జ్ఞాపకార్థదినాన్ని యోగ్యమైనరీతిలో ఆచరించండి
అది సా.శ. 33 నీసాను 14, సాయంకాలం, అప్పుడు యేసు జ్ఞాపకార్థదిన ఆచరణను ప్రారంభించాడు.a ఆయన తన పన్నెండుమంది అపొస్తలులతో కలిసి పస్కాను ఆచరించడం కొంతసేపటి క్రితమే ముగించాడు, కాబట్టి మనం ఆ తేదీ గురించి నిశ్చయత కలిగివుండవచ్చు. ద్రోహి అయిన యూదాను పంపివేసిన తర్వాత యేసు, “యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి—మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన—ఇది నిబంధనవిషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము” అని చెప్పాడు.—మార్కు 14:22-24.
తన మరణానికున్న ప్రాముఖ్యతనుబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (లూకా 22:19; 1 కొరింథీయులు 11:23-26) ఆయన బలి మాత్రమే వారసత్వంగా వచ్చిన పాపమరణాల నుండి మానవజాతిని విడిపించగలదు. (రోమీయులు 5:12; 6:23) ఆయన ఉపయోగించిన రొట్టె, ద్రాక్షారసం ఆయన పరిపూర్ణ శరీరానికి, ఆయన రక్తానికి చిహ్నాలు. అసలైన తేదీ తెలుసు గనుక, ప్రతి సంవత్సరం ఆ తేదీకి సరిసమానమైన రోజున అంటే యూదా పస్కా ఆచరించబడినట్లుగానే మనం ఆ సందర్భాన్ని ఆచరించవచ్చు. కాని మనం దాన్ని యోగ్యమైనరీతిలో ఆచరించాలి. ఎందుకు?
రొట్టె, ద్రాక్షారసం చిహ్నాలలో భాగం వహించేవారందరూ “ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” అని అపొస్తలుడైన పౌలు తెలియజేశాడు. (ఇటాలిక్కులు మావి.) (1 కొరింథీయులు 11:26) గనుక ఆచరణ యొక్క అవధానం యేసు మరణంపై మరియు మానవజాతి కొరకైన దాని భావంపై ఉంటుంది. అది గంభీరమైన సందర్భమైవుండి, దేవుని మంచితనాన్ని, యెహోవా ఎడల, ఆయన కుమారుని ఎడల మనకు ఉండవలసిన మెప్పును గుర్తు తెచ్చుకొనే సమయమై ఉంటుంది. (రోమీయులు 5:8; తీతు 2:14; 1 యోహాను 4:9, 10) అందుకే, “యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును” అని పౌలు హెచ్చరించాడు.—1 కొరింథీయులు 11:27.
యోగ్యమైనరీతిలో—ఎలా?
ప్రశ్నించదగిన ఆచారాలలో నిమగ్నమై ఉండడం ద్వారా లేక అన్యాచారాలను స్వీకరించడం ద్వారా మనం ఆ సందర్భాన్ని అగౌరవపరుస్తే, దేవుడు సంతోషించడన్నది సుస్పష్టం. (యాకోబు 1:27; 4:3, 4) ఇది, ఈస్టర్ సమయంలోని ప్రజాదరణ పొందిన సంఘటనలను నిషేధిస్తుంది. “[తనను] జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించడంలో, జ్ఞాపకార్థదిన ఆచారాన్ని ఆయన ఏర్పాటు చేసినట్లుగానే ఆచరించాలని మనం కోరుకుంటాము. (లూకా 22:19; 1 కొరింథీయులు 11:24, 25) ఈ ఆచరణకు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు చేర్చిన అలంకారాలను ఇది నిషేధిస్తుంది. “నేటి ప్రభు రాత్రి భోజన ఆచారానికి, క్రీస్తు మరియు ఆయన అపొస్తలులు అనుసరించిన అతిసరళమైన వేడుకకు ఎంతో తేడా ఉంది” అని న్యూ కాథోలిక్ ఎన్సైక్లోపీడియా అంగీకరిస్తోంది. ప్రభు రాత్రి భోజన ఆచారాన్ని తరచూ, చివరికి ప్రతిరోజు ఆచరించడం ద్వారా క్రైస్తవమత సామ్రాజ్యం యేసు ఉద్దేశించిన దాన్నుండి తొలగిపోయి, దాన్ని సామాన్య విషయంగా మార్చివేసింది.
ప్రభు రాత్రి భోజనానికి సంబంధించి సంఘంలో ఒక సమస్య ఉత్పన్నమైనందున అయోగ్యంగా పాల్గొనడం గురించి పౌలు కొరింథులోని క్రైస్తవులకు వ్రాశాడు. కొందరు దాని పరిశుద్ధతను గౌరవించలేదు. వారు తమ సాయంకాల భోజనాన్ని తమతో తెచ్చుకొని, దాన్ని కూటానికి ముందుగాని కూటమి జరిగే సమయంలోగాని తినేవారు. తరచూ వారు విపరీతంగా తిని, త్రాగేవారు. ఇది వారికి మత్తు కలిగించి, వారి జ్ఞానేంద్రియాలకు మాంద్యం కలుగజేసింది. వారు మానసికంగా, ఆత్మీయంగా మెలకువగా ఉండనందున, వారు ‘శరీరాన్ని వివేచింప’ లేకపోయారు, తద్వారా ‘ప్రభువు శరీరాన్ని గూర్చి రక్తాన్ని గూర్చి అపరాధులయ్యారు.’ అదే సమయంలో, సాయంకాల భోజనం చేయని వారు ఆకలితో ఉన్నారు, వారు శ్రద్ధ కూడా నిలుపలేక పోయారు. చివరికి వారిలో ఎవరూ చిహ్నాలలో మెప్పుతో పాల్గొనే స్థితిలోగాని, ఈ ఆచరణ ప్రభువు మరణ జ్ఞాపకార్థకమని ఆ సందర్భం యొక్క గంభీరతను పూర్తిగా గుర్తించే స్థితిలోగాని ఉండలేక పోయారు. ఇది, వారికి వ్యతిరేకంగా తీర్పు రావడానికి కారణమయ్యింది, ఎందుకంటే వారు దాని ఎడల అగౌరవాన్ని, చివరికి అలక్ష్యాన్ని చూపించారు.—1 కొరింథీయులు 11:27-34.
వివేచన అవసరం
కొంతమంది జ్ఞాపకార్థదిన చిహ్నాల్లో భాగం వహించారు, అయితే తాము అలా చేయకుండా ఉండవలసిందని వారు ఆ తర్వాత తెలుసుకున్నారు. సరైన విధంగా జ్ఞాపకార్థదిన చిహ్నాల్లో పాల్గొనేవారు దేవునిచే ఎన్నుకోబడినవారై ఉంటారు, దేవుని ఆత్మ సాక్ష్యం వారికుందని అది చూపిస్తుంది. (రోమీయులు 8:15-17; 2 కొరింథీయులు 1:21, 22) వారిని అర్హులను చేసేది వారి వ్యక్తిగత నిర్ణయం లేక నిశ్చయం కాదు. క్రీస్తుతో కూడా పరలోకంలో పరిపాలించే వారి సంఖ్యను దేవుడు 1,44,000 మందికి పరిమితం చేశాడు. క్రీస్తు విమోచనా క్రయధనం నుండి ప్రయోజనం పొందేవారితో పోలిస్తే అది సాపేక్షికంగా చిన్న సంఖ్యనే. (ప్రకటన 14:1, 3) ఎంపిక చేసుకోవడం యేసు కాలం నుండే ప్రారంభమయ్యింది తత్ఫలితంగా, పాల్గొనేవారు నేడు కేవలం కొద్దిమందే ఉన్నారు. కొంతమందికి మరణం సంభవిస్తుండగా, ఆ సంఖ్య తగ్గిపోవాలి.
ఒకరు చిహ్నాలలో పొరపాటుగా ఎందుకు పాల్గొంటారు? విశ్వాసం గలవారందరూ పరలోకానికి వెళతారు అనే గత మతసంబంధమైన ఉద్దేశాల మూలంగాకావచ్చు. లేదా, లాలసతో లేక స్వార్థంతో—ఇతరుల కంటే తనకు ఎక్కువ అర్హత ఉందన్న భావంతో—పేరు పొందాలన్న కోరికతో అలా చేస్తుండవచ్చు. ఒకవేళ అది, తీవ్రమైన సమస్యల నుండి లేక భూమిపై జీవించడంలో ఆసక్తిని కోల్పోయేలా చేసిన దుర్ఘటన నుండి ఉత్పన్నమైన బలమైన భావాల ఫలితమై ఉండవచ్చు. పరలోక నిరీక్షణగల ఎవరితోనైనా సన్నిహిత స్నేహం ఉండడం వలన కూడా అలా జరుగవచ్చు. నిర్ణయం పూర్తిగా దేవునిదే కాని మనది కాదని మనమందరం గుర్తుంచుకోవడం అవసరం. (రోమీయులు 9:16) కాబట్టి ఒక వ్యక్తి, “పరీక్షించు”కొనిన తర్వాత, తాను నిజంగా చిహ్నాలలో పాల్గొనకుండా ఉండవలసిందని తెలుసుకుంటే, ఆయన ఇక మానుకోవచ్చు.—1 కొరింథీయులు 11:28.
దేవుడు మానవజాతిలోని అనేకుల ఎదుట ఉంచిన నిరీక్షణ పరదైసు భూమిపై నిత్యజీవమే. అది మనం ఎదురు చూడవలసిన, దానికి మనం సులభంగా ఆకర్షితులం కాగల గొప్ప ఆశీర్వాదం. (ఆదికాండము 1:28; కీర్తన 37:9, 11) విశ్వాసంగల వారు పునరుత్థానమైన తమ ప్రియమైనవారితో తిరిగి కలిసేది, యేసు పరలోక జీవనానికి మార్గం తెరవక మునుపు మరణించిన వారైన అబ్రాహాము, శారా, మోషే, రాహాబు, దావీదు, బాప్తిస్మమిచ్చు యోహాను వంటి ప్రాచీన నీతిమంతులను కలిసేది భూమిపైనే.—మత్తయి 11:11; 1 కొరింథీయులు 15:20-23 పోల్చండి.
భూ నిరీక్షణ గలవారు తాము రొట్టె, ద్రాక్షారసంలో పాల్గొనకపోయినప్పటికీ, హాజరవ్వడం ద్వారా మరియు గౌరవపూర్వక శ్రద్ధనివ్వడం ద్వారా ప్రభు రాత్రి భోజన ఆచారాన్ని యోగ్యమైనరీతిలో ఆచరించరిస్తారు. దేవుని ఎదుట తమకు అనుగ్రహపూర్వక స్థానం ఉండేలా చేసే క్రీస్తు బలి ద్వారా వారు కూడా ప్రయోజనం పొందుతారు. (ప్రకటన 7:14, 15) ఇవ్వబడే ప్రసంగాన్ని వింటుండగా, పరిశుద్ధ విషయాల ఎడల వారి మెప్పు బలపర్చబడుతుంది, అంతటా ఉన్న దేవుని ప్రజలతో ఐక్యత కలిగివుండాలన్న వారి కోరిక వృద్ధిచెందుతుంది.
ఈ సంవత్సరం, ఏప్రిల్ 2, మంగళవారం నాడు సూర్యాస్తమయం తర్వాత, భూవ్యాప్తంగా 78,000 కంటే ఎక్కువగావున్న యెహోవాసాక్షుల సంఘాలన్నిటిలో జ్ఞాపకార్థదినం ఆచరింపబడుతుంది. మీరు హాజరౌతారా?
[అధస్సూచీలు]
a యూదా దినం సాయంకాలంతో ఆరంభమౌతుంది. మన క్యాలండరు ప్రకారం, ఆ నీసాను 14, మార్చి 31 గురువారం సాయంకాలంతో ఆరంభమై ఏప్రిల్ 1 శుక్రవారం సాయంకాలం సూర్యాస్తమయం వరకు కొనసాగింది. జ్ఞాపకార్థదినం గురువారం సాయంకాలాన ప్రారంభించబడింది, అదే యూదా దినాన అంటే శుక్రవారం మధ్యాహ్నం యేసు మరణించాడు. మూడవ దినాన అంటే ఆదివారం వేకువజామున ఆయన పునరుత్థానం చేయబడ్డాడు.
[8వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు సంవత్సరానికొకసారి చొప్పున ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థదినాన్ని ఆచరిస్తారు