ఎందుకు ప్రాపంచిక మతం అంతమొందుతుంది
“నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.”—ప్రకటన 18:4.
1. (ఎ) మహాబబులోను ఏ భావంలో పడిపోయింది? (బి) ఈ సంఘటన యెహోవాసాక్షులను ఎలా ప్రభావితం చేసింది?
“మహాబబులోను కూలిపోయెను!” అవును, యెహోవా దృష్టిలో ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం కూలిపోయింది. క్రీస్తు సహోదరుల శేషం 1919లో, మర్మపూరిత బబులోను యొక్క ముఖ్య భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క ప్రభావం నుండి బయటకు వచ్చినప్పటినుండి ఇది వాస్తవమై ఉంది. దాని ఫలితంగా, అబద్ధ మతాన్ని అధిక్షేపించేందుకు మరియు మెస్సీయ రాజ్యం ద్వారా దేవుని నీతియుక్త పరిపాలనను ప్రకటించేందుకు వారు స్వతంత్రులుగా ఉన్నారు. తోలుబొమ్మలవంటి మతాల కదంబకాన్ని సాతాను రూపించి, ‘సర్వలోకమును మోస పుచ్చేందుకు’ దాన్ని అతను నేర్పుగా ఉపయోగించిన తీరును, ఈ శతాబ్దమంతటిలోను యెహోవా యొక్క యథార్థ సాక్షులు బయల్పరిచారు.—ప్రకటన 12:9; 14:8; 18:2.
మహాబబులోను ఎలా కూలిపోయింది?
2. ప్రపంచ మతాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
2 అయితే, ‘అనేక దేశాల్లో మతం వృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తున్నప్పుడు, బబులోను కూలిపోయిందని మీరెలా చెప్పగలరు?’ అని ఎవరైనా అడుగవచ్చు. కాథోలిక్, ఇస్లాం మతాల్లో చెరి వంద కోట్లకంటే ఎక్కువమంది విశ్వాసులు ఉన్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో ప్రొటెస్టెంటు మతం ఇప్పటికీ వృద్ధి చెందుతోంది, అక్కడ ఎడతెగక క్రొత్త చర్చీలు, ఛాపల్స్ పుట్టుకొస్తున్నాయి. బౌద్ధ, హిందూ ధర్మాల ఆచారాలను కోట్లాదిమంది ఆచరిస్తున్నారు. అయినా, ఈ మతాలన్నీ కూడా ఈ కోట్లకొలది మంది ప్రజల ప్రవర్తనపై ఎంతమేరకు అనుకూల ప్రభావాన్ని చూపగల్గుతున్నాయి? ఉత్తర ఐర్లాండ్‌లో కాథోలిక్‌లు, ప్రొటెస్టెంటులు ఒకరినొకరు చంపుకోకుండా అది నివారించిందా? మధ్య ప్రాచ్యంలోని యూదులకు, ముస్లింలకు అది వాస్తవమైన శాంతిని తెచ్చిందా? భారతదేశంలోని హిందూ ముస్లింల మధ్య సామరస్యానికి అది దారి తీసిందా? ఇటీవలనే, సెర్బియాలోని ఆర్థడాక్స్‌లు, క్రొయేషియాలోని కాథోలిక్‌లు మరియు బోస్నియాలోని ముస్లింలు “జాతి ప్రక్షాళన” చేయకుండా, దోచుకోకుండా, మానభంగాలు చేయకుండా, ఒకరినొకరు వధించుకోకుండా అది నివారించిందా? తరచూ మతం నామమాత్రంగానే ఉంది, అతి స్వల్ప ఒత్తిడికైనా పగిలిపోయే గుడ్డుపొలుసంత పల్చని పొరగా మాత్రమే అది ఉంది.—గలతీయులు 5:19-21; యాకోబు 2:10, 11 పోల్చండి.
3. మతం దేవుని ఎదుట తీర్పుకు ఎందుకు నిలువబడింది?
3 దేవుని దృక్పథం ప్రకారం, జన బాహుళ్యం ఇచ్చే మతపర మద్దతు ఒక తప్పించుకోలేని వాస్తవాన్ని మాత్రం మార్చలేదు, మతాలన్నీ దేవుని ఎదుట తీర్పు తీర్చబడాలన్నదే వాస్తవం. మహాబబులోనుకున్న చరిత్ర సాక్ష్యం పలుకుతున్నట్లు, “దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు” గనుక అది దోషిగా తీర్పు తీర్చబడేందుకు అర్హమైయుంది. (ప్రకటన 18:5) ప్రవచనార్థక భాషలో హోషేయ ఇలా వ్రాశాడు: “వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును.” సాతాను యొక్క ప్రపంచవ్యాప్త అబద్ధ మతాలన్నీ కూడా దేవుడు, ఆయన ప్రేమ, ఆయన నామం మరియు ఆయన కుమారుని ఎడల నమ్మక ద్రోహం చేసినందుకు అత్యధిక మూల్యాన్ని చెల్లిస్తాయి.—హోషేయ 8:7; గలతీయులు 6:7; 1 యోహాను 2:22, 23.
మీరు ఎంపిక చేసుకోవాలి
4, 5. (ఎ) మనం నేడు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాము? (బి) ఏ ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి?
4 మనం “అంత్యదినముల” చివరి భాగంలో జీవిస్తున్నాం, నిజ క్రైస్తవులుగా మనం ఈ “అపాయకరమైన కాలముల”ను తప్పించుకునేందుకు పోరాడుతున్నాము. (2 తిమోతి 3:1-5) ఒక హంతకుడు, అబద్ధికుడు మరియు అపవాది అయిన సాతాను యొక్క కుళ్లిన వ్యక్తిత్వాన్ని నిజంగా ప్రతిబింబించే అతని లోకంలో, నిజ క్రైస్తవులు తాత్కాలిక నివాసులు మాత్రమే. (యోహాను 8:44; 1 పేతురు 2:11, 12; ప్రకటన 12:10) మనం దౌర్జన్యం, మోసం, దగా, కుళ్లు మరియు నీచమైన అవినీతి చేత చుట్టబడి ఉన్నాము. నీతినియమాలు ఎటో కొట్టుకుపోయాయి. సౌఖ్యమే ప్రాముఖ్యం, తాత్కాలికావశ్యకత అనే పదాలు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. అనేక సందర్భాలలో, సలింగసంయోగం, జారత్వం మరియు వ్యభిచారాన్ని బైబిలు స్పష్టంగా ఖండించడాన్ని నీరుగార్చడం ద్వారా మత నాయకులు అతి మూర్ఖమైన అవినీతిని సమర్థిస్తున్నారు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మీరు అబద్ధ మతానికి మద్దతునిచ్చి, సమర్థిస్తారా లేక సత్యారాధనలో చురుకుగా భాగం వహిస్తారా?—లేవీయకాండము 18:22; 20:13; రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 6:9-11.
5 ఇది వేరుపరచే కాలం. కనుక, అబద్ధ మరియు సత్యారాధనకుగల వ్యత్యాసాన్ని చూసేందుకు మరెన్నటికంటే ఎక్కువ కారణాలు ఇప్పుడున్నాయి. క్రైస్తవమత సామ్రాజ్య మతాలను అంతగా నిందించేందుకు అవి ఇంకా ఏం చేశాయి?—మలాకీ 3:18; యోహాను 4:23, 24.
అబద్ధమతం దోషిగా తీర్చబడింది
6. క్రైస్తవమత సామ్రాజ్యం దేవుని రాజ్యానికి ఎలా ద్రోహం చేసింది?
6 క్రైస్తవమత సామ్రాజ్యంలోని కోట్లాది మంది ప్రభువు ప్రార్థనను క్రమంగా ఉపయోగిస్తూ, దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తున్నప్పటికీ, ఆ దైవపరిపాలనా రాజ్యానికి మినహా మిగతా రాజకీయ విధానాలకు అన్నింటికీ వారు ఎడతెగక మద్దతును ఇచ్చారు. శతాబ్దాల పూర్వం, రియాక్‌ల్యూ, మజారిన్ మరియు వోల్‌సే కార్డినల్‌ల వంటి కాథోలిక్ చర్చి “రాకుమారులు” లౌకిక రాజనీతినిపుణులు, ప్రభుత్వ సేవకులుగా కూడా వ్యవహరించారు.
7. క్రైస్తవమత సామ్రాజ్యపు మత నాయకులను యెహోవాసాక్షులు 50 సంవత్సరాల కంటే పూర్వమే ఎలా బహిర్గతం చేశారు?
7 50 సంవత్సరాల కంటే పూర్వం, మతం ప్రళయవాయువును కోస్తుంది (ఆంగ్లం) అనే పేరుగల చిన్న పుస్తకంలో, క్రైస్తవమత సామ్రాజ్యం రాజకీయాల్లో భాగం వహించడాన్ని యెహోవాసాక్షులు బహిర్గతం చేశారు.a అప్పుడు చెప్పబడినది నేడు కూడా అంతే శక్తివంతంగా అన్వయిస్తుంది: “అన్ని వర్గాల మత నాయకుల ప్రవర్తనను యథార్థంగా పరిశోధించడం, యావత్ క్రైస్తవమత సామ్రాజ్యపు మత నాయకులందరూ ‘ఈ ప్రస్తుత దుష్ట ప్రపంచం’ యొక్క రాజకీయాల్లో అత్యంత శ్రద్ధతో భాగం వహిస్తున్నారనే మరియు దాని ప్రాపంచిక కార్యకలాపాల్లో భాగం వహిస్తున్నారనే విషయాన్ని బయల్పర్చుతుంది.” అప్పట్లో, పోపు పయస్ XII నాజీ హిట్లర్‌తో (1933), ఫాసిస్టు ఫ్రాంకోతో (1941) సంధి కుదుర్చుకున్నందుకు, అలాగే అప్రతిష్టాకరమైన పర్ల్ హార్బర్ దాడి తర్వాత కేవలం కొన్ని నెలలకే, అంటే 1942 మార్చిలో, దాడికి పాల్పడిన దేశమైన జపాన్‌తో దౌత్యప్రతినిధులను పరస్పరం పంపించుకొనే పని చేస్తున్నందుకు సాక్షులు పోపును తీవ్రంగా విమర్శించారు. “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” అన్న యాకోబు హెచ్చరికకు చెవి యొగ్గడంలో పోపు విఫలమయ్యాడు.—యాకోబు 4:4.
8. రోమన్ కాథోలిక్ చర్చి నేడు రాజకీయాల్లో ఎలా ఇమిడివుంది?
8 నేడు ఎలాంటి పరిస్థితి ఉంది? కాథోలిక్ మతాధికారము దాని మత నాయకుల ద్వారా, దాని సామాన్య సభ్యుల ద్వారా రాజకీయాల్లో ఇంకా ఇమిడివుంది. మానవ నిర్మిత ఐక్యరాజ్య సమితి విశ్వశాంతిని తెస్తుందని పేర్కొనడం ద్వారా ఇటీవలి పోపులు ఈ బూటకపు సంస్థను తాము అంగీకరిస్తున్నామని చూపుతున్నారు. “పరిశుద్ధ అధికారానికి రాయబారులైన” క్రొత్తగా నియమితులైన ఏడుగురు దౌత్యవేత్తలు, “పరిశుద్ధ పితకు” తమ యోగ్యతా పత్రాలు సమర్పించారని వాటికన్ అధికారిక వార్తాపత్రికైన లాస్సేర్‌వాటోరే రోమానో యొక్క ఇటీవలి సంచిక ప్రకటించింది. దౌత్యపరమైన లావాదేవీల్లో యేసు గానీ పేతురు గానీ ఇమిడివుండటాన్ని మనం ఊహించగలమా? యూదుల ద్వారా రాజుగా చేయబడేందుకు యేసు నిరాకరించి, తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని చెప్పాడు.—యోహాను 6:15; 18:36.
9. ప్రొటెస్టెంట్ మతాలు తమ కాథోలిక్ ప్రతిమతం కంటే ఏమీ మెరుగుగా లేవని మనం ఎందుకు చెప్పవచ్చు?
9 ప్రొటెస్టెంటు నాయకులు తమ కాథోలిక్ ప్రతినాయకులకంటే ఏమైనా మెరుగుగా ఉన్నారా? అమెరికాలో, అనేక సంప్రదాయ ప్రధాన ప్రొటెస్టెంటు మతాలు మరియు అలాగే మార్మన్ మతం కొన్ని రాజకీయ విభాగాలతో గుర్తింపబడుతున్నాయి. అఖిలపక్ష క్రైస్తవ సంస్థ అమెరికా రాజకీయాల్లో పీకల దాకా మునిగి ఉంది. ఇతర ప్రొటెస్టెంటు మత నాయకులు మరొక రాజకీయ విభాగంలో స్థానాన్ని కలిగివున్నారని స్పష్టంగా గుర్తించబడుతున్నారు. బ్రిటీష్ పార్లమెంటు సభ్యుడైన ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఇయాన్ పేజ్‌లే వలే, పాట్ రాబర్ట్‌సన్ మరియు జెస్సీ జాక్‌సన్ వంటి అమెరికా రాజకీయ ప్రతినిధులు కూడా “రెవరెండ్‌లు” అనే విషయాన్ని అమెరికాలో కొన్నిసార్లు మర్చిపోవడం జరుగుతుంది. వారు తమ స్థానాన్ని ఎప్పటికైనా ఎలా సమర్థించుకోగలరు?—అపొస్తలుల కార్యములు 10:34, 35; గలతీయులు 2:6.
10. 1944లో ఏ స్పష్టమైన వ్యాఖ్యానం చేయబడింది?
10 మతం ప్రళయవాయువును కోస్తుంది (ఆంగ్లం) 1944లో అడిగినట్లే మేమూ నేడు అడుగుతున్నాం: “ప్రపంచ శక్తులతో సంధి కుదుర్చుకునేటువంటి, ఈ ప్రపంచం నుండి లాభాన్ని వెదకుతూ దాని ద్వారా రక్షణను పొందాలని ప్రయత్నించేటువంటి, దాని రాజకీయాల్లో తన తలదూర్చేటువంటి ఏ సంస్థ అయినా కూడా . . . దేవుని చర్చి కాగలదా లేక భూమిపై క్రీస్తు యేసుకు ప్రాతినిధ్యం వహించగలదా? . . . స్పష్టంగా, ఈ ప్రపంచ రాజ్యాలతో చేతులు కలిపే మతాలన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా వచ్చే దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యం వహించలేవు.”
అబద్ధ మతపు కయీను స్వభావం
11. అబద్ధ మతం కయీను మాదిరిని ఎలా అనుకరించింది?
11 చరిత్రంతటిలోనూ, అబద్ధ మతం తన తమ్ముడైన హేబెలును హత్య చేసిన భ్రాతృహంతకుడైన కయీను స్వభావాన్ని చూపింది. “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను గనుకనే గదా?” తన తమ్ముని పవిత్రమైన, దేవునికి అంగీకృతమైన ఆరాధనను చూసి ఓర్చుకొనలేనివాడై, కయీను దౌర్జన్యానికి పాల్పడ్డాడు, ఒక హేతుబద్ధమైన సమాధానం లేనివారు తీసుకునే అంతిమ చర్య అదే.—1 యోహాను 3:10-12.
12. యుద్ధాలు, గొడవల్లో మతం భాగం వహించిందనేందుకు ఏ సాక్ష్యాధారం ఉంది?
12 అబద్ధ మతాన్ని ఇలా దోషిగా తీర్చడానికి వాస్తవాలు మద్దతునిస్తున్నాయా? బోధకులు ఆయుధాలను అందిస్తున్నారు (ఆంగ్లం) అనే పుస్తకంలో రచయిత ఇలా చెప్పాడు: “నాగరికత చరిత్రలో, . . . రెండు శక్తులు ఎప్పుడూ కూడా సంధి కుదుర్చుకున్నాయి. అవి యుద్ధం మరియు మతం. గొప్పవైన ప్రపంచ మతాలన్నింటిలో, . . . [క్రైస్తవమత సామ్రాజ్యం] కంటే మరేదీ కూడా [యుద్ధానికి] అంతగా అంకితం కాలేదు.” కొన్ని సంవత్సరాల క్రితం, ద సన్ అనే కెనడాలోని వాంకోవర్ వార్తాపత్రిక ఇలా అన్నది: “చర్చి పతాకాన్ని అనుసరించడం బహుశా సంస్థీకరింపబడిన అన్ని మతాల బలహీనత కావచ్చు . . . దేవుడు మా పక్షాన ఉన్నాడు అని ఇరు పక్షాల వారూ చెప్పుకొనని యుద్ధం ఏదైనా జరిగిందా?” దీని రుజువును మీరు ఏదైనా ప్రాంతీయ చర్చిలో చూసి ఉండవచ్చు. తరచూ జాతీయ పతాకాలు దైవపీఠాన్ని అలంకరించి ఉంటాయి. యేసు ఏ పతాకం క్రింద సైనిక కవాతు చేస్తాడని మీరు భావిస్తున్నారు? ఆయన మాటలు ఈ శతాబ్దాలన్నింటిలో ప్రతిధ్వనించాయి: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు”!—యోహాను 18:36.
13. (ఎ) ఆఫ్రికాలో అబద్ధ మతం ఎలా విఫలమైంది? (బి) క్రైస్తవత్వాన్ని గుర్తించే ఏ చిహ్నాన్ని యేసు సూచించాడు?
13 క్రైస్తవమత సామ్రాజ్య మతాలు తమ మందలకు యథార్థమైన సహోదర ప్రేమ యొక్క సత్యాన్ని నేర్పలేదు. బదులుగా, జాతీయ వర్గీయ మరియు తెగల సంబంధంగా తమ మందలు విభజింపబడేందుకు అనుమతించడం జరిగింది. రువాండాలోని తెగల జాతి నిర్మూలనానికి దారితీసిన విభేదాల్లో కాథోలిక్ మరియు ఆంగ్లికన్ మత నాయకులు తమ పాత్రను నిర్వహించారని నివేదికలు సూచిస్తున్నాయి. ద న్యూయార్క్ టైమ్స్ ఇలా నివేదించింది: “రువాండాలోని నరమేధాలు అక్కడి రోమన్ కాథోలిక్‌లు అనేకమంది తాము చర్చి అధికారం చేత మోసగింపబడ్డామని భావించేందుకు దారితీశాయి. చర్చి తరచూ హుటూ మరియు టుట్సీల మధ్య, అంటే తెగల పరంగా విభాగింపబడింది. ఒక మేరీనోల్ ప్రీస్టు చెప్పిన విషయాన్ని అదే వార్తాపత్రిక ఇలా ఉదాహరించింది: “1994లో రువాండానందు చర్చి ఎంతో దుఃఖకర రీతిలో విఫలమైంది. అనేకమంది రువాండన్‌లకు చర్చి ఎడల నమ్మకం పోయింది. దానికి ఇక ఎలాంటి విలువా లేదు.” “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు”రు అని యేసు చెప్పిన మాటలకు ఎంత భిన్నంగా ఉందీ పరిస్థితి.—యోహాను 13:35.
14. ముఖ్యమైన క్రైస్తవేతర మతాలు ఏ ప్రవర్తనా చరిత్రను కలిగివున్నాయి?
14 మహాబబులోను యొక్క ఇతర ముఖ్య మతాలు కూడా మేలైన మాదిరిని ఎంతమాత్రం ఉంచలేదు. 1947లో, అంటే భారతదేశం విభాగింపబడినప్పుడు జరిగిన ఘోరమైన మారణకాండ, అక్కడి ముఖ్య మతాలు సహనాన్ని ఉత్పత్తి చేయలేదని కనుపర్చింది. భారతదేశంలో ఇంకా కొనసాగుతున్న మత కలహాలు, అనేకమంది ప్రజలు ఇంకా మారలేదని ధ్రువపర్చుతున్నాయి. ఇండియా టుడే పత్రిక ఇలా తేల్చి చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు: “మతమనే ధ్వజం క్రిందనే అత్యంత నీచమైన నేరాలు కొనసాగాయి. . . . అది ప్రచండమైన దౌర్జన్యాన్ని ప్రజ్వలితం చేస్తోంది, అదెంతో వినాశకర శక్తియైయుంది.”
“ఆశ్చర్యకరమైన అసత్యాభాసం”
15. పశ్చిమ దేశాల్లో మతం యొక్క స్థితి ఏమిటి?
15 ఒప్పించడం, నిజమైన విలువలను అభ్యసింపజేయడం మరియు ఐహికత్వం చొచ్చుకు రావడాన్ని నిరోధించడం వంటివి చేయడంలో మతం విఫలమవ్వడాన్ని చివరకు ప్రాపంచిక వ్యాఖ్యాతలు కూడా గమనించారు. అదుపు తప్పింది (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, అమెరికా దేశపు మాజీ జాతీయ భద్రతా సలహాదారుడైన జుబెగ్నెఫ్ బ్రేజ్హిన్‌స్కీ ఇలా వ్రాశాడు: “‘దేవుడు మరణించాడు’ అనే ప్రతిపాదనకు మహాగొప్ప విజయం, మార్క్సిస్ట్‌లు ఆధిపత్యం వహించిన దేశాల్లోనే కాక . . . నైతిక ఉదాసీనతను ఆచారబద్ధంగా పెంపొందించిన, స్వేచ్ఛగల ప్రజాస్వామ్యం ఉండే పశ్చిమ సమాజాల్లోనే లభించిందనేది ఆశ్చర్యకరమైన అసత్యాభాసం. ఈ సమాజాల్లో, మతమనేది ముఖ్య సామాజిక శక్తిగా ఉండటం మానేసింది అన్నదే వాస్తవం.” ఆయన ఇలా కొనసాగించాడు: “యూరోపియన్ సంస్కృతిపై మతం యొక్క పట్టు పూర్తిగా సడలిపోయింది, నేడు యూరప్—అమెరికా కంటే ఎక్కువగా—ప్రాముఖ్యంగా ఒక లౌకిక సమాజమైంది.”
16, 17. (ఎ) తన కాలంలోని మత నాయకుల సంబంధంగా యేసు ఏ సలహా ఇచ్చాడు? (బి) ఫలాలను గూర్చిన ఏ చక్కని సూత్రాన్ని యేసు వ్యక్తపరిచాడు?
16 తన కాలంలోని యూదా మత నాయకుల గురించి యేసు ఏం చెప్పాడు? “శాస్త్రులును పరిసయ్యులును [తోరాహ్‌ను, ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు] మోషే పీఠమందు కూర్చుండువారు గనుక—వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” అవును, మత వేషధారణ క్రొత్తదేమీ కాదు.—మత్తయి 23:2, 3.
17 అబద్ధ మతం యొక్క ఫలాలు దాన్ని ఖండిస్తున్నాయి. యేసు చెప్పిన నియమం ఎంతగానో వర్తిస్తుంది: “ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.”—మత్తయి 7:17-20.
18. క్రైస్తవమత సామ్రాజ్యం తన సభ్యులను ఎలా శుభ్రంగా ఉంచగలిగేది?
18 ఒకవేళ క్రైస్తవమత సామ్రాజ్య మతాలు, దాని సభ్యులమని చెప్పుకునే వారు చేసిన చెడు క్రియలన్నిటికీ, బహిష్కరణ లేక వెలివేయడం అనే క్రైస్తవ క్రమశిక్షణను మనస్సాక్షిపూర్వకంగా అన్వయిస్తే, ఏమి సంభవిస్తుంది? పశ్చాత్తాపం చెందని అబద్ధికులు, జారులు, వ్యభిచారులు, సలింగసంయోగులు, మోసగాళ్లు, నేరస్థులు, మాదక ద్రవ్యాల వ్యాపారులు మరియు వాటి బానిసలు, మాఫియా ముఠాల సభ్యులు, వీరందరికీ ఏమి సంభవిస్తుంది? క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క కుళ్లిన ఫలాలు, అది దేవుని చేత నాశనం చేయబడేందుకు కచ్చితంగా అర్హమైనదని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.—1 కొరింథీయులు 5:9-13; 2 యోహాను 10, 11.
19. మతపర నాయకత్వానికి సంబంధించి ఏ విషయాలను ఒప్పుకున్నారు?
19 అమెరికాలోని ప్రెస్బిటేరియన్ చర్చి కొరకైన సాధారణ సమావేశం ఇలా అంగీకరించింది: “మేము అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. . . . దేశమంతటా ఉన్న మత నాయకులందరిలో 10 నుండి 23 శాతం మంది చర్చి సభ్యులు, కార్యార్థులు, చర్చి ఉద్యోగస్థులు మొదలైన వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారు లేక లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నారు.” అమెరికా వ్యాపారవేత్త ఒకరు విషయాన్నిలా చక్కగా క్లుప్తీకరించాడు: “మత సంస్థలు తమ నైతిక విలువలను మనకు అందించడంలో విఫలమయ్యాయి, అసలు అనేక సందర్భాలలో, సమస్యకు అవే కారణమయ్యాయి.”
20, 21. (ఎ) యేసు మరియు పౌలు వేషధారణను ఎలా అధిక్షేపించారు? (బి) ఏ ప్రశ్నలకు ఇంకా జవాబివ్వాల్సి ఉంది?
20 మత వేషధారణను యేసు అధిక్షేపించడం, ఆయన కాలంలో ఎంత వాస్తవమో నేడు కూడా అలాగే ఉంది: “వేషధారులారా—ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే.” (మత్తయి 15:7-9) పౌలు తీతుకు వ్రాసిన మాటలు కూడా మన ఆధునిక పరిస్థితిని వర్ణిస్తున్నాయి: “దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.”—తీతు 1:16.
21 ఒక అంధుడు మరో అంధునికి మార్గం చూపితే, ఇద్దరూ కలిసి గుంటలో పడిపోతారని యేసు చెప్పాడు. (మత్తయి 15:14) మీరు మహాబబులోనుతోపాటు అంతమైపోవాలనుకుంటారా? లేక మీ కళ్లను తెరుచుకొని నేరుగా ఉండే మార్గాలలో నడవాలనీ, యెహోవా దీవెనలను ఆనందించాలనీ కోరుకుంటారా? మనం ఇప్పుడు ఎదుర్కొనవలసిన ప్రశ్నలేమంటే: ఏదైనా మతం గనుక దైవిక ఫలాలను ఉత్పత్తి చేస్తున్నట్టయితే, ఆ మతం ఏది? దేవునికి అంగీకారయోగ్యమైన సత్యారాధనను మనం ఎలా గుర్తించగలం?—కీర్తన 119:105.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు 1944లో ప్రచురించినది; ఇప్పుడు ముద్రింపబడటం లేదు.
మీరు గుర్తు తెచ్చుకోగలరా?
◻ దేవుని ఎదుట మహాబబులోను ప్రస్తుత స్థానం ఏమిటి?
◻ అబద్ధ మతం దేని ఆధారంగా దోషిగా తీర్చబడింది?
◻ అబద్ధ మతం కయీను స్వభావాన్ని ఎలా కనుపర్చింది?
◻ ఏ మతానికి తీర్పు తీర్చేందుకైనా యేసు ఏ సూత్రాన్ని వ్యక్తపరిచాడు?
[13వ పేజీలోని చిత్రం]
చరిత్రంతటిలోను మత నాయకులు రాజకీయాల్లో తలదూర్చారు
[15వ పేజీలోని చిత్రం]
ఈ మత నాయకులు బహు అధికారంగల రాజనీతి నిపుణులుగా కూడా ఉన్నారు
కార్డినల్ మజారిన్
కార్డినల్ రియాక్‌ల్యూ
కార్డినల్ వోల్‌సే
[చిత్రసౌజన్యం]
Cardinal Mazarin and Cardinal Richelieu: From the book Ridpath’s History of the World (Vol. VI and Vol. V respectively). Cardinal Wolsey: From the book The History of Protestantism (Vol. I).