రాజ్య వార్తతో విజయవంతమైన ప్రచారం
“జీవితం ఎందుకు ఇంతగా సమస్యలతో నిండివుంది?—సమస్యలులేని పరదైసు సాధ్యమేనా?” ఇది, గత సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో 139 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టబడిన నాలుగు పేజీల రాజ్య వార్త సంఖ్య 34 యొక్క శీర్షికాంశం. “సంవత్సరం యొక్క ఉన్నతాంశాల్లో ఇది ఒకటి” అని జమైకాలోని సాక్షులు ఈ సేవా ప్రచారాన్ని వర్ణించారు. బెల్జియంలోని సాక్షులు దీన్ని, “సహోదరులకు గొప్ప ఆనందానికి మూలం” అన్నారు. చెక్ రిపబ్లిక్‌లో, రాజ్య వార్త పంచిపెట్టడంలో భాగం వహించే అవకాశం యెహోవాసాక్షులకు లభించడం ఇదే మొదటిసారి. బ్రాంచి ఇలా నివేదిస్తోంది: “ఈ ప్రచారం ఆసక్తి మరియు ఉత్సాహాల స్ఫూర్తినితెచ్చింది.” అనేక ఇతర దేశాల నుండి అలాంటి అభిప్రాయాలనే వినడం జరిగింది.
మతం పేరిట జరుగుతున్న హేయకృత్యాలనుబట్టి మూల్గులిడుచూ, ప్రలాపిస్తున్న వారికి రాజ్య వార్త సంఖ్య 34 ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని అందజేసింది. (యెహెజ్కేలు 9:4) తాము అదుపు చేయలేని “వ్యవహరించుటకు క్లిష్టమైన కాలముల” మూలంగా తమ జీవితాలు కష్టాల్లో ఉన్న వారికి అది ఓదార్పుననుగ్రహించింది. (2 తిమోతి 3:1, NW) బైబిలు వైపు దృష్టి మరల్చుతూ, జీవిత సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని కరపత్రం చూపించింది. సమస్యల్లేని పరదైసు కచ్చితం. (లూకా 23:43) రాజ్య వార్త చదివిన అనేకులు దాని సమాచారాన్నిబట్టి పురికొల్పబడ్డారు. టోగోలో ఒక వ్యక్తి సాక్షితో ఇలా చెప్పాడు: “మీరు చెప్పింది నిర్వివాదమైనది.”
నిర్వివాదాంశంగా, ఈ రాజ్య వార్తను పంచి పెట్టడం అసాధారణమైన అవధానాన్ని పొందింది. డెన్మార్క్‌లో ఈ కరపత్రాన్ని అందజేస్తున్న ఒక సాక్షితో ఒక గృహస్థుడు అలా అన్నాడు: “నేను ఇప్పుడే అమెరికా నుండి తిరిగి వచ్చాను. నేను బయల్దేరుతుండగా, ఎవరో నాకు మీ కరపత్రాన్ని ప్రతిపాదించారు. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, వెంటనే అదే కరపత్రం డానిష్ భాషలో అందజేయబడుతోంది!”
ప్రచారానికి ఉత్సాహభరితమైన మద్దతు
కరపత్రాన్ని పంచి పెట్టే పనిలో యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా కలిశారు. రాజ్య వార్త పంచిపెట్టబడుతున్న నెలల్లో మునుపెన్నటికన్నా శిఖరాగ్ర స్థాయిలో ప్రచారకులు నివేదించిన అనేక దేశాల్లో ఆస్ట్రియా, ఎల్ సాల్వడార్, హైతీ, హంగేరి, ఇటలీ, న్యూ కలెడోనియా కేవలం కొన్ని మాత్రమే.
జాంబియాలో, ఒక ప్రయాణ కాపరి తన మూడేళ్ల కుమార్తె డెబోరాకు, ఇంటింట సాహిత్యాన్ని ప్రతిపాదించడంలో తర్ఫీదిచ్చాడు. రాజ్య వార్త సంఖ్య 34తో ప్రచారం చేసే సమయంలో, డెబోరా ఆ కరపత్రం యొక్క 45 కంటే ఎక్కువ ప్రతులను అందజేసింది. డెబోరా నుండి రాజ్య వార్త తీసుకున్న కొంతమందితో ఆమె తల్లి బైబిలు పఠనాలు ప్రారంభించింది.
దక్షిణాఫ్రికాలో ఒక యౌవనస్థురాలు కాష్యా అనే తన తోటి విద్యార్థికి కరపత్రాన్ని ప్రతిపాదించింది. కాష్యా కరపత్రాన్ని చదివి ఇలా చెప్పింది: “పరదైసు భూమిపై నిరంతరం జీవించడం ఎంతో అద్భుతమైనది! దీని గురించి నాకు ముందు ఎందుకు చెప్పబడలేదు?” ఒక బైబిలు పఠనం ప్రారంభించబడింది. వారం రోజుల్లో కాష్యా మరో కరపత్రాన్ని అందుకుంది. ఆ రెండవది సైప్రస్‌లో నివసించే, రోమన్ కాథోలిక్ మతస్థురాలైన తన కలం స్నేహితురాలి నుండి వచ్చింది. ఆ కలం స్నేహితురాలు రోమన్ కాథోలిక్ చర్చి యొక్క బోధలు ఎందుకు అబద్ధమైనవో వివరించి, తాను యెహోవాసాక్షులతో బైబిలు పఠించాలని అనుకుంటున్నానని తెలియజేసింది. తన పఠనాన్ని కొనసాగించాలని కాష్యాకున్న దృఢ నిశ్చయతను అది ఎంతో బలపర్చింది.
స్విట్జర్లాండులో, ఒక పది సంవత్సరాల బాలుడు తన తల్లితో కలిసి ఆ కరపత్రాన్ని పంచిపెట్టడంలో భాగం వహించాడు. అతడు ఒక ప్రతిని ఒక యౌవనస్థురాలికి అందజేసి దాన్ని జాగ్రత్తగా చదవమని ఆమెను ప్రోత్సహించాడు. భూమిపై నిరంతర జీవితం, అంటే దాని ముఖపత్రంపై వర్ణించబడిన చిత్రం చూపిస్తున్నదాన్ని నీవు నిజంగా నమ్ముతున్నావా అని ఆ యౌవనస్థురాలు ఆ బాలున్ని అడిగింది. ఆ బాలుని సమాధానం? “అవును, నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.” తన స్వంత మతంలో అనేకానేక పరస్పర విరుద్ధతలు ఉన్నాయి గనుక తాను నిజమైన విశ్వాసం కొరకు వెదుకుతున్నానని ఆ స్త్రీ తెలియజేసింది. పునర్దర్శనం సమయంలో, బైబిలు పఠనం ప్రారంభించబడింది.
తక్షణ ప్రతిస్పందనలు
కొన్నిసార్లు రాజ్య వార్త, దాన్ని చదివిన వారిలో వెనువెంటనే ప్రతిస్పందన కలుగజేసింది. బెల్జియంలో, కరపత్రాన్ని చదివిన తర్వాత ఒక పదకొండు సంవత్సరాల బాలిక తాను దుకాణాల్లో దొంగతనం చేసేదాన్నని యెహోవాసాక్షుల్లో ఒకరి ఎదుట ఒప్పుకుంది. ఆ బాలిక తల్లి విషయాన్ని మరుగు చేయాలనుకుంది గాని, తాను చదివిన దాన్నిబట్టి ఆ బాలిక మనస్సాక్షి కదిలింపబడింది, ఆ దుకాణం యజమాని వద్దకు వెళ్లాలని ఆమె పట్టుబట్టింది. చివరికి, సాక్షితోపాటు తన కుమార్తె ఆ దుకాణానికి తిరిగి వెళ్లడానికి ఆమె తల్లి అంగీకరించింది. ఆమె ఒప్పుకున్నదాన్నిబట్టి దుకాణం యజమాని ఆశ్చర్యపోయాడు. ఆమె ఈ విధంగా ప్రవర్తించడానికి కదిలించినది రాజ్య వార్త అని అతడు తెలుసుకున్నప్పుడు, దానిలో అంత శక్తివంతమైనది ఏమి ఉందో తెలుసుకోవడానికి అతడు తన కొరకు ఒక ప్రతిని తీసుకున్నాడు. ఆ బాలిక ఇప్పుడు అభివృద్ధికరంగా బైబిలు పఠిస్తోంది.
కామెరూన్‌లో ఒక సాక్షి రాజ్య వార్త యొక్క ప్రతిని ఒక వ్యక్తికి అందజేసింది, ఆమె ఇలా తెలియజేస్తోంది: “మేము తిరిగి వెళ్లే సరికి, ఆయన దానిలో అప్పటికే గీతలు గీసి ఉంచుకొని, అనేక ప్రశ్నలు కలిగివున్నాడు. సంతృప్తికరమైన సమాధానాలు పొందిన తర్వాత, ఆయన ఇలా తెలియజేశాడు: ‘మానవజాతి అసంతోషానికి మతం దోహదపడిందన్నది కచ్చితంగా నిజం. నేను ఎంతో అర్థం చేసుకోవడానికి మీ కరపత్రం నాకు సహాయం చేసింది, కాని నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను.’” ఆయన ఇప్పుడు క్రమంగా బైబిలు పఠనం చేస్తున్నాడు.
ఉరుగ్వేలో ఇంటింటిని దర్శిస్తున్న ఒక సాక్షి, ఒక వ్యక్తికి కరపత్రాన్ని అందజేశాడు. ఆ సాక్షి ఇంటింటికి ప్రకటించే తన పనిని కొనసాగించి, ఆ బ్లాకు మొత్తం పూర్తి చేసి అదే వ్యక్తి ఇంటి యొక్క వెనుక తలుపు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి చేతిలో కరపత్రం పట్టుకొని తన కొరకు ఎదురు చూస్తుండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అతడు అప్పటికే దాన్ని చదివి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. తక్షణమే పఠనం ప్రారంభించబడింది.
పంచిపెట్టడంలో ప్రజలు సహాయం చేయడం
జపానులో, యౌవనస్థుడైన ఒక సాక్షి 50వ పడిలో ఉన్న ఒక వ్యక్తిని సమీపించి, కరపత్రాన్ని అతనికి పరిచయం చేశాడు. ఆ వ్యక్తి ఇలా అడిగాడు: “చూపులేని ప్రజలను కలిసినప్పుడు నీవు ఆ కరపత్రంతో ఏమిచేస్తావు?” తనకు తెలియదని సాక్షి అంగీకరించాడు. ఆ వ్యక్తి ఒక నిమిషం ఆగమని చెప్పి తన ఇంట్లోకి వెళ్లాడు. అతడు రాజ్య వార్త యొక్క ప్రతితో తిరిగి వచ్చి ఇలా చెప్పాడు: “నేను ఇప్పటికే ఆ కరపత్రాన్ని అందుకున్నాను. దానిలో ఎంతో ఆసక్తికరమైన, ప్రాముఖ్యమైన సమాచారం ఉందని నేను తలంచాను, కాబట్టి నేను దాన్ని బ్రెయిలీలోకి ఎత్తి వ్రాశాను. దయచేసి దీన్ని అంధుల కొరకు ఉపయోగించండి.” దానిలో ఉన్నదాని నుండి అంధులు ప్రయోజనం పొందకుండా ఉండకూడదని రాజ్య వార్తను బ్రెయిలీలోకి ఎత్తి వ్రాయడానికి ఆ వ్యక్తి ఎన్నో గంటలు గడిపాడు.
స్లొవాక్యాలో ఒక వ్యక్తికి కరపత్రం ఎంతగా నచ్చిందంటే, అతడు దాన్ని 20 జిరాక్స్ ప్రతులు తీసి తానే వాటిని పంచిపెట్టాడు. స్విట్జర్లాండులో, ఒక ప్రచారకుడు ఒక కుటుంబానికి రాజ్య వార్త అందజేసి, ఆ కుటుంబం నివసిస్తున్న భవనంలోనే పై అంతస్తుల్లో పనిచేయడాన్ని కొనసాగించాడు. మళ్లీ క్రిందికి వచ్చేసరికి, ఆ కుటుంబంలోని ఒక బాలుడు ఆయనను కలిసి, ఆ కరపత్రం యొక్క మరో 19 ప్రతులు ఇవ్వమని అడిగాడు. ఆ బాలుని పాఠశాలలో విద్యార్థులు సమస్యల గురించి, వాటికి పరిష్కారం కొరకు జరుగుతున్న అన్వేషణ గురించి వ్రాయమని కోరడం జరిగింది. కాబట్టి తన తోటి విద్యార్థులందరి కొరకు రాజ్య వార్త యొక్క ఒక్కో ప్రతి కావాలని ఆ బాలుడు కోరుకున్నాడు.
ఎవరూ తప్పిపోలేదు
ఎవరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూడడానికి ప్రచారంలో పాల్గొన్నవారు ఎంతో కృషి చేశారు. న్యూ కలెడోనియాలో, రాజ్య వార్త పంచిపెట్టడానికి సుదూరాన ఉన్న ఒక తెగ నివసిస్తున్న ప్రాంతానికి ఇద్దరు సాక్షులు ప్రయాణిస్తున్నారు. మార్గం మధ్యలో, ఉపయోగింపబడనట్లు ఉన్న ఒక దారిని వాళ్లు గమనించారు, అయినప్పటికీ దాని చివరలో ఎవరైనా నివసిస్తున్నారేమో చూడాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. కారును విడిచి పెట్టి, చివరికి ఒక ఇంటిని కనుగొనే వరకు వాళ్లు నీటి కాలువలను దాటుకుంటూ, మార్గం వెంబడి కష్టపడి నడిచి వెళ్లారు. యెహోవాసాక్షుల గురించి ఎన్నడూ వినని ఒక జంట అక్కడ నివసిస్తున్నారు, వాళ్లు రాజ్య వార్త యొక్క ప్రతిని తీసుకున్నారు. ఆ తర్వాత ప్రచారకులు పునర్దర్శనం చేసినప్పుడు, సాక్షులు వారి ఇంటి వరకు నేరుగా కారు తీసుకుని రాగలిగేలా ఆ దంపతులు దారిని, మధ్యలోవున్న అనేక చిన్న చిన్న వంతెనలను బాగుచేసి ఉంచడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఒక క్రమమైన బైబిలు పఠనం ప్రారంభించబడింది.
పోలండులో, ఒక సాక్షి ఒక గృహస్థునికి రాజ్య వార్త అందజేయడానికి వెళ్లేందుకు ఒక నిర్మాణ స్థలాన్ని దాటి వెళ్లవలసి వచ్చింది. ఆయన భవన స్థలాన్ని దాటి వెళుతుండగా పనివాళ్లు ఆయనను గమనించారు. చివరికి, పనివాళ్లలో ఒకరు మమ్మల్ని మరచిపోవద్దని ఆయనతో అన్నారు. ఆయన వారిని సమీపించినప్పుడు, వాళ్లు ఆగి కరపత్రాన్ని అందజేయడాన్ని జాగ్రత్తగా విన్నారు. వాళ్లు రాజ్య వార్త ప్రతులను అలాగే పత్రికలను, ఆ తర్వాత పునర్దర్శనం సమయంలో పుస్తకాలను తీసుకున్నారు.
అనేక భాషల్లో కోటానుకోట్ల రాజ్య వార్త సంఖ్య 34 ప్రతులు పంచిపెట్టబడ్డాయి. దాని వర్తమానం ఇప్పటికే శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. కష్టాల్లేని పరదైసు సాధ్యమౌతుందని అనేకులు తెలుసుకున్నారు. నీతి హృదయం గలవాళ్లు ప్రతిస్పందించడం కొనసాగించాలని, చివరికి ‘భూమిని స్వతంత్రించుకొని, బహు క్షేమము గలిగి సుఖించే దీనులలో’ వారు చేరాలని మేము ప్రార్థిస్తున్నాము.—కీర్తన 37:11.
[31వ పేజీలోని బాక్సు]
పత్రికలు పంచిపెడుతూనే ఉండండి!
రాజ్య వార్త సంఖ్య 34ను పంచి పెట్టడంలో 1995 ఏప్రిల్ మరియు మే నెలలు ఎంతో విజయవంతమైన ప్రచారాన్ని చూశాయి. ఆ రెండు నెలల్లో, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను కూడా విశేషంగా పంచిపెట్టడం జరిగింది. ఉదాహరణకు, ఏప్రిల్ నెలలో తాను 250 రాజ్య వార్త ప్రతులను, 750 పత్రికలను అందజేసినట్లు చెక్ రిపబ్లిక్ నుండి ఒక సహోదరుడు నివేదిస్తున్నాడు. గ్వాడలోప్‌లో ఏప్రిల్ 15 శనివారాన్ని ప్రత్యేక పత్రికా దినంగా ఎంచుకోవడం జరిగింది. ఆ రోజు ఆ దేశంలోని ఇంచుమించు ప్రతి ప్రచారకుడు పరిచర్యలో భాగం వహించాడు! ఏప్రిల్ నెలలో పత్రికలను పంచిపెట్టడంలో స్లొవాక్య క్రొత్త శిఖరాగ్రాన్ని చేరింది. అనేక ఇతర దేశాల నుండి అలాంటి నివేదికలే వచ్చాయి.
కాబట్టి పత్రికలను పంచి పెట్టడం విషయంలో 1996 ఏప్రిల్ మరియు మే నెలలను ఎందుకు విశేషమైనవి చేయకూడదు? సంఘాలు ప్రత్యేక పత్రికా దినాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యక్తులు సహాయ పయినీరు సేవలో పాల్గొనవచ్చు. ఇలా మరియు ఇతర విధాలుగా, పత్రికలను పంచిపెట్టడాన్ని ప్రోత్సహించవచ్చు, తద్వారా రాజ్య వార్త సంఖ్య 34లో ప్రకటించబడిన ప్రాముఖ్యమైన వర్తమానం వ్యాపించడం కొనసాగుతుంది. అప్పుడు, గత సంవత్సరం జరిగినట్లుగానే, మనం చూపించే ఆసక్తితోకూడిన స్ఫూర్తిని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు.—2 తిమోతి 4:22.