ఎవరు సువార్తికులై ఉంటారు?
దాదాపు 40 సంవత్సరాల క్రితం వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ యొక్క ఒక సమావేశం జరిగినప్పుడు, “సువార్తికుని స్ఫూర్తితో బయలుదేరాలని,” “సువార్తకు వెళ్లాలని” తమ మందలకు చెప్పాలని సభ్యులకు ఉద్బోధించబడింది. ఐదు సంవత్సరాల తర్వాత, కాథోలిక్ మత గురువైన జాన్ ఎ. ఓబ్రీన్ “మనం కేవలం మన ఇండ్లలో ఉండడం ద్వారా” కాకుండా “వారి దగ్గరికి వెళ్ళి” క్రొత్త శిష్యులను లోపలికి తీసుకు రావలసిన అవసరతను గూర్చి వ్రాశాడు. 1994 జనవరిలో, ఇది “సువార్తను గూర్చి సిగ్గుపడవలసిన సమయం కాదు, ఇది ఇంటి పైకప్పుల మీద నుండి దానిని ప్రకటించవలసిన సమయం” అని పోప్ జాన్ పోల్ II చెప్పాడు.
సువార్త ప్రకటించమని ఇలా అప్పుడప్పుడు వచ్చే ఆహ్వానాలు చెవిటివాడిముందు శంఖం ఊదినట్లు ఉన్నాయన్నది స్పష్టం. ఆస్ట్రేలియా వార్తాపత్రికయైన ఇలవారా మెర్క్యూరీ ఈ విధంగా చెప్పింది: “ప్రఖ్యాతి చెందిన దక్షిణ తీర కాథోలిక్క్‌లు తమ విశ్వాసాన్ని తెలుపుకునే యెహోవాసాక్షుల పద్ధతిని అవలంబించేందుకు అంత ఆతురపడరు.” “సువార్తపని చేయడమనేది కాథోలిక్ అభిమతమే కాదు” అని ఒక వ్యక్తి అన్నాడు. మరొకరు ఈ విధంగా తర్కించారు: “చర్చి తనను తాను వృద్ధిచేసుకోవడం మంచిదే కాని, అది ఇంటి తలుపులను తట్టడం ద్వారా కాదు. బహుశా పాఠశాలల ద్వారా లేదా తపాలా ద్వారా ఆ పని ఇంకా బాగా చేయవచ్చు.” పోప్ అభిప్రాయాలను ఎలా వ్యాఖ్యానించాలో స్థానిక పెద్ద చర్చి అధ్యక్షునికి కూడా కచ్చితంగా తెలియదు. “ప్రజలు తమకు తెలిసిన సువార్తను తమ సొంత జీవితాలలో అభ్యసించాలని మేము ప్రోత్సహిస్తాం, అయితే ఇంటింటికి వెళ్ళడం ద్వారానా అన్నది మరో విషయం” అని ఆయన చెప్పాడు. ఆ వార్తాశీర్షిక ప్రధానశీర్షిక దానిని చక్కగా ఇలా సంగ్రహిస్తుంది: “ప్రకటించమన్న పోప్ ఆహ్వానాన్ని కాథోలిక్కులు అనుసరించరు.”
క్రైస్తవ మత సామ్రాజ్యం సువార్త పని చేయడంలో విఫలులౌతున్నప్పటికీ, 50 లక్షలకన్నా ఎక్కువ మందిగావున్న యెహోవాసాక్షులు “వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అన్న యేసు ఆజ్ఞను అనుసరిస్తున్నారు. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 5:42 పోల్చండి.) వారి ఇంటింటి ప్రకటన పని అనేది 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఇప్పుడు జరుగుతుంది. వారు తీసుకువచ్చే సందేశం అనేది భవిష్యత్తు కొరకైన బైబిలులోని అద్భుతమైన వాగ్దానాలను ఉన్నతపరచే అనుకూలమైన ఒక సందేశం. వాళ్ళు ఈ సారి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు?