నాలుగు సంవత్సరాల యుద్ధకాలంలో ఆదరణ
మునుపటి యుగొస్లేవియా ప్రాంతంలోని నాలుగు సంవత్సరాల యుద్ధకాలంలో అనేకమంది ప్రజలు కష్టాల్ని తీవ్రమైన కొరతల్ని అనుభవించారు. వారిలో ‘సమస్త ఆదరణకర్తయగు దేవునిని’ ఎడతెగక నమ్మకంగా ఆరాధిస్తున్న వందలాదిమంది యెహోవాసాక్షులు కూడా ఉన్నారు.—2 కొరింథీయులు 1:3.
సరజివానందు, యుద్ధకాలమంతటిలో ముట్టడివేయబడిన ఓ పెద్ద నగరంలో జీవిస్తున్న ప్రజలు దానికి తోడైన కష్టాలహోరును అనుభవించారు. అక్కడ విద్యుత్తు, నీరు, వంటచెరకు, ఆహార కొరతలు ఉండేవి. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో యెహోవాసాక్షుల సరజివా సంఘమెలా నడిచింది? పెద్ద పరిమాణంలో పునరావాస సహాయ సామాగ్రిని తెచ్చేందుకు పొరుగు దేశాల్లోని క్రైస్తవులు తమ ప్రాణాలకు తెగించారు. (కావలికోట నవంబరు 1, 1994 పేజీలు 23-27 చూడండి.) అంతేగాక, సరజివాలోని మన సహోదరులు ఆత్మీయ విషయాలకు ప్రథమ స్థానాన్నిస్తూ తాము కల్గివున్న వాటిని ఒకరికొకరు పంచుకున్నారు. ముట్టడి వేయబడ్డ కాలంలో ఆ నగరంలోని ఓ క్రైస్తవ కాపరి నుండి ఈ క్రింది రిపోర్టు వచ్చింది:
“మా కూటాల్ని మేము ఎంతో విలువైనవిగా పరిగణించాం. నేను, నా భార్య మరో ముప్పయిమంది వ్యక్తులతో కలిసి కూటాలకు హాజరయ్యేందుకు 15 కిలోమీటర్లు నడిచి వెళ్తాం. కొన్నిసార్లు కూటాలు జరగే సమయంలో నీటి సరఫరా చేయబడుతుందని ప్రకటించబడేది. సహోదరులు ఏమి చేశారు? వారు ఇంటి దగ్గరే ఉండిపోయారా లేక కూటాలకు హాజరయ్యారా? మన సహోదరులు కూటాలకు హాజరవ్వడానికే ఎంచుకున్నారు. సహోదరులు ఎల్లవేళలా ఒకరికొకరు సహాయం చేసుకొనేవారు; తాము కల్గివున్నవాటిని వారు పంచుకొనేవారు. మా సంఘంలోని ఓ సహోదరి నగర శివార్లలో, అడవికి దగ్గరగా నివసిస్తోంది; కాబట్టి కొంత వంటచెరకును సంపాదించడం ఆమెకు కొంచెం సులభమే. ఆమె ఒక బేకరీలో కూడా పనిచేస్తుంది, ఆమె జీతం పిండి రూపంలో చెల్లించబడుతుంది. సాధ్యమైనప్పుడల్లా ఓ పెద్దరొట్టెను చేసి దానిని కూటానికి తీసుకు వచ్చేది. కూటం అయిపోయిన తర్వాత, తిరిగి వెళ్తుండగా ఆమె అందరికీ ఒక్కో ముక్కను ఇచ్చేది.
“సహోదరులు లేక సహోదరీల్లో ఎవ్వరూ కూడా విడనాడబడినట్లుగా ఎన్నడూ భావించకపోవడం ప్రాముఖ్యం. అప్రీతికరమైన పరిస్థితిలో సహాయపడాల్సిన అవసరత ఎవరికి ఏర్పడుతుందో మాలో ఎవ్వరికీ తెలియదు. రోడ్లన్నీ మంచుతో కప్పబడిన కాలంలో, ఒక సహోదరి అనారోగ్యంతో ఉన్నప్పుడు బలంగావున్న యౌవన సహోదరులు ఆమెను బండిపై ఎక్కించుకొని కూటాలకు తీసుకు వచ్చారు.
“ప్రకటనా పనిలో మేమందరమూ భాగం వహించాము, మా ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదించాడు. బోస్నియాలోని మా ఘోర పరిస్థితిని ఆయన చూశాడు, అయితే యుద్ధానికి ముందు మేము చూడలేకపోయిన అభివృద్ధితో ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు.”
అదే విధంగా, మునుపటి యుగొస్లేవియాలోని ఇతర యుద్ధ ప్రాంతాల్లో యెహోవాసాక్షులు తీవ్రమైన కష్టాలున్నా అభివృద్ధిని అనుభవించారు. సాక్షుల ఒక గుంపును గూర్చిన ఈ క్రింది రిపోర్టు క్రోయేషియాలోని యెహోవాసాక్షుల కార్యాలయం నుండి వచ్చింది: “వెలికా క్లాడుసాలో నివసిస్తున్న సహోదరులు తాళుకోజాలని తీవ్రమైన కష్టకాలాల్ని కల్గివున్నారు. అనేక సందర్భాల్లో ఆ పట్టణం దాడికి గురైంది. క్రొయేషియన్, సెర్భియన్, మరితర ముస్లిమ్ సైన్యాలకు తమ తటస్థతను గురించి ఆ సహోదరులు వివరించాల్సి వచ్చింది. నిర్బంధించబడడం, కొట్టబడడం, ఆకలి మరణాపాయాల్ని వారు సహించుకోవాల్సి వచ్చిందనేది నగ్నసత్యం. ఇప్పటికీ వారందరూ నమ్మకంగా ఉన్నారు, తమ కార్యకలాపాలపై యెహోవా ఆశీర్వాదాల్ని చూసే విశిష్టమైన ఆధిక్యతను కల్గివున్నారు.”
ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, వెలికా క్లాడుసాలోని మరియు పొరుగునున్న బీహాక్లోని యెహోవాసాక్షులు తమ పొరుగువారితో దేవుని ఆదరణపూరితమైన సందేశాన్ని ఆసక్తిదాయకంగా వారు పంచుకొంటుండగా పెరుగుతున్న అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని మొత్తం 26 మంది రాజ్య ప్రచారకులు 39 బైబిలు పఠనాల్ని నిర్వహిస్తున్నారు!