కలలు భవిష్యత్తును ముందే తెలియజేయగలవా?
ప్రాచీన కాలాలనుండి కూడా, మానవజాతికి కలల ఎడల అత్యంత ఆసక్తి ఉంది. కలలను వివరించేందుకు ఐగుప్తీయులు సూక్ష్మాంశాలతో పుస్తకాలను సిద్ధం చేశారు, బబులోనీయులకు తమ కలలను వివరించేవారు ఉండేవారు. తమ కలల్లో ఆరోగ్య నిర్దేశకాలను అందుకునేందుకు అనారోగ్యంగా ఉండే ప్రజలను అస్‌క్లీపియస్ గుళ్లలో పడుకోబెట్టే ఆచారం గ్రీకులకు ఉండేది. మన సామాన్య శకం యొక్క రెండవ శతాబ్దంలో, అర్టమడోరస్ వ్రాసిన పుస్తకంలో అతను కలల చిహ్నాలకు అర్థాలనిచ్చాడు. అప్పటినుండి ప్రచురించబడిన అటువంటి అనేక పుస్తకాలు అతని పుస్తకంపై ఆధారపడి ఉన్నాయి. నేటి వరకూ కూడా, కలలను వివరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, అయితే అవి వాస్తవంగా భవిష్యత్ సంఘటనల గురించి మనకు అంతర్దృష్టినిస్తున్నాయా?
అవి భవిష్యత్తును గురించి చెప్పగలగాలంటే, ఒక ఉన్నత శక్తిచే ప్రభావితం చెందివుండాలి. దేవుడు ఆ శక్తిని ఇచ్చిన అనేక సందర్భాలను బైబిలులో మనం కనుగొంటాము. ఆయన తన సేవకులకు అలాగే తనను సేవించని కొందరికి కూడా ప్రవచనార్థక కలలను అనుగ్రహించాడు. వాస్తవానికి, యోబు 33:14-18 ఇలా చెబుతుంది: “దేవుడు . . . మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో . . . ఆయన వారి చెవులను తెరవచేయును.”
సామాన్య శకానికి 1,700 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం జీవించిన యోసేపు దినాల్లోని ఐగుప్తీయుడైన ఫరో విషయంలో దేవుడు అలా చేశాడు. ఫరో కల ఆదికాండము 41:1-7 మరియు 25 నుండి 32 వచనాల్లో కనుగొనబడుతుంది, అది “ఐగుప్తు దేశమందంతటను బహుసమృద్ధిగా పంటపండు” ఏడు సంవత్సరాలను మరియు వాటి తర్వాత ఏడు సంవత్సరాల క్షామాన్ని ప్రవచిస్తుందని యోసేపు దాన్ని వివరించాడు. యోసేపు ఫరోకు ఇలా వివరించాడు: “దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.” (ఆదికాండము 41:28) ఆ కల వాస్తవంగా సంభవించిన దాని ప్రవచనము.
బబులోనీయుల ఒక ప్రముఖ రాజుకు అదే విధమైన అనుభవం కలిగింది. నెబుకద్నెజరుకు వచ్చిన ఒక కల అతన్ని ఎంతో కలవరపెట్టింది, అయితే అతను దాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. తన కలను దాని వివరణను తనకు తెలిపేందుకు అతను తన మాంత్రికులను పిలిపించాడు. అది, వారు తీర్చలేని కోరిక.—దానియేలు 2:1-11.
రాజుకు ఆ కలను ఇచ్చింది దేవుడే గనుక, ఆ కలను దాని భావాన్ని బయల్పర్చుటకు ఆయన ప్రవక్తయైన దానియేలుకు శక్తినిచ్చాడు. దానియేలు 2:19 ఇలా చెబుతుంది: “అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను.” ఈ కల విషయమై దానియేలు దేవునికి కీర్తిని ఆపాదించాడు: “రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్యగలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను.”—దానియేలు 2:27, 28.
కొన్నిసార్లు దేవుడు కలల ద్వారా తన ప్రజలకు నిర్దేశకాలనిచ్చాడు, మరి కొన్నిసార్లు దైవిక అంగీకారం ఉందని అభయమిచ్చాడు లేక తాను వారికి ఎలా సహాయం చేస్తున్నాడో వారికి అర్థమయ్యేందుకు సహాయం చేశాడు. యాకోబు విషయంలో, దేవుడు తన అంగీకారాన్ని ఒక కల ద్వారా బయల్పర్చాడు.—ఆదికాండము 48:3, 4.
యేసు యొక్క పెంపుడు తండ్రియైన యోసేపు, మరియ గర్భవతి అయ్యిందని తెలుసుకుని ఆమెను విడనాడాలని తీర్మానించుకున్నాడు. అలా చేయవద్దని ఆయన కలలో ఉపదేశాన్ని పొందాడు. మత్తయి 1:20 ఇలా చెబుతుంది: “అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై—దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది.” ఆ తర్వాత ఆయన కలలో ఒక హెచ్చరికను పొందాడు: “ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై—హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.”—మత్తయి 2:13.
దేవుడు అనుగ్రహించని కలలు
దేవుని ప్రజలు కానివారి మధ్య కూడా కలలను వివరించడం సర్వసాధారణమన్న విషయం, సాధారణంగా కలలు భవిష్యత్తును బయల్పర్చేవని నమ్మేందుకు వీలులేదని సూచిస్తుంది. దేవుని ప్రవక్తయైన యిర్మీయా కాలంలో, అబద్ధ ప్రవక్తలు ఇలా అనేవారు: “కలకంటిని కలకంటిని.” (యిర్మీయా 23:25) దేవుడు తమ ద్వారా మాట్లాడుతున్నాడని నమ్మేలా ప్రజలను పెడదోవ పట్టించాలన్నదే వారి ఉద్దేశం. కలలను కనే వీరి గురించి, ఇలా చెప్పేందుకు యిర్మీయా ప్రేరేపించబడ్డాడు: “ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీ మధ్యనున్న ప్రవక్తలచేతనైనను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, . . . ఇదే యెహోవా వాక్కు.”—యిర్మీయా 29:8, 9.
ఈ అబద్ధ ప్రవక్తలు “మంత్రజ్ఞు”లై ఉండిరి గనుక, ప్రజలను మోసగించాలనే సంకల్పంగల దుష్ట ఆత్మీయ శక్తులచేత ఈ కలలు ప్రభావితంచెంది ఉండవచ్చు. జెకర్యా 10:2 నందు చెప్పబడిన దానిలో కూడా అదే సూచించబడింది: “గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి.”
యిర్మీయా మరియు జెకర్యా దినాల్లో అబద్ధ ప్రవక్తలు చేసిన విధంగానే, దర్శనాలు మరియు కలల ద్వారా దేవుడు తమతో మాట్లాడాడని అబద్ధంగా చెప్పేందుకు మహామోసగాడైన అపవాది మత నాయకులను వేలాది సంవత్సరాలుగా ఉపయోగించుకున్నాడు. అలాంటి వారి గురించి, ప్రేరేపిత బైబిలు రచయితైన యూదా మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “కొందరు రహస్యముగా జొరబడి యున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.” ఈ పురుషులు “కలల్లో మునిగి తేలుతున్నారని” చెప్పవచ్చునని ఆయన అన్నాడు.—యూదా 4, 8.
వారి మాటలను పరీక్షించండి
దేవుడు తనతో కలలో మాట్లాడాడని లేక భవిష్యత్ సంఘటనలను గురించిన తన కలలు నిజమని నిరూపించబడ్డాయని ఒక వ్యక్తి పేర్కొనవచ్చు, అయినంత మాత్రాన అతన్ని నమ్మేందుకు, గ్రుడ్డిగా అతన్ని అనుసరించేందుకు అది తగినంత కారణం కాదు. ద్వితీయోపదేశకాండము 13:1-3, 5 నందు కనుగొనబడే వచనాల్లో, ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయబడిన ఉపదేశాన్ని గమనించండి: “ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచకక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచకక్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. . . . ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను.” తన ప్రజల యథార్థతకు పరీక్షగా అబద్ధాలు మాట్లాడేందుకు అట్టి వారిని దేవుడు అనుమతించాడు.
మోసకరమైన కలలుగనే వారి మాటలను గ్రుడ్డిగా నమ్మేబదులు, “సర్వలోకమును మోస పుచ్చు”తున్న అదృశ్య మహావంచకుని ద్వారా మోసగించబడడాన్ని నివారించేందుకు మనం చేయవలసిన జ్ఞానవంతమైన పని వారి మాటలను పరీక్షించడమే. (ప్రకటన 12:9) అయితే వారిని విశ్వసనీయమైన రీతిలో ఎలా పరీక్షించవచ్చు?
దేవుని ప్రేరేపిత వాక్యం, సత్యం వైపుకు మనల్ని నడిపించేందుకు దైవికంగా ఇవ్వబడిన మార్గదర్శకం. దాని గురించి, యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) కాబట్టి 1 యోహాను 4:1నందు మనకిలా ఉపదేశమివ్వబడింది: “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.” బైబిలుతో జాగ్రత్తగా పోల్చబడినప్పుడు, వారి మాటలు, వేదాంతాలు మరియు చర్యలు దానికి విరుద్ధంగా ఉంటాయి. ఏది సత్యమనే విషయంలో దేవుని వాక్యమే అధికారిక మూలము.
తనకు ప్రత్యేక జ్ఞానముందని చెప్పుకుంటున్న కలలుగనే వాడు వాస్తవానికి సోదెను లేక ఇతర అభిచార సంబంధమైన ఆచారాలను ఉపయోగిస్తున్నాడా? ఒకవేళ అలాగైతే, అతను దేవుని వాక్యం ద్వారా ఖండించబడ్డాడు. “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచినడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.”—ద్వితీయోపదేశకాండము 18:10-12.
మరణించని ప్రాణము తనలో ఉందని అతను గనుక చెబుతుంటే, “పాపముచేయు ప్రాణము ఏదో అదే మరణము నొందును” అని స్పష్టంగా చెబుతున్న దేవుని వాక్యానికి విరుద్ధంగా అతను మాట్లాడుతున్నాడు. (యెహెజ్కేలు 18:4, NW) అతను తననుతాను హెచ్చించుకుంటున్నాడా, తనను అనుకరించేందుకు ప్రజలను కూడదీస్తున్నాడా? “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును” అని మత్తయి 23:12 హెచ్చరిస్తుంది. మరియు అపొస్తలుల కార్యములు 20:30 క్రైస్తవులను ఇలా అప్రమత్తులను చేస్తుంది: “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.”
అతను దౌర్జన్యపూరిత చర్యలను ప్రబోధిస్తున్నాడా? యాకోబు 3:17, 18 అతన్ని ఇలా ఖండిస్తుంది: “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.” అతను ఈ లోకంలో రాజకీయ అధికారాన్ని లేక పలుకుబడిని కోరుతున్నాడా? “యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” అని అంటూ దేవుని వాక్యం అతన్ని దృఢంగా నిందిస్తుంది. అలా బైబిలు అబద్ధమైన దానిని బయల్పరుస్తుంది.—యాకోబు 4:4.
ఒకవేళ ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుని లేక ఒక స్నేహితుని మరణాన్ని గురించి కలగంటే, అతను ఆ వ్యక్తి గురించి శ్రద్ధ కలిగి ఉన్నందుకు అలా కలగని ఉండవచ్చు. సరిగ్గా ఆ కల వచ్చిన రాత్రే అతను మరణించి ఉండటమనేది, ఆ కల ప్రవచనార్థకమైనదని అది నిరూపించదు. అలా నెరవేరుతున్నాయని అనిపించే ప్రతి కలకు తోడు అలా నెరవేరని కలలు వందలాది ఉన్నాయి.
తన లిఖితపూర్వక వాక్యం తయారగుచుండగా, ప్రవచనార్థక సంఘటనలను బయల్పర్చేందుకు, ఉపదేశాలను ఇచ్చేందుకు దేవుడు గతంలో కలలను ఉపయోగించినప్పటికీ, నేడు అలా చేసేందుకు ఆయనకు ఎలాంటి అవసరమూ లేదు. ఈ సమయంలో మానవజాతికి అవసరమైన దేవుడిచ్చే నిర్దేశకాలను అన్నింటినీ ఆ వ్రాతపూర్వక వాక్యం కలిగివుంది మరియు భవిష్యత్తులో వేల సంవత్సరాలకంటే ఎక్కువ కాలంలో నెరవేరే సంఘటనలను గురించిన ప్రవచనాలను అది కలిగివుంది. (2 తిమోతి 3:16, 17) కాబట్టి కలలనేవి భవిష్యత్తు సంఘటనలను గురించిన దేవుని సూచనలు కాదుగానీ మనం మానసికంగా సరిగ్గా ఉండేందుకు మెదడుకు ఎంతో ప్రాముఖ్యమైన కార్యాలని తెలుసుకుని మనం ధైర్యంగా ఉండవచ్చు.
[7వ పేజీలోని చిత్రం]
జరుగనైయున్న దాన్ని ఫరో కల చూపినట్లే, దేవుని వాక్యం మన భవిష్యత్తును గూర్చి వెలుగును వెదజల్లుతోంది