ఈ అంత్యదినాల్లో ఐక్యత కలిగివుండండి
“ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై . . . సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.”—ఫిలిప్పీయులు 1:27.
1. యెహోవాసాక్షులకు ప్రపంచానికి ఏ వ్యత్యాసం ఉంది?
ఇవి ‘అంత్యదినాలు.’ నిస్సందేహంగా ఇవి ‘అపాయకరమైన కాలములే.’ (2 తిమోతి 3:1-5) మానవ సమాజంలో అవిశ్రాంతత ఉన్న ఈ “అంత్యకాలము”లో, యెహోవాసాక్షులు తమ మధ్యనున్న సమాధానం మరియు ఐక్యతనుబట్టి ఎంతో భిన్నంగా ఉన్నారు. (దానియేలు 12:4) కాని యెహోవా ఆరాధికుల విశ్వ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు ఈ ఐక్యతను కాపాడడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది.
2. ఐక్యతను కాపాడుకోవడం గురించి పౌలు ఏమి చెప్పాడు, మనం ఏ ప్రశ్నను పరిశీలిస్తాము?
2 ఐక్యత కలిగివుండమని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఉద్బోధించాడు. ఆయనిలా వ్రాశాడు: “నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయైయున్నది. ఇది దేవునివలన కలుగునదే.” (ఫిలిప్పీయులు 1:27, 28) క్రైస్తవులముగా మనం కలిసి పని చేయాలని పౌలు మాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కాబట్టి, ఈ కష్టతరమైన సమయాల్లో మన క్రైస్తవ ఐక్యతను కాపాడుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
దైవిక చిత్తానికి విధేయులుకండి
3. సున్నతి పొందని మొదటి అన్యులు క్రీస్తు అనుచరులుగా ఎప్పుడు, ఎలా అయ్యారు?
3 మన ఐక్యతను కాపాడుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, ఎల్లవేళలా దైవిక చిత్తానికి లోబడి ఉండడం. దీని కొరకు, మన ఆలోచనా విధానంలో సవరింపు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. యేసుక్రీస్తు యొక్క తొలి యూదా శిష్యులను పరిశీలించండి. అపొస్తలుడైన పేతురు సా.శ. 36లో సున్నతి పొందని అన్యులకు మొదటిసారి ప్రకటించినప్పడు, ఈ అన్య జనాంగాలపై దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, వారు బాప్తిస్మం పొందారు. (అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం) అప్పటివరకు యూదులు, సమరయులు, యూదా మతానికి చెందిన మతప్రవిష్టులు మాత్రమే యేసుక్రీస్తు అనుచరులయ్యారు.—అపొస్తలుల కార్యములు 8:4-8, 26-38.
4. కొర్నేలీకి సంబంధించి ఏమి జరిగిందో వివరించిన తర్వాత, పేతురు ఏమి చెప్పాడు, యూదులైన యేసు శిష్యులకు ఇది ఏ పరీక్షను తెచ్చింది?
4 కొర్నేలీ మరియు ఇతర అన్యుల మతమార్పిడి గురించి అపొస్తలులు, యెరూషలేములోని ఇతర సహోదరులు తెలుసుకున్నప్పుడు, పేతురు నివేదికను వినాలని వారు ఆసక్తి కలిగివున్నారు. కొర్నేలికి, విశ్వసిస్తున్న ఇతర అన్యులకు సంబంధించి ఏమి జరిగిందో వివరించిన తర్వాత, “కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు [యూదులకు] అనుగ్రహించినట్టు దేవుడు వారికి [విశ్వసిస్తున్న ఆ అన్యులకు] కూడ సమానవరము [పరిశుద్ధాత్మ] అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని” చెబుతూ అపొస్తులుడు ముగించాడు. (అపొస్తలుల కార్యములు 11:1-17) ఇది యూదులైన యేసుక్రీస్తు అనుచరులకు ఒక పరీక్ష అయింది. వారు దేవుని చిత్తానికి విధేయులై, విశ్వసిస్తున్న అన్యులను తమతోటి ఆరాధికులుగా అంగీకరిస్తారా? లేక యెహోవా భూ సేవకుల ఐక్యత ప్రమాదంలో పడుతుందా?
5. దేవుడు అన్యులకు మారుమనస్సును అనుగ్రహించాడనే వాస్తవానికి అపొస్తలులు, ఇతర సహోదరులు ఎలా ప్రతిస్పందించారు, ఈ దృక్పథం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
5 వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “వారు [అపొస్తలులు మరితర సహోదరులు] ఈ మాటలు విని మరేమి అడ్డముచెప్పక—అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.” (అపొస్తలుల కార్యములు 11:18) ఆ దృక్పథం యేసు అనుచరుల ఐక్యతను కాపాడి, వృద్ధి చేసింది. కేవలం కొద్ది సమయంలో, అన్యులు లేక అన్యజనాంగాల మధ్య ప్రకటన పని మంచి ఊపందుకుంది, అలాంటి కార్యాలపై యెహోవా ఆశీర్వాదం ఉండేది. క్రొత్త సంఘాన్ని ఏర్పాటు చేసే విషయంలో మన సహకారాన్ని కోరితే లేక దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద దైవపరిపాలనా సవరింపు జరిగితే మనం అడ్డుచెప్పకూడదు. మన హృదయపూర్వక సహకారం యెహోవాను ప్రీతిపరుస్తుంది, ఈ అంత్యదినాల్లో మన ఐక్యతను కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది.
సత్యాన్ని హత్తుకొని ఉండండి
6. యెహోవా ఆరాధికుల ఐక్యతపై సత్యం ఏ ప్రభావాన్ని కలిగివుంది?
6 యెహోవా ఆరాధికుల కుటుంబంలో భాగంగా, మనమందరం ‘యెహోవాచేత బోధింపబడ్డాము’ గనుక మనం ఐక్యత కల్గివుండి, బయల్పర్చబడిన ఆయన సత్యాన్ని దృఢంగా చేపట్టాలి. (యోహాను 6:45; కీర్తన 43:3) మన బోధలు దేవుని వాక్యంపై ఆధారపడి ఉన్నాయి గనుక, మనమందరం ఏకభావంతో మాట్లాడతాము. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా యెహోవా అందజేస్తున్న ఆత్మీయ ఆహారాన్ని మనం ఆనందంగా అంగీకరిస్తాము. (మత్తయి 24:45-47) ప్రపంచవ్యాప్తంగా మన ఐక్యతను కాపాడుకోవడానికి అలాంటి సమరూపతగల బోధ మనకు సహాయం చేస్తుంది.
7. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు వ్యక్తిగతంగా కష్టమైనట్లయితే, మనమేమి చేయాలి, ఏమి చేయకూడదు?
7 మనకు వ్యక్తిగతంగా ఏదైనా ఒక బోధను అర్థం చేసుకోవడం లేక అంగీకరించడం కష్టమైతే అప్పుడేమిటి? మనం జ్ఞానం కొరకు ప్రార్థించి, లేఖనాల్లోను క్రైస్తవ ప్రచురణల్లోను పరిశోధించడం ప్రారంభించాలి. (సామెతలు 2:4, 5; యాకోబు 1:5-8) ఒక పెద్దతో చర్చించడం సహాయకరంగా ఉండగలదు. అయినప్పటికీ విషయం అర్థంకాకపోతే, ఆ విషయాన్ని గురించి మరీ ఎక్కువ శ్రద్ధ కలిగివుండక పోవడం మంచిది. బహుశా ఆ విషయం మీద ఎక్కువ సమాచారం ప్రచురించబడవచ్చు, అప్పుడు మన గ్రహింపు విస్తృతం కావచ్చు. అయితే మన స్వంత భిన్న అభిప్రాయాన్ని అంగీకరించమని సంఘంలోని ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నించడం తప్పవుతుంది. ఇది విభేదాన్ని నాటినట్లు ఉంటుంది కాని ఐక్యతను కాపాడేదిగా ఉండదు. “సత్యమును అనుసరించి నడుచుకొనుచు” ఉండడం, అలా చేయడానికి ఇతరులను ప్రోత్సహించడం ఎంత మంచిది!—3 యోహాను 4.
8. సత్యం ఎడల ఏ దృక్పథాన్ని కలిగివుండడం యుక్తం?
8 మొదటి శతాబ్దంలో పౌలు ఇలా చెప్పాడు: “ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.” (1 కొరింథీయులు 13:12) తొలి క్రైస్తవులు అన్ని వివరాలను గ్రహించకపోయినప్పటికీ, ఐక్యంగానే ఉన్నారు. మనకిప్పుడు యెహోవా సంకల్పాన్ని గూర్చిన ఆయన వాక్య సత్యాన్ని గూర్చిన ఎంతో స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి మనం ‘నమ్మకమైన దాసుని’ ద్వారా పొందిన సత్యాన్నిబట్టి కృతజ్ఞత కలిగివుందాము. యెహోవా తన సంస్థ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడని మనం కృతజ్ఞత కలిగివుందాము. మనకు ఎప్పుడూ ఒకే అంత జ్ఞానం లేకపోయినప్పటికీ, మనం ఆత్మీయంగా ఆకలితో లేక దప్పికతో అలమటించలేదు. బదులుగా, మన కాపరియైన యెహోవా మనల్ని ఐక్యంగా ఉంచి మన గురించి మంచి శ్రద్ధ తీసుకున్నాడు.—కీర్తన 23:1-3.
నాలుకను సరిగా ఉపయోగించండి!
9. ఐక్యతను పెంపొందింపజేయడానికి నాలుకను ఎలా ఉపయోగించవచ్చు?
9 ఇతరులను ప్రోత్సహించడానికి నాలుకను ఉపయోగించడం ఐక్యతను, సహోదరత్వపు స్ఫూర్తిని పెంపొందింపజేసేందుకు ఒక ముఖ్య మార్గం. సున్నతిపై ఒక ప్రశ్నను పరిష్కరించిన లేఖను మొదటి శతాబ్దపు పరిపాలక సభ పంపింది, అది ప్రోత్సాహానికి మూలంగా ఉండినది. దాన్ని చదివిన తర్వాత, అంతియొకయలోని అన్యులైన శిష్యులు “ఆదరణ పొంది సంతోషించిరి.” ఆ పత్రిక ఇచ్చి యెరూషలేము నుండి పంపబడిన యూదా మరియు సీల “పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.” పౌలు బర్నబాల సాన్నిధ్యం అంతియొకయలోని తోటి విశ్వాసులను కూడా ప్రోత్సహించి బలపర్చిందనడంలో సందేహం లేదు. (అపొస్తలుల కార్యములు 15:1-3, 23-32) మనం క్రైస్తవ కూటాల కొరకు సమావేశమైనప్పుడు మన సాన్నిధ్యం ద్వారా, మన ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాల ద్వారా మనమూ అలాగే చేయవచ్చు.—హెబ్రీయులు 10:24, 25.
10. ఒకవేళ దూషించడం జరిగితే, ఐక్యతను కాపాడడానికి ఏమి చేయవలసి ఉంటుంది?
10 అయితే, మన నాలుకను తప్పుగా ఉపయోగించడం మన ఐక్యతకు ప్రమాదం కలుగజేయగలదు. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!” (యాకోబు 3:5) జగడములు కలుగజేసేవారిని యెహోవా ద్వేషిస్తాడు. (సామెతలు 6:16-19) అలాంటి మాటలు అనైక్యతను కలుగజేస్తాయి. ఆలాగైతే దూషించడం, అంటే ఎవరినైనా విపరీతంగా తిడితే లేదా అతనిని లేక ఆమెను అవమానించేలా మాట్లాడితే అప్పుడేమిటి? పెద్దలు తప్పిదస్థునికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, సంఘం యొక్క శాంతి భద్రతా ఐక్యతలను కాపాడేందుకు పశ్చాత్తాపపడని దూషకున్ని బహిష్కరిస్తారు. “సహోదరుడనబడిన వాడెవడైనను . . . తిట్టుబోతు . . . అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని” పౌలు వ్రాశాడు.—1 కొరింథీయులు 5:11.
11. మనకు ఒక తోటి విశ్వాసికి మధ్య ఉద్రిక్తత కలగడానికి కారణమైనదేదైనా మనం మాట్లాడివుంటే, నమ్రత ఎందుకు ప్రాముఖ్యము?
11 నాలుకకు కళ్లెము వేసుకోవడం ఐక్యతను కాపాడడానికి సహాయం చేస్తుంది. (యాకోబు 3:10-18) కాని మనం మాట్లాడినదేదైనా మనకు తోటి క్రైస్తవునికి మధ్య ఉద్రిక్తతను కలిగించిందనుకోండి. అవసరమైతే క్షమాపణ చెప్పడం ద్వారా మన సహోదరునితో సమాధానం ఏర్పరచుకోవడానికి చొరవ తీసుకోవడం యుక్తం కాదంటారా? (మత్తయి 5:23, 24) నిజమే, అలా చేయడానికి నమ్రత లేక దీనమనస్సు అవసరం, కాని పేతురిలా వ్రాశాడు: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5) మన పొరపాట్లను ఒప్పుకొని, తగిన విధంగా క్షమాపణ తెలిపి, మన సహోదరులతో ‘సమాధానము కలిగివుండడానికి’ నమ్రత మనల్ని పురికొల్పుతుంది. ఇది యెహోవా కుటుంబం యొక్క ఐక్యతను కాపాడడానికి సహాయం చేస్తుంది.—1 పేతురు 3:10, 11.
12. యెహోవా ప్రజల ఐక్యతను పెంపొందింపజేయడానికి, కాపాడుకోవడానికి మనం నాలుకను ఎలా ఉపయోగించవచ్చు?
12 మనం మన నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే, యెహోవా సంస్థలో ఉన్న వారిమధ్య కుటుంబ స్ఫూర్తిని పెంపొందింపజేయవచ్చు. పౌలు అదే చేశాడు గనుక, ఆయన థెస్సలొనీకయులకు ఇలా గుర్తుచేయగలిగాడు: “దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలయెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.” (1 థెస్సలొనీకయులు 2:11, 12) ఈ విషయంలో మంచి మాదిరి నుంచిన పౌలు తోటి క్రైస్తవులను ఇలా పురికొల్పగలిగాడు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి.” (1 థెస్సలొనీకయులు 5:14) ఇతరులను ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి, పెంపొందింపజేయడానికి నాలుకను ఉపయోగించడం ద్వారా మనం ఎంత మేలు చేయవచ్చో ఆలోచించండి. అవును, “సమయోచితమైన మాట యెంత మనోహరము!” (సామెతలు 15:23) అంతేగాక, అలాంటి సంభాషణ యెహోవా ప్రజల ఐక్యతను పెంపొందింపజేయడానికి, కాపాడడానికి సహాయం చేస్తుంది.
క్షమించేవారిగా ఉండండి!
13. మనం క్షమించేవారిగా ఎందుకుండాలి?
13 మనం క్రైస్తవ ఐక్యతను కాపాడాలంటే, తప్పుచేసి క్షమాపణ కోరిన వ్యక్తిని క్షమించడం అవసరం. మనం ఎంత తరచుగా క్షమించాలి? “ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్లమారులమట్టుకని” యేసు పేతురుతో చెప్పాడు. (మత్తయి 18:22) మనం క్షమించని వారమైతే, మనకేమి ప్రయోజనముండదు. అదెలా? శత్రుత్వం, పగ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మనం క్రూరులుగా, క్షమించనివారిగా పేరు పొందితే, మనపైకి మనమే బాధ తెచ్చుకోవచ్చు. (సామెతలు 11:17) పగపట్టడం దేవునికి హేయమైనది, అది తీవ్రమైన పాపానికి నడిపించగలదు. (లేవీయకాండము 19:18) బాప్తిస్మమిచ్చే యోహాను మీద “పగపట్టి”న దుష్టురాలైన హేరోదియ పన్నిన పన్నాగంలో ఆయన తల నరికి వేయబడిందని గుర్తుంచుకోండి.—మార్కు 6:19-28.
14. (ఎ) క్షమించడం గురించి మత్తయి 6:14, 15 మనకు ఏమి నేర్పిస్తుంది? (బి) మనం ఎవరినైనా క్షమించడానికి ముందు వారు క్షమాపణ చెప్పేంత వరకు ఎల్లప్పుడూ వేచివుండాలా?
14 యేసు నేర్పిన మాదిరి ప్రార్థనలో ఈ మాటలు ఉన్నాయి: “మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (లూకా 11:4) మనం క్షమించకపోతే, ఒకనాడు యెహోవా దేవుడు మన పాపాలను ఇక క్షమించకుండా ఉండే ప్రమాదం ఉంది, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” (మత్తయి 6:14, 15) యెహోవా ఆరాధికుల కుటుంబంలో ఐక్యతను కాపాడడానికి నిజంగా మన వంతు మనం చేయాలనుకుంటే, అనాలోచితంగా ఏ చెడు ఉద్దేశమూ లేకుండా చేసిన పొరపాటును బహుశా మరచిపోవడం ద్వారా మనం క్షమించేవారిగా ఉంటాము. పౌలు ఇలా చెప్పాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు [“యెహోవా,” NW] మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) మనం క్షమించినప్పుడు, మనం యెహోవా సంస్థ యొక్క అమూల్యమైన ఐక్యతను కాపాడడానికి సహాయం చేస్తాము.
ఐక్యత మరియు వ్యక్తిగత నిర్ణయాలు
15. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఐక్యతను కాపాడడానికి యెహోవా ప్రజలకు ఏది సహాయం చేస్తుంది?
15 వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ఆధిక్యతతో మరియు బాధ్యతతో దేవుడు మనల్ని స్వేచ్ఛాచిత్తంగల వారిగా చేశాడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20; గలతీయులు 6:5) అయినప్పటికీ, మనం బైబిలు కట్టడలకు, సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటాము గనుక మనం మన ఐక్యతను కాపాడుకోవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం వాటిని పరిగణనలోకి తీసుకుంటాము. (అపొస్తలుల కార్యములు 5:29; 1 యోహాను 5:3) తటస్థతకు సంబంధించి ఒక ప్రశ్న తలెత్తిందనుకోండి. మనం ‘లోకసంబంధులము కామని’ మనం ‘మన మచ్చుకత్తులను నాగటి నక్కులుగా సాగగొట్టుకున్నామని’ గుర్తుంచుకోవడం ద్వారా మనం జ్ఞానవంతమైన వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకోవచ్చు. (యోహాను 17:16; యెషయా 2:2-4) అలాగే, దేశంతో మన సంబంధం విషయంలో మనం ఒక వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకోవలసినప్పుడు, లౌకిక విషయాల్లో మనం “పై అధికారులకు” లోబడుతూ, ‘దేవునివి దేవునికి’ చెల్లించే విషయంలో బైబిలు చెబుతున్నదాన్ని పరిగణనలోకి తీసుకుంటాము. (లూకా 20:25; రోమీయులు 13:1-7; తీతు 3:1, 2) అవును, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు బైబిలు కట్టడలను, సూత్రాలను పరిగణనలోకి తీసుకోవడం మన క్రైస్తవ ఐక్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
16. లేఖనాధారంగా తప్పులేని లేక సరికాని నిర్ణయాలను తీసుకునేటప్పుడు, ఐక్యతను కాపాడడానికి మనమెలా సహాయం చేయగలము? వివరించండి.
16 లేఖనాధారంగా తప్పులేని లేక సరికాని, పూర్తిగా వ్యక్తిగతమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా మనం క్రైస్తవ ఐక్యతను కాపాడడానికి దోహదపడవచ్చు. అదెలా? మన నిర్ణయం ద్వారా ప్రభావితం కాగలవారి ఎడల ప్రేమపూర్వక శ్రద్ధ చూపించడం ద్వారా. ఉదాహరణకు: ప్రాచీన కొరింథులోని సంఘంలో, విగ్రహాలకు బలి అర్పింపబడిన మాంసముకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నిజమే, విగ్రహారాధన సంబంధమైన వేడుకలో ఒక క్రైస్తవుడు భాగం వహించడనుకోండి. అయితే, పూర్తిగా రక్తం చిందింపబడిన, అంగడిలో అమ్మబడే ఈ విధమైన మిగిలిపోయిన మాంసమును తినడం పాపమేమికాదు. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 10:25) అయితే, ఈ మాంసము తినడం గురించి కొంతమంది క్రైస్తవుల మనస్సాక్షి అభ్యంతరపడింది. కాబట్టి వారిని అభ్యంతరపర్చకుండా ఉండమని పౌలు ఇతర క్రైస్తవులను కోరాడు. వాస్తవానికి ఆయనిలా వ్రాశాడు: “కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.” (1 కొరింథీయులు 8:13) కాబట్టి, ఏ బైబిలు కట్టడ లేక సూత్రము ఇమిడి ఉండకపోయినప్పటికీ, దేవుని కుటుంబ ఐక్యతను ప్రభావితం చేసే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను పరిగణనలోకి తీసుకోవడం ఎంత ప్రేమపూర్వకమైనదిగా ఉంటుందోకదా!
17. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమి చేయడం కోరదగినది?
17 ఏ చర్య గైకొనాలో మనకు కచ్చితంగా తెలియకపోతే, మనం పరిశుభ్రమైన మనస్సాక్షి కలిగి ఉండేలా చేసేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జ్ఞానయుక్తంగా ఉంటుంది, మన నిర్ణయాన్ని ఇతరులు గౌరవించాలి. (రోమీయులు 14:10-12) అయితే, మనం వ్యక్తిగత నిర్ణయం తీసుకోవలసినప్పుడు మనం ప్రార్థనలో యెహోవా నడిపింపును కోరాలి. కీర్తనల గ్రంథకర్తలా, మనం నమ్మకంగా ఇలా ప్రార్థించవచ్చు: “నాకు నీ చెవియొగ్గి . . . నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. . . . నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే.”—కీర్తన 31:2, 3.
క్రైస్తవ ఐక్యతను ఎల్లప్పుడూ కాపాడండి
18. క్రైస్తవ సంఘ ఐక్యతను పౌలు ఎలా ఉదాహరించాడు?
18 మొదటి కొరింథీయులు 12వ అధ్యాయంలో, క్రైస్తవ సంఘ ఐక్యతను ఉదాహరించడానికి పౌలు మానవ శరీరాన్ని ఉపయోగించాడు. ఆయన పరస్పరం ఆధారపడడాన్ని, ప్రతి సభ్యుని ప్రాముఖ్యతను నొక్కి తెలియజేశాడు. “అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?” అని పౌలు ప్రశ్నించాడు. “అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. గనుక కన్ను చేతితో—నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో—మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.” (1 కొరింథీయులు 12:19-21) అలాగే, యెహోవా ఆరాధికుల కుటుంబంలోని మనమందరం ఒకే పని చేయము. అయినప్పటికీ, మనం ఐక్యంగా ఉంటాము, మనం ఒకరికొకరం అవసరం.
19. దేవుని ఆత్మీయ ఏర్పాట్ల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు, ఈ విషయంలో ఒక వృద్ధ సహోదరుడు ఏమి చెప్పాడు?
19 శరీరానికి ఆహారం శ్రద్ధ నడిపింపు అవసరమైనట్లే దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా సంస్థ ద్వారా అందజేస్తున్న ఆత్మీయ ఏర్పాట్లు మనకు అవసరం. ఈ ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందేందుకు మనం యెహోవా భూ కుటుంబంలో భాగమైవుండాలి. దేవుని సేవలో అనేక సంవత్సరాలు గడిపిన తర్వాత, ఒక సహోదరుడు ఇలా వ్రాశాడు: “అంతా స్పష్టంగా లేనప్పుడు అంటే 1914కు కొంచెం మునుపటి దినాల నుండి . . . సత్యం మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశిస్తున్న ఈనాటి వరకు నేను యెహోవా సంకల్పాలను గూర్చిన జ్ఞానానికి అనుగుణంగా జీవించగలిగినందుకు నేను కృతజ్ఞత కలిగివున్నాను. నాకు ఏదైనా ఒక విషయం ఎక్కువ ప్రాముఖ్యమైనదై ఉంటే అది యెహోవా యొక్క దృశ్య సంస్థకు సన్నిహితంగా ఉండడమే. మానవ తర్కంపై ఆధారపడడం ఎంత అనౌచిత్యమో నా తొలి అనుభవం నాకు నేర్పింది. ఒక్కసారి నా మనస్సు ఆ విషయంపై నిలిచిన తర్వాత, నమ్మకమైన సంస్థతోనే ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. ఒకరు యెహోవా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మరే విధంగా పొందగలరు?”
20. యెహోవా ప్రజలుగా మనం మన ఐక్యత గురించి ఏమి చేయడానికి నిశ్చయత కలిగి ఉండాలి?
20 లోకసంబంధమైన అంధకారం నుండి, అనైక్యత నుండి యెహోవా తన ప్రజలను వెలుపలికి పిలిచాడు. (1 పేతురు 2:9) తనతోను, మన తోటి విశ్వాసులతోను ఆయన మనల్ని ఆశీర్వాదకరమైన ఐక్యతలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు ఎంతో సమీపంలోవున్న నూతన విధానంలో ఈ ఐక్యత ఉంటుంది. కాబట్టి, ఈ అపాయకరమైన అంత్యదినములలో, ‘ప్రేమను ధరించుకోవడంలో’ కొనసాగుతూ, మన అమూల్యమైన ఐక్యతను పెంపొందింపజేసుకోవడానికి, కాపాడుకోవడానికి మనం చేయగలిగినదంతా చేద్దాము.—కొలొస్సయులు 3:14.
మీరెలా సమాధానమిస్తారు?
◻ దేవుని చిత్తాన్ని చేయడం, సత్యానికి హత్తుకొని ఉండడం ఐక్యతను కాపాడుకోవడానికి మనకు ఎందుకు సహాయం చేయగలదు?
◻ నాలుకను సరిగా ఉపయోగించడంతో ఐక్యత ఎలా సంబంధాన్ని కలిగి ఉంది?
◻ క్షమించేవారిగా ఉండడంలో ఏమి ఇమిడి ఉంది?
◻ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఐక్యతను ఎలా కాపాడుకోవచ్చు?
◻ క్రైస్తవ ఐక్యతను ఎందుకు కాపాడుకోవాలి?
[16వ పేజీలోని చిత్రం]
ఈ కాపరి తన మందను ఐక్యంగా ఉంచినట్లే, యెహోవా తన ప్రజలను ఐక్యంగా ఉంచుతాడు
[18వ పేజీలోని చిత్రం]
మనం ఇతరులను అభ్యంతరపర్చినప్పుడు నమ్రతగా క్షమాపణ చెప్పడం ద్వారా ఐక్యతను పెంపొందింపజేయడానికి మనం సహాయం చేస్తాము