కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 11/1 పేజీలు 12-18
  • యెహోవా అనుగ్రహిస్తున్న ఆదరణను పంచుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా అనుగ్రహిస్తున్న ఆదరణను పంచుకొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘సమస్తమైన ఆదరణకు కర్తయగు దేవుడు’
  • ఆదరించేవారిగా తర్ఫీదు పొందడం
  • ఆసియాలో పౌలుకు వచ్చిన శ్రమ
  • ఆధునిక దిన మాదిరులు
  • రువాండా నందలి విషాదకర సంఘటనకు—ఎవరు బాధ్యులు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “సమమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” నుండి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 11/1 పేజీలు 12-18

యెహోవా అనుగ్రహిస్తున్న ఆదరణను పంచుకొనుట

“మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.”—2 కొరింథీయులు 1:7.

1, 2. నేడు క్రైస్తవులైన అనేకమంది అనుభవం ఏమైవుంది?

ఇటీవలి కావలికోట పాఠకులలో అనేకమంది బైబిలు సత్యాన్ని గూర్చిన జ్ఞానమేమీ లేకుండానే పరిణితి సాధించారు. బహుశా మీ విషయంలోనూ అది నిజమైవుండవచ్చు. అలా అయితే, మీ అవగాహనా నేత్రాలు తెరవబడుతుండగా మీరెలా భావించారో జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకు, మృతులు బాధను అనుభవించరుగాని అపస్మారక స్థితిలో ఉంటారని మీరు మొదటిసారి అర్థం చేసుకున్నప్పుడు, ఉపశమనాన్ని పొందలేదా? మరణించిన కోట్లాదిమంది దేవుని నూతన లోకంలో జీవానికి పునరుత్థానం చేయబడతారనే మృతుల కొరకైన నిరీక్షణను గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఆదరణను పొందలేదా?—ప్రసంగి 9:5, 10; యోహాను 5:28, 29.

2 దుష్టత్వానికి అంతం తెస్తానని మరియు ఈ భూమిని పరదైసుగా మారుస్తానని దేవుడు చేసిన వాగ్దానం విషయం ఏమిటి? మీరు దీని గురించి తెలుసుకున్నప్పుడు అది మిమ్మల్ని ఆదరించి, మీరు ఆతృతతో ఎదురుచూసేలా చెయ్యలేదా? రానైవున్న భూపరదైసులోనికి తప్పించబడడమే గాని ఎన్నటికీ మరణించే అవసరత ఉండదని మీరు మొదట నేర్చుకున్నప్పుడు మీరెలా భావించారు? నిస్సందేహంగా మీరు పులకించిపోయి ఉంటారు. అవును, ఇప్పుడు యెహోవాసాక్షుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతున్న దేవుని ఆదరణపూరిత సందేశాన్ని మీరు పొందినవారయ్యారు.—కీర్తన 37:9-11, 29; యోహాను 11:26; ప్రకటన 21:3-5.

3. ఇతరులతో దేవుని ఆదరణపూరితమైన సందేశాన్ని పంచుకొంటున్న వారు కూడా ఎందుకు శ్రమ అనుభవిస్తున్నారు?

3 అయినా, మీరు బైబిలు సందేశాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు “విశ్వాసము అందరికి లేద”ని కూడా మీరు గ్రహించారు. (2 థెస్సలొనీకయులు 3:2) బైబిలు వాగ్దానాలయందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నందుకు మీ మునుపటి స్నేహితులలో కొందరు బహుశా మిమ్మల్ని అపహసించే ఉంటారు. యెహోవాసాక్షుల సహవాసంలో బైబిలు పఠనాన్ని కొనసాగిస్తున్నందుకు మీరు హింసను కూడా అనుభవించి ఉండవచ్చు. బైబిలు సూత్రాలకు అనుగుణంగా మీ జీవితంలో మీరు మార్పుల్ని చేసుకొనడం ఆరంభిస్తుండగా వ్యతిరేకత తీవ్రతరమై ఉండవచ్చు. దేవుని ఆదరణను అంగీకరించిన వారందరిపైకి సాతాను అతని లోకంతెచ్చే శ్రమను మీరు అనుభవించడం ఆరంభమై ఉంటుంది.

4. క్రొత్తగా ఆసక్తిని చూపించినవారు ఏ విభిన్నమైన రీతుల్లో శ్రమకు ప్రతిస్పందించవచ్చు?

4 విచారకరంగా, యేసు ప్రవచించినట్లుగానే కొంతమంది అభ్యంతరపడి, క్రైస్తవ సంఘంతో తమ సహవాసాన్ని మానుకోవడానికి శ్రమ కారణమౌతోంది. (మత్తయి 13:5, 6, 20, 21) ఇతరులు తాము నేర్చుకుంటున్న ఆదరణపూరితమైన వాగ్దానాలపై తమ మనస్సుల్ని కేంద్రీకరిస్తూండడం ద్వారా శ్రమను తాళుకుంటున్నారు. చివరకు వారు యెహోవాకు తమ జీవితాల్ని సమర్పించుకొని, ఆయన కుమారుడగు యేసుక్రీస్తు శిష్యులుగా బాప్తిస్మం పొందుతారు. (మత్తయి 28:19, 20; మార్కు 8:34) అయితే, ఒక క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకోవడంతో శ్రమ నిలిచిపోదు. ఉదాహరణకు, అనైతిక చరిత్రగల ఓ వ్యక్తికి పవిత్రంగా ఉండడమనేది ఓ కఠినమైన పోరాటంకాగలదు. ఇతరులు అవిశ్వాసులైన కుటుంబ సభ్యుల నుండి వచ్చే ఎడతెగని వ్యతిరేకతతో పోరాటం సల్పాల్సి ఉంటుంది. శ్రమ ఏదైనప్పటికీ, దేవుని ఎడల సమర్పణా జీవితాన్ని నమ్మకంగా వెంబడించే వారందరూ ఓ విషయంలో నిశ్చయతను కల్గివుండగలరు. వ్యక్తిగతమైన రీతిలో వారు దేవుని ఆదరణను సహాయాన్ని అనుభవిస్తారు.

‘సమస్తమైన ఆదరణకు కర్తయగు దేవుడు’

5. పౌలు అనుభవించిన అనేక శ్రమలతోపాటు దేనిని కూడా ఆయన అనుభవించాడు?

5 దేవుడు అనుగ్రహించు ఆదరణను బహుగా ప్రశంసించిన వారిలో అపొస్తలుడైన పౌలు ఒకడు. ఆసియాలోను మాసిదోనియాలోను ఒక నిర్దిష్టమైన శ్రమ కాలం గతించిపోయిన తర్వాత, గద్దింపుతో వ్రాసిన తన పత్రికకు కొరింథీయులు ప్రతిస్పందించారని వినడంతో ఆయన గొప్ప ఉపశమనాన్ని పొందాడు. వారికి రెండవ పత్రికను వ్రాయడానికి ఇది ఆయనను ప్రేరేపించింది, అందులో ఈ క్రిందనున్న స్తుతి వ్యక్తీకరణవుంది: “కనికరము [“మృదువైన కనికరాల్ని,” NW] చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. . . . ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.”—2 కొరింథీయులు 1:3, 4.

6. రెండవ కొరింథీయులు 1:3, 4 వచనాల్లోని పౌలు మాటల నుండి మనమేమి నేర్చుకుంటాం?

6 ఈ ప్రేరేపిత మాటలు మనకెంతో సమాచారాన్ని ఇస్తున్నాయి. మనం వాటిని విశ్లేషిద్దాం. తన పత్రికల్లో పౌలు దేవునికి స్తుతుల్ని లేక కృతజ్ఞల్ని వ్యక్తపర్చినప్పుడు లేక ఆయనకు ఒక విన్నపాన్ని చేసినప్పుడు, ఆయన క్రైస్తవ సంఘానికి శిరస్సైన యేసు ఎడల ప్రగాఢమైన మెప్పుదలను కూడా చేర్చడాన్ని మనం సాధారణంగా కనుగొంటాం. (రోమీయులు 1:8; 7:25; ఎఫెసీయులు 1:3; హెబ్రీయులు 13:20, 21) అందుకే పౌలు ‘మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవునికి’ ఈ స్తుతి వ్యక్తీకరణను సంబోధించాడు. తర్వాత, తన రచనల్లో మొదటిసారిగా ఆయన గ్రీకు నామవాచకాన్ని “మృదువైన కనికరాల్ని” అని అనువదించాడు. మరొకరు బాధను అనుభవిస్తుంటే విచారాన్ని వ్యక్తపర్చేందుకు ఉపయోగించిన ఒక పదం నుండి ఈ నామవాచకం వచ్చింది. ఆ విధంగా శ్రమల్ని అనుభవిస్తున్న తన నమ్మకమైన సేవకులలో ఎవరి ఎడలనైనా వ్యక్తపర్చే దేవుని మృదువైన కనికరాల్ని అంటే వారి పక్షంగా దయాపూర్వకంగా పనిచేయడానికి దేవునిని కదిలించే మృదువైన భావాల్ని గురించి పౌలు వర్ణిస్తున్నాడు. చివరగా, “మృదువైన కనికరాల్ని చూపు తండ్రి” అని ఆయనను పిలవడంద్వారా ఈ కోరదగిన లక్షణానికి మూలాధారంగా యెహోవావైపు పౌలు చూస్తున్నాడు.

7. యెహోవా “సమస్త ఆదరణకు కర్తయగు దేవుడు” అని ఎందుకు చెప్పవచ్చు?

7 శ్రమను అనుభవిస్తున్న ఒకనికి ఉపశమనాన్ని దయచేసేందుకు దేవుని “మృదువైన కనికరాలు” కారణమౌతున్నాయి. కాబట్టి, పౌలు యెహోవాను ‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని’గా వర్ణిస్తున్నాడు. ఆ విధంగా, తోటి విశ్వాసుల దయనుండి మనం ఏ విధమైన ఆదరణను పొందినా, దానికి మూలంగా మనం యెహోవా వైపు చూడగలము. దేవునితో సంబంధంలేని ఆదరణ నిజమైనది, శాశ్వతమైనది కాజాలదు. అంతేగాక, తన స్వరూపమందు మానవున్ని సృష్టించింది ఆయనే గనుక మనల్ని ఆదరించేవారిగా ఉండేలా చేయగల్గుతున్నాడు. ఆదరణ అవసరమైనవారి ఎడల మృదువైన కనికరాల్ని చూపించేందుకు తన సేవకుల్ని ప్రేరేపించేది దేవుని పరిశుద్ధాత్మే.

ఆదరించేవారిగా తర్ఫీదు పొందడం

8. మన శ్రమలకు దేవుడు కారణం కాకపోయినప్పటికీ మనం శ్రమల్ని సహించుకోవడంవల్ల ఏ ప్రయోజనకరమైన ప్రభావం మనపై ఉంటుంది?

8 యెహోవా దేవుడు తన నమ్మకమైన సేవకులపైకి వస్తున్న విభిన్నమైన శ్రమల్ని అనుమతిస్తున్నప్పటికీ అలాంటి శ్రమలకు ఆయన ఎన్నటికీ కారకుడు కాడు. (యాకోబు 1:13) అయితే, మనం శ్రమల్ని తట్టుకున్నప్పుడు ఆయన అనుగ్రహిస్తున్న ఆదరణ, ఇతరుల అవసరతలకు ఎక్కువగా ప్రతిస్పందించేలా మనకు తర్ఫీదును ఇవ్వగలదు. దాని ఫలితమేంటి? “దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” (2 కొరింథీయులు 1:4) ఆ విధంగా తోటి విశ్వాసులతోను మనం క్రీస్తును అనుకరించి ‘దుఃఖక్రాంతులైన వారినందరిని ఆదరిస్తు’న్నప్పుడు అంటే మనం మన పరిచర్యలో కలుసుకున్న వారందరితోను యెహోవా ఆదరణను ప్రతిభావంతంగా పంచుకొనేందుకు ఆయన మనకు తర్ఫీదును ఇస్తున్నాడు.—యెషయా 61:2; మత్తయి 5:4.

9. (ఎ) బాధను సహించుకోవడానికి మనకేది సహాయపడ్తుంది? (బి) మనం శ్రమను నమ్మకంగా సహించుకొన్నప్పుడు ఇతరులు ఏ విధంగా ఆదరణను పొందారు?

9 క్రీస్తు ద్వారా దేవుని నుండి తాను పొందిన సమృద్ధియైన ఆదరణ మూలంగా తనకు కల్గిన అనేకమైన బాధల్ని తాను సహించుకున్నానని పౌలు చూపిస్తున్నాడు. (2 కొరింథీయులు 1:5) దేవుని అమూల్యమైన వాగ్దానాల్ని ధ్యానించడం ద్వారాను, ఆయన పరిశుద్ధాత్మ మద్దతు కొరకు ప్రార్థించడం ద్వారాను, మన ప్రార్థనలకు దేవుని జవాబుల్ని అనుభవించడం ద్వారాను మనం కూడా సమృద్ధియైన ఆదరణను అనుభవించగలము. ఆ విధంగా యెహోవా సర్వాధిపత్యాన్ని ఎడతెగకకుండా హత్తుకొని ఉండేందుకు అపవాది అబద్ధికుడని రుజువుచేసేందుకూ మనం బలపర్చబడతాం. (యోబు 2:4; సామెతలు 27:11) ఏ రూపంలోనైనా వచ్చే శ్రమను మనం నమ్మకంగా సహించుకున్నప్పుడు, శ్రమయందు క్రైస్తవులు నమ్మకస్థులుగా ఉండేలా చేస్తున్న యెహోవా ఆదరణనుబట్టి పౌలువలె మనం కూడా ఆయనకు ఘనతను చెల్లించాలి. నమ్మకమైన క్రైస్తవుల సహనం సహోదరత్వంపై ఆదరణపూరితమైన ప్రభావాన్ని కల్గివుండి, ఇతరులు “ఆ శ్రమలను ఓపికతో సహించుటకు” నిశ్చయించుకొనేలా చేస్తుంది.—2 కొరింథీయులు 1:6.

10, 11. (ఎ) ప్రాచీన కొరింథీ సంఘానికి బాధల్ని తీసుకొచ్చిన కొన్ని విషయాలేమిటి? (బి) కొరింథీ సంఘాన్ని పౌలు ఏ విధంగా ఆదరించాడు, ఆయన ఏ నిరీక్షణను వ్యక్తపర్చాడు?

10 నిజ క్రైస్తవులందరిపైకి వచ్చే బాధలలో తమవంతు బాధలను కొరింథీయులు కల్గివున్నారు. దానికితోడు, పశ్చాత్తాపపడని ఓ జారున్ని బహిష్కరించేందుకు వారికి సలహా అవసరమైంది. (1 కొరింథీయులు 5:1, 2, 11, 13) ఈ చర్యను తీసుకోవడంలో విఫలమవ్వడం, కలహాలను విభజనలను అంతమొందించడంలో విఫలమవ్వడం సంఘానికి అవమానాన్ని తెచ్చింది. కాని చివరకు వారు పౌలు సలహాను అన్వయించుకొని, నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించారు. అందుకే, ఆయన వారిని ఆప్యాయంగా మెచ్చుకొని, తన పత్రికకు వారు చూపిన శ్రేష్ఠమైన ప్రతిస్పందన తనను ఆదరించిందని తెలియజేశాడు. (2 కొరింథీయులు 7:8, 10, 11, 13) బహిష్కరించబడిన వ్యక్తి కూడా పశ్చాత్తాపడినట్లు స్పష్టమౌతోంది. కాబట్టి ‘వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిదని, లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడని’ పౌలు వారికి సలహా ఇచ్చాడు.—2 కొరింథీయులు 2:7.

11 పౌలు వ్రాసిన ఈ రెండవ పత్రిక కొరింథీ సంఘాన్ని నిశ్చయంగా ఆదరించి ఉండవచ్చు. ఇదే ఆయన ఉద్దేశాల్లో ఒకటైవుంది. ఆయనిలా వివరించాడు: “మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.” (2 కొరింథీయులు 1:7) తన పత్రిక చివరలో పౌలు ఇలా ఉద్బోధించాడు: “ఆదరణ కలిగియుండుడి, . . . ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.”—2 కొరింథీయులు 13:11.

12. క్రైస్తవులందరూ ఏ అవసరాన్ని కల్గివున్నారు?

12 మనం దీనినుండి ఎంత ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకొనగలమో కదా! క్రైస్తవ సంఘంలోని సభ్యులందరూ దేవుడు తన వాక్యము ద్వారాను, తన పరిశుద్ధాత్మ ద్వారాను, తన భూసంబంధమైన సంస్థ ద్వారాను దయచేస్తున్న ‘ఆదరణను పంచుకోవాల్సిన’ అవసరతవుంది. బహిష్కరించబడిన వారు ఒకవేళ పశ్చాత్తాపపడి తమ తప్పుడు నడవడిని సరిదిద్దుకుంటే వారు కూడా ఆదరించబడాల్సిన అవసరతలో ఉండవచ్చు. అందుకే, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”డు వారికి సహాయపడేందుకు ఓ దయాపూర్వకమైన ఏర్పాటును ఏర్పాటుచేశాడు. సంవత్సరానికి ఓ పర్యాయం ఇద్దరు పెద్దలు బహిష్కరించబడిన ఒకానొక వ్యక్తుల్ని దర్శించవచ్చు. వీరు తిరుగుబాటు ధోరణిని ఎంతోకాలం చూపించకపోవచ్చు లేక ఘోరమైన పాపంలో ఇమిడి ఉండకపోవచ్చు మరియు తిరిగి చేర్చుకొనబడేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవడానికి సహాయం అవసరమై ఉండవచ్చు.—మత్తయి 24:45; యెహెజ్కేలు 34:16.

ఆసియాలో పౌలుకు వచ్చిన శ్రమ

13, 14. (ఎ) ఆసియాలో తాను అనుభవించిన తీవ్రమైన శ్రమ కాలాన్ని పౌలు ఏ విధంగా వర్ణించాడు? (బి) పౌలు ఏ సంఘటనను మనస్సులో కల్గివుండి ఉంటాడు?

13 పౌలు సహించవలసివచ్చిన అనేక శ్రమలతో ఇంత వరకూ కొరింథీ సంఘం అనుభవించిన బాధను పోల్చరాదు. అందుకే ఆయన వారికి ఇలా జ్ఞాపకం చేశాడు: “సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇకముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.”—2 కొరింథీయులు 1:8-10.

14 పౌలు ప్రాణాన్ని అలాగే మాసిదోనియాకు చెందిన ఆయన తోటి ప్రయాణికులైన గాయి, అరిస్తర్కు అనే ఇరువురి ప్రాణాల్ని కూడా బలిగొనబోయిన ఎఫెసీలోని అల్లరిని పౌలు సూచిస్తున్నాడని కొంతమంది బైబిలు పండితులు నమ్ముతున్నారు. ఈ ఇరువురు క్రైస్తవులు “రెండు గంటలసేపు—ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసి”న అల్లరిమూకతో నిండిపోయిన నాటకశాలలోనికి బలవంతంగా కొనిపోబడ్డారు. సమూహాన్ని సముదాయించడంలో నగరాధికారి చివరకు సఫలుడయ్యాడు. గాయి, అరిస్తర్కుల ప్రాణాలకు వాటిల్లిన ఈ భయం పౌలును ఎంతగానో కలవరపర్చింది. నిజానికి, ఆయన లోపలకు వెళ్లి, మతమౌఢ్యులైన ఆ గుంపుతో తర్కించాలని అనుకున్నాడు, కాని ఈ విధంగా తన ప్రాణాన్ని అపాయంలో పడవేసుకోకుండా ఆయన వారించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 19:26-41.

15. మొదటి కొరింథీయులు 15:32 వచనంలో ఏ తీవ్రమైన పరిస్థితి వర్ణించబడి ఉండవచ్చు?

15 అయినా, ముందు జరగబోయే సంఘటనకన్నా ఎంతో విపరీతమైన ఓ పరిస్థితిని పౌలు వివరిస్తూ ఉండవచ్చు. పౌలు కొరింథీయులకు వ్రాసిన తన మొదటి పత్రికలో ఇలా అడిగాడు: “మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి?” (1 కొరింథీయులు 15:32) మృగాలవంటి మనుష్యుల వలన మాత్రమే కాదుగాని ఎఫెసు స్టేడియంలోని క్రూరమృగాల వలన కూడా ఆయన ప్రాణానికి అపాయం వాటిల్లి ఉండవచ్చునని దీని భావమైవుంది. రక్తపిపాసులైన సమూహాలు చూస్తుండగా నేరస్థులు క్రూరమృగాలతో పోరాడేందుకు బలవంత పెట్టబడడం ద్వారా కొన్నిసార్లు శిక్షించబడ్డారు. అక్షరార్థమైన క్రూరమృగాల్ని ఎదుర్కొన్నాడనేదే గనుక పౌలు భావమైతే సింహాల నోటినుండి రక్షించబడిన దానియేలువలె ఆయన కూడా క్రూరమైన మరణాన్నుండి చివరి క్షణంలో తప్పక తప్పించబడి ఉండవచ్చు.—దానియేలు 6:22.

ఆధునిక దిన మాదిరులు

16. (ఎ) పౌలు అనుభవించిన శ్రమల్ని యెహోవాసాక్షులలో అనేకమంది ఎందుకు అర్థం చేసుకోగలరు? (బి) తమ విశ్వాసాన్నిబట్టి మరణించివారిని గురించి మనమే నిశ్చయతను కల్గివుండగలం? (సి) కొంతమంది క్రైస్తవులు మరణం నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్నప్పుడు ఏ మంచి ప్రభావం ఏర్పడింది?

16 ప్రస్తుతదిన క్రైస్తవులలో అనేకమంది పౌలు అనుభవించిన శ్రమల్ని అర్థం చేసుకోగలరు. (2 కొరింథీయులు 11:23-27) నేడు కూడా క్రైస్తవులు “[తమ] శక్తికి మించిన అత్యధిక భారము”ను కల్గివున్నారు, అనేకులు తాము ‘బ్రతుకుతామనే నమ్మకంలేని’ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. (2 కొరింథీయులు 1:8) మూకుమ్మడిగా హత్యలుచేసే వారి చేతుల్లోను, క్రూరులైన హింసకుల చేతుల్లోను కొందరు మరణించారు. దేవుని ఆదరణాశక్తి వారు సహించుకునేలా చేసిందని మరియు వారి నిరీక్షణ అటు పరలోకసంబంధమైనదైనా లేక భూసంబంధమైనదైనా దాని నెరవేర్పుపై హృదయాల్ని మనస్సుల్ని కేంద్రీకరించి వారు మరణించారనే నిశ్చయతను మనం కల్గివుండగలం. (1 కొరింథీయులు 10:13; ఫిలిప్పీయులు 4:13; ప్రకటన 2:10) మరితర పరిస్థితుల్లో యెహోవా విషయాల్ని తారుమారుచేశాడు, మన సహోదరులు మరణం నుండి తప్పించబడ్డారు. ఆ విధంగా తప్పించబడిన వారు ‘మృతులను లేపు దేవునియందు’ పెరిగిన తమ నమ్మకాన్ని నిస్సందేహంగా పెంపొందించుకున్నారు. (2 కొరింథీయులు 1:9) అటు తర్వాత, వారు ఇతరులతో దేవుని ఆదరణకరమైన సందేశాన్ని పంచుకున్నప్పుడు మరింత ఒప్పుదలతో మాట్లాడగల్గుతారు.—మత్తయి 24:14.

17-19. రువాండాలోని మన సహోదరులు దేవుని ఆదరణలో పాలివారని ఏ అనుభవాలు చూపుతున్నాయి?

17 పౌలు ఆయన సహవాసులు అనుభవించినలాంటి దానినే రువాండాలోని మన సహోదరులు ఇటీవల అనుభవించారు. అనేకమంది తమ ప్రాణాల్ని కోల్పోయారు కాని వారి విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడంలో సాతాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బదులుగా, ఈ దేశంలోని మన సహోదరులు వ్యక్తిగతంగా అనేకమైన రీతుల్లో దేవుని ఆదరణను అనుభవించారు. రువాండాలో నివసిస్తున్న హుటూ, టుట్సీల జాతివిధ్వంసకాండ జరిగిన సమయంలో టుట్సీలను కాపాడేందుకు హుటూలు, హుటూలను కాపాడేందుకు టుట్సీలు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. తమ తోటి విశ్వాసుల్ని కాపాడుతున్నందుకు అతివాదులచే కొందరు చంపబడ్డారు. ఉదాహరణకు, ఛాంటల్‌ అనే పేరుగల టుట్సీ సహోదరిని దాచిన తర్వాత గాహిజి అనే పేరుగల ఓ హుటు సాక్షి చంపబడ్డాడు. ఛాంటల్‌ టుట్సి భర్తయైన జాన్‌ను మరో ప్రాంతంలో షార్లొట్‌ అనే పేరుగల హుటు సహోదరి దాచివుంచింది. రాత్రి సమయంలో మాత్రమే కొద్దిసేపు బయటికి వస్తూ జాన్‌ మరియు మరో టుట్సి సహోదరుడు ఓ పెద్ద పొగగొట్టంలో దాదాపు 40 రోజులు దాక్కొని ఉన్నారు. హుటు సైనిక శిబిరానికి దగ్గర్లోనే నివసిస్తున్నప్పటికీ ఈ కాలమంతటిలోను షార్లొట్‌ వారికి ఆహారాన్ని కాపుదలను ఇచ్చింది. జాన్‌ ఛాంటల్‌లు తిరిగి కలుసుకున్నప్పటి చిత్రాన్ని మీరు ఈ పేజీలో చూడగలరు, ప్రిస్కిల్ల, అకులలు ‘తమ ప్రాణాల్ని’ అపొస్తలుడైన పౌలు నిమిత్తం అపాయంలో పెట్టుకున్నట్లుగానే’ తమ కోసం ప్రాణాల్ని అపాయంలో పెట్టుకున్న తమ తోటి ఆరాధికులైన హుటులకు వీరు కృతజ్ఞులైవున్నారు.—రోమీయులు 16:3, 4.

18 తోటి టుట్సీ విశ్వాసుల్ని కాపాడినందుకు రుఆఖుబుబు అనే మరో హుటు సాక్షిని ఇన్‌టరెమర అనే వార్తాపత్రిక కొనియాడింది.a అదిలా తెలియజేసింది: “తన సహోదరుల (అలాగని తోటి విశ్వాసులు ఒకరినొకరు పిల్చుకుంటారు) మధ్య అక్కడక్కడ ప్రజల్ని దాస్తూవుండే రుహఖుబుబు అనే ఓ యెహోవాసాక్షి ఉన్నాడు. ఆయన ఆస్త్మా రోగియైనా వారికి ఆహార పానీయాల్ని తీసుకెళ్లడంలో ఆయన రోజంతా గడిపేవాడు. అయితే దేవుడు ఆయనకు విశేషమైన బలాన్నిచ్చాడు.”

19 నికొడెమ్‌ మరియు అటనాజి అనే పేర్లుగల ఆసక్తి కల్గిన హుటు దంపతుల విషయాన్ని కూడా పరిశీలించండి. జాతివిధ్వంసకాండ చెలరేగక ముందు ఆల్ఫొన్స్‌ అనే పేరుగల టుట్సీ సాక్షిద్వారా ఈ వివాహిత దంపతులు బైబిలు పఠనం తీసుకునేవారు. తమ ప్రాణాల్ని పణంగాపెట్టి ఆల్ఫొన్స్‌ను వారు తమ గృహంలోనే దాచివుంచారు. తమ టుట్సీ స్నేహితుని గురించి తమ పొరుగువారైన హుటూలకు తెల్సు గనుక ఆ ఇల్లు అనువైన స్థలం కాదని తర్వాత వారు గ్రహించారు. కాబట్టి, నికొడెమ్‌, అటనాజిలు ఆల్ఫొన్స్‌ని తమ పెరడులోని ఓ గోతిలో దాచిపెట్టారు. ఇలా వెళ్లడం మంచిదైంది ఎందుకంటే దాదాపు ప్రతిరోజూ ఆల్ఫొన్స్‌ని అన్వేషించడానికి పొరుగువారు వచ్చేవారు. ఆ గోతిలోనే 28 రోజులుగా పడుకొని, యెరికోలోని తన ఇంటిమిద్దెపై ఇద్దరు ఇశ్రాయేలీయుల్ని దాచిన రాహాబును గురించిన వివరణలవంటి బైబిలు వివరణలను ఆల్ఫొన్స్‌ ధ్యానించేవాడు. (యెహోషువ 6:17) ఆల్ఫొన్స్‌ నేడు సువార్త ప్రచారకునిగా రువాండాలో తన సేవను కొనసాగిస్తున్నాడు, అతని కొరకు తమ ప్రాణాల్ని అపాయంలో పెట్టుకున్న అతని హుటు బైబిలు విద్యార్థులకు కృతజ్ఞతలు. నికొడెమ్‌, అటనాజిల విషయమేమిటి? వారిప్పుడు బాప్తిస్మం తీసుకొనిన యెహోవాసాక్షులు మరియు ఆసక్తి కల్గిన వ్యక్తులతో 20కి పైగా బైబిలు పఠనాల్ని చేస్తున్నారు.

20. రువాండాలోని మన సహోదరుల్ని యెహోవా ఏ రీతిలో ఆదరించాడు, కాని వారిలో అనేకులకు ఎట్టి ఎడతెగని అవసరంవుంది?

20 రువాండాలో జాతివిధ్వంసకాండ ఆరంభమైననాటికి, ఆ దేశంలో 2,500 మంది సువార్త ప్రచారకులు ఉన్నారు. వందలాదిమంది తమ ప్రాణాల్ని కోల్పోయినా లేక ఆ దేశం నుండి పారిపోవడానికి ఒత్తిడి చేయబడినా, ఆ సాక్షుల సంఖ్య 3,000 మందికి పైగా పెరిగింది. మన సహోదరుల్ని దేవుడు నిజంగా ఆదరించాడనడానికి అదే తార్కాణం. యెహోవాసాక్షులలో ఉన్న అనేకమంది అనాథలు, విధవరాండ్ర విషయమేమిటి? సహజంగానే వీరు ఇప్పటికీ శ్రమను అనుభవిస్తున్నారు, వీరికి ఎడతెగని ఆదరణ అవసరం. (యాకోబు 1:27) దేవుని నూతన లోకంలో పునరుత్థానం జరిగినప్పుడు మాత్రమే వారి కన్నీళ్లు పూర్తిగా తుడిచివేయబడతాయి. అయినా, తమ సహోదరుల ఉపచర్యల మూలంగానూ వారు ‘సమస్త ఆదరణకర్తయగు దేవుని’ ఆరాధికులైనందుననూ జీవితాన్ని వారు తాళుకొనగల్గుతున్నారు.

21. (ఎ) దేవుని ఆదరణ పొందాల్సిన తీవ్రమైన అవసరతలోవున్న మన సహోదరులు ఎక్కడెక్కడ ఉన్నారు, మనమందరమూ సహాయం చేయగల్గే ఒక మార్గం ఏమిటి? (“నాలుగు సంవత్సరాల యుద్ధకాలంలో ఆదరణ” అనే బాక్సును చూడండి.) (బి) ఆదరణ కొరకైన మన అవసరత ఎప్పుడు పూర్తిగా తీర్చబడుతుంది?

21 ఇరిట్రియా, సింగపూర్‌, మునుపటి యుగొస్లేవియావంటి అనేక ఇతర దేశాల్లో శ్రమలు ఉన్నప్పటికీ మన సహోదరులు యెహోవాను నమ్మకంగా సేవించడంలో కొనసాగుతున్నారు. వారు ఆదరణను పొందునట్లుగా మనం క్రమమైన విన్నపాలు చేయడంద్వారా అలాంటి సహోదరులకు సహాయపడదాం. (2 కొరింథీయులు 1:11) దేవుడు యేసుక్రీస్తు ద్వారా పూర్తి స్థాయిలో “[మన] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి”వేసే సమయం వరకూ మనం నమ్మకంగా సహించుకుందాం. అప్పుడు మనం యెహోవా తన నీతియుక్త నూతన లోకంలో దయచేయబోయే ఆదరణను పూర్తి స్థాయిలో అనుభవిస్తాం.—ప్రకటన 7:17; 21:4; 2 పేతురు 3:13.

[అధస్సూచీలు]

a రుఆఖుబుబు కుమార్తెయైన డెబోరా చేసిన ప్రార్థన, హుటు సైనికుల హృదయాల్ని తాకి ఆ కుటుంబం హత్యకావించబడకుండా కాపాడిన అనుభవాన్ని గురించి కావలికోట జనవరి 1, 1995, పేజీ 26 తెలియజేసింది.

మీకు తెలుసా?

◻ ‘సమస్త ఆదరణకు కర్తయగు దేవుడని’ యెహోవా ఎందుకు పిలువబడ్డాడు?

◻ మనం శ్రమల్ని ఏ విధంగా దృష్టించాలి?

◻ ఎవరితో మనం ఆదరణను పంచుకోగలం?

◻ ఆదరణ కొరకైన మన అవసరత ఏ విధంగా పూర్తిగా తీర్చబడుతుంది?

[17వ పేజీలోని చిత్రం]

జాన్‌ మరియు ఛాంటల్‌లు టుట్సీ సాక్షులైనప్పటికీ రువాండాలోని జాతివిధ్వంసకాండ చెలరేగిన సమయంలో హుటు సాక్షులచే వేర్వేరు స్థలాల్లో దాచబడ్డారు

[17వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు రువాండాలోని తమ పొరుగువారితో దేవుని ఆదరణకరమైన సందేశాన్ని ఎడతెగకుండా పంచుకుంటున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి