ఐక్య కుటుంబంగా యెహోవా సేవచేయడం
ఆన్‌టోన్యూ సాన్టోలేరీ చెప్పినది
మా నాన్న 1919లో ఇటలీని విడిచి వెళ్లే సమయానికి ఆయనకు 17 సంవత్సరాలు. ఆయన ఒక శ్రేష్ఠమైన జీవితం కొరకు బ్రెజిల్‌కు తరలి వెళ్లాడు. కొంతకాలానికి, సావుపౌలో రాష్ట్రం అంతర్భాగంలోని చిన్న పట్టణంలో ఆయన ఒక మంగలి దుకాణం పెట్టాడు.
ఒకరోజు 1938లో నాకు ఏడు సంవత్సరాలున్నప్పుడు, నాన్న తన మంగలి దుకాణానికి వచ్చిన ఒక వ్యక్తి నుండి బైబిలు యొక్క బ్రాసిలేరా అనువాదాన్ని తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత అమ్మ తీవ్రంగా జబ్బుపడి, మరణం వరకు అనారోగ్యంగానే ఉండినది. నాన్న కూడా జబ్బుపడ్డాడు, కాబట్టి మేమందరం అంటే నేను అమ్మ, నాన్న, చెల్లి ఆనా సావుపౌలో నగరంలో బంధువులతో నివసించడానికి వెళ్లాము.
సావుపౌలోలో నేను విద్యనభ్యసిస్తుండగా, నేను బాగా చదవడం ప్రారంభించాను, ప్రాముఖ్యంగా చారిత్రాత్మక వ్రాతలను చదవడం ప్రారంభించాను. వాటిలో అప్పుడప్పుడు బైబిలు గురించి ప్రస్తావించబడడాన్నిబట్టి నేను ముగ్ధుడనయ్యాను. సావుపౌలో ప్రజా గ్రంథాలయం నుండి నేను తెచ్చుకున్న ఒక నవల కొండమీది ప్రసంగం గురించి అనేకసార్లు ప్రస్తావించింది. ఇక అప్పుడు, ఆ ప్రసంగాన్ని నా అంతట నేను చదవడానికి నేను ఒక బైబిలును సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. సంవత్సరాల క్రితం నాన్న తీసుకున్న బైబిలు కొరకు నేను వెదికాను, చివరికి దాన్ని నేను ఒక ట్రంకుపెట్టె అడుగున కనుగొన్నాను, అది అక్కడే ఏడు సంవత్సరాలుగా పడివుండింది.
మా కుటుంబం కాథోలిక్‌ల కుటుంబం, కాబట్టి బైబిలు చదవమని నేను ఎన్నడూ ప్రోత్సహింపబడలేదు. ఇప్పుడు నేను స్వయంగా అధ్యాయాలు వచనాలు తెరిచి చూడడం నేర్చుకున్నాను. నేను కొండమీది ప్రసంగాన్నే కాదు మొత్తం మత్తయి పుస్తకాన్ని, అలాగే ఇతర పుస్తకాలను అమితానందంతో చదివాను. యేసు బోధల్లోను అద్భుతాల్లోనూ ఉన్న సత్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.
నేను బైబిలులో చదివినదానికి కాథోలిక్ మతానికి ఎంత తేడా ఉందో గుర్తించి, ప్రెస్బైటేరియన్ చర్చికి హాజరవ్వడం ప్రారంభించాను, ఆనా నాతో చేరింది. అయినప్పటికీ నా హృదయం శూన్యంగా ఉన్నట్లు భావించాను. నేను సంవత్సరాలుగా దేవుని కొరకు అత్యంతాసక్తితో అన్వేషిస్తున్నాను. (అపొస్తలుల కార్యములు 17:27) ఆకాశం నక్షత్రాలతో నిండివున్న ఒక రాత్రి, నేను దుఃఖితుడనై ఉన్నప్పుడు, ‘నేనెందుకిక్కడ ఉన్నాను? జీవితం యొక్క సంకల్పమేమిటి?’ అని తలంచాను. నేను పెరట్లో ఏకాంతంగా ఉండే ఒక స్థలాన్ని వెదుక్కుని, మోకాళ్లూని, ‘ప్రభువా దేవా! నీవెవరు? నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?’ అని ప్రార్థించాను. తర్వాత కొద్ది కాలానికే దానికి సమాధానం లభించింది.
బైబిలు సత్యం నేర్చుకోవడం
1949లో ఒకరోజు, మా నాన్న ఒక ట్రామ్‌లో నుండి దిగగానే ఒక యౌవనస్థురాలు ఆయనను సమీపించింది. ఆమె ఆయనకు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలనందించింది. ఆయన కావలికోటకు చందా కట్టి, ప్రెస్బైటేరియన్ చర్చికి హాజరయ్యే ఇద్దరు పిల్లలు తనకున్నారని వివరిస్తూ, మా ఇంటిని దర్శించమని ఆమెను కోరాడు. ఆ స్త్రీ తాను దర్శించినప్పుడు పిల్లలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఆనాకిచ్చి, ఆమెతో బైబిలు పఠనం ప్రారంభించింది. తర్వాత పఠనంలో నేను చేరాను.
1950 నవంబరులో మేము యెహోవాసాక్షుల సమావేశానికి మొదటిసారిగా హాజరయ్యాము. అక్కడ “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే పుస్తకం విడుదల చేయబడింది, మేము ఆ పుస్తకాన్ని మా నిర్దేశకంగా ఉపయోగిస్తూ మా బైబిలు పఠనాన్ని కొనసాగించాము. ఆ తర్వాత త్వరలోనే, మేము సత్యాన్ని కనుగొన్నామని గ్రహించాము, 1951 ఏప్రిల్‌లో మేము యెహోవాకు మా సమర్పణను సూచిస్తూ బాప్తిస్మం తీసుకున్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత నాన్న సమర్పించుకుని, దేవుని ఎడల యథార్థంగా ఉండి 1982లో మరణించాడు.
పూర్తికాల సేవలో ఆనందించడం
1954 జనవరిలో, నాకు 22 సంవత్సరాలు ఉన్నప్పుడే, బేతేలు అని పిలువబడే, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడానికి నేను అంగీకరింపబడ్డాను. అక్కడికి వెళ్లిన తర్వాత, నాకంటే రెండు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడైన రిచర్డ్ మూకే అనే వ్యక్తి బ్రాంచి అధ్యక్షునిగా ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. 1955లో, సర్క్యూట్ సేవకుల అవసరత ఏర్పడినప్పుడు—అప్పట్లో ప్రయాణ కాపరులు అలా పిలువబడేవారు—ఈ సేవలో భాగం వహించడానికి ఆహ్వానింపబడిన ఐదుగురిలో నేను ఒకడిని.
రియో గ్రాండె డో సుల్ అనే రాష్ట్రంలో నాకు నియామకం లభించింది. నేను పని ప్రారంభించినప్పుడు అక్కడ యెహోవాసాక్షుల సంఘాలు 8 మాత్రమే ఉండేవి, కాని 18 నెలల్లోనే 2 క్రొత్త సంఘాలు, 20 ఒంటరి గుంపులు స్థాపించబడ్డాయి. నేడు ఈ ప్రాంతంలో, యెహోవాసాక్షులకు చెందిన 15 సర్క్యూట్‌లు ఉన్నాయి, ఒకొక్క సర్క్యూట్‌లో 20 సంఘాలున్నాయి! 1956 చివరి భాగంలో, నా సర్క్యూట్ నాలుగు చిన్న భాగాలుగా విభాగించబడిందని, వాటిలో నలుగురు సర్క్యూట్ సేవకులు సేవ చేస్తారని నాకు చెప్పడం జరిగింది. ఆ సమయంలో, క్రొత్త నియామకం కొరకు బేతేలుకు తిరిగి రమ్మని నేను నిర్దేశించబడ్డాను.
నాకు ఆశ్చర్యానందాలు కలిగేలా నేను ఉత్తర బ్రెజిల్‌కు జిల్లా సేవకునిగా అంటే అనేక సర్క్యూట్‌లలో సేవ చేసే ప్రయాణ పరిచారకునిగా నియమింపబడ్డాను. అప్పట్లో బ్రెజిల్‌నందు యెహోవాసాక్షులలో 12,000 మంది ప్రచారకులు ఉండేవారు, దేశంలో రెండు జిల్లాలు ఉండేవి. రికార్ట్ ఉట్కె దక్షిణంలో సేవచేసేవాడు, నేను ఉత్తరంవైపు జిల్లాలో సేవచేసేవాడిని. యెహోవాసాక్షులు రూపొందించిన కార్యనిర్వహణలో ఉన్న నూతన లోక సంస్థ మరియు నూతన లోక సంస్థ యొక్క ఆనందం అనే చిత్రాలను చూపించడానికి ప్రొజెక్టరును ఉపయోగించడంలో బేతేలునందు మాకు శిక్షణ ఇవ్వబడింది.
ఆ రోజుల్లో ప్రయాణించడం ఎంతో వేరుగా ఉండేది. సాక్షులెవరికీ వాహనాలు లేవు కాబట్టి నేను తెడ్ల పడవలో, దోనెలో, ఎడ్లబండిలో, గుఱ్ఱం మీద, సరుకుల బండిలో, ట్రక్కులో, ఒకసారి విమానంలోనూ ప్రయాణించాను. అమెజాన్ ఆరంభంలో ఉన్న బేలమ్‌కు అమెజానస్ రాష్ట్ర రాజధానియైన మనాస్‌కు మధ్యదారిలో ఉన్న నగరమైన సాన్‌టారమ్‌లో దిగడానికి అమెజాన్ అడవి మీదుగా ప్రయాణించి వెళ్లడం ఉత్తేజకరంగా ఉండినది. అప్పట్లో జిల్లా సేవకులు సేవచేయడానికి కొన్ని సర్క్యూట్ సమావేశాలు మాత్రమే ఉండేవి, గనుక సొసైటీ చిత్రాలను చూపడంలోనే నేను ఎక్కువ సమయం గడిపేవాడిని. పెద్ద నగరాల్లో వందలాదిమంది హాజరయ్యేవారు.
ఉత్తర బ్రెజిల్‌నందు నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది అమెజాన్ ప్రాంతం. 1957 ఏప్రిల్‌లో నేను అక్కడ సేవ చేస్తున్నప్పుడు, అమెజాన్ నది దాని ఉపనదులు గట్లు తెంచుకొని ప్రవహించాయి. అడవిలో రెండు చెట్ల మధ్య కట్టబడిన తెర మీద చిత్రాల్లో ఒక దాన్ని చూపించే ఆధిక్యత నాకు లభించింది. సమీపంలో ఉన్న నదిలో లంగరు వేయబడివున్న మోటారు పడవ నుండి ప్రొజెక్టరుకు కరెంటు సరఫరా తీసుకోవడం జరిగింది. ప్రేక్షకులలో అనేకులకు అదే మొదటి చిత్రం.
ఆ తర్వాత వెంటనే నేను బేతేలు సేవకు తిరిగి వచ్చాను, ఆ తర్వాతి సంవత్సరం అంటే 1958లో న్యూయార్క్ నగరంలో జరిగిన యెహోవాసాక్షుల చారిత్రాత్మక “దైవిక చిత్తం” అనే అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యే ఆధిక్యత నాకు లభించింది. ఎనిమిది రోజుల సమావేశం యొక్క చివరి రోజున యాంకీ స్టేడియంలోను సమీపంలో ఉన్న పోలో మైదానాల్లోను నిండిపోయిన 2,53,922 మందిలో 123 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు.
నా జీవితంలోని మార్పులను ఆనందించడం
బేతేలుకు తిరిగి వచ్చిన కొంతకాలానికి నాకు క్లారా బెర్నట్‌తో పరిచయమేర్పడింది, 1959 మార్చిలో మేము వివాహం చేసుకున్నాము. బాహ్యా రాష్ట్రంలో మాకు సర్క్యూట్ పని అప్పగించబడింది, అక్కడ మేము దాదాపు ఒక సంవత్సరం పాటు సేవచేశాము. అక్కడున్న సహోదరుల దీనత్వాన్ని, అతిథి సత్కారాన్ని, ఆసక్తిని, ప్రేమను క్లారా నేను ఇప్పటికీ ఆనందంతో జ్ఞాపకం చేసుకుంటాము; వారు వస్తుదాయకంగా పేదవారైనప్పటికీ రాజ్యఫలాల విషయంలో సంపన్నులు. తర్వాత మేము సావుపౌలో రాష్ట్రానికి బదిలీ చేయబడ్డాము. అక్కడ ఉండగానే అంటే 1960లో నా భార్య గర్భవతి కావడంతో మేము పూర్తికాల పరిచర్యను విడిచిపెట్టవలసి వచ్చింది.
నా భార్య జన్మస్థలమైన సాంటా కాటరీనా రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి వెళ్లాలని మేము నిర్ణయించుకున్నాము. మా కుమారుడైన గెర్సన్ మా ఐదుగురు పిల్లల్లో మొదటివాడు. అతని తర్వాత 1962లో గీల్సన్, 1965లో తెలీత, 1969లో టార్స్యో, 1974లో జనీసీ జన్మించారు. యెహోవా మూలంగా ఆయనిచ్చే చక్కని ఉపదేశం మూలంగా మేము “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని” పెంచడమనే సవాలును ఎదుర్కోగలిగాము.—ఎఫెసీయులు 6:4.
మేము మా పిల్లల్లో ప్రతి ఒక్కరిని అమూల్యమైనవారిగా ఎంచుతాము. కీర్తనల గ్రంథకర్త మా భావాలను ఎంతో చక్కగా ఇలా వ్యక్తపరిచాడు: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.” (కీర్తన 127:3) ‘యెహోవా అనుగ్రహించే ఏ స్వాస్థ్యమునైనా’ మేము ఎలా చూసుకుని ఉండేవారిమో అలాగే, ఆయన వాక్యమునందున్న ఉపదేశాలను మనస్సులో ఉంచుకొని, సమస్యలున్నప్పటికీ మేము మా పిల్లల గురించి అలాగే శ్రద్ధ తీసుకున్నాము. ఎన్నో ప్రతిఫలాలు లభించాయి. ఒకరి తర్వాత ఒకరు ఆ ఐదుగురూ యెహోవాకు తమ సమర్పణను సూచిస్తూ బాప్తిస్మం తీసుకోవాలనే కోరికను వేరు వేరుగా, తమంతట తాముగా వ్యక్తపర్చినప్పుడు, అది మాకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది.—ప్రసంగి 12:1.
మా పిల్లల ఎంపికలు
గెర్సన్ కంప్యూటర్ కోర్సు ముగించిన వెంటనే, వృత్తిపరమైన జీవనోపాధికి బదులుగా పూర్తికాల పరిచర్యను ఎంపిక చేసుకుని, బేతేలులో సేవ చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు మేమెంతో ఆనందించాము. అయితే బేతేలు జీవితం గెర్సన్‌కు మొదట్లో అంత సుళువుగా ఉండేది కాదు. అతడు కేవలం నాలుగు నెలలు బేతేలులో ఉన్న తర్వాత అతడిని మేము సందర్శించి వెళ్లిపోతుండగా అతని ముఖంలో కనిపించిన విషాదం నన్నెంతగానో ప్రభావితం చేసింది. మేము రోడ్డులో ఉన్న మొదటి మలుపు దాటి వెళ్లేవరకు అతడు మమ్మల్ని చూస్తుండడం నేను మా కారు అద్దంలోనుండి చూశాను. నా కళ్లు కన్నీళ్లతో ఎంతగా నిండిపోయాయంటే, మేము ఇంటికి తిరిగి రావడానికి చేయవలసిన 700 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగించే ముందు నేను రోడ్డు ప్రక్కన ఆగవలసి వచ్చింది.
గెర్సన్ నిజంగా బేతేలులో ఆనందించడం ప్రారంభించాడు. అక్కడ ఆరు సంవత్సరాలు ఉన్న తర్వాత, అతడు హైడీ బెసర్‌ను వివాహం చేసుకున్నాడు, వారిద్దరు కలిసి మరో రెండు సంవత్సరాలపాటు బేతేలులో సేవ చేశారు. అప్పుడు హైడీ గర్భవతి కావడంతో, వారు విడిచిపెట్టి రావలసి వచ్చింది. ఇప్పుడు ఆరు సంవత్సరాల వయస్సుగల వారి కుమార్తె సీంటియ రాజ్య కార్యకలాపాలకు వారితోపాటు వెళుతుంది.
మేము గెర్సన్‌ను మొదటిసారి బేతేలులో సందర్శించిన కొంత కాలానికే, వ్యాపార నిర్వహణలో తన మొదటి సంవత్సరాన్ని ఆ మధ్యనే ముగించిన గీల్సన్ తనకు కూడా బేతేలుకు వెళ్లాలని ఉందని చెప్పాడు. ఒక సంవత్సరం పాటు బేతేలులో సేవ చేసిన తర్వాత తన వ్యాపార కోర్సును పునఃప్రారంభించాలని అతడు ప్రణాళికలు వేసుకున్నాడు. కాని అతని ప్రణాళికలు మారిపోయాయి, అతడు బేతేలు సేవలోనే ఉండిపోయాడు. 1988లో అతడు వీవ్యన్ గోన్‌సాల్విస్ అనే పయినీరును వివాహం చేసుకున్నాడు, పూర్తికాల పరిచారకులను అలా పిలుస్తారు. అప్పటి నుండి, వారిద్దరూ కలిసి బేతేలులో సేవచేస్తున్నారు.
డ్రాఫ్టింగ్‌లో కోర్సు ముగించిన తర్వాత, 1986లో పయినీరు సేవలో ప్రవేశించడానికి మా మూడవ బిడ్డయైన తెలీత ఎంపిక చేసుకున్నప్పుడు మా ఆనందాలు కొనసాగాయి. మూడు సంవత్సరాల తర్వాత ఆమె కూడా బేతేలుకు ఆహ్వానింపబడింది. పది సంవత్సరాలుగా బేతేలులో సేవ చేస్తున్న జూజె కోసీని 1991లో ఆమె వివాహం చేసుకుంది. వివాహిత జంటగా వారు అక్కడే కొనసాగుతున్నారు.
మేము ఇప్పటికే మూడుసార్లు విన్న, “నాన్నా, నాకు బేతేలుకు వెళ్లాలని ఉంది” అనే అదే వాక్యాన్ని తర్వాతివాడైన టార్స్యో పునరుద్ఘాటించినప్పుడు నా భార్య, నేను మరలా ఆనందించాము. అతని దరఖాస్తు అంగీకరించబడింది, 1991లో అతడు కూడా బేతేలు సేవను ప్రారంభించాడు, 1995 వరకు అతడు అక్కడే ఉన్నాడు. అతడు ఈ విధంగా మూడు కంటే ఎక్కువ సంవత్సరాల వరకు యెహోవా రాజ్యాసక్తులను పెంపొందింపజేయడానికి తన యౌవన శక్తిని ఉపయోగించినందుకు మేము ఆనందిస్తున్నాము.
మా చిన్న కుమార్తె జనీసీ యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకుని, 13 ఏళ్ల వయస్సులో బాప్తిస్మం తీసుకుంది. ఆమె పాఠశాలలో చదువుతుండగా, ఒక సంవత్సరంపాటు సహాయ పయినీరుగా సేవచేసింది. తర్వాత, 1993 సెప్టెంబరు 1 నుండి ఆమె ఇక్కడ గాస్‌పార్ అనే నగరంలోని మా సంఘంలో క్రమ పయినీరుగా సేవచేయనారంభించింది.
విజయ మార్గం
యెహోవా సేవ చేయడంలో కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుకోవడానికి కీలకం ఏమిటి? దానికేవో ప్రత్యేకమైన సూత్రాలు ఉన్నాయని నేను నమ్మడం లేదు. క్రైస్తవ తలిదండ్రులు అనుసరించేందుకు యెహోవా తన వాక్యంలో ఉపదేశాన్ని అందజేశాడు, కాబట్టి మేము అనుభవించిన మంచి ఫలితాలన్నిటికీ ఘనత ఆయనకు చెందవలసిందే. మేము ఆయన నడిపింపులను అనుసరించడానికి ప్రయత్నించామంతే. (సామెతలు 22:6) మా పిల్లలందరూ నా నుండి లాటిన్ మనస్తత్త్వాన్ని, తమ తల్లి నుండి ఆచరణాత్మకమైన జర్మన్ స్ఫూర్తిని సంతరించుకున్నారు. కాని వారు మా నుండి పొందిన అత్యంత ప్రాముఖ్యమైనది ఆత్మీయ వారసత్వమే.
మా గృహజీవితం రాజ్యాసక్తుల చుట్టూ పరిభ్రమించింది. ఈ ఆసక్తులను ప్రాముఖ్యమైనవిగా ఉంచుకోవడం సుళువుగా లేకుండినది. ఉదాహరణకు, క్రమమైన కుటుంబ బైబిలు పఠనాన్ని కొనసాగించడం మాకు ఎల్లప్పుడూ కష్టంగానే ఉండేది, అయినప్పటికీ మేమెప్పుడూ విడిచి పెట్టలేదు. ప్రతి బిడ్డను వారి జీవితపు తొలి దినాల నుండే క్రైస్తవ కూటాలకు, అలాగే సభలకు సమావేశాలకు తీసుకు వెళ్లాము. అనారోగ్యంగా ఉన్నప్పుడు లేక ఇతర అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే హాజరు కాకుండా ఉండేవాళ్లము. అంతేగాక, చిన్న వయస్సులోనే పిల్లలు క్రైస్తవ పరిచర్యకు మాతోపాటు వచ్చేవారు.
పిల్లలకు పది సంవత్సరాలున్నప్పుడు వారు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగాలివ్వడం ప్రారంభించారు. మానుస్క్రిప్ట్‌ను ఉపయోగించే బదులు ఔట్‌లైన్‌ను ఉపయోగించమని ప్రోత్సహిస్తూ, వారు తమ మొదటి ప్రసంగాలను సిద్ధం చేసుకోవడానికి మేము సహాయం చేశాము. ఆ తర్వాత ప్రతి ఒక్కరు తమ స్వంత ప్రసంగాలను సిద్ధం చేసుకున్నారు. అంతేగాక, వారు 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండగా, వారిలో ప్రతి ఒక్కరు పరిచర్యలో క్రమంగా భాగం వహించడం ప్రారంభించారు. వారికి తెలిసిన జీవన విధానం ఇదొక్కటి మాత్రమే.
మా పిల్లలను పెంచడంలో నా భార్యయైన క్లారా ప్రముఖ పాత్ర నిర్వహించింది. వారు చాలా చిన్న వయస్సులో ఉండగా అంటే ఒక బాలుడు తనకు నేర్పబడేదంతా స్పాంజీలా పీల్చుకొనే సమయంలో, క్లారా ప్రతి రాత్రి వారికోసం బైబిలు కథ చదివి, ప్రతి ఒక్కరితో కలిసి ప్రార్థించేది. పరదైసును పోగొట్టుకోవడం నుండి పరదైసును తిరిగిపొందడం వరకు, గొప్ప బోధకుడు చెప్పేది వినడం, నా బైబిలు కథల పుస్తకం (ఆంగ్లం) వంటి పుస్తకాలను ఆమె చక్కగా ఉపయోగించింది.a యెహోవాసాక్షులు అందజేసిన ఆడియో మరియు వీడియో సహాయకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు మేము వాటిని కూడా ఉపయోగించాము.
పిల్లల ఎడల అనుదినం శ్రద్ధ చూపించ వలసిన అవసరత ఉంటుందని క్రైస్తవ తలిదండ్రులుగా మా అనుభవం ధృవీకరిస్తుంది. ప్రగాఢమైన ప్రేమ, వ్యక్తిగతమైన ఆసక్తి, విస్తారమైన సమయం వంటివి పిల్లల ప్రాథమిక అవసరతలు. మేము మాకు సాధ్యమైనంత మేరకు ఈ అవసరతలను తీర్చడం తలిదండ్రులుగా మా బాధ్యత అని భావించడమేగాక, అలా చేయడం ద్వారా గొప్ప ఆనందాన్ని ప్రతిఫలంగా పొందాము.
నిజంగా, “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే. యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు” అని కీర్తన 127:3-5 నందున్న మాటల నెరవేర్పును గుర్తించడం తలిదండ్రులకు సంతృప్తికరమైనదే. ఐక్య కుటుంబంగా యెహోవా సేవ చేయడం వాస్తవంగా మాకు సంతోషాన్ని కలిగించింది!
[అధస్సూచీలు]
a అన్నీ వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినవి.
[26వ పేజీలోని చిత్రం]
ఆన్‌టోన్యూ సాన్టోలేరీ తన సమీప కుటుంబ సభ్యులతో