కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 5/15 పేజీలు 10-15
  • అంకితభావంతో చదవండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంకితభావంతో చదవండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘చదువువాడు ధన్యుడు’
  • శ్రద్ధతో ఆలోచించండి మరియు ధ్యానించండి
  • పాత విషయాలతో క్రొత్త విషయాలను చేర్చండి
  • లేఖనాధార సంఘటనలను దృశ్యీకరించుకోండి
  • విలువైన పాఠాలు నేర్చుకోవడం
  • కుటుంబమంతా కలిసి బైబిలు చదవడం ద్వారా ప్రయోజనం పొందండి
  • చదవడం మరియు క్రైస్తవ పరిచర్య
  • చదవడం మీద శ్రద్ధ వహించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని వాక్యంలో ఆనందించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 5/15 పేజీలు 10-15

అంకితభావంతో చదవండి

“నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.”—1 తిమోతి 4:13.

1. బైబిలు చదవడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందగలము?

యెహోవా దేవుడు మానవజాతికి చదవడం, వ్రాయడం నేర్చుకునే అద్భుతమైన సామర్థ్యాన్నిచ్చాడు. మనకు చక్కని ఉపదేశమివ్వడానికి ఆయన తన వాక్యమైన బైబిలును కూడా అందించాడు. (యెషయా 30:20, 21) సూచనార్థకంగా, దాని పుటలు, దేవునికి భయపడే పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల వంటివారితో ‘నడిచేందుకు’ మనకు వీలు కలిగిస్తాయి. శారా, రిబ్కా, యథార్థవంతురాలైన మోయాబీయురాలగు రూతు వంటి దైవభక్తిగల స్త్రీలను మనం ‘చూడవచ్చు.’ అవును, యేసుక్రీస్తు తన కొండమీది ప్రసంగాన్ని ఇవ్వడాన్ని మనం ‘వినవచ్చు.’ మనం మంచి చదువరులమైతేనే, పరిశుద్ధ లేఖనాల్లోని ఈ ఆనందము మరియు అందులోని గొప్ప ఉపదేశాలూ మన స్వంతం కాగలవు.

2. యేసు, ఆయన అపొస్తలులు బాగా చదవగలరని ఏది సూచిస్తుంది?

2 నిస్సందేహంగా, పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తుకు చదవడంలో మహాగొప్ప సామర్థ్యం ఉంది, కచ్చితంగా ఆయనకు హెబ్రీ లేఖనాలు ఎంతో బాగా తెలుసు. కాబట్టి, అపవాది శోధించినప్పుడు, యేసు పదే పదే వాటిని సూచిస్తూ, ‘అని వ్రాయబడియున్నది’ అని చెప్పాడు. (మత్తయి 4:4, 7, 10) ఆయన ఒక సందర్భంలో నజరేతులోని సమాజ మందిరంలో, యెషయా ప్రవచనం యొక్క ఒక భాగాన్ని బహిరంగంగా చదివి, దాన్ని తనకు అన్వయించుకున్నాడు. (లూకా 4:16-21) యేసు అపొస్తలుల విషయమేమిటి? వారి వ్రాతల్లో, వారు తరచూ హెబ్రీ లేఖనాలను ఉదహరించారు. పేతురు మరియు యోహానులు ఉన్నత విద్యకు సంబంధించిన హెబ్రీ పాఠశాలల్లో విద్య అభ్యసించనందుకు యూదా పరిపాలకులు వారిని చదువురాని వారిగా దృష్టించినప్పటికీ, దైవిక ప్రేరణగల వారి లేఖలు వారు చక్కగా చదవగలరని, వ్రాయగలరని రుజువు చేస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 4:13) అయితే, చదవగల సామర్థ్యం నిజంగా ప్రాముఖ్యమా?

‘చదువువాడు ధన్యుడు’

3. లేఖనాలను మరియు క్రైస్తవ ప్రచురణలను చదవడం ఎందుకంత ప్రాముఖ్యము?

3 లేఖనాల్లోని కచ్చితమైన జ్ఞానాన్ని పొంది, దాన్ని అన్వయించుకోవడం నిరంతర జీవాన్ని ఇవ్వగలదు. (యోహాను 17:3) కాబట్టి, పరిశుద్ధ లేఖనాలను, అభిషిక్త క్రైస్తవులతో కూడిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా దేవుడు అందించే క్రైస్తవ ప్రచురణలను చదవడం, పఠించడం అత్యంత ప్రాముఖ్యమని యెహోవా సాక్షులు గుర్తిస్తారు. (మత్తయి 24:45-47) వాస్తవానికి, ప్రత్యేకంగా రూపొందించబడిన వాచ్‌ టవర్‌ ప్రచురణలను ఉపయోగించి వేలమందికి చదవడానికి, తద్వారా దేవుని వాక్యంలోని జీవాన్నిచ్చే జ్ఞానాన్ని పొందడానికి నేర్పబడింది.

4. (ఎ) దేవుని వాక్యాన్ని చదివి, పఠించి, అన్వయించుకోవడం ద్వారా సంతోషం ఎందుకు కలుగుతుంది? (బి) చదవడానికి సంబంధించి పౌలు తిమోతితో ఏమి చెప్పాడు?

4 దేవుని వాక్యాన్ని చదివి, పఠించి, అన్వయించుకోవడం ద్వారా సంతోషం లభిస్తుంది. అలా చేయడం ద్వారా మనం దేవున్ని ప్రీతిపరచి ఘనపరుస్తాము, ఆయన దీవెనలను అందుకుంటాము, ఆనందాన్ని అనుభవిస్తాము. తన సేవకులు సంతోషంగా ఉండాలని యెహోవా ఇష్టపడుతున్నాడు. అందుకే, ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలకు తన ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలని ఆయన యాజకులకు ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 31:9-12) లేఖికుడైన ఎజ్రా మరియు ఇతరులు, యెరూషలేములో సమకూడిన ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు, దాని భావం స్పష్టంగా తెలుపబడింది, తత్ఫలితంగా వారందరూ “సంభ్రమ” పడిరి. (నెహెమ్యా 8:6-8, 12) క్రైస్తవ అపొస్తలుడైన పౌలు తన జత పనివాడైన తిమోతికి తర్వాత ఇలా చెప్పాడు: “నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.” (1 తిమోతి 4:13) మరో అనువాదంలో ఇలా ఉంది: ‘అంకితభావంతో లేఖనాలను బహిరంగముగా చదువుము.’—న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌.

5. ప్రకటన 1:3 సంతోషాన్ని, చదవడంతో ఎలా జత చేస్తుంది?

5 దేవుని వాక్యాన్ని చదవడం, దాన్ని అన్వయించుకోవడంపై మన ఆనందం ఆధారపడి ఉంటుందని ప్రకటన 1:3 నందు స్పష్టపర్చబడింది. అక్కడ మనకిలా చెప్పబడింది: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” అవును, మనం ప్రకటనలోని మరియు లేఖనాలన్నిటిలోని దేవుని ప్రవచనార్థక మాటలను చదవడం, వినడం అవసరం. ‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే’ వ్యక్తి నిజమైన ఆనందం గల వ్యక్తి. దాని ఫలితం? “అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:1-3) కాబట్టి, మంచి కారణాలనుబట్టి మనం వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, స్నేహితులతో కలిసి ఆయన వాక్యాన్ని చదివి పఠించాలని యెహోవా సంస్థ మనలో ప్రతి ఒక్కరిని కోరుతోంది.

శ్రద్ధతో ఆలోచించండి మరియు ధ్యానించండి

6. యెహోషువ ఏమి చదవమని ఆదేశించబడ్డాడు, ఇది ఎలా ప్రయోజనకరమైనది?

6 మీరు దేవుని వాక్యాన్ని మరియు క్రైస్తవ ప్రచురణలను చదవడంవల్ల ఎలా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలరు? దైవ భయంగల, ప్రాచీన ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువ చేసినట్లే మీరూ చేయడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆయనకిలా ఆజ్ఞాపించబడింది: “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ 1:8) ‘ధ్యానించడం’ అంటే పదాలను తగ్గు స్వరంలో మీకు మీరు చెప్పుకోవడం. ఇది జ్ఞాపకముంచుకోవడానికి ఒక సహాయకం, ఎందుకంటే ఇది విషయాన్ని మనస్సుపై ముద్రిస్తుంది. యెహోషువ దేవుని ధర్మశాస్త్రాన్ని “దివారాత్రము” లేక క్రమంగా చదవాల్సి ఉంది. దేవుడిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడంలో విజయం సాధించడానికి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి అదే మార్గం. దేవుని వాక్యాన్ని అలా క్రమంగా చదవడం మీకు కూడా అదే విధంగా సహాయం చేయగలదు.

7. మనం దేవుని వాక్యాన్ని చదవడంలోగల వేగంపై ఎందుకు మన అవధానాన్ని ఉంచకూడదు?

7 దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చదివే వేగంమీద మీ అవధానాన్ని ఉంచకండి. బైబిలు చదవడానికి లేక ఏదైనా క్రైస్తవ ప్రచురణను చదవడానికి మీరు కొంత సమయాన్ని వెచ్చించాలనుకుంటే, మీరు నెమ్మదిగా చదువుకోవచ్చు. విశేషమైన అంశాలను జ్ఞాపకముంచుకోవాలనే ఉద్దేశంతో మీరు చదువుతున్నట్లయితే, అప్పుడిది ఎంతో ప్రాముఖ్యం. మీరు చదివేటప్పుడు శ్రద్ధతో ఆలోచించండి. బైబిలు రచయిత వ్యాఖ్యానాలను విశ్లేషించండి. ‘ఆయన ఉద్దేశమేమిటి? ఈ సమాచారాన్ని నేను ఎలా అన్వయించుకోగలను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

8. లేఖనాలను చదివేటప్పుడు ధ్యానించడం ఎందుకు ప్రయోజనకరము?

8 పరిశుద్ధ లేఖనాలను చదివేటప్పుడు ధ్యానించడానికి సమయం తీసుకోండి. బైబిలు వృత్తాంతాలను జ్ఞాపకముంచుకోవడానికి, లేఖనాధార సూత్రాలను అన్వయించుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, తద్వారా మీ మనస్సులో అంశాలను జ్ఞాపకముంచుకోవడం మీరు హృదయంలో నుండి మాట్లాడడానికి, యథార్థంగా ప్రశ్నించే వారికి మీరు చక్కని సమాధానాలు ఇవ్వడానికి, ఇలా చెప్పానేమిటా అని తర్వాత మీరు పశ్చాత్తాప పడకుండా ఉండడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. దైవ ప్రేరేపిత సామెత ఇలా చెబుతుంది: ‘నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ధ్యానించును.’—సామెతలు 15:28.

పాత విషయాలతో క్రొత్త విషయాలను చేర్చండి

9, 10. మీకు ముందే తెలిసిన వాటితో క్రొత్త లేఖనాధార అంశాలను జోడించడం ద్వారా మీ బైబిలు పఠనం ఎలా మెరుగుపడగలదు?

9 ఒకప్పుడు తమకు దేవుని గురించి, ఆయన వాక్యం గురించి, ఆయన సంకల్పాల గురించి కొంత మాత్రమే తెలిసి ఉందని అనేకమంది క్రైస్తవులు అంగీకరించవలసినదే. అయితే, నేడు, ఈ క్రైస్తవ పరిచారకులు సృష్టి మరియు మానవుడు పాపంలో పడిపోవడం మొదలుకొని క్రీస్తు బలి సంకల్పాన్ని వివరించగలరు, ఈ దుష్టవిధాన అంతం గురించి చెప్పగలరు, పరదైసు భూమిపై మానవులు నిత్యజీవంతో ఎలా ఆశీర్వదింపబడగలరో చూపించగలరు. ముఖ్యంగా యెహోవా సేవకులు బైబిలును, క్రైస్తవ ప్రచురణలను పఠించడం ద్వారా “దేవునిగూర్చిన విజ్ఞానము” పొందారు గనుకనే ఇది సాధ్యమౌతోంది. (సామెతలు 2:1-5) వారు అప్పటికే గ్రహించిన పాత విషయాలతో నేర్చుకుంటున్న క్రొత్త విషయాలను క్రమంగా జోడించారు.

10 క్రొత్త లేఖనాధార అంశాలను మీకు ఇప్పటికే తెలిసిన వాటితో జోడించడం ప్రయోజనకరంగా, ప్రతిఫలదాయకంగా ఉంటుంది. (యెషయా 48:17) బైబిలు కట్టడలు, సూత్రాలు, లేక చివరికి కొంత అస్పష్ట తలంపులు అందజేసినప్పుడు వీటిని, మీకు ఇప్పటికే తెలిసిన వాటితో జత చేయండి. “హితవాక్య ప్రమాణము” గురించి మీరు నేర్చుకున్నదానితో ఆ సమాచారాన్ని సమన్వయపర్చండి. (2 తిమోతి 1:13) దేవునితో మీకున్న సంబంధాన్ని బలపర్చుకునేందుకు మీకు సహాయం చేసే, మీ క్రైస్తవ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చే, లేదా బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకునేందుకు మీకు సహాయం చేసే సమాచారం కొరకు చూడండి.

11. ప్రవర్తన గురించి బైబిలు చెప్పే విషయాన్ని చదివేటప్పుడు మీరేమి చేయడం ప్రయోజనకరము? వివరించండి.

11 ప్రవర్తన గురించి బైబిలు చెప్పే విషయాన్ని చదివేటప్పుడు, దానిలో ఇమిడివున్న సూత్రాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. దానిపై ధ్యానించండి, అలాంటి పరిస్థితుల క్రింద మీరైతే ఏం చేస్తారో నిర్ణయించుకోండి. యాకోబు కుమారుడు యోసేపు, “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని” అడుగుతూ, పోతీఫరు భార్యతో లైంగిక దుర్నీతిలో పాల్గొనడానికి కచ్చితంగా నిరాకరించాడు. (ఆదికాండము 39:7-9) మనస్సును కదిలించే ఈ వృత్తాంతములో మీరు, లైంగిక దుర్నీతి దేవునికి వ్యతిరేకమైన పాపం అనే ఒక అంతర్లీన సూత్రాన్ని కనుగొంటారు. మనస్సులో మీరు ఈ సూత్రాన్ని దేవుని వాక్యంలోని ఇతర వ్యాఖ్యానాలతో జతచేయండి, అప్పుడు మీరు అలాంటి తప్పు చేయడానికి శోధింపబడితే ఆ సూత్రం నుండి ప్రయోజనం పొందగలిగేలా మీరు దాన్ని జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు.—1 కొరింథీయులు 6:9-11.

లేఖనాధార సంఘటనలను దృశ్యీకరించుకోండి

12. మీరు బైబిలు వృత్తాంతాలను చదువుతుండగా వాటిని ఎందుకు దృశ్యీకరించుకోవాలి?

12 మీరు చదివేటప్పుడు మీ మనస్సులో విషయాలను ముద్రింపజేసుకొనేందుకు, ఏమి జరుగుతుందో దాన్ని దృశ్యీకరించుకోండి. మానసిక దృష్టితో ప్రాంతాన్ని, గృహాలను, ప్రజలను చూడండి. వారి స్వరాలను వినండి. బట్టీలో కాలుతున్న రొట్టె వాసనను పీల్చుకోండి. ఊహలో దృశ్యాలను మళ్లీ చూడండి. అప్పుడు మీరు చదివేది మిమ్మల్ని పురికొల్పే అనుభవంగా ఉండగలదు, ఎందుకంటే మీరు ఒక ప్రాచీన నగరాన్ని చూడవచ్చు, ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించవచ్చు, సృష్టి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవచ్చు, లేక గొప్ప విశ్వాసంగల స్త్రీ పురుషులతో సహవసించవచ్చు.

13. న్యాయాధిపతులు 7:19-22 నందు వ్రాయబడిన దాన్ని మీరెలా వివరిస్తారు?

13 ఒకవేళ మీరు న్యాయాధిపతులు 7:19-22 చదువుతున్నారనుకోండి. అక్కడేమి జరుగుతోందో దృశ్యీకరించుకోండి. న్యాయాధిపతియైన గిద్యోను మరియు మూడొందల మంది ధైర్యవంతులైన ఇశ్రాయేలు పురుషులు మిద్యానీయుల పాళెము కొట్టకొనకు పోయి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. అప్పుడు దాదాపు రాత్రి పది గంటలు అంటే “నడిజాము” కాబోతుంది. మిద్యానీయుల కాపలాదారులు అప్పుడే తమ స్థానాలలో నిలబడ్డారు, ఇశ్రాయేలీయుల నిద్రిస్తున్న శత్రువుల శిబిరాన్ని చీకటి ఆవరించింది. చూడండి! గిద్యోను, ఆయన మనుష్యులు బూరలు పట్టుకొని ఉన్నారు. వారి ఎడమ చేతుల్లోవున్న దివిటీలను చాటుచేసేందుకు పెద్ద నీటి కుండలు వారి యొద్ద ఉన్నాయి. హఠాత్తుగా, ఒక్కో గుంపులో వందమంది చొప్పున ఉన్న మూడు గుంపులు ఒక్కసారిగా బూరలు ఊదుతూ, కుండలను పగులగొడుతూ, దివిటీలను పైకెత్తి, “యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము” అని కేకలు వేశారు. మీరు శిబిరం వైపు చూడండి. మిద్యానీయులు పారిపోతూ, అరవడం ప్రారంభిస్తారు! మూడువందలమంది తమ బూరలను ఊదుతుండగా, దేవుడు మిద్యానీయుల దండంతటిలోను ప్రతివాని ఖడ్గము వాని పొరుగువాని మీదికి త్రిప్పుతాడు. మిద్యానీయుల దండు తరుమబడింది, యెహోవా ఇశ్రాయేలీయులకు విజయాన్ని చేకూర్చాడు.

విలువైన పాఠాలు నేర్చుకోవడం

14. దీనత్వం కలిగి ఉండవలసిన అవసరతను గూర్చి ఒక బాలునికి బోధించడానికి న్యాయాధిపతులు 9వ అధ్యాయాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

14 దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీరు మీ పిల్లల్లో దీనత్వం కలిగివుండవలసిన అవసరతను నొక్కితెలియజేయాలి అనుకున్నారనుకోండి. గిద్యోను కుమారుడు యోతాము ప్రవచనంలో చెప్పబడిన విషయాన్ని దృశ్యీకరించుకొని, దాని ప్రాముఖ్యతను గ్రహించడం సులభం కావాలి. న్యాయాధిపతులు 9:8 చదవడం మొదలుపెట్టండి. యోతాము ఇలా చెప్పాడు, ‘చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరెను.’ ఓలీవ చెట్టు, అంజూర చెట్టు, ద్రాక్షావల్లి పరిపాలించడానికి నిరాకరించాయి. కాని తక్కువదైన ముండ్లపొద పరిపాలించడానికి ఇష్టపడింది. మీ పిల్లలకు ఈ వృత్తాంతాన్ని బిగ్గరగా చదివి వినిపించడం ద్వారా, విలువైన మొక్కలు తమతోటి ఇశ్రాయేలీయులపై పరిపాలనా స్థానాన్ని పొందాలని కోరుకొనని అర్హతగల వ్యక్తులను సూచించాయని మీరు వివరించవచ్చు. కేవలం వంటచెరకుగానే పనికివచ్చే ముండ్లపొద, ఇతరులపై ఆధిపత్యం వహించాలని కోరుకుంటూ చివరికి యోతాము ప్రవచనం ప్రకారం మరణించిన హంతకుడును, అహంకారియునైన అబీమెలెకు పరిపాలనకు ప్రాతినిధ్యం వహించింది. (న్యాయాధిపతులు 9వ అధ్యాయం) ఏ బాలుడు పెరిగి పెద్దవాడై, ముండ్లపొదవలె కావాలని కోరుకుంటాడు?

15. రూతు గ్రంథంలో యథార్థత యొక్క ప్రాముఖ్యత ఎలా ఉన్నతపర్చబడింది?

15 బైబిలు పుస్తకమైన రూతు గ్రంథంలో యథార్థత యొక్క ప్రాముఖ్యత స్పష్టం చేయబడింది. ఒకవేళ ఆ వృత్తాంతాన్ని బిగ్గరగా చదివి, అది చెప్పేదాన్ని గ్రహించడానికి మీ కుటుంబ సభ్యులు వంతులు తీసుకుంటున్నారనుకోండి. విధవరాలైన తన అత్త నయోమితో మోయాబీయురాలగు రూతు బేత్లెహేముకు ప్రయాణిస్తుండడాన్ని మీరు చూచి, రూతు ఇలా చెప్పడం మీరు వింటారు: “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు.” (రూతు 1:16) బోయజు పొలంలో కష్టపడి పనిచేసే రూతు, పంట కోసే వారివెనక పనలు ఏరుకోవడం కనిపిస్తుంది. “నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు” అని అతడు ఆమెను అభినందించడం మీరు వింటారు. (రూతు 3:11) త్వరలోనే, బోయజు రూతును వివాహం చేసుకుంటాడు. మరిది వివాహ ఏర్పాటుకు అనుగుణ్యంగా, ఆమె బోయజు ద్వారా “నయోమికొరకు” కుమారునికి జన్మనిచ్చింది. రూతు దావీదుకు, చివరికి యేసు క్రీస్తుకు పూర్వీకురాలవుతుంది. అలా ఆమె ‘సంపూర్ణ ప్రతిఫలం’ పొందుతుంది. అంతేగాక, లేఖనాధార వృత్తాంతాన్ని చదివేవారు ఈ విలువైన పాఠాన్ని నేర్చుకుంటారు అదేమిటంటే, యెహోవా ఎడల యథార్థంగా ఉండండి, మీరు అధికంగా ఆశీర్వదింపబడతారు.—రూతు 2:12; 4:17-22; సామెతలు 10:22; మత్తయి 1:1, 5, 6.

16. ముగ్గురు హెబ్రీయులు ఏ పరీక్షను ఎదుర్కొన్నారు, ఈ వృత్తాంతం మనకెలా సహాయం చేయగలదు?

16 షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే హెబ్రీయులను గూర్చిన వృత్తాంతం కష్టసమయాల్లో మనం దేవుని ఎడల యథార్థంగా ఉండడానికి సహాయం చేయగలదు. దానియేలు మూడవ అధ్యాయం బిగ్గరగా చదివినప్పుడు ఆ సంఘటనను దృశ్యీకరించుకోండి. బబులోను అధికారులు దూరాయనే మైదానంలో బంగారంతో చేయబడిన పెద్ద విగ్రహాలు ఉన్నచోట సమావేశమైయున్నారు. వాద్యధ్వనులు వినబడగానే వాళ్లు రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన విగ్రహానికి సాగిలపడి నమస్కరిస్తారు. అంటే, షద్రకు, మేషాకు, అబేద్నెగో తప్ప మిగతా అందరూ అలా చేస్తారు. రాజుతో వాళ్లు, తాము ఆయన దేవుళ్లకు సేవచేయమని, బంగారు విగ్రహానికి నమస్కరించమని గౌరవపూర్వకంగానే, అయితే స్థిరంగా చెబుతారు. ఈ హెబ్రీ యౌవనులు బాగా మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. కాని ఏమి జరుగుతుంది? తొంగి చూస్తున్న రాజు అందులో నలుగురు దృఢకాయులైన పురుషులను చూస్తాడు, వారిలో ఒకడు ‘దేవతల రూపము వంటి రూపము గలవాడు.’ (దానియేలు 3:25) ఆ ముగ్గురు హెబ్రీయులు అగ్నిగుండంలో నుండి బయటికి తీసుకురాబడతారు, నెబుకద్నెజరు వారి దేవున్ని స్తుతిస్తాడు. ఆ వృత్తాంతాన్ని దృశ్యీకరించుకోవడం ఎంతో ప్రయోజనకరం. పరీక్షా సమయంలో యెహోవా ఎడల యథార్థంగా ఉండడం గురించి అది ఎంత చక్కటి పాఠాన్ని బోధిస్తుందోకదా!

కుటుంబమంతా కలిసి బైబిలు చదవడం ద్వారా ప్రయోజనం పొందండి

17. బైబిలును కలిసి చదవడం ద్వారా మీ కుటుంబం నేర్చుకోగల కొన్ని ప్రయోజనకరమైన విషయాలను క్లుప్తంగా తెలియజేయండి.

17 బైబిలును కలిసి చదవడానికి మీరు క్రమంగా సమయాన్ని గడిపినట్లయితే, మీ కుటుంబం అనేక ప్రయోజనాలను పొందగలదు. ఆదికాండముతో ప్రారంభించి, సృష్టికార్యాన్ని దృశ్యీకరించుకొని, మానవుని ఆది పరదైసు గృహంలోకి మీరు తొంగిచూడవచ్చు. నమ్మకస్థులైన పూర్వీకుల, వారి కుటుంబాల అనుభవాలను పంచుకొని, ఇశ్రాయేలీయులు ఆరిన ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తుండగా వారిని అనుసరించవచ్చు. భారీకాయుడు, ఫిలిష్తీయుడునైన గొల్యాతును గొర్రెలకాపరి, బాలుడు అయిన దావీదు ఓడించడం మీరు చూడవచ్చు. మీ కుటుంబం యెరూషలేములోని యెహోవా ఆలయ నిర్మాణాన్ని గమనించవచ్చు, బబులోను సైన్యాలు దాన్ని నాశనం చేయడాన్ని చూడవచ్చు మరియు అధిపతియైన జెరుబ్బాబేలు ఆధ్వర్యంలో దాని పునర్నిర్మాణాన్ని దృష్టించవచ్చు. మీరు యేసు జననం గురించి దేవదూతలు చేస్తున్న ప్రకటనను బేత్లెహేము వద్దనున్న దీనులైన గొర్రెల కాపరులతోపాటు వినవచ్చు. ఆయన బాప్తిస్మం మరియు ఆయన పరిచర్యను గురించిన వివరాలను మీరు సేకరించవచ్చు, ఆయన తన మానవ జీవితాన్ని బలిగా అర్పించడాన్ని మీరు చూడవచ్చు, ఆయన పునరుత్థాన ఆనందాన్ని మీరు పంచుకోవచ్చు. తర్వాత మీరు అపొస్తలుడైన పౌలుతోపాటు ప్రయాణించి, క్రైస్తవత్వం వ్యాప్తి చెందుతుండగా సంఘాలు స్థాపించబడడం గమనించవచ్చు. తర్వాత మీ కుటుంబం, ప్రకటన గ్రంథంలో క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనతోపాటు భవిష్యత్తును గూర్చి అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన ఘనమైన దర్శనాన్ని ఆనందించవచ్చు.

18, 19. కుటుంబమంతా కలిసి బైబిలు చదవడాన్ని గురించి ఏ సలహాలు ఇవ్వబడ్డాయి?

18 మీ కుటుంబమంతా కలిసి బైబిలును బిగ్గరగా చదువుతున్నట్లయితే, దాన్ని స్పష్టంగా, ఉత్సాహంగా చదవండి. లేఖనాల్లోని కొన్ని భాగాలను చదివేటప్పుడు, కుటుంబంలోని ఒకరు—బహుశా తండ్రి—సాధారణ వృత్తాంతానికి సంబంధించిన వాటిని చదవవచ్చు. కుటుంబంలోని ఇతర సభ్యులు తమ వ్యాఖ్యానాలను తగిన భావాలతో చదువుతూ బైబిలులోని వ్యక్తుల పాత్రలను చేపట్టవచ్చు.

19 మీ కుటుంబమంతా కలిసి బైబిలు చదువుతుంటే, చదివే మీ సామర్థ్యం మెరుగుపడవచ్చు. అలాగే, దేవుని గూర్చిన మీ జ్ఞానం పెరుగుతుంది, ఇది మీరు ఆయనకు సన్నిహితులయ్యేలా చేస్తుంది. ఆసాపు ఇలా పాడాడు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.” (కీర్తన 73:28) మీ కుటుంబం, “అదృశ్యుడైనవానిని” అంటే యెహోవా దేవున్ని “చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై”యున్న మోషేలా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది.—హెబ్రీయులు 11:27.

చదవడం మరియు క్రైస్తవ పరిచర్య

20, 21. ప్రకటించమని మనకివ్వబడిన ఆజ్ఞ, చదివే సామర్థ్యంతో ఎలా సంబంధం కలిగివుంది?

20 “అదృశ్యుడైనవానిని” ఆరాధించాలనే మన కోరిక మనం మంచి చదువరులముగా ఉండేలా మనల్ని ప్రేరేపించాలి. మంచిగా చదవగల మన సామర్థ్యం, దేవుని వాక్యం నుండి సాక్ష్యం ఇవ్వడానికి మనకు సహాయం చేస్తుంది. “వెళ్లి . . . సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించిన రాజ్య ప్రకటన పనిని కొనసాగించడానికి అది మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8) సాక్ష్యమివ్వడం యెహోవా ప్రజల ముఖ్యమైన పని, చదివే సామర్థ్యం దాన్ని నెరవేర్చడానికి మనకు సహాయం చేస్తుంది.

21 దేవుని వాక్యాన్ని బాగా చదివే వారిగా, నైపుణ్యంగల ఉపదేశకులుగా ఉండడానికి కృషి అవసరం. (ఎఫెసీయులు 6:17) కాబట్టి, ‘దేవునియెదుట యోగ్యులుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను మిమ్మల్ని మీరు దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడండి.’ (2 తిమోతి 2:15) అంకితభావంతో చదవడం ద్వారా లేఖన సత్యాన్ని గూర్చిన మీ జ్ఞానాన్ని, యెహోవా సాక్షిగా మీ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోండి.

మీ సమాధానాలేమిటి?

◻ దేవుని వాక్యాన్ని చదవడంపై సంతోషం ఎలా ఆధారపడివుంది?

◻ మీరు బైబిలులో చదివేదానిని ఎందుకు ధ్యానించాలి?

◻ లేఖనాలను చదివేటప్పుడు జోడించడాన్ని మరియు దృశ్యీకరించుకోవడాన్ని ఎందుకు ఉపయోగించాలి?

◻ బైబిలు చదవడం నుండి నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఏవి?

◻ కుటుంబమంతా కలిసి బైబిలును బిగ్గరగా ఎందుకు చదవాలి, చదవడం క్రైస్తవ పరిచర్యతో ఏ సంబంధాన్ని కలిగివుంది?

[13వ పేజీలోని చిత్రం]

కుటుంబమంతా కలిసి బైబిలు చదువుతున్నప్పుడు, వృత్తాంతాలను దృశ్యీకరించుకొని వాటి ప్రాముఖ్యత గురించి ధ్యానించండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి