వాగ్దాన దేశం నుండి ఆచరణాత్మకమైన పాఠాలు
బైబిలులోని వాగ్దాన దేశం నిజంగా ప్రత్యేకమైనది. ఈ చిన్న ప్రాంతంలో, ఎన్నో రకాల భౌగోళిక విషయాలను మనం కనుగొంటాము. ఉత్తరాన, మంచుతో కప్పబడిన పర్వతాలు, దక్షిణాన వేడి ప్రాంతాలు ఉన్నాయి. ఫలవంతమైన పల్లపు భూములు, నిర్మానుష్యమైన అరణ్య ప్రాంతాలు, ఫలవృక్షాల తోటల కొరకు మరియు మేసే మందల కొరకు పర్వత ప్రాంతాలు ఉన్నాయి.
చల్లటి ఉన్నత ప్రాంతాల్లో బాగా పెరిగేవి, వేడిగల ఎడారిలో పెరిగే ఇతరమైనవి మరియు అలూవియల్ సమప్రదేశం లేక రాళ్లతో నిండిన ప్రదేశంలో పెరిగే మరితర వాటితో సహా వివిధ రకాల చెట్లు, పొదలు మరియు ఇతర మొక్కలు పెరిగేందుకు దాని ఎత్తు, వాతావరణం మరియు నేలలో ఉన్న వైవిధ్యం అవకాశాన్నిస్తుంది. ఓ వృక్షశాస్త్ర నిపుణుడు, ఈ ప్రాంతంలో సుమారు 2,600 రకాల మొక్కలను కనుగొనవచ్చని అంచనా వేస్తున్నాడు! ఆ దేశాన్ని కనుగొన్న మొట్టమొదటి ఇశ్రాయేలీయులు దానికున్న శక్తి యొక్క సత్వర రుజువును చూశారు. ఆ లోయనుండి వారు ఒక ద్రాక్ష గెలను తీసుకువచ్చారు, అది ఎంత పెద్దగా ఉందంటే ఇద్దరు మనుష్యులు ఓ కర్రపై దాన్ని మోసుకురావాల్సివచ్చింది! ఆ లోయ ఎష్కోలు అని సరిగ్గానే పిలువబడింది, ఎందుకంటే “ద్రాక్ష గెల” అని దాని భావం.a—సంఖ్యాకాండము 13:21-24.
అయితే ఈ విశిష్టమైన ప్రాంతంలోని భౌగోళిక విషయాల్లో కొన్నింటిని ఇప్పుడు మనం దగ్గిరగా పరిశీలిద్దాము. ప్రత్యేకంగా దక్షిణ భాగాన్ని పరిశీలిద్దాము.
షెఫెలా
వాగ్దాన దేశంలో పడమటి ఒడ్డున మధ్యధరా సముద్ర తీరము ఉంది. తీరం నుండి సుమారు 40 కిలోమీటర్లు లోనకు షెఫెలా ఉంటుంది. “షెఫెలా” అనే పద భావం “పల్లపు భూమి” అని, కానీ వాస్తవానికి అది కొండ ప్రాంతమే, మరి తూర్పున ఉన్న యూదయ పర్వతాలతో పోల్చి చూస్తే అది దిగువగా ఉంటుందన్న దృష్ట్యా మాత్రమే అదలా పిలువబడగలదు.
దీనితో ఉన్న పటాన్ని చూసి, షెఫెలా చుట్టుప్రక్కల్లో ఉన్న ప్రాంతాలతో దానికిగల సంబంధాన్ని గమనించండి. దాని తూర్పు దిక్కున యూదయ పర్వతాలున్నాయి; పడమట ఫిలిష్తియ తీరప్రాంతం ఉంది. ఆ విధంగా, షెఫెల సంఘర్షణ ప్రతిబంధక మండలంగా పనిచేసింది, అంటే బైబిలు కాలాల్లో దేవుని ప్రజలను తమ ప్రాచీన శత్రువులనుండి వేరు చేసిన అడ్డుగోడగా పనిచేసింది. పడమటి నుండి దాడి చేసే ఏ సైనిక దళమైనా, ఇశ్రాయేలు రాజధానియైన యెరూషలేముకు వెళ్లేముందు షెఫెలా గుండా వెళ్లవలసిందే.
అలాంటి ఒక సంఘటన సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో జరిగింది. సిరియా రాజైన హజాయేలు ‘[బహుశా షెఫెలా సరిహద్దు వద్ద] గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేము మీదకి రాదలచాడని’ బైబిలు చెబుతోంది. రాజైన యోవాషు, ఆలయంలోని మరియు కోటలోని విలువైన వస్తువులతో హజాయేలును కొనడం ద్వారా అతనిని ఆపగల్గాడు. అయితే, షెఫెలా యెరూషలేము భద్రతకు అతి ప్రాముఖ్యమైనదిగా ఉండినదని ఈ వృత్తాంతం దృష్టాంతపరుస్తోంది.—2 రాజులు 12:17, 18.
మనం దీనినుండి ఒక ఆచరణాత్మకమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. హజాయేలు యెరూషలేమును స్వాధీనపర్చుకోవాలనుకున్నాడు, కానీ అతను మొదట షెఫెలా గుండా ప్రవేశించాలి. అదే విధంగా, అపవాదియైన సాతాను దేవుని సేవకులను ‘మ్రింగాలని వెదకుచున్నాడు,’ కానీ తరచూ అతను బలమైన సంఘర్షణ ప్రతిబంధక మండలం నుండి అంటే చెడు సహవాసం మరియు వస్తుదాయకాసక్తి వంటివాటి విషయంలోని బైబిలు సూత్రాలకు వారు అంటిపెట్టుకుని ఉండడం నుండి ఛేదించుకుని వెళ్లాల్సివుంటుంది. (1 పేతురు 5:8; 1 కొరింథీయులు 15:33; 1 తిమోతి 6:10) బైబిలు సూత్రాలతో రాజీపడడం తరచూ గంభీరమైన పాపాలు చేసేందుకు మొదటి మెట్టవుతుంది. కనుక ఆ సంఘర్షణ ప్రతిబంధక మండలాన్ని భద్రంగా ఉంచుకోండి. ఈ రోజు బైబిలు సూత్రాలను అనుసరించండి, రేపు మీరు దేవుని నియమాల్ని ఉల్లంఘించరు.
యూదా కొండప్రాంతం
షెఫెలా నుండి మరికాస్త లోపలికి యూదా కొండ ప్రాంతం ఉంటుంది. ఆ కొండ ప్రాంతం మంచి ధాన్యాన్ని, ఒలీవ నూనెను మరియు ద్రాక్షారసాన్ని ఉత్పత్తి చేసింది. యూదా ఎత్తు మీద ఉన్నందున అది కూడా చక్కని ఆశ్రయంగా ఉండేది. ఆ విధంగా, రాజైన యోతాము అక్కడ “కోటలను దుర్గములను కట్టించెను.” కష్ట కాలంలో ప్రజలు రక్షణ కొరకు అక్కడికి పరుగెత్తగల్గేవారు.—2 దినవృత్తాంతములు 27:4.
సీయోను అని కూడా పిలువబడే యెరూషలేము, యూదా కొండ ప్రాంతంలో ప్రాముఖ్యమైన భాగము. మూడు ప్రక్కల లోతైన లోయలు ఉండడం మరియు మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసిఫస్ అభిప్రాయం ప్రకారం ఉత్తరాన మూడు వరుసల గోడ ఉండడంవల్ల యెరూషలేము ఎంతో సురక్షితంగా ఉన్నట్లు కనిపించేది. అయితే ఒక ఆశ్రయం యొక్క భద్రతను కాపాడేందుకు గోడలూ ఆయుధాలకంటే ఎక్కువే కావాలి. దానికి నీళ్లు కూడా అవసరం. ముట్టడి సమయంలో ఇది అవసరం ఎందుకంటే నీళ్లు లేకపోతే ముట్టడించబడిన పౌరులు త్వరగా లొంగిపోవల్సివస్తుంది.
సిలోయము కొలనులోనుండి యెరూషలేము నీటిని పొందుతూ ఉండింది. అయితే, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో, రాజైన హిజ్కియా అష్షూరీయులు దాడి చేస్తారనే ఆలోచనతో సిలోయము కొలనును కాపాడేందుకు అది పట్టణంలోనే ఉండేలా ఓ బాహ్య గోడను కట్టించాడు. ముట్టడించే ఆ అష్షూరీయులు తమ కొరకు నీటిని కనుక్కోలేక కష్టపడేలా పట్టణం బయట ఉన్న ఊటలను కూడా అతను ఆపుచేశాడు. (2 దినవృత్తాంతములు 32:2-5; యెషయా 22:11) అంతమాత్రమే కాదు. అదనపు నీటి సరఫరాను నేరుగా యెరూషలేములోకి మరలించే మార్గాన్ని హిజ్కియా కనుగొన్నాడు!
హిజ్కియా గొప్ప పురాతన ఇంజినీరింగు అద్భుతాల్లో ఒకటిగా పిలువబడుతున్న సొరంగాన్ని గిహోను కాలువనుండి సిలోయము కాలువ వరకూ త్రవ్వించాడు.b సగటున 1.8 కిలోమీటర్ల ఎత్తు ఉండే ఈ సొరంగం 533 మీటర్ల పొడువుంటుంది. ఒక్కసారి దాన్ని ఊహించుకోండి—కొండలో నుండి త్రవ్వించబడిన సుమారు అర్థకిలోమీటరు పొడవున్న సొరంగమది! నేడు, సుమారు 2,700 సంవత్సరాల తర్వాత, సాధారణంగా హిజ్కియా కాలువ అని పిలువబడే, ఇంజనీరింగులోని అద్భుతం అయిన దీనిలో నుండి సందర్శకులు నడిచి వెళ్లవచ్చు.—2 రాజులు 20:20; 2 దినవృత్తాంతములు 32:30.
యెరూషలేము నీటి సరఫరాను కాపాడేందుకు మరియు దాన్ని ఎక్కువ చేసేందుకు హిజ్కియా చేసిన ప్రయత్నాలు మనకు ఆచరణాత్మకమైన పాఠాలను నేర్పిస్తాయి. యెహోవా “జీవజలముల ఊట.” (యిర్మీయా 2:13) బైబిలులో ఉన్న ఆయన ఆలోచనలు జీవాన్ని కాపాడేవి. అందుకే వ్యక్తిగత బైబిలు పఠనం ఆవశ్యకం. అయితే పఠించేందుకు అవకాశం మరియు దానివల్ల వచ్చే జ్ఞానం ఊరికినే మీవద్దకు ప్రవహించదు. బహుశ మీరు, బొత్తిగా తీరికలేని మీ అనుదిన కార్యకలాపాల్లో నుండి దాని కొరకు వీలు చేసుకోవడం వంటి ‘కాలువలను త్రవ్వవల్సి’ ఉండవచ్చు. (సామెతలు 2:1-5; ఎఫెసీయులు 5:15, 16) ఒకసారి మీరు ప్రారంభించిన తర్వాత, మీ వ్యక్తిగత పఠనానికి ప్రాముఖ్యతనిస్తూ మీ పట్టికకు అంటిపెట్టుకుని ఉండండి. ఈ అమూల్యమైన నీటి సరఫరా నుండి ఎవరూ లేక ఏదీ మిమ్మల్ని దూరం చేయకుండా జాగ్రత్తపడండి.—ఫిలిప్పీయులు 1:9, 10.
అడవి ప్రాంతాలు
యూదయ పర్వతాలకు పడమటివైపు, “ఎడారి” అనే భావంగల యెషీమోను అని కూడా పిలువబడే అరణ్య ప్రాంతం ఉంది. (1 సమూయేలు 23:19, NW, అధఃసూచి) ఉప్పు సముద్రం వద్ద, ఈ నిస్సారమైన ప్రాంతం రాళ్లున్న సన్నటి త్రోవలను మరియు వంకరటింకరగావున్న శిఖరాలను కల్గివుంటుంది. కేవలం 24 కిలోమీటర్లలోనే సుమారు 1,200 మీటర్ల ఎత్తు తగ్గిపోయే యూదయ అరణ్య ప్రాంతం, పడమటి నుండి వచ్చే వానగాలుల నుండి కాపాడబడివుంది, మరి అందువల్ల అక్కడ పరిమితమైన వర్షాలే కురుస్తాయి. వార్షిక పాపపరిహారార్థ దినాన అజాజేలు మేక పంపించబడిన అడవి నిస్సందేహంగా ఇదే. సౌలు నుండి దావీదు పారిపోయింది కూడా ఈ ప్రాంతానికే. యేసు ఇక్కడే 40 రోజుల వరకు పస్తులుండి, ఆ తర్వాత అపవాది చేత శోధించబడ్డాడు.—లేవీయకాండము 16:21, 22; కీర్తన 63, పైవిలాసము; మత్తయి 4:1-11.
యూదయ అరణ్య ప్రాంతానికి దాదాపు 160 కిలోమీటర్లు నైరుతి దిశగా పారాను అరణ్యం ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వాగ్దాన దేశం వరకూ చేసిన 40 సంవత్సరాల ప్రయాణంలో గుడారాలు ఎక్కువగా ఇక్కడే వేయబడ్డాయి. (సంఖ్యాకాండము 33:1-49) “తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యము” గురించి మోషే వ్రాశాడు. (ద్వితీయోపదేశకాండము 8:15) లక్షలకొలది మంది ఇశ్రాయేలీయులు బ్రతికి బయటపడడం ఆశ్చర్యకరమైన విషయం! అయినప్పటికీ, యెహోవా వారిని కాపాడాడు.
ఆత్మీయంగా నిస్సారంగా ఉన్న లోకంలో సహితం, యెహోవా మనలను కూడా కాపాడగలడనేందుకు ఇది ఒక జ్ఞాపికగా పని చేస్తుందని ఆశిద్దాం. అవును, నిజమైనవి కాకపోయినప్పటికీ మనం కూడా పాములూ తేళ్ల మధ్య నడుస్తున్నాము. మన ఆలోచనా విధానంపై సులభంగా ప్రభావం చూపే విషపూరితమైన మాటలను ఏ అడ్డూ అదుపులేకుండా కక్కే వారితో బహుశ మనం ప్రతి రోజూ కలవవలసి ఉండవచ్చు. (ఎఫెసీయులు 5:3, 4; 1 తిమోతి 6:20) ఈ అడ్డంకులున్నప్పటికీ దేవుని సేవ చేసేందుకు కృషిచేసేవారు అభినందనీయులు. వారి విశ్వాస్యత, యెహోవా వారిని నిజంగా కాపాడుతున్నాడనేందుకు దృఢమైన రుజువు.
కర్మెలు కొండలు
కర్మెలు అనే పేరుకు “ఫలవృక్షముల తోట” అని అర్థం. ఉత్తరంగా ఉన్న ఈ సారవంతమైన ప్రాంతం సుమారు 50 కిలోమీటర్ల పొడవుండి, ద్రాక్షాతోటలతోనూ ఒలీవ తోటలతోను మరియు ఫలాలనిచ్చే చెట్లతోనూ అలంకరింపబడి ఉంది. ఈ కొండ ప్రాంతం యొక్క పైభాగం దాని ఠీవి మరియు అందానికి చిరస్మరణీయం. యెషయా 35:2 ‘కర్మెలు సొగసును’ పునఃస్థాపిత ఇశ్రాయేలు దేశపు ఫలవంతమైన మహిమకు గుర్తుగా పేర్కొంటోంది.
కర్మెలులో గణనీయమైన సంఘటనలు అనేకం జరిగాయి. బయలు దేవత ప్రవక్తలను ఏలీయా సవాలు చేసిందీ, అప్పుడు తన సర్వాధిపత్యానికి నిదర్శనంగా ‘యెహోవా అగ్ని దిగినదీ’ ఇక్కడే. అంతేకాకుండా, ఇశ్రాయేలులోనున్న అనావృష్టిని అద్భుతమైన రీతిలో తీర్చిన పెద్ద వానగా మారిన చిన్న మేఘంవైపుకు కర్మెలు పర్వతంపైనుండే ఏలీయా అవధానాన్ని మరలించాడు. (1 రాజులు 18:17-46) షూనేమీయురాలు మరణించిన తన బిడ్డకొరకు సహాయాన్నర్థిస్తూ వచ్చినప్పుడు ఏలీయా తర్వాతివాడైన ఎలీషా కర్మెలు పర్వతం మీదే ఉన్నాడు, మరి ఆ తర్వాత ఎలీషా ఆ బిడ్డను పునరుత్థానం చేశాడు.—2 రాజులు 4:8, 20, 25-37.
కర్మెలు దిగుడులో ఇప్పటికీ ఫలవృక్షాలు, ఒలీవ వృక్షాలు, ద్రాక్ష చెట్లు ఉన్నాయి. వసంతరుతువులో ఈ దిగుడులు పూలతో అందంగా అలంకరింపబడతాయి. బహుశ షూలమ్మీతీ కురుల పుష్కలతనో ఆమె అందమైన శిరస్సు మెడ మీదుగా ఠీవిగా ఉండడాన్నో శ్లాఘిస్తూ సొలొమోను, “నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము” అని ఆమెతో అన్నాడు.—పరమగీతము 7:5.
ఆ కర్మెలు పర్వతాలకు ఆనవాలైన శోభ, యెహోవా తన ఆధునిక దిన ఆరాధికుల సంస్థపై కురిపించిన ఆత్మీయ అందాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. (యెషయా 35:1, 2) యెహోవాసాక్షులు నిజంగా ఆత్మీయ పరదైసులో ఉన్నారు మరియు “మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను” అని రాజైన దావీదు వ్యక్తపర్చిన భావాలతో వారు ఏకీభవిస్తారు.—కీర్తన 16:6.
నిజమే, ప్రాచీన ఇశ్రాయేలీయులు దేవుని శత్రులవుల నుండి ఎడతెగని వ్యతిరేకతను అనుభవించినట్లుగానే నేడు దేవుని ఆత్మీయ జనాంగం కూడా ఎదుర్కొనవల్సిన కష్టతరమైన సవాళ్లు ఉన్నాయి. అయినప్పటికీ, యెహోవా అనుగ్రహించిన ఆశీర్వాదాలను నిజమైన క్రైస్తవులు ఎల్లప్పుడూ ఎరిగి ఉంటారు. వాటిలో నిత్యం అధికమయ్యే బైబిలు సత్య వెలుగుతో సహా, ప్రపంచవ్యాప్త సహోదరత్వం మరియు పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందే అవకాశం ఉన్నాయి.—సామెతలు 4:18; యోహాను 3:16; 13:35.
“యెహోవా తోట వలె”
ప్రాచీన వాగ్దాన దేశం చూడముచ్చటగా ఉండేది. అది “పాలు తేనెలు ప్రవహించు” ప్రదేశంగా చక్కగా వర్ణించబడింది. (ఆదికాండము 13:10; నిర్గమకాండము 3:8) మోషే దాన్ని “మంచి దేశము . . . అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపు చెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవనూనెయు తేనెయు గల దేశము. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు” అని చెప్పాడు.—ద్వితీయోపదేశకాండము 8:7-9.
యెహోవా తన ప్రాచీన ప్రజలకు ఓ సుసంపన్నమైన, అందమైన స్వస్థలాన్ని ఆశీర్వాదంగా ఇవ్వగలిగినట్లైతే, తన ఆధునిక దిన విశ్వసనీయ సేవకులకు, భూవ్యాప్తంగా విస్తరించిన పర్వతాలు, లోయలు, నదులు సరస్సులతో ఓ మహిమాన్విత పరదైసును తప్పకుండా ఇవ్వగలడు. అవును, వైవిధ్యంతో కూడిన ప్రాచీన వాగ్దాన దేశం, ఆయన సాక్షులు నేడు అనుభవించే ఆత్మీయ పరదైసుకు మరియు నూతన లోకంలోని భవిష్యత్ పరదైసుకు ఒక ముంగుర్తు మాత్రమే. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు” అని కీర్తన 37:29 నందు వాగ్దానం చేయబడినది అక్కడ నెరవేరుతుంది. యెహోవా ఆ పరదైసు గృహాన్ని విధేయులైన మానవజాతికి ఇచ్చినప్పుడు, దానిలోని “గదులు” అన్నింటినీ పరిశీలించడంలో, అలా నిరంతరం చేయడంలో వారు ఎంత ఆనందాన్ని కల్గివుంటారోకదా!
[అధస్సూచీలు]
a ఈ ప్రాంతంలోని ఒక ద్రాక్ష గెల బరువు 12 కిలోలని మరొక దాని బరువు 20 కిలోలకంటే ఎక్కువని నమోదు చేయబడింది.
b గిహోను కొలను యెరూషలేము పడమటి సరిహద్దు వెలుపల ఉంది. అది ఓ గుహలో దాచబడివుంది; కనుక, అది ఉన్న సంగతి అష్షూరీయులకు తెలిసివుండకపోవచ్చు.
[4వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
గలిలయ
కర్మెలు పర్వతం
గలిలయ సముద్రము
సమరయ
షెఫెలా
యూదయ పర్వతాలు
ఉప్పు సముద్రము
[క్రెడిట్ లైను]
NASA photo
[4వ పేజీలోని చిత్రం]
షెఫెలా దేవుని ప్రజలకు మరియు వారి శత్రువులకు మధ్య అడ్డుగోడగా ఉండేది
MI 0 5 10
KM 0 8 16
ఫిలిష్తియ పల్లపు ప్రదేశం
షెఫెలా
యూదయ కొండ ప్రాంతము
యూదయ అరణ్యం
రిఫ్ట్ లోయ
ఉప్పు సముద్రము
అమ్మోనీయులు మరియు మోయాబీయుల దేశం
[5వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
హిజ్కియా నిర్మించిన సొరంగము: దృఢమైన కొండ గుండా చెక్కబడి 533 మీటర్ల పొడవుంటుంది
టైరోపియన్ లోయ
సిలోయము
దావీదు పట్టణం
కిద్రోను లోయ
గిహోను
[6వ పేజీలోని చిత్రం]
దావీదు సౌలు నుండి పారిపోయి యూదయ అరణ్యంలో ఆశ్రయాన్ని పొందాడు. తర్వాత, ఇక్కడే యేసు అపవాదిచే శోధించబడ్డాడు
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.
[7వ పేజీలోని చిత్రం]
ఏలీయా బయలు ప్రవక్తలను కర్మెలు పర్వతంపై అవమానపర్చాడు
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.
[8వ పేజీలోని చిత్రం]
“నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.”—ద్వితీయోపదేశకాండము 8:7