శ్రేష్ఠమైన మార్గం
యెహోవాసాక్షులు లోకంలో ఆత్మీయత లేకుండా పోవడాన్ని గూర్చి సమాజంలో ప్రబలమైన అనైతికత మరియు మత అనిశ్చయతను గూర్చి చింతిస్తున్నారు. దాని మూలంగా, వాళ్ళు కొన్నిసార్లు మూలసిద్ధాంతవాదులు అని పిలువబడుతున్నారు. కానీ అది నిజమా? కాదు. వారికి మతసంబంధంగా గట్టి నమ్మకాలు ఉన్నప్పటికీ, మూలసిద్ధాంతవాదులు అన్న పదం ఏ అర్థంలో ఉపయోగించబడుతుందో ఆ అర్థంలో వారు మూలసిద్ధాంతవాదులు కారు. ఒక నిశ్చిత దృష్టికోణాన్ని వృద్ధిచేసేందుకు వారు రాజకీయ నాయకులను ఒత్తిడి చేయరు, తమతో ఏకీభవించని వారికి వ్యతిరేకంగా హింసాకాండకు ప్రదర్శనలకు ఒడిగట్టరు. వారు శ్రేష్ఠమైన మార్గాన్ని కనుగొన్నారు. వారు తమ నాయకుడైన యేసుక్రీస్తును అనుకరిస్తారు.
మతసంబంధ సత్యం ఉనికిలో ఉందని, అది బైబిలులో కనుగొనబడుతుందని యెహోవాసాక్షులు ఒప్పించబడ్డారు. (యోహాను 8:31బి, 32; 17:17) అయితే క్రైస్తవులు దయగలవారిగా, మంచివారిగా, దీనత్వముగలవారిగా, సహేతుకతగలవారిగా ఉండాలని—మతపిచ్చికి తావివ్వని గుణాలను కలిగి ఉండాలని బైబిలు బోధిస్తుంది. (గలతీయులు 5:22, 23; ఫిలిప్పీయులు 4:5) “మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది” అని వర్ణించబడిన “పైనుండివచ్చు జ్ఞానము”ను క్రైస్తవులు అలవర్చుకోవాలని బైబిలు పుస్తకమైన యాకోబులో ప్రోత్సహించబడుతుంది. “నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును” అని కూడా యాకోబు అన్నాడు.—యాకోబు 3:17, 18.
యేసు సత్యాన్ని గూర్చి చాలా ఎక్కువగా చింతించేవాడు అని యెహోవాసాక్షులు గుర్తుంచుకుంటారు. ఆయన పొంతి పిలాతుకు ఇలా చెప్పాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:37) ఆయన నిర్భయంగా సత్యాన్ని వాదించేవాడైనప్పటికీ, ఆయన తన నమ్మకాలను ఇతరులపై రుద్దాలని ప్రయత్నించలేదు. బదులుగా, ఆయన వారి మనస్సులను హృదయాలను ఆకర్షించాడు. అబద్ధాన్ని మరియు అవినీతిని భూమండలం నుండి ఎప్పుడు ఎలా తీసివేయాలో “ఉత్తముడును యథార్థ వంతుడునై”న తన పరలోకపు తండ్రి నిర్ణయిస్తాడని ఆయనకు తెలుసు. (కీర్తన 25:8) కనుక, తనతో ఏకీభవించనివారిని హతమార్చాలని ఆయన చూడలేదు. దానికి భిన్నంగా ఆయన కాలం నాటి ఆర్థడాక్స్ మత నాయకులు యేసును హతమార్చాలని ప్రయత్నించారు.—యోహాను 19:5, 6.
మత సిద్ధాంతాలను గూర్చి యెహోవాసాక్షులకు గట్టి నమ్మకాలున్నాయి, నైతిక విషయాల్లో వారు పటిష్ఠమైన విలువలను ప్రదర్శిస్తారు. అపొస్తలుడైన పౌలువలె “ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మ మొక్కటే” అని వారు ఒప్పించబడ్డారు. (ఎఫెసీయులు 4:5) “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది, దాని కనుగొనువారు కొందరే” అన్న యేసు మాటలను కూడా వారు ఎరిగివున్నారు. (మత్తయి 7:13, 14) అయినప్పటికీ, తమ విశ్వాసాలను అవలంబించాలని ఇతరులను బలవంతపెట్టడానికి వారు ప్రయత్నించరు. బదులుగా, వారు పౌలును అనుకరిస్తూ ‘దేవునితో సమాధానపడాలని’ కోరుకునే అందరూ అలా చేయాలని ‘వేడుకొంటారు.’ (2 కొరింథీయులు 5:20) ఇదే శ్రేష్ఠమైన మార్గం. ఇదే దేవుని మార్గం.
నేడు ఉపయోగించబడుతున్న మత మూలసిద్ధాంతవాదం అనే పదం చాలా భిన్నమైనది. మూలసిద్ధాంతవాదులు సమాజంపై తమ సూత్రాలను రుద్దడానికి దౌర్జన్యంతో సహా అనేక తంత్రాలను ఉపయోగిస్తారు. అలా చేయడంలో వారు రాజకీయ విధానం యొక్క సంఘటిత భాగమవుతున్నారు. అయితే, తన అనుచరులు ‘లోకసంబంధులుగా ఉండకూడదు’ అని యేసు చెప్పాడు. (యోహాను 15:19; 17:16; యాకోబు 4:4) ఆ మాటలకు అనుగుణ్యంగా యెహోవాసాక్షులు రాజకీయ వివాదాల్లో నిష్కర్షగా తటస్థతను పాటిస్తారు. మరి, ఫూవోరీపాజీనా అనే ఇటలీ వార్తాపత్రిక గుర్తించినట్లు, “వారు దేనినీ ఎవరి మీద రుద్దరు; వారు చెప్పేదానిని ప్రతి ఒక్కరు అంగీకరించడమో నిరాకరించడమో చేయవచ్చు.” దాని ఫలితం ఏమిటి? యెహోవాసాక్షులిచ్చే సమాధానకరమైన బైబిలు సందేశం సకల జనములను, ఒకప్పుడు మూలసిద్ధాంతవాదులుగా ఉన్నవారిని కూడా ఆకర్షిస్తుంది.—యెషయా 2:2, 3.
పటిష్ఠమైన విలువలున్న లోకం
మూలసిద్ధాంతవాదుల సంబంధమైన సమస్యలను మానవులు పరిష్కరించలేరని సాక్షులు గుర్తిస్తారు. దేవుని యందు విశ్వాసముంచాలని, మీ వ్యక్తిగత మత విశ్వాసాలను అంగీకరించాలని మీరు ఒక వ్యక్తిని బలవంతపెట్టలేరు. అలాచేయడం సాధ్యమేనని తలంచడం చరిత్రలో క్రూసేడ్లు, మధ్యయుగ ఇన్క్విసిషన్లు, అమెరికన్ ఇండియన్ల “మతమార్పిడులు” వంటి మహా చెడ్డ ఘోరకృత్యాలకు దారితీసింది. అయినప్పటికీ, మీరు దేవునియందు నమ్మకముంచితే, మీరు విషయాలను ఆయన చేతిలో వదిలేయడానికి సిద్ధపడతారు.
బైబిలు ప్రకారం, దేవుడు కొంత కాలావధిని ఉంచాడు, ఆ కాలావధిలో మానవులు తన నియమాలను ఉల్లంఘించేందుకు, అలా ఆ ఉల్లంఘన బాధలకు వేదనకు కారణమయ్యేందుకు అనుమతినిచ్చాడు. ఆ కాలం దాదాపు అయిపోవచ్చింది. ఇప్పటికే దేవుని పరలోక రాజ్యంలో యేసు రాజుగా ఏలుతున్నాడు. మరి త్వరలోనే ఆ రాజ్యము మానవ ప్రభుత్వాలను తీసివేసి, మానవజాతిపై చేసే పరిపాలనలో దైనందిన తీర్మానాలను తీసుకునేందుకు చర్యను గైకొంటుంది. (మత్తయి 24:3-14; ప్రకటన 11:15, 18) శాంతిసమాధానాలు సమృద్ధిగా ఉండే ప్రపంచవ్యాప్త పరదైసు దాని ఫలితమయ్యుంటుంది. ఆ కాలంలో, సత్య దేవుడ్ని ఎలా ఆరాధించాలి అనే విషయంలో ఇక ఏ మాత్రం అనిశ్చయత ఉండదు. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) విధేయులైన సమస్త మానవజాతి శ్రేయస్సు కొరకు ప్రేమపూర్వక దయ, సత్యం, నీతి, మరియు మంచితనం వంటి శాశ్వత విలువలు రాజ్యమేలుతాయి.
ఆ సమయం కోసం ఎదురుచూస్తూ, కీర్తనల గ్రంథకర్త కావ్యశైలిలో ఈ విధంగా అంటున్నాడు: “కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములోనుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.”—కీర్తన 85:10-13.
మనం ప్రపంచాన్ని మార్చలేం, కానీ నేడు కూడా మనం వ్యక్తిగతంగా దైవిక విలువలను అలవర్చుకోగలం. అలా క్రొత్తలోకంలో తన ఆరాధికులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ రకమైన ప్రజలుగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయగలం. అప్పుడు, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని కీర్తనల రచయిత చెప్పిన ఆ దీనులతో పాటు మనమూ ఉంటాం. (కీర్తన 37:11) తన చిత్తాన్ని చేసే వారికి దేవుడు మద్దతునిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, వారి భవిష్యత్ కొరకు అద్భుతమైన విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.
[7వ పేజీలోని చిత్రం]
దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను పరిచయం చేసుకొమ్మని యెహోవాసాక్షులు అందరినీ ఆహ్వానిస్తున్నారు
[6వ పేజీలోని చిత్రసౌజన్యం]
3, 4, 5, 6 పేజీల్లో దీపం: Printer’s Ornaments/by Carol Belanger Grafton/Dover Publications, Inc.