దేవుని వాక్యంలో ఆనందించండి
“యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించే” వ్యక్తి సంతోషభరితంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని “రాత్రింబవళ్ళు తగ్గు స్వరంలో” చదువుకుంటాడు. (కీర్తన 1:1,2 NW) దేవుని వాక్యంలో మీరూ ఆనందిస్తారా? దేవుని వాక్యం ద్వారా మీకు కలిగే ఆనందాన్ని మీరు ఎలా అధికం చేసుకోవచ్చు?
యెహోవా మాట్లాడుతుండగా వినండి
కేవలం పదాలను చదివేయకండి. మీరు చదువుతున్న పరిస్థితులను మనోఫలకంపై చిత్రించుకోండి, స్వరాలను ఊహించుకోండి. మీరు బైబిలులోని మొదటి అధ్యాయాలను చదువుతుండగా, మానవునికి నివాస యోగ్యమయ్యే విధంగా భూమిని తయారుచేయడంలో దశలవారీగా ఏమి చేయబడిందో స్వయంగా యెహోవాయే వెల్లడిచేస్తుండగా వినండి. మొదటి మానవులను ఉనికిలోకి తీసుకువచ్చే సమయమైందని ప్రధాన శిల్పి అయిన తన కుమారుడికి యెహోవా చెప్పడం వినండి. ఈ సన్నివేశాన్ని మీ మనస్సులో చిత్రించుకోండి: ఆదాము హవ్వలు తిరుగుబాటు చేస్తారు, దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు, ఆ తర్వాత ఆయన వారిని పరదైసు నుండి వెళ్ళగొడతాడు. (ఆదికాండము, 1-3 అధ్యాయాలు) యేసుక్రీస్తు దేవుని ప్రియమైన కుమారుడనీ ఆయన తన ప్రాణాన్ని మానవజాతి కోసం ఇవ్వడానికి దేవునిచేత పంపబడినవాడనీ పరలోకం నుండి ఒక స్వరం తెలియజేయడాన్ని చదివినప్పుడు సంభ్రమాశ్చర్యాలతో కూడిన అనుభూతిని పొందండి. (మత్త. 3:16,17) ‘ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను’ అని యెహోవా ప్రకటించడం విన్నప్పుడు అపొస్తలుడైన యోహాను ఎలా ప్రతిస్పందించివుంటాడో ఊహించడానికి ప్రయత్నించండి. (ప్రక. 21:5) దేవుని వాక్యాన్ని ఈ విధంగా చదవడం నిజంగా ఆనందభరితమైన అనుభవమే!
ప్రేరేపిత వృత్తాంతాలను చదవడం కొనసాగించండి. తద్వారా మీరు యెహోవా మహిమైశ్వర్యములు గలవాడనీ సంభ్రమాశ్చర్యాలు కలిగించే వ్యక్తియనీ తెలుసుకుంటారు. అప్పుడు ఆయనవైపుకు మీరు చాలా బలంగా ఆకర్షించబడుతున్నట్లు మీకనిపిస్తుంది. ఆయన మనలను ప్రేమిస్తాడు, మనతో కరుణాపూర్వకంగా ప్రవర్తిస్తాడు, మనం ఆయన చిత్తం చేయడానికి వినయంగా ప్రయత్నిస్తే మనకు సహాయపడతాడు, మనం చేస్తున్న ప్రతిదానిలోనూ సఫలులవ్వడం ఎలాగో మనకు చూపిస్తాడు.—యెహో. 1:8; కీర్త. 8:1; యెష. 41:9,10.
బైబిలు చదవడానికి మీరు ఎంత ఎక్కువ సమయం వెచ్చిస్తే, మీకు అంత ఎక్కువ సంతృప్తి కలుగుతుంది, మీ విషయంలో దేవుని చిత్తాన్ని గురించిన పరిజ్ఞానంలో మీరు ఎదుగుతారు. అయితే, మీ ఆనందానికి అది ముగింపు కాదు. మీరు చదువుతున్నది మీ సమస్యలను జ్ఞానయుక్తంగా పరిష్కరించుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నప్పుడు, “నీ శాసనములు ఆశ్చర్యములు. కావుననే నేను వాటిని గైకొనుచున్నాను” అని చెప్పిన కీర్తనకర్తలాగే మీరూ భావిస్తారు. (కీర్త. 119:129) మీ ఆలోచనా ధోరణినీ మీ కోరికలనూ దైవిక మార్గంలోకి మలుచుకునేందుకు మీకు సహాయపడేటువంటి సూత్రాలను మీరు లేఖనాల ద్వారా గ్రహించినప్పుడు కూడా మీరు ఆనందిస్తారు.—యెష. 55:8,9.
కీడు నుండి తప్పించి సరైన మార్గాన్ని చూపించే నైతిక మార్గనిర్దేశాన్ని బైబిలు మనకిస్తుంది. యెహోవా, మనం అపరిపూర్ణమైన శరీర కోరికలకు లోబడితే మనకు ఎదురయ్యే సమస్యలు ఏమిటో తెలిసిన తండ్రి అని మనం బైబిలు చదువుతుండగా గ్రహిస్తాం. ఆయన నిర్ణయించిన ఉన్నత నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తే వచ్చే భయంకరమైన పర్యవసానాలను మనం అనుభవించకూడదని ఆయన కోరుకుంటాడు. ఆయన మనపై శ్రద్ధ చూపిస్తాడు, అతి శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని మనం అనుభవించాలని కోరుకుంటాడు. ఆయన మనకు దేవుడిగా, పరలోకపు తండ్రిగా ఉండడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలను ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా మనం పూర్తిగా గ్రహించగలుగుతాం.
ప్రతి రోజూ బైబిలు చదవండి
కీర్తనకర్త, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి గురించి మాట్లాడుతూ, “అతడు చేయునదంతయు సఫలమగును” అని అన్నాడు. (కీర్త. 1:3) అవును, మనకు అపరిపూర్ణతలున్నప్పటికీ మనం సాతాను దుష్ట విధానంలో జీవిస్తున్నప్పటికీ మనలను మ్రింగివేయాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనం దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం ద్వారా చదువుతున్నదాన్ని ఆచరణలో పెడుతుండడం ద్వారా యెహోవాతో మనకున్న సంబంధంతో ముడిపడివున్న ప్రతి విషయంలోనూ సఫలులం కాగలం.
మనం ఈ పాత లోక విధానపు ఒత్తిళ్ళకు గురవుతుంటాం గనుక, సృష్టికర్త ఆలోచనలను హృదయంలోకి తీసుకునేందుకు, ప్రతిరోజూ కేవలం కొన్ని నిమిషాలే వెచ్చించినా ఎంతో బలాన్ని పుంజుకోగలుగుతాం. తమ విశ్వాసం మూలంగా చెరసాలలో వేయబడిన కొందరికి, వార్తాపత్రికల్లోని ఆర్టికల్‌లలో బైబిలులోని వివిధ భాగాల నుండి ఉల్లేఖించిన వచనాలే అందుబాటులో ఉండేవి. వారు వాటిని కత్తిరించుకొని, కంఠస్థం చేసి, వాటిని ధ్యానించేవారు. యెహోవా దేవుని వాక్యంలోవున్న పరిజ్ఞానాన్ని పొందడానికి వారు తమ పరిస్థితులు అనుకూలించినంత మేరకు ప్రయత్నించారు కాబట్టి ఆయన వారి ప్రయత్నాలను ఆశీర్వదించాడు. (మత్త. 5:3) అయితే, మనలో చాలామందికి వారి కన్నా ఎంతో ఎక్కువ స్వేచ్ఛ ఉంది. రోజుకొక్కసారి బైబిలులోని ఒక వచనాన్ని గబగబా చదివేసినా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని మనం అనుకోకూడదు. అయితే, మనం ప్రతిరోజూ బైబిలులో కొంత భాగాన్ని చదవడానికీ దాని గురించి ఆలోచించడానికీ మన జీవితాల్లో దాన్ని ఆచరణలో పెట్టడానికీ తగిన ప్రాధాన్యతనిస్తే, ఆశీర్వాదాలను పొందుతాం.
