పాఠకుల ప్రశ్నలు
యేసుకు అర్మగిద్దోను తేదీ ఇప్పుడు తెలుసా?
ఆయనకు తెలుసని నమ్మడం చాలా సహేతుకమనిపిస్తుంది.
కొంతమంది అసలు ప్రశ్న ఎందుకు ఉత్పన్నమౌతుందని ఆశ్చర్యపోవచ్చు. బహుశ మత్తయి 24:36 నందు కనుగొనబడే యేసు వ్యాఖ్యానం మూలాన కావచ్చు: “ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” “కుమారుడైనను” అనే పదాన్ని గమనించండి.
“ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అన్న అపొస్తలుల ప్రశ్నలకు యేసు ఇచ్చిన జవాబులో ఈ వచనం ఒక భాగము. (మత్తయి 24:3) “సూచన”గా రూపుదిద్దుకున్న సాక్ష్యాల గురించిన ఇప్పటి ప్రఖ్యాత ప్రవచనంలో యుద్ధాలు, ఆహార కొరత, భూకంపాలు, నిజ క్రైస్తవుల హింస, వీటితోపాటు తన ప్రత్యక్షతను సూచిస్తూ భూమిపై జరిగే మరితర విషయాలను ఆయన ముందే చెప్పాడు. అంతం సమీపంలో ఉందని ఈ సూచన ద్వారా తన అనుచరులు గుర్తించగలరు. వసంత కాలం సమీపంగా ఉన్నదని సూచిస్తూ అంజూరపు చెట్టు చిగురించే సమయంతో ఈ విషయాల సామీప్యాన్ని ఆయన దృష్టాంతముగా చూపించాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.”—మత్తయి 24:33.
అయితే కచ్చితంగా అంతం ఎప్పుడు వస్తుందనేది యేసు చెప్పలేదు. దాని బదులు, మత్తయి 24:36 వద్ద మనం ఏది చదువుతామో దాన్ని ఆయన చెప్పాడు. పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదములో (ఆంగ్లం) ఆ విధంగా చదువబడుతుంది, అనేక ఆధునిక బైబిళ్లు కూడా ఆ విధంగానే చదువబడుతున్నాయి. అయితే, కొన్ని పాత అనువాదాలలో “కుమారుడైనను” అనే పదం లేదు.
ఉదాహరణకు, కాథోలిక్ డుయే వర్షన్ ఇలా చదువబడుతుంది: “కానీ ఆ దినమును గూర్చిగాని, గడియను గూర్చిగాని ఎవరికీ తెలియదు, పరలోకమందలి దూతలకు తెలియదు, కేవలం తండ్రికే తెలుసు.” కింగ్ జేమ్స్ వర్షన్ కూడా అలాగే చదువబడుతుంది. “కుమారుడైనను” అనే పదం మార్కు 13:32 నందు కనుగొనబడినను, అది ఇక్కడ ఎందుకు విడిచిపెట్టబడింది? వెనుకటికి 17వ శతాబ్దారంభంలో ఆ రెండు వర్షన్‌లు తయారుచేయబడినప్పుడు, అనువాదకులు ఉపయోగించిన వ్రాతప్రతులలో ఆ మాట లేదు కాబట్టి. అయినా ఈలోగా, అనేక పాత గ్రీకు వ్రాతప్రతులు వెలుగులోకి వచ్చాయి. మత్తయి వ్రాసిన అసలు పాఠ్య భాగం యొక్క సమయానికి ఎక్కువ సమీపాన ఉన్న ఈ వ్రాతప్రతుల్లో, మత్తయి 24:36 నందు “కుమారుడైనను” అనే పదం ఉంది.
ఆసక్తికరంగా, కాథోలిక్ జెరుసలేమ్ బైబిల్, లాటిన్ వల్గేట్ ఈ మాటను “బహుశ వేదాంతపరమైన కారణాలనుబట్టి” విడిచిపెట్టిందని ఒక అధఃసూచిలో చెబుతూ ఈ పదాన్ని చేరుస్తుంది. అది నిజమే! త్రిత్వాన్ని నమ్మే అనువాదకులు లేక లేఖికులు, తన తండ్రి కలిగి ఉన్న జ్ఞానాన్ని యేసు కలిగి లేడని సూచించే ఒక పదబంధాన్ని వదిలిపెట్టడానికి శోధించబడి ఉంటారు. ఆయన, ఆయన తండ్రి ఇద్దరూ ఒక త్రిత్వ దేవునిలో భాగాలైతే యేసుకు ఒక వాస్తవం తెలియకుండా ఎలా ఉండగలదు?
అదే విధంగా, బి. ఎమ్. మెట్స్‌గర్ వ్రాసిన ఎ టెక్స్‌టువల్ కామెంటరీ ఆన్ ద గ్రీక్ న్యూ టెస్టమెంట్ ఇలా అంటుంది: “మలి బైజాంటైన్ పాఠ్య భాగంతో సహా, మత్తయి యొక్క అత్యధిక [వ్రాతప్రతి] సాక్ష్యాలలో ‘కుమారుడైనను’ అనే పదం కనిపించదు. ఇంకొక వైపు, అలెగ్జాండ్రియన్, ద వెస్ట్రన్, సీజేరియన్ రకమైన పాఠ్య భాగాలకు శ్రేష్ఠమైన ఉదాహరణలు ఆ పదాన్ని కలిగి ఉన్నాయి.” మార్కు 13:32 నందు “ఈ పదం చేర్చబడిందనే ఊహ కంటే, అది అందించే సిద్ధాంతపర కష్టం మూలంగా పదాలను విడిచిపెట్టడం జరిగింది అనేది బహుశ అత్యంత సంభవనీయమైనది.”—ఇటాలిక్కులు మావి.
పురాతన వ్రాతప్రతుల ఆ “శ్రేష్ఠమైన ఉదాహరణలు,” అంత్య గడియను గురించిన జ్ఞానంలో సహేతుకమైన అభివృద్ధిని అందించే వ్యాఖ్యానానికి మద్దతు ఇస్తున్నాయి. దూతలకు అంత్య గడియ తెలియదు; కుమారునికి తెలియదు; కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. మరి అది మత్తయి 20:23 నందున్న యేసు మాటలతో పొందిక కలిగి ఉంది, అక్కడ ఆయన రాజ్యంలో ప్రముఖ స్థానాలను అనుగ్రహించే అధికారము తనకు లేదని, కానీ తండ్రికి ఉందని అంగీకరించాడు.
అందువలన, తను భూమ్మీద ఉన్నప్పుడు ‘లోకాంతం’ యొక్క తేదీ తనకు తెలియదని యేసు స్వంత మాటలు చూపిస్తున్నాయి. ఆయన దాన్ని అటు తరువాత తెలుసుకున్నాడా?
యేసు ఒక తెల్లని గుర్రంపై కూర్చుని, “జయించుచు, జయించుటకు” బయలుదేరినట్లు ప్రకటన 6:2 వర్ణిస్తుంది. తరువాత 1914లో మొదటి ప్రపంచయుద్ధం మొదలైనప్పటి నుండి మనం అనుభవిస్తున్న యుద్ధాలు, కరవులు, తెగుళ్లను సూచించే గుర్రపు రౌతులు వచ్చారు. 1914లో దేవుని పరలోక రాజ్యానికి యేసు రాజుగా సింహాసనాసీనుడు అయ్యాడని యెహోవాసాక్షులు నమ్ముతారు. భూమిపై దుష్టత్వానికి విరుద్ధంగా రాబోయే పోరాటంలో ఆయన నాయకత్వం వహిస్తాడు. (ప్రకటన 6:3-8; 19:11-16) దేవుని నామాన విజయం సాధించడానికి యేసు ఇప్పుడు అధికారం పొందాడు కాబట్టి, అంతం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని, ‘తన విజయాన్ని పూర్తిచేసేది’ ఎప్పుడనే విషయాన్ని తండ్రి చెప్పే ఉంటాడన్నది సహేతుకమే అనిపిస్తుంది.
భూమిపైనున్న మనకు ఆ తేదీ చెప్పబడలేదు, అందువలన యేసు మాటలు మనకు ఇంకా అన్వయిస్తాయి: ‘జాగ్రత్తపడుడి, మెలకువగానుండి ప్రార్థనచేయుడి, ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. . . . నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి.’—మార్కు 13:33-37.