దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
ఎడిత్ మైకెల్ చెప్పినది
ఓ యెహోవాసాక్షి, 1930 తొలికాలంలో మా ఇంటికి వచ్చినప్పుడు మేము అమెరికాలోని మిస్సోరీ సెయింట్. లూయి సమీపంలో ఉండేవాళ్లం. సరిగ్గా ఆ సమయంలోనే బట్టలు ఆరేసి ఉన్న త్రాడు తెగడంతో, అమ్మ తళతళ మెరిపించిన తెల్లబట్టలు బురదలో పడిపోయాయి. సాక్షి వెళ్లిపోతుందికదా అని ఆమె అందించిన పుస్తకాలను అమ్మ తీసుకుంది, తర్వాత వాటిని అలమారాపై పెట్టి మర్చిపోయింది.
ఆ సంవత్సరాల్లో మేము ఆర్థిక మాంధ్యాన్ని అనుభవించాము, మరి నాన్నగారికి ఉద్యోగం లేదు. ఒకరోజు ఆయన చదవడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అమ్మ ఆ పుస్తకాలను గూర్చి ఆయనతో చెప్పింది. ఆయన దాన్ని చదవడం ప్రారంభించి, కొంత సమయం గడిచాక, “ఏమ్మా, ఇదే సత్యం!” అని ఆనందంతో కేకవేశాడు.
“ఆ, అన్ని మతాల్లాగే డబ్బు తీసుకునే ఇంకో మతం అది” అని ఆమె బదులిచ్చింది. అయినప్పటికీ, కూర్చుని తనతో లేఖనాలను చూడమని నాన్నగారు పట్టుపట్టారు. ఆమె అలా చేసినప్పుడు, ఆమె కూడా ఒప్పించబడింది. ఆ తర్వాత వాళ్లు సాక్షులకొరకు వెదకడం ప్రారంభించారు, మరి సెయింట్. లూయి సెంటర్ సమీపంలోని ఓ అద్దె హాలులో సాక్షులు కూడుకుంటున్నారని కనుగొన్నారు. ఆ హాలు, నృత్యాలూ ఇతర కార్యక్రమాలను జరుపుకునేందుకు కూడా ఉపయోగించబడేది.
అప్పుడు నాకు మూడేళ్లు, అమ్మానాన్నలు నన్ను వెంటతీసుకువెళ్లారు, ఆ హాలును కనుక్కున్నారు, కానీ అప్పుడు అక్కడ నృత్యం జరుగుతోంది. కూటాలు ఎప్పుడు జరుగుతాయో నాన్నగారు తెలుసుకున్నారు, మేము తిరిగి కూటానికి వెళ్లాము. మేము ఉండే స్థలానికి సమీపంలో ఉన్న వారపు బైబిలు పఠనానికి మేము హాజరవ్వడం కూడా ప్రారంభించాము. మొదటిసారి మా ఇంటికి వచ్చిన స్త్రీ ఇంట్లో అది జరిగేది. “మీరు మీ కుమారులను కూడా తీసుకురావచ్చుకదా?” అని ఆమె అన్నది. వాళ్లకు జోళ్లు లేవని చెప్పేందుకు అమ్మకు అవమానమనిపించింది. చివరికి ఆమె చెప్పింది, సాక్షులు వాళ్లకు వాటిని ఇప్పించారు, నా సోదరులు మాతోపాటు కూటాలకు హాజరయ్యారు.
ప్రకటించడానికి అమ్మకు మా ఇంటి దగ్గిర ఓ ప్రాంతం ఇవ్వబడింది, ఆమె ఇంటింటి పరిచర్యను ప్రారంభించింది. నేను ఆమె వెనకాలే దాక్కుని దాక్కుని వెళ్లేదాన్ని. అమ్మ కారు నడపడం నేర్చుకునేంత వరకూ మేము ఓ మైలు దూరం నడిచి, సెయింట్. లూయిలో జరిగే కూటానికి వెళ్లే బస్సును ఎక్కేవాళ్లం. ఐసు, మంచు ఉన్నప్పటికీ మేమెన్నడూ కూటాలను మానలేదు.
1934లో అమ్మానాన్నలిద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు. నేను బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాను, నాతో మాట్లాడమని ఓ వృద్ధ సాక్షిని అమ్మ అడిగేంతవరకూ నేను అమ్మను అడుగుతూనే వచ్చాను. నేను అర్థం చేసుకోగలిగే విధంగా ఆయన నన్ను ఎన్నో ప్రశ్నలను అడిగాడు. ఆ తర్వాత, బాప్తిస్మం తీసుకోకుండా నన్ను నివారించకూడదని ఆయన మా తలిదండ్రులతో చెప్పాడు; అలా చేయడం నా ఆత్మీయ పెరుగుదలకు హానికల్గించవచ్చన్నాడు. కనుక ఆ తర్వాతి వేసవిలో, అంటే నాకు ఇంకా ఆరేళ్లున్నప్పుడే నేను బాప్తిస్మం తీసుకున్నాను.
గృహం మరియు సంతోషం (ఆంగ్లం) అనే చిన్నపుస్తకం నాకు మహా ఇష్టం, దాన్ని నేను ఎప్పుడూ నాదగ్గిరే పెట్టుకునేదాన్ని, పడుకునేటప్పుడు కూడా నా తలదిండు క్రింద పెట్టుకునేదాన్ని. దాన్ని నా కొరకు మళ్లీ మళ్లీ చదివి వినిపించమని నేను అమ్మను బ్రతిమాలేదాన్ని, చివరకు నాకు ఆ చిన్నపుస్తకం మొత్తం కంఠాపాఠం వచ్చేసింది. ఆ చిన్న పుస్తకం వెనక వైపున ఓ చిన్న పాప పరదైసులో ఓ సింహంతో ఉన్న బొమ్మ ఉంది. ఆ చిన్న పాప నేనేనని అనేదాన్ని. దేవుని నూతన లోకంలోని జీవమనే ప్రతిఫలంపై నా దృష్టిని ఉంచేందుకు ఆ బొమ్మ నాకు సహాయపడింది.
నాకు పరమ సిగ్గు, కానీ నేను వణుకుతున్నప్పటికీ, సంఘంలోని కావలికోట పఠనంలో నేను ఎప్పుడూ జవాబులు చెప్పేదాన్ని.
నాన్న తన ఉద్యోగాన్ని కోల్పోతానేమోనన్న భయంతో తాను సాక్షులతో సహవాసం మానేయడం విషాదకరం. నా సోదరులు కూడా అలాగే చేశారు.
పూర్తికాల సేవ
పయినీర్లు లేక పూర్తికాల సేవకులు తమ ట్రేలర్లను మా ఇంటి వెనక చావడిలో ఉంచేందుకు అమ్మ అనుమతించేది, పాఠశాల అయిపోయిన తర్వాత నేను వారితో పరిచర్యలో పాల్గొనేదాన్ని. నేను కూడా పయినీరు సేవ చేయాలని నాకు ఇష్టం ఉండేది, కానీ నేను ఇంకా పైచదువులు చదవాలన్న అభిప్రాయంతో నాన్న అందుకు వ్యతిరేకించారు. నన్ను పయినీరు సేవ చేసేందుకు అనుమతించేలా చివరికి అమ్మ ఆయన్ను ఒప్పించింది. కనుక 1943 జూన్‌లో నాకు 14 ఏళ్లున్నప్పుడు నేను పూర్తికాల పరిచర్యను ప్రారంభించాను. ఇంటిఖర్చులకు సహాయపడేందుకు నేను పార్ట్ టైమ్ పని చేసేదాన్ని మరి కొన్నిసార్లు ఫుల్ టైమ్ పని చేసేదాన్ని. అయినప్పటికీ ప్రకటనా పనిలో నేను ప్రతి నెలా 150 గంటలు చేయగలిగేదాన్ని.
కొంత కాలం తర్వాత, డోరతీ క్రేడన్ అనే పయినీరు భాగస్వామి నాకు లభించింది, ఆమె 1943 జనవరిలో అంటే ఆమెకు 17 సంవత్సరాలున్నప్పుడు పయినీరు సేవను ప్రారంభించింది. ఆమె సమర్పిత కాథోలిక్గా ఉండేది కానీ, ఆరు నెలల బైబిలు పఠనం తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుంది. అనేక సంవత్సరాలవరకు ఆమె నాకు, నేను ఆమెకు ప్రోత్సాహానికి బలానికి ఆధారాలమయ్యాము. మేము తోడబుట్టినవారికంటే సన్నిహితులమయ్యాము.
1945లో ప్రారంభించి, సంఘాలేలేని ప్రాంతమైన మిస్సోరీలోని చిన్నచిన్న పట్టణాల్లో మేము పయినీరు సేవ చేశాము. బోలింగ్ గ్రీన్ పట్టణంలో కూటాల హాలును మేము సరిచేశాము; అమ్మ కూడా వచ్చి మాకు సహాయం చేసింది. తర్వాత మేము ప్రతివారం ప్రజలందరి ఇంటికి వెళ్లి బహిరంగ ప్రసంగానికి రమ్మని వాళ్లను ఆహ్వానించేవాళ్లం. సెయింట్. లూయి నుండి సహోదరులు వచ్చి ఆ బహిరంగ ప్రసంగాలు ఇచ్చేందుకు మేము ఏర్పాటు చేశాము. ప్రతివారం సుమారు 40 నుండి 50 మంది హాజరయ్యే వారు. లౌసీయానాలో కూడా మేము అదే చేసేవాళ్లం, అక్కడ మేము ఓ మసోనిక్ ఆలయాన్ని అద్దెకు తీసుకున్నాము. హాలు అద్దె ఖర్చులను తీర్చేందుకు మేము చందా పెట్టెలను పెట్టాము, ప్రతివారం ఆ ఖర్చులన్నీ తీరేవి.
తర్వాత మేము మెక్సికోలోని మిస్సోరీకి వెళ్ళి ఓ అంగడి వెనుకున్న గదిని అద్దెకు తీసుకున్నాము. అక్కడున్న ఓ చిన్న సంఘం ఉపయోగించేందుకు మేము దాన్ని సరిచేశాము. ఆ భవనం ప్రక్కన దానికి ఆనుకుని గదులుండేవి వాటిలో మేము ఉండేవాళ్లం. మెక్సికోలో బహిరంగ ప్రసంగాలను ఏర్పాటు చేసేందుకు కూడా మేము సహాయపడ్డాము. ఆ తర్వాత ఆ రాష్ట్ర రాజధానియైన జెఫ్ఫర్సన్ పట్టణానికి వెళ్లి, అక్కడ పని వారాల్లోని ప్రతి మొదటి రోజు ఉదయం మేము ప్రభుత్వ ఉద్యోగులను వారి కార్యాలయాల్లో సంప్రదించే వాళ్లం. రాజ్యమందిరం పైనున్న ఒక గదిలో మేము స్టెల్లా విల్లీతో నివసించే వాళ్లం, ఆమె మాకు తల్లిలా ఉండేది.
అక్కడ నుండి మేము ముగ్గురమూ ఫెస్టస్ మరియు క్రిస్టల్ సిటీకి వెళ్లాం అవి ఒకదానిదగ్గిర ఒకటి ఉన్నాయి. ఆసక్తిగల ఒక కుటుంబం ఉండే ఇంటి వెనుక కోళ్లఫారమ్ను ఇంటిగా మార్చిన దానిలో మేము నివసించాము. బాప్తిస్మం తీసుకున్న సహోదరులు ఎవరూ లేనందువల్ల, మేమే అన్ని కూటాలనూ నిర్వహించేవాళ్లం. పార్ట్ టైమ్ పనిని చేసేందుకు, మేము అలంకరణ సామాగ్రిని అమ్మేవాళ్లం. వస్తుపరంగా మాదగ్గిర చాలా తక్కువగా ఉండేది. వాస్తవానికి, మా షూలలో ఉన్న రంధ్రాలను సరిచేయించుకునేంత డబ్బు కూడా మాకు లేకపోయింది, కనుక ప్రతిరోజు ఉదయం మేము ఓ క్రొత్త కార్డ్‌బోర్డు ముక్కలను పెట్టుకునేవాళ్లం మరి రాత్రిళ్లు మాకున్న ఆ ఒకే ఒక జత బట్టలు ఉతుక్కునేవాళ్లం.
1948 తొలి భాగంలో, నాకు 19 ఏళ్లున్నప్పుడు, డోరతీకి నాకూ వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 12వ తరగతికి ఆహ్వానం వచ్చింది. ఐదునెలల కోర్సు తర్వాత 1949, ఫిబ్రవరి 6న 100 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. అది ఎంతో ఆనందమయమైన సమయం. మా తలిదండ్రులు కాలిఫోర్నియాలో ఉంటున్నారు, మరి అమ్మ కూడా దానికి హాజరయ్యేందుకు అంతదూరం నుండి వచ్చింది.
మా నియామకానికి వెళ్లడం
ఇరవై ఎనిమిదిమంది పట్టభద్రులు ఇటలీకి నియమించబడ్డారు, నేనూ డోరతీతో సహా ఆరుగురు మిలాన్ పట్టణానికి పంపించబడ్డాం. 1949 మార్చి 4న ఇటాలియన్ నౌక వుల్కానియాలో మేము న్యూయార్క్ నుండి బయల్దేరాము. ఆ యాత్రకు 11 రోజులు పట్టింది, అలజడిగల సముద్రం మాలో అనేకులను అస్వస్థులను చేసింది. మమ్మల్ని కలిసి రైలు ద్వారా మిలాన్‌కు తిరిగి తీసుకు వెళ్లేందుకు, సహోదరుడైన బినాన్టీ గినోయా నౌకాశ్రయానికి వచ్చాడు.
మిలాన్‌లోని మిషనరీ గృహానికి మేము చేరుకున్నప్పుడు, యౌవనస్థురాలైన ఓ అమ్మాయి మా అందరి గదుల్లో పూలు పెట్టిందని మేము కనుగొన్నాము. సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి మారియా మెరాఫినా, గిలియడ్‌కు వెళ్ళి తిరిగి ఇటలీకి వచ్చింది, అక్కడ నేనూ ఆమె కలిసి మిషనరీ గృహంలో సేవ చేశాము!
మేము మిలాన్ చేరుకున్న రోజు ఉదయం, మేము స్నానాల గదినుండి బైటికి చూశాము. ఇంటి వెనక వీధిలో బాంబువల్ల ధ్వంసమైన ఓ పెద్ద భవనం ఉంది. బాంబులు వేసే ఒక అమెరికా విమానం, 80 కుటుంబాలు నివసించే ఆ భవనంపై పొరపాటున బాంబు వేసింది. మరోసారి, ఓ కర్మాగారంపై వేయాల్సిన బాంబు గురితప్పి ఓ పాఠశాలపైపడింది, దానితో 500 మంది పిల్లలు చనిపోయారు. కనుక అక్కడి ప్రజలకు అమెరికావాళ్ళంటే అంత ఇష్టం ఉండేది కాదు.
ప్రజలు యుద్ధంవల్ల విసిగిపోయి ఉన్నారు. ఇంకో యుద్ధం మొదలైతే, బాంబుల దాడికి తట్టుకోగల ఆశ్రయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి గాస్ ఆన్ చేసి అక్కడే చచ్చిపోతామని అనేకమంది ప్రజలు అన్నారు. మేము అమెరికాకు గానీ ఏ ఇతర మానవ ప్రభుత్వానికి గానీ ప్రాతినిధ్యం వహించడం లేదుకానీ యుద్ధాలనూ అవి తీసుకువచ్చే బాధలనూ అంతమొందించే దేవుని రాజ్యానికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని హామీ ఇచ్చాము.
పెద్ద పట్టణమైన మిలాన్‌లో ఇంచుమించు 20 మంది ఉన్న ఒకేఒక సంఘం మిషనరీ గృహంలో కూడుకునేది. ప్రకటించేందుకు ప్రాంతాలను ఇంకా చూసుకోలేదు, కనుక మేము ఓ పెద్ద అపార్ట్మెంటులో సాక్ష్యమివ్వడం ప్రారంభించాము. మొదటి ఇంట్లో మేము జాండీనాటీ గారిని కలిశాము, తన భార్య చర్చిని విడనాడాలని అతను ఇష్టపడేవాడు కనుక అతను మా ప్రచురణలను తీసుకున్నాడు. శ్రీమతి జాండీనాటీ యథార్థపరురాలు, ఆమెకు చాలా సందేహాలుండేవి. “మీరు ఇటాలియన్ నేర్చుకుంటే నేను సంతోషిస్తాను ఎందుకంటే అప్పుడు మీరు నాకు బైబిలును నేర్పించగలరు కదా” అని ఆమె అన్నది.
వాళ్ల అపార్ట్మెంటులోని పైకప్పులు చాలా ఎత్తుగా ఉండేవి అంతేకాకుండా వెలుగు చాలా తక్కువగా ఉండేది కనుక రాత్రుళ్లు బైబిలు చదివేందుకు లైటుకు దగ్గిరగా ఉండేలా ఆమె కుర్చీని బల్లపై వేసుకుని అందులో కూర్చునేది. “నేను మీతో బైబిలు పఠిస్తే, చర్చికి వెళ్లడం మానేయాల్సి ఉంటుందా?” అని ఆమె అడిగింది. అది ఆమె తీసుకోవల్సిన నిర్ణయమని మేము చెప్పాము. ఆమె ఆదివారం ఉదయం చర్చికి వెళ్లేది మధ్యాహ్నాలు కూటాలకు వచ్చేది. ఒకరోజు, “నేను ఇక చర్చికి వెళ్లడంలేదు” అని ఆమె చెప్పింది.
“ఎందుకు?” అని మేము అడిగాము.
“ఎందుకంటే వారు బైబిలును బోధించడంలేదు, నేను మీతో బైబిలు చదవడం వల్లనే సత్యాన్ని కనుగొన్నాను.” ఆమె బాప్తిస్మం తీసుకుని, ప్రతిరోజూ చర్చికి వెళ్లే అనేకమంది స్త్రీలతో పఠించింది. తనను చర్చికి వెళ్లవద్దని మేము చెప్పివుంటే తాను పఠించడం ఆపివేసి బహుశ ఎన్నడూ సత్యాన్ని నేర్చుకోలేకపోయేదానినని ఆమె మాతో ఆ తర్వాత చెప్పింది.
క్రొత్త నియామకాలు
కొంతకాలానికి నేనూ డోరతీ నలుగురు ఇతర మిషనరీలతో సహా ఇటలీ పట్టణమైన ట్రీస్టీకి నియమించబడ్డాము. అప్పట్లో దాన్ని బ్రిటీష్ మరియు అమెరికా సైన్యాలు ఆక్రమించుకుని ఉన్నాయి. సుమారు పదిమంది సాక్షులు మాత్రమే ఉండేవాళ్లు కానీ ఈ సంఖ్య పెరిగింది. మేము ట్రీస్టీలో మూడు సంవత్సరాలు ప్రకటించాము, మేము అది విడిచి వెళ్లినప్పుడు 40 మంది రాజ్యప్రచారకులు ఉండేవాళ్లు, వారిలో 10 మంది పయినీర్లు.
ఆ తర్వాత మమ్మల్ని వెరోనా పట్టణానికి నియమించారు, అక్కడ ఒక్క సంఘంకూడా లేదు. కానీ చర్చి లౌకిక అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినప్పుడు, మేము వెళ్లిపోవల్సి వచ్చింది. డోరతీని నన్ను రోమ్కు నియమించారు. అక్కడ సామాన్లున్న ఓ ఇంటిని మేము అద్దెకు తీసుకున్నాము, వాటికన్ సమీపంలో ఉన్న ప్రాంతంలో మేము పనిచేశాము. మేము అక్కడ ఉన్నప్పుడే డోరతీ, జాన్ చిమిక్లిస్ని వివాహం చేసుకునేందుకు లెబనన్కు వెళ్లింది. మేము సుమారు 12 సంవత్సరాలు కలిసివున్నాము, ఆమె లేని లోటు తీరలేదు.
1955లో రోమ్ నందలి మరో భాగంలోని న్యూ అప్పీయన్ వే అనే వీధిలో ఓ క్రొత్త మిషనరీ గృహం తెరవడం జరిగింది. ఆ గృహంలో ఉన్న నలుగురిలో ఒకామె మారియా మెరాఫినా, మేము మిలాన్ చేరుకున్న రాత్రి మా గదుల్లో పూలు పెట్టిన అమ్మాయి ఈమే. పట్టణం యొక్క ఈ ప్రాంతంలో ఓ క్రొత్త సంఘం తయారైంది. ఆ వేసవిలో రోమ్‌లోని అంతర్జాతీయ సమావేశం తర్వాత జర్మనీలోని న్యూరెంబర్గ్లోని సమావేశానికి హాజరయ్యే ఆధిక్యత నాకు లభించింది. హిట్లర్ పరిపాలనలో అంత సహించిన వారిని కలవడం ఎంత పులకరింత కలిగించిందో!
తిరిగి అమెరికాకు
ఆరోగ్య సమస్యలవల్ల 1956లో నేను అనారోగ్య సెలవు తీసుకుని అమెరికాకు వచ్చాను. కానీ ఇప్పుడు మరియు యెహోవా నూతన లోకంలో ఆయనను నిత్యమూ సేవించే ప్రతిఫలంపై నుండి నేనెన్నడూ నా దృష్టిని మరలించలేదు. నేను ఇటలీకి తిరిగిరావాలని పథకం వేసుకున్నాను. అయితే, న్యూయార్క్ బ్రూక్లిన్ నందున్న, యెహోవాసాక్షుల ప్రపంచ ముఖ్యకార్యాలయంలో సేవచేస్తున్న ఓర్విల్ మైకెల్‌ను నేను కలిశాను. న్యూయార్క్ పట్టణం నందు 1958లో జరిగిన అంతర్జాతీయ సమావేశం తర్వాత మేము వివాహం చేసుకున్నాము.
కొంత కాలం తర్వాత వెర్జీనియా నందలి ఫ్రంట్ రాయల్‌కు మేము వెళ్లాము అక్కడ మేము ఓ చిన్న సంఘంతో కలిసి సేవచేయడంలో ఆనందించాము. రాజ్యమందిరం వెనుక ఉన్న ఓ చిన్న అపార్ట్మెంట్లో మేము నివసించాము. చివరికి, 1960 మార్చిలో, మా ఖర్చులను తీర్చుకోడానికి లౌకిక ఉద్యోగాన్ని కనుగొనేందుకు బ్రూక్లిన్కు తిరిగి రావల్సి వచ్చింది. పూర్తికాల సేవలో కొనసాగేందుకు మేము వివిధ బ్యాంకుల్లో రాత్రుళ్లు పనిచేసే వాళ్లం.
మేము బ్రూక్లిన్‌లో ఉన్నప్పుడు నాన్నగారు మరణించారు మరి మా అత్తగారికి స్వల్ప గుండెపోటు వచ్చింది. కనుక మా ఇద్దరి అమ్మలకు దగ్గిరగా ఉండేందుకు మేము ఓరిగన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. మేము పార్ట్‌టైమ్ పనిని కనుగొని, అక్కడే పయినీరు సేవను కొనసాగించాము. 1964 చివరి భాగంలో, మేము మా ఇద్దరి అమ్మలతో కలిసి పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ నందు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారి వార్షిక కూటానికి హాజరయ్యేందుకు కారులో ప్రయాణించి వెళ్లాము.
మేము రోఢే ద్వీపాన్ని సందర్శించిన సమయంలో, అర్లిన్ మీర్ అనే ప్రాంతీయ కాపరి, ఆయన భార్య రాష్ట్ర రాజధానియైన ప్రావిడెన్స్‌కు మారమని మమ్మల్ని ప్రోత్సహించారు, అక్కడ రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉండింది. మా ఇద్దరి అమ్మలూ ఈ క్రొత్త నియామకాన్ని అంగీకరించమని మమ్మల్ని ప్రోత్సహించారు గనుక ఓరిగాన్కు తిరిగి వచ్చిన తర్వాత, మేము మా ఇంట్లోని వస్తువుల్లో చాలా వాటిని అమ్మి, అక్కడికి వెళ్లాము.
మరలా గిలియడ్ పాఠశాలకు
1965 వేసవిలో, మేము యాంకీ స్టేడియమ్ నందలి సమావేశానికి హాజరయ్యాము. ఓ వివాహ జతగా అక్కడ మేము గిలియడ్ పాఠశాల కొరకు దరఖాస్తు పెట్టాము. ఓ నెల తర్వాత, దరఖాస్తు ఫారాలు రావడం చూసి మేము ఆశ్చర్యపోయాము. వాటిని 30 రోజుల్లో తిరిగి పంపించాలి. అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండకపోవడంవల్ల దూరదేశానికి వెళ్లడానికి నేను కొంచెం చింతించాను. అయితే, “ఆ దరఖాస్తు ఫారాలను నింపండి. యెహోవా ఇచ్చే ఏ సేవాధిక్యతనైనా ఎల్లప్పుడూ అంగీకరించాలి తెలుసా!” అని ఆమె నన్ను ప్రోత్సహించింది.
దానితో ఆ విషయం సరైంది. మేము ఆ దరఖాస్తులను నింపి పంపించాము. 1966 ఏప్రిల్ 25న ప్రారంభమయ్యే 42వ తరగతికి ఆహ్వానాలు రావడం ఎంత ఆశ్చర్యకరం! అప్పట్లో గిలియడ్ పాఠశాల న్యూయార్క్ బ్రూక్లిన్‌లో ఉండేది. ఐదు నెలలకంటే ముందే, 106 మందిమి 1966 సెప్టెంబరు 11న పట్టభద్రులమయ్యాము.
అర్జెంటీనాకు నియమించబడడం
పట్టభద్రులైన రెండు రోజుల తర్వాత, మేము పెరువియన్ విమానంలో అర్జెంటీనాకు బయలుదేరాము. మేము బ్యునోస్ ఏర్స్ చేరుకున్నప్పుడు బ్రాంచి అధ్యక్షుడు చార్ల్స్ ఇసెన్హోవర్ మమ్మల్ని విమానాశ్రయం వద్ద కలిశాడు. మేము సీమ సుంకాల విషయాన్ని చూసుకునేందుకు ఆయన మాకు సహాయపడ్డాడు, ఆ తర్వాత మమ్మల్ని బ్రాంచికి తీసుకువెళ్లాడు. మేము మా సామాన్లు తీసి సర్దుకునేందుకు ఒకరోజు ఉంది; ఆ తర్వాత మా స్పానిష్ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి నెల మేము రోజుకు 11 గంటలు స్పానిష్ చదివాము. రెండవనెల, రోజుకు నాలుగు గంటలు భాషను నేర్చుకుంటూ ప్రాంతీయ పరిచర్యలో భాగం వహించడం ప్రారంభించాము.
బ్యునోస్ ఏర్స్ నందు మేము ఐదు నెలలు ఉన్నాము ఆ తర్వాత రొజారియో అనే ప్రాంతానికి మేము నియమించబడ్డాము. ఉత్తరానున్న ఆ పెద్ద పట్టణానికి రైలు ద్వారా వెళ్లాలంటే సుమారు నాలుగు గంటలు పడుతుంది. అక్కడ సుమారు 15 నెలలు సేవచేసిన తర్వాత, ఉత్తరాన మరింత లోపలికున్న సాన్టియాగో డెల్ ఎస్టిరోకు పంపించబడ్డాము. అది వేడిగా ఉండే ఎడారి ప్రాంతంలో ఉంటుంది. మేము అక్కడ ఉన్నప్పుడు, 1973 జనవరిలో మా అమ్మ మరణించింది. నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఆమెను చూడనేలేదు. నిశ్చయమైన పునరుత్థాన నిరీక్షణ, అలాగే నేను ఎప్పుడూ నా నియామకంలో ఉండాలన్న అమ్మ కోరిక ప్రకారం నేను పని చేస్తున్నానన్న సంతృప్తీ ఈ దుఃఖంలో నేను నిలదొక్కుకునేందుకు నాకు సహాయపడ్డాయి.—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.
సాంటియాగో డెల్ ఎస్టిరోలోని ప్రజలు స్నేహంగా మెలిగేవారు, బైబిలు పఠనాలు సులభంగా ప్రారంభమయ్యాయి. 1968లో మేము వచ్చినప్పుడు, అక్కడ సుమారు 20 లేక 30 మంది కూటాలకు హాజరయ్యేవాళ్లు, కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత మా సంఘంలో నూటికంటే ఎక్కువమంది ఉండేవారు. దానికి తోడు, సమీపంలోని నగరాల్లో 25 మరియు 50 ప్రచారకులున్న రెండు క్రొత్త సంఘాలున్నాయి.
మరలా అమెరికాకు తిరిగి రావడం
ఆరోగ్య సమస్యలవల్ల, 1976లో మేము మరలా అమెరికాకు అంటే ఉత్తర కారొలినాలోని ఫయేట్టివిల్కి ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డాము. మధ్య మరియు దక్షిణ అమెరికా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికో మరియు స్పెయిన్నుండి సహితం వచ్చిన స్పానిష్ మాట్లాడే ప్రజలు అక్కడ ఉండేవాళ్లు. మాకు చాలా బైబిలు పఠనాలుండేవి, మరి కొంత కాలానికి స్పానిష్ సంఘం ప్రారంభమైంది. ఆ నియామకంలో మేము సుమారు ఎనిమిది సంవత్సరాలు గడిపాము.
అయినప్పటికీ, బాగా వృద్ధురాలై ఏమీ చేసుకోలేని మా అత్తమ్మకు దగ్గిరగా మేము ఉండాల్సి వచ్చింది. ఆమె ఓరిగన్ నందలి పోర్ట్‌లాండ్‌లో నివసించేది కనుక పోర్ట్‌లాండ్‌కు సమీపంలో ఉన్న వాషింగ్టన్ వాన్కోవర్లోని స్పానిష్ సంఘానికి క్రొత్త నియామకం దొరికింది. 1983 నందు డిశంబరులో మేము వచ్చినప్పుడు మా సంఘం చిన్నగా ఉండేది కాని ఇప్పుడు అనేకమంది క్రొత్తవారిని చూస్తున్నాము.
జూన్ 1996లో 53 సంవత్సరాల పూర్తికాల సేవను నేను పూర్తిచేశాను, నా భర్త 1996 జనవరి 1న 55 సంవత్సరాల పూర్తికాల సేవను పూర్తి చేశాడు. ఈ సంవత్సరాలన్నింటిలోనూ దేవుని వాక్యం యొక్క సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని పొంది యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకునేందుకు వందల మందికి సహాయపడే ఆధిక్యత నాకు లభించింది. వీరిలో అనేకులు ఇప్పుడు పెద్దలుగానూ పూర్తికాల పరిచారకులుగాను పని చేస్తున్నారు.
కొన్నిసార్లు, నాకు పిల్లలులేని లోటు లేదా అని నన్ను అడిగేవారు. వాస్తవానికి, యెహోవా నన్ను అనేకమంది ఆత్మీయ పిల్లలతో, మనవరాళ్లు మనుమలతో ఆశీర్వదించాడు. అవును, నా జీవితం యెహోవా సేవలో అర్థవంతంగానూ ప్రతిఫలదాయకంగానూ సాగింది. తన జీవితాన్ని ఆలయ సేవలో గడిపి తనకున్న గొప్ప సేవాధిక్యతవల్ల పిల్లలను ఎన్నడు లేకుండా ఉన్న యొఫ్తా కుమార్తెతో నన్ను నేను పోల్చుకోవచ్చు.—న్యాయాధిపతులు 11:38-40.
నేనింకా చిన్నపిల్లగా ఉన్నప్పుడే యెహోవాకు సమర్పించుకోవడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. పరదైసును గూర్చిన చిత్రం అప్పుడు నా మనస్సులో ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడూ అంత స్పష్టంగానే ఉంది. దేవుని నూతనలోకంలో అంతంలేని జీవమనే ప్రతిఫలంపై నా దృష్టి, హృదయం నిలిచివున్నాయి. అవును, యెహోవాను నేను కేవలం 50 సంవత్సరాలు మాత్రమే కాదు నిరంతరం—ఆయన రాజ్య పరిపాలన క్రింద సేవించాలన్నదే నా కోరిక.
[23వ పేజీలోని చిత్రం]
1943లో, నా భుజాలపై చేతులుంచిన డోరతీ క్రేడన్ మరియు తోటి పయినీర్లతో
[23వ పేజీలోని చిత్రం]
ఇటలీలోని రోమ్‌లో 1953లో తోటి మిషనరీలతో
[25వ పేజీలోని చిత్రం]
నా భర్తతో