రాజ్య ప్రచారకుల నివేదిక
రష్యాలో ‘దప్పికగొనిన’ వారికి సహాయపడుట
“నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు” అని యేసు తెలియజేశాడు. (మత్తయి 5:6) 70 సంవత్సరాలుగా మత స్వాతంత్ర్యం అణచివేయబడిన రష్యాలో ఆత్మీయ దప్పికగల అనేకమందిని తృప్తిపర్చేందుకు యెహోవాసాక్షులు ఎలా సహాయపడుతున్నారో ఈ క్రింది అనుభవాలు తెలియజేస్తున్నాయి.
▪ వల్యన్త్యాన అనే పేరుగల ఓ స్త్రీకి అనేక సంవత్సరాలుగా జవాబులు దొరకని గంభీరమైన బైబిలు ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకు, ‘యేసు ఎవరికి ప్రార్థన చేశాడా? అని ఆమె ఆలోచించింది. యేసు తనకన్నా గొప్పవానికెవనికో ప్రార్థన చేసివుండాలని ఆమె తలంచి, ఆయన పేరు ఏమిటోనని తెలుసుకొనగోరింది.
ఆమె రష్యన్ ఆర్థడక్స్ చర్చిని సందర్శించింది. అయినా, ఆ మతంలో ఆమె తన ప్రశ్నలకు జవాబుల్ని కనుగొనలేకపోయింది. అసంతృప్తితో ఆమె పెంతెకొస్తు చర్చికి వెళ్లింది కాని మరలా అస్పష్టమైన జవాబుల్నే పొందింది. ఎక్కడకెళ్లాలో తెలియక, వల్యన్త్యాన తనంతటతానుగా జవాబుల్ని పొందడానికి ప్రయత్నిస్తూ బైబిల్ని చదవనారంభించింది—ఫలితం శూన్యం. ఆమె సహాయం కొరకు ప్రార్థించింది.
కొంతకాలం తర్వాత యెహోవాసాక్షులు ఆమె ఇంటి ద్వారాన్ని తట్టారు. దేవుని నామం యెహోవాయని వారు ఆమెకు బైబిలు నుండి చూపించారు. చివరకు, యేసు ఎవరికి ప్రార్థించాడో ఆమె తెలుసుకుంది! ఆమె సాక్షులతో క్రమంగా బైబిల్ని పఠించడం ఆరంభించింది. ఆమె తరచూ రాత్రంతా మేల్కొని వాచ్‌టవర్ సొసైటీ ప్రచురించిన సాహిత్యాలను చదువుతూ బైబిలు వచనాల్ని చూస్తుంటుంది. త్వరలోనే వల్యన్త్యాన తాను బైబిలు సత్యాన్ని కనుగొన్నాననే నిర్ధారణకు వచ్చింది. మూడునెలల్లోపలే ఆమె ప్రకటనాపనిలో భాగంవహించడం ఆరంభించింది, అటుతర్వాత రెండు నెలలకు ఆమె బాప్తిస్మం పొందింది. సత్యం కొరకైన ఆమె ప్రార్థనాపూర్వకమైన అన్వేషణ ఫలించింది.
▪ మారుమూల ప్రాంతంలో ప్రకటించడానికి ఓ సాక్షి బస్సులో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణంలో ఆయన ఓ యౌవన స్త్రీకి బైబిలు వాగ్దానాల్ని గురించి మాట్లాడాడు, కాని ఆ యౌవన స్త్రీ ఆసక్తిని చూపించలేదు. రెండు నెలల తర్వాత ఆ సాక్షి ఓ బహిరంగ ప్రసంగాన్ని ఇవ్వడానికి అదే ప్రాంతానికి రెండవసారి ప్రయాణించాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత, ఆయన ఓ సందర్శకున్ని సమీపించి ఇలా అడిగాడు: “బైబిలు నుండి సువార్త గురించి మీతో ఎవరైనా ఇప్పటికే మాట్లాడారా?” ఆ వ్యక్తి “మీరే మాట్లాడారని” జవాబిచ్చాడు. ఆయన జోక్ చేస్తున్నాడని ఆ సాక్షి అనుకున్నాడు. కాని రెండు నెలల క్రిందట బస్సులో ప్రయాణం చేస్తుండగా, ఆ సాక్షికి యౌవన స్త్రీకి మధ్య జరిగిన సంభాషణను తాను విన్నానని ఆ యౌవనస్థుడు వివరించాడు. “నేనింకా తెలుసుకోవాలని అనుకున్నాను కాని మీరు బస్సు దిగిపోయారు, నేను యెహోవాసాక్షుల్ని మరలా చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. అటుతర్వాత, నేను పనిచేసే స్థలంలో సాక్షులతో బైబిలు పఠిస్తున్న ఓ వ్యక్తిని నేను కలుసుకున్నాను. గనుకనే నేను ఇక్కడకు రాగల్గాను!”
ఆయన, ఆయన భార్య బైబిలు పఠనం చేయనారంభించారు. అటుతర్వాత అనతికాలంలోనే ఆయన తానుచేసే ఉద్యోగం, బైబిలు సూత్రాలకు విరుద్ధమైందని గ్రహించగల్గాడు. దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలనే కోరికతో, అతడు తన వృత్తిని మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రతి అవకాశమందూ దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులకు చెబుతున్నాడు. ఆయన భార్య, బైబిల్ని పఠించడంలో పురోభివృద్ధి సాధిస్తోంది కూడా.
“రమ్ము . . . దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అని విశాలమైన రష్యా ప్రాంతంలో యెహోవాసాక్షులు యథార్థవంతులైన ప్రజలకు తెలియజేయడంలో భాగంవహించడానికి ఇష్టపడ్తున్నారు.—ప్రకటన 22:17.