనిక రైలు సాయంత్రం ఆరు గంటలకు వెళ్తుందని మాకు చెప్పారు. అదెంతో గొప్ప ఏర్పాటుగా తోచింది మాకు! క్రమమైన రైలులో అయితే మా కాగితాలను పదే పదే చూడటం జరుగుతుంది, అయితే ఈ రైలు మిలిటరీ వాళ్లను తీసుకెళ్తుంది గనుక మరియు మేమిద్దరమే పౌర ప్రయాణికులం గనుక మా పాస్‌పోర్టులను చూస్తామని ఎవరూ అనలేదు. మేము అధికారుల అమ్మమ్మలమని వారు అనుకుని ఉంటారు.
మరుసటి ఉదయం మేము టిమిసోవారాకు చేరుకున్నాము, ఒక బంధువు యొక్క స్నేహితుని సహాయంతో వీసాలు పొందగలిగాము. మరసటి రోజు మేము దేశం వెలుపల ఉన్నాము. మేము మాతోపాటు రుమేనియాలోని నమ్మకమైన క్రైస్తవ సహోదర సహోదరీల ఆనందకరమైన మరియు మర్చిపోలేని జ్ఞాపకాలను తెచ్చుకున్నాము.
మేము రుమేనియాను దర్శించిన తర్వాతి సంవత్సరాల్లో ఉక్కు తెర వెనుక ఉన్న వారి ప్రకటనా కార్యకలాపాలను గురించి మేము విన్నది అంతంత మాత్రమే. అయినప్పటికీ, ఏమి సంభవించినప్పటికీ మన క్రైస్తవ సహోదర సహోదరీలు మన దేవునికి నమ్మకంగా ఉంటారనే విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాము. వారు నిజంగానే అలా ఉన్నారు! మరి 1990లో రుమేనియాలోని యెహోవాసాక్షులు మత సంబంధమైన సంస్థగా చట్టబద్ధంగా గుర్తింపబడ్డారనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతటి ఆనందకరమైన విషయం! రుమేనియాలో జరుపబడిన సమావేశాన్ని గురించి విని మరుసటి సంవత్సరం మేమెంతో ఆనందించాము. అంతెందుకు, ఎనిమిది పట్టణాల్లో 34,000 మంది హాజరయ్యారు, 2,260 మంది బాప్తిస్మం తీసుకున్నారు! ఇప్పుడు రుమేనియాలో 35,000 కంటే ఎక్కువమంది ప్రకటనాపనిలో భాగంవహిస్తున్నారు, గత సంవత్సరం 86,034 మంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి హాజరయ్యారు.
సత్యం నాకింకా ప్రశస్తమయినదే
కొన్ని సంవత్సరాలు నేను జ్ఞాపకార్థ దిన చిహ్నాలను తీసుకోవడం మానేశాను. ఎంతో యోగ్యులైన సహోదరులు వాటిని తీసుకోకపోవడాన్ని నేను గమనించాను, నేనిలా తర్కించుకున్నాను: ‘ఇతరులు అంత గొప్ప ప్రసంగీకులుగా ఉన్నప్పుడు తన కుమారునితో పరలోకంలో సహ భాగస్వామిగా ఉండే ఆధిక్యతను యెహోవా నాకు మాత్రమే ఎందుకిస్తాడు?’ అయితే నేను తీసుకోనప్పుడు ఎంతో కలత చెందినట్లు భావించాను. నేను దేనినో నిరాకరిస్తున్నట్లు నాకు అనిపించింది. ఎంతో అధ్యయనం మరియు ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపన తర్వాత నేను మళ్లీ తీసుకోవడం ప్రారంభించాను. నా ఆనందం, సంతోషం నాకు మళ్లీ లభించాయి, అవి నన్నెప్పుడూ వదలి పోలేదు.
చదివేందుకు నాకు ఇప్పుడు కంటి చూపు సరిగ్గా లేకపోయినప్పటికీ, నేను ప్రతిరోజు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల టేపులను వింటాను. నేను ప్రకటనాపనిలో కూడా భాగం వహిస్తున్నాను. నేను ప్రతి నెల 60 నుండి 100 పత్రికలను అందిస్తాను, అయితే గత ఏప్రిల్ నెలలో తేజరిల్లు! సంచికలతో ప్రత్యేక క్యాంపేను నిర్వహించబడిన సమయంలో నేను 323 పత్రికలను అందించాను. నా కుమార్తెల సహాయంతో నేను దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో భాగం వహించగలుగుతున్నాను. నేను ఇతరులను ప్రోత్సహించడంలో కొనసాగగలుగుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. రాజ్య మందిరంలోని దాదాపు అందరూ నన్ను అమ్మమ్మా అని పిలుస్తారు.
యెహోవాకు సమర్పించుకున్న గత 79 సంవత్సరాలను చూస్తూ, తన ప్రశస్తమైన సత్యాలను తెలుసుకునేందుకూ తన సేవలో నా జీవితాన్ని ఉపయోగించేందుకూ నాకు వీలు కలిగించినందుకు నేను ఆయనకు ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ అంత్య దినాల్లో దేవుని గొర్రెవంటి వారిని సమకూర్చే పని యొక్క అద్భుతమైన బైబిలు ప్రవచనాల నెరవేర్పును చూసేందుకు నేను ఇంకా బ్రతికి ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని.—యెషయా 60:22; జెకర్యా 8:23.
[23వ పేజీలోని చిత్రం]
నా చెల్లి మేరీ, నాన్న నిలబడి ఉన్నారు, నేను జార్జ్ మా కుమార్తెలు ఎస్తర్ మరియు ఆన్
[24వ పేజీలోని చిత్రం]
నా కుమార్తెలు బెత్ మరియు ఐరీన్ ఆమెతో ఆమె భర్త, వాళ్ల ఇద్దరు కొడుకులు, వాళ్లు కూడా నమ్మకంగా యెహోవాను సేవిస్తున్నారు