బైబిలు సంబంధిత భౌగోళిక శాస్త్రం ప్రామాణికమైనదా?
ఎలస్తీనాలో సూర్యుడప్పుడే అస్తమించాడు. అది 1799వ సంవత్సరం. ఫ్రెంచిసైన్యం ఆ దినమంతా ఎండలో ప్రయాణించి స్థావరం ఏర్పాటుచేసుకున్నారు, వారి ప్రధాన సైన్యాధికారి నెపోలియన్ తన గుడారంలో విశ్రమిస్తున్నాడు. మినుకుమినుకు మంటున్న క్రొవ్వొత్తివెలుతురులో అతని సేవకుడొకడు ఫ్రెంచి బైబిలును బిగ్గరగా చదువుతున్నాడు.
నెపోలియన్ పాలస్తీనాలో సైనిక దండయాత్ర చేసినపుడెల్లా తరచు అలా జరుగుతుండేది. “ఆ ప్రాచీన పట్టణ శిధిలాలలో మకాము చేసినపుడెల్లా ప్రతి సాయంత్రం వారు లేఖనాలను బిగ్గరగా చదివేవారు . . . ఆ వర్ణనల సారూప్యత, సత్యం ఎన్నదగినది; అనేక శతాబ్దాలు, మార్పులు జరిగిన తరువాత కూడా అవి యింకను ఈ దేశానికి సరిపోతున్నాయి,” అని అతడు అటుపిమ్మట జ్ఞప్తికితెచ్చుకున్నాడు.
నిజమే, మధ్యప్రాచ్యాన్ని సందర్శించు యాత్రికులు బైబిలు సంఘటనలను ప్రస్తుత కాల ప్రదేశాలకు పొందికచేయుట సులభమని కనుగొన్నారు. ఫ్రెంచిసైన్యం ఐగుప్తును జయించక ముందు ఆ ప్రాచీన దేశాన్ని గూర్చి విదేశీయులకు అంతగా తెలియదు. నెపోలియన్ ఐగుప్తునకు తీసుకువచ్చిన విజ్ఞానశాస్త్రజ్ఞులు, పండితులు ఐగుప్తు గతవైభవ వివరాలను ప్రపంచానికి బయలుపర్చ మొదలు పెట్టారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు అనుభవించిన ‘కఠిన దాస్యాన్ని’ దృశ్యీకరించుటను అది సులభతరంచేసింది—నిర్గమకాండము 1:13, 14.
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విముక్తులైన రాత్రి, వారు రామసేసులో సమకూడి “అరణ్యము” వరకు సాగిపోయిరి. (నిర్గమకాండము 12:37; 13:20) ఈ ప్రదేశమందు, దేవుడు వారిని “వెనుతిరిగి,” “సముద్రము నొద్ద దిగవలెనని” ఆజ్ఞాపించాడు. ఈ వింతైన సంచారమును బట్టివారు “చిక్కుబడియున్నారని” అనుకొని, ఐగుప్తు రాజు తన సైన్యముతో 600 యుద్ధ రథాలతో తమ మాజీ దాసులను తిరిగి పట్టుకొనేందుకు బయల్దేరాడు.—నిర్గమకాండము 14:1-9.
నిర్గమము
సా.శ. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసీఫస్ చెప్పిన ప్రకారం, ఐగుప్తు సైన్యము ఇశ్రాయేలీయులను “ఇరుకైన ప్రాంతానికి” తరిమి “దాటిపోలేని ఎత్తైన కొండశిఖరానికి సముద్రానికి మధ్యవారిని యిరికించారు.” ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన నిర్దిష్ట ప్రదేశము నేడు కచ్చితంగా తెలియదు. అయితే, పర్వత శ్రేణినుండి ఎర్ర సముద్రము ఉత్తర భాగాన్ని చూస్తూ ఆ సంఘటనను దృశ్యీకరించుట సులభమే. ఆసక్తికరమైన విషయమేమంటే, ఆ పర్వతం జెబెల్ అటాకె అని పిలువబడుతున్నది, అనగా “విడిపించిన పర్వతం” అని అర్థం. ఈ పర్వతశ్రేణికి ఎర్ర సముద్రానికీ మధ్య చిన్న మైదానమున్నది. అది సన్నబడి, సముద్రములోనికి చొచ్చుకొనియున్న పర్వతాలవరకు నడిపింది. ఎర్ర సముద్రానికి ఆవలివైపున అనేక నీటిబుగ్గలున్న సారవంత ప్రదేశమున్నది, దీనిని ఆయున్ మ్యూసా అని పిలుస్తారు అంటే, “మోషే బావులు” అని అర్థము. ఈ రెండింటి మధ్యనున్న సముద్రమట్టం క్రమంగా తగ్గుతూవెళ్తూంది మరితర ప్రదేశాల్లోనైతే దాని లోతు 9 నుండి 18 మీటర్లకు అకస్మాతుగా దిగిపోతుంది.
ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై తప్పించుకొనిపోవుటకు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన అద్భుతాన్ని వక్రీకరించడానికి అవిశ్వాసులైన క్రైస్తవ మత వేదాంతులు ప్రయత్నించారు. ఈ సంఘటన లోతులేని చిత్తడినేలలో లేని ఎర్ర సముద్రానికి ఉత్తరానగల చవిటి నేలలో జరిగిందని వారు పేర్కొన్నారు. కాని అది బైబిలు వృత్తాంతానికి సరిపడుట లేదు, ఫరో అతని సైన్యమంతా ఎర్ర సముద్రములో కొట్టుకొని పోయేంతటి, అనగా వారిని మింగివేసేంత సమృద్ధిగా నీరున్న ప్రదేశంలో వారు దాటుట జరిగిందని అది పదేపదే తెల్పుచున్నది.—నిర్గమకాండము 14:26-31; కీర్తన 136:13-15; హెబ్రీయులు 11:29.
సీనాయి అరణ్యము
సీనాయి ద్వీపకల్ప పరిసరాల్లోనున్న క్లిష్టపరిస్థితులు ఇశ్రాయేలీయుల సంచారమును గూర్చిన బైబిలు వృత్తాంతంలో విశదంగా వర్ణించబడ్డాయి. (ద్వితీయోపదేశకాండము 8:15) కాని దేవుని శాసనాన్ని స్వీకరించేందుకు జనాంగమంతా సీనాయి పర్వతము ఎదుట సమకూడి, ఆ పిమ్మట “దూరముగా” వైదొలగగల్గుదురా? (నిర్గమకాండము 19:1, 2; 20:18) ముప్పయి లక్షలమంది ఉన్నట్లు అంచనావేయబడిన ఆ గుంపు అలా కదిలివెళ్లేందుకు సరిపడునంత స్థలమక్కడ ఉన్నదా?
బైబిలు విద్వాంసుడు, 19వ శతాబ్దపు బాటసారియైన ఆర్థర్ స్టాన్లీ సీనాయి పర్వత ప్రాంతాన్ని సందర్శించి, తన బృందం రాస్ సాఫ్ సాఫాను అధిరోహించిన తర్వాత కన్పించిన దృశ్యాన్ని యిలా వర్ణించాడు: “దానిని చూచి వర్ణించిన ప్రతి ఒక్కరిపైనా దాని ప్రభావం తక్షణమే కన్పించింది. . . . ఈ పర్వతం వరకు చొచ్చుకువచ్చిన అతిపెద్ద పసుపువర్ణ మైదానమక్కడ ఉంది . . . ఈ ప్రాంతంలో పర్వతము మైదానము అలా కలిసి ఉండడం బహు అరుదైయుండగా, ఈ సాంప్రదాయ సీనాయి పరిసరాలలో అలాంటి అనుసంధానము ఈ వృత్తాంతము యొక్క సత్యానికి అది నిజంగా ప్రాముఖ్యమైన సాక్ష్యాధారమై నిలిచియుంది.”
వాగ్దాన దేశము
ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరములు సంచరించిన తర్వాత, వారు యిక ప్రవేశించబోవుచున్న దేశవిశేషతలను గూర్చి మోషే యిలా వర్ణించాడు: “నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.”—ద్వితీయోపదేశకాండము 8:7.
సర్వజనాంగము, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పరదేశులేమి అందరూ ఏబాలు గెరిజీము కొండలనడుమ విస్తారమైన నీటి సదుపాయముగల లోయప్రాంతమందు సమకూడినప్పుడు ఈ వాగ్దాన ప్రామాణికత రుజువయ్యింది. గెరిజీము కొండ మట్టమున ఆరు గోత్రాలవారు నిలుచున్నారు. యెహోవా శాసనమునకు విధేయులైతే ఆ జనాంగము అనుభవించగల దైవిక ఆశీస్సులను, ఒకవేళ వారు దేవుని శాసనాన్ని ఉల్లంఘిస్తే వారిపైవచ్చు శాపములను గూర్చి వినడానికి ఆ లోయకు ఆవలివైపున ఏబాలుకొండ దిగువ భాగాన మిగిలిన ఆరుగోత్రాలవారు సమకూడారు. (యెహోషువ 8:33-35) అయితే మరి అట్టి యిరుకైన లోయ ప్రాంతంలో ఆ జనాంగమంతా పట్టేంత స్థలమక్కడ ఉందా? ఆధునిక శబ్దయంత్ర పరికరం లేకుండా వారంతా ఎలా వినగలరు?
లేవీయుల స్వరాలను యెహోవా దేవుడు అద్భుతరీత్యా అధికం చేసియుండవచ్చు. అయినా, అలాంటి అద్భుతం సంభవించనక్కర్లేదు. ఈ లోయనందలి ప్రతిధ్వని విధానం అద్భుతమైంది. “యాత్రికులు అందరూ రెండు అంశాలపై ఏకీభవిస్తున్నారు: 1. ఈ లోయలో పల్కిన దేనినైనా ఏబాలు, గెరిజీముల రెండింటి నుండి స్పష్టంగా వినడానికి ఏవిధమైన యిబ్బంది లేదు. 2. ఇశ్రాయేలీయులంతా నిలుచుండేందుకు కావలిసినంత స్థలాన్ని ఈ రెండు పర్వతాలు కల్గివున్నాయి,” అని 19వ శతాబ్దపు బైబిలు విద్వాంసుడు ఆల్ఫ్రెడ్ ఎడర్షిమ్ వ్రాశాడు.
మరో 19వ శతాబ్దపు బైబిలు విద్వాంసుడు, విలియమ్ థామ్సన్ ఆ లోయలో తన అనుభవాన్ని ది లాండ్ అండ్ ది బుక్ అను తన పుస్తకంలో వర్ణించాడు: “ప్రతిధ్వనిని వినడానికి నేనుగట్టిగా అరిచి, ఆ పిమ్మట ‘యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమును . . . చేసినవాడు శాపగ్రస్తుడగును’ అని పెద్ద స్వరంతో లేవీయులు ఎలుగెత్తి చాటగా, అటు తర్వాత ఆ గొప్ప జనాంగము పదింతల శబ్దముతో ఆమెన్! అన్న మహాద్భుత కేక ఏబాలునుండి గెరిజీమునకు గెరిజీమునుండి ఏబాలునకు ప్రతిధ్వనించుట, ఎలా ఉండునో నేను ఊహించాను.”—ద్వితీయోపదేశకాండము 27:11-15ను పోల్చండి.
