రాజ్య ప్రచారకుల నివేదిక
అన్ని సందర్భాల్లోనూ రాజ్యసువార్తను వ్యాపింపజేయడం
దేవుని వాక్యమైన బైబిలు కష్టించి పని చేయడాన్ని ప్రోత్సహిస్తోంది. రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.”—ప్రసంగి 11:6.
సముచితమైన ప్రతి సందర్భంలోనూ యెహోవాసాక్షులు దేవుని రాజ్యసువార్తను ప్రకటించడం ద్వారా “విత్తనమును” విత్తుతారు. 230 కంటే ఎక్కువ దేశాల్లోనూ ద్వీపాల్లోనూ వారు “మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించ”డంలో కొనసాగుతున్నారు. (అపొస్తలుల కార్యములు 5:42) యెహోవాసాక్షులు ప్రకటనాపనిలో ‘తమ చేయి వెనుక తియ్యక’ ఎలా పని చేస్తున్నారో ఈ క్రింది అనుభవాలు ఉదాహరిస్తున్నాయి.
◻ కేప్ వర్డే రిపబ్లిక్‌లోని ఒక యెహోవాసాక్షి ప్రాంతీయ పరిచర్య చేస్తూ ఒక చెరసాల ప్రక్కనుండి నడిచి వెళ్తున్నది. చెరసాల ఆవరణలో, కొంతమంది ఖైదీలు ఒక చెట్టుపై కూర్చుని ఉన్నారు. క్రింద వెళ్తున్న సాక్షిని గమనించి, కొన్ని పత్రికలు కావాలని వారు గట్టిగా అరిచి చెప్పారు. ఆ సాక్షి కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల అనేక ప్రతులను ఒక రాయికి కట్టి చెరసాల గోడ మీదగా అవతలి వైపుకి విసిరింది. మొదట్లో చూపించిన ఈ ఆసక్తి మూలంగా 12 బైబిలు పఠనాలు ప్రారంభించబడ్డాయి. ఆ ఖైదీల్లో ముగ్గురు తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని, నీటి బాప్తిస్మం తీసుకున్నారు. ఆ ఖైదీల్లో ఒకరు ఒక సంవత్సరంపైనుండే పూర్తికాల ప్రచారకునిగా లేక పయినీర్‌గా సేవ చేస్తున్నాడు. అయితే వాళ్లు చెరసాలలో ప్రాంతీయ సేవా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? మొదట చెరసాలను ప్రాంతాలుగా విభజించడం జరిగింది. తర్వాత ఆ ప్రాంతం ముగ్గురు సాక్షులకు పంచి ఇవ్వబడింది, వారు జైలులోని గది గదికీ ప్రకటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యెహోవాసాక్షులు చేస్తున్న రీతిగానే పునర్దర్శనాలను చేయడం ద్వారా ఆసక్తి కనపర్చిన వారి వద్దకు ఈ రాజ్య ప్రచారకులు తిరిగి వెళ్తున్నారు. ఉన్న వ్యత్యాసమల్లా బైబిలు పఠనాలను తరచుగా నిర్వహించడమే. వారానికి ఒకటిరెండుసార్లు చొప్పున ఓ గంటో లేక అంతకన్నా ఎక్కువసేపో పఠించడానికి బదులు, కొంతమంది ఖైదీలు ప్రతీరోజూ పఠించారు! అంతే కాకుండా, సాక్షులు తమ కూటాలన్నిటినీ చెరసాలలోనే జరుపుకునేందుకు చెరసాల జనరల్ డైరెక్టర్ అనుమతినిచ్చాడు.
◻ పోర్చుగల్‌లోని ఒక స్త్రీ తన అమ్మమ్మ మరణం తర్వాత వాచ్‌టవర్ ప్రచురణలను వారసత్వంగా పొందింది. ఆమె యెహోవాసాక్షి కాదు ఆ పుస్తకాలను తన దగ్గిర ఉంచుకోవడానికి ఆసక్తి చూపలేదు. అయినా, ఆమె వాటిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఒకరోజు ఇంటింటి పరిచర్య పని చేస్తున్నప్పుడు తనను దర్శించడానికి వచ్చిన ఒక యెహోవాసాక్షికి తన గ్రంథాలయాన్ని గురించి ఆమె చెప్పింది. ఆ గ్రంథాలయానికున్న అసలైన విలువ ఏమిటో మీకు తెలుసా అని ఆ సాక్షి ఆమెను అడిగింది. ఆ స్త్రీ ఇలా సమాధానమిచ్చింది: “వాస్తవానికి, నాకు వాటి విలువను గురించి బొత్తిగా తెలియదు, అయినా దాన్ని నేను ఎలా తెలుసుకోగలను?” ఆ స్త్రీ బైబిలు పఠనాన్ని అంగీకరించింది, త్వరలోనే ఆమె తన అమ్మమ్మ గ్రంథాలయాన్ని ఒక సంపదగా పరిగణించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె కూడా బాప్తిస్మం తీసుకున్న ఒక యెహోవాసాక్షి. అంతే కాకుండా, ఆమె కుమార్తె, ఆ కుటుంబ శ్రేయోభిలాషియైన ఓ స్నేహితురాలూ బైబిలు పఠిస్తున్నారు. ఈ పుస్తకాల సేకరణ ఎంత అమూల్యమైన సంపదయని నిరూపించుకుందో కదా!