గ్రీసులో యెహోవాసాక్షులకు మరొక విజయం
యెహోవాసాక్షుల ఇద్దరు పూర్తికాల సేవకులు ఇమిడివున్న చట్టబద్ధమైన కేసును, 1995 అక్టోబరు 6న ఏథెన్సులో ఉన్న ముగ్గురు సభ్యుల మెజిస్ట్రేట్ కోర్టు విన్నది. వారిపై మోపబడిన నేరం మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారన్నదే, సాక్షులు ఒక పోలీసు అధికారి ఇంటిని దర్శించిన తర్వాత అతడు వారిపై కేసు నమోదు చేశాడు.
అధ్యక్షత వహించిన న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు, ఆమె యెహోవాసాక్షుల పని ఎడల ఎంతో ఆసక్తి కలిగి ఉందని చూపించాయి. ఉదాహరణకు, ఆమె ఇలా అడిగింది: “మీరు ఈ పనిని ఎంత కాలంనుండి చేస్తున్నారు? ఈ గడిచిన సంవత్సరాల్లో ప్రజలు మీ ఎడల ఎలా వ్యవహరించారు? మీ పనికి ఏ విధమైన ప్రతిస్పందన లభించింది? మీరు ప్రజల ఇళ్లకెళ్లి వారికేం చెబుతారు?” కోర్టు గదిలోని వారందరూ ఇవ్వబడిన చక్కని సాక్ష్యాన్ని శ్రద్ధగా విన్నారు.
సాక్షులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ప్రాసిక్యూటరు కూడా వారి పక్షానే మాట్లాడాడు. “యెహోవాసాక్షులు తమ దేవున్ని విశ్వసించి ఆయనను ఆరాధించే హక్కును మాత్రమే కాక, తమ విశ్వాసాన్ని ఇంటింటా బహిరంగ స్థలాల్లో, వీధుల్లో ప్రకటించే మరియు తమకిష్టమైతే తమ ప్రచురణలను ఉచితంగా పంచిపెట్టే హక్కును కూడా వారు కలిగి ఉన్నారు” అని అతడు తన ముగింపు ప్రసంగంలో పేర్కొన్నాడు. కోర్టులు మరియు స్టేట్ కౌన్సిల్ నిర్దోషులని తీర్పు ఇచ్చిన వివిధ తీర్పులను ప్రాసిక్యూటరు సూచించాడు. మానవహక్కుల యూరప్ కోర్టు ద్వారా యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇవ్వబడిన కొక్కీనాకీస్ వి. గ్రీస్ కేసును గురించి కూడా అతడు ప్రస్తావించాడు.a “ఈ కేసులో గ్రీసు జరిమానా కూడా చెల్లించిందని దయచేసి గమనించండి. కాబట్టి అలాంటి కేసులకు తీర్పు తీర్చమని మనలను కోరినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి, ఇలాంటి కేసులను ఎప్పుడూ కోర్టుకు తీసుకు రాకూడదు” అని ప్రాసిక్యూటరు హెచ్చరించాడు.
ప్రాసిక్యూటరు ప్రసంగం తర్వాత, సాక్షుల తరఫు న్యాయవాది చెప్పేందుకు ఎక్కువేమీ మిగలలేదు. అయినప్పటికీ, మతమార్పిడి చట్టం రాజ్యాంగానికి విరుద్ధమైనదని మరియు అది గ్రీసును అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందిపెడుతూ ఉందని నొక్కి చెప్పేందుకు ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు.
అధ్యక్షత వహిస్తున్న న్యాయమూర్తి ఇతర ఇద్దరు న్యాయమూర్తుల వైపు చూసిందంతే, తర్వాత సహోదరుడు, సహోదరీ ఏకగ్రీవంగా నిర్దోషులుగా తీర్పు తీర్చబడ్డారు. గంటా పది నిమిషాలు సాగిన విచారణ యెహోవా నామానికి, ఆయన ప్రజలకు ఒక ఘనవిజయం.
మత మార్పిడి ఇమిడివున్న మానవహక్కుల యూరప్ కోర్టు కొక్కీనాకీస్ కేసును వినిన తర్వాతి కేసుల్లో ఇది నాల్గవది, ఈ నాలుగింటిలోనూ యెహోవాసాక్షులు నిర్దోషులుగా తీర్పు తీర్చబడ్డారు. తమ ప్రకటనాపనికి సంబంధించి ఇక ఎలాంటి సమస్యలూ లేవని, అవరోధం లేకుండా తాము తమ పనిని కొనసాగించడం ఇక సులభమని గ్రీసులోని యెహోవాసాక్షులు ఆనందిస్తున్నారు.
[అధస్సూచీలు]
a కావలికోట సెప్టెంబరు 1, 1993, 27-31 పేజీలను చూడండి.