యెజ్రెయేలు లోయ
షెకెమునకు ఉత్తరాన మరో సారవంతమైన లోయ ఉన్నది. అది సముద్ర మట్టాని కంటె క్రిందకుండి పెద్దమైదానంగా విస్తరించియుంది. ఈ ప్రాంతాన్నంతా యెజ్రెయేలు లోయ అని పిలుస్తారు, యెజ్రెయేలు పట్టణము పేరున అది నామకరణం చేయబడింది. ఈ లోయ ప్రాంతానికి ఉత్తరంగా గలిలయ కొండలున్నాయి, అక్కడ యేసు స్వగ్రామమైన నజరేతు వుంది. జార్జి స్మిత్ ది హిస్టోరికల్ జియోగ్రఫీ ఆఫ్ ది హోలీ లాండ్ అను తన పుస్తకములో యిలా వివరించాడు, “నజరేతు, పర్వతముల నడుమనున్న మైదానమందున్నది; అయితే ఈ మైదానము అంచునకు నీవు వచ్చి చూస్తే, . . . అదెంత చక్కటి దృశ్యం! [యెజ్రెయేలు లోయ] . . . దాని యుద్ధ భూమితో పాటు . . . నీ కనులెదుట నిలిచియుంటుంది . . . పాత నిబంధన చరిత్రకు అది ఒక రేఖా చిత్రపటము.”
యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు జయించిన పట్టణ-రాజ్యాలైన తానాకు, మెగిద్దో, యొక్నెయాము, బహుశ కెదెషు నగరాలలోని శిధిలాలను పురావస్తు శాస్త్రవేత్తలు ఈ లోయ ప్రాంతములో త్రవ్వి వెలికితీశారు. (యెహోషువ 12:7, 21, 22) ఇదే ప్రాంతమందు, న్యాయాధిపతులైన బారాకు, గిద్యోనుల కాలంలో అత్యంత శక్తివంతులైన శత్రుసేనలనుండి యెహోవా తన ప్రజలను అద్భుత రీతిగావిడిపించాడు.—న్యాయాధిపతులు 5:1, 19-21; 6:33; 7:22.
శతాబ్దాల అనంతరం, రాజైన యెహూ యెజెబెలు, మతభ్రష్టులైన అహాబు యింటి వారిపై యెహోవా న్యాయ తీర్పును అమలుపర్చుటకు ఈ లోయగుండానే యెజ్రెయేలుకు ప్రయాణించి వెళ్లాడు. యెజ్రెయేలు కోటబురుజునుండి తూర్పువైపు 19 కిలోమీటర్ల దూరంలో యెహూ సైన్యాలు తరలిరావడాన్ని చూచుట సులభమే. కావున, యెహూ యెజ్రెయేలు నగరికి చేరుకొనక ముందే రాజైన యెహోరాము మొదట ఒక వార్తాహరుని, పిదప రెండవ వానిని గుర్రములపై పంపెను, చివరకు ఇశ్రాయేలీయుల రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా తామే తమ రథములపై ఆయన నెదుర్కొన వెళ్లిరి. అప్పుడే యెహూ యెహోరామును సంహరించాడు. అహజ్యా పారిపోయాడు గాని అటు పిమ్మట గాయపర్చబడి మెగిద్దోలో చనిపోయాడు. (2 రాజులు 9:16-27) పైన పేర్కొనబడిన యుద్ధభూములను గూర్చి జార్జి స్మిత్ యిలా వ్రాస్తున్నాడు: “ఈ వర్ణనలలో దేనియందుకూడా . . . భౌగోళిక అసాధ్యత కన్పించకపోవడం విశేషం.”
యేసు ఈ యెజ్రెయేలు లోయను చూచి అక్కడ సంభవించిన గగుర్పాటుతో కూడిన విజయాలను ధ్యానించినప్పుడెల్లా తాను వాగ్దాన మెస్సీయనను సంగతినెరిగినవాడై యెహోవా విశ్వాధిపత్యాన్ని మహిమపర్చేందుకు గొప్ప యెహోషువ, గొప్ప బారాకు, గొప్ప గిద్యోను, గొప్ప యెహూల పాత్రను వహించాల్సియుండెనని నిస్సందేహముగా తలంచియుంటాడు. నిజమే, ఈ లోయ ప్రాంతమందు అత్యంత యుద్ధతంత్ర పట్టణమగు మెగిద్దోను, దేవునియుద్ధమగు హార్మెగిద్దోనుకు (అనగా ‘మెగిద్దో పర్వతమని’ భావము) సూచనగా బైబిలు పేర్కొంటున్నది. రాజులకు రాజైన యేసుక్రీస్తు దేవునికి, దేవుని నిజమైన ప్రజలగు క్రైస్తవ సంఘానికి శత్రువులైన వారందరిని నాశనము చేసే భూవ్యాప్త యుద్ధమే అది.—ప్రకటన 16:16; 17:14.
కోపోద్రేకులైన నజరేతు యూదులు యేసును చంపవలెనని “తమపట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసుకొని పోయిరి” అని బైబిలు వర్ణిస్తున్నది. (లూకా 4:29) ఆసక్తికరమైన విషయమేమంటే, ఇప్పుడున్న నగరానికి నైఋతి దిశగా 12 మీటర్ల కొండపేటు ఉన్నది, అక్కడే ఈ సంఘటన సంభవించి యుండవచ్చు. యేసు తన శత్రువులనుండి తప్పించుకొని “కపెర్నహూము పట్టణమునకు” వచ్చెనని బైబిలు తెల్పుచున్నది. (లూకా 4:30, 31) నిజమే, కపెర్నహూము సముద్రమట్టానికి దాదాపు 200 మీటర్ల దిగువున పల్లపు ప్రాంతమందున్నది.
నెపోలియన్ మాత్రమేకాక అనేకులు బైబిలు సంబంధిత భౌగోళికశాస్త్ర ప్రామాణికత్వాన్ని గూర్చి ఆశ్చర్యాన్ని వ్యక్తపర్చడానికి ఇవి అనేక మరితర వివరాలు దోహదపడ్డాయి. “స్థలవర్ణనకు సంబంధించిన [బైబిలు] ఉదాహరణలు అనేకములు, సంతృప్తిదాయకంగా ఉన్నాయి,” అని ది లేండ్ అండ్ ది బుక్లో థాంప్సన్ వ్రాశాడు. “లిఖిత చరిత్రకు పాత, క్రొత్త నిబంధనల రెండింటి సహజ భౌగోళిక స్థితిగతులకు మధ్య ఎడతెగని సంఘీభావమును చూచి ముగ్ధులుకాకుండుట అసాధ్యం,” అని స్టాన్లీ సీనాయ్ అండ్ పాలెస్టెయిన్ పుస్తకమునందు వ్యాఖ్యానించాడు.
భౌగోళిక విషయాల్లో బైబిలు యొక్క ఆశ్చర్యకర ప్రామాణికత్వం అది కేవలం మానవుని నుండి కల్గిన పుస్తకం కాదనడానికి ఒక తార్కాణమైయుంది. దీనికి ముందున్న మూడు కావలికోట సంచికలు బైబిలు సంబంధిత శీర్షికలను కల్గియుండెను. ఈ శీర్షికల పరంపరలో మిగతా ఆ మూడు భాగాలను సంపాదించి చదువమని మేము మిమ్మును ఆహ్వానిస్తున్నాము.
[7వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
యెజ్రెయేలు లోయ
యెజ్రెయేలు
నజరేతు
తానాకు
మెగిద్దో
యొక్నెయాము
కెదెషు
ఉ
గలిలయ సముద్రము
మహా సముద్రము
మైళ్లు
కిలోమీటర్లు
5
10
10
20
[క్రెడిట్ లైను]
Based on a map copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.
[5వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలీయులు సీనాయిపర్వతం వద్ద ధర్మశాస్త్రాన్ని పొందారు
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.