మైఖేల్ ఫారడే—విజ్ఞానశాస్త్రవేత్త మరియు విశ్వాసంగల వ్యక్తి
“విద్యుచ్ఛక్తికి జనకుడు.” “జీవించినవారిలోకెల్లా అత్యంత గొప్ప ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రవేత్త.” ఇవి, 1791లో ఇంగ్లాండునందు జన్మించిన మైఖేల్ ఫారడేను వర్ణించే రెండు వివరణలు, ఆయన కనుగొన్న విద్యుదయస్కాంత ప్రేరణ విద్యుత్ మోటార్ల అభివృద్ధికి, శక్తి ఉత్పత్తికి కారణమయ్యింది.
ఫారడే లండన్‌లోని రాయల్ ఇన్స్టిట్యూషన్లో రసాయన మరియు భౌతిక శాస్త్రాలపై విస్తృతంగా ఉపన్యాసాలిచ్చాడు. విజ్ఞానశాస్త్రాన్ని లోకప్రియం చేసేందుకు ఆయనిచ్చిన ఉపన్యాసాలు, యౌవనస్థులు సంక్లిష్టమైన విషయాలను గ్రహించడానికి సహాయం చేశాయి. ఆయన అనేక విశ్వవిద్యాలయాల నుండి అవార్డులు అందుకున్నాడు. అయినప్పటికీ ఆయన ప్రాచుర్యాన్ని తిరస్కరించాడు. ఆయన మతసంబంధంగా ఎంతో ఆసక్తిగలవాడు, తన మూడు గదుల గృహంలోని ఏకాంతతలో, తన కుటుంబం మరియు తోటి విశ్వాసుల సహచర్యంలో ఆయన ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఫారడే, “ఎంతో చిన్నదైన, తక్కువగా చూడబడిన క్రైస్తవుల తెగ” అని తాను వర్ణించిన, “. . . సాండెమాన్యన్స్ అని పిలువబడే తెగకు” చెందినవాడు. వారెవరు? వారేమి విశ్వసించారు? ఫారడేపై అవెలాంటి ప్రభావాన్ని చూపాయి?
సాండెమాన్యన్లు
“ఫారడే కుటుంబం మరియు సాండెమాన్యన్ చర్చి మధ్యనున్న తొలి సంబంధం మైఖేల్ ఫారడే తాతా నానమ్మల ద్వారా ఏర్పడింది” అని మైఖేల్ ఫారడే: సాండెమాన్యన్ అండ్ సైంటిస్ట్ అనే పుస్తక రచయితయైన జెఫ్రీ కాంటర్ తెలియజేస్తున్నాడు. వారు ఇంగ్లాండు చర్చికి చెందిన సంచార సేవకుని అనుచరులతో సహవసించేవారు, ఆ అనుచరులు సాండెమాన్యన్ నమ్మకాలను హత్తుకున్నారు.
రాబర్ట్ సాండెమాన్ (1718-71) ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా గణితము, గ్రీకు, ఇతర భాషలు చదువుతున్న కాలంలో, ఒకరోజు మాజీ ప్రెస్బిటేరియన్ పరిచారకుడైన జాన్ గ్లాస్ ప్రకటిస్తుండగా విన్నాడు. ఆయన విన్నది, ఆయన విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టి పెర్త్‌కు తిరిగి వచ్చి గ్లాస్ మరియు ఆయన సహవాసులతో కలిసేలా చేసింది.
1720లలో జాన్ గ్లాస్, స్కాట్లాండ్ చర్చి బోధలను కొన్నింటిని అనుమానించడం ప్రారంభించాడు. ఆయన దేవుని వాక్యాన్ని పఠించడం, బైబిలు నందలి ఇశ్రాయేలు జనాంగం, అనేక జనాంగాల నుండి వచ్చిన పౌరులుగల ఆత్మీయ జనాంగాన్ని సూచించిందనే ముగింపుకు ఆయన వచ్చేలా చేసింది. ప్రతి దేశం వేర్వేరు చర్చీలను కల్గివుండడం సరైనదనే దానికి సమర్థింపును ఆయన ఎక్కడా కనుగొనలేదు.
గ్లాస్ స్కాట్లాండ్ నందలి డూండీ వెలుపల ఉన్న టీలింగ్లోని తన చర్చి బోధలతో సంతృప్తిపడక, స్కాట్లాండ్ చర్చి నుండి విరమించుకొని తన స్వంత కూటాలను ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు వందమంది ఆయనతో కలిశారు, వారు మొదటి నుండి తమ స్థాయిలలో ఐక్యతను కాపాడుకోవలసిన అవసరత ఉందని గ్రహించారు. వారు తమ మధ్య ఉత్పన్నం కాగల ఏ విభేదాలను పరిష్కరించుకోవడానికైనా మత్తయి 18వ అధ్యాయంలోని 15 నుండి 17 వచనాలలో వ్రాయబడివున్న క్రీస్తు ఉపదేశాలను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత వారు వారపు కూటాలు జరుపుకునేవారు, అక్కడ ఒకే విశ్వాసంగలవారు ప్రార్థన మరియు ప్రోత్సాహం కొరకు కూడుకునేవారు.
కొంచెం ఎక్కువమంది ప్రజలు వివిధ గుంపుల కూటాలకు క్రమంగా హాజరుకావడం ప్రారంభించినప్పుడు, వారి ఆరాధనను పర్యవేక్షించడానికి బాధ్యతగల పురుషులు అవసరమయ్యారు. కాని ఎవరు అర్హులయ్యారు? ఈ విషయం గురించి అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడనే దాని ఎడల జాన్ గ్లాస్ మరియు ఆయన సహవాసులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) విశ్వవిద్యాలయ విద్య గురించిగాని, హెబ్రీ మరియు గ్రీకు భాషలను అర్థం చేసుకోవడం అవసరమనిగాని చెప్పబడినట్లు వారు కనుగొనలేదు. కాబట్టి, లేఖనాధార సూత్రాలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించిన తర్వాత, వారు అర్హతగల పురుషులను పెద్దలుగా నియమించారు. స్కాట్లాండ్ చర్చి ఎడల నమ్మకంగా ఉన్న వారు దాన్ని, “బీదరికంలో పెరిగిన” నిరక్షరాస్యులైన వీరు బైబిలును అర్థం చేసుకుని దాని సందేశాన్ని ప్రకటించడానికి ప్రయత్నించడం “దాదాపు దేవదూషణ వంటిదిగా” పరిగణించారు. 1733లో గ్లాస్ మరియు ఆయన తోటి విశ్వాసులు పెర్త్ పట్టణంలో తమ స్వంత సమావేశ మందిరాన్ని నిర్మించుకున్నప్పుడు, వారిని పట్టణంలో నుండి వెళ్లగొట్టమని స్థానిక మతనాయకులు మేజిస్ట్రేటులపైకి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు. మతనాయకులు విఫలమయ్యారు, ఉద్యమం పెరిగింది.
రాబర్ట్ సాండెమాన్ గ్లాస్ పెద్ద కుమార్తెను వివాహం చేసుకున్నాడు, 26 సంవత్సరాల వయస్సులో గ్లాసైట్ల పెర్త్ సంఘంలో ఆయన పెద్ద అయ్యాడు. ఒక పెద్దగా ఆయన బాధ్యతలు ఎంత భారమైనవిగా ఉండేవంటే, ఆయన తన పర్యవేక్షణా పనికే మొత్తం తన సమయమంతా వెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత, ఆయన భార్య మరణించాక, రాబర్ట్ “చర్చి పని కొరకు తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువు సేవ చేయడానికి ఆనందంగా అంగీకరించాడు” అని ఒక జీవిత సంగ్రహం తెలియజేస్తుంది.
సాండెమాన్యనిజం వ్యాప్తి చెందడం
సాండెమాన్ తన పరిచర్యను స్కాట్లాండ్ నుండి ఇంగ్లాండ్ వరకు ఉత్సాహంతో విస్తరింపజేశాడు, అక్కడ తోటి విశ్వాసుల క్రొత్త గుంపులు వృద్ధి చెందాయి. ఆ సమయంలో, ఆంగ్లేయ కల్వినిస్టులలో వివాదం చెలరేగింది. తాము రక్షణ కొరకు ముందే నిర్ణయింపబడ్డామని వారిలో కొంతమంది విశ్వసించారు. అయితే మరోవైపున, సాండెమాన్, విశ్వాసం తప్పనిసరి అని నమ్మినవారి పక్షం వహించాడు. ఈ దృక్కోణానికి మద్దతుగా, ఆయన ఒక పుస్తకాన్ని ప్రచురించాడు, అది నాలుగుసార్లు పునఃముద్రింపబడింది, రెండు అమెరికన్ సంపుటిలలో కూడా ప్రచురితమైంది. జెఫ్రీ కాంటర్ చెప్పేదాని ప్రకారం, ఈ సంపుటి యొక్క ప్రచురణ “[సాండెమాన్యన్] తెగను దాని ప్రాంతీయ స్కాటిష్ ఆరంభాలకంటే విస్తృతం చేసిన ఏకైక అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనై ఉంది.”
సాండెమాన్ మరియు ఆయనతోపాటు ఇతర గ్లాసైట్ పెద్దలు 1764లో అమెరికాకు ప్రయాణించారు, ఆ సందర్శనం ఎంతో వివాదాన్ని, వ్యతిరేకతను రేకెత్తించింది. అయినప్పటికీ, కనెక్టికట్, డానబెరిలో ఒకే అభిప్రాయంగల క్రైస్తవుల గుంపును నెలకొల్పడానికి అది కారణమయ్యింది.a అక్కడ, 1771లో సాండెమాన్ మరణించాడు.
ఫారడే మతసంబంధమైన నమ్మకాలు
చిన్నవాడైన మైఖేల్ తన తలిదండ్రుల సాండెమాన్యన్ బోధలను గ్రహించాడు. బైబిలు బోధించేదాన్ని అనుసరించని వారి నుండి సాండెమాన్యన్లు వేరుగా ఉండేవారని ఆయన తెలుసుకున్నాడు. ఉదాహరణకు, వారు తమ వివాహ వేడుకలను చట్టబద్ధంగా అవసరమైనవాటి వరకే పరిమితం చేయడాన్ని ఇష్టపడుతూ, ఆంగ్లికన్ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించారు.
ప్రభుత్వానికి విధేయులైయుండడం, అయినప్పటికీ రాజకీయాల్లో తటస్థంగా ఉండడం సాండెమాన్యన్ల ప్రత్యేకత. సమాజంలో గౌరవింపబడే సభ్యులైనప్పటికీ, వారు ప్రభుత్వపరమైన ఉన్నత పదవులను అరుదుగా అంగీకరించేవారు. కాని కొన్ని సందర్భాల్లో వారు వాటిని అంగీకరించినప్పటికీ, పార్టీ రాజకీయాలను విసర్జించేవారు. వారు అలా చేయడం వారిపైకి అపనిందను తీసుకువచ్చింది. (యోహాను 17:14 పోల్చండి.) దేవుని పరలోక రాజ్యం ప్రభుత్వానికి పరిపూర్ణ ఏర్పాటని సాండెమాన్యన్లు విశ్వసించారు. వారు రాజకీయాలను “అల్పమైన, నీచమైన, నైతికత కొరవడిన యుక్తిగా” దృష్టించేవారని కాంటర్ తెలియజేస్తున్నాడు.
ఇతరుల నుండి వేరుగా ఉన్నప్పటికీ, వారు పరిసయ్యులవంటి దృక్పథాలను చేపట్టలేదు. వారిలా ప్రకటించారు: “ప్రాచీన పరిసయ్యుల స్ఫూర్తిని, ఆచారాన్ని విసర్జించడం కచ్చితంగా అవసరమని మేము తీర్మానిస్తున్నాము, అందుకే లేఖనాలు వేటిని పాపాలని, విధులని నిర్ణయించాయో వాటికి మించిన వాటిని రూపొందించడాన్ని, మానవ సాంప్రదాయాల ద్వారా లేక తర్కబద్ధమైన చమత్కారాల ద్వారా దైవిక సూత్రాలను నిరర్థకం చేయడాన్ని మేము విసర్జిస్తాము.”
తమ సభ్యులలో ఎవరైనా త్రాగుబోతుగా, దోచుకొనువానిగా, జారునిగా, లేక ఇతర గంభీరమైన పాపాలను చేసేవారిగా తయారైతే, వారిని సంఘంలోనుండి వెలివేసే లేఖనాధార ఆచారాన్ని వారు అనుసరించారు. ఒక పాపి నిజంగా పశ్చాత్తాపపడితే, వారు ఆయనను తిరిగి చేర్చుకోవడానికి ప్రయత్నించేవారు. లేకపోతే, ‘దుర్మార్గుని వెలివేయమని’ ఇవ్వబడిన లేఖనాధార ఆజ్ఞను వారు అనుసరించేవారు.—1 కొరింథీయులు 5:5, 11, 13.
రక్తాన్ని విసర్జించమని బైబిలునందు ఇవ్వబడిన ఆజ్ఞకు సాండెమాన్యన్లు విధేయులయ్యారు. (అపొస్తలుల కార్యములు 15:29) మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినవద్దని దేవుడు మొదటి మానవులకు ఎలా ఆజ్ఞాపించాడో అలాగే, రక్తంపై విధింపబడిన నిర్బంధానికి దేవుని ప్రజలు విధేయత చూపించవలసి ఉందని జాన్ గ్లాస్ వాదించాడు. (ఆదికాండము 2:16, 17) రక్తానికి సంబంధించిన ఆజ్ఞకు అవిధేయత చూపించడమన్నది, క్రీస్తు రక్తాన్ని సరైన విధంగా ఉపయోగించడాన్ని, అంటే పాప ప్రాయశ్చిత్తాన్ని నిరాకరించడంతో సమానమైనది. గ్లాస్ ఇలా తెలియజేశాడు: “రక్తాన్ని తినడాన్ని నిషేధించడం ఎప్పుడూ ఉన్నదే, ఇప్పటికీ అది అత్యంత గొప్ప, అత్యున్నతమైన ప్రాముఖ్యత గలది.”
సాండెమాన్యన్లు లేఖనాలపై చేసిన తర్కం, అనేక ఉరులను తప్పించుకోవడానికి వారికి సహాయం చేసింది. ఉదాహరణకు, వినోదం విషయంలో, వారు క్రీస్తు ఉపదేశాలను నిర్దేశక సూత్రాలుగా దృష్టించేవారు. “క్రీస్తు ఆజ్ఞలు ఇవ్వని విషయాల్లో మేము ఆజ్ఞలు ఇవ్వడానికి సాహసించము, అంతేగాక ఆయనిచ్చిన ఏ ఆజ్ఞలను తీసివేయము. కాబట్టి, బహిరంగమైనదైనా లేక వ్యక్తిగతమైనదైనా వినోదం నిషేధింపబడినట్లు మనం ఎక్కడా కనుగొనలేము గనుక నిజంగా పాపభరితమైనవైన పరిస్థితులతో సంబంధంలేనంత వరకు ఏ వినోదాన్నైనా మేము న్యాయబద్ధమైనదిగానే పరిగణిస్తాము” అని వారు తెలియజేశారు.
సాండెమాన్యన్లు లేఖనాలపై కచ్చితంగా ఆధారపడివున్న అనేక దృక్పథాలను విశ్వసించినప్పటికీ, నిజ క్రైస్తవులను గుర్తించే చర్య యొక్క ప్రాముఖ్యతను వారు గ్రహించలేదు, అదేమిటంటే ప్రతి ఒక్కరు ఇతరులకు రాజ్య సువార్తను ప్రకటించాలన్నదే. (మత్తయి 24:14) అయితే, వారి కూటాలకు అందరూ ఆహ్వానితులే, అక్కడ తమ నిరీక్షణ గురించి హేతువడిగిన వారందరికీ సమాధానమిచ్చేందుకు వారు ప్రయత్నించేవారు.—1 పేతురు 3:15.
ఈ విధమైన నమ్మకాలు విజ్ఞానశాస్త్రవేత్తయైన మైఖేల్ ఫారడేపై ఎలా ప్రభావం చూపించాయి?
సాండెమాన్యన్ అయిన ఫారడే
తన విశేషమైన ఆవిష్కరణలనుబట్టి గౌరవింపబడిన, కొనియాడబడిన, ఉన్నతంగా ఎంచబడిన మైఖేల్ ఫారడే చాలా సాధారణమైన జీవితాన్ని గడిపాడు. పేరుపొందిన వ్యక్తులు మరణిస్తే, వారి అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు కావాలని ఎదురు చూడడం జరిగినప్పుడు, ఫారడే సాధారణంగా హాజరయ్యేవాడు కాదు, ఇంగ్లాండ్ చర్చి ఆరాధనకు హాజరై దానిలో భాగం వహించేందుకు ఆయన మనస్సాక్షి అనుమతించేది కాదు.
ఒక విజ్ఞానశాస్త్రవేత్తగా ఫారడే తాను వాస్తవాలని నిరూపించగలవాటినే హత్తుకొని ఉండేవాడు. తమ స్వంత ఊహలను పెంపొందింపజేసి ఆ విషయాలకు సంబంధించి పక్షాలు వహించిన విద్యావంతులతో సన్నిహితంగా ఉండడాన్ని ఆయన నివారించేవాడు. ఆయన ఒకసారి ప్రేక్షకులతో చెప్పినట్లుగా, ‘వాస్తవమని చెప్పబడిన ఒక విషయం మనల్ని ఎన్నడూ విఫలం చేయదు, దాని సాక్ష్యం ఎప్పుడూ నిజమైనదే.’ విజ్ఞానశాస్త్రం ‘జాగ్రత్తగా గమనించబడిన వాస్తవాలపై’ ఆధారపడినదని ఆయన వర్ణించాడు. ప్రకృతి యొక్క ప్రాథమిక శక్తులపై ఒక ప్రసంగాన్ని ముగిస్తూ, “వాటిని సృష్టించిన వానిని” ధ్యానించమని ఫారడే తన ప్రేక్షకులను ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఆయన క్రైస్తవ అపొస్తలుడైన పౌలు యొక్క ఈ మాటలను ఉదాహరించాడు: “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.”—రోమీయులు 1:20.
అనేకమంది ఇతర విజ్ఞానశాస్త్రవేత్తల నుండి ఫారడేను ఎంతో భిన్నంగా ఉంచినదేమిటంటే, దేవుని ప్రేరేపిత పుస్తకం నుండి, అలాగే ప్రకృతి పుస్తకం నుండి నేర్చుకోవాలన్న ఆయన కోరికనే. “ఆయన తన సాండెమాన్యనిజం ద్వారా దేవుని నైతిక సూత్రాలకు, నిత్యజీవాన్ని గూర్చిన వాగ్దానానికి అనుగుణంగా జీవించడానికి మార్గాన్ని కనుగొన్నాడు. ఆయన తన విజ్ఞానశాస్త్రం ద్వారా, విశ్వాన్ని నడిపేందుకు దేవుడు ఎంపిక చేసుకున్న భౌతిక సూత్రాలతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు” అని కాంటర్ తెలియజేస్తున్నాడు. “బైబిలు యొక్క సంపూర్ణ అధికారాన్ని విజ్ఞానశాస్త్రం ఎంతమాత్రం తక్కువ చేయలేదు, బదులుగా విజ్ఞానశాస్త్రాన్ని నిజంగా క్రైస్తవ విధానంలో ఆచరించినట్లయితే, అది దేవుని మరో పుస్తకాన్ని ప్రకాశమానం చేయగలదు” అని ఫారడే విశ్వసించాడు.
ఫారడేకు అన్వయింపజేయాలని ఇతరులు కోరుకున్న అనేక గౌరవాలను ఆయన వినయంగా తిరస్కరించాడు. ఆయన నైట్హుడ్నందు తరచూ నిరాసక్తత కనబరచాడు. ఆయన ‘సాధారణమైన ఫారడేగా’ మిగిలిపోవడాన్నే ఇష్టపడ్డాడు. నార్‌ఫాక్ అనే కుగ్రామంలో నివసిస్తున్న, ఒకే విధమైన అభిప్రాయాలుగల విశ్వాసుల చిన్న గుంపు గురించి శ్రద్ధ వహించడానికి రాజధాని నుండి అక్కడికి క్రమంగా ప్రయాణించడంతో సహా, పెద్దగా తన కార్యకలాపాలకు ఆయన ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు.
మైఖేల్ ఫారడే 1867, ఆగస్టు 25న మరణించాడు, ఉత్తర లండన్‌లోని హైగేట్ శ్మశానంలో ఆయన సమాధి చేయబడ్డాడు. ఫారడే “మరే ఇతర భౌతిక శాస్త్రవేత్త కంటే ఎంతో ఎక్కువ పరిమాణంలో స్వచ్ఛమైన వైజ్ఞానిక సాఫల్యాన్ని సాధించాడు, ఆయన ఆవిష్కరణల ఆచరణాత్మకమైన పరిణామాలు నాగరిక జీవిత నైజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి” అని జీవిత చరిత్రకారుడైన జాన్ థామస్ మనకు తెలియజేస్తున్నాడు. గతించిన ఫారడే భార్యయైన సేరా ఇలా వ్రాసింది: “ఆయన నిర్దేశకం మరియు కట్టడ క్రొత్త నిబంధన అని మాత్రమే నేను చెప్పగలను; ఎందుకంటే ఆయన దాన్ని, . . . అది వ్రాయబడినప్పుడు ఎంత అవశ్యపాలనీయమైనదో ప్రస్తుత దిన క్రైస్తవులకు అంతే అవశ్యపాలనీయమైనదైన . . . దేవుని వాక్యంగా పరిగణించాడు.”—తన విశ్వాసానికి అనుగుణంగా భక్తితో జీవించిన ఒక ప్రముఖ విజ్ఞానశాస్త్రవేత్తకు వాగ్ధాటితో కూడిన సాక్ష్యము.
[అధస్సూచీలు]
a అమెరికాలో చివరగా మిగిలివున్న సాండెమాన్యన్, లేక గ్లాసైట్ గుంపు ఈ శతాబ్దారంభంలో అంతరించిపోయింది.
[29వ పేజీలోని బాక్సు]
బ్రిటన్స్ రాయల్ ఇన్స్టిట్యూషన్లో అధ్యాపకునిగా నియమింపబడిన మైఖేల్ ఫారడే, యౌవనులు సహితం అర్థం చేసుకునే విధంగా విజ్ఞానశాస్త్రాన్ని వ్యాప్తిలోకి తెచ్చాడు. ఆయన తన తోటి అధ్యాపకులకు ఇచ్చిన ఉపదేశంలోని ఆచరణాత్మకమైన సలహాలను, బహిరంగంగా బోధించే ఆధునిక దిన క్రైస్తవులు పరిశీలించడం అవసరం.
◻ “ఉద్ధృతంగా, తొందరపాటుతో ప్రసంగించకూడదు, అలా చేస్తే అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి మెల్లిగా, ఉద్దేశపూర్వకంగా ప్రసంగించాలి.”
◻ ఒక ప్రసంగికుడు “ప్రసంగారంభంలోనే” తన ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నించాలి. “అగోచరమైన క్రమాల పరంపరతో, ప్రేక్షకులు దాన్ని గుర్తించలేని విధంగా, విషయానికి సంబంధించి అవసరమైనంత వరకు వారి ఆసక్తిని అలాగే సజీవంగా ఉంచాలి.”
◻ “ఒక ప్రసంగికుడు కరతాళధ్వనుల కొరకు ఎంతో క్రిందికి దిగజారితే, మెప్పును కోరితే, ఆయన తన స్థానానికున్న గౌరవం నుండి అధఃస్థితికి పడిపోతాడు.”
◻ నోట్సు ఉపయోగించడంపై: “[విషయానికి] సంబంధించి కాగితం మీద ఒక పథకం వేసుకుని, విషయాలకు సంబంధించిన వాటిని ఊహించుకోవడం ద్వారా లేక మరో విధంగానైనా వాటిని మనస్సులో మననం చేసుకుంటూ ఆయా భాగాల్లో వాటిని నింపడం . . . నా బాధ్యత అని నేను ఎల్లప్పుడు భావిస్తాను. . . . నేను పెద్ద, చిన్న శీర్షికలను ఒక క్రమంలో వ్రాసుకుని, వీటి ఆధారంగా నేను నా విషయాంశాలను రూపొందిస్తాను.”
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Both pictures: By courtesy of the Royal Institution