కేవలం అద్భుతాలే విశ్వాసాన్ని పెంపొందించవెందుకని
చూసినది నమ్ముతాం. అనేకుల దృష్టికోణమది. దేవుడు అద్భుతమైన విధంగా తనను బయలుపరచుకుంటే ఆయనను నమ్ముతాం అని కొందరు అంటారు. నిజమేనేమో, అలాగైతేనే వాళ్ళు నమ్ముతారేమో, కానీ అలాంటి నమ్మకం యథార్థమైన విశ్వాసానికి నడుపుతుందా?
ఇశ్రాయేలీయులైన కోరహు, దాతాను, అబీరాముల విషయాన్నే పరిశీలించండి. ఐగుప్తు మీదకు వచ్చిన పది తెగుళ్ళూ, ఎర్ర సముద్రం గుండా ఇశ్రాయేలు జనాంగం తప్పించుకోవడం, ఐగుప్తీయుడైన ఫరో మరియు అతని సైనిక దళం నిర్మూలం చేయబడడం వంటి, దేవుడు చేసిన సంభ్రమాశ్చర్యాలను కలిగించే అద్భుత కార్యాలకు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులని బైబిలు చూపిస్తుంది. (నిర్గమకాండము 7:19-11:10; 12:29-32; కీర్తన 136:15) సీనాయి కొండ దగ్గర, యెహోవా పరలోకం నుండి మాట్లాడడం కోరహు, దాతాను, అబీరాములు కూడా విన్నారు. (ద్వితీయోపదేశకాండము 4:11, 12) అయితే, ఈ అద్భుతాలు జరిగి ఎంతో కాలం కాకముందే, ఆ ముగ్గురు వ్యక్తులు యెహోవాకు వ్యతిరేకంగా, ఆయన అభిషిక్త సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటును పురికొల్పారు.—సంఖ్యాకాండము 16:1-35; కీర్తన 106:16-18.
దాదాపు 40 సంవత్సరాల తర్వాత, బిలాము అనే పేరుగల ఒక ప్రవక్త కూడా ఒక అద్భుతాన్ని కళ్ళారా చూశాడు. అతడు దేవుని శత్రువులైన మోయాబీయుల పక్షం చేరడాన్ని దూత జోక్యంచేసుకోవడం కూడా ఆపలేదు. అలాంటి అద్భుతం జరిగాక కూడా బిలాము వెళ్ళి యెహోవా దేవునికి, ఆయన ప్రజలకు వ్యతిరేకమైన స్థానాన్ని వహించాడు. (సంఖ్యాకాండము 22:1-35; 2 పేతురు 2:15, 16) అయితే ఇస్కరియోతు యూదాను పోల్చితే బిలాము విశ్వాసరాహిత్యము పెద్ద విషయమేమీ కాదు. యూదా యేసు సన్నిహిత సహచరుడైయుండీ కూడా, అసాధారణమైన అనేక అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షియైయుండీ కూడా, ముప్పై వెండి నాణాల కొరకు క్రీస్తును శత్రువులకు అప్పగించాడు.—మత్తయి 26:14-16, 47-50; 27:3-5.
యూదా మత నాయకులు కూడా యేసు చేసిన అనేక అద్భుతాలను ఎరిగినవారే. ఆయన లాజరును పునరుత్థానం చేసిన తర్వాత, “ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే” అని వారు ఒప్పుకున్నారు కూడా. సజీవుడైన లాజరును చూడడం వారి కఠిన హృదయాలను మార్చిందా, వారికి విశ్వాసాన్ని కలిగించిందా? లేదు, నిజానికి అలా జరగలేదు. బదులుగా, వారు యేసునూ లాజరునూ ఇరువురినీ చంపడానికి పథకం వేశారు!—యోహాను 11:47-53; 12:10.
దేవుడు నేరుగా జోక్యం చేసుకున్నప్పడు కూడా ఆ దుష్టులలో విశ్వాసం కలుగలేదు. ఒక సందర్భంలో, యేసు ఆలయ ఆవరణలో ఉన్నప్పుడు, “తండ్రీ, నీ నామము మహిమపరచుమని” బిగ్గరగా ప్రార్థించాడు. “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును” అని యెహోవా బదులిచ్చిన స్వరము పరలోకమునుండి వినబడింది. అయినప్పటికీ ఆ అద్భుతమైన సంఘటన అక్కడున్నవారి హృదయాల్లో విశ్వాసాన్ని కలిగించలేదు. “ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి” అని బైబిలు చెబుతుంది.—యోహాను 12:28-30, 37; ఎఫెసీయులు 3:17 పోల్చండి.
అద్భుతాలు విశ్వాసాన్ని పెంపొందించలేదెందుకని
అద్భుతాలు జరిగినప్పటికీ అవిశ్వాసం అలా ఎలా ఉంటుంది? యేసు తన పరిచర్యను ఆరంభించిన అదే సమయంలోనే యూదులు అందరూ కూడా ‘క్రీస్తు’ను “కనిపెట్టుచు” ఉండిరన్న విషయాన్ని మీరు తలపోస్తున్నప్పుడు యూదా మతనాయకులు యేసును ఎలా తిరస్కరించారు అన్నది ముఖ్యంగా మీకు అర్థంకాని విషయంగా అనిపించవచ్చు. (లూకా 3:15) అయితే, వారు దేనిని కనిపెడుతూ ఉండేవారన్నదానిలోనే ఉంది సమస్య. తమకు “లౌకిక విజయాన్ని” మరియు “సిరిసంపదలను” ఇచ్చే మెస్సీయాను గూర్చిన తలంపుతో యూదులు భ్రమపడ్డారు అని పేరుగాంచిన ఒక బైబిలు విద్వాంసుడు చెప్పిన విషయాన్ని లెక్సికోగ్రాఫర్ డబ్ల్యు. ఇ. వైన్ ఉదాహరిస్తున్నాడు. కనుక, సా.శ. 29లో తమ మధ్య నిజమైన మెస్సీయగా ప్రత్యక్షమైన నమ్రతగల, రాజకీయాలతో సంబంధంలేని నజరేయుడైన యేసు కొరకు వారు సిద్ధపడలేదు. యేసు బోధల వల్ల అప్పటి సాంఘిక పరిస్థితులు తారుమారవుతాయేమోనని తమ ప్రముఖ స్థానాలు ప్రమాదంలో పడతాయేమోనని కూడా మత నాయకులు భయపడ్డారు. (యోహాను 11:48) వారు ముందుగా ఊహించుకున్న తలంపులూ మరియు వారి స్వార్థమూ యేసు చేసిన అద్భుతాల అర్థం విషయంలో వారిని గ్రుడ్డివారిగా చేశాయి.
తరువాత యేసు అనుచరులు దైవిక శక్తిని పొందారన్న విషయాన్ని గూర్చిన అద్భుతమైన రుజువును యూదా మత నాయకులు మరితరులు తిరస్కరించారు. ఉదాహరణకు, ఆయన అపొస్తలులు పుట్టు కుంటివానిని స్వస్థపరచినప్పుడు, కోపోద్రేకం చెందిన యూదా మహా సభలోనివారు “ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.” (అపొస్తలుల కార్యములు 3:1-8; 4:13-17) స్పష్టంగా, ఈ అద్భుత కార్యం ఆ మనుష్యుల హృదయాల్లో విశ్వాసాన్ని బలపరచనూ లేదు లేదా విశ్వాసాన్ని కలిగించనూ లేదు.
ఉన్నతస్థితి కొరకైన కాంక్ష, గర్వం, అత్యాశ అనే కారకాలు అనేకులు తమ హృదయ వాకిళ్ళను మూసుకునేందుకు పురికొల్పాయి. మొదట పేర్కొనబడిన కోరహు, దాతాను, మరియు అబీరాముల విషయంలోను అలాగే కనిపిస్తుంది. అసూయ, భయం, గాయపరిచే ఇతర దృక్పథాలనేకం ఇతరులకు ఆటంకం కలిగించాయి. దేవుని ముఖాన్ని చూసే ఆధిక్యతను ఒకప్పుడు కలిగిన అవిధేయులైన దూతలను గూర్చి, అంటే, అదే ఆ దయ్యాలను గూర్చి కూడా మనకు గుర్తు చేయబడింది. (మత్తయి 18:10) వారు దేవుని ఉనికిని సందేహించరు. నిజానికి, “దయ్యములును నమ్మి వణకుచున్నవి.” (యాకోబు 2:19) అయినా, వాళ్ళకు దేవునియందు విశ్వాసం లేదు.
నిజమైన విశ్వాసానికి అర్థం
విశ్వాసం నమ్మకం కంటే ఎంతో మించినది. ఇది ఏదో అద్భుతాన్ని చూసినప్పుడు కలిగే తాత్కాలిక ఉద్వేగపు ప్రతిచర్య కన్నా కూడా ఎంతో మించినది. “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది” అని హెబ్రీయులు 11:1 చెబుతుంది. విశ్వాసమున్న వ్యక్తి యెహోవా దేవుడు వాగ్దానం చేసిన ప్రతిదీ నెరవేరినదన్నట్లుగా తన హృదయమందు ఒప్పించబడతాడు. అంతేగాక, చూడని వాస్తవాలను గూర్చిన నిరాకరించలేని రుజువు అనేది ఎంతో శక్తివంతమైనదనీ, విశ్వాసమూ అలాంటి నిరాకరించలేని రుజువుకు సమానమనీ చెప్పబడుతుంది. అవును, విశ్వాసమన్నది రుజువుపై ఆధారపడినదే. మరి గత కాలాల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో గానీ లేదా బలపరచడంలో గానీ అద్భుతాలు తమ పాత్రను నిర్వహించాయి. యేసు చేసిన సూచకక్రియలు ఆయన వాగ్దత్త మెస్సీయ అని ఇతరులను ఒప్పించేందుకు తోడ్పడ్డాయి. (మత్తయి 8:16, 17; హెబ్రీయులు 2:2-4) అలాగే, అద్భుతంగా స్వస్థపరచడం, అన్యభాషల్లో మాట్లాడడం వంటి దేవుని పరిశుద్ధాత్మ లేదా చురుకైన శక్తి అనుగ్రహించే వరాలు యూదులకు యెహోవా అనుగ్రహం ఇక ఏ మాత్రం లేదనీ, ఆయన అంగీకారం ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు స్థాపించిన క్రైస్తవ సంఘం మీదే ఉందనీ రుజువు చేశాయి.—1 కొరింథీయులు 12:7-11.
ఆత్మ అనుగ్రహించే అద్భుతమైన వరాల్లో ఒకటి ప్రవచించే సామర్థ్యం. అవిశ్వాసులు ఈ అద్భుతాన్ని చూసినప్పుడు, వారిలో కొందరు “దేవుడు నిజముగా మీలో ఉన్నాడని” ప్రకటిస్తూ యెహోవాను ఆరాధించేందుకు పురికొల్పబడ్డారు. (1 కొరింథీయులు 14:22-25) అయినప్పటికీ, అద్భుతాలు క్రైస్తవ ఆరాధనలో శాశ్వతంగా ప్రధాన భాగమై ఉండాలని యెహోవా దేవుడు ఉద్దేశించలేదు. దానికి పొందికగా, “ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 13:8) ఈ వరాలు అపొస్తలుల మరణంతో అపొస్తలుల ద్వారా అలాంటి వరాలను పొందినవారి మరణంతో నిలిచిపోయాయని ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
అయితే ప్రజలు విశ్వాసానికి ఆధారం లేకుండా విడిచిపెట్టబడ్డారా? లేదు, కనుకనే, “[దేవుడు] ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని” పౌలు వ్రాశాడు. (అపొస్తలుల కార్యములు 14:17) నిజంగా, మన చుట్టూ ఉన్న రుజువుల వైపుకు తమ మనస్సులను హృదయాలను తెరవడానికి సిద్ధంగా ఉన్న యథార్థహృదయులకు యెహోవా దేవుని “నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు [దేవునిని నిరాకరించే వారు] నిరుత్తరులై యున్నారు.”—రోమీయులు 1:20.
దేవుని ఉనికిని గూర్చి నమ్మడం మాత్రమే సరిపోదు. “ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని పౌలు ఉద్బోధించాడు. (రోమీయులు 12:2) ఈ పత్రికలాంటి క్రైస్తవ ప్రచురణల సహాయంతో లేఖనాలను శ్రద్ధగా పఠించడం ద్వారా దానిని చేయవచ్చు. దేవుని వాక్యమైన బైబిలును గూర్చిన కచ్చితమైన జ్ఞానంపై ఆధారపడిన విశ్వాసం బలహీనమైనది కాదు, లేదా పైపైది కాదు. దేవుని చిత్తాన్ని గ్రహించి, దానిని విశ్వాసంతో చేసేవారు దేవునికి పరిశుద్ధ యాగమును చేస్తున్నారు.—రోమీయులు 12:1.
చూడకపోయినా నమ్మడం
చనిపోయిన యేసు పునరుత్థానమయ్యాడని విశ్వసించడం అపొస్తలుడైన తోమాకు కష్టమయ్యింది. “నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని” తోమా ఖండితంగా చెప్పాడు. తర్వాత యేసు శరీరాన్ని దాల్చి కొయ్యపై వ్రేలాడబడినప్పటి గాయాలను చూపించినప్పుడు ఆయన చేసిన ఆ అద్భుతానికి తోమా అనుకూలంగా ప్రతిస్పందించాడు. అయితే, “చూడక నమ్మినవారు ధన్యులని” యేసు అన్నాడు.—యోహాను 20:25-29.
నేడు లక్షలాది మంది యెహోవాసాక్షులు “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచు” ఉన్నారు. (2 కొరింథీయులు 5:6) బైబిలులో వ్రాయబడిన అద్భుతాలను వారు చూడకపోయినప్పటికీ, అవి జరిగాయని వారు గట్టిగా నమ్ముతారు. సాక్షులు దేవునిమీద ఆయన వాక్యం మీద విశ్వాసముంచుతారు. ఆయన ఆత్మ సహాయంతో వారు బైబిలు బోధలనూ, దాని ముఖ్యమైన అంశాన్నీ, అంటే యెహోవా దేవుని పరలోక రాజ్యం ద్వారా ఆయన సర్వాధిపత్యం నిరూపించబడుతుందనే విషయాన్ని గ్రహించగలుగుతున్నారు. (మత్తయి 6:9, 10; 2 తిమోతి 3:16, 17) ఈ యథార్థ క్రైస్తవులు బైబిలులోని జ్ఞానపూర్వకమైన ఉపదేశాన్ని తమ జీవితంలో అన్వయించుకుంటూ వ్యక్తిగతంగా గొప్ప ప్రయోజనాలను పొందుతారు. (కీర్తన 119:105; యెషయా 48:17, 18) మన దినములు “అంత్య దినముల”ని బైబిలు ప్రవచనాలు సూచిస్తున్నాయనడానికి గల ఖండించలేని రుజువును వారు అంగీకరిస్తారు, మరియు దేవుని వాగ్దత్త క్రొత్త లోకం సమీపంలోనే ఉందని వారికి నమ్మకమూ ఉంది. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-14; 2 పేతురు 3:13) దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడమన్నది వారికి ఆనందదాయకమైన విషయం. (సామెతలు 2:1-5) దేవుడ్ని అన్వేషించేవారు లేఖనాలను పఠించడం ద్వారా మాత్రమే ఆయనను కనుగొనగలరని వారికి తెలుసు.—అపొస్తలుల కార్యములు 17:26, 27.
ముందటి శీర్షికలో పేర్కొనబడిన ఆల్బర్ట్ మీకు జ్ఞాపకమున్నాడా? అద్భుతం కోసం ఆయన చేసిన ప్రార్థనకు జవాబు లభించకుండానే కొన్ని రోజులు గడిచిన తర్వాత, వయస్సులో పెద్దామె అయిన ఒక యెహోవాసాక్షి ఆయనను సందర్శించి, బైబిలుపై ఆధారపడిన సాహిత్యాన్ని ఆయనకు ఇచ్చి వెళ్లింది. ఆ తర్వాత, ఆల్బర్ట్ ఉచిత గృహ బైబిలు పఠనాన్ని అంగీకరించాడు. బైబిలు సందేశంతో ఆయనకు మంచి పరిచయం అవుతున్న కొలది, ఆయన నిరాశ కాస్తా ఉత్తేజంగా మారింది. తను అనుకున్న దానికి భిన్నమైన రీతిలో తాను దేవునిని కనుగొన్నాడని ఆయన తెలుసుకోనారంభించాడు.
“యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి” అని లేఖనాలు ఉద్బోధిస్తున్నాయి. (యెషయా 55:6) ఆధునిక కాలంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడని వేచి ఉండడం ద్వారా కాదు కానీ, ఆయన వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించడం ద్వారానే మీరు అలా చేయవచ్చు. కేవలం అద్భుతాలే విశ్వాసాన్ని బలపర్చలేవు గనుక ఇది అత్యవసరం.
[5వ పేజీలోని చిత్రం]
లాజరు అద్భుతమైన రీతిలో పునరుత్థానమవ్వడం కూడా విశ్వాసముంచేందుకు యేసు శత్రువులను పురికొల్పలేదు
[7వ పేజీలోని చిత్రం]
విశ్వాసం బైబిలును గూర్చిన కచ్చితమైన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది