రాజ్య ప్రచారకుల నివేదిక
‘మనుష్యుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి’
యేసు కొండమీద చేసిన తన ప్రసంగములో తన శిష్యులకిలా చెప్పాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు.” ఆయన వారికిలా ఉద్బోధించాడు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”—మత్తయి 5:14-16.
ఇటలీలో యెహోవాసాక్షుల సత్క్రియలు గమనించబడకుండా పోలేదు. ఉదాహరణకు, ఈ క్రింది నివేదికలు చూపిస్తున్నట్లుగా, వారు తమ వార్షిక సదస్సులకు హాజరయ్యేటప్పుడు వారి మంచి ప్రవర్తన దేవునికి స్తుతిని తెస్తుంది:
▪ ఇటలీ నందలి టెర్నీలోని ఒక స్త్రీ అనేక సంవత్సరాలు, ఆ నగరంలో స్టేడియం వద్ద ఒక హోటలు నడపడానికి తన కుమార్తెకు సహాయం చేసింది. ఆమె ఇలా తెలియజేస్తుంది: “ఫుట్బాల్ ఆటల కొరకు వచ్చినవారికి, అక్కడ యెహోవాసాక్షుల సదస్సులకు వచ్చినవారికి మధ్య నేను ఎంతో తేడాను గమనించాను. సాక్షులు తమ వస్త్రధారణలో ఎంతో ఒద్దికగా ఉన్నారు, వారు నిజాయితీపరులు, గౌరవనీయులు. వేర్వేరు జాతులకు చెందిన ప్రజలు అంత బాగా ఎలా కలిసి మెలిసి ఉండగలరా అని నేను తరచూ ఆశ్చర్యపోయేదాన్ని.
“ఒకరోజు ఒక సాక్షి నన్ను వీధిలో ఆపి, దేవుని నామం తెలుసా అని నన్నడిగింది. నాకు తెలియదు, యెహోవాసాక్షులు మంచి ప్రజలని నాకు తెలుసు గనుక, ఆమె నన్ను దర్శించడానికి నేను అంగీకరించాను. నేను మృతుల స్థితి గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను, ఆమె నాకు దానిని బైబిలు నుండి తెలియజేసింది. నేను నిస్సంకోచంగా బైబిలు పఠనాన్ని అంగీకరించాను, రెండు వారాల తర్వాత నేను కూటాలకు హాజరవ్వడం ప్రారంభించాను.
“మొదట్లో నా కుమార్తె నన్ను వ్యతిరేకించింది, కాని నా ప్రవర్తనా దృఢనిశ్చయాలు ఆమె దృక్పథాన్ని మార్చివేశాయి. నేను తొమ్మిది నెలలు పఠించాను. నేడు నా కుమార్తె, ఆమె భర్త తమ హోటలుకు వచ్చే సాక్షుల ఎడల మెప్పుదలను వ్యక్తం చేస్తుంటారు. నేనైతే, ఈ స్టేడియంలో ఒక సదస్సులో బాప్తిస్మం తీసుకున్నాను.”
▪ రోసేటో డెల్యీ అబ్రుట్జీలో ఒక సమావేశం జరిగిన తర్వాత, కాంప్సైట్ మేనేజరు ఇలా వ్యాఖ్యానించాడు: “యెహోవాసాక్షులు తాము చేసే పనులన్నిటిలో ఎంతో నిజాయితీగా ఉంటారని నేను గమనించాను. గత వారం, నా కాంప్సైట్లో 40 మంది ఉన్నారు, వాళ్లు ఏ సమస్యలూ కలిగించలేదు. బదులుగా, తమ ట్రెయిలర్లో లేక టెంటులో అదనంగా వ్యక్తులు ఉంటే వాళ్లు మాత్రమే మాకు తెలియజేస్తారు. నామట్టుకు నాకైతే, శ్రేష్ఠమైన ఖాతాదార్లు వాళ్లే.”
▪ అదే సమావేశం తర్వాత, ఒక హోటలు మేనేజరు ఇలా తెలియజేశాడు: “యెహోవాసాక్షులు ఎంతో సమాధానపరులు. వాళ్లు రౌడీలు కాదు, వాళ్లు పెందలాడే నిద్రపోతారు. వాళ్లు నిజంగా దయ, యథార్థత, మంచి ప్రవర్తన గలవారు. ప్రతి ఒక్కరూ వారిలా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇతరులు అన్నీ దొంగిలిస్తారు—పూలకుండీలు, ఆష్ట్రేలు, చివరికి టాయిలెట్ పేపర్లు మరియు చక్కెర కూడా దొంగిలిస్తారు! మీ వాళ్లు అలాంటిదేదీ ఎన్నడూ చేయలేదు. మీ పిల్లలు సాయంకాలం ఫ్రిజ్లో నుండి ఐస్క్రీములు తీసుకున్నప్పుడు, నేను అక్కడికి వెళ్లి వాళ్లు ఏమి తీసుకున్నారని పరిశీలించవలసిన అవసరం లేదు. వాళ్లు నాకు ఏమి ఇవ్వవలసి ఉందో లెక్క చూసుకుని, వెంటనే నాకు చెల్లించడానికి వస్తారు. నాకు వాళ్లయందు సంపూర్ణ నమ్మకం ఉంది. ఇతరులు అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! మా హోటలుకొచ్చే వాళ్లందరూ యెహోవాసాక్షులై ఉండాలని నేను కోరుకుంటున్నాను.”
భూమి మీది ఇతర అనేక ప్రాంతాల్లోలానే, ఇటలీలో యెహోవాసాక్షులు సుపరిచితులు. వాళ్లు ‘అన్యజనుల మధ్య తమ మంచి ప్రవర్తనను కాపాడుకొని,’ తద్వారా తాము ఎవరి నామాన్ని ధరించారో ఆ సత్యదేవునికి స్తుతిని తెస్తారు.—1 పేతురు 2:12.