షెకెము—లోయలోని ఊరు
దేవుడు తన ప్రజల కోసం ఎంచుకున్న దేశం నడిమధ్యలో, ఏబాలు గెరిజీము పర్వతాల మధ్యన షెకెము పట్టణం నెలకొని ఉంది. ఇక్కడే, దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం, “నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని” యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు.—ఆదికాండము 12:6, 7.
ఈ వాగ్దానానికి అనుగుణంగా, అబ్రాహాము మనుమడైన యాకోబు షెకెము వద్ద గుడారము వేసికొని, అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దానికి “ఇశ్రాయేలు దేవుడే దేవుడు” అని పేరుపెట్టాడు. యాకోబు తన కుటుంబానికి, మందలకు నీటి కోసం ఒక బావిని తవ్వాడు, అది శతాబ్దాల తర్వాత “యాకోబు బావి” అని పిలువబడింది.—ఆదికాండము 33:18-20, అధఃసూచి; యోహాను 4:5, 6, 12.
అయితే, యాకోబు కుటుంబ సభ్యులందరూ సత్యారాధన ఎడల ఆసక్తిని చూపలేదు. ఆయన కుమార్తె దీనా షెకెముకు చెందిన కనానీయుల అమ్మాయిలతో స్నేహాన్ని పెంచుకుంది. చాలా చిన్నదైన దీనా తన కుటుంబం యొక్క గుడారాల్లోని భద్రతను వదిలి, దగ్గర్లోని పట్టణానికి పోయి అక్కడి వారిని స్నేహితులను చేసుకుంది.
తమ పట్టణానికి, బహుశ ఒంటరిగా క్రమంగా వచ్చే ఈ యౌవన కన్యను ఆ పట్టణపు యౌవన పురుషులు ఎలా దృష్టించేవారు? ఒక నాయకుని కుమారుడు “ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.” అవినీతిపరులైన కనానీయులతో సహవసించడం ద్వారా దీనా ప్రమాదాన్ని ఎందుకు కొనితెచ్చుకుంది? తన వయస్సు అమ్మాయిల సహవాసం తనకు అవసరమని ఆమె భావించినందుకా? ఆమె తన అన్నల్లో కొందరంత అహంకారాన్ని, స్వేచ్ఛా తత్త్వాన్ని కలిగి ఉందా? ఆదికాండములోని వృత్తాంతాన్ని చదివి, తమ కుమార్తె షెకెముకు వెళ్తుండటం మూలంగా వచ్చిన విపత్కర పరిణామాల విషయమై యాకోబు లేయాలు ఎంత కలతను అవమానాన్ని అనుభవించి ఉంటారో గ్రహించేందుకు ప్రయత్నించండి.—ఆదికాండము 34:1-31; 49:5-7; జూన్ 15, 1985 కావలికోట (ఆంగ్లం) 31వ పేజీని కూడా చూడండి.
దాదాపు 300 సంవత్సరాల తర్వాత, దైవపరిపాలనా నడిపింపు సూత్రాలను అలక్ష్యం చేయడం వలన కలిగే ఫలితాల గురించి మళ్లీ ప్రాముఖ్యంగా చెప్పడం జరిగింది. షెకెము వద్ద, ఇశ్రాయేలీయుల చరిత్రలోని మరువలేని ఒక సమావేశాన్ని యెహోషువ ఏర్పాటు చేశాడు. లోయలోని ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. పది లక్షలకంటే ఎక్కువమంది ప్రజలు, అంటే మొత్తం ఇశ్రాయేలీయుల ఆరు గోత్రములకు చెందిన పురుషులూ స్త్రీలూ మరియు పిల్లలు గెరిజీము పర్వతం ఎదుట నిలుచున్నారు. లోయకు అవతల మిగతా ఆరు గోత్రములకు చెందిన దాదాపు అంతేమంది ప్రజలు ఏబాలు పర్వతం ఎదుట నిలుచున్నారు.a అక్కడ క్రింద, ఇశ్రాయేలీయుల రెండు గుంపుల మధ్య మందసపు పెట్టె ప్రక్కన యాజకులు మరియు యెహోషువ నిలుచుని ఉన్నారు. ఎంత మహత్తరమైన దృశ్యమో కదా!—యెహోషువ 8:30-33.
ఈ గొప్ప సమూహం ఎదుటనున్న ఈ రెండు పర్వతాలూ అందానికి, మోడువారినతనానికి మధ్యగల స్పష్టమైన వ్యత్యాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గెరిజీముపైనున్న పల్లాలు పచ్చగా, సారవంతంగా ఉన్నాయి, అయితే ఏబాలుపైవి ఎండిపోయి మోడువారి ఉన్నాయి. యెహోషువ మాట్లాడే సమయం కొరకు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తుండగా వారి ఆతృతను మీరు ఉహించుకోగలరా? ఈ ప్రాకృతిక ప్రదర్శన శాలలో ప్రతి శబ్దమూ ప్రతిధ్వనిస్తుంది.
‘మోషే యొక్క ధర్మశాస్త్రగ్రంథమును’ చదివేందుకు యెహోషువ తీసుకున్న నాలుగునుండి ఆరు గంటల సమయంలో, ప్రజలు కూడా పాల్గొన్నారు. (యెహోషువ 8:34, 35) బహుశ, గెరిజీము ఎదుటనున్న ఇశ్రాయేలీయులు ప్రతి దీవెన తర్వాత ఆమేన్! అని అనగా, ఏబాలు ఎదుటనున్న వారు ఆమేన్! అనడం ఒక్కో శాపాన్ని నొక్కి తెలియజేసేది. ఏబాలు పర్వతం యొక్క మోడు వారిన రూపం, అవిధేయత యొక్క విపత్కరమైన పరిణామాలను గురించి ప్రజలకు జ్ఞాపకం చేసేందుకు చక్కగా పనికి వచ్చి ఉంటుంది.
“తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని” యెహోషువ హెచ్చరిస్తాడు. పది లక్షలకంటే ఎక్కువ స్వరాలు ఏకగ్రీవంగా “ఆమేన్!” అని పలుకుతాయి. ఆ భీకరమైన ప్రతిస్పందన సద్దుమణిగేందుకు యెహోషువ ఆగుతాడు. “తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని” ఆయన చెబుతాడు. అనేకమంది పరదేశులతో పాటు ఉన్న ఆరు గోత్రాల వారు మళ్లీ “ఆమేన్!” అని బిగ్గరగా పలుకుతారు. (ద్వితీయోపదేశకాండము 27:16, 17) మీరు అక్కడ ఉండి ఉంటే, ఆ పర్వతాల మధ్య జరిగిన ఆ సమావేశాన్ని మీరు ఎన్నడైనా మరిచిపోయి ఉండేవారా? విధేయత యొక్క అవసరత మీ మనస్సుల్లో చెరగని ముద్ర వేసి ఉండేది కాదా?
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన మరణించడానికి కొంచెంముందు, జనాంగము తమ నిర్ణయాన్ని దృఢపర్చుకునేందుకు యెహోషువ వారిని మళ్లీ షెకెము ఎదుట సమావేశపర్చాడు. ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవలసిన విషయాన్ని ఆయన వారి ఎదుట ఉంచాడు. “మీరు ఎవని సేవించెదరో . . . నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము” అని ఆయన అన్నాడు. (యెహోషువ 24:1, 15) షెకెమునందు ఏర్పాటు చేయబడిన, విశ్వాసాన్ని పురికొల్పే ఈ సమావేశాలు లోతైన ప్రభావాన్ని కలిగించాయన్నది స్పష్టమౌతుంది. యెహోషువ మరణం తర్వాత చాలా సంవత్సరాల వరకూ, ఇశ్రాయేలీయులు ఆయన నమ్మకమైన మాదిరిని అనుకరించారు.—యెహోషువ 24:31.
దాదాపు 15 శతాబ్దాల తర్వాత, యేసు గెరిజీము పర్వతం నీడన కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక ఉల్లాసకరమైన చర్చ కొనసాగింది. సుదూర ప్రయాణం తర్వాత అలసిపోయి ఉన్న యేసు యాకోబు బావి వద్ద కూర్చుని ఉన్నప్పుడు, ఒక సమరయ స్త్రీ తన నీటి కడవతో అక్కడికి వచ్చింది. తనకు నీళ్లివ్వమని యేసు అడిగేసరికి ఆ స్త్రీ చాలా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే యూదులు సమరయులతో మాట్లాడరు అలాంటిది వారి పాత్రల్లో నీళ్లు త్రాగడం అసంభవం. (యోహాను 4:5-9) యేసు తర్వాత పలికిన మాటలు ఆమెకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి.
‘ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును.’ (యోహాను 4:13, 14) ఈ లోతైన బావిలోనుండి నీళ్లు చేదుకోవడం చాలా ప్రయాసతోకూడిన పని గనుక ఆ వాగ్దానంలో ఆ స్త్రీ చూపిన ఆసక్తిని ఊహించండి. యెరూషలేము, గెరిజీము పర్వతం చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ, దేవున్ని సమీపించేందుకు అవశ్యకమైన మత కేంద్రాలు కావని యేసు తదుపరి వివరించాడు. ఓ స్థలం కాదుగానీ, హృదయ దృక్పథం మరియు ప్రవర్తన ప్రాముఖ్యమైనవి. ‘యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుదురు’ అని ఆయన అన్నాడు. “తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.” (యోహాను 4:23) ఆ మాటలు ఎంత ఆదరణకరంగా ఉండి ఉంటాయో కదా! ఈ లోయ మరోసారి, యెహోవాను సేవించేందుకు ప్రజలు పురికొల్పబడిన స్థలంగా మారింది.
నేడు నెబ్లస్ పట్టణం ప్రాచీన షెకెము శిథిలాల ప్రక్కన నెలకొని ఉంది. గెరిజీము పర్వతం మరియు ఏబాలు పర్వతం ఇంకా ఈ లోయను ఆక్రమించి ఉన్నాయి, అవి గడిచిన సంఘటనలకు మౌన సాక్షులుగా నిలుచుని ఉన్నాయి. ఈ పర్వతాల పీఠభూమి వద్ద ఉన్న యాకోబు బావిని ఇప్పటికీ దర్శించవచ్చు. అక్కడ సంభవించిన సంఘటనలను మనం ధ్యానిస్తుండగా, యెహోషువ మరియు యేసు మనకు బోధించిన రీతిలో సత్యారాధనను ఉన్నతపర్చడం యొక్క ప్రాముఖ్యత గురించి మనకు జ్ఞాపకం చేయబడుతోంది.—యెషయా 2:2, 3 పోల్చండి.
[అధస్సూచీలు]
a గెరిజీము పర్వతం ఎదుట షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు మరియు బెన్యామీనుల ఆరు గోత్రముల వారు ఉన్నారు. ఏబెలు పర్వతం ఎదుట రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను మరియు నఫ్తాలిల ఆరు గోత్రముల వారు ఉన్నారు.—ద్వితీయోపదేశకాండము 27:12, 13.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.