ఈస్టర్ లేక జ్ఞాపకార్థదినం—మీరు దేన్ని ఆచరించాలి?
ఏప్రిల్ 7న అరుణోదయం తన కాంతిని క్షితిజంపై ప్రసరింపజేస్తుండగా, సంవత్సరంలోని తమ అత్యంత పరిశుద్ధ దినమైన ఈస్టర్కు కోట్లాదిమంది స్వాగతం పలుకుతారు. ఒకప్పుడు ఆ పేరు, సెప్టాజెసిమా అని పిలువబడే సెలవు దినంతో ఆరంభమై త్రిత్వదినం అని పిలువబడేదానితో ముగిసే వేడుకలూ ఉపవాసాలూ ఉండే 120-దినాల కాలానికి అన్వయించబడేది. నేడు ఆ పేరు యేసు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసే ఒకే దినానికి—ఈస్టర్ ఆదివారానికి అన్వయింపబడుతోంది.
అయితే, అదే వారారంభంలోని ఒక సాయంకాలాన, ఇతర లక్షలాదిమంది ప్రభు రాత్రి భోజనం అని కూడా పిలువబడే క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినాన్ని ఆచరించడానికి సమకూడుతారు. అది, భూమిపై తన చివరి రాత్రి యేసు తానే నెలకొల్పిన ఒక ఆచరణ. అప్పుడాయన తన శిష్యులతో, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” చెప్పాడు.—లూకా 22:19.
మీరు దేన్ని ఆచరించాలి?
ఈస్టర్ యొక్క ఆరంభం
అనేక దేశాల్లో ఉపయోగింపబడుతున్న, ఈస్టర్ అనే పేరు బైబిలులో లేదు. మధ్యయుగంనాటి సెలవు దినాలు మరియు పండుగలు అనే పుస్తకం, “ఈ సెలవుదినం సూర్యోదయ, వసంత ఋతువుల అన్య దేవతయైన ఆస్టర్ పేరు మీదుగా వచ్చింది” అని మనకు తెలియజేస్తుంది. ఈ దేవత ఎవరు? “పురాణగాథ ప్రకారం, అతని స్వచ్ఛతనుబట్టి శ్వేత దేవుడని మరియు అతని నొసలు మానవజాతికి వెలుగును అందజేస్తున్నందున సూర్య దేవుడని కూడా పిలువబడిన బాల్డర్ను ఆహ్వానించేందుకు వల్హల్లా ద్వారాలను తెరిచినది ఆస్టరే” అని దినాలను గూర్చిన అమెరికా పుస్తకం (ఆంగ్లం) అనే పుస్తకం సమాధానం చెబుతోంది. అదింకా ఇలా తెలియజేస్తుంది: “చర్చి దాని ఆరంభ దినాల్లో పాత అన్యాచారాలను స్వీకరించి, వాటికి క్రైస్తవ భావాన్నిచ్చిందనడంలో ఏ సందేహమూ లేదు. ఆస్టర్ పండుగ వసంత ఋతువులో జీవం యొక్క పునరాగమన వేడుకగా ఉండేది గనుక దాన్ని, తాము ఎవరి సువార్తనైతే ప్రకటిస్తున్నారో ఆ యేసు మృతులలో నుండి పునరుత్థానం కావడం యొక్క వేడుకగా చేయడం సులభంగానే జరిగింది.”
కొన్ని దేశాల్లో ఈస్టర్ గ్రుడ్లు, ఈస్టర్ కుందేలు, హాట్ క్రాస్ బన్నులు వంటి ఈస్టర్ ఆచారాలు ఎలా ప్రారంభమయ్యాయో ఈ స్వీకరణ వివరిస్తుంది. “క్రాస్ . . . గుర్తు వేయబడిన మెరిసే గోధుమవర్ణం పైభాగంతోనున్న” హాట్ క్రాస్ బన్నులను చేసే ఆచారానికి సంబంధించి, ఈస్టర్ మరియు దాని ఆచారాలు అనే పుస్తకం, “మొదటి శుభశుక్రవారం సంఘటనల నుండి క్రాస్ నిత్య ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ఎంతో ముందే అది ఒక అన్య చిహ్నంగా ఉండింది, క్రైస్తవ పూర్వ కాలాల్లో కొన్నిసార్లు బ్రెడ్డు మరియు కేకులపై దాని గుర్తు వేయబడేది” అని తెలియజేస్తుంది.
లేఖనాల్లో ఎక్కడా మనం వీటి ప్రస్తావనను కనుగొనము, యేసు తొలి శిష్యులు వాటిని విశ్వసించారనేందుకు ఏ సాక్ష్యాధారమూ లేదు. వాస్తవానికి, ‘నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనం అపేక్షిద్దాము’ అని అపొస్తలుడైన పేతురు మనకు చెబుతున్నాడు. (1 పేతురు 2:2) కాబట్టి క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు అలాంటి స్పష్టమైన అన్యమత చిహ్నాలను తమ నమ్మకాల్లోకి, ఆచారాల్లోకి ఎందుకు తీసుకున్నారు?
“నిర్మూలించలేనంతగా పాతుకుపోయిన అన్య వేడుకలకు క్రైస్తవ గుర్తింపును ఇవ్వడం తొలి చర్చి యొక్క స్థిరమైన సిద్ధాంతంగా ఉండింది. ఈస్టర్ విషయంలో మార్పిడి ప్రాముఖ్యంగా సులభమయ్యింది. సహజ సూర్యుడు ఉదయించడం వల్ల మరియు ప్రకృతి శీతాకాల మరణావస్థ నుండి తిరిగి లేవడం వల్ల కలిగే ఆనందం, నీతి సూర్యుడు ఉదయించడం వల్ల మరియు క్రీస్తు సమాధిలో నుండి పునరుత్థానమవ్వడం వల్ల కలిగే ఆనందంగా మారింది. మే నెల మొదటి తేదీ, ఆ ప్రాంతంలో జరిగిన కొన్ని అన్యాచారాలు ఈస్టర్ వేడుకతో సామ్యంగా ఉండేలా మార్చబడ్డాయి” అని ప్రసిద్ధ ఆచారాల ఎడల జిజ్ఞాస అనే పుస్తకం సమాధానమిస్తుంది. ప్రజాదరణ పొందిన అన్యాచారాలను, మాంత్రిక కర్మలను విడనాడే బదులు మత నాయకులు వాటిని క్షమించి వాటికి “క్రైస్తవ గుర్తింపును” ఇచ్చారు.
‘కాని, దానిలో ఏదైనా హాని ఉందా?’ అని మీరనుకోవచ్చు. లేదని కొందరు భావిస్తారు. “క్రైస్తవత్వం వంటి ఒక మతం ఇతర ప్రజలను చేరినప్పుడు, అది పాత మతాల నుండి తీసుకొనబడిన కొన్ని సాంప్రదాయాచారాలను స్వీకరించి ‘బాప్తిస్మమిస్తుంది’” అని ఈస్టర్—దాని కథ మరియు భావం అనే తన పుస్తకంలో ఎపిస్కోపల్ ఛాప్లైన్ అలన్ డబ్ల్యూ. వాట్స్ చెప్పాడు. “చర్చి బోధించిన అవే నిత్య సూత్రాలను సూచిస్తున్నట్లుగా అనిపించే వాటిని అది ఎంపిక చేసుకుని ప్రజల్లో పాతుకుపోయిన ఆచారాల్లోకి ప్రవేశపెడుతుంది.” అనేకులకు, తమ చర్చి ఈ ఆచారాలను అనుమతించి వాటిని పరిశుద్ధమైనవిగా పరిగణిస్తుందనే వాస్తవమే తాము వాటిని అంగీకరించడానికి తగినంత కారణాన్నిస్తుంది. కాని ప్రాముఖ్యమైన ప్రశ్నలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఈ ఆచారాల గురించి దేవుడు ఎలా భావిస్తాడు? ఈ విషయంలో అనుసరించడానికి ఆయన మనకేవైనా మార్గనిర్దేశాలను ఇచ్చాడా?
దేవుని దృక్కోణాన్ని తెలుసుకోవడం
“మన ప్రభువు పునరుత్థాన ఆచరణయైన ఈస్టర్ దినం, క్రైస్తవ చర్చి పండుగలన్నిటిలోకి అత్యంత గొప్పది” అని ఈస్టర్ మరియు దాని ఆచారాలు అనే తన పుస్తకంలో క్రిస్టీనా హోల్ చెప్పింది. ఇతర రచయితలు ఏకీభవిస్తున్నారు. “ప్రాముఖ్యత విషయంలో క్రైస్తవ సంవత్సరంలోని ఏ ఇతర పర్వ దినం లేక పండుగ ఈస్టర్ ఆదివారంతో సాటిరాదు” అని వేడుకలు అనే తన పుస్తకంలో రాబర్ట్ జె. మైర్స్ తెలియజేస్తున్నాడు. అయితే, అది కొన్ని ప్రశ్నలను లేవదీస్తుంది. ఈస్టర్ను వేడుక చేసుకోవడం అంత ప్రాముఖ్యమైనదైతే, అలా చేయమని బైబిలులో ప్రత్యేకమైన ఆజ్ఞ ఎందుకు లేదు? యేసు తొలి శిష్యులు ఈస్టర్ ఆదివారాన్ని ఆచరించిన నివేదిక ఏమైనా ఉందా?
దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు అనే విషయంలో బైబిలు నిర్దేశక సూత్రాలనివ్వడం లేదని కాదు. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఈ విషయాన్ని ఎంతో కచ్చితంగా చెప్పాడు. ముందు తెలియజేసినట్లుగా, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడంలో కొనసాగమని క్రైస్తవులకు స్పష్టమైన ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. (1 కొరింథీయులు 11:23-26; కొలొస్సయులు 2:16, 17) “క్రొత్త నిబంధనలోగాని, లేక అపోస్టలిక్ ఫాదర్ల వ్రాతల్లోగాని ఈస్టర్ పండుగను ఆచరించిన సూచన ఏదీ లేదు. ప్రత్యేక సమయాలను పరిశుద్ధపరచడమనే తలంపు మొదటి క్రైస్తవుల మనస్సుల్లో లేదు. . . . ప్రభువుగాని, ఆయన అపొస్తలులుగాని దీన్ని లేక ఏ ఇతర పండుగనైనా ఆచరించడం గురించి ఆజ్ఞాపించలేదు” అని ది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తొలి సంచిక మనకు చెబుతుంది.
అలాంటి పండుగలను ఆచరించడం కారణ సహితమని భావించడానికి, వాటిని ఆచరించడం వల్ల కలిగే ఆనందం మరియు అవి తెచ్చే సంతోషం చాలునని కొందరు భావిస్తారు. అయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు మత సంబంధమైన ఒక ఆచారాన్ని స్వీకరించి దానికి “యెహోవాకు పండుగ” అని పేరు పెట్టిన సందర్భం నుండి మనం నేర్చుకోగలము. వారు కూడా, “తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.” కాని వారి క్రియలు యెహోవా దేవునికి విపరీతమైన ఆగ్రహం తెప్పించాయి, ఆయన వారిని తీవ్రంగా శిక్షించాడు.—నిర్గమకాండము 32:1-10, 25-28, 35.
దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. సత్యమైన నమ్మకాల “వెలుగు”కు సాతాను ప్రపంచపు “చీకటి”కీ ఎంత మాత్రం పొంతన ఉండే అవకాశం లేదు; క్రీస్తుకు, అన్యారాధనకు మధ్య ‘పొత్తు’ కుదరదు. “కావున మీరు వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును” అని మనకు చెప్పబడుతుంది.—2 కొరింథీయులు 6:14-18.
బైబిలులో—ఈస్టర్ కాదు—జ్ఞాపకార్థ దిన ఆచరణ మాత్రమే క్రైస్తవులకు ఆజ్ఞాపించబడినందున, దాన్నే ఆచరించాలి. కాబట్టి దాన్ని మనం యోగ్యమైనరీతిలో ఎలా ఆచరించగలం?
[5వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలీయుల “యెహోవాకు పండుగ” దేవునికి విపరీతమైన ఆగ్రహం తెప్పించింది
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover: M. Thonig/H. Armstrong Roberts