మనం దేవునికి ఎలా ప్రార్థించాలి?
ప్రార్థన గురించి ఉపదేశం ఇవ్వమని ఒక శిష్యుడు అడిగినప్పుడు, యేసు నిరాకరించలేదు. లూకా 11:2-4 ప్రకారం, “మీరు ప్రార్థన చేయునప్పుడు—తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని” ఆయన చెప్పాడు. ఇది సాధారణంగా ప్రభువు ప్రార్థన అని పిలువబడుతుంది. దానిలో ఎంతో సమాచారం ఉంది.
ప్రాథమికంగా, మన ప్రార్థనలు ఎవరిని సంబోధిస్తూ ఉండాలో మొట్టమొదటి పదాలు తెలియజేస్తాయి—మన తండ్రికి. మరే ఇతర వ్యక్తికి, విగ్రహానికి, “పరిశుద్ధునికి” లేక చివరికి తనకు ప్రార్థన చేయవచ్చునని యేసు ఎంతమాత్రం చెప్పలేదని గమనించండి. అసలు, దేవుడు ఇలా ప్రకటించాడు: “మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.” (యెషయా 42:8) ఆరాధికుడు ఎంత యథార్థవంతుడైనప్పటికీ, మన పరలోక తండ్రికి కాకుండా మరి దేనికైనా లేక మరెవరికైనా చేసే ప్రార్థనలను ఆయన వినడు. బైబిలులో, యెహోవా దేవుడు మాత్రమే ‘ప్రార్థన ఆలకించువాడని’ పిలువబడ్డాడు.—కీర్తన 65:2.
“పరిశుద్ధులు” దేవునితో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారని కొందరనవచ్చు. కాని యేసు తానే ఇలా ఉపదేశించాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును.” (యోహాను 14:6, 13) పరిశుద్ధుడని పిలువబడే ఎవరైనా మధ్యవర్తి పాత్ర నిర్వహించగలరనే తలంపును యేసు అలా త్రోసిపుచ్చాడు. క్రీస్తు గురించి అపొస్తలుడైన పౌలు ఏమి చెప్పాడో కూడా గమనించండి: “అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే.” “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు.”—రోమీయులు 8:34; హెబ్రీయులు 7:25.
పరిశుద్ధపరచబడవలసిన నామం
యేసు ప్రార్థనలోని తర్వాతి పదాలు ఇలా ఉన్నాయి: “నీ నామము పరిశుద్ధపరచబడును గాక.” ఎవరికైనా దేవుని నామం తెలియకపోతే, దాన్ని ఉపయోగించకపోతే వారు దాన్ని ఎలా పరిశుద్ధపరచగలరు అంటే పవిత్రపరచగలరు లేక ప్రత్యేకపరచగలరు? “పాత నిబంధన”లో 6,000 కంటే ఎక్కువసార్లు, దేవుడు యెహోవా అనే తన వ్యక్తిగత నామంతో గుర్తింపబడ్డాడు.
కాథోలిక్ డ్యుయే వర్షన్ నందు నిర్గమకాండము 6:3 మీద ఒక అధఃసూచి దేవుని నామాన్ని గురించి ఇలా చెబుతోంది: “కొంతమంది ఆధునికులు యెహోవా అనే నామాన్ని రూపించారు . . . , ఎందుకంటే హెబ్రీ లేఖనాల్లో ఉన్న [దేవుని] నామాన్ని ఎంతోకాలంగా ఉపయోగించనందున దాని అసలైన ఉచ్చారణ ఇప్పుడు తెలియడంలేదు.” కాబట్టి కాథోలిక్ న్యూ జెరూసలెమ్ బైబిల్ యహ్‌వహ్ అనే నామాన్ని ఉపయోగిస్తుంది. కొంతమంది పండితులు ఆ ఉచ్చారణ సరైనదని భావిస్తున్నప్పటికీ, తెలుగులో దైవిక నామాన్ని ఉచ్చరించడానికి “యెహోవా” అనేది సరియైన మరియు ఎంతోకాలం క్రితం స్థాపించబడిన విధానం. దైవిక నామాన్ని ఉచ్చరించడానికి ఇతర భాషలకు వాటి వాటి స్వంత శైలి ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నామాన్ని పరిశుద్ధపరిచేందుకు దాన్ని ఉపయోగించడమే. ప్రార్థనలో యెహోవా అనే నామాన్ని ఉపయోగించమని మీ చర్చి మీకు నేర్పిందా?
ప్రార్థనకు తగిన అంశాలు
ఆ తర్వాత యేసు తన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు: “నీ రాజ్యము వచ్చుగాక.” మత్తయి సువార్త ఇంకా ఈ పదాలను చేరుస్తుంది: “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:10) దేవుని రాజ్యం యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న ప్రభుత్వం. (యెషయా 9:6, 7) బైబిలు ప్రవచనం ప్రకారం, అది త్వరలోనే మానవ ప్రభుత్వాలన్నిటినీ నిర్మూలించి, విశ్వశాంతి యుగాన్ని తీసుకువస్తుంది. (కీర్తన 72:1-7; దానియేలు 2:44; ప్రకటన 21:3-5) కాబట్టి నిజక్రైస్తవులు రాబోయే దేవుని రాజ్యాన్ని తమ ప్రార్థనల్లో మరల మరల వచ్చే అంశంగా చేసుకుంటారు. అలా చేయమని మీ చర్చి మీకు నేర్పిందా?
ఆసక్తికరంగా, మన ప్రార్థనలలో మనకు అవసరమైన వ్యక్తిగత విషయాలను చేర్చవచ్చునని కూడా యేసు చూపించాడు. ఆయనిలా చెప్పాడు: “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము.” (లూకా 11:3, 4) అనుదిన విషయాల్లో మనం దేవుని చిత్తాన్ని కోరవచ్చునని, మనల్ని కలతపరిచే లేక మన మనశ్శాంతిని భంగపరిచే దేని గురించైనా మనం యెహోవాను సమీపించవచ్చునని యేసు మాటలు సూచిస్తున్నాయి. దేవున్ని ఈ విధంగా క్రమంగా వేడుకోవడం, మనం ఆయనమీద ఆధారపడివున్నామనేదాన్ని గుణగ్రహించడానికి మనకు సహాయం చేస్తుంది. అలా మనం మన జీవితాల్లో ఆయన ప్రభావాన్ని మరింత ఎక్కువగా గుర్తెరుగుతాము. అలాగే ప్రతిరోజు మనం మన తప్పుల గురించి దేవుని క్షమాపణను కోరడం ప్రయోజనకరమైనదే. అలా మనం మన బలహీనతల గురించి బాగా తెలుసుకుంటాము, ఇతరుల తప్పులను మరింత సహించగలుగుతాము. ప్రాముఖ్యంగా ఈ ప్రపంచం యొక్క దిగజారిపోతున్న నైతికతల దృష్ట్యా, శోధన నుండి తప్పించమని మనం ప్రార్థించాలని యేసు పురికొల్పడం కూడా తగినదే. ఆ ప్రార్థనతో పొందికగా, తప్పుచేయడానికి మనల్ని నడిపించగల పరిస్థితులను, సందర్భాలను తప్పించుకొనేందుకు మనం జాగ్రత్త కలిగివుంటాము.
కాబట్టి, దేవునికి ప్రీతికరమైన ప్రార్థనలను చేయడాన్ని గూర్చి ప్రభువు ప్రార్థన మనకు ఎంతో చెబుతుందనడంలో ఏ సందేహమూ లేదు. కాని మనం ఈ ప్రార్థనను తీసుకుని, కేవలం దాన్ని క్రమంగా వల్లిస్తూ ఉండాలని యేసు ఉద్దేశించాడా?
ప్రార్థనపై మరింత సలహా
ప్రార్థన గురించి యేసు మరిన్ని సూచనలిచ్చాడు. మత్తయి 6:5, 6 నందు మనమిలా చదువుతాము: “మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; . . . నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.” ప్రార్థన అన్నది ఎవరినైనా ప్రభావితం చేయడానికన్నట్లుగా, నలుగురు చూడాలనే రీతిగా చేయకూడదని ఈ మాటలు మనకు బోధిస్తున్నాయి. బైబిలు చెబుతున్నట్లు, మీరు మీ హృదయాన్ని యెహోవా ఎదుట ఏకాంతంగా కుమ్మరిస్తారా?—కీర్తన 62:8.
యేసు ఈ హెచ్చరికనిచ్చాడు: “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.” (మత్తయి 6:7) స్పష్టంగా, ప్రార్థనలను బట్టీపట్టడాన్ని లేక వాటిని ఏదైనా పుస్తకంలో నుండి చదవడాన్ని యేసు ఎన్నడూ అంగీకరించలేదు. ఆయన మాటలు జపమాల ఉపయోగాన్ని కూడా త్రోసిపుచ్చాయి.
ఒక కాథోలిక్ జపగ్రంథము ఇలా అంగీకరిస్తోంది: “మనం దుఃఖంలో ఉన్నప్పుడు లేక మనం అనుదినం ఆయనను స్తుతించేటప్పుడు కృతజ్ఞతతో లేక అవసరతతో ఆయనవైపు తిరిగి మనకు అప్పటికప్పుడు వచ్చే తలంపులను తెలియజేసేదే మన శ్రేష్ఠమైన ప్రార్థన అయ్యుండగలదు.” యేసు స్వంత ప్రార్థనలు అప్పటికప్పుడు చేసినవేగాని జ్ఞాపకం ఉంచుకుని చేసినవి కావు. ఉదాహరణకు, యోహాను 17వ అధ్యాయంలో వ్రాయబడివున్న యేసు చేసిన ప్రార్థనను చదవండి. యెహోవా నామం పరిశుద్ధపరచబడడాన్ని చూడాలని యేసుకున్న కోరికను నొక్కి తెలియజేస్తూ అది మాదిరి ప్రార్థనతో పొందిక కలిగివుంది. యేసు చేసిన ప్రార్థన అప్పటికప్పుడు చేసినది, హృదయాంతరాళాల్లో నుండి వచ్చినది.
దేవుడు ఆలకించే ప్రార్థనలు
బట్టీపట్టిన ప్రార్థనలు చేయడం, “పరిశుద్ధుల”కు లేక విగ్రహాలకు ప్రార్థించడం, లేదా జపమాల వంటి మతసంబంధమైన వస్తువులను ఉపయోగించడం వంటివి మీకు నేర్పబడినట్లయితే, యేసు చూపించిన మాదిరి ప్రకారం ప్రార్థన చేయడం మొదట్లో మీకు కొంత కష్టంగానే ఉండవచ్చు. అయితే, దేవుని గురించి అంటే ఆయన నామం, ఆయన సంకల్పాలు, ఆయన వ్యక్తిత్వం వంటివాటి గురించి తెలుసుకోవడమే దానికి పరిష్కారం. బైబిలును క్షుణ్ణంగా పఠించడం ద్వారా మీరు దీన్ని సాధించవచ్చు. (యోహాను 17:3) ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంసిద్ధంగా, సుముఖంగా ఉన్నారు. అంతెందుకు, ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడానికి’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమందికి వారు సహాయం చేశారు. (కీర్తన 34:8) మీరు దేవున్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత ఎక్కువగా ప్రార్థనలో ఆయనను స్తుతించడానికి మీరు పురికొల్పబడతారు. భక్తితో కూడిన ప్రార్థనలో మీరు యెహోవాకు ఎంత దగ్గరైతే, ఆయనతో మీకుగల సంబంధం అంత సన్నిహితమౌతుంది.
కాబట్టి దేవుని సత్యారాధికులందరూ “యెడతెగక ప్రార్థనచేయుడి” అని పురికొల్పబడుతున్నారు. (1 థెస్సలొనీకయులు 5:17) మీ ప్రార్థనలు యేసుక్రీస్తు ఇచ్చిన ఉపదేశాలతో సహా బైబిలుతో నిజంగా పొందిక కలిగివుండేలా చూసుకోండి. ఈ విధంగా, మీ ప్రార్థనలకు దేవుని అంగీకారం ఉంటుందని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు.
[7వ పేజీలోని చిత్రం]
మనం యెహోవా గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, హృదయపూర్వకంగా ఆయనకు ప్రార్థించడానికి మనం అంత ఎక్కువగా పురికొల్పబడతాము