మూలసిద్ధాంతవాదం వ్యాప్తి
మూలసిద్ధాంతవాదం—కేవలం కొన్ని దశాబ్దాల క్రితం, ఇది ప్రొటెస్టెంట్ మతంలోని అల్పసంఖ్యాకుల ఉద్యమమే తప్ప మరేమి కాదన్నట్లుగా ఉండేది. కాని పరిస్థితి ఎంత మారిపోయిందో! 20వ శతాబ్దాంతంలో మూలసిద్ధాంతవాదంa అనేది ప్రసార మాధ్యమంలోను విశ్వవిద్యాలయ పరిశోధనల్లోను అంత చర్చనీయాంశంగా మారుతుందనే దానిని గూర్చి 30 సంవత్సరాల క్రితం ఎవరూ అంతగా ఊహించి ఉండరు అని మతాన్ని గూర్చిన ఓ వ్యాఖ్యాతయైన బ్రూస్ బి. లారెన్స్ వ్రాశాడు.
అయితే, అదే జరిగింది. హింసాయుత వీధి ప్రదర్శనలు, హత్యలు, గర్భస్రావ వ్యతిరేక ఉద్యమాలు, రాజకీయాల్లో మత స్వాధీన గుంపుల జోక్యం, దైవదూషణకరమైనవని పరిగణించబడిన పుస్తకాలను బహిరంగంగా కాల్చివేయడం వంటి వాటిని గూర్చిన వార్తాపత్రిక నివేదికలు మూలసిద్ధాంతవాదుల చర్యలను గూర్చిన ఎడతెగని జ్ఞాపికలు. మూలసిద్ధాంతవాదం ప్రతిచోటా “దేవుని నామమున దాడి చేస్తుంది” అని ఇటలీలోని ఆర్థిక సంబంధ వారపత్రికయైన మొన్‌డో ఏకోనోమీకో పేర్కొంది.
మూలసిద్ధాంతవాదులు తీవ్రవాదులుగా, మతపిచ్చిగలవారిగా, కుట్రలు పన్నేవారిగా, తీవ్రవాదపు దాడులను చేసేవారిగా తరచూ వర్ణించబడ్డారు. రోమన్ కాథోలిక్ మతంలో కోమూన్‌యోనే ఏ లీబేరాట్స్యోనే, యూదా మతంలో గుష్ ఎమూనీమ్, ఉత్తర అమెరికా ప్రొటెస్టెంట్ మతంలో అఖిలపక్ష క్రైస్తవ సంస్థ వంటి గుంపుల పెరుగుదలను చూసి ప్రజలు కలవరపడుతున్నారు. మూలసిద్ధాంతవాదం ఎందుకు వ్యాపిస్తుంది? దాన్ని ఏది ప్రేరేపిస్తుంది? ఫ్రెంచ్ సామాజిక వాదియైన ఝీల్ కపల్ చెబుతున్నట్లు బహుశా అది “దేవుని ప్రతీకారమా”?
[అధస్సూచీలు]
a పారంపర్య, సాంప్రదాయ మత విలువలను నిష్కర్షగా ఆచరించేవాడే మూలసిద్ధాంతవాది. “మూలసిద్ధాంతవాదం” అర్థం తరువాతి శీర్షికలో ఇంకాస్త పూర్తిగా చర్చించబడుతుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Nina Berman/Sipa Press