‘మాకు ప్రార్థన చేయ నేర్పుము’
‘ప్రభువా మాకు ప్రార్థన చేయ నేర్పుము.’ యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు ఆ విజ్ఞప్తి చేశారు. (లూకా 11:1) పేరు తెలియని ఆ శిష్యుడు, ప్రార్థన ఎడల ఎంతో మెప్పుగల వ్యక్తి అన్నది స్పష్టమౌతుంది. అలాగే నేడు నిజక్రైస్తవులు దాని ప్రాముఖ్యతను గుర్తిస్తారు. అసలు ప్రార్థన అన్నది విశ్వంలోని అత్యున్నతమైన వ్యక్తి మనం చెప్పేది వినేలా చేసే ఒక మార్గం! ఒక్కసారి ఆలోచించండి! ‘ప్రార్థన ఆలకించువాడు’ మన చింతల ఎడల, వ్యాకులతల ఎడల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తాడు. (కీర్తన 65:2) ఇంకా ప్రాముఖ్యంగా, ప్రార్థన ద్వారా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము.—ఫిలిప్పీయులు 4:6.
అయినప్పటికీ, ‘ప్రార్థన చేయ మాకు నేర్పుమనే’ మాటలు కొన్ని గంభీరమైన ప్రశ్నలను ఉత్పన్నం చేస్తాయి. దేవున్ని సమీపించడానికి ప్రపంచమంతటిలో వివిధ మతాలు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. కాని, ప్రార్థించడంలో సరైన పద్ధతి ఒకటి, తప్పు పద్ధతి ఒకటి ఉందా? దానికి సమాధానంగా, ప్రార్థన ఇమిడివున్న కొన్ని జనాదరణ పొందిన మతాచారాలను మనం మొదట పరిశీలిద్దాం. లాటిన్ అమెరికాలో ఆచరింపబడే వాటివైపు మనం శ్రద్ధ మళ్లిద్దాం.
విగ్రహాలు మరియు “సంరక్షక పరిశుద్ధులు”
సాధారణంగా, లాటిన్ అమెరికా దేశాలు ఎంతో మతాసక్తిగలవి. ఉదాహరణకు, “సంరక్షక పరిశుద్ధులకు” ప్రార్థించడమనే జనాదరణ పొందిన ఆచారాన్ని ఒకరు మెక్సికో అంతటిలో కనుగొనవచ్చు. వాస్తవానికి, మెక్సికో పట్టణాల్లో “సంరక్షక పరిశుద్ధులను” కలిగివుండడం వాడుక, వారి కొరకు ప్రత్యేకమైన దినాల్లో పండుగలు జరిగేవి. మెక్సికోలోని కాథోలిక్‌లు వివిధ రకాలైన విగ్రహాలకు కూడా ప్రార్థిస్తారు. అయితే, ఏ “పరిశుద్ధుడు” ప్రేరేపింపబడతాడనేది ఆరాధికుడు ఏ విధమైన విజ్ఞప్తి చేయాలని కోరుకుంటాడనే దాని మీద ఆధారపడివుంటుంది. ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలని ఒక జత కొరకు చూస్తుంటే, అతడు ఆంథోనీ అనే “పరిశుద్ధునికి” క్రొవ్వొత్తి వెలిగించవచ్చు. ఎవరైనా వాహనం మీద ప్రయాణం ప్రారంభించబోతుంటే అతడు ప్రయాణికులకు, ప్రాముఖ్యంగా మోటారు వాహనాలపై ప్రయాణించే వారికి పరిశుద్ధుడైన క్రిస్టఫర్ “పరిశుద్ధుని” అండకు వెళ్లవచ్చు.
అయితే, ఆ ఆచారాలు ఎక్కడి నుండి వచ్చాయి? స్పెయిన్ దేశస్థులు మెక్సికోకు వచ్చినప్పుడు, వారు అన్య దేవతారాధనకు తమను తాము సమర్పించుకున్న సామాన్య ప్రజలను కనుగొన్నారని చరిత్ర చూపిస్తుంది. లోస్ ఆస్టెకాస్, హాంబ్రె ఈ ట్రీబూ (ఆస్టెక్స్, మానవుడు మరియు తెగ) అనే తన పుస్తకంలో విక్టర్ వాల్ఫ్‌గాంగ్ వాన్ హాగెన్ ఇలా చెబుతున్నాడు: “వ్యక్తిగత దేవుళ్లు ఉండేవారు, ప్రతి మొక్కకు దాని దేవుడు ఉండేవాడు, ప్రతి కార్యానికి దేవుడు లేక దేవత ఉండేవారు, చివరికి ఆత్మహత్యలకు కూడా ఒక దేవుడు ఉండేవాడు. యాకాటెకూట్లీ అనే వాడు వ్యాపారుల దేవునిగా ఉండేవాడు. అనేకమంది దేవుళ్లుగల ఈ లోకంలో, దేవుళ్లందరికీ స్పష్టంగా నిర్వచింపబడిన దృక్పథాలు, సంకల్పాలు ఉండేవి.”
ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన స్పెయిన్ దేశస్థులు స్థానికులను “క్రైస్తవీకరించాలని” ప్రయత్నించినప్పుడు, వారు కేవలం భక్తిని తమ విగ్రహాల నుండి చర్చికి చెందిన “పరిశుద్ధుల” వైపుకు మరల్చుకునేంతగా, ఈ దేవుళ్లు కాథోలిక్‌ల “పరిశుద్ధులతో” పోలిక కలిగివుండేవారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నందలి ఒక శీర్షిక, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో అనుసరించే కాథోలిక్ మత అన్యాచార మూలాలను గుర్తించింది. ఒక ప్రాంతంలో, సామాన్య ప్రజలు ఆరాధించే 64 మంది “పరిశుద్ధుల”లోని అనేకులు “ప్రత్యేక మైయన్ దేవుళ్లకు” ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అది తెలియజేసింది.
“పరిశుద్ధునికి, అతనికి ప్రార్థించే ప్రజలకు మధ్య నమ్మకమైన సన్నిహితత్వపు బంధం స్థాపించబడింది, . . . ఆ బంధం క్రీస్తుతోను దేవునితోను ఉన్న సంబంధాన్ని తప్పుదోవ పట్టించే బదులు దాన్ని బలపరుస్తుంది, పటిష్ఠం చేస్తుంది” అని న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లోపీడియా వాదిస్తోంది. స్పష్టంగా అన్యమత చిహ్నమైన ఆ బంధం సత్యదేవునితో ఒకరికిగల సంబంధాన్ని ఎలా పటిష్ఠపరచగలదు? అలాంటి “పరిశుద్ధుల”కు చేయబడే ప్రార్థనలు నిజంగా దేవున్ని ప్రీతిపర్చగలవా?
జపమాల మూలం
మరో జనాదరణ పొందిన ఆచారంలో జపమాలను ఉపయోగించడం ఇమిడి ఉంది. డిక్యొనార్యొ ఎన్‌సైక్లొపీడికొ హిస్‌పానో అమెరికానొ (హిస్ పానిక్ అమెరికన్ ఎన్‌సైక్లోపెడిక్ డిక్షనరి) జపమాలను ఇలా వర్ణిస్తుంది: “అది యాభై లేక నూట యాభై పూసలతో చేయబడిన మాల, ఆ పూసలకంటే పెద్దగా ఉండే పూసలతో అవి పది పది చొప్పున వేరుచేయబడి ఉంటాయి. చివర్లలో క్రీస్తు శిలువమీదవున్న బొమ్మతో అది ముడివేయబడి ఉంటుంది, ప్రస్తుతం దానికి ముందు మూడు పూసలు ఉంటున్నాయి.”
జపమాల ఎలా ఉపయోగించబడుతుందో వివరిస్తూ, ఒక కాథోలిక్ ప్రచురణ ఇలా చెబుతుంది: “పరిశుద్ధ జపమాల మన విమోచన యొక్క మర్మాలను గూర్చిన మౌఖిక మరియు మానసిక ప్రార్థన వంటిది. అది పదిహేను డికేడ్‌లతో చేయబడి ఉంటుంది. ప్రతి డికేడ్‌లో ఒకసారి ప్రభువు ప్రార్థన, పది మరియ స్తుతులు మరియు ఒకసారి తండ్రికి స్తుతి వల్లించడం ఉంటుంది. ప్రతి డికేడ్ సమయంలోను ఒక మర్మాన్ని ధ్యానిస్తారు.” ఆ మర్మాలు కాథోలిక్‌లు ఎరిగి ఉండవలసిన సిద్ధాంతాలు లేక బోధలు, ఈ సందర్భంలో అవి క్రీస్తు యేసు జీవితం, వేదన, మరణాలకు సంబంధించినవి.
ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “జపమాలతో ప్రార్థించే తొలి విధానాలు క్రైస్తవత్వంలో మధ్యయుగాల్లో ప్రారంభమయ్యింది కాని అది 1400లలో మరియు 1500లలో మాత్రమే వ్యాప్తి చెందింది.” జపమాల ఉపయోగం కేవలం కాథోలిక్ మతానికి మాత్రమే పరిమితమై ఉందా? కాదు. డిక్యొనార్యొ ఎన్‌సైక్లొపీడికొ హిస్‌పానో అమెరికానొ ఇలా చెబుతుంది: “ఇస్లాము, లామా, బౌద్ధ ఆరాధనలలో అలాంటి పూసలే ఉపయోగించబడతాయి.” వాస్తవానికి, “మహమ్మదీయులు తమ జపమాలను బౌద్ధుల నుండి తీసుకున్నారని, మత యుద్ధాల సమయంలో క్రైస్తవులు మహమ్మదీయుల నుండి తీసుకున్నారని కొంతమంది రచయితలంటారు” అని డిక్యొనార్యొ డె రెలిజ్యనోస్ (డిక్షనరీ ఆఫ్ రిలీజియన్స్) తెలియజేస్తుంది.
అనేక ప్రార్థనలు పునరుచ్చరించడం అవసరమైనప్పుడు, జపమాల జ్ఞాపికగా పనిచేస్తుందని కొంతమంది వాదిస్తారు. కాని దాని ఉపయోగంతో దేవుడు ప్రీతిచెందుతాడా?
అలాంటి ఆచారాల ఔచిత్యాన్ని గూర్చి లేక విలువను గూర్చి మనం ఊహించవలసిన అవసరం గాని వాదించవలసిన అవసరం గాని లేదు. ఎలా ప్రార్థించాలో నేర్పమని తన అనుచరులు చేసిన విజ్ఞప్తికి యేసు అధికారపూర్వక ప్రత్యుత్తరమిచ్చాడు. ఆయన చెప్పినది జ్ఞానోదయం కలిగిస్తుంది, బహుశా కొంతమంది చదువరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
[3వ పేజీలోని చిత్రం]
కాథోలిక్‌లు సాధారణంగా జపమాల పూసలను వాడతారు. వాటి మూలం ఏమిటి?