నిజం చెప్పాలంటే, మనం ఎంత ఆలోచించి వేసుకున్న పథకాలకైనా ఆటంకం కలగవచ్చు. అలా ఆటంకాలు కలిగినప్పుడు, నిజంగా అవసరమైనవాటికే ప్రాముఖ్యతనిస్తాం. ఉదాహరణకు, మనం ఒకటి రెండు రోజులు నీళ్ళు త్రాగకుండా ఉండాలని అనుకోము. అదేవిధంగా, మన దైనందిన జీవితంలో ఏమి జరిగినప్పటికీ సత్యపు జలాలతో సేదదీర్చుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి.—అపొ. 17:11.
దేవుని వాక్యాన్ని మొత్తం చదవండి
మీరు వ్యక్తిగతంగా బైబిలంతా చదివారా? కొందరు, బైబిలును ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదవాలంటే కంగారుపడిపోయారు. అందుకే, బైబిలంతా చదవాలని కోరుకున్న అనేకులు మొదట క్రైస్తవ గ్రీకు లేఖనాలను చదవడం మొదలుపెట్టారు. ఎందుకు? క్రీస్తు అడుగుజాడలను అనుసరించాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులుగా, తమకు ఆ బైబిలు పుస్తకాలు ఎలా వర్తిస్తాయో వాళ్ళు సులభంగా గ్రహించగలగడమే అందుకు కారణం కావచ్చు. లేదా, క్రైస్తవ గ్రీకు లేఖనాలు చదవలేనంత ఎక్కువ ఉన్నట్లు అనిపించకపోయివుండవచ్చు, అవి బైబిలులోని నాలుగో వంతు కన్నా కొంచెమెక్కువ ఉన్నాయంతే. వాళ్ళు ఆ 27 పుస్తకాలను పూర్తిగా చదివిన తర్వాత, హీబ్రూ లేఖనాలైన 39 పుస్తకాలను చదివి ఆనందించడం మొదలుపెట్టారు. వాళ్ళు హీబ్రూ లేఖనాలను ముగించేసరికి, బైబిలును క్రమంగా చదవడం వాళ్ళకు అలవాటైంది. అలా వాళ్ళు, క్రైస్తవ గ్రీకు లేఖనాలను రెండవసారి చదవడం మొదలుపెట్టి అలాగే కొనసాగించారు. ఆ తర్వాత వాళ్ళు బైబిలు చదవడం ఆపలేదు. మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవడాన్ని జీవితాంతం ఉండే అలవాటుగా చేసుకోవచ్చు.
మీ కుటుంబంలోగానీ సంఘంలోగానీ చదవలేనివాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు క్రమంగా బైబిలును చదివి వినిపించమంటారా అని మీరు ఆ వ్యక్తిని ఎందుకు అడగకూడదు? అలా చదివి వినిపించడం ద్వారా మీరూ ప్రయోజనం పొందుతారు, తాను విన్నవాటిని ధ్యానించి దాన్ని తన జీవితంలో ఆచరిస్తూ ఆ వ్యక్తీ ప్రయోజనం పొందుతాడు.—ప్రక. 1:3.
కొంతకాలానికి, మీరు బైబిలు చదవడానికి అనుబంధంగా ప్రత్యేక పథకాలను చేపట్టాలనుకోవచ్చు. వాటిలో కొన్ని, బైబిలులోని వివిధ భాగాల మధ్యవున్న సంబంధాన్ని మరింతగా గ్రహించేందుకు సహాయపడతాయి. మీ బైబిలులో రెఫరెన్సులు ఉంటే, అవి మిమ్మల్ని చారిత్రక వివరాల దగ్గరికి, సంబంధిత వృత్తాంతాల వైపుకు తీసుకువెళ్తుండవచ్చు. వివిధ కీర్తనలు వ్రాయబడడానికీ యేసుక్రీస్తు అపొస్తలులు పత్రికలు వ్రాయడానికీ దారి తీసిన పరిస్థితులను గ్రహించేందుకు అవి మీకు సహాయపడవచ్చు. మరొకవైపున, బైబిలులో పేర్కొనబడిన ప్రజలు, స్థలాలు, గుణాలకు సంబంధించిన నేపథ్య సమాచారాన్ని లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఎంతో తెలియజేస్తుంది. అందులోని చార్టులు, బైబిలు ప్రవచనాల నెరవేర్పు వైపుకు దృష్టిని మళ్ళిస్తాయి; సమకాలీనులైన రాజులు ప్రవక్తలు ఎవరో చూపిస్తాయి; బైబిలులోని అనేక సంఘటనలు జరిగిన తేదీలను ఉజ్జాయింపుగా తెలియజేస్తాయి.
మీరు నేర్చుకున్నదానిని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని ప్రజల మధ్య ఆయా పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలను అర్థం చేసుకుంటారు. యెహోవా తన ప్రజలతో ఆయా పరిస్థితుల్లో ఆయా విధాలుగా ఎందుకు వ్యవహరించాడో కూడా మీరు తెలుసుకుంటారు. ప్రభుత్వాల, ప్రజల, వ్యక్తుల చర్యలను యెహోవా ఎలా ఎంచుతాడో కూడా మీరు చూస్తారు. అలా మీరు ఆయన ఆలోచనలను ఇంకా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు.
సంఘటనలు జరిగిన ప్రాంతాన్ని మీరు మీ మనోఫలకంపై చిత్రించుకున్నప్పుడు బైబిలు చరిత్ర మీకు మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. బైబిలు ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్‌లు, ఆ ప్రాంతపు నైసర్గిక స్వరూపాన్ని అలాగే ఆ ప్రాంతానికీ ఇతర ప్రాంతాలకూ మధ్యవున్న దూరాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని ఎక్కడ దాటారని ఉజ్జాయింపుగా చెప్పవచ్చు? వాగ్దాన దేశపు వైశాల్యమెంత? యేసు, భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఎంత దూరం నడిచాడు? పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో చూసిన దృశ్యాలు ఏమిటి? మ్యాప్‌ల ద్వారా, భౌగోళిక వివరణల ద్వారా మీకు తెలిసే వివరాలు, మీరు చదువుతున్నవి వాస్తవమైనవని గ్రహించేలా చేస్తాయి. అయితే, బైబిలు ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్‌లను మీరు ఎక్కడ చూడవచ్చు? కొన్ని మ్యాప్‌లు, పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదములో (ఆంగ్లం) కనిపిస్తాయి. అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటాల్లో దాదాపు 70 మ్యాప్‌లు ఉన్నాయి. మొదటి సంపుటిలోని చివర్లో మ్యాప్ ఇండెక్స్ ఉంది. ఇతర మ్యాప్‌ల కోసం వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌ను ఉపయోగించండి. ఇవి మీకు అందుబాటులో లేనట్లయితే, బైబిలు చదవడంలో మీకు సహాయపడేందుకు కావలికోటలో వచ్చిన మ్యాప్‌లను ఉపయోగించండి.
“దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది” అంటూ హీబ్రూ లేఖనాల్లో దావీదు రాజు యెహోవాను స్తుతించాడు. (కీర్త. 139:17) క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అపొస్తలుడైన పౌలు, యెహోవా “దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను” అని యెహోవాను స్తుతించాడు. (2 కొరిం. 4:5,6) దావీదూ పౌలూ కొన్ని శతాబ్దాల ఎడంలో జీవించారు; కానీ వారిరువురూ దేవుని వాక్యంలో ఆనందించారు. యెహోవా తన ప్రేరేపిత వాక్యపు పుటల్లో మీకిచ్చిన సమాచారాన్నంతటినీ చదివేందుకు మీరు సమయం తీసుకుంటే మీరు కూడా ఆనందించగలరు.