యేసును గూర్చిన సత్యం
యేసు ఎవరు, ఆయన ఏమి సాధించాడు అనేవాటికి సంబంధించిన సిద్ధాంతాలకు, ఊహాకల్పనలకు అంతు లేదన్నట్లు అనిపిస్తుంది. కానీ బైబిలు విషయమేమిటి? అది యేసును గూర్చి మనకేమి చెబుతుంది?
బైబిలు చెప్పేది
బైబిలును జాగ్రత్తగా చదువుతుండగా మీరు ఈ కీలకమైన వాస్తవాలను గమనిస్తారు:
◻ యేసు దేవుని అద్వితీయ కుమారుడు, సర్వసృష్టికి ఆదిసంభూతుడు.—యోహాను 3:16; కొలొస్సయులు 1:15.
◻ దాదాపు రెండు సహస్రాబ్దాల కాలం క్రితం, దేవుడు యేసు జీవాన్ని మానవునిగా పుట్టేందుకై యూదా కన్యక అయిన మరియ గర్భంలోనికి మార్చాడు.—మత్తయి 1:18; యోహాను 1:14.
◻ యేసు కేవలం ఒక మంచి మానవుడు మాత్రమే కాదు. ఆయన ప్రతి విషయంలోను తన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సుందరమైన వ్యక్తిత్వానికి విశ్వసనీయమైన ప్రతిరూపమై ఉన్నాడు.—యోహాను 14:9, 10; హెబ్రీయులు 1:3.
◻ తన భూ పరిచర్యలో, పీడిత ప్రజల అవసరాలను యేసు ప్రేమపూర్వకంగా తీర్చాడు. ఆయన అద్భుతంగా రోగులను స్వస్థపర్చాడు, చివరికి మృతులను లేపాడు కూడా.—మత్తయి 11:4-6; యోహాను 11:5-45.
◻ దురవస్థలోనున్న మానవాళికి దేవుని రాజ్యమే ఏకైక నిరీక్షణ అని యేసు ప్రకటించాడు, ఈ ప్రకటనా పనిని కొనసాగించడానికి ఆయన తన శిష్యులకు శిక్షణనిచ్చాడు.—మత్తయి 4:17; 10:5-7; 28:19, 20.
◻ సా.శ. 33, నీసాను 14 (దాదాపు ఏప్రిల్ 1)న రాజద్రోహం అనే అబద్ధ ఆరోపణపై యేసు బంధించబడి, తీర్పు తీర్చబడి, శిక్షించబడి, చంపబడ్డాడు.—మత్తయి 26:18-20, 48-మత్తయి 26:48 నుండి 27:50.
◻ యేసు మరణం నమ్మకముంచే మానవజాతిని పాపభరిత స్థితి నుండి విడుదల చేస్తూ, విమోచన క్రయధనంగా పనిచేస్తుంది, ఆ విధంగా ఆయనయందు విశ్వాసముంచే వారందరికీ నిరంతర జీవితానికి మార్గాన్ని తెరుస్తుంది.—రోమీయులు 3:23, 24; 1 యోహాను 2:2.
◻ నీసాను 16న, యేసు పునరుత్థానం చేయబడ్డాడు, అటుతరువాత త్వరలోనే ఆయన తన తండ్రికి తన పరిపూర్ణ మానవ జీవితం యొక్క విమోచన క్రయధన విలువను అందించడానికి పరలోకానికి ఆరోహణమయ్యాడు.—మార్కు 16:1-8; లూకా 24:50-53; అపొస్తలుల కార్యములు 1:6-9.
◻ పునరుత్థానమైన యేసు, యెహోవా నియమిత రాజుగా మానవుని కొరకైన దేవుని తొలి సంకల్పాన్ని నెరవేర్చడానికి పూర్తి అధికారం కలిగివున్నాడు.—యెషయా 9:6, 7; లూకా 1:32, 33.
ఆ విధంగా దేవుని సంకల్పాలను నెరవేర్చడంలో యేసు కీలకమైన వ్యక్తియని బైబిలు తెలియజేస్తుంది. కానీ ఈయనే బేత్లెహేములో జన్మించి, దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై నడిచిన నిజమైన యేసని—చరిత్రలోని యేసని మీరు ఎలా రూఢిగా తెలుసుకోవచ్చు?
నమ్మకానికి ఆధారం
క్రైస్తవ గ్రీకు లేఖనాలను నిష్పక్షపాతమైన మనస్సుతో కేవలం చదవడం ద్వారా అనేక సందేహాలను తొలగించవచ్చు. మీరు అలా చేయడంద్వారా, పురాణాల విషయంలోలాగ బైబిలు వృత్తాంతం సంఘటనల అస్పష్టమైన కథనం కాదని మీరు కనుగొంటారు. బదులుగా, పేర్లు, నిర్దిష్టమైన కాలాలు, కచ్చితమైన స్థలాలు పేర్కొనబడ్డాయి. (ఉదాహరణకు, లూకా 3:1, 2 చూడండి.) అదనంగా, చదువరిలో నమ్మకాన్ని కల్గించే రీతిలో యేసు శిష్యులు గమనార్హమైన నిజాయితీతోను, నిష్కాపట్యంతోను చిత్రించబడ్డారు. రచయితలు ఒక విశ్వసనీయమైన నివేదికను అందించడానికిగాను ఎవరికీ రంగులు పులమలేదు, చివరికి తమ చిత్రీకరణలకు కూడా రంగులు పులుముకోలేదు. అవును, మీరు బైబిలులో సత్యం ఉన్నట్లు చూస్తారు.—మత్తయి 14:28-31; 16:21-23; 26:56, 69-75; మార్కు 9:33, 34; గలతీయులు 2:11-14; 2 పేతురు 1:16.
అయితే ఇంకా ఉంది. పురాతత్త్వశాస్త్ర ఆవిష్కరణలు మళ్లీ మళ్లీ బైబిలు రికార్డును దృఢపర్చాయి. ఉదాహరణకు, మీరు జెరూసలేమ్‌లోని ఇజ్రాయెల్ పురావస్తు ప్రదర్శనశాలను సందర్శిస్తే, పొంతి పిలాతును ప్రస్తావించే అభిలేఖనం ఉన్న ఒక బండను మీరు చూడగలరు. బైబిలు పేర్కొంటున్న లుసానియ మరియు సెర్గి పౌలులను తొలి క్రైస్తవుల ఊహాజనిత సృష్టి అనడానికి బదులుగా వారు నిజమైన వ్యక్తులు అని ఇతర పురాతత్త్వశాస్త్ర ఆవిష్కరణలు దృఢపరుస్తున్నాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాలలో (క్రొత్త నిబంధన) నివేదించబడిన సంఘటనలకు జువెనల్, టాసిటస్, సెనెకా, స్యూటోనియస్, ప్లినీ ది యంగర్, లూషన్, కెల్సస్, యూదా చరిత్రకారుడైన జోసీఫస్ వంటి ప్రాచీన రచయితల రచనల్లో సమృద్ధమైన నిర్ధారణలు కనుగొనబడుతున్నాయి.a
క్రైస్తవ గ్రీకు లేఖనాలలోని వృత్తాంతాలను మొదటి శతాబ్దంలో జీవిస్తున్న వేలాదిమంది మారు ప్రశ్న లేకుండా స్వీకరించారు. క్రైస్తవత్వపు శత్రువులు కూడా యేసు ఏమి చెప్పాడు, ఏమి చేశాడనేవాటిని గురించిన నివేదికల సత్యసంధతను నిరాకరించలేదు. యేసు వ్యక్తిత్వానికి ఆయన మరణం తర్వాత తన శిష్యులచే రంగులు పులమబడ్డాయనే సాధ్యతను గురించి ఆచార్యుడైన ఎఫ్. ఎఫ్. బ్రూస్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “కొంతమంది రచయితలు అనుకుంటున్నట్లుగా ఏమి జరిగిందో, ఏమి జరగలేదో జ్ఞాపకముంచుకోగల్గే అంతమంది శిష్యులు ఇంకా జీవించి ఉన్న ఆ తొలి దినాలలో యేసు చెప్పిన పలుకులను, చేసిన క్రియలను కల్పించడం నిశ్చయంగా అంత సుళువైనదేమీ కాదు. . . . శిష్యులు పొరపాట్లను (వాస్తవాలను వక్రీకరించడం విషయం చెప్పనే అక్ఖర్లేదు) నివేదించే సాహసాన్ని చేయలేరు. అలా చేస్తే వాటిని వెల్లడి చేయడానికి మహదానందపడే వారిచే అవి వెంటనే వెల్లడిచేయబడేవే.”
వారు విశ్వసించకపోవడానికి కారణాలు
ఏమైనప్పటికీ, కొంతమంది పండితులు సంశయవాదులుగా ఉండిపోతారు. వారు బైబిలు రికార్డు కాల్పనికమైనదని భావిస్తుండగా, అపోక్రిఫల్ వ్రాతలను ఆతురతతో శోధించి, వీటిని విశ్వసనీయమైనవని వారు స్వీకరిస్తారు! ఎందుకు? స్పష్టంగా, అనేకమంది ఆధునిక మేధావులు విశ్వసించాలని కోరుకోని విషయాలు బైబిలు రికార్డులో ఉన్నాయి.
1871లో ప్రచురించబడిన తన యూనియన్ బైబిల్ కంపానియన్‌లో, ఎస్. ఆస్టిన్ అల్‌బోన్ సంశయవాదులకు ఒక సవాలును విసిరాడు. ఆయనిలా వ్రాశాడు: “సువార్త చరిత్రను సందేహిస్తున్నానని చెప్పుకుంటున్న వారినెవరినైనా సీజర్ కాపిటోల్‌లో మరణించాడని, లేక 800లో షార్లిమాన్ చక్రవర్తిని పశ్చిమ సామ్రాజ్యానికి చక్రవర్తిగా పోప్ లియో III రాజ్యాభిషిక్తుని చేశాడని నమ్మడానికి ఏమి కారణాలున్నాయో అడగండి? . . . ఈ వ్యక్తుల విషయమై . . . స్థిరంగా పలుకబడిన వాక్యాలన్నింటినీ మనము నమ్ముతాము; అలా ఎందుకంటే మనకు వాటి సత్యత్వాన్ని గూర్చి చారిత్రాత్మక సాక్ష్యాధారం ఉంది. . . . ఒకవేళ, ఇటువంటి రుజువును అందించినప్పుడు ఎవరైనా ఇంకా నమ్మడానికి తిరస్కరిస్తే మనం వారు మూర్ఖత్వంగల వక్రమైనవారని లేక ఘోరమైన రీతిలో అజ్ఞానులని వారిని విడిచిపెడతాము. అయితే, పరిశుద్ధ లేఖనాల ప్రామాణికతకు సమృద్ధియైన సాక్ష్యాధారం ఉన్నప్పటికీ తాము ఒప్పింపబడలేకపోయామని చెప్పుకునే వారి గురించి మనం ఏమి అంటాము? . . . వారు తమ అహంకారాన్ని అణచివేసే విషయాన్ని నమ్మడానికి, తమ జీవిత విధానాలను మార్చుకోవడానికి ఇష్టపడరు.”
అవును, కొంతమంది సంశయవాదులు క్రైస్తవ గ్రీకు లేఖనాలను తిరస్కరించడంలో దురుద్దేశాలను కలిగి ఉన్నారు. వారికున్న సమస్య దాని విశ్వసనీయతను గురించి కాదు గాని దాని ప్రమాణాల విషయమే. ఉదాహరణకు, యేసు తన శిష్యులను గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:14) అయితే, క్రైస్తవులమని చెప్పకునే అనేకమంది ఈ లోక రాజకీయాల్లో పూర్తిగా మునిగివున్నారు, చివరికి రక్తపాతంతో కూడిన యుద్ధాల్లో కూడా భాగం వహించారు. బైబిలు ప్రమాణాలకు అనురూపంగా ఉండడానికి బదులుగా అనేకమంది ప్రజలు బైబిలే తమ స్వంత ప్రమాణాలకు అనురూపంగా ఉండాలని కోరుకుంటారు.
నైతిక విలువల విషయం కూడా పరిగణించండి. వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నందుకు తుయతైరలోని సంఘానికి యేసు ఖండితమైన సలహాను ఇచ్చాడు. “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే” అని ఆయన వారికి చెప్పాడు, “మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.”b (ప్రకటన 2:18-23) అయినా, క్రైస్తవులమని చెప్పుకునే అనేకమంది నైతిక ప్రమాణాలను గాలికి విడిచిపెడ్తున్నారన్నది నిజం కాదా? వారు తమ అనైతిక ప్రవర్తనను విసర్జించడానికి బదులుగా యేసు చెప్పింది తిరస్కరిస్తారు.
బైబిలులోని యేసును స్వీకరించకుండడానికి ఉన్ముఖులై, పండితులు తమ స్వంత ఊహలలోని యేసును సృష్టించుకున్నారు. పురాణ కథలు సృష్టిస్తున్నారని సువార్త రచయితలను అబద్ధంగా నిందిస్తూ, వారే ఆ విషయంలో అపరాధులు అవుతున్నారు. వారు తాము అంగీకరించాలనుకున్న యేసు జీవితపు భాగాలను నమ్ముతూ, మిగతా వాటిని తిరస్కరించి, తమ స్వంతంగా కొన్ని వివరాలను చేరుస్తారు. వాస్తవానికి, తమ తిరుగులాడుతున్న ఋషి లేక సాంఘిక విప్లవవాది, తాము వెదుకుతున్నామని చెప్పుకునే చరిత్రలోని యేసు కాదు; బదులుగా, యేసును గూర్చిన వారి భావన కేవలం గర్వంతో కూడిన తమ పాండిత్య ఊహల్లోని కల్పితకథ మాత్రమే.
నిజమైన యేసును కనుగొనుట
సత్యం కొరకు, నీతి కొరకు యథార్థంగా ఆకలిదప్పులు గలవారి హృదయాలను జాగృతం చేయడానికి యేసు ప్రయత్నించాడు. (మత్తయి 5:3, 6; 13:10-15) అటువంటి వారు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” అనే యేసు ఆహ్వానానికి ప్రతిస్పందిస్తారు.—మత్తయి 11:28-30.
నిజమైన యేసు ఆధునిక పండితులు వ్రాసిన పుస్తకాల్లో కనబడడు; మానవ నిర్మిత ఆచారాలకు పట్టుకొమ్మగా ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలలోనూ కనబడడు. మీరు చరిత్రాత్మక యేసును మీ బైబిలు ప్రతినందు కనుగొనగలరు. మీరు ఆయన గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు నేర్చుకోవడంలో యెహోవాసాక్షులు మీకు సహాయపడతారు.
[అధస్సూచీలు]
a మరింత సమాచారం కొరకు వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా?, (ఆంగ్లం) 5వ అధ్యాయం, 55-70 పేజీలను చూడండి.
b బైబిలులో, అంతరింద్రియములు కొన్నిసార్లు ఒకరి లోతైన ఆలోచనలను మరియు భావోద్రేకాలను సూచిస్తాయి.
[6వ పేజీలోని బాక్సు]
శతాబ్దాల నుండి విమర్శ
క్రైస్తవ గ్రీకు లేఖనాలను విమర్శించే అలవాటు 200 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, హెర్మాన్ జామ్యూయెల్ రైమారస్ (1694-1768) అనే జర్మన్ తత్త్వవేత్త ఈ క్రింది విధంగా దృఢంగా చెప్పినప్పుడు వ్రేళ్లూనింది: “తమ వ్రాతల్లోని అపొస్తలుల బోధలకు, యేసు తనకు తానుగా తన స్వంత జీవిత కాలంలో ఏమి ప్రకటించి, ఏమి బోధించాడో దానికి మధ్య సంపూర్ణ విభిన్నత ఉందని చెప్పడంలో మన తప్పేమీ లేదు.” రైమారస్ కాలం నుండి, అనేకమంది పండితులు అదే విధంగా భావించేలా నేర్పించబడ్డారు.
నిజమైన యేసు (ఆంగ్లం) అనే పుస్తకం గతంలోని అనేకమంది విమర్శకులు తమను తాము మతభ్రష్టులుగా పరిగణించలేదని అంటుంది. బదులుగా, “అంధవిశ్వాసం మరియు మూఢనమ్మకాల సంకెళ్ల నుండి స్వేచ్ఛను పొందినందుకు వారు తమను తాము మరింత స్వచ్ఛమైన క్రైస్తవులని అనుకున్నారు.” ఉన్నత విమర్శ “స్వచ్ఛమైన రకపు క్రైస్తవత్వం” అని వారు భావించారు.
క్రైస్తవమత సామ్రాజ్యం మానవ నిర్మిత ఆచారానికి పట్టుకొమ్మగా తయారయ్యిందనేది ఒక విషాదకరమైన వాస్తవం. బైబిలుకు విరుద్ధంగా ఉన్న వాటిలో అమర్త్య ప్రాణము, త్రిత్వం, నరకాగ్ని వంటి సిద్ధాంతాలు కొన్ని మాత్రమే. కానీ సత్యం యొక్క ఈ భ్రష్టత్వానికి క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితలు బాధ్యులు కారు. దానికి విరుద్ధంగా, క్రైస్తవులమని చెప్పుకునే వారి మధ్య భ్రష్టత్వం “ఇప్పటికే క్రియ చేయుచున్నది” అని పౌలు ఎప్పుడైతే వ్రాశాడో ఆ మొదటి శతాబ్దం మధ్యలో వారు అబద్ధ బోధల తొలి జాడలకు విరుద్ధంగా పోరాడారు. (2 థెస్సలొనీకయులు 2:3, 7) క్రైస్తవ గ్రీకు లేఖనాలలో ఉన్నది చారిత్రాత్మక మరియు సైద్ధాంతిక సత్యం యొక్క రికార్డు అని మనము నమ్మిక కల్గియుండవచ్చు.
[7వ పేజీలోని బాక్సు]
సువార్తలు ఎప్పుడు వ్రాయబడ్డాయి?
సువార్తలు వర్ణించిన సంఘటనలు సంభవించిన చాలా కాలం తర్వాత అవి వ్రాయబడ్డాయి, అందువలన కొన్ని పొరపాట్లు ఉండడం దాదాపు నిశ్చయం అని క్రొత్త నిబంధన విమర్శకులు అనేకమంది పిడివాదం చేస్తారు.
అయితే, మత్తయి, మార్కు, లూకాల రచనకు వారు చెబుతున్నదానికంటే మునుపటి తేదీని సాక్ష్యాధారాలు సూచిస్తున్నాయి. అసలు వ్రాత దాదాపు సా.శ. 41లో జరిగిందని కొన్ని మత్తయి వ్రాతప్రతుల కాపీల క్రింద వ్రాయబడిన సమాచారం సూచిస్తుంది. లూకా సువార్త బహుశ సా.శ. 56, 58 మధ్య వ్రాయబడివుండవచ్చు, ఎందుకంటే అపొస్తలుల కార్యముల పుస్తకం (బహుశ 61లో పూర్తిచేయబడి ఉండవచ్చు) దాని రచయిత అయిన లూకా అప్పటికే తన “మొదటి గ్రంథము” అయిన సువార్తను వ్రాశాడని సూచిస్తుంది. (అపొస్తలుల కార్యములు 1:2) మార్కు సువార్త అపొస్తలుడైన పౌలు మొదటి లేక రెండవ ఖైదు సమయంలో—బహుశ సా.శ. 60, 65 మధ్య సంవత్సరాలలో రోమ్‌లో సంకలనం చేయబడిందని పరిగణించబడుతుంది.
ఆచార్యుడైన క్రేగ్ ఎల్. బ్లోమ్‌బెర్గ్ ఆ సువార్తల తొలి తేదితో ఏకీభవిస్తున్నాడు. మొదటి శతాబ్దపు చివర్లో సంకలనం చేయబడిన యోహాను సువార్తను కలుపుకున్నప్పుడు కూడా “అనేకమైన ప్రాచీన జీవిత చరిత్రల విషయంలో జరిగిన దాన్ని పోలిస్తే మనం అసలు సంఘటనలకు ఇంకా ఎంతో దగ్గరగా ఉన్నాము” అని ఆయన అంటున్నాడు. ఉదాహరణకు, అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క ఇద్దరు తొలి చరిత్రకారులు అయిన అర్రీయన్ మరియు ప్లుటార్చ్‌లు క్రీ.పూ. 323లో సంభవించిన అలెగ్జాండర్ మరణానికి నాలుగు వందలకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత వ్రాశారు, అయినా చరిత్రకారులు సాధారణంగా వారు నమ్మకయోగ్యమైనవారని పరిగణిస్తారు. కాలం గడిచే కొలది అలెగ్జాండర్ జీవితం గురించి అద్భుతమైన గాథలు అల్లబడ్డాయి, కానీ ఈ గాథల్లో చాలామట్టుకు ఈ ఇద్దరు రచయితల తర్వాత అనేక శతాబ్దాల కాలంలో అల్లబడ్డాయి.” క్రైస్తవ గ్రీకు లేఖనాల చరిత్రాత్మక భాగాలు నిశ్చయంగా లౌకిక చరిత్రలకు ఉన్నంత విశ్వసనీయత అయినా కలిగివుండను యోగ్యమైనవే.
[8వ పేజీలోని చిత్రం]
రాబోయే భూపరదైసులో అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది