నమ్మదగిన దేవున్ని సేవించడం
కీమాన్ ప్రోగాకీస్ చెప్పినది
అది 1955లో, ఎముకలు కొరికేంత చలిగా ఉన్న సాయంత్రం. నా భార్య యనూలే, నేను మా 18 సంవత్సరాల కుమారుడు యార్గోస్ గురించి చింతించడం ప్రారంభించాం, ఎందుకంటే తాను పని చేసే కియోస్క్ నుండి అతడింకా తిరిగి రాలేదు. అనుకోని రీతిగా, ఒక పోలీసు మా తలుపు తట్టాడు. “మీ కుమారుడు తన సైకిల్‌పై ఇంటికి వస్తూ ఉండగా, ఓ వాహనం ఢీకొనడంతో అతడు మరణించాడు” అని అతను చెప్పాడు. తర్వాత అతను ముందుకు వంగి ఇలా గుసగుసలాడాడు: “ప్రమాదవశాత్తు అలా జరిగిందని వాళ్లంటారు, అయితే నేను చెప్పేది నమ్మండి, అతడు హత్య చేయబడ్డాడు.” స్థానిక ప్రీస్టు, కొందరు గస్తీదళం నాయకులు అతడిని చంపడానికి పన్నాగం వేశారు.
గొడవలు మరియు కష్టాల సమయం నుండి గ్రీసు కోలుకుంటున్న ఆ సంవత్సరాల్లో, యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండటం ప్రమాదకరంగా ఉండేది. గ్రీకు ఆర్థడాక్స్ చర్చి మరియు గస్తీదళ సంస్థల శక్తి గురించి నాకు స్వయంగా తెలుసు, ఎందుకంటే నేను 15 సంవత్సరాలకంటే ఎక్కువకాలం వాటిలో చురుకైన సభ్యునిగా పని చేశాను. 40 సంవత్సరాల కంటే ఎక్కువకాలం క్రితం మా కుటుంబంలో జరిగిన ఈ దుర్ఘటనకు దారి తీసిన సంఘటనల గురించి నన్ను మీకు చెప్పనివ్వండి.
గ్రీసులో పెరిగి పెద్దవ్వడం
నేను 1902లో, గ్రీసులోని కాల్కీస్ పట్టణానికి సమీపాన ఉన్న ఒక కుగ్రామంలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించాను. స్థానిక రాజకీయాల్లో మా నాన్న ఎంతో చురుకుగా పాల్గొనేవాడు, మరి మా కుటుంబంలోని వారు గ్రీకు ఆర్థడాక్స్ చర్చి భక్తిగల సభ్యులు. మా దేశ ప్రజల్లో అనేకులు నిరక్షరాస్యులుగా ఉన్న కాలంలో, నేను రాజకీయ మరియు మతపరమైన పుస్తకాలను ఎంతో ఆసక్తిగా చదివేవాడిని.
20వ శతాబ్దం ప్రారంభంలో ప్రబలివున్న పేదరికం మరియు అన్యాయం, శ్రేష్ఠమైన పరిస్థితులుగల లోకం కొరకు నాలో ఆశను చిగురింపజేశాయి. మతం, మా దేశప్రజల దుస్థితిని మెరుగుపర్చ గలదని నేను తలంచాను. నాకు మతం ఎడలగల ఆసక్తిని బట్టి, మా సమాజానికి నేను గ్రీక్ ఆర్థడాక్స్ ప్రీస్టును కావాలని మా గ్రామంలోని ప్రముఖులు ప్రతిపాదించారు. అయితే, నేను అనేక క్రైస్తవమత మఠాలను సందర్శించి, బిషప్పులు మరియు మఠాధికార్లతో సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ అలాంటి బాధ్యతను స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు లేక ఇష్టపడుతున్నట్లు నేను భావించలేదు.
అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో
కొన్ని సంవత్సరాల తర్వాత, 1941 ఏప్రిల్‌లో, గ్రీసు నాజీ ఆక్రమణ క్రిందికి వచ్చింది. ఇది హత్యలు, కరవు, లేమి మరియు చెప్పలేనంత మానవ బాధ గల దుఃఖకరమైన కాలాన్ని తీసుకువచ్చింది. ఒక తీవ్రమైన తిరుగుబాటు ఉద్యమం మొదలయ్యింది, నాజీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న గెరిల్లా గుంపుల్లో ఒకదానిలో నేను చేరాను. తత్ఫలితంగా, మా ఇంటికి అనేకసార్లు నిప్పంటించడం జరిగింది, కాల్పుల్లో నేను గాయపడ్డాను, మా పంటలను నాశనం చేశారు. మరి 1943 తొలి కాలంలో మా కుటుంబానికి, నాకు మరో అవకాశం లేక మేము ఎత్తు పల్లాలుగల కొండలకు పారిపోవలసి వచ్చింది. అక్టోబరు 1944లో జర్మన్ వారి ఆక్రమణ అంతమొందేంత వరకూ మేమక్కడే ఉండిపోయాము.
జర్మన్లు వెళ్లిపోయిన తర్వాత అంతర్గత రాజకీయ మరియు పౌర సంబంధ గొడవలు మొదలయ్యాయి. నేను ఉన్న గెరిల్లా గుంపు అంతర్యుద్ధంలో ముఖ్య పోరాట శక్తి అయ్యింది. న్యాయం, సమానత మరియు సామ్యవాద సమాజం వంటి కమ్యూనిస్టు భావాలు నాకు నచ్చినప్పటికీ, వాస్తవం నాకు తుదకు పూర్తిగా దిగ్భ్రాంతి కలిగించింది. గుంపులో నాకు ఉన్నత స్థానం ఉండేది గనుక, అధికారం ప్రజలను భ్రష్టులను చేస్తుందని నేను స్వయంగా చూశాను. స్పష్టమైన ఉన్నత సిద్ధాంతాలు మరియు ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ స్వార్థం మరియు అపరిపూర్ణత రాజకీయ సదుద్దేశాలను సహితం పాడుచేస్తాయి.
అంతః పోరాటంలోని వివిధ వర్గాల్లోని ఆర్థడాక్స్ మత గురువులు, తమ స్వంత మతానికి చెందిన వారిని చంపేందుకు ఆయుధాలు చేపట్టారనే విషయం ప్రాముఖ్యంగా నాకు వ్యాకులతను కలిగించింది! ‘“కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని హెచ్చరించిన యేసుక్రీస్తుకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఈ మత గురువులు ఎలా చెప్పుకోగలరు’ అని నాలో నేను ఆలోచించాను.—మత్తయి 26:52.
1946లో అంతర్యుద్ధం జరుగుతుండగా, మధ్య గ్రీసులోని లామ్యా పట్టణం సమీపాన నేను అజ్ఞాతంలో ఉన్నాను. నా బట్టలు పూర్తిగా చిరిగిపోయాయి, కాబట్టి నేను మారువేషం వేసుకుని, నగరంలోని టైలర్ దగ్గరికి వెళ్లి క్రొత్త బట్టలు కుట్టించుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి వెళ్లేసరికి అక్కడ తీవ్రమైన వాగ్వివాదం జరుగుతోంది, వెంటనే నేను రాజకీయాల గురించి కాదుగాని గతంలో నా అభిమాన అంశమైన మతం గురించి మాట్లాడడం ప్రారంభించాను. అక్కడున్నవారు జ్ఞానవంతమైన నా దృక్పథాలను గమనించి, నేను ఒక ఫలానా ‘వేదాంత పండితునితో’ మాట్లాడాలని సూచించారు. వెంటనే, వారు ఆయనను తీసుకురావడానికి వెళ్లారు.
ఒక నమ్మదగిన నిరీక్షణను కనుగొనడం
ఆ తర్వాత జరిగిన చర్చలో, నా నమ్మకాలకు ఆధారమేమిటని ఆ “పండితుడు” నన్ను అడిగాడు. “పరిశుద్ధ తండ్రులు, సార్వత్రిక క్రైస్తవ మతగురువుల సభ” అని నేను సమాధానమిచ్చాను. నన్ను వ్యతిరేకించే బదులు, ఆయన తన చిన్న బైబిలును మత్తయి 23:9, 10 వచనాలకు త్రిప్పి, అక్కడ “భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు” అని ఉన్న యేసు మాటలను నన్ను చదవమన్నాడు.
అది నా కళ్లు తెరిపించింది! ఈ వ్యక్తి సత్యం చెబుతున్నాడని నేను గ్రహించాను. ఆయన తాను ఒక యెహోవాసాక్షినని చెప్పినప్పుడు, చదవడానికి కొంత సాహిత్యమివ్వమని నేను ఆయనను అడిగాను. ఆయన నా కోసం వెలుగు (ఆంగ్లం) అనే పుస్తకం తెచ్చాడు, అది బైబిలు పుస్తకమైన ప్రకటనపై వ్యాఖ్యానం, నేను దాన్ని నా అజ్ఞాత స్థలానికి తీసుకువెళ్లాను. ప్రకటనలో సూచింపబడిన క్రూరమృగాలు నాకు చాలా కాలం వరకు ఒక మర్మంగా ఉండేవి, కాని ఇవి మన 20వ శతాబ్దంలో ఉనికిలో ఉండే రాజకీయ సంస్థలను సూచిస్తాయని నేనిప్పుడు తెలుసుకున్నాను. బైబిలు మన కాలానికి ఆచరణాత్మకమైన భావాన్ని కలిగివుందని, నేను దాన్ని పఠించి దాని సత్యాలకు అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోవాలని నేను గ్రహించడం ప్రారంభించాను.
పట్టుబడడం, జైలుశిక్ష విధించబడడం
ఆ తర్వాత అనతి కాలంలోనే, నా అజ్ఞాత స్థలంలోకి సైనికులు ప్రవేశించి, నన్ను నిర్బంధించారు. నన్ను చెరసాల గదిలో పడేశారు. కొంతకాలం నుండి పోలీసులు వెంటాడుతున్న చట్టబహిష్కృతునిగా ఉన్నాను కాబట్టి నాకు మరణదండన విధింపబడుతుందని నేను అనుకున్నాను. అక్కడ నా చెరసాల గదిలో, నాతో మొదట మాట్లాడిన సాక్షి నన్ను దర్శించాడు. యెహోవాయందు ప్రగాఢ విశ్వాసం ఉంచమని ఆయన నన్ను ప్రోత్సహించాడు, నేను అలాగే చేశాను. ఈకరీయకు చెందిన ఎగియన్ ద్వీపంపై నాకు ఆరు నెలలు ద్వీపాంతరవాస శిక్ష విధించబడింది.
నేను అక్కడికి చేరిన వెంటనే, నన్ను నేను కమ్యూనిస్టుగా కాదుగాని, ఒక యెహోవాసాక్షిగా పరిచయం చేసుకున్నాను. బైబిలు సత్యాలు నేర్చుకున్న ఇతరులు కూడా ద్వీపాంతర వాస శిక్ష క్రింద అక్కడికి పంపబడ్డారు, కాబట్టి నేను వారిని కనుగొన్నాను, మేమంతా కలిసి బైబిలును క్రమంగా పఠించేవాళ్లము. లేఖనాల నుండి మరింత జ్ఞానాన్ని, మన నమ్మకమైన దేవుడగు యెహోవా గురించి మరి శ్రేష్ఠమైన అవగాహనను పొందడానికి వారు నాకు సహాయం చేశారు.
1947లో, నా శిక్ష ముగిసినప్పుడు, ప్రభుత్వ న్యాయవాది కార్యాలయానికి రమ్మని నాకు పిలుపువచ్చింది. నా ప్రవర్తనను బట్టి తాను ఎంతో ముగ్ధుడనయ్యానని, మళ్లీ నాకు ఎన్నడైనా ద్వీపాంతర వాస శిక్ష విధించబడితే సంప్రదించడానికి నేను ఆయన పేరును ఉపయోగించుకోవచ్చునని ఆయన నాతో చెప్పాడు. అప్పటికే మా కుటుంబం తరలి వెళ్లిన ఏథెన్సుకు నేను వచ్చిన తర్వాత, నేను యెహోవాసాక్షుల సంఘంతో సహవసించడం ప్రారంభించి, యెహోవాకు నేను చేసుకున్న సమర్పణకు సూచనగా త్వరలోనే నేను బాప్తిస్మం తీసుకున్నాను.
మతమార్పిడిని గూర్చిన నేరారోపణ
మతమార్పిడిని నిషేధిస్తూ 1938 మరియు 1939లలో చేయబడిన చట్టాల ప్రకారం గ్రీసు, యెహోవాసాక్షులపై అనేక దశాబ్దాలు చట్టరీత్యా చర్యగైకొంటూ వచ్చింది. కాబట్టి, 1938 నుండి 1992 వరకు, గ్రీసులో 19,147 మంది నిర్బంధించబడ్డారు, కోర్టు మొత్తంగా 753 సంవత్సరాల శిక్షను విధించింది, దానిలో 593 సంవత్సరాలు వాస్తవంగా అనుభవించడం జరిగింది. వ్యక్తిగతంగా, నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించినందుకు 40 కంటే ఎక్కువసార్లు నిర్బంధించబడ్డాను, మొత్తం కలిపి నేను 27 నెలలు వివిధ చెరసాలల్లో శిక్ష అనుభవించాను.
చాల్సిస్లోని గ్రీకు ఆర్థడాక్స్ మతనాయకునికి నేను వ్రాసిన ఒక లేఖ మూలంగా ఒకసారి నేను నిర్బంధించబడ్డాను. 1955లో, క్రైస్తవమత సామ్రాజ్యం లేక క్రైస్తవత్వం—ఏది “లోకానికి వెలుగై” ఉంది? అనే చిన్నపుస్తకాన్ని మతనాయకులందరికీ పంపించమని యెహోవాసాక్షుల సంఘాలన్నిటినీ కోరడం జరిగింది. నేను ఎవరికి లేఖ వ్రాశానో ఆ ఉన్నత మతనాయకులలో ఒకరు, మతమార్పిడి గురించి నాపై దావా వేశాడు. విచారణ సమయంలో, సాక్షియైన బారిస్టరు మరియు స్థానిక న్యాయవాది ఇద్దరూ, దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించే బాధ్యత నిజ క్రైస్తవులకు ఉందని వివరిస్తూ, నైపుణ్యవంతంగా వాదించారు.—మత్తయి 24:14.
అధికారంలోవున్న కోర్టు జడ్జి ఆ మతనాయకున్ని (బిషప్పు కంటే తక్కువ స్థాయిలో ఉండే చర్చి అధికారి) ఇలా అడిగాడు: “నీవు లేఖను, ఆ చిన్న పుస్తకాన్ని చదివావా?”
“లేదు, నేను ఆ కవరును తెరిచిన వెంటనే వాటిని చింపేసి, వాటి పీడ వదిలించుకున్నాను!” అని ఆయన ఉద్రేకంతో సమాధానమిచ్చాడు.
“మరి ఈ వ్యక్తి నీ మతాన్ని మార్చబోయాడని ఎలా చెప్పగలవు?” అని అధికారంలో ఉన్న జడ్జి ఆరా తీసాడు.
తర్వాత, ప్రభుత్వ గ్రంథాలయాల కొరకు పుస్తకాల దొంతరలను విరాళంగా ఇచ్చిన పండితులు, మరితరుల ఉదాహరణలను మా బారిస్టరు పేర్కొన్నాడు. “ఆ ప్రజలు ఇతరుల మతాలను మార్చడానికి ప్రయత్నించారని నీవంటున్నావా?” అని ఆయన అడిగాడు.
స్పష్టంగా, అలాంటి చర్య మతమార్పిడితో సమానం కాదు. “నిరపరాధి” అన్న తీర్పు విన్నప్పుడు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను.
నా కుమారుని మరణం
నా కుమారుడు యార్గోస్ కూడా, సాధారణంగా ఆర్థడాక్స్ మతనాయకుల ప్రేరేపణ మూలంగా పదేపదే వేధించబడ్డాడు. దేవుని రాజ్యసువార్తను ప్రకటించడంలో అతని యౌవనపు ఆసక్తినిబట్టి అతను కూడా అనేకసార్లు నిర్బంధించబడ్డాడు. చివరికి, వ్యతిరేకులు అతన్ని వదిలించుకోవాలని అదే సమయంలో, ప్రకటించడాన్ని ఆపేలా మాకు హెచ్చరికా సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
యార్గోస్ మరణం గురించి నివేదించడానికి మా ఇంటికి వచ్చిన పోలీసు, స్థానిక గ్రీకు ఆర్థడాక్స్ ప్రీస్టు మరియు గస్తీదళం నాయకులు మా కుమారున్ని చంపడానికి పథకం వేశారని చెప్పాడు. ఆ కల్లోలిత కాలాల్లో అలాంటి “దుర్ఘటనలు” సర్వసాధారణమైనవే. అతని మరణం వేదన కలుగజేయడమే గాక, ప్రకటన పనిలో చురుకుగా ఉండాలి, యెహోవాను సంపూర్ణంగా విశ్వసించాలి అనే మా నిశ్చయతను కేవలం బలపర్చింది.
యెహోవాయందు నమ్మకముంచడానికి ఇతరులకు సహాయం చేయడం
1960వ దశాబ్ద మధ్యభాగంలో, ఏథెన్సు నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోవున్న తీరప్రాంత గ్రామమైన స్కాలా ఒరోపోస్లో నా భార్యా పిల్లలు వేసవి నెలలను గడిపేవారు. ఆ సమయంలో, అక్కడ సాక్షులెవరూ నివసించేవారు కాదు, కాబట్టి మేము ఇరుగుపొరుగువారికి అనియత సాక్ష్యమిచ్చేవారము. కొంతమంది స్థానిక రైతులు అనుకూలంగా ప్రతిస్పందించారు. పగలు ఎక్కువ గంటలు పురుషులు తమ పొలాల్లో గడిపేవారు గనుక, మేము వారితో చాలా రాత్రయ్యాక బైబిలు పఠనాలు నిర్వహించేవాళ్లము, వారిలో చాలామంది సాక్షులయ్యారు.
యెహోవా మా ప్రయత్నాలను ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూసిన తర్వాత, ఆసక్తిగలవారితో బైబిలు పఠనాలు నిర్వహించడానికి మేము దాదాపు 15 సంవత్సరాలు, ప్రతివారం అక్కడికి ప్రయాణించి వెళ్లేవాళ్లము. మేము అక్కడ ఎవరితో పఠించామో వారిలో 30 మంది వ్యక్తులు బాప్తిస్మం తీసుకునేంతగా అభివృద్ధి సాధించారు. ప్రారంభంలో, ఒక పఠన గుంపు ఏర్పరచబడింది, కూటాలు నిర్వహించడానికి నేను నియమింపబడ్డాను. ఆ తర్వాత ఆ గుంపు ఒక సంఘంగా తయారైంది, నేడు ఆ ప్రాంతంలోని వంద కంటే ఎక్కువమంది సాక్షులు మాలాకాసా సంఘంగా ఏర్పడ్డారు. మేము సహాయం చేసిన వారిలో నలుగురు వ్యక్తులు ఇప్పుడు పూర్తికాల పరిచారకులుగా సేవ చేస్తుండడాన్నిబట్టి మేమానందిస్తున్నాము.
ఒక గొప్ప పిత్రార్జితం
నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్న కొంతకాలానికి, నా భార్య ఆత్మీయంగా అభివృద్ధి సాధించడం ప్రారంభించి, బాప్తిస్మం తీసుకుంది. హింస ఉన్న కష్టతరమైన కాలంలో, ఆమె విశ్వాసం దృఢంగా ఉంది, ఆమె తన యథార్థతను స్థిరంగా, నిశ్చలంగా కాపాడుకుంది. నేను తరచూ చెరసాలలో వేయబడడాన్ని బట్టి వచ్చిన అనేక కష్టాల గురించి ఆమె ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు.
అనేక సంవత్సరాల కాలంలో, మేమిద్దరం కలిసి అనేక బైబిలు పఠనాలు నిర్వహించాము, ఆమె తన సరళమైన, ఉత్సాహభరితమైన పద్ధతితో అనేకులకు ప్రభావవంతంగా సహాయం చేసింది. ప్రస్తుతం, ఆమె క్రమంగా ఎవరికైతే కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను ఇస్తుందో అలాంటి వారు డజన్లమంది ఇమిడివున్న పత్రికామార్గం ఆమెకుంది.
ముఖ్యంగా, ప్రేమగల నా జత యొక్క మద్దతు మూలంగా, జీవించివున్న మా ముగ్గురు పిల్లలు వారి కుటుంబాలు అంటే వారిలో ఆరుగురు మనుమలు, నలుగురు మునిమనుమలు ఉన్నారు, వారందరూ యెహోవా సేవలో చురుకుగా ఉన్నారు. నేను నా భార్య ఎదుర్కొన్న హింసను, తీవ్రమైన వ్యతిరేకతను వారు ఎదుర్కొనకపోయినప్పటికీ, వారు యెహోవాయందు దృఢ విశ్వాసాన్ని ఉంచారు, వారు ఆయన మార్గాలలో నడవడం కొనసాగిస్తున్నారు. పునరుత్థానంలో మా ప్రియమైన యార్గోస్ తిరిగి వచ్చినప్పుడు, అతనితో మళ్లీ కలవడం మాకందరికీ ఎంత ఆనందంగా ఉంటుందో కదా!
యెహోవాయందు విశ్వాసముంచడానికి నిశ్చయించుకోవడం
ఈ సంవత్సరాలన్నిటిలో, యెహోవా ఆత్మ ఆయన ప్రజలపై పనిచేయడాన్ని నేను చూశాను. మనం మానవ ప్రయత్నాలయందు మన నమ్మకాన్ని ఉంచలేమని తెలుసుకోవడానికి ఆయన ఆత్మచే నడిపించబడే సంస్థ నాకు సహాయం చేసింది. శ్రేష్ఠమైన భవిష్యత్తును గూర్చిన వారి వాగ్దానాలు నిష్ప్రయోజనకరమైనవి, అవి కేవలం ఒక అభూత కల్పనే.—కీర్తన 146:3, 4.
నా వయస్సు పైబడుతూ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, నా కళ్లు రాజ్య నిరీక్షణపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అబద్ధమతం కొరకు, రాజకీయ విధానాల ద్వారా శ్రేష్ఠమైన పరిస్థితులను తెచ్చేందుకు ప్రయత్నించడానికి నేను వెచ్చించిన సంవత్సరాలనుబట్టి నేను నిజంగా చింతిస్తున్నాను. నేను నా జీవితాన్ని మళ్లీ కొనసాగించాల్సివస్తే, నిస్సందేహంగా నేను మళ్లీ, నమ్మదగిన దేవుడైన యెహోవా సేవ చేయడానికే నిర్ణయించుకుంటాను.
(కీమాన్ ప్రోగాకీస్ ఇటీవలనే మరణించాడు. ఆయనది భూనిరీక్షణ.)
[26వ పేజీలోని చిత్రం]
తన భార్య యనూలేతో ఉన్న కీమాన్ యొక్క ఇటీవలి ఫోటో