కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 3/1 పేజీలు 4-5
  • మూలసిద్ధాంతవాదం ఏమిటది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మూలసిద్ధాంతవాదం ఏమిటది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన కాలానికి అదొక ప్రతిక్రియ
  • మూలసిద్ధాంతవాదిని గుర్తించడం
  • మూలసిద్ధాంతవాదం వ్యాప్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • శ్రేష్ఠమైన మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మానవాళి సమస్యలకు మతమే మూలకారణమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మతం దాని ప్రభావం మేలుకా, కీడుకా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 3/1 పేజీలు 4-5

మూలసిద్ధాంతవాదం ఏమిటది?

మూలసిద్ధాంతవాదం ఎక్కడ ఆరంభమైంది? గత శతాబ్దాంతంలో స్వతంత్రంగా ఆలోచించే వేదాంతులు బైబిలు మరియు పరిణామం వంటి విజ్ఞానశాస్త్ర సిద్ధాంతాల విమర్శనాత్మక అధ్యయనానికి వీలు కలిగించేందుకు తమ విశ్వాసాలను మార్చుకున్నారు. దాని ఫలితంగా, బైబిలు మీద ప్రజలకున్న విశ్వాసం తగ్గుముఖం పట్టింది. అమెరికాలో పూర్వాచార పరాయణులైన మత నాయకులు విశ్వాసానికి మూలసిద్ధాంతాలు అని వారు పిలిచినవాటిని స్థాపిస్తూ ప్రతిక్రియ చేశారు.a 20వ శతాబ్దం తొలిభాగంలో, ది ఫండమెంటల్స్‌: ఎ టెస్టిమనీ టు ది ట్రూత్‌ [మూలసిద్ధాంతాలు: సత్యానికి ఒక సాక్ష్యం] అనే పేరులో రెండు సంపుటుల పరంపరలో ఈ మూల సిద్ధాంతాల చర్చను వారు ప్రచురించారు. ఆ సంపుటుల శీర్షిక నుండి “fundamentalism” [“మూలసిద్ధాంతవాదం”] అనే పదం వచ్చింది.

మూలసిద్ధాంతవాదం 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో తరచూ చర్చనీయాంశమయ్యింది. ఉదాహరణకు, 1925లో మత మూలసిద్ధాంతవాదులు అమెరికాలో టెనెసీలోని జాన్‌ స్కోప్స్‌ అనే పాఠశాల అధ్యాపకున్ని కోర్టుకు తీసుకువెళ్ళారు, ఆ కేసు స్కోప్స్‌ ట్రయల్‌ అని పిలువబడింది. ఆయన చేసిన నేరమేమిటి? ఆయన పరిణామాన్ని గూర్చి బోధించేవాడు, అది ప్రభుత్వ చట్టానికి విరుద్ధమైనది. మూలసిద్ధాంతవాదం కొంత కాలమే నిలుస్తుంది అని ఆ రోజుల్లో కొందరు నమ్మారు. 1926లో ప్రొటెస్టెంట్‌ల పత్రికయైన క్రిస్టియన్‌ సెన్‌చ్యురీ అది “నిరర్థకమైనదని, కృత్రిమమైనదని” మరియు “నిర్మాణాత్మక లక్ష్యసాధన కొరకు లేదా మనుగడ కొరకు అవసరమైన గుణాలు పూర్తిగా లేనిదని” చెప్పింది. ఆ అంచనా ఎంత తప్పో!

1970లు నుండి మూలసిద్ధాంతవాదం ఎడతెగక ఒక చర్చనీయాంశంగా ఉంటోంది. అమెరికాలోని, కాలిఫోర్నియాలో జరిగిన ఫుల్లర్‌ థియోలజికల్‌ సెమినారీలో ప్రొఫెసర్‌ మిరోస్లావ్‌ వోల్ఫ్‌, “మూలసిద్ధాంతవాదం మనుగడ సాధించడమే కాక, బాగా అభివృద్ధికూడా చెందింది” అని అంటున్నారు. నేడు “మూలసిద్ధాంతవాదం” అనే పదం కేవలం ప్రొటెస్టెంట్‌ ఉద్యమాలకే కాక, కాథోలిక్‌, ఇస్లామ్‌, యూదా, హిందూ మతాల వంటి ఇతర మతాల ఉద్యమాలకు కూడా వర్తిస్తుంది.

మన కాలానికి అదొక ప్రతిక్రియ

మూలసిద్ధాంతవాదం ఎందుకు వ్యాపిస్తోంది? దానిని అధ్యయనం చేసేవారు, కనీసం కొంత మేరకైనా, మన కాలంలోని నైతిక మరియు మత సంబంధ అనిశ్చయతయే దానికి కారణమని అంటారు. ఆదిమ కాలాల్లో అనేక సమాజాలు పారంపర్య విశ్వాసాల ఆధారమైన నైతిక నిశ్చయతగల వాతావరణంలో జీవించేవి. ఇప్పుడు ఈ విశ్వాసాలు సవాలు చేయబడ్డాయి, లేదా నిరాకరించబడ్డాయి. చాలా మంది జ్ఞానులు దేవుడు లేడు, ఎవరూ శ్రద్ధతీసుకోని విశ్వంలో మానవుడు ఒంటరివాడు అన్న తమ వాదనను సమర్థించుకుంటున్నారు. మానవజాతి అనుకోని పరిణామం యొక్క ఫలితమని, అది ప్రేమగల ఒక దేవుని క్రియల ఫలితం కాదని శాస్త్రజ్ఞులనేకులు బోధిస్తారు. సహించే ధోరణి ప్రబలంగా ఉంది. సమాజంలోని అన్ని తరగతుల్లోను నైతిక విలువలు కోల్పోవడంతో లోకం అస్వస్థంగా ఉంది.—2 తిమోతి 3:4, 5, 13.

మూలసిద్ధాంతవాదులు పాత విశ్వాసాల కొరకు పరితపిస్తారు, వారిలో కొందరు సముచితమైన నైతిక, సిద్ధాంత మూలాలు అని తాము తలంచే వాటిని తమ సమాజాల్లో దేశాల్లో తిరిగి తీసుకురావాలని శ్రమపడతారు. “సరైన” నైతిక నియమావళి మరియు సిద్ధాంత విశ్వాసాలకనుసారంగా జీవించాలని ఇతరులను బలవంతపెట్టేందుకు వారు తమ శక్తిమేరకు చేయగలిగినదంతా చేస్తారు. తనదే సరని, మిగిలినవాళ్ళది తప్పని మూలసిద్ధాంతవాది గట్టిగా నమ్ముతాడు. మూలసిద్ధాంతవాదం అనే పదం “సంకుచితత్వాన్ని, మూఢవిశ్వాసాన్ని, జ్ఞానవిరోధాన్ని మరియు సాంఘిక దురభిమానాన్ని సూచించే శత్రుభావమున్న, అవమానపర్చే విధమైన పదమని తరచూ తలంచబడుతుంది” అని ఫండమెంటలిజమ్‌ అనే తన పుస్తకంలో ప్రొఫెసర్‌ జేమ్స్‌ బార్‌ చెబుతున్నాడు.

ఎవరూ సంకుచితమైనవారని, మూఢవిశ్వాసులని, సాంఘిక దురభిమాని అని పిలువబడేందుకు ఇష్టపడరు గనుక, ఎవరు మూలసిద్ధాంతవాది, ఎవరు మూలసిద్ధాంతవాది కాదు అనే విషయంలో అందరూ ఏకీభవించరు. అయినప్పటికీ మత మూలసిద్ధాంతవాదాన్ని తెలియజేసే దృక్కోణాలు కొన్ని ఉన్నాయి.

మూలసిద్ధాంతవాదిని గుర్తించడం

మత మూలసిద్ధాంతవాదం అంటే సాధారణంగా ఒక సంస్కృతిలో ఆదిమ పారంపర్యాలు లేదా మత విశ్వాసాలు అని ఏవి విశ్వసించబడుతాయో వాటిని కాపాడేందుకు, లోకంలోని లౌకికాత్మ అని దేనిని తలస్తారో దానిని వ్యతిరేకించేందుకు చేసే ప్రయత్నం. అంటే ఆధునికమైన అన్నింటిని మూలసిద్ధాంతవాదులు వ్యతిరేకిస్తారని చెప్పడం లేదు. తమ దృష్టికోణాన్ని ప్రబలపరచేందుకు కొందరు ఆధునిక సమాచార వినిమయ పద్ధతులను ఫలకరంగా ఉపయోగిస్తారు. అయితే వారు సమాజాన్ని లౌకికంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతారు.b

కొందరు మూలసిద్ధాంతవాదులు తమ కొరకు పారంపర్య సిద్ధాంత నియమావళిని లేదా జీవన విధానాన్ని కాపాడుకోవాలనే కాక, దాన్ని ఇతరులపై రుద్దాలని, మూలసిద్ధాంతవాదుల విశ్వాసాలకు అనుగుణ్యంగా వారు మారగల్గేలా సాంఘిక వ్యవస్థనే మార్చాలని నిశ్చయించుకున్నారు. కనుక, కాథోలిక్‌ మూలసిద్ధాంతవాది గర్భస్రావాన్ని నిరాకరించడమనేది తన వరకు మాత్రమే పరిమితం చేసుకోడు. గర్భస్రావం చేయించడాన్ని నిషేధించే చట్టాలను రూపొందించమని తన దేశంలోని శాసనసభ్యులను ఆయన బాగా ఒత్తిడిచేయవచ్చు. లా రేపూబ్లీకా అనే పత్రిక ప్రకారం, పోలండ్‌లో గర్భస్రావ వ్యతిరేక చట్టాన్ని ఆమోదింపజేసేందుకు కాథోలిక్‌ చర్చి “‘ఒక వాగ్యుద్ధం’” జరిపి “అందులో తన శక్తినంతటినీ తన పలుకుబడినంతటినీ ఉపయోగించింది.” అలా చేయడంలో చర్చి అధికారులు చాలా వరకు మూలసిద్ధాంతవాదుల్లాగే ప్రవర్తించారు. అమెరికాలోని అఖిలపక్ష ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ సంస్థ అలాంటి “వాగ్యుద్ధాలు” జరుపుతుంది.

మూలసిద్ధాంతవాదులు ముఖ్యంగా మనస్సుల్లో లోతుగా నాటుకుపోయిన తమ మత విశ్వాసాలతో వేరుగా కనిపిస్తారు. అలా, ఒక ప్రొటెస్టెంట్‌ మూలసిద్ధాంతవాది బైబిలు యొక్క అక్షరార్థ వివరణనూ, బహుశా భూమి అక్షరార్థమైన ఆరు రోజుల్లోనే సృష్టించబడిందనే విశ్వాసాన్ని కూడా నమ్మకంతో వాదిస్తాడు. పోప్‌ పొరపాటేపడడనే విషయాన్ని గూర్చి కాథోలిక్‌ మూలసిద్ధాంతవాదికి సందేహమే ఉండదు.

అందుకే, “మూలసిద్ధాంతవాదం” అనే పదం నిర్హేతుకమైన మతపిచ్చి అనే తలంపును ఎందుకు తెస్తుంది, మూలసిద్ధాంతవాదులు కానివారు మూలసిద్ధాంతవాదం వ్యాపించడాన్ని చూసి ఎందుకు కలతచెందుతున్నారు అన్నది అర్థంచేసుకోగల విషయమే. వ్యక్తులుగా మనం మూలసిద్ధాంతవాదులతో ఏకీభవించకపోవచ్చు, వారు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం చూసి, కొన్నిసార్లు వారి హింసాయుత క్రియలను చూసి ఖంగుతినవచ్చు. నిజమే, ఒక మత మూలసిద్ధాంతవాదులు ఇతర మత మూలసిద్ధాంతవాదుల చర్యలకు భయపడివుండవచ్చు! అయినప్పటికీ, ఆలోచనాపరులైన చాలా మంది వ్యక్తులు మూలసిద్ధాంతవాద వ్యాప్తికి కారణమయ్యే విషయాలను గూర్చి—నైతికత లేకుండా పోవడమన్నది అధికమవ్వడం, విశ్వాసం లేకపోవడం, ఆధునిక సమాజంలో ఆత్మీయత నిరాకరించబడడం వంటి విషయాలను గూర్చి కలతచెందుతున్నారు.

ఈ ధోరణులకు మూలసిద్ధాంతవాదం మాత్రమే ఏకైక ప్రతిస్పందనా? అలా కాకపోతే, మరి వేరే ప్రత్యామ్నాయమేది?

[అధస్సూచీలు]

a మూలసిద్ధాంతవాదంలోని ఐదు అంశాలని పిలువబడేవి 1895లో ఈ విధంగా నిర్వచించబడ్డాయి: “(1) లేఖనాల సంపూర్ణ ప్రేరణ మరియు కచ్చితత్వము; (2) యేసుక్రీస్తు దైవత్వం; (3) క్రీస్తు కన్యకు జన్మించడం; (4) ఇతరుల కొరకు సిలువపై యేసు పాప ప్రాయశ్చిత్తం చేయడం; (5) యేసు శరీరంతో పునరుత్థానమవ్వడం మరియు వ్యక్తిగతంగాను శారీరకంగాను రెండవసారి భూమిమీదికి రావడం.”—స్టడీ డీ టేవోలోఝీయా (వేదాంత అధ్యయనాలు).

b “లౌకికంగా మార్చడం” అంటే, ఆత్మీయమైన విషయాలకు, లేదా పవిత్రమైన విషయాలకు వ్యతిరేకంగా లౌకికానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడమని భావం. లౌకికమనేది మతానికో లేదా మతవిశ్వాసాలకో సంబంధించింది కాదు.

[5వ పేజీలోని చిత్రం]

1926లో, మూలసిద్ధాంతవాదం “నిరర్థకమైనదని, కృత్రిమమైనదని,” మరియు “నిర్మాణాత్మక లక్ష్యసాధన కొరకు లేదా మనుగడ కొరకు అవసరమైన గుణాలు పూర్తిగా లేనిదని” ఒక ప్రొటెస్టెంట్‌ పత్రిక వర్ణించింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి