“మీరు ప్రభావితం చేసిన అనేక జీవితాల్లో కేవలం ఒక్కటి మాత్రమే”
1996 జనవరిలో కరల్ బ్రెయిన్ ట్యూమర్‌తో అనారోగ్యంగా ఉండింది. ఆమె తన 60వ పడిలో ఉండింది, అప్పటి వరకూ ఆమె ఎల్లప్పుడూ సంతోషంగాను, అందరికీ ప్రోత్సాహకరంగాను ఉండే ఆరోగ్యవంతురాలైన స్త్రీ. కాని అప్పుడు డాక్టర్లు ఆ ప్రాణాంతకమైన ట్యూమర్ పెరుగుదలను అధిగమించాలని ప్రయత్నించారు. నొప్పితో కరల్ పెనుగులాడుతుండగా ఈ క్రింది ఉత్తరం ఆమెకు అందింది:
“ప్రియమైన కరల్:
“మీ అనారోగ్యాన్ని బట్టి నేను చాలా విచారిస్తున్నాను. సంతోషకరమైన విషయమేమిటంటే, మనకు నిజమైన నిరీక్షణ ఉంది, మనం దానిని తెలుసుకునేందుకు, దానియందు ఆనందించేందుకు బైబిలు మనకు సహాయపడుతుంది. ఈ నిరీక్షణ యెహోవా రాజ్యం భూమిపై పరిపాలన చేసేటప్పుడు మనం పరదైసు పరిస్థితిలో నివసించగలిగే సమయం కొరకు మనమందరం ఎదురుచూస్తున్న నిరీక్షణే.
“వ్యక్తిగతంగా మీరు చేసిన ప్రకటనా పని చాలా మందిని నిత్య మరణం నుండి రక్షించిందని మీకు తెలపాలనుకుంటున్నాను. ఈ చాలా మందిలో నేనొకడ్ని. మనం మొదట కలిసినప్పటి విషయం మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు నాకు 20 ఏండ్లు. నాకు పొడవైన జుట్టు ఉండేది, నేను మత్తుమందులను అమ్మేవాడ్ని, నేను ఆకతాయి గుంపుతో సమయం గడిపేవాడ్ని. మేమందరం తుపాకులు పట్టుకుని తిరిగేవాళ్ళం, మేము మమ్మల్ని తప్ప మరెవర్నీ ప్రేమించేవాళ్ళం కాదు.
“మీరు మరో సాక్షితో పాటు వచ్చి మా ఇంటి తలుపు తట్టారు, కావలికోటను తేజరిల్లు!ను నాకు ప్రతిపాదించారు. నేను మీకు ఒక డాలర్ ఇవ్వజూపి, నాకు పత్రికలు అవసరం లేదన్నాను. మీరు కేవలం విరాళాలను పొందేందుకు ప్రకటించడం లేదని మీరు నాకు తెలియజేశారు. ప్రజలు బైబిలు చదివేందుకు సహాయపడే పనిని మీరు చేస్తున్నారని మీరు నాకు చెప్పారు. నేను ఆ పత్రికలను తీసుకున్నానా లేక వాటిని చదివానా అన్నది నాకు కచ్చితంగా గుర్తు లేదు. అయినప్పటికీ, మీరు సత్యాన్ని గూర్చిన విత్తనాన్ని నా జీవితంలో నాటారు.
“కొన్ని సంవత్సరాల తర్వాత, నేను మా అమ్మవాళ్ళింట్లో ఉన్నప్పుడు, గారీ అనే ఒక సాక్షి వచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు సందర్శించిన విషయాన్ని ఆయనకు చెప్పాను. నేను 1984లో బాప్తిస్మం పొందేంతవరకు గారీ నాతో చాలా కాలం బైబిలు పఠించాడు. ఇప్పుడు నేను నా పిల్లలకు దేవుని రాజ్యాన్ని గూర్చిన సత్యాన్ని నేర్పుతున్నాను.
“మీ నమ్మకమైన సేవా సంవత్సరాల్లో మీరు ప్రభావితం చేసిన అనేక జీవితాల్లో నాది కేవలం ఒక్కటి మాత్రమేనని నాకు కచ్చితంగా తెలుసు. అయినప్పటికీ, ఈ ప్రేమా దయలవలన, గొప్ప దేవుడైన యెహోవాను, ఆయన కుమారుడైన క్రీస్తుయేసును గూర్చి నేను నా కుటుంబం తెలుసుకోగల్గేలా మీరు సహాయం చేశారు. మన కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును యెహోవా తుడిచివేసే, మరణం ఇక లేకుండాపోయే రానున్న క్రొత్త లోకంలో నేను మిమ్మల్ని కలవగల రోజు కొరకు నేను ఎదురుచూస్తున్నాను.—ప్రకటన 21:4.
“నేను నా కుటుంబం మీ గురించి తెలుసుకునే అవకాశం లభించినందుకు, మీ సాక్ష్యపు పనిలో మేము భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాము. మీకు కృతజ్ఞతలు.
“సహోదర ప్రేమతో,
పీటర్”
ఆరు నెలల అనారోగ్యం తర్వాత, మార్చి 1996లో కరల్ మరణించింది, 35 సంవత్సరాలు ఆసక్తిగల సువార్తికురాలిగా సత్యాన్ని గూర్చిన అనేక విత్తనాలను విత్తిన తర్వాత మరణించింది. ఒక విత్తనం ఎప్పుడు ఫలాన్నిస్తుందో ఎవరికీ తెలియదని, అనేక సంవత్సరాల తర్వాత కూడా అది ఫలాన్నివ్వచ్చని ఆమె తెలుసుకుంది.—మత్తయి 13:23.