“సహజ జ్ఞానముగల” జీవులు మనకు ఏమి నేర్పించగలవు
ఏర్ కండీషన్, యాంటీఫ్రీజ్, ఉప్పును వెలికి తీసే పద్ధతి మరియు సోనార్ వంటి ఆవిష్కరణలు, మానవజాతికి 20వ శతాబ్దంలో బాగా తెలిశాయి. అయినప్పటికీ, వేలకొలది సంవత్సరాలకు పూర్వం నుండే అవి జంతు ప్రపంచంలో ఉన్నాయి. అవును, అలాంటి “సహజ జ్ఞానంగల” జీవులను గూర్చి నేర్చుకోవడంవల్ల మానవజాతి ప్రయోజనం పొందగలదు. (సామెతలు 30:24-28; యోబు 12:7-9) కొన్ని జంతువులు, మానవులకు మౌన బోధకులన్నట్లుగా ఉన్నాయి మరి వాటిని పరిశీలించడం మనకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
కొన్ని జంతువుల లక్షణాలను పరిశీలించడంవల్ల మనం ప్రయోజనం పొందగలమా? యేసుక్రీస్తు తన అనుచరులను గొఱ్ఱెలు, పాములు, పావురాలు మరియు మిడతలకు పోల్చాడు. తన అనుచరులను ఈ జీవులతో పోల్చినప్పుడు ఆయన మనస్సులో ఏముంది? దాన్ని మనం చూద్దాం.
“నా గొఱ్ఱెలు నా స్వరము వినును”
బైబిలులో గొఱ్ఱెలు 200 సార్లు ప్రస్తావించబడ్డాయి. స్మిత్స్ బైబిల్ డిక్షనరి వివరించిన ప్రకారంగా, “గొఱ్ఱె సాత్వికానికి, ఓర్పుకు మరియు విధేయతకు గుర్తు.” యెషయా 53వ అధ్యాయంలో యేసునే ప్రవచనార్థకంగా గొఱ్ఱెకు పోల్చడం జరిగింది. ఆయన తన అనుచరులను అదే జంతువుతో పోల్చడం ఎంత సబబుగా ఉందో కదా! అయితే గొఱ్ఱెలోని ఏ ప్రత్యేక లక్షణం యేసు మనస్సులో ఉంది?
“నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును” అని యేసు అన్నాడు. (యోహాను 10:27) అలా, తన శిష్యుల సాత్వికాన్ని, ఆయనను అనుసరించాలన్న వారి కుతూహలాన్ని ఆయన ఉన్నతపర్చాడు. అక్షరార్థమైన గొఱ్ఱెలు తమ కాపరి శబ్దం విని, ఆయన్ను అనుసరించేందుకు ఇష్టపడతాయి. కాపరికి కూడా ఆ మందతో సన్నిహిత సంబంధం ఉంటుంది.
ఓ మంద మేసేటప్పుడు, పచ్చికబయళ్ల మీద అవి దూరదూరంగా ఉండవచ్చు, అయితే ప్రతి గొఱ్ఱె ఆ గుంపంతటితో సంబంధం కల్గేవుంటుంది. ఆ విధంగా, భద్రత లేనట్లుగాను లేక భయపడినట్లుగానూ భావించినట్లయితే, “అవి త్వరగా ఒకచోటికి చేరుకోవచ్చు” అని అల్లీస్ ఫూర్ డ స్కాఫ్ (అంతా గొఱ్ఱెల కొరకే) పుస్తకం పేర్కొంటోంది. అపాయాన్ని తప్పించుకునేందుకు గొఱ్ఱెలు పారిపోవల్సివస్తే, అవి పూర్తి మందగా పారిపోతాయి, మరి పరిస్థితిని పరిశీలించేందుకు అప్పుడప్పుడు ఆగుతాయి. “అప్పుడప్పుడు ఆగి పారిపోవడంవల్ల గొఱ్ఱెపిల్లలూ బలహీనమైనవి వాటితో ఉండేందుకు సహాయపడుతుంది. మంద వాటికి ప్రత్యేక రక్షణను కూడా అందిస్తుంది.” ఈ ప్రవర్తననుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
నేడు నిజమైన క్రైస్తవులు, క్రైస్తవమత సామ్రాజ్యపు విభాగాల్లోనూ తెగల మధ్యనూ చెదరివుండడం లేదు. బదులుగా, వారు ఒక మందగా సమకూడివున్నారు. దేవుని యొక్క ఈ మందకు వ్యక్తిగత సంబంధముందని మరియు ఇది యెహోవాసాక్షుల సంస్థ ఐక్యతకు దోహదపడుతుందని ప్రతి క్రైస్తవుడు భావిస్తాడు. అది తీవ్రమైన అస్వస్థతైనా, యుద్ధమైనా, లేక ప్రకృతి విపత్తయినా అంటే ఓ సంక్షోభం సంభవించినప్పటికీ ప్రతి ఆరాధికుడూ నడిపింపు రక్షణలను ఎక్కడ పొందగలడు? ఆత్మీయ భద్రతను అందించే యెహోవా సంస్థలోనే.
బైబిలు సలహా ఎలా అందించబడుతుంది? కావలికోట మరియు దాని సహాయ పత్రికైన తేజరిల్లు! ప్రచురణల ద్వారా. ఈ పత్రికలు మరియు క్రైస్తవ కూటాలు, మందలోని గొఱ్ఱెపిల్లలు మరియు బలహీనమైన గొఱ్ఱెల వంటి వారికి అధిక శ్రద్ధనిచ్చేందుకు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, ఒంటరిగా ఉన్న తల్లి లేక తండ్రి ఎడల మరియు కృంగుదలతో బాధపడేవారి ఎడల శ్రద్ధవహిస్తారు. కనుక, ప్రతి పత్రికను చదవడం, ప్రతి సంఘకూటానికి హాజరుకావడం మరియు మనం నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడం ఎంత జ్ఞానయుక్తమో కదా! ఆ విధంగా మనం సాత్వికాన్ని మరియు దేవుని మందతో దృఢమైన బంధాన్ని ప్రదర్శించగలం.—1 పేతురు 5:2.
“పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి”
స్మిత్స్ బైబిలు డిక్షనరి ఇలా పేర్కొంటోంది: “తూర్పు ప్రాంతమంతటిలోనూ పాములు దుష్ట ప్రవర్తనకూ అవిధేయ దృక్పథానికి గుర్తుగా ఉపయోగించబడ్డాయి.” మరోవైపు “నా పావురమా” అన్న పదం ప్రేమకు ప్రతిగా ఉపయోగించే పదం. (పరమగీతము 5:2) మరి “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి” అని యేసు తన అనుచరులను ప్రోత్సహించినప్పుడు ఆయన మనస్సులో ఏముంది?—మత్తయి 10:16.
ప్రకటించి బోధించే పనిని గూర్చి యేసు ఉపదేశాలను ఇస్తున్నాడు. ఆయన శిష్యులు అన్ని రకాల ప్రతిస్పందనను అపేక్షించారు. కొందరు ఆసక్తిని కనపరుస్తారు కాని ఇతరులు సువార్తను నిరాకరిస్తారు. కొందరైతే దేవుని సేవకులైన వీరిని హింసిస్తారు కూడా. (మత్తయి 10:17-23) శిష్యులు హింసకు ఎలా ప్రతిస్పందించాలి?
దాస్ ఎవాన్జిలియమ్ దెస్ మత్తుఅస్ (మత్తయి సువార్తలో) నందు మత్తయి 10:16 గూర్చి ఫ్రిట్జి రీనికర్ ఇలా చెప్పాడు: “జాగరూకతతో . . . ఏది ఏమైనా శత్రువులు చేసే ఫిర్యాదులకు న్యాయసమ్మతమైన కారణాలను ఇవ్వగలగడం, నిజాయితీగా, యథార్థతగా మరియు నిర్మొహమాటంగా ఉండడం ఇమిడివున్నాయి. ఎలాంటి సానుభూతి కనపర్చకుండా మరియు ఏ కనికరమూ లేకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని జారవిడవకుండా దాడిచేసే దయలేని శత్రువుల మధ్య యేసు ప్రతినిధులున్నారు. కాబట్టి, ఓ పాములా శత్రువులను గమనించడం, పరిస్థితిని పరిశీలించేందుకుగాను మన కళ్లనూ చెవులనూ తెరచివుంచుకోవడం అవసరం; మోసాన్ని, కుతంత్రాలను ఉపయోగించుకోకుండా పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం ద్వారా, మాటలు క్రియల్లో శుద్ధంగానూ యథార్థంగానూ ఉంచుకోవడం ద్వారా తమ్మును తాము పావురాలవంటివారని నిరూపించుకోవడం అవసరం.”
మత్తయి 10:16 నందున్న యేసు మాటలనుండి దేవుని ఆధునిక సేవకులు ఏమి నేర్చుకోవచ్చు? మొదటి శతాబ్దంలో సువార్తకు ప్రజలు ఎలా ప్రతిస్పందించారో నేడు కూడా ప్రజలు ఇంచుమించు అలాగే ప్రతిస్పందిస్తున్నారు. హింసను ఎదుర్కున్నప్పుడు, నిజమైన క్రైస్తవులు పాముకున్న తెలివినీ పావురంలాంటి స్వచ్ఛతనూ చేర్చాల్సివుంటుంది. క్రైస్తవులు ఎన్నడూ మోసాన్ని లేక కపటాన్ని ఉపయోగించరు కానీ రాజ్య సువార్తను ఇతరులకు ప్రకటించడంలో అవినీతిపరులు కారు, వారు యథార్థవంతులు మరియు నిజాయితీపరులు.
ఓ ఉదాహరణ: పని స్థలంలోని సహోద్యోగులు, పాఠశాలలో యువకులు లేక మీ స్వంత కుటుంబ సభ్యులు, మీరు యోహోవాసాక్షిగా మీ విశ్వాసాలను గూర్చి సూటిపోటి మాటలంటారనుకోండి. దానికి వెంటనే, వారి విశ్వాసాన్ని గూర్చి అదేమాదిరి సూటిపోటి మాటలతో ప్రతిస్పందించడం జరుగుతుంది. అలా చేస్తే నిష్కాపట్యంగా ఉన్నట్లేనా? కానే కాదు. తమ వ్యాఖ్యానాలు తమ శాంత స్వభావాన్ని మార్చవని మిమ్మల్ని విమర్శించేవారికి మీరు కనపరిస్తే వారు మారే అవకాశం ఉంది. అప్పుడు మీరు జాగ్రత్తగానూ మరియు నిందారహితులుగాను ఉంటారు అంటే ‘పాములవలె జాగ్రత్తగాను, పావురములవలె నిష్కాపట్యంగాను’ ఉంటారు.
“ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలియున్నవి”
1784లో “చరిత్రలో ఇంతవరకు వ్రాయబడని పెద్ద [మిడతల]” దండు దక్షిణాఫ్రికాపై దాడిచేసిందని జిఇఓ పత్రిక చెప్పింది. ఆ దండు 5,200 కిలోమీటర్ల ప్రాంతాన్ని చుట్టుముట్టింది, అది ఇంచుమించు హాంకాంగ్‌కు అయిదురెట్లు పెద్దది. ఈ మిడతలు “సందర్శించే దేశాల్లో కాయగూరలపై దారుణమైన దాడి చేస్తాయి” అని స్మిత్స్ బైబిల్ డిక్షనరి చెప్పింది.
“ప్రభువు దినము”లో సంభవించబోయే విషయాలను గూర్చి దేవుడిచ్చిన ప్రకటనల్లో మిడతల దండుకు సంబంధించిన దృశ్యాన్ని ఉపయోగించాడు. వాటిని గూర్చి ఇలా చెప్పబడింది: “ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలియున్నవి.” (ప్రకటన 1:1, 10; 9:3-7) ఈ సూచనకున్న ప్రత్యేకతేమిటి?
ప్రకటన 9వ అధ్యాయంలోని మిడతలు, ఈ శతాబ్దంలో భూమిపై జీవిస్తున్న దేవుని అభిషిక్త సేవకులను దృశ్యీకరిస్తున్నాయని యెహోవాసాక్షులు ఎంతో కాలంగా అర్థం చేసుకుంటున్నారు.a ఈ క్రైస్తవులకు ఓ ప్రత్యేకమైన పని నియమించబడింది, అది రాజ్య వార్తను భూవ్యాప్తంగా ప్రకటించి శిష్యులను తయారు చేయడమే. (మత్తయి 24:14; 28:19, 20) అది వారు అడ్డంకులను ఎదుర్కొని తమ పనిని విడవక చేయాలి. అసాధ్యమైన మిడతలకంటే మంచి ఉదాహరణ మరింకేముంటుంది?
అయిదు సెంటీమీటర్లకంటే కొద్దిగా పొడవుండే ఈ మిడత రోజుకు 100 నుండి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. డెసర్ట్ రకం మిడతలు 1,000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించగలవు. “దాని రెక్కలను ప్రతి క్షణానికి 18 సార్లు చొప్పున, రోజుకు 17 గంటలు ఆడిస్తుంటుంది, అంటే మరే ఇతర కీటకమూ చేయలేని దాన్ని అది చేయగలదన్నమాట” అని జియియో వివరిస్తోంది. అంత బుల్లి జీవికి ఎంత పెద్ద పని!
రాజ్య సువార్తను వ్యాపింపజేయడంలో యెహోవాసాక్షులు ఓ గుంపుగా స్థిరంగా ఉన్నారు. వారు ఇప్పుడు 230 దేశాల్లో ప్రకటిస్తున్నారు. ఆ పనిని చేసేందుకు, దేవుని సేవకులైన వీరు అనేక కష్టాలను తాళుకుంటారు. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు? దురభిమానం, చట్టబద్దమైన నియమాలు, అస్వస్థత, నిరుత్సాహం మరియు బంధువులనుండి వచ్చే వ్యతిరేకతలు కొన్ని మాత్రమే. అయితే వారి పురోగతిని మరేదీ ఆపలేదు. దేవుడు తమకిచ్చిన పనికి వారు అంటిపెట్టుకుని ఉన్నారు.
క్రైస్తవ లక్షణాలను వ్యక్తపరుస్తూ ఉండండి
అవును, యేసు తన అనుచరులను గొఱ్ఱెలతో, పాములతో, పావురాలతో మరియు మిడతలతో పోల్చాడు. మన దినానికి ఇది ఎంతో యుక్తంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ విధానము తప్పకుండా అంతమౌతుంది మరియు సమస్యలు మునుపెన్నటికంటే ఇప్పుడు మరింత క్లిష్టంగా ఉన్నాయి.
యేసు ఉపయోగించిన ఉపమాన పదాలను జ్ఞాపకముంచుకుంటూ నిజమైన క్రైస్తవులు దేవుని మందకు సన్నిహితంగా అంటిపెట్టుకుని ఉంటారు మరియు యెహోవా సంస్థనుండి సలహాలను సాత్వికంగా అంగీకరిస్తారు. వారు జాగ్రత్తగా ఉండి, అన్ని విషయాల్లోనూ వారు నిందారహితులుగా ఉంటూ తమ క్రైస్తవ క్రియలను ఆటంకపర్చే ఎటువంటి పరిస్థితులను గూర్చైనా మెలకువగా ఉంటారు. అంతేకాకుండ, అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేయడంలో వారు పట్టుదలకల్గివుంటారు. మరియు “సహజ జ్ఞానముగల” కొన్ని జీవులనుండి వారు నేర్చుకుంటూనే ఉంటారు.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురింపబడిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 22వ అధ్యాయాన్ని చూడండి.