పండితుల ప్రకారం సువార్త
“నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారు?” (లూకా 9:18) యేసు తన శిష్యులను దాదాపు రెండు సహస్రాబ్దాల క్రితం ఈ ప్రశ్నను అడిగాడు. ఈ ప్రశ్న అప్పుడు వివాదాస్పదంగా ఉండింది. ప్రత్యేకంగా యేసుపై కేంద్రీకరించబడుతుందని చెప్పబడే క్రిస్టమస్ సీజన్‌లో అదిప్పుడు ఇంకా ఎక్కువ వివాదాస్పదంగా ఉన్నట్లుంది. మానవజాతిని విమోచించడానికి యేసు పరలోకం నుండి పంపించబడ్డాడని అనేకమంది నమ్ముతారు. మీరు కూడా నమ్మేది అదేనా?
కొంతమంది పండితులు వేరే దృష్టికోణాన్ని ప్రతిపాదిస్తారు. “తాను లోక పాపముల నిమిత్తం మరణించవలసిన దేవుని కుమారుడినని బోధించేవానిగా ఉన్న యేసు ప్రతిరూపం చారిత్రాత్మకంగా సత్యం కాదు” అని మతం మరియు సంస్కృతుల ఆచార్యుడైన మార్కస్ జే. బోర్గ్ వాదిస్తున్నాడు.
నిజమైన యేసు మనం బైబిలులో చదివే యేసు కాదని ఇతర పండితులు వాదిస్తారు. సువార్తలన్నీ యేసు మరణించడానికి నాలుగు దశాబ్దాలు లేక అంతకు ఎక్కువ సంవత్సరాల తరువాత లిఖించబడ్డాయని, అప్పటికే యేసు యొక్క వాస్తవమైన వ్యక్తిత్వానికి రంగులు పూయబడ్డాయని కొంతమంది నమ్ముతారు. సమస్య సువార్త రచయితల జ్ఞాపకశక్తికి సంబంధించినది కాదు గానీ వారి వివరణకు సంబంధించినది అని పండితులు నొక్కి చెబుతారు. యేసు మరణం తర్వాత శిష్యులు ఆయనను వేరేగా—దేవుని కుమారునిగా, రక్షకునిగా, మెస్సీయగా దృష్టించడం మొదలుబెట్టారు. యేసు కేవలం ఒక యూదా గ్రామీణుడని, తిరుగులాడుతున్న ఒక ఋషి అని, ఒక సాంఘిక విప్లవవాదియని అంతకంటే ఎక్కువేమీ కాదని కొంతమంది ధైర్యంగా వాదిస్తారు. సువార్త సత్యం ఆ విధంగా ఉంది అని పండితులు అంటారు.
యేసును గూర్చిన “పాండిత్య” దృష్టికోణం
తమ “పాండిత్య” దృష్టికోణాన్ని సమర్థించుకోవడానికి విమర్శకులు యేసును గూర్చి అలౌకికంగా కన్పిస్తున్న దేనినైనా కొట్టిపారేయడానికి ఉత్సుకత చూపిస్తున్నట్లుగా ఉంది. ఉదాహరణకు, కన్యకకు పుట్టడం యేసు యొక్క అక్రమ జన్మను కప్పిపుచ్చడానికని కొంతమంది అంటారు. ఇతరులు యెరూషలేము వినాశనం గూర్చిన యేసు ప్రవచనాలు వాటి “నెరవేర్పు” తర్వాత అవి సువార్తలలో చొప్పించబడ్డాయని పిడివాదం చేస్తూ వాటిని తిరస్కరిస్తారు. కొంతమంది యేసు స్వస్థతలు కేవలం మనశ్శరీర సంబంధమైనవని కూడా అంటారు. అటువంటి ప్రతిపాదనలు నిజమని మీరు అనుకుంటున్నారా లేక అవి అసంగతంగా ఉన్నాయనుకుంటున్నారా?
యేసు శిష్యులే తమ ఉద్యమం నీరుగారకుండా ఉండేందుకు పునరుత్థానాన్ని కల్పించారని కూడా కొంతమంది పండితులు వాదిస్తారు. ఎంతైనా యేసు అనుచరులు ఆయన లేకుండా శక్తిహీనులు కదా, అందుకని వారు తమ వ్రాతల్లో తమ యజమానుని ప్రముఖ పాత్రను పునఃస్థాపితం చేయడానికి చరిత్రను కల్పించారు అని పండితులు తర్కిస్తారు. మౌలికంగా పునరుత్థానం చెందింది క్రీస్తు కాదుగానీ క్రైస్తవత్వం అని పండితులు అంటున్నారు. అలా అనడం ద్వారా పండితులు తమ స్వేచ్ఛను అతిక్రమిస్తున్నారని అనిపిస్తే, యేసు అసలు చంపబడనేలేదు అని చెప్పే బార్బారా థీరింగ్ అనే వేదాంతురాలి ప్రతిపాదన సంగతేమిటి? యేసు కొరత వేయబడడాన్ని తప్పించుకుని, రెండు పెళ్ళిళ్ళు చేసుకుని, ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడని ఆమె నమ్ముతుంది.
ఈ వాదనలన్నీ యేసును అనేకమంది పండితులు ఆయనను అంగీకరించే ఒకే ఒక్క స్థాయికి దిగజారుస్తాయి, అంటే వారు ఆయనను ఒక జ్ఞానిగా, నామమాత్ర యూదునిగా, సంఘ సంస్కర్తగా—మరెవరిగానైనా సరే అంగీకరిస్తారు కానీ “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” వచ్చిన దేవుని కుమారునిగా మాత్రం అంగీకరించరు.—మత్తయి 20:28.
బహుశ సంవత్సరంలోని ఈ సమయంలో మీరు పశువుల తొట్టిలో యేసు జననము గూర్చిన భాగం వంటి సువార్తల భాగాలను చదివివుండవచ్చు. లేక మీరు అటువంటి వృత్తాంతాలను చర్చిలో వినివుండవచ్చు. మీరు సువార్త వృత్తాంతాలను విలువైనవిగా, నమ్మశక్యమైనవిగా అంగీకరించారా? అయితే దిగ్భ్రాంతిని కలిగించే ఈ పరిస్థితిని గమనించండి. జీసస్ సెమినార్ అని పిలువబడిన ఒకదానిలో, పండితుల గుంపొకటి యేసు మాటల ప్రామాణికతను నిర్ధారించడానికి 1985 నుండి సంవత్సరానికి రెండు సార్లు చొప్పున కలుస్తూ వచ్చింది. యేసు ఈ మాటలు పలికాడని బైబిలు ఆయనకు ఆపాదించే వాటిని యేసు నిజంగా పలికాడా? సెమినార్ యేసు యొక్క ప్రతి పలుకుకు రంగుల పూసలతో ఓటు వేశారు. ఎరుపు రంగు పూసకు అర్థం ఆ మాట తప్పకుండా యేసు పలికినదే; గులాబీవర్ణంలోని పూసకు అర్థం యేసు బహుశ అది చెప్పివుంటాడు; బూడిద రంగు పూస సందేహాన్ని సూచిస్తుంది; మరియు నల్ల పూస అది అబద్ధమని తెలుపుతుంది.
యేసు ఈ మాటలు పలికాడని ఆయనకు ఆపాదించబడిన పదాల్లో 82 శాతం పదాలు బహుశ ఆయన పలికి ఉండకపోవచ్చు అని జీసస్ సెమినార్ ప్రకటించిందని తెలుసుకుంటే మీరు కలత చెందుతుండవచ్చు. మార్కు సువార్తలోని ఒక్క ఉల్లేఖనం మాత్రమే నమ్మదగినది అని భావించబడుతుంది. లూకా సువార్త పూర్తిగా ప్రచారంతో నిండి ఉందని, “అంతర్నిహితమైన మూలాన్ని నిర్ధారించలేని” విధంగా ఉందని చెప్పబడింది. యోహాను సువార్తలోని మూడు వరుసలు తప్పించి మిగతా అంతటికీ అది అబద్ధమని తెలుపుతూ నల్ల పూసల ఓటు లభించింది, మరి మిగిలిన ఆ కాస్త ముక్కకు సందేహాన్ని సూచించే బూడిద రంగు పూస లభించింది.
కేవలం సైద్ధాంతికం మాత్రమే కాదు
మీరు పండితులతో ఏకీభవిస్తారా? యేసును గూర్చి బైబిలులో కనుగొనబడే దానికన్నా మరింత కచ్చితమైన చిత్రణను వారు మనకు అందిస్తున్నారా? ఈ ప్రశ్నలు పాండిత్య వాదోపవాదాలకు సంబంధించినవి మాత్రమే కావు. సంవత్సరంలోని ఈ సమయంలో, బైబిలు ప్రకారం “[ఆయనయందు] విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు” దేవుడు యేసును పంపించాడని మీకు జ్ఞాపకం చేయబడవచ్చు.—యోహాను 3:16.
ఒకవేళ యేసు మనకు ఏమీ తెలియని తిరుగులాడుతున్న ఒక ఋషి మాత్రమే అయితే ఆయనయందు మనం ‘విశ్వాసముంచడం’ నిరర్థకంగా ఉంటుంది. మరోవైపు, ఒకవేళ యేసును గూర్చిన బైబిలు చిత్రణ సత్యమైనదైతే, మన నిరంతర రక్షణ అందులో ఇమిడివుంది. అందువలన మనం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది—బైబిలు యేసును గూర్చిన సత్యాన్ని కలిగి ఉందా?