మీ జీవితంలో సర్వోత్కృష్టమైనదేమిటి?
“నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.”—కీర్తన 143:8.
1. మానవ ప్రయాసలు మరియు సాఫల్యాల గురించి సొలొమోను రాజు ఏ అభిప్రాయానికి వచ్చాడు?
జీవితం కార్యకలాపాలతోను వ్యవహారాలతోను నిండివుందన్నది బహుశా మీకు బాగా తెలిసిన విషయమే. మీరు దాని గురించి ఆలోచించినప్పుడు, వాటిలో కొన్ని ఆవశ్యకమైనవన్నట్లు మీరు గుర్తించవచ్చు. ఇతర కార్యకలాపాలు మరియు వ్యవహారాలు తక్కువ ప్రాముఖ్యత గలవి లేక వ్యర్థమైనవి కూడా కావచ్చు. మీరు దీన్ని గుర్తించారంటే మీరు జ్ఞానవంతులైన వ్యక్తులలో ఒకడైన సొలొమోను రాజుతో ఏకీభవిస్తున్నట్లే. జీవిత కార్యకలాపాలను క్షుణ్ణంగా పునఃసమీక్షించిన తర్వాత, ఆయన ఈ అభిప్రాయానికి వచ్చాడు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 2:4-9, 11; 12:13) ఇది మనకు నేడు ఏ ప్రాధాన్యతను కలిగివుంది?
2. దైవభయంగల ప్రజలు తమకు తాము ఏ ప్రాథమిక ప్రశ్న వేసుకోవాలి, అది ఏ సంబంధిత ప్రశ్నలకు నడిపిస్తుంది?
2 మీరు “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచు”కోవాలని కోరుకుంటే, మీకు మీరు సవాలుతో కూడిన ఈ ప్రశ్నను వేసుకోండి, ‘నా జీవితంలో సర్వోత్కృష్టమైనదేమిటి?’ నిజమే, మీరు ఆ ప్రశ్న గురించి ప్రతిరోజు ఆలోచించకపోవచ్చు, కాని ఇప్పుడు దాన్ని ఎందుకు పరిశీలించకూడదు? వాస్తవానికి, ‘నేను నా ఉద్యోగానికి లేక వృత్తికి లేక వస్తుసంబంధ విషయాలకు అనవసరమైన ప్రాముఖ్యతనిస్తున్నానా? నా ఇల్లు, కుటుంబం, ప్రియమైనవారు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నారు?’ వంటి కొన్ని సంబంధిత ప్రశ్నలను అది గుర్తు చేస్తుంది. ఒక యౌవనస్థుడు ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘విద్య నా అవధానాన్ని, సమయాన్ని ఎంత మేరకు తీసుకుంటోంది? వాస్తవంగా, ఒక వ్యాపకం, క్రీడ, లేక ఏదైనా ఒక విధమైన వినోదం లేక సాంకేతిక పరిజ్ఞానం నాకు అత్యంత ఆసక్తికరమైనదిగా ఉందా?’ మన వయస్సు లేక పరిస్థితి ఏదైనప్పటికీ, మనం ఇలా ప్రశ్నించుకోవడం సమంజసంగా ఉంటుంది, ‘నా జీవితంలో దేవుని సేవకు ఏ స్థానం ఉంది?’ ప్రాముఖ్యమైన వాటిని నిర్ణయించుకోవడం యొక్క అవసరతను బహుశా మీరు అంగీకరిస్తుండవచ్చు. కాని వాటిని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకోవడానికి కావలసిన సహాయాన్ని మనం ఎలా, ఎక్కడి నుండి పొందవచ్చు?
3. క్రైస్తవులకు, ప్రాముఖ్యమైనవాటిని నిర్ణయించుకోవడంలో ఏమి ఇమిడి ఉంటుంది?
3 “సర్వోత్కృష్టమైనది” అనేదానికి మిగతా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది లేక మొదట పరిగణించవలసిన అవసరత గలది అనే మూల భావం ఉంది. మీరు యెహోవాసాక్షుల్లో ఒకరైనా లేక వారితో సహవసిస్తున్న లక్షలాదిమంది యథార్థతగల దేవుని వాక్య విద్యార్థులలో ఒకరైనా, ఈ సత్యాన్ని పరిశీలించండి: “ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” (ప్రసంగి 3:1) సరైన విధంగా, కుటుంబ సంబంధాల ఎడల మీరు ప్రేమపూర్వక శ్రద్ధను చూపించడం దానిలో ఇమిడి ఉంటుంది. (కొలొస్సయులు 3:18-21) లౌకిక ఉద్యోగం ద్వారా మీ కుటుంబాన్ని సంరక్షించడం అందులో ఇమిడివుంటుంది. (2 థెస్సలొనీకయులు 3:10-12; 1 తిమోతి 5:8) కొంత మార్పు కోసం, మీరు ఏదైనా వ్యాపకం కొరకో లేక అప్పుడప్పుడు వినోదం లేక సేదదీర్పు కొరకో మీరు కొంత సమయాన్ని తీసుకోవచ్చు. (మార్కు 6:31 పోల్చండి.) అయితే, గంభీరంగా తలంచిన తర్వాత, వీటిలో ఏ ఒక్కటీ జీవితంలో సర్వోత్కృష్టమైనది కాదని మీరు గుర్తించరా? మరింత ప్రాముఖ్యమైనది ఇంకా ఏదో ఉంది.
4. మనం ప్రాముఖ్యమైనవాటిని నిర్ణయించుకోవడంతో ఫిలిప్పీయులు 1:9, 10 వచనాలు ఎలా సంబంధాన్ని కలిగివున్నాయి?
4 ప్రాముఖ్యమైన వాటిని నిర్ణయించుకోవడంలోనూ జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బైబిలు యొక్క నిర్దేశక సూత్రాలు విలువైన సహాయకాలని బహుశా మీరు గుర్తిస్తుండవచ్చు. ఉదాహరణకు, ‘తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను . . . నిండుకోవాలని’ ఫిలిప్పీయులు 1:9, 10 నందు క్రైస్తవులకు ఉద్బోధించబడింది. దేని కొరకు? ‘మీరు శ్రేష్ఠమైన [“మరింత ప్రాముఖ్యమైన,” NW] కార్యములను వివేచింపగలవారగుటకు’ అని అపొస్తలుడైన పౌలు జతచేశాడు. (ఇటాలిక్కులు మావి.) అది జ్ఞానవంతమైనది కాదా? కచ్చితమైన జ్ఞానం ఆధారంగా, ఒక వివేచనగల క్రైస్తవుడు జీవితంలో ఏది ప్రధానమైనది, అంటే ఏది సర్వోత్కృష్టమైనదై ఉండాలనేది నిశ్చయించుకోవచ్చు.
ఏది సర్వోత్కృష్టమైనదనేదానికి ఒక మాదిరి
5. క్రైస్తవుల కొరకు ఉంచబడిన మాదిరిని వర్ణిస్తూ, యేసు జీవితంలో ఏది సర్వోత్కృష్టమైనదై ఉండిందో లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి?
5 అపొస్తలుడైన పేతురు వ్రాసిన ఈ మాటల్లో మనం జ్ఞానం యొక్క ఒక అమూల్యమైన కోణాన్ని కనుగొంటాము: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:21) జీవితంలో ఏది సర్వోత్కృష్టమైనది అనేదాని ఆచూకీలను కనుగొనేందుకు, దాని గురించి యేసుక్రీస్తు ఏమి తలంచాడనేదాన్ని మనం పరిశీలించవచ్చు. కీర్తన 40:8 ప్రవచనార్థకంగా ఆయన గురించి ఇలా చెప్పింది: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” అదే తలంపును ఆయనిలా వ్యక్తం చేశాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.”—యోహాను 4:34; హెబ్రీయులు 12:2.
6. దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రథమ స్థానం ఇవ్వడంలో యేసు పొందిన ఫలితాలనే మనమూ ఎలా పొందవచ్చు?
6 ఆ కీలకాంశాన్ని అంటే దేవుని చిత్తాన్ని చేయడం అనే అంశాన్ని గమనించండి. “సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును” అని యేసు చెప్పాడు గనుక తన శిష్యులు సరైన విధంగా తమ జీవితాల్లో దేన్ని సర్వోత్కృష్టమైనదిగా చేసుకోవాలనేదాన్ని ఆయన మాదిరి నొక్కి తెలియజేస్తుంది. (లూకా 6:40) యేసు తన తండ్రి సంకల్పించిన మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తాన్ని సర్వోత్కృష్టమైనదిగా ఉంచుకోవడంలో “సంపూర్ణసంతోషము” ఉందని చూపించాడు. (కీర్తన 16:11; అపొస్తలుల కార్యములు 2:28) అదేమి సూచిస్తుందో మీరు గ్రహించగలుగుతున్నారా? యేసు అనుచరులు దేవుని చిత్తాన్ని చేయడాన్ని తమ జీవితాల్లో సర్వోత్కృష్టమైనదిగా ఎంపిక చేసుకుంటే, వారు “సంపూర్ణసంతోషము”ను, నిజమైన జీవితాన్ని అనుభవిస్తారు. (1 తిమోతి 6:19) కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడాన్ని మన జీవితాల్లో ప్రధానమైనదిగా ఎంచడానికి ఒకటికంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి.
7, 8. యేసు ఏ శ్రమలను ఎదుర్కొన్నాడు, దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
7 దేవుని చిత్తాన్ని చేయడానికి యేసు తనను తాను సమర్పించుకున్న వెంటనే, అపవాది ఆయనను దాని నుండి మళ్లించడానికి ప్రయత్నించాడు. ఎలా? మూడు విషయాల్లో శోధించడం ద్వారా. ప్రతిసారీ యేసు లేఖనాధారంగా, సుస్పష్టంగా సమాధానమిచ్చాడు. (మత్తయి 4:1-10) కాని హింస, అపనింద, యూదా అప్పగించడం, అబద్ధ ఆరోపణలు, ఆ తర్వాత హింసాకొయ్యపై మరణం వంటి అదనపు శ్రమలు ఆయన కోసం వేచివున్నాయి. అయినప్పటికీ, ఈ శ్రమలేవీ దేవుని యథార్థ కుమారుడు తన స్థిరత్వాన్ని కోల్పోయేలా చేయలేదు. ఒక క్లిష్టసమయంలో, “నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని . . . నీ చిత్తమే సిద్ధించు గాక” అని యేసు ప్రార్థించాడు. (మత్తయి 26:39, 42) మనం “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండ”డానికి కారణమౌతూ, మన కొరకు మాదిరినుంచినవానిలోని ఈ అంశాన్నిబట్టి మనలో ప్రతి ఒక్కరం ఎంతో కదిలింపబడవద్దా?—రోమీయులు 12:12.
8 అవును, మనం మన జీవితంలో ప్రాముఖ్యమైనవాటిని నిర్ణయించుకునేటప్పుడు, విశేషంగా మనం సత్యం యొక్క శత్రువులను, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేవారిని ఎదుర్కొనేటట్లయితే దైవిక నడిపింపు ప్రాముఖ్యంగా సహాయకరమైనదిగా ఉంటుంది. శత్రువుల వ్యతిరేకతను అనుభవిస్తున్నప్పుడు నమ్మకమైన రాజగు దావీదు నడిపింపు కొరకు చేసిన విన్నపాన్ని జ్ఞాపకం చేసుకోండి. కీర్తన 143 నందలి ఒక భాగాన్ని పరిశీలిస్తుండగా దీన్ని మనం గ్రహిస్తాము. మనం యెహోవాతో మన వ్యక్తిగత సంబంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చనేది గ్రహించడానికి, మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని చేసేందుకు ప్రథమ స్థానాన్నివ్వడానికి మనల్ని బలపర్చేందుకు ఇది మనకు సహాయం చేయాలి.
యెహోవా మన ప్రార్థనలను విని సమాధానమిస్తాడు
9. (ఎ) దావీదు పాపియైనప్పటికీ, ఆయన మాటలు మరియు చర్యలు ఏమి బయల్పరుస్తున్నాయి? (బి) సరైనది చేయడాన్ని మనం ఎందుకు విడిచిపెట్టకూడదు?
9 పాపభరితుడు, మర్త్యమైనవాడు అయిన దావీదుకు యెహోవా తన విన్నపాన్ని వింటాడన్న విశ్వాసం ఉండినది. ఆయన దీనంగా ఇలా వేడుకున్నాడు: “యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము; నా విన్నపములకు చెవి యొగ్గుము. నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు.” (కీర్తన 143:1, 2) దావీదుకు తన అపరిపూర్ణత గురించి తెలుసు, అయినప్పటికీ ఆయన దేవుని ఎడల యథార్థ హృదయం కలిగివున్నాడు. అందుకే, నీతినిబట్టి తాను సమాధానాన్ని పొందగలనని ఆయన నమ్మకం కలిగివున్నాడు. ఇది మనల్ని ప్రోత్సహించదా? మనం దేవుని నీతికి సరితూగలేకపోయినప్పటికీ, మనం ఆయన ఎడల యథార్థ హృదయం కలిగివుంటే మనం కోరేది ఆయన వింటాడని మనం నమ్మకం కలిగివుండవచ్చు. (ప్రసంగి 7:20; 1 యోహాను 5:14) ప్రార్థనలో పట్టుదల కలిగివుంటూ, మనం ఈ దుష్టదినాల్లో, “మేలుచేత కీడును జయించ” వలెననే ఉద్దేశం కలిగివుండాలి.—రోమీయులు 12:20, 21; యాకోబు 4:7.
10. దావీదు ఎందుకు వ్యాకులతననుభవించాడు?
10 మనకున్నట్లుగానే దావీదుకు కూడా శత్రువులుండేవారు. సౌలు నుండి పారిపోతూ ఏకాంతమైన, అభేద్యమైన స్థలాల్లో దాక్కోవడం తప్ప వేరే మార్గంలేనివానిగానైనా లేక శత్రువులు వేధిస్తున్న రాజుగానైనా దావీదు వ్యాకులతను అనుభవించాడు. ఇది తనను ఎలా ప్రభావితం చేసిందో ఆయనిలా వివరించాడు: “శత్రువులు నన్ను తరుముచున్నారు. . . . గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. . . . నా ఆత్మ నాలో కృంగియున్నది. నాలో నా హృదయము విస్మయమొందెను.” (కీర్తన 143:3, 4) అలా భావించడానికి మీకూ కారణముందా?
11. దేవుని ఆధునిక దిన సేవకులు ఏ వ్యాకులతలను అనుభవించారు?
11 శత్రువుల ఒత్తిడి, తీవ్ర ఆర్థిక కష్టాల మూలంగా శ్రమలు, తీవ్ర అనారోగ్యం, లేక వేదన కలిగించే ఇతర సమస్యలు దేవుని ప్రజలు కొందరు తమ ప్రాణము కృంగిపోయినట్లు భావించడానికి కారణమయ్యాయి. కొన్నిసార్లు వారి హృదయాలు కూడా భావరహితమైనట్లు అయిపోయాయి. వారు వ్యక్తిగతంగా ఇలా వేడుకున్నట్లుగా ఉంది: “అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు. . . . నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము.” (కీర్తన 71:20, 21) వారెలా సహాయాన్ని పొందారు?
శత్రుప్రయత్నాలను ఎదుర్కొనే విధానం
12. రాజైన దావీదు ప్రమాదాన్ని మరియు శ్రమలను ఎలా ఎదుర్కొన్నాడు?
12 ప్రమాదానికి, గొప్ప శ్రమలకు గురైనప్పుడు దావీదు ఏమి చేశాడన్న విషయాన్ని కీర్తన 143:5 ఇలా సూచిస్తుంది: “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.” దేవుని సేవకులతో ఆయన వ్యవహారాల గురించి, తాను స్వయంగా విడుదలను ఎలా అనుభవించాననే దాని గురించి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా తన గొప్ప నామం కొరకు ఏమి చేశాడనేదాని గురించి ఆయన ధ్యానించాడు. అవును, దావీదు దేవుని క్రియల ఎడల ఆసక్తి చూపించాడు.
13. మనం శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు, ప్రాచీన మరియు ఆధునిక నమ్మకమైన సేవకుల మాదిరుల గురించి ధ్యానించడం సహించడానికి మనకు ఎలా సహాయం చేస్తుంది?
13 దేవుడు తన ప్రజలతో వ్యవహరించిన విధానం గురించి మనం తరచు జ్ఞాపకం చేసుకోలేదా? కచ్చితంగా! క్రైస్తవపూర్వ కాలాల్లోని ‘సాక్షుల గొప్ప మేఘము’ యొక్క వృత్తాంతము కూడా దానిలో ఇమిడివుంది. (హెబ్రీయులు 11:32-38; 12:1) మొదటి శతాబ్దంలోని అభిషిక్త క్రైస్తవులు కూడా “పూర్వపుదినముల”ను, వారు సహించిన దాన్ని “జ్ఞాపకము తెచ్చు”కుంటూ ఉండమని ప్రోత్సహింపబడ్డారు. (హెబ్రీయులు 10:32-34) యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులులో (ఆంగ్లం) వివరించబడినటువంటి, ఆధునిక కాలాల్లోని దేవుని సేవకుల అనుభవాల విషయమేమిటి?a అందులో మరియు ఇతర వాటిలో వ్రాయబడివున్న వృత్తాంతాలు, యెహోవా తన ప్రజలు నిషేధాలను, ఖైదులను, సామూహిక చర్యను, నిర్భంధ శిబిరాలను మరియు బానిస శిబిరాలను సహించడానికి ఎలా సహాయం చేశాడో జ్ఞాపకం చేసుకోవడానికి మనకు దోహదపడతాయి. బురుండి, ర్వాండా, లైబీరియా, మునుపటి యుగోస్లావియా వంటి యుద్ధ పీడిత దేశాల్లో శ్రమలు ఉండినవి. వ్యతిరేకత తలెత్తినప్పుడు, యెహోవాతో పటిష్ఠమైన సంబంధాన్ని కాపాడుకున్నందున దేవుని సేవకులు సహించగలిగారు. ఆయన చిత్తాన్ని చేయడాన్ని తమ జీవితాల్లో సర్వోత్కృష్టమైనదిగా చేసుకున్న వారిని ఆయన హస్తం బలపర్చింది.
14. (ఎ) మనవంటి పరిస్థితిలోనే ఉన్న ఒక వ్యక్తిని దేవుడు బలపర్చిన ఒక ఉదాహరణ ఏది? (బి) ఆ ఉదాహరణ నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
14 అయితే, అలాంటి క్రూరమైన దుర్‌వ్యవహారానికి గురవ్వలేదని మీరు సమాధానమివ్వవచ్చు, మీరు ఎన్నడైనా అలా గురవ్వవలసి వస్తుందని కూడా మీరు అనుకోకపోవచ్చు. అయితే, నాటకీయమైన పరిస్థితులని కొందరు దృష్టించే పరిస్థితుల్లో మాత్రమే దేవుడు తన ప్రజలకు మద్దతునిచ్చాడని కాదు. ఆయన అనేకమంది “సగటు” వ్యక్తులకు “సాధారణ” పరిస్థితుల్లో సహాయం చేశాడు. అనేకానేక ఉదాహరణల్లో కేవలం ఒకటి ఇక్కడ ఇవ్వబడింది: పైనున్న చిత్రాన్ని మీరు గుర్తించగలరా, దేవుని ప్రజలతో ఆయన వ్యవహారాలను జ్ఞాపకం చేసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుందా? అది డిశంబరు 1, 1996 కావలికోట నందు ప్రచురించబడింది. పనెలపీ మాక్రీస్ చెప్పిన వృత్తాంతాన్ని మీరు చదివారా? క్రైస్తవ యథార్థత యొక్క ఎంత చక్కని ఉదాహరణ! ఆమె పొరుగువారి నుండి ఏమి సహించిందో, తీవ్ర అనారోగ్యాలతో ఎలా పోరాడిందో, పూర్తికాల పరిచర్యలో కొనసాగడానికి ఆమె ఎలా కృషి చేసిందో మీరు జ్ఞాపకం చేసుకోగలరా? మిటలీనీలో ప్రతిఫలదాయకమైన ఆమె అనుభవం సంగతేమిటి? విషయమేమిటంటే, ప్రాముఖ్యమైన వాటిని నిర్ణయించుకోవడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి మన జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వడానికి అలాంటి ఉదాహరణలు మనకందరికీ సహాయం చేస్తాయని మీరు భావిస్తారా?
15. మనం ధ్యానించవలసిన యెహోవా కార్యాలు కొన్ని ఏవి?
15 దావీదు చేసినట్లుగా, యెహోవా కార్యాల గురించి ధ్యానించడానికి అది మనల్ని బలపరుస్తుంది. యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడంలో తన కుమారుడు మరణించడం, పునరుత్థానం చేయబడడం, మహిమపర్చబడడం వంటి వాటి ద్వారా రక్షణ కొరకు ఏర్పాటు చేశాడు. (1 తిమోతి 3:16) ఆయన తన పరలోక రాజ్యాన్ని స్థాపించాడు, పరలోకంలో నుండి సాతానును అతని దయ్యాలను వెళ్లగొట్టాడు, ఇక్కడ భూమిపై సత్యారాధనను నెలకొల్పాడు. (ప్రకటన 12:7-12) ఆయన ఆత్మీయ పరదైసును నిర్మించి, తన ప్రజలను అభివృద్ధితో ఆశీర్వదించాడు. (యెషయా 35:1-10; 60:22) మహా శ్రమ ప్రారంభం కావడానికి ముందు ఆయన ప్రజలు ఇప్పుడు అంతిమ సాక్ష్యాన్నిస్తున్నారు. (ప్రకటన 14:6, 7) అవును, మనం ధ్యానించడానికి ఎంతో ఉంది.
16. మనం దేని గురించి శ్రద్ధ కలిగివుండాలని ప్రోత్సహింపబడ్డాము, ఇది మనపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?
16 మానవ ప్రయత్నాలలో మునిగిపోవడంకన్నా దేవుని చేతి కార్యాలపై మనం శ్రద్ధనిలపడం యెహోవా చూపించిన శక్తి ప్రబలమైనదనే విషయం మనలో ముద్రించబడేలా చేస్తుంది. అయితే, ఆ పనులు పరలోకంలోను, ఇక్కడ భూమిపైనా అద్భుతమైన భౌతిక సృష్టికార్యాలకే పరిమితమైనవి కావు. (యోబు 37:14; కీర్తన 19:1; 104:24) ఎన్నుకొనబడిన తన ప్రాచీన ప్రజల అనుభవాల్లో ప్రదర్శించబడినట్లుగా, శత్రు వ్యతిరేకుల నుండి తన ప్రజలను విడిపించడం వంటివి కూడా ఆయన అద్భుత కార్యాల్లో ఇమిడివున్నాయి.—నిర్గమకాండము 14:31; 15:6.
ఏ మార్గంలో నడవాలో తెలుసుకోవడం
17. దావీదుకు యెహోవా ఎంత వాస్తవమై ఉండెను, దీని ద్వారా మనం ఎలా నిశ్చయతను పొందవచ్చు?
17 తన జీవితంలోని తేమ ఎండిపోతుందేమోనని, దావీదు సహాయం కొరకు ఇలా ప్రార్థించాడు: “నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము.” (కీర్తన 143:6, 7) తన పరిస్థితి గురించి దేవునికి తెలుసని పాపియైన దావీదు ఎరిగివుండెను. (కీర్తన 31:7) మనం కూడా కొన్నిసార్లు మన ఆత్మీయత దిగజారిపోయినట్లు భావించవచ్చు. కానీ పరిస్థితి నిరాశాజనకం కాదు. మన ప్రార్థనలను వినే యెహోవా, ప్రేమపూర్వక పెద్దల ద్వారా, కావలికోట నందలి శీర్షికల ద్వారా, లేక కేవలం మన కోసమే రూపొందింపబడినట్లనిపించే కూటాల్లోని భాగాల ద్వారా మనల్ని ఉత్తేజపర్చి మన పునఃస్థాపనను వేగిర పర్చవచ్చు.—యెషయా 32:1, 2.
18, 19. (ఎ) దేని గురించి మనం యెహోవాను పట్టుదలతో వేడుకోవాలి? (బి) మనం దేని గురించి నిశ్చయత కలిగివుండవచ్చు?
18 యెహోవాయందలి మన నమ్మకం మనం ఆయనను ఇలా వేడుకొనేలా మనల్ని కదిలిస్తుంది: “నీయందు నేను నమ్మిక యుంచియున్నాను, . . . నీ కృపావార్తను నాకు వినిపింపుము. . . . నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.” (కీర్తన 143:8) గ్రీకు ద్వీపంపై ఒంటరిగానున్న మాక్రీస్ సహోదరిని ఆయన నిరుత్సాహపరిచాడా? కాబట్టి ఆయన చిత్తాన్ని చేయడాన్ని మీ జీవితంలో సర్వోత్కృష్టమైన విషయంగా చేసుకుంటే ఆయన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాడా? దేవుని రాజ్యాన్ని ప్రకటించే మన పనిని అడ్డగించాలని లేక పూర్తిగా నిలిపివేయాలని అపవాది, అతని ప్రతినిధులు కోరుకుంటారు. సత్యారాధన సాధారణంగా అనుమతించబడే ప్రాంతాల్లో మనం సేవచేస్తున్నప్పటికీ లేక అది నిషేధింపబడిన ప్రాంతాల్లో సేవచేస్తున్నప్పటికీ, మన ఐక్య ప్రార్థనలు దావీదు యొక్క ఈ విన్నపంతో పొందిక కలిగివుంటాయి: “యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను. నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము.” (కీర్తన 143:9) ఆత్మీయ వినాశనానికి గురికాకుండా మనం సురక్షితంగా ఉండడం మహోన్నతుని చాటున నివసించడంపై ఆధారపడి ఉంటుంది.—కీర్తన 91:1.
19 ఏది సర్వోత్కృష్టమైనదనేదాన్ని గూర్చిన మన నమ్మకం సుస్థిరమైన పునాది గలది. (రోమీయులు 12:1, 2) కాబట్టి, మానవ వ్యవహారాల్లో ఏది ప్రాముఖ్యమైనదని లోకం భావిస్తుందో దాన్ని మీపై రుద్దాలనే దాని ప్రయత్నాలను ఎదిరించండి. సర్వోత్కృష్టమైనదని మీకు తెలిసినదాన్ని అంటే దేవుని చిత్తాన్ని చేయడాన్ని మీ జీవితంలోని ప్రతి అంకం ప్రతిఫలించడాన్ని అనుమతించండి.—మత్తయి 6:10; 7:21.
20. (ఎ) కీర్తన 143:1-9 నందు దావీదు గురించి మనం ఏమి నేర్చుకున్నాము? (బి) క్రైస్తవులు నేడు దావీదు స్ఫూర్తిని ఎలా ప్రతిఫలింపజేస్తారు?
20 కీర్తన 143 నందలి మొదటి తొమ్మిది వచనాలు యెహోవాతో దావీదుకున్న సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెబుతాయి. శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ఆయన నడిపింపు కొరకు దేవున్ని నిర్మొహమాటంగా వేడుకున్నాడు. సరైన మార్గంలో నడవడానికి సహాయం కోరుతూ, ఆయన తన హృదయాన్ని కుమ్మరించాడు. భూమిపైనున్న ఆత్మాభిషిక్తుల శేషము మరియు వారి సహచరులు నేడు అలాగే చేస్తారు. వారు నడిపింపు కొరకు యెహోవాను వేడుకుంటూ, ఆయనతో తమకుగల సంబంధాన్ని అమూల్యమైనదిగా పరిగణిస్తారు. అపవాది నుండి మరియు ప్రపంచం నుండి ఒత్తిడులు వచ్చినప్పటికీ, దేవుని చిత్తాన్ని చేయడానికి వారు ప్రాధాన్యతనిస్తారు.
21. తమ జీవితాల్లో ఏది సర్వోత్కృష్టమైనదై ఉండాలనేది మనం ఇతరులకు బోధించాలంటే మనం మంచి మాదిరినుంచడం ఎందుకు ప్రాముఖ్యము?
21 యెహోవాసాక్షులతో బైబిలు పఠిస్తున్న లక్షలాదిమంది దేవుని చిత్తాన్ని చేయడం సర్వోత్కృష్టమైనదని గుర్తించవలసిన అవసరం ఉంది. వాక్యానికి విధేయులుగా ఉండడంలో ఇమిడివున్న సూత్రాలను నొక్కిచెప్పే, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 13వ అధ్యాయాన్ని చర్చిస్తున్నప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం వారికి సహాయం చేయవచ్చు.b అయితే, మనం బోధిస్తున్నదానిలో మనం మాదిరికరంగా ఉన్నామని వారు చూడాలి. కొంత కాలం తర్వాత, తాము ఏ మార్గంలో నడవాలో వారు కూడా తెలుసుకుంటారు. తమ జీవితాల్లో ఏది సర్వోత్కృష్టమైనదై ఉండాలనేది ఈ లక్షలాదిమంది వ్యక్తిగతంగా గ్రహిస్తుండగా, అనేకులు సమర్పించుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి చర్య తీసుకునేలా కదిలింపబడతారు. ఆ తర్వాత, జీవ మార్గంలో నడవడంలో కొనసాగడానికి సంఘం వారికి సహాయం చేయగలదు.
22. తరువాతి శీర్షికలో ఏ ప్రశ్నలు పరిశీలించబడతాయి?
22 తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని చేయడానికి అత్యధిక ప్రాముఖ్యతనివ్వాలని అనేకులు వెంటనే అంగీకరిస్తారు. అయితే తన చిత్తాన్ని చేయడానికి యెహోవా తన సేవకులకు క్రమంగా ఎలా నేర్పిస్తాడు? ఇది వారికి ఏ ప్రయోజనాలను తీసుకువస్తుంది? తరువాతి శీర్షికలో, ఈ ప్రశ్నలతోపాటు ఒక కీలక వచనం, అంటే కీర్తన 143:10 చర్చించబడుతుంది.
[అధస్సూచీలు]
a 1993లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
b 1995లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
మీ సమాధానమేమిటి?
◻ ఫిలిప్పీయులు 1:9, 10 వచనాలను అన్వయించుకోవడం ద్వారా మనం ప్రాముఖ్యమైన వాటిని ఎలా నిర్ణయించుకోవచ్చు?
◻ తన జీవితంలో సర్వోత్కృష్టమైనదేమిటో యేసు ఎలా చూపించాడు?
◻ శ్రమలనుభవిస్తున్నప్పుడు దావీదు తీసుకున్న చర్యల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
◻ కీర్తన 143:1-9 నేడు మనకు ఏవిధంగా సహాయం చేస్తుంది?
◻ మన జీవితాల్లో ఏది సర్వోత్కృష్టమైనదై ఉండాలి?
[10వ పేజీలోని చిత్రం]
దావీదు చర్యలు ఆయన యెహోవాపై ఆధారపడ్డాడని నిరూపించాయి
[క్రెడిట్ లైను]
Reproduced from Illustrirte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s