‘తన ఇంటివారిని పోషించడం’—వర్ధమాన దేశాల్లో సవాలునెదుర్కోవడం
“ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షించకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” అపొస్తలుడైన పౌలు అలా చెప్పాడు. (1 తిమోతి 5:8) కుటుంబాన్ని పోషించడమన్నది సంపన్న దేశాల్లో అత్యధికంగా కష్టమౌతుంటే, వర్ధమాన దేశాల్లో అలా చేయడం తరచూ మరింత అసాధ్యమైన సవాలును ముందుంచుతుంది.
ఉదాహరణకు, ఆఫ్రికాలో ఆర్థిక సంక్షోభమన్నది అప్పుడప్పుడు తలెత్తే విషయం కాదుగాని సర్వసాధారణమైన విషయం. ఉద్యోగాలు అరుదు, అవి లభ్యమైనప్పుడు, కేవలం నిత్యావసరాలను సమకూర్చుకోవడానికే భార్యాభర్తలిద్దరూ పని చేయవలసి ఉంటుంది. పని వెతుక్కోవడానికి కుటుంబ యజమానులు తమ వివాహ జతను పిల్లలను నెలలపాటు లేక సంవత్సరాల పాటు విడిచిపెట్టి, దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తగిన గృహవసతిని కనుగొనడం కూడా కష్టమే. అనేక ఆఫ్రికా కుటుంబాలు పెద్దవిగా ఉంటాయి; దానితో వారి గృహాలు ఇరుకుగా, కనీసావసరాలు కొరవడి ఉంటాయి. తరచు అనారోగ్యకరమైన పరిస్థితులు నెలకొనివుంటాయి.
దానికి తోడు, స్థానిక ఆచారాలు, అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు, జనాదరణ పొందిన దృక్పథాలు, దేవుని వాక్యమైన బైబిలుకు విరుద్ధంగా ఉండవచ్చు. వివాహం మరియు పిల్లల గురించి వ్యాప్తిలో ఉన్న కొన్ని దృక్పథాలను పరిశీలించండి. అద్దె మరియు పాఠశాల వేతనం చెల్లించవలసిన బాధ్యత మాత్రమే తమకుందని కొంతమంది కుటుంబ యజమానులు విశ్వసిస్తున్నారు. ఆహారం, వస్త్రాలు వంటి కనీసావసరాలను తీర్చేపని వారి భార్యలపైన, కొన్నిసార్లు వారి పెద్ద పిల్లలపైన పడుతుంది.
అంతేగాక, కొంతమంది భర్తలకు “నా డబ్బు నాదే, కాని నీ డబ్బు కూడా నాదే” అనే దృక్పథం ఉంది. ఇది తరచూ, డబ్బు సంపాదిస్తున్న భార్యల్లో ఆగ్రహానికి కారణమౌతుంది. ఒక టాంజానియా స్త్రీ ఇలా ఫిర్యాదు చేసింది: “డబ్బంతా నా కోసం లేక పిల్లల కోసం కాదు, త్రాగుడుకే ఖర్చు చేయబడుతుంది. మేమూ పని చేస్తాము లేదా ఎక్కువపని మేమే చేస్తాము, కాని ఆ డబ్బంతా నేనే సంపాదించానని, అదంతా నాదని చెబుతూ ఆయనే అదంతా తీసేసుకుంటాడు.”
అయితే, క్రైస్తవులు స్థానిక సంస్కృతి లేక జనాదరణ పొందిన అభిప్రాయం కంటే దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. తన కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే విషయంలో బైబిలు సహాయకరమైన నడిపింపునిస్తుంది. ఉదాహరణకు, “పిల్లలు తల్లిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది” అని అది చెబుతుంది. (2 కొరింథీయులు 12:14) కాబట్టి, పనిచేయగల సామర్థ్యమున్న, దేవునికి భయపడే పురుషులు కుటుంబానికి ఆహార వస్త్రాదులను సమకూర్చవలసిన పనిని సోమరితనంతో తమ భార్యలకు లేక పెద్ద పిల్లలకు విడిచిపెట్టరు; ఆ బాధ్యత స్పష్టంగా, కుటుంబ శిరస్సు భుజాలపైనే పడుతుంది.—1 కొరింథీయులు 11:3.
నిజమే, తన కుటుంబ అవసరతలన్నిటినీ తీర్చడానికి భర్త సంపాదన సరిపోకపోవచ్చు. కాని అతని భార్య ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే, ఒక క్రైస్తవ పురుషుడు ఆగ్రహించడు. బదులుగా, అతడు ఆమెను గౌరవనీయురాలైన “తోటి” దానిగా చూస్తాడు. (మలాకీ 2:14) కాబట్టి, ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును అతడు నిర్దాక్షిణ్యంగా తీసేసుకుని, ఆమె భావాలను పరిగణనలోకి తీసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడు. బదులుగా ఆయన, ఆయన భార్యా ‘కలిసి ఆలోచనచేసి,’ కుటుంబమంతటి ప్రయోజనం కొరకు తమ డబ్బును సరైన విధంగా ఎలా ఉపయోగించవచ్చుననేది నిర్ణయిస్తారు. (సామెతలు 13:10) బైబిలు కాలంలోని “గుణవతియైన భార్య” అనుభవించినట్లుగా, వీలైన చోట ఒక భర్త తన భార్యకు కొంత మేరకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. (సామెతలు 31:10, 11, 16) అలాంటి విషయాల్లో బైబిలు సలహాను అనుసరించడం కుటుంబ సంతోషాన్ని, సంతృప్తిని పెంపొందింపజేస్తుంది.
నిరుద్యోగ సవాళ్లను ఎదుర్కోవడం
నిరుద్యోగ సమస్యను పరిశీలించండి. ఉద్యోగాలు కొన్నే ఉండి, తక్కువ వేతనం లభిస్తున్నప్పుడు, ఆఫ్రికాలోని అనేక కుటుంబాల యజమానులు తమ గృహాలనుండి దూరంగా గనుల్లో, కర్మాగారాల్లో, పొలాల్లో, తోటల్లో పని వెతుక్కుంటారు. ఒక క్రైస్తవ పురుషుడు ఈ పరిస్థితిలో ఉంటే, అతడు తోటి ఆరాధికుల నుండి వేరుగా, చెడు సహవాసానికి గురౌతూ ఉండవచ్చు. (సామెతలు 18:1; 1 కొరింథీయులు 15:33) పరిస్థితిని చక్కబరచడానికి అతని కుటుంబం వీలైనంతగా కృషి చేసినప్పటికీ, ఆత్మీయ విషయాల్లో నాయకత్వం వహించడానికి లేక భావోద్రేక మద్దతునిచ్చేందుకు తండ్రి ఇంటివద్ద లేనందున వారు ఎంతో కష్టపడవలసి రావచ్చు. పరిహాసంగా, ఏ ఆర్థిక కష్టాన్ని తొలగించడానికి అలా ఎక్కువకాలం దూరంగా ఉండడం జరిగిందో అదే సంభవించేలా కూడా అది చేయగలదు.
ఒక తల్లి ఇలా చెబుతుంది: “నా భర్త బంగారం త్రవ్వకానికి వెళ్లాడు. ఒక నెల లేదంటే రెండు నెలల తర్వాత తిరిగి రావడానికి ఆయన పథకం వేసుకున్నాడు. కాని ఒక సంవత్సరం పట్టింది! నేను ఆరుగురు పిల్లల గురించి శ్రద్ధతీసుకోవాలి. ఇంటి అద్దె కట్టాలి. నా ఆరోగ్యం బాగుండేది కాదు గనుక నేను ఆసుపత్రి బిల్లులు కట్టాలి. మాకు బట్టలు, రోజు తినడానికి తిండి అవసరమయ్యాయి. నాకు ఉద్యోగం లేదు. ఎంతో కష్టంగా ఉండేది. అత్యంత కష్టమైన విషయం ఏమిటంటే, పిల్లల ఆత్మీయత గురించి అంటే కుటుంబ పఠనం, కూటాలు, ప్రకటన పని వంటివాటి గురించి శ్రద్ధ తీసుకోవడం. యెహోవా సహాయంతో మేము ఎలాగో నెట్టుకొచ్చాము.”
కొంతమంది తల్లులు కూడా పని చేయడానికిగాను తమ కుటుంబాలను అనేక నెలలపాటు విడిచిపెట్టి వెళ్లవలసిన బాధ్యత ఉన్నట్లు భావించారు. కొంతమంది ప్రయాణ వ్యాపారులుగా పని చేస్తూ, ఇంటివద్ద అరుదుగా ఉంటారు. కాబట్టి పెద్ద పిల్లలు తలిదండ్రుల పాత్ర వహిస్తూ, భోజనాలు, ఇంటిపనులు, తమ కంటే చిన్నవారైన తోబుట్టువుల క్రమశిక్షణ వంటివాటి గురించి శ్రద్ధ తీసుకునేలా ఒత్తిడి చేయబడుతున్నారు. ఆత్మీయ కార్యకలాపాల్లో పాల్గొనడం కుంటుపడుతుంది. అవును కుటుంబంపై విపరీతమైన ఒత్తిడి ఉండవచ్చు!
అవును, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు, కుటుంబాన్ని పోషించేందుకు తల్లి/తండ్రికి దూరప్రాంతంలో ఉద్యోగం వెతుక్కోవడం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. బైబిలు కాలాల్లో యాకోబు కుమారులు ఐగుప్తు నుండి సరుకులు తెచ్చుకోవడానికి తమ కుటుంబాలను విడిచి వెళ్లవలసి వచ్చిందన్నది స్పష్టమౌతుంది. (ఆదికాండము 42:1-5) కాబట్టి నేడు అలాంటి పరిస్థితులే ఉత్పన్నమైనప్పుడు కుటుంబ యజమానులు, దూరంలో ఉన్న ఉద్యోగం తీసుకురాగల వస్తుపరమైన ప్రయోజనాలను, ఎక్కువకాలం దూరంగా ఉండడం వలన కలిగే ఆత్మీయ మరియు భావోద్రేక హానితో పోల్చి చూసుకోవాలి. అనేక కుటుంబాలు ఎక్కువ కాలం వేరై ఉండడం కంటే ఆర్థిక కష్టాన్ని సహించడాన్నే ఇష్టపడుతున్నాయి. “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని 1 తిమోతి 6:8 నందు పౌలు చెప్పిన మాటలను వారు మనస్సు నందుంచుకుంటారు.—సామెతలు 15:17 పోల్చండి.
తరచూ, అలా ప్రయాణించి వెళ్లడానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. చొరవను చాతుర్యాన్ని ప్రదర్శించడం ద్వారా కొందరు ఉపయోగకరమైన సేవలనందించి ఉద్యోగాన్ని సృష్టించుకోగలిగారు.a (సామెతలు 31:24 పోల్చండి.) లేదా ఇతరులు నీచమైనవని భావించే తక్కువరకం ఉద్యోగాలను అంగీకరించడానికి సంబంధించిన విషయమై ఉండవచ్చు. (ఎఫెసీయులు 4:28) అపొస్తలుడైన పౌలు ఆర్థికపరంగా ఇతరులకు భారంగా ఉండకూడదని ‘ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేశాడు.’ (2 థెస్సలొనీకయులు 3:8) క్రైస్తవ పురుషులు నేడు ఆ ఉదాహరణను అనుసరించవచ్చు.
విద్యాభ్యాస సమస్యలు
విద్యాభ్యాసం మరో సమస్య. కొన్ని సుదూర ప్రాంతాల్లో, తలిదండ్రులు పిల్లలకు తగిన విద్యనభ్యసింపజేయడానికి ఎక్కువ కాలం వరకు బంధువుల వద్ద ఉండేందుకు వారిని పంపించడం సాధారణమైన విషయమే. తలిదండ్రుల నుండి దూరంగా ఉండే అటువంటి పిల్లలకు తరచూ కూటాలకు హాజరవ్వడం లేక ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడం కష్టమౌతుంది. అవసరమైన క్రమశిక్షణ కొరవడడంతో, వారు సులభంగా చెడు సహవాసాలకు గురౌతారు. ఫలితంగా, అనేకులు క్రైస్తవ జీవన విధానాన్ని విడిచిపెట్టారు.
లౌకిక విద్యకు దాని ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. కాని బైబిలు ఆత్మీయ విద్యకు ఉన్నత విలువనిచ్చింది, అలాంటి ఉపదేశాన్ని ఇచ్చే బాధ్యతను దేవుడు తలిదండ్రులకప్పగించాడు. (ద్వితీయోపదేశకాండము 11:18, 19; సామెతలు 3:13, 14) అయితే పిల్లవాన్ని ఎక్కువకాలం వరకు దూరంగా పంపించివేయడం అతడిని ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను పెంచాలనే’ తలిదండ్రుల ప్రయత్నాలను బహుశా తక్కువ చేయవచ్చు.—ఎఫెసీయులు 6:4.b
విద్యాభ్యాసం కొరకు స్థానికంగా ఉన్న అవకాశాలు సరిపోనప్పుడు, తలిదండ్రులు తమ పిల్లలకు ప్రాథమిక నైపుణ్యాలు నేర్పేందుకు తాము చేయగలిగినదంతా చేయడం కంటే మరో మార్గం లేదు. మన “మహోపదేశకుడ”గు యెహోవా కూడా సహాయాన్ని అందజేస్తున్నాడు. (యెషయా 30:20, NW) యెహోవాసాక్షుల స్థానిక సంఘాలు అనేక విద్యావకాశాలను అందజేస్తున్నాయి. అనేక సంఘాలు విద్యాబోధనా తరగతులను నిర్వహిస్తున్నాయి. అలాగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, స్పష్టంగా చదవి మాట్లాడగల ఒక బాలుని సామర్థ్యానికి పదును పెట్టగల సహాయకరమైన ఏర్పాటు.
పిల్లలను కనడం విషయంలో సమతూకంగల దృక్పథం
ప్రాముఖ్యంగా పిల్లలు ఎక్కువమంది ఉన్నప్పుడు వారికి అన్నీ సమకూర్చడం కష్టం. ఆఫ్రికాలోని తలిదండ్రులు తరచూ పిల్లలంటే తమకు ఇష్టమని చెబుతారు; అందుకే, వారు తమకు వీలైనంతమందిని కంటారు! పిల్లలు ఆర్థిక వనరులుగా ఎంచబడినప్పటికీ, వారిలో అనేకులకు అనేకమంది తలిదండ్రులు తగినంత ఇవ్వలేకపోతున్నారు.
నిజమే, “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని బైబిలు చెబుతుంది. (కీర్తన 127:3) అయితే, ఇశ్రాయేలులో అనుకూలమైన పరిస్థితులున్న కాలంలో ఆ మాటలు వ్రాయబడ్డాయని గమనించండి. ఆ తర్వాత, తీవ్రమైన కరువు మరియు యుద్ధం పిల్లలు కలిగివుండడాన్ని కష్టతరం చేశాయి. (విలాపవాక్యములు 2:11, 20; 4:10) అనేక వర్ధమాన దేశాల్లో నెలకొనివున్న కష్టతరమైన పరిస్థితి దృష్ట్యా, ఎంతమంది పిల్లలకు తాము వాస్తవంగా ఆహారం, వస్త్రాలు, గృహవసతి, తర్ఫీదు ఇవ్వగలమనేదాని గురించి బాధ్యతగల క్రైస్తవులు గంభీరంగా తలంచాలి. ఖర్చులను లెక్కచూసుకొని, సాంప్రదాయాన్ని అనుసరించక పరిమిత సంఖ్యలో పిల్లలను కలిగివుండడం బాగుంటుందని అనేకమంది భార్యాభర్తలు నిర్ణయించుకుంటున్నారు.c—లూకా 14:28 పోల్చండి.
స్పష్టంగా, ఇవి “అపాయకరమైన కాలము”లే. (2 తిమోతి 3:1-5) ఈ విధానం దాని అనివార్యమైన అంతం వైపుకు కొనసాగుతుండగా, వర్ధమాన దేశాల్లోని కుటుంబాలపై ఒత్తిడి అధికమౌతుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, దేవుని వాక్య సూత్రాలను సన్నిహితంగా హత్తుకొని ఉండడం ద్వారా, కుటుంబ యజమానులు తమ కుటుంబాల భౌతిక మరియు ఆత్మీయ అవసరతల గురించి శ్రద్ధ వహించడంలో విజయం సాధించగలరు, ఎందుకంటే యథార్థంగా తన సేవ చేసేవారికి యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5) అవును, బీద దేశాల్లో కూడా, తమ కుటుంబాలను పోషించే సవాలును క్రైస్తవులు విజయవంతంగా ఎదుర్కోవచ్చు!
[అధస్సూచీలు]
a దీని జత పత్రికయైన తేజరిల్లు! యొక్క నవంబరు 8, 1994 సంచికలోని “వర్ధమాన దేశాల్లో ఉద్యోగాలను కల్పించటము” అనే శీర్షికను చూడండి.
b అదనపు వివరాల కొరకు, ఆగస్టు 15, 1982 కావలికోట (ఆంగ్లం) నందలి “పాఠకుల ప్రశ్నలు” చూడండి.
c జూన్ 8, 1993 తేజరిల్లు! బ్రోషూరు నందలి “కుటుంబ నియంత్రణ—లోకవ్యాప్త సమస్య” అనే శీర్షికల పరంపరలందు సహాయకరమైన సమాచారం అందజేయబడింది.