కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 11/1 పేజీలు 7-12
  • ఆదరణ కొరకు యెహోవావైపు చూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదరణ కొరకు యెహోవావైపు చూడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదరణకరమైన వాగ్దానం నెరవేరింది
  • నోవహుకన్నా గొప్పవాడొకడు
  • ఆదరణ ఎక్కడ దొరుకుతుంది
  • తీవ్రమైన శ్రమ కాలాల్లో
  • నిజమైన ఓదార్పు ఎక్కడ లభిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • దేవుడు ఎలా ఓదారుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 11/1 పేజీలు 7-12

ఆదరణ కొరకు యెహోవావైపు చూడండి

“క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.”—రోమీయులు 15:5.

1. ఆదరణ కొరకైన అవసరత రోజురోజుకీ ఎందుకు పెరిగిపోతోంది?

గడిచే ప్రతిరోజూ దానితోపాటు ఆదరణ కొరకు పెరుగుతున్న అవసరాన్ని తీసుకొస్తున్నది. 1,900 సంవత్సరాల క్రిందట బైబిలు రచయిత ఒకరు గమనించినట్లుగా ‘సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది.’ (రోమీయులు 8:22) ‘మూలుగడం,’ ‘వేదన’పడడడం మనకాలంలో ఇంతకు మునుపుకన్నా మరింత ఎక్కువైంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంనాటినుండి మానవజాతి యుద్ధాలు, నేరం మరియు మానవుడు భూమిని సక్రమంగా పర్యవేక్షించనందున తరచూ సంభవించు ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఒకదాని తర్వాత మరొక సంక్షోభాన్ని అనుభవించింది.—ప్రకటన 11:18.

2. (ఎ) మానవజాతి ఎదుర్కుంటున్న ప్రస్తుత శ్రమలకు ఎక్కువగా నిందించబడాల్సిందెవరు? (బి) ఏ వాస్తవం ఆదరణ కొరకు మనకు ఓ ఆధారాన్ని కలుగజేస్తోంది?

2 మన కాలంలో ఎందుకింత బాధవుంది? 1914లో రాజ్యం ఉద్భవించిన తర్వాత పరలోకంనుండి సాతాను పడద్రోయబడడాన్ని గూర్చి వర్ణిస్తూ బైబిలు ఇలా జవాబిస్తోంది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.” (ప్రకటన 12:12) మనం సాతాను దుష్ట పరిపాలనాంతానికి దాదాపుగా చేరుకోవడమే ఆ ప్రవచన నెరవేర్పుకు స్పష్టమైన తార్కాణం. సాతాను మన మొదటి తల్లిదండ్రుల్ని తిరుగుబాటుకు నడిపించడానికి మునుపున్న శాంతియుతమైన స్థితికి భూమిపైనున్న జీవితం త్వరలోనే తిరిగి వస్తుందని తెలుసుకోవడం ఎంత ఆదరణకరమైన విషయమో కదా!

3. ఆదరించబడాల్సిన అవసరతలేకుండా మానవులు ఉన్నదెప్పుడు?

3 ఆదిలో అందమైన ఉద్యానవనంలాంటి ఓ గృహాన్ని మానవ సృష్టికర్త మొదటి మానవజత కొరకు ఇచ్చాడు. “సంతోషం” లేక “ప్రీతి” అనే అర్థాన్నిచ్చే ఏదెను అని పిలువబడిన ప్రాంతంలో అదివుంది. (ఆదికాండము 2:8, అథఃస్సూచి, NW) అంతేకాకుండా ఆదాము, హవ్వ ఎన్నటికీ మరణించని ఉత్తరాపేక్షతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవించారు. తోటపని, కళ, నిర్మాణం, సంగీతం వంటి వాటిలో తమ సామర్థ్యాల్ని వారు పెంపొందించకొనగల్గే అనేక రంగాల్ని గురించి కొంచెం ఆలోచించండి. భూమిని లోబర్చుకొని, దానిని పరదైసుగా చేసే తమ పనిని వారు నెరవేరుస్తుండగా సృష్టి కార్యాలన్నింటిని వారు అధ్యయనం చేయగల్గేవారని కూడా యోచించండి. (ఆదికాండము 1:28) నిశ్చయంగా మూల్గులు, వేదనలతోగాక సంతోషానందాలతో ఆదాము హావ్వల జీవితాలు నిండివుండేవి. స్పష్టంగా, ఆదరించబడాల్సిన అగత్యం వారికి లేదు.

4, 5. (ఎ) ఆదాము, హవ్వలు విధేయతా పరీక్షలో ఎందుకు విఫలులయ్యారు? (బి) ఆదరించబడాల్సిన అవసరతలోనికి మానవులు ఎలా వచ్చారు?

4 అయితే ఆదాము, హవ్వలు చేయాల్సినదల్లా తమ దయగల పరలోకపు తండ్రి ఎడల ప్రగాఢమైన ప్రేమను ప్రశంసను పెంపొందించుకోవడమే. అటువంటి ప్రేమ అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి విధేయతను చూపించేలా వారిని ప్రేరేపించి ఉండేది. (యోహాను 14:31 పోల్చండి.) విచారకరంగా, మన ఆది తల్లిదండ్రులు ఇరువురూ తమ సర్వాధిపతిగా హక్కుదారుడైన యెహోవాకు విధేయతను చూపించడంలో విఫలులయ్యారు. బదులుగా, పతనమైన దూతయైన అపవాదియగు సాతాను దుష్ట పరిపాలన క్రిందకు రావడానికి వారు తమ్మునుతాము అనుమతించుకున్నారు. పాపం చేయడానికి, నిషేధించిన ఫలాన్ని భుజించడానికి హవ్వను శోధించింది సాతానే. “నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని” స్పష్టంగా దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని ఆదాము కూడా భుజించినప్పుడు అతడు పాపం చేశాడు.—ఆదికాండము 2:17.

5 ఈ విధంగా, పాపభరితులైన ఆ జంట మరణించనారంభించారు. మరణ శిక్షను విధిస్తున్నప్పుడు ఆదాముతో దేవుడు ఇలా కూడా చెప్పాడు: “నీ నిమిత్తం నేల శపించబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు.” (ఆదికాండము 3:17, 18) ఆ విధంగా ఆదాము, హవ్వలు సాగుచేయబడని భూమిని పరదైసుగా చేసే ఉత్తరాపేక్షను కోల్పోయారు. ఏదెను నుండి వెళ్లగొట్టబడి, శపించబడిన నేలనుండి ప్రయాసముతో ఆహారాన్ని పొందేందుకు వారు తమ శక్తుల్ని కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈ పాపకరమైన, మరణకరమైన స్థితిని వారసత్వంగా పొందిన వారి సంతానం, మరింతగా ఆదరించబడాల్సిన అవసరతలోనికి వచ్చింది.—రోమీయులు 5:12.

ఆదరణకరమైన వాగ్దానం నెరవేరింది

6. (ఎ) మానవజాతి పాపంలో పడిపోయిన తర్వాత ఆదరణపూరితమైన ఏ వాగ్దానాన్ని దేవుడు చేశాడు? (బి) ఆదరణను గూర్చిన ఏ ప్రవచనాన్ని లెమెకు ప్రవచించాడు?

6 మానవ తిరుగుబాటును పురికొల్పినవానిని శిక్షించినప్పుడు, ‘ఆదరణకు కర్తయగు దేవుడ’ని యెహోవా రుజువు చేసుకున్నాడు. (రోమీయులు 15:5) ఆదాము తిరుగుబాటు మూలంగా కల్గిన దారుణ ఫలితాలనుండి అతని సంతానాన్ని చివరకు విడుదల చేయబోయే ‘సంతానాన్ని’ పంపిస్తానని వాగ్దానం చేయడంద్వారా ఆయన దానిని చేశాడు. (ఆదికాండము 3:15) సకాలంలో, ఈ విడుదలను గూర్చిన ఆశాకిరణాల్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఉదాహరణకు, ఆదాముకు తన కుమారుడైన షేతు ద్వారా వచ్చిన దూరపు సంతానమైన లెమెకును ఆయన ప్రేరేపించి, లెమెకు కుమారుడు ఏమి చేయబోతాడో ప్రవచించేలా చేశాడు: “భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయు”ను. (ఆదికాండము 5:29) ఈ వాగ్దానానికి అనుగుణంగా, “నెమ్మది” లేక “ఓదార్పు” అనే భావాన్నిస్తున్న నోవహు అను పేరు ఆ బాలునికి పెట్టబడింది.

7, 8. (ఎ) మానవున్ని సృష్టించినందుకు యెహోవా పశ్చాత్తాప పడాల్సిన స్థితికి ఏ పరిస్థితి నడిపించింది, అందును గూర్చి ఆయన ఏమి చేయ సంకల్పించాడు? (బి) తన పేరుకున్న అర్థానికి తగినట్టుగా నోవహు ఏ విధంగా జీవించాడు?

7 ఈలోగా పరలోక దూతల్లో కొందరిని అనుచరులుగా సాతాను సంపాదించుకున్నాడు. వీళ్లు మానవులుగా భౌతికరూపాన్ని ధరించి, ఆదాము సంతానంలోని ఆకర్షణీయమైన స్త్రీలను భార్యలుగా చేపట్టారు. అటువంటి అసహజ కలయికలు మానవ సమాజాన్ని మరింతగా పాడుచేసి, భూమిని హింసతో నింపిన ‘బలత్కారులైన’ భక్తిహీన నెఫీలలు జాతిని ఉత్పన్నం చేశాయి. (ఆదికాండము 6:1, 2, 4, 11; యూదా 6) “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.”—ఆదికాండము 6:5, 6.

8 భూమ్యంతటా జలప్రళయాన్ని రప్పించి ఆ దుష్ట లోకాన్ని నాశనం చేయాలని యెహోవా సంకల్పించాడు, కాని జీవాన్ని కాపాడేందుకు నోవహు ఓడను నిర్మించడానికి ఆయన అనుమతించాడు. ఆ విధంగా మానవజాతి, జంతుజాలం రక్షించబడ్డాయి. పరిశుభ్రపర్చబడిన భూమిపైకి ఓడలోనుండి నోవహు అతని కుటుంబం దిగుతుండగా, జలప్రళయానంతరం వారెంత ఉపశమనాన్ని పొందివుంటారో కదా! భూమిపై నుండి శాపం తొలగించబడి, వ్యవసాయ కార్యక్రమం మరింత సులభం కావడాన్ని చూడడం ఎంత ఆదరణో కదా! నిశ్చయంగా, లెమెకు ప్రవచనం నిజమని రుజువైంది, నోవహు తన పేరుకుగల భావానికి తదనుగుణంగా జీవించాడు. (ఆదికాండము 8:21) విశ్వాస పాత్రుడైన దేవుని సేవకునిగా నోవహు, మానవజాతికి తగినంత “ఆదరణ”ను తేవడంలో ఒక ఉపకరణమయ్యాడు. అయితే, సాతాను దయ్యాలైన అతని దూతల దుష్ట ప్రభావం జలప్రళయంతో ముగిసిపోలేదు మరియు పాపం, రోగం, మరణాల భారం క్రింద మానవజాతి ఎడతెగక మూల్గుతోంది.

నోవహుకన్నా గొప్పవాడొకడు

9. పశ్చాత్తాపపడిన మానవులకు సహాయకునిగాను ఆదరించువానిగాను యేసుక్రీస్తు ఏ విధంగా రుజువుచేసుకున్నాడు?

9 తుదకు మానవజాతి చరిత్రలోని దాదాపు 4,000 సంవత్సరాల అంతంలో, వాగ్దాన సంతానం వచ్చాడు. మానవజాతి ఎడలగల గొప్ప ప్రేమచే కదిలించబడిన యెహోవా దేవుడు, పాపభరిత మానవజాతి నిమిత్తం విమోచన క్రయధనంగా మరణించేందుకు భూమిపైకి తన అద్వితీయ కుమారుని పంపించాడు. (యోహాను 3:16) తన బలి మరణమందు విశ్వాసముంచిన పశ్చాతాప్తులైన పాపులకు యేసుక్రీస్తు గొప్ప ఉపశమనాన్ని తెస్తున్నాడు. తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకొని, ఆయన కుమారుని శిష్యులైన వారందరూ శాశ్వత విశ్రాంతిని, ఆదరణను అనుభవిస్తారు. (మత్తయి 11:28-30; 16:24) అపరిపూర్ణతను కల్గివున్నా, పరిశుభ్రమైన మనస్సాక్షితో దేవునిని సేవించడంలో వారు ప్రగాఢమైన ఆనందాన్ని కనుగొన్నారు. యేసునందు విశ్వాసాన్ని ఎడతెగకుండా కల్గివుంటే వారు నిత్యజీవ బహుమానాన్ని పొందుతారని తెలుసుకోవడం వారికెంత ఆదరణనిస్తుందో కదా! (యోహాను 3:36; హెబ్రీయులు 5:9) బలహీనతనుబట్టి వారు గంభీరమైన పాపాన్ని చేసినట్లయితే పునరుత్థానుడైన ప్రభువగు యేసునందు వారు ఒక సహాయకున్ని లేక ఆదరించువాడిని కల్గివున్నారు. (1 యోహాను 2:1, 2) అటువంటి పాపాన్ని ఒప్పుకోవడం ద్వారాను పాపాన్ని అభ్యసించేవారిగా ఉండకుండేందుకు లేఖనాధారిత చర్యల్ని తీసుకోవడం ద్వారాను వారు ‘తమ పాపాల్ని క్షమించేందుకు దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడని’ తెలుసుకొని ఉపశమనాన్ని పొందుతారు.—1 యోహాను 1:9; 3:6; సామెతలు 28:13.

10. యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలనుండి మనమేమి నేర్చుకొనగలము?

10 యేసు భూమ్మీద ఉన్నప్పుడు దయ్యం పట్టినవానిని విడుదల చెయ్యడం ద్వారా ప్రతివిధమైన రోగాన్ని స్వస్థపర్చడం ద్వారా ప్రియులైన మృతులను తిరిగి సజీవులుగా లేపడం ద్వారా కూడా విశ్రాంతిని తీసుకొచ్చాడు. నిజమే, ఆ విధంగా ఆశీర్వదించబడిన వారు అటు తర్వాత వృద్ధులై మరణించారు గనుక అలాంటి అద్భుతాలు తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే తెచ్చాయి. అయినప్పటికీ, దాని మూలంగా యేసు తాను మానవజాతి అంతటిపైకి కుమ్మరించబోయే శాశ్వత భవిష్య ఆశీర్వాదాల్ని సూచించాడు. ఇప్పుడు బలిష్ఠుడగు పరలోకపు రాజుగా ఆయన కేవలం దయ్యాల్ని వెళ్లగొట్టడంకన్నా ఎంతో గొప్పకార్యాన్ని త్వరలోనే చేస్తాడు. వారి నాయకుడగు సాతానుతోపాటు వారిని ఆయన నిష్క్రియా స్థితియైన అగాధములో పడవేస్తాడు. తర్వాత క్రీస్తు మహిమాయుక్త వెయ్యేండ్ల పాలన ఆరంభమౌతుంది.—లూకా 8:30, 31; ప్రకటన 20:1, 2, 6.

11. ‘విశ్రాంతి దినానికి ప్రభువని’ తననుతాను యేసు ఎందుకు పిల్చుకున్నాడు?

11 యేసు తాను “విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నా”నని చెప్పాడు, ఆయన చేసిన స్వస్థతల్లో అనేకం విశ్రాంతి దినాన్నే చేశాడు. (మత్తయి 12:8-13; లూకా 13:14-17; యోహాను 5:15, 16; 9:14) ఆ రోజునే ఎందుకు చేశాడు? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం ఒక భాగం మరియు ఆ విధంగా “రాబోవుచున్న మేలుల ఛాయ”గా అది పనిచేసింది. (హెబ్రీయులు 10:1) వారంలోని ఆరు పని దినాలు, సాతాను పీడిత పరిపాలనకు మానవుడు చేసిన గత 6,000 సంవత్సరాల బానిసత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. వారాంతంలోని విశ్రాంతి దినం, గొప్ప నోవహుయైన యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనా కాలంలో మానవజాతి అనుభవించే ఆదరణకరమైన విశ్రాంతిని మనస్సులోనికి తెస్తుంది.—2 పేతురు 3:8 పోల్చండి.

12. ఏ ఆదరణకరమైన అనుభవాల కొరకు మనం ఎదురు చూడగలము?

12 చివరకు, క్రీస్తు పరిపాలన యొక్క భూసంబంధమైన అనుయాయులు సాతాను దుష్ట ప్రభావం నుండి తాము పూర్తిగా విడుదల పొందినట్లుగా చివరకు కనుగొన్నప్పుడు వారెంత విశ్రాంతిని పొందుతారో! వారు తమ భౌతిక, భావోద్రేక, మానసిక రుగ్మతల నుండి స్వస్థతను పొందినప్పుడు మరింత ఆదరణ లభిస్తుంది. (యెషయా 65:17) తర్వాత, ప్రియులైనవారిని మృతులలో నుండి వారు ఆహ్వానించడం ఆరంభించినప్పుడు వారు పొందే పారవశ్యాన్ని గూర్చి కొంచెం ఆలోచించండి! ఆ విధంగా దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 21:4) యేసు విమోచన క్రయధన ప్రయోజనాలు అంతకంతకూ అన్వయించబడుతుండగా, దేవుని రాజ్యం యొక్క విధేయతగల అనుయాయులు ఆదాము పాపపు చెడు పర్యవసనాలన్నింటి నుండి పూర్తిగా విడుదలపొందుతూ పరిపూర్ణతకు ఎదుగుతారు. (ప్రకటన 22:1-5) తర్వాత సాతాను “కొంచెము కాలము” విడుదల చేయబడతాడు. (ప్రకటన 20:3, 7) యెహోవా సరియైన సర్వాధిపత్యాన్ని నమ్మకంగా అంటిపెట్టుకున్న మానవులందరికి నిత్యజీవం బహుకరించబడుతుంది. చెప్పనలవికాని ఆనందాన్ని, “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి” పూర్తిగా “విడిపింపబ”డే విశ్రాంతిని ఊహించండి! ఆ విధంగా విధేయులైన మానవజాతి “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము”ను అనుభవిస్తుంది.—రోమీయులు 8:20.

13. దేవుడు అనుగ్రహించు ఆదరణ నిజ క్రైస్తవులు అందరికీ ఎందుకు అవసరం?

13 అంతవరకూ, సాతాను దుష్ట విధానంలో జీవించు వారందరికీ సామాన్యమైన మూల్గులకు వేదనకు మనం లోబడుతూ ఉండాల్సిందే. పెరుగుతున్న భౌతిక రోగాలు, భావోద్రేక రుగ్మతలు నమ్మకమైన క్రైస్తవులతోపాటు అన్ని రకాల ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి. (ఫిలిప్పీయులు 2:25-27; 1 థెస్సలొనీకయులు 5:14) దానికితోడు, ‘పరిపాలకునిగా మానవులకుగాక దేవునికే లోబడుతు’న్నందున మనపై సాతాను కుమ్మరిస్తున్న అన్యాయపు అపహాస్యాన్ని, హింసను క్రైస్తవులుగా మనం తరచూ అనుభవిస్తున్నాం. (అపొస్తలుల కార్యములు 5:29) ఆ విధంగా, సాతాను విధానాంతం వరకూ దేవుని చిత్తాన్ని చేయడంలో మనం కొనసాగాలంటే మనకు ఆయన అనుగ్రహించు ఆదరణ, సహాయం, మద్దతు అవసరం.

ఆదరణ ఎక్కడ దొరుకుతుంది

14. (ఎ) యేసు తాను మరణించడానికి ముందురాత్రి ఏ వాగ్దానాన్ని చేశాడు? (బి) దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చు ఆదరణ నుండి మనం పూర్తిగా ప్రయోజనం పొందాలంటే ఏమి అవసరం?

14 తన మరణానికి ముందు రాత్రి, యేసు తన నమ్మకమైన అపొస్తలులను త్వరలోనే విడనాడి, తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లబోతున్నానని వారికి విశదపర్చాడు. ఇది వారిని కలవరపర్చి దుఃఖక్రాంతులను చేసింది. (యోహాను 13:33, 36; 14:27-31) వారు నిర్విరామంగా ఆదరించబడాల్సిన అవసరతను గుర్తిస్తూ యేసు ఇలా వాగ్దానం చేశాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.” (యోహాను 14:16, అథఃస్సూచి, NW) తాను పునరుత్థానమైన 50 రోజుల తర్వాత తన శిష్యులపై కుమ్మరించబడిన దేవుని పరిశుద్ధాత్మను యేసు ఇక్కడ సూచించాడు.a ఇతర విషయాలతోపాటు వారు శ్రమలను అనుభవిస్తున్న కాలంలో వారిని ఆదరించి, దేవుని చిత్తాన్ని చేయడంలో కొనసాగడానికి దేవుని ఆత్మ వారిని బలపర్చింది. (అపొస్తలుల కార్యములు 4:31) అయితే, అటువంటి సహాయం దానంతటదే వస్తుందని దృష్టించకూడదు. దానినుండి పూర్తిగా ప్రయోజనం పొందేందుకు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దయచేస్తున్న ఆదరణకరమైన సహాయం కొరకు ప్రతి క్రైస్తవుడు ఎడతెగక ప్రార్థిస్తుండాలి.—లూకా 11:13.

15. యెహోవా మనకు ఆదరణను అనుగ్రహిస్తున్న కొన్ని మార్గాలు ఏమిటి?

15 దేవుడు ఆదరణను అనుగ్రహిస్తున్న మరో మార్గమేంటంటే తన వాక్యమైన బైబిలు ద్వారానే. పౌలు ఇలా వ్రాశాడు: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:4) బైబిలులోను బైబిలు ఆధారిత ప్రచురణల్లోను వ్రాయబడిన విషయాలను మనం క్రమంగా చదవి, ధ్యానించాల్సిన అవసరతను ఇది చూపిస్తోంది. దేవుని వాక్యంనుండి ఆదరణకరమైన ఆలోచనలను పంచుకొనబడే క్రైస్తవ కూటాలకు మనం క్రమంగా హాజరవ్వాల్సిన అవసరత కూడావుంది. అటువంటి కూటాల ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం.—హెబ్రీయులు 10:25.

16. దేవుని ఆదరణకరమైన ఏర్పాట్లు ఏమి చేయడానికి మనల్ని పురికొల్పాలి?

16 దేవుడు చేసిన ఆదరణకరమైన ఏర్పాట్లను ఉపయోగించుకోవడం నుండి మనం పొందే మంచి ఫలితాల్ని పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక చూపుతోంది. “మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 15:5, 6) అవును, దేవుడు చేసిన ఆదరణకరమైన ఏర్పాట్లనుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం ద్వారా ధైర్యవంతుడైన మన నాయకుడగు యేసుక్రీస్తువలె మనం కాగలం. మన సాక్ష్యపు పనిలోను మన కూటాల్లోను తోటి విశ్వాసులతో చేసే ఆంతరంగిక సంభాషణల్లోను మరియు మన ప్రార్థనల్లోను దేవునిని మహిమపర్చేందుకు మన నోళ్లను ఉపయోగిస్తూ ఉండడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది.

తీవ్రమైన శ్రమ కాలాల్లో

17. యెహోవా తన కుమారున్ని ఏ విధంగా ఆదరించాడు మరి దాని ఫలితం ఏమిటి?

17 యేసు తన వేదనకరమైన మరణానికి ముందు రాత్రి ‘చింతాక్రాంతుడై,’ ‘బహుగా దుఃఖోన్ముఖుడ’య్యాడు. (మత్తయి 26:37, 38) కాబట్టి తన శిష్యుల్ని కొద్ది దూరంలో విడిచి, సహాయం కొరకు తన తండ్రికి ప్రార్థన చేశాడు. “భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” (హెబ్రీయులు 5:7) “పరలోకమునుండి యొకదూత [యేసుకు] కనబడి ఆయనను బలపరచెను” అని బైబిలు నివేదిస్తోంది. (లూకా 22:43) యేసు తన వ్యతిరేకుల్ని ఎదుర్కోవడంలో చూపిన ధైర్యోచిత మగధీరత్వ విధానమే దేవుడు తన కుమారున్ని ఆదరించిన విధానం అత్యంత ప్రభావితమైందనడానికి తార్కాణం.—యోహాను 18:3-8, 33-38.

18. (ఎ) అపొస్తలుడైన పౌలు జీవితంలోని ఏ కాలము విశేషంగా శ్రమలతో నిండివుంది? (బి) కష్టించి పనిచేస్తున్న కరుణామయులైన పెద్దలకు మనం ఏ విధంగా ఆదరణకరంగా ఉండగలం?

18 అపొస్తలుడైన పౌలు కూడా తీవ్రమైన శ్రమ కాలాల్ని అధిగమించాడు. ఉదాహరణకు, ఎఫెసులోని ఆయన పరిచర్య ‘యూదుల కుట్రలవలన [ఆయనకు] కల్గిన శోధనలు, కన్నీళ్ల’చే గుర్తించబడింది. (అపొస్తలుల కార్యములు 20:17-20) చివరకు, పౌలు ప్రకటనా కార్యక్రమాన్ని గూర్చి అర్తెమి దేవత మద్దతుదారులు పట్టణంలో అలజడిని రేపిన తర్వాత ఆయన ఎఫెసును విడిచిపెట్టాడు. (అపొస్తలుల కార్యములు 19:23-29; 20:1) పౌలు ఉత్తరదిశగా త్రోయ పట్టణానికి వెళ్లినప్పుడు, ఆయన మనస్సును బహుగా కలవరపెట్టినదేదో ఉంది. ఎఫెసులో అలజడి రేగడానికి కొంతకాలం ముందు కలతపర్చే ఓ నివేదికను ఆయన పొందాడు. కొరింథులో క్రొత్తగా ఏర్పడిన సంఘం విభజనచే పీడించబడింది, అది జారత్వాన్ని సహిస్తున్నది. కాబట్టి పరిస్థితి చక్కదిద్దబడుతుందనే నిరీక్షణలతో తీవ్రంగా గద్దిస్తూ ఎఫెసు నుండి పౌలు ఓ పత్రికను వ్రాశాడు. అది ఆయన చేయదగినంతటి సులభమైన విషయమేమీ కాదు. “నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని” అని ఆయన రెండవ పత్రికలో తర్వాత వ్యక్తర్చాడు. (2 కొరింథీయులు 2:4) అపొస్తలుడైన పౌలువలె, కరుణామయులైన పెద్దలు తమ స్వంత బలహీనతల్ని బాగుగా ఎరిగినందున సరిదిద్దే సలహాను గద్దింపును ఇవ్వడం వారికి అంత సులభమేమీ కాదు. (గలతీయులు 6:1) కాబట్టి, ప్రేమపూర్వకమైన బైబిలు ఆధారిత సలహాకు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండడం ద్వారా మనలో నాయకత్వం వహిస్తున్నవారికి మనం ఆదరణనిచ్చేవారిగా ఉందాం.—హెబ్రీయులు 13:17.

19. త్రోయ నుండి మాసిదోనియకు పౌలు ఎందుకు వెళ్లాల్సివచ్చింది, చివరకు ఆయన ఏ విధంగా ఉపశమనాన్ని పొందాడు?

19 ఎఫెసులో ఉండగా పౌలు కొరింథులోని సహోదరులకు పత్రికను వ్రాయడం మాత్రమే కాదుగాని వారికి మద్దతునివ్వడానికి తీతును కూడా పంపించి, పత్రికకు వారు చూపించిన ప్రతిస్పందనను తిరిగి నివేదించమని ఆయనను నియమించాడు. తీతు త్రోయలో తనని కలుసుకుంటాడని పౌలు నిరీక్షించాడు. అక్కడ శిష్యుల్నిచేసే శ్రేష్ఠమైన అవకాశాలతో పౌలు ఆశీర్వదించబడ్డాడు. కాని తీతు అక్కడికి ఇంకా చేరుకోనందున ఇది ఆయనకున్న చింతను తొలగించలేకపోయింది. (2 కొరింథీయులు 2:12, 13) గనుక మాసిదోనియలో తీతును కలుసుకుంటాననే ఆశతో ఆయన అక్కడకు బయలుదేరాడు. పౌలు పరిచర్యకు తీవ్ర వ్యతిరేకత సంభవించినందున ఆయనకున్న చింతాక్రాంతమైన స్థితి మరింత పెరిగిపోయింది. “మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను” అని ఆయన వివరిస్తున్నాడు. (2 కొరింథీయులు 7:5, 6) తన పత్రికకు కొరింథీయుల అనుకూల ప్రతిస్పందనను గురించి పౌలుకు తెలియజేసేందుకు తీతు చివరకు చేరుకున్నప్పుడు ఎంత ఉపశమనం కల్గిందో కదా!

20. (ఎ) పౌలు విషయంలోవలెనే, యెహోవా ఆదరణను అనుగ్రహిస్తున్న మరో ప్రాముఖ్యమైన మార్గమేది? (బి) తదుపరి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?

20 “దీనులు”గాను లేక “కృంగిపోయినవారి”గాను (ఫిలిప్స్‌) ఉండేందుకు కారణమైన శ్రమల్ని కూడా ఎదుర్కొనిన నేటి దేవుని సేవకులలో అనేకమందికి పౌలు అనుభవం ఆదరణనిస్తోంది. అవును, ‘ఆదరణను అనుగ్రహించు దేవునికి’ మన వ్యక్తిగత అవసరతలు తెలుసు మరియు కొరింథీయులలోని పశ్చాత్తాప వైఖరిని గూర్చిన తీతు నివేదిక ద్వారా పౌలు ఆదరణను పొందినట్లుగానే ఒకరికొకరము ఆదరణకరంగా ఉండేలా మనల్ని ఉపయోగించుకొనగలడు. (2 కొరింథీయులు 7:11-13) మన తర్వాతి శీర్షికలో కొరింథీయుల ఎడల పౌలు చూపిన హృదయపూర్వక ప్రతిస్పందనను మరియు నేడు దేవుడు చూపే ఆదరణను మనం ప్రతిభావంతంగా పంచుకొనేవారిగా ఉండేందుకు అది మనకు ఏ విధంగా సహాయపడుతుందో మనం పరిశీలిద్దాం.

[అధస్సూచీలు]

a మొదటి శతాబ్ద క్రైస్తవులపైన దేవుని పరిశుద్ధాత్మ చేసిన ప్రధానమైన కార్యాలలో ఒకటి, వారిని దేవుని ఆత్మీయ దత్త పుత్రులుగాను యేసు సహోదరులుగాను అభిషేకించడమే. (2 కొరింథీయులు 1:21, 22) ఇది 1,44,000 మందియైన యేసుక్రీస్తు శిష్యులకు మాత్రమే ప్రత్యేకించబడింది. (ప్రకటన 14:1, 3) నేడు క్రైస్తవులలో అత్యధికులకు భూపరదైసుపై నిత్యజీవ నిరీక్షణ దయాపూర్వకంగా అనుగ్రహించబడింది. అభిషేకించబడకపోయినప్పటికీ వారు కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆదరణను పొందుతారు.

మీరు జవాబివ్వగలరా?

◻ ఆదరించబడాల్సిన అవసరం మానవజాతికి ఏ విధంగా వచ్చింది?

◻ నోవహు కన్నా గొప్పవానిగా యేసు ఎలా రుజువు చేసుకున్నాడు?

◻ ‘విశ్రాంతి దినానికి ప్రభువునని’ తననుతాను యేసు ఎందుకు పిలుచుకున్నాడు?

◻ దేవుడు ఏవిధంగా నేడు ఆదరణను అనుగ్రహిస్తున్నాడు?

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

కొరింథీయులను గూర్చిన తీతు నివేదిక ద్వారా పౌలు గొప్ప ఆదరణను పొందాడు

మాసిదోనియ

ఫిలిప్పీ

గ్రీసు

కొరింథు

ఆసియ

త్రోయ

ఎఫెసు